బ్యాలెన్స్ షీట్
- Dr: Kiran Jammalamadaka
- Jun 20, 2023
- 8 min read

'Balance Sheet' - New Telugu Story Written By Dr. Kiran Jammalamadaka
'బ్యాలెన్స్ షీట్' తెలుగు కథ
రచన: డా: కిరణ్ జమ్మలమడక
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
మనసు అస్సలు మాట వినటం లేదు,
ఏమీ జరగదు అని నాకు నేను ఎన్ని సార్లు సంభాళించుకున్నా ఆలోచనలు మాత్రం ఆశ, అపనమ్మకాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఎప్పుడో ఎంసెట్ ఫలితాలకు పడినంత టెన్షన్ పడుతున్నాను ఈ రోజు. ఎన్ని సార్లు మనసుని డైవర్ట్ చేద్దామని ప్రయత్నించినా ఆలోచనలన్నీ జరగబోయే మీటింగ్ మీదకే పోతూ ఉన్నాయి.
ఎందుకు ఈ మీటింగ్? ఇది సాధారణ మీటింగ్ ఐతే కాదు, ఏదో జరగబోతోంది. అది ఏంటో చూచాయగా మెదడు పసిగట్టినా, మనసు ఒప్పుకోవటం లేదు. అనుమానం నిజమైతే ఏం చెయ్యాలి? అని ఆలోచిస్తూ ఉండగానే కంపెనీ పార్కింగ్ కి చేరుకున్నా. నా లాగే మా కొలిగ్స్ ఇంకొంత మంది అక్కడికి చేరుకొని గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ.. ముక్తసరి పలకరింపులు పలకరించుకుంటూ లిఫ్ట్ దగ్గరకు చేరుకున్నాం. అక్కడ ఆంబులెన్స్ ఎమర్జెన్సీ పార్కింగ్ లో పార్క్ చేసివుంది. అంతా అయోమయం గా వుంది,
సాధారణం గా ఫైర్ డ్రిల్ల్ కి వొచ్చే అంబులెన్స్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? అన్న ఆలోచన మా అందరి లోను వున్నా పైకి కనపడనివ్వకుండా లిఫ్ట్ లో మా ఫ్లోర్ కి వెళ్లిపోయాం, అక్కడ ‘వాలంటీర్’ అన్న టీ షర్ట్స్ వేసుకున్న వస్తాదుల్లాంటి ముగ్గురు, ఆఫీస్ లాబీ లో కూర్చొని వున్నారు. ఈ శకునాలు అన్ని స్ఫష్టం గా జరగబోయే దానిని సూచిస్తూ వున్నా ఇంకా ఏదో ఆశ.. ఏమీ కాదనే చిన్న నమ్మకం ఇంకా వున్నాయి.కనీసం నాకు ఏమీ కాదేమో అన్న చిన్న ఆశ.
ఇంకా 15 నిముషాలు సమయం ఉండటం తో కాంటీన్ కి వెళ్లి కాఫి తాగుదామని మేము కొంత మంది కాఫీ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళబోతే తలుపులు గొలుసులతో బంధించి "అండర్ మైంటెనెన్సు " అని చిన్న బోర్డు పెట్టారు. ఇప్పుడేం మెయింటనెన్స్ ?.. అర్థం అవ్వటానికి ఎక్కువ సేపు పట్టలేదు నాకు.
మా మేనేజర్ "దేవి చరణ్ " ఇంకా మీటింగ్ నుంచి రాలేదు, వాళ్ళు వొచ్చాక మేము వెళ్ళాలి, ఏసీ పనిచేస్తున్నా, చెమటలు పడుతున్నాయి. నాగుండె చప్పుడు నాకే వినిపించ సాగింది, క్షణం ఒక యుగం గా గడుస్తోంది, ఇదంతా తుఫాను ముందు నిశ్శబ్దం అని తెలుసు..
ఆలోచనలో ఉండగానే దేవి చరణ్ వొచ్చి, "అనుకున్నంత వరస్ట్ కాదు, రెండు నెలలు టైం వుంది" అని ఒక్క ముక్కలో చెప్పి వెళ్ళిపోయాడు, అదీ అనధికారం గా మా టెన్షన్ చూసి చెప్పాడు, అసలైతే ప్రోటోకాల్ ప్రకారం సైట్ హెడ్ మాత్రమే చెప్పాలి.
అందరం ఆయన రూమ్ కి వెళ్లి నిలబడ్డాం. సైట్ హెడ్ చాల సీరియస్ గా వున్నాడు. ఎప్పుడూ అయన నోట "గుడ్ టైం టు బి హియర్ " అన్న మాటలే విన్న మాకు "బ్యాడ్ టైం ఫర్ అస్" అన్న మాటలు కొత్తగా అనిపించాయి.
సమ్మెట ఒక్కసారిగా కొడితే తట్టుకోలేమని ఇలా మెల్లిగా చూపించి.. చెప్పారేమో.. అదీ ఒకందుకు మంచిదే, కింద అంబులెన్సు, కిరాయి వలంటీర్ల అవసరం లేకుండానే జరగవలసిన కార్యక్రమంపై మేము దృష్టి పెట్టాం.
మా చేతుల్లో కాగితాలు పెట్టారు. సంతకాలు పెట్టి, ఒకరి తరువాత ఒకరు మా కామన్ ఏరియా కి చేరుకున్నాం, 45 మంది ఉద్యోగాలు.. రెండే నెలలు! ఇదే దీని సారాంశం. ఇది సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ లో కొత్త కాదు, కానీ నాకు కొత్త.
నా టీం కి అధర్యపడొద్దని చెప్పి, నా కేబిన్ లోకి వెళ్ళిపోయాను అంతకు మించి ఏమి మాట్లాడే పరిస్థితి అది కాదని నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు.
నా కేబిన్ లో నా చైర్ లో కూలబడి బయట జరుగుతున్న దానిని గమనిస్తున్నా. అంతా ఎవరి హడావిడిలో వాళ్ళు వున్నారు, తెలిసినవాళ్ళకి ఫోన్స్ చేస్తున్నారు, కొంత మంది రెస్యూమ్ మోడిఫై చేసి పంపుతున్నారు.
సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ లో చేరేటప్పుడు ఎక్స్పీరియన్స్ కావాలంటారు. అది బోలెడు వొచ్చాక మాకొద్దంటారు, ఇప్పుడు నా పరిస్థితి అంతే, నేను ప్రయత్నాలు మొదలుపెట్టాలి.. కానీ ఎవరు తీసుకుంటారు నన్ను ఇప్పుడు?
నా మనసు, మెదడు ఒక్కతాటిపైకి వొచ్చాయి అన్న ఒక్క రాయితీ తప్ప భవిషత్తు అంతా అగమ్యగోచరం గా వుంది ఇంటి లోన్, కార్ లోన్, స్కూల్ ఫీజు.. అన్ని కళ్ళముందు తిరుగుతున్నాయి, నా ఆలోచనలు వెనక్కి వెళ్లాయి.
***
"విమానం ఎక్కాలంటే ఏ చదవాలి మామయ్యా?" అని నేను అడగటం, “కంప్యూటర్స్ ఐతే బెటర్” అని మా మామయ్య చెప్పటం, అదే నా మనసులో పాతుకుపోవడం, అన్ని చిన్నప్పుడే జరిగిపోయాయి. అప్పటినుంచి విమానం ఎక్కాలన్న ఒకే లక్ష్యం తో ఈ కంప్యూటర్స్ చదువు చదివా. నానా కష్టాలు పడి ఒక పేరున్న కంపెనీ లో చేరాను, చేరిన కొన్ని నెలలకే అమెరికా వెళ్లే అవకాశం వొచ్చింది. 3 నెలలు వుండి ఏదో నేర్చుకొని రావాలి అని చెప్పారు, నాకు ఎందుకు వెడుతున్నాను అనే దానికంటే ఎక్కడికి వెడుతున్నాను అనే దాని మీదే ధ్యాసంతా వుంది.
తొమ్మిది మేఘాలు దిగడానికి నాకు కాస్త ఎక్కువ సమయమే పట్టింది. తరువాత ఎన్ని సార్లు విదేశాలకు వెళ్లినా మొదటి సారి మారిన వేషం, నల్లని తోలు కోటు, ఎడమచేతిలో పాసుపోర్టు, కుడిచేతిలో కేబిన్ బ్యాగ్ ని ఈడ్చుకుంటూ అద్దంలో నన్ను నేను చూసిన క్షణం ఇంకా మరచిపోలేదు, ఇంక జీవితం లో సాధించడానికి ఏం మిగల్లేదు అన్న భావన. తలచుకుంటే నే నవ్వువొస్తుంది, ఎర్ర బస్సు నుంచి ఎయిర్ బస్సు కి ప్రమోషన్ వొస్తే అలానే ఉంటుందేమో.
మొదటిసారి విమానం లో భయం, ఉత్సాహం, ఆనందం ఇలాంటి చాల రకాల భావాలతో మేము కొంత మంది "సియాటెల్ " ఎయిర్పోర్ట్ లో దిగాం. అక్కడినుండి ముందే ఏర్పాటు చేసుకొన్నఅపార్ట్మెంట్స్ కి చేరుకున్నాం. అక్కడ మూడొంతులమంది ఇండియా నుండి వొచ్చిన వారే. వేరు వేరు కంపెనీల నుండి వొచ్చారు. ఆ సందడి చూస్తే ఒక్కొక్క సారి నేను అమెరికా లో వున్నానా లేక మన గాంధీ నగర్ లో వున్నానా అన్న అనుమానం వొస్తూ వుండేది. వంట గదిలోనుండి వొచ్చే పోపు వాసనలు, లుంగీలు, క్రికెట్ ఆట.. ఇక్కడ ఉన్నట్టే ఉండేది.
నా ఆఫీస్, మా సీనియర్ కొలీగ్ ఆఫీస్ ఒకే బిల్డింగ్ అవటం వల్లన నేను అతనితో వెళ్ళేవాడిని. అతని పేరు 'గాలి'. వేరే పేరువున్నా చాల రకాల కారణాల వల్ల అతనిని అతని స్నేహితులు అలానే పిలుస్తుంటారు. నేనూ అలానే పిలిచేవాడిని, అతనూ పలికేవాడు, ఎందుకు ? ఏమిటి? అని నేను అడగలేదు, అతను చెప్పలేదు. ఏదో ముద్దు పేరు.. అంతే.
‘గాలి’ కి చాల అభిప్రాయాలూ వున్నాయి, దేవుడు చేసిన ఘోరమైన తప్పిదాల్లో ఒకటి, 'గాలి' ని ఇండియా లో, అదీ తెలుగు నేలపైన పుట్టించడం అని 'గాలి' ప్రఘాడ విశ్వాసం. ఏ పాటి అవకాశం వున్నా అమెరికా వచ్చేస్తూ వుంటాడు.
‘గాలి’ గురించి ఒక చిన్న సంఘటన చెప్పాలి, బస్సు పాస్ వున్నా, నడిచి వెడదాం అనే వాడు. నేను నిజమే అనుకున్నా. కానీ జరిగింది వేరట. ఒక రోజు 15 మంది దాకా మన వాళ్ళు బస్సు స్టాప్ లో నుంచుని ఉన్నారట, బస్సు రాగానే అందరు ఎక్కేసారట. చివరిగా 'గాలి' ఎక్కుతూ ఉంటే ఆ బస్సు డ్రైవర్ "ఎనీ బడీ లెఫ్ట్ ఇన్ ఇండియా ?" అని బిగ్గరగా నవ్వాడట.
అసలే సెన్సిటివ్ అయిన 'గాలి' డ్రైవర్ సరదాగా అన్న మాటలకు బాగా హర్ట్ అయ్యి, ఆ రోజు నుంచి ఆ రూట్ లో బస్సు ఎక్కడం మానేసాడట. ఎంతవరకు నిజమో తెలీదు, నేను అడిగే సాహసం చెయ్యలేదు.
రోజు లాగే నేను, 'గాలి'- ఫుట్ పాత్ మీద నడుచుకుంటూ ఏవో కబుర్లు చెప్పుకుంటూ వెడుతూ ఉంటే, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక ముసలావిడ కార్ లో నుంచి రమ్మని సైగ చేసింది. ఏ అవసరమొచ్చిందో అని 'గాలి' పరుగున వెళ్ళాడు. ఆవిడ ఒక అడ్రస్ చెప్పి అక్కడ కటింగ్ ఫ్రీ గా చేస్తున్నారని, వెళ్ళమని చెప్పి, ట్రాఫిక్ సిగ్నల్ పడగానే వెళ్ళిపోయింది.
'గాలి' కి ఏమనాలో తెలీక వెనక్కు వొచ్చి జరిగింది చెప్పాడు. ఏదో మార్కెటింగ్ కోసం అయి ఉంటుందిలే అని సర్దిచెప్పబోయా. కానీ 'గాలి' మాత్రం సర్దుకోలేదు. తననే ఎందుకు పిలిచింది?, ఫ్రీ కటింగ్ గురించి తనకే ఎందుకు చెప్పింది? అని తెగ మదన పడిపోయాడు. ఇలాంటి సరదా సంఘటనల తో మొదటి వారం చూస్తుండగానే అయిపోయింది. రెండొవ వారం నుంచి నా ట్రైనింగ్ షెడ్యూల్ మొదలు. నేను ట్రైనింగ్ తీసుకోవలసిన వ్యక్తి పేరు 'విటాలీ'.
నాకు చేతనైనట్టుగా ట్రైనింగ్ ప్లాన్ తయారుచేసుకున్నా. అదే 'విటాలీ' కి ఇచ్చి సమీక్షించామన్నా. అతను ఇంకా అవసరమయ్యేవి, ముందు ముందు ఉపయోగపడేవి, అతని పరిధి లో లేకున్నా ప్లాన్ లో చేర్చాడు. మొదటి పరిచయం లోనే 'విటాలీ' మీద మంచి అభిప్రాయం కలిగింది. మెల్లగా చనువు పెంచుకున్నాను. అందులోనూ నా స్వార్థం వుంది, ఎందుకంటె నేను ఇండియా వెళ్ళిపోయాక ఏమైనా డౌట్స్ వొస్తే దిక్కెవరు?
ఆ క్రమం లోనే అతని తో చనువు పెంచుకున్నా. అదే 'విటాలీ' కి ఇచ్చి సమీక్షించామన్నా. అతను ఇంకా, మెల్లిగా అతని పర్సనల్ లైఫ్ గురించి, ఆ రూమ్ లో ఫోటో లో వున్న అతని కుటుంభ సభ్యుల గురించి అడగటం చేస్తూ వుండేవాడిని. 'విటాలీ' మాత్రం చాల ప్రొఫెషనల్ గా సమాధానం ఇచ్చేవాడు. ఏమైనా నాకు ఒక వెసులుబాటు ఇచ్చాడు అది ఏమిటంటే, ‘ఈ మెయిల్స్ ఓన్లీ’ అని అతని రూమ్ డోర్ కి తగిలించి వున్నా నేను మాత్రం లోపలి వెళ్లొచ్చు.
మా ట్రైనింగ్ బాగానే సాగిపోతోంది, ఏదో సందర్భం లో వాళ్ళ ఫామిలీ ఫొటోస్ చూస్తూ ‘యు అర్ ఏ లక్కీ మాన్’ అన్నా. దానికి 'విటాలీ' నవ్విన నవ్వు నాకు ఇంకా గుర్తు, ‘ఏప్’ అని ఊరుకున్నాడు. నేను సోప్ వేస్తున్నానని తెలిసిపోయిందా? ఎందుకు లే ఎక్సట్రాలు.. అన్నీ తగ్గించాలి అని అనుకోని కొంచెం సైలెంట్ గా పని చూసుకుంటూ ఉండేవాడిని.
ఒక రోజు మామూలు గా, ఈ మెయిల్స్ ఓన్లీ అని వున్నా, నేను రూమ్ లోకి వెళ్ళిపోయాను. అక్కడ 'విటాలీ' తన భార్య ‘మార్టినా’ కు ఏదో చెప్పి సముదాయిస్తున్నాడు. ఒక్కసారిగా నన్ను చూసి ఆమె నీళ్లు నిండిన కళ్ళతో ఏదో అనబోవటం, 'విటాలీ' ఆమెను కళ్ళతోనే ఆపటం ఒక్క క్షణం లోనే జరిగిపోయాయి. నేను ‘సారీ’ చెప్పి వెళ్ళిపోయాను. నేను ఇంటికి వచ్చినా ఆమె కళ్ళు నన్ను వెంటాడుతూనే వున్నాయి. నాకు ఆ రాత్రి నిద్ర పట్టడం కష్టమైంది.
మర్నాడు శనివారం కావడం తో నేను, 'గాలి' షాపింగ్ కి వెళ్ళాము. అక్కడ మన వాళ్ళు చాలామందే వున్నారు. సాయంత్రం దాకా షాపింగ్ చేసి ఇంటికి అందరం తిరుగు ప్రయాణం అయ్యాము, మాతోపాటు చాల మంది మన వాళ్ళు కూడా ఎక్కారు. వారంతా ఒక చోట చేరి నవ్వుతూ తుళ్ళుతూ వాళ్ళు కొన్న కెమెరాలు, ఫోన్లు, సెంటు సీసాలు ఒకరికి ఒకరు చూపించుకుంటున్నారు. ఇంతలో ఒక ముసలావిడ వాళ్ళ దగ్గరకు వెళ్లి నిలబడింది. ఒక్క సారిగా అందరు మాటలు ఆపి ఆమె వైపు చూస్తున్నారు.
ఆమె బిగ్గరగా "మీ వల్లే నా కొడుకు ఉద్యోగం పోయింది " అని ఇంగ్లీష్ లో అని చెమర్చిన కళ్ళతో అక్కడే నిలబడింది. ఇంతలో ఎవరో ఒకావిడ వొచ్చి ఆమెను దూరంగా తీసుకెళ్లింది. ఆ తరువాత స్టాప్ లోనే వాళ్ళు దిగిపోయారు. ఆ సంఘటన వల్ల నిశ్శబ్దం చాల సేపు రాజ్యమేలింది, నాకు మాత్రం ఆ ముసలావిడ మాటలు 'విటాలీ' భార్య కళ్ళలోంచి వచ్చినట్టు అనిపించాయి.
ఇక్కడ ఈ ముసలావిడ కొడుకు, అక్కడ 'విటాలీ' ఇలా ఇండియా నుంచి వచ్చిన ప్రతి నలుగురికి ఒక ఉద్యోగం చొప్పున పోతున్నాయి, ఎలా.. ? అని అలానే ఆలోచిస్తూ కూర్చుండి పోయాను. ‘బస్సుస్టాప్ వచ్చింది’ అని, 'గాలి' తట్టి లేపేవరకు తెలియలేదు.
నన్నే గమనిస్తున్న'గాలి' నన్ను కాఫీ షాప్ కి తీసుకెళ్లి ఒక కప్పు నా ముందుకు తోసి, తాను మెల్లిగా సిప్ చేస్తూ "ఇప్పుడు చెప్పు.. ఏమైంది ? ఆవిడ మాటల గురించే ఆలోచిస్తున్నావా?" అని అడిగాడు,
వెంటనే నేను, 'విటాలీ' రూమ్ లో జరిగింది చెప్పి, “ఇప్పుడు నావల్ల "’విటాలీ’ ఉద్యోగం పోతుందా? అన్యాయం కదా.. ఇలా ఎంతమందివి పోతాయి ఇక్కడ” అని అన్నాను.
దానికి 'గాలి', "కాఫీ ఎలా వుంది?" అని అడిగాడు.
నేను అడిగిందేమిటి అని అనుకుంటూ "వాసన ఉన్నంత కమ్మ గా రుచిలేదు" అన్నా.
“అమెరికా అంటే అంతే తమ్ముడు.. ఇదేమి "ల్యాండ్ అఫ్ హప్పినెస్స్" కాదు. ఇక్కడా కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి.. ” అని ఒక్క క్షణం ఆగాడు, నా మనసులో మాట తెలిసినట్టు గా.
"కానీ నాకు ఇక్కడ కష్టాలు పడటమే ఇష్టం. ఆ క్రమం లో నేను కొన్ని అవమానాలు భరించాల్సి వచ్చినా నాకేం అభ్యంతరం లేదు.. " అని నా అనుమానానికి సమాధానం ఇచ్చి, తాను చెప్పటం మొదలుపెట్టాడు.
"ఇక్కడా, ఎక్కడా ఎవరు ఎవరికి అన్యాయం చెయ్యటం లేదు. ఒకరి అవసరం ఇంకొకరి అవకాశం. ఈ కంపెనీ అవసరమే మన అవకాశం. అంతా ఒక బ్యాలెన్స్ షీట్.. అంతే. ! మనం ఆ షీట్ లో కేవలం అంకెలు మాత్రమే, మనకి సంతోషమా ? విచారమా ? అనేది, మన స్థానం కుడివైపా?, ఎడం వైపా ? అనేదాన్ని బట్టి ఉంటుంది”.
‘ఈ న్యాయాన్న్యాయాల గురించి ఆలోచించడం మానేసి నీ ధర్మం నువ్వు నిర్వర్తించు’ అని శ్రీ కృష్ణుడు గీతలో అర్జునుడికి చెప్పినట్టు, సూటిగా చెప్పి తన కాఫీ తాగటం లో నిమగ్నమయ్యాడు.
అది నిజమని అనిపించినా ఎందుకో, నా మనసు ఇంకా 'విటాలీ' గురించే ఆలోచిస్తోంది.
మర్నాడు నేను ఆఫీస్ కి వెళ్ళాను, 'విటాలీ' మామూలుగానే వున్నాడు, నన్ను లంచ్ కి తీసుకెళ్లాడు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసి, ఒక చిన్నపిల్లాడి కి చెప్పినట్టు జాగ్రత్తలు చెప్పాడు, అప్పుడు నేను చిన్న పిల్లాడినే మరి. పర్సనల్ ఈ మెయిల్ అడుగుదామని నోటి దాకా వచ్చింది, కానీ ఏమైనా అనుకుంటాడేమోఅని అడగలేదు.
ఆ తరువాత నేను ఇండియా వచ్చేయటం, ఇక్కడ కంపెనీ పనులతో హడావిడిగా ఉండటం రొటీన్ అయిపోయింది. నేను ఇండియా వచ్చిన వారానికి 'విటాలీ' నుండి నాకు ఈమెయిల్ వొచింది. అందులో నాకు ఏమైనా డౌట్స్ వున్నాయేమోనన్న తాపత్రయమే ఎక్కువగా కనిపించింది. అప్పటి నుండి మొదలైన మా ఉత్తర ప్రత్యుత్తరాలు, ఫోన్ సంభాషణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. , తాను ఒక కంపెనీ పెట్టాడని, అది బానే నడుస్తోందని మాటలలో చెప్పాడు. మళ్ళి ఈమధ్యనే ఇక్కడ జరుగుతున్న పరిణామాల గురించి ప్రస్తావిస్తూ ఒక ఈమెయిల్ రాసా.
***
నా ఆలోచనలోనుండి బయటకు రమ్మన్నట్టు ఈమెయిల్ శబ్దం చేసింది నా కంప్యూటర్. వెంటనే ఈమెయిల్ చెక్ చేసా, అది 'విటాలీ' నుంచి వొచ్చిందే. వెంటనే చదవటం మొదలుపెట్టా.
డియర్ ఫ్రెండ్,
నేను రష్యా లో వున్నప్పుడు, పేదరికం నుంచి బయటపడి అసలు చదువుకోగలనా? యెంత కష్టం వొచ్చిందీ అనిపించింది. ఆ తరువాత అమెరికా మైగ్రేట్ అయ్యి మైగ్రేషన్ క్యాంపు నుండి బయటపడతానా ? ఇది ఇంకా పెద్ద కష్టం అని అనిపించింది. ఆ తరువాత తిండికి తడుముకున్నా, ఉద్యొగానికి అప్లై చెయ్యటానికి డబ్బులు తడుముకున్నా, ఇది ఇంకా పెద్ద కష్టం. ఒకదాని తరువాత ఒకటి ఆలా జీవితం లో ప్రతి మజిలీ కష్టాలతోనే మొదలయ్యేది, అంతమయ్యేది. నిజానికి అవన్నీ పెద్ద కష్టాలు కావు అన్న నిజం నేను ‘మార్టినా’ ని కోల్పోయేంతవరకు తెలియలేదు. ఇది అతిపెద్ద కష్టం అనిపించింది. ఈ కష్టాలన్నీ సాపేక్షం. అంతే.. కష్టాలు అందరికీ వస్తాయి.
కష్టాలు నిన్ను నడపటానికే వస్తాయి, ఆపటానికి అని అనుకోకు, ఆగిపోకు. జీవితం కొనసాగుతూనే ఉంటుంది. ఉద్యోగం జీవితం లో ఒక చిన్న భాగం మాత్రమే, మనమే జీవితమంతా ఉద్యోగమే అనుకుంటాం. నీ ప్రయత్నం విరమించకు.
ఇట్లు,
విటాలీ.
అని చదువుతూ ఉండగా, నా కేబిన్ తలుపు చప్పుడయింది. తలెత్తి చూస్తే మా మేనేజర్ దేవి చరణ్ తనతో పాటు ఒక 25ఏళ్ళ కుర్రాడిని తీసుకొచ్చాడు. నేను లేచి, వాళ్ళ దగ్గరకు వెళ్ళగానే దేవి చరణ్ "ఇతను, వాన్ లీ. వియత్నాం నుంచి వొచ్చాడు " అని ఇంగ్లీష్ లో పరిచయం చేసాడు. మిగిలినది చెప్పవలసిన పని లేకుండా నేను చెయ్యి ఇచ్చి, అతనిని నా కేబిన్ సోఫా లో కూర్చోబెట్టి తనకు కావలసిన వివరాలు అందించసాగాను.
చిత్రంగా వుంది, విటాలీ స్థానం లో నేను, నా స్థానం లో వియత్నాం నుంచి వొచ్చిన వాన్ లీ.
మా పాత కొలీగ్, ‘గాలి’ అన్నట్టు ఈ బ్యాలెన్స్ షీట్ లో అప్పటి నా కుడి స్థానం ఎడమ వైపుకు మారింది, కానీ నాకేం బెంగ లేదు. నాకు కుడివైపుకు వెళ్లగలనన్న ధైర్యం మాత్రం వుంది.
జీవితం నడుస్తూనే ఉంటుంది.
థాంక్స్ 'విటాలీ'.
*****
కిరణ్ జమ్మలమడక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: Dr: కిరణ్ జమ్మలమడక
కంప్యూటర్ అప్లికేషన్స్ లో మాస్టర్స్ చేసి, GE లో సీనియర్ మేనేజర్ గా, భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. కిరణ్ , "స్ప్రింగ్" అనే సంస్థ ను స్థాపించి, తద్వారా విద్యార్థులకు మోటివేషనల్, లైఫ్ కోచింగ్ తరగతులను నిర్వహిస్తూ వుంటారు. తన సంస్థ ద్వారానే కాకుండా పిల్లలు , పెద్దలు ప్రపంచం పట్ల సానుకూల దృక్పథం తో ముందుకుసాగాలనే ఉద్దేశం తో కథలు రాయటం మొదలుపెట్టారు, ప్రముఖ పత్రికల్లో ఆయన కథలు కొన్ని ప్రచురితమయ్యాయి ,తెలుగు వెలుగు 'కథా- విజయం 2019' పోటీలో భాగంగాఎన్నిక అయ్యిన "మిరప మొక్క " ప్రజాదరణ పొందినది. పదేళ్లలోపు పిల్లల కోసం రాసిన "యాత్ర", పదేళ్ల పైబడిన పిల్లల కోసం రాసిన నవల "అతీతం" లను తానా - మంచిపుస్తకం 2021 లో ప్రచురించింది.
బాలన్స్డ్ గా కధ నడిచింది. బావుంది సర్ 👍