top of page

బాధ్యతారాహిత్యం


'Badhyatharahithyam' - New Telugu Story Written By Ch. Pratap

Published In manatelugukathalu.com On 17/10/2023

'బాధ్యతారాహిత్యం' తెలుగు కథ

రచన: Ch. ప్రతాప్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

సింహపురిని ఏలే మగధసేనుడు భోగలాలసుడు. ఎప్పుడూ రాజ్య మందిరంలో సేవకులతో సేవలు చేయించుకుంటూ, తన కిష్టం వచ్చిన భోజనాలు తినడం, మధుపాత్రతో రక రకాల మధువులను సేవించడం, వేశ్యల నృత్య గీతాదులతో కాలక్షేపం చేయడం లోనే మునిగి తేలుతుండేవాడు. రాజ్య పాలన అంతటిని మంత్రులపైకి నెట్టేసె తాను మాత్రం హాయిగా భోగ వంతమైన జీవితం అనుభవిస్తున్నాడు.


రాజ్యంలో వచ్చే ఆదాయం అంతా తన సుఖాలకే వినియోగిస్తుండడం వలన ఆదాయానికి, వ్యయానికి అంతరం ఏర్పడ సాగింది. దానితో మంత్రుల సలహాపై పన్నులు పెంచేసాడు. ప్రజలు కూడా వంతుల వారీగా రాజుకు సంబంధించిన పొలాల్లో ఉచితంగా పని చేయాలన్న నిబంధన కూడా విధించాడు.


ఆ ఏడు రాజ్యంలో తీవ్రంగా కరువొచ్చింది. అనావృష్టి కారణంగా పొలాలన్నీ ఎండిపోయాయి. ప్రజలకు ఆదాయం లేక తీవ్ర ఆర్ధిక ఇబ్బందులకు లోనవసాగారు. అయినా మగధ సేనుడు మాత్రం పన్నులను తగ్గించలేదు సరి కదా పన్నులు సకాలంలో కట్టనివారిపై భటులను పంపి శిక్షించేవాడు. వారి ఆస్తిపాస్తులను జప్తు చేయించసాగాడు.


ఒక గ్రామంలో రైతు అలా తన ఆస్థులను జప్తు చేయడానికి వచ్చిన భటులపై తిరగబడ్డాడు. ఇంటిని, పొలాన్ని ప్రభుత్వ పరం చేయడానికి ఒప్పుకోకపోగా మహారాజును మానవత్వం లేని మనిషని తీవ్ర పదజాలంతో దూషించాడు. దానితో భటులు ఆ రైతును బంధించి రాజుగారి ముందు ప్రవేశపెట్టారు. భటులు చెప్పిన దానిని విని మహారాజు ఆగ్రహోదగ్రుడై ఆ రైతుకు మరణ శిక్ష విధించాడు. అతడిని అప్పటికప్పుడే మరణశిక్ష అమలు చేయాలని రాజు ఆజ్ఞాపించాడు. ఉరి తీసే ముందు నీ ఆఖరి కోరిక ఏమిటని మగధ సేనుడు ఆ రైతుని అడిగాడు.


మరణం అంటే కొంచెం కూడా తొణకని ఆ రైతు" రాజా, ఈ కరువు కాలంలో కూడా మీరు మాలాంటి పేదవారిపై కాస్త కనికరం కూడా చూపకుండా పనులు కట్టించుకుంటున్నారు. నా లాంటి పేదవారు అవి కట్టలేక నానా అవస్థలు పడుతున్నారు. చివరకు కొంప, గోడు అమ్ముకొని పై దేశాలకు వలస పోతున్నారు. ఇంకొంతమంది ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. ఆఖరుకు మీ పొలాలలో పని చేసేవారికి అర్ధ కూలీ కూడా ఇవ్వడం లేదు.


మమ్మల్ని కంటికి రెప్పలా చూడాల్సిన మీరు మాత్రం హాయిగా భోగాలలో తేలియాడుతూ జల్సా చేస్తున్నారు. ప్రజలను ఆకలి బాధ నుంచి విముక్తి కలిగించడం పాలకుల లక్షణం. ప్రకృతి అనుకూలించడం లేదంటూ తమ కర్తవ్యం నుంచి తప్పుకోవడం అసాధ్యం. అన్నీ అనుకూలంగా ఉంటే ఇక పాలకులు చేయదగినది ఏముంటుంది! ఎలాంటి పరిస్థితులలోనైనా ప్రజల బాగోగులకు లోటు రాకుండా చూడటమే వారి నిబద్ధతకు గీటురాయి. ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా పరిపాలన సాగించటం పాలకుల కర్తవ్యం.


కాబట్టి నా ఆఖరు కోరికను మన్నించి కనీసం ఈ కరువు సమయంలోనైనా పన్నులను మాఫీ చెయ్యండి. ప్రజలకు సుఖ శాంతులు ప్రసాదించండి" అని తన ఆఖరు కోరిక విన్నవించుకున్నాడు.


అప్పుడు మహారాజు మరింతగా హుంకరించి "ఓయీ రైతు, మహారాజునన్న గౌరవం లేకుండా ఏమిటేమిటో పేలుతున్నావు. నీ మాటలకు ప్రమాణం ఏమిటో చెప్పక పోయావో నీతో పాటు నీ మొత్తం కుటుంబాన్ని ఉరి తీయిస్తాను" అని అరిచాడు.


అందుకు ఆ రైతు మరింత నిర్భయంగా "నా మాటలలోని నిజానిజాలను మీ వేగులను అడిగి తెలుసుకోండి" అని అన్నాడు.


ఆ రైతు ధైర్యానికి కాస్తంత అచ్చెరువొంది ఆ మహారాజు తన మందిరానికి వెళ్ళీ అత్యవసరంగా వేగులను సమావేశపరిచి ఆ రైతు చెప్పిన విషయాలపై చర్చించాడు. చివరకు ఆ రైతు చెప్పినవన్నీ నిజాలేనని తేలింది. తన రాజ్యంలో క్షామ పరిస్థితుల కారణంగా ప్రజలెంత కష్టాలు పడుతున్నారో అతనికి అర్ధం అయ్యింది.


"నా తల్లిదండ్రులు ఈ రాజ్యాన్ని సుభిక్షంలా వుండేలా, ప్రజలకు ఎటువంటి కష్టాలు రాకుండా వుండేలా చూడమని నాకు బాధ్యతను అప్పగించారు. నేను మాత్రం వారి సంక్షేమాన్ని విస్మరించి నా సుఖ సంతోషాలనే చూసుకుంటున్నాను. చివరకు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా నా దృష్టికి రాకపోవడం నిజంగా నా పరిపాలనా వైఫల్యమే. నేను నా ఆనందాలకు ప్రాధాన్యత నిస్తూ, అనుక్షణం స్వర్గ సుఖాలలో తేలియాడుతూ ప్రజలకు మాత్రం నరకం చూపిస్తున్నాను" అని మనస్సులోనే పశ్చాతాపపడ్డాడు.


తన బాధ్యతారాహిత్య ప్రవర్తనకు ఎంతగానో సిగ్గుపడ్డాడు. వెంటనే ఆ రైతుకు విధించిన మరణశిక్షను రద్దు చేసి అతనికి ఉదరపోషణార్ధం కొంత డబ్బు ఇచ్చి పంపి వేసాడు.


మహాభారతంలో ధర్మరాజు భీష్మపితామహునితో ప్రజలు ఏ ధర్మం ఆచరిస్తే సుఖంగా జీవిస్తారు అని అడిగిన సందేహానికి భీష్ముడు ఇచ్చిన సమాధానం మగధసేనుడు గుర్తుచేసుకున్నాడు.


“ధర్మరాజా.. ప్రజలు తమకు ఒక రాజును నియమించుకుని ఆయనను అభిషిక్తుడిని చేసి ఆయన పాలనలో ప్రజలు సుఖంగా జీవిస్తారు. అలా పాలించే రాజు లేకపోతే ప్రజలు ధర్మంతప్పి ఒకరి ధనంను, భార్యను ఒకరు అపహరించుతూ, ఒకరి సొత్తును ఒకరు దోచుకుంటూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. ప్రజా జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపించడానికి పాలకుడు కావాలి.. లేకుంటే ప్రజాజీవితం అస్తవ్యస్థం ఔతుంది. వ్యవసాయము, వ్యాపారం, గోరక్షణ మొదలైన వృత్తులు నాశనం ఔతాయి. ఒకానొక సమయంలో పాలకులు లేక దొంగతనం, అక్రమప్రవర్తన, దుర్మార్గం పెచ్చుమీరి ప్రజల జీవితం కల్లోలితం అవుతుంది. కాబట్టి పాలకులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం మహా పాపం”.


ఈ బోధ తన వంటి పాలకులకు సదా ఆచరణీయం మరియు అనుసరణీయం అని మగధాసేనుడు తెలుసుకున్నాడు.


నాటి నుండి ప్రజలకు సుఖశాంతులు కలగజేయడం కోసం కావాల్సిన ఉపశమన చర్యలు తీసుకున్నాడు. రాజ్యంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను స్వయంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించసాగాడు. అనతికాలంలోనే సింహపురి రామరాజ్యంలో సుభిక్షంగా వర్ధిల్లింది.

***

Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు Ch. ప్రతాప్. నేను వృత్తి రీత్యా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సివిల్ ఇంజనీరుగా పని చేస్తున్నాను. ప్రస్తుత నివాసం ముంబయి. 1984 సంవత్సరం నుండే నా సాహిత్యాభిలాష మొదలయ్యింది. తెలుగు సాహిత్యం చదవడం అంటే ఎంతో ఇష్టం. అడపా దడపా వ్యాసాలు, కథలు రాస్తుంటాను.
34 views0 comments

Comentarios


bottom of page