top of page
Writer's pictureDr: Kiran Jammalamadaka

నీలో నేను


'Nilo Nenu' - New Telugu Story Written By Dr. Kiran Jammalamadaka

'నీలో నేను' తెలుగు కథ

రచన: డా: కిరణ్ జమ్మలమడక

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

విశాఖ తీరం, నాకు చాల ఇష్టమైన ప్రదేశాలలో ఒకటి. ఏ మాత్రం అవకాశం వున్నా ఆ ఇసుక తిన్నెల మీదే కూర్చోవడం.. ఏమైనా చదువుకోవడం ఇష్టం. ఈ అలలు ఇప్పుడు ఎంత అందంగా కనపడు తున్నాయో, ఇవే అలలు కొన్ని నెలల క్రితం చాలా ఆందోళనగా కనిపించాయి.


సముద్రం చాల విచిత్రమైనది. ఆనందం గా వున్నప్పుడు అలలు కేరింతలు కొడుతున్నట్టు, బాగో లేకపోతే అవే అలలు ఆందోళనతో ఎగసి పడుతున్నట్టు కనిపిస్తాయి కాబోలు. ఆలా ఆలోచిస్తూ ఉండగానే నా మనసు కొన్ని నెలల క్రితానికి వెళ్ళిపోయింది.


***

నేను ఒక 15 నెలల క్రితం చదువు పూర్తిచేసుకొని, నేను ఊహించుకున్న ఆశించిన ఉద్యోగం కోసం వెతుక్కుంటూ విశాఖపట్నం వచ్చి చేరాను. అందరిలానే నేను ఒక మంచి పేరున్న సాఫ్ట్వేర్ కంపెనీ లో చేరాలని, కలలు కన్నా.. కానీ ఒక ఫ్రెషర్ కి అది యెంత కష్టంమో ఎంతమందికి తెలుసు?


విశాఖపట్నం వొచ్చి 7 -8 నెలలు అవుతున్నా, ఆదివారం బీచ్ కి రావటానికి నాకు చాల కాలం పట్టింది. విశాఖపట్నం లో ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ లో వుద్యోగం రాగానే నా మదిలో మెరిసిన ఒకే ఆలోచన, విశాఖ బీచ్ లో సాయం సంధ్య వేళ ఇసుక తెన్నెల్లో కూర్చొని శ్రీ శ్రీ కవితలు చదవాలని. కానీ వొచ్చిన దగ్గరనుండి ఆదివారానికి సోమవారానికి తేడా లేకుండా పని చేస్తున్నాను.. అంటే చెయ్యాల్సి వచ్చింది..


బీచ్ కి వొచ్చిన దగ్గరనుండి అదేపనిగా ఎగసిపడే అలలననే చూస్తున్నాను. వెంట తెచ్చుకున్న పుస్తకం తెరిచి చదవటం మొదలుపెట్టాను. నిజానికి పుస్తకం చూసి చదవ వలసిన అవసరం లేదు కానీ అదో తృప్తి. నా కిష్టమైన కవిత ని చదవటం మొదలుపెట్టాను.


‘కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు

అదీ చేత కాక పోతే పాకుతూ పో

అంతే కానీ ఒకే చోట ఆలా కదలకుండా ఉండి పోకు’


అని చదువుతూ వుండగా నా సెల్ ఫోన్ మ్రోగింది.


ఎవరని చూస్తే ఏదో తెలియని నెంబర్. ఎత్తి “హలో” అన్నాను.


అవతలి నుండి "హలొ అనంత్, నేను సురేష్ ని.. నీ క్లాసుమేట్" అన్నాడు.


"ఓహ్ సురేష్, ఎలా వున్నావు? ఏంటి సంగతులు " అని పలకరించాను.


“అనంత్, జాబ్ కావాలి అనంత్! మీ కంపెనీ లో ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే చెపుతావా” అన్నాడు, చాల రిక్వెస్టింగ్ గా.


”అదేంటి సురేష్.. హైదరాబాద్ లో జాబ్ లో వున్నావు గా! పైగా అక్కడే అవకాశాలు ఎక్కువ " అని ఆర్థోక్తి లో ముగించాను.


"కానీ ఇంకో వారం లో వెళ్ళిపోమన్నారు. అన్నీ ట్రై చేస్తున్నా, నీకు ఓ మాట చెపుదామని" అన్నాడు సురేష్.


"తప్పకుండ సురేష్, నేను ఏమైనా ఉంటే చెబుతాను. నువ్వు ఏం వర్రీ కాకు" అని ఫోన్ పెట్టేసాను.


***

ఒక్కసారిగా నాకు కాలేజీ రోజులు గుర్తు వొచ్చాయి, అన్ని కాలేజిల్లాగానే మా కాలేజి లో ౩-4 గ్రూప్స్, మళ్ళివాటిలో మిత్రకూటములు ఉండేవి. వున్న బ్యాచ్ లలో నా బ్యాచ్ కి కొంచెం చెడ్డపేరు ఎక్కువ. అల్లరి బ్యాచ్, గాలి బ్యాచ్.. లాంటి ముద్దు పేర్లతో సంభోదించేవారు. ఆ విషయాలు మేము పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. ఈ క్రమం లోనే క్లాస్ లో అన్ని బ్యాచ్ లతో పిక్నిక్ ల విషయం లో, ఫేర్వెల్, ఫ్రెషర్స్ పార్టీ విషయం.. ఒకటేమిటి అన్నిటిలో, అందరితో గొడవలు అయ్యాయి. ఇప్పుడు చాల చిన్న విషయాల్లా అనిపించినా అప్పుడు అవే పెద్ద విషయాలు.


తరగతులకు వెళ్లినా, వెళ్ళక పోయినా పొద్దున్నే 8 :౩౦ కల్లా, కాలేజీ టీ కొట్టుదగ్గరకు పిచ్చాపాటి కబురులకి చేరేవారు అంతా. ఒక రోజు అక్కడికి వెళ్లసరికి నా క్లాసుమేట్ నారాయణ మూర్తి చాల ఆవేశం గా మాట్లాడుతున్నాడు. మిగిలినవాళ్లు ఆ మాటలు పెద్దగా పట్టించుకోకుండా పేపర్ చదువుతూ టీ తాగుతున్నారు. సీన్ చూడడానికి కాస్త విచిత్రం గా అనిపించింది. మెల్లిగా దగ్గరవుతున్న కొద్దీ నారాయణ మూర్తి మాటలు వినపడసాగాయి.


"మన దేశం గురించి వాడికెందుకు? మన సైన్యం గురించి వాడు కామెంట్ చేస్తాడా? వీడెవడు అసలు.. మన రక్షణ మనకి చేతకాదా? ఛీ.. ఇలా అందరు మన గురించి కామెంట్ చేసేవాళ్ళే. అవన్నీ పేపర్ లో వేయడం.. " అని ఆవేశం గా ఊగిపోతున్నాడు.


ఏంటి విషయం అని కళ్ళతోనే అడిగాను నేను, నా పక్కనే వున్నా ఒక క్లాసుమేట్ ని.


దానికి అతను యదాలాపంగా టీ తాగుతూ పక్కనే వున్న న్యూస్ పేపర్ లో "భారత రక్షణ వ్యవస్థని పటిష్ట పరచాలి _ జార్జ్ ఫెర్నాండెస్ " అని వున్న హెడ్డింగ్ ని చూపించాడు.


అది చదివి నేను ‘ఇందులో ఏముంది’ అన్నాను.


దానికి ఆ పేపర్ ఇచ్చిన అతను "జార్జ్ ఫెర్నాండెస్ వేరే దేశం వాడు అనుకుంటున్నాడు. మన రక్షణ మంత్రి అని తెలియదు వాడికి.. " అని అన్నాడు.


నాకు చాలా నవ్వువొచ్చింది, నవ్వు ఆపుకుంటూ "మనకెందుకులే మామ దేశం గురించి " అన్నాను.


"నీ కొద్దేమో.. మాకందరికి కావాలి " అన్న మాటలు సూటిగా వచ్చి నా చెవులను తాకాయి.


ఎవరా అని చూస్తే సురేష్, చాలా సీరియస్ గా చూస్తూ అన్నాడు. అంత కోపమెందుకొచ్చిందో అనుకుంటూ ఉండగానే అందరు క్లాస్ కి, మేము సినిమా కి వెళ్లిపోయాం.


అప్పటిదాకా సురేష్ తో పెద్ద పరిచయం లేదు. తను నా క్లాస్ అని తెలుసు అంతే. ఇది వరకు ఎప్పుడు మాట్లాడలేదు. అప్పటినుండి నేను అవకాశం కోసం చూస్తున్నాను.


దేహానికి తప్ప దాహానికి పనికి రాని ఆ సముద్రపు కెరటాలు ఎగిసి ఎగిసి పడుతుంటే తాను ఇంకెంత ఎగిరిపడాలి.. అన్న వ్యాక్యం గుర్తువచ్చింది నాకు ఆ క్షణం లో.


ఒక రోజు సురేష్, ప్రేమ, ఆకర్షణ ఇలాంటి వాటి మీద ఏదేదో లెక్చర్ ఇస్తున్నాడు. ఆ గుంపులో నేను కూడ వున్నాను. ఇంతలో గాంధీ గారి గురించి చెప్పటం అందులో ఆయన బ్రహ్మచర్యం గురించి ప్రస్తావించాడు.


వెంటనే నేను సురేష్ ప్రవాహానికి అడ్డుపడి "40 ఏటా బ్రహ్మచర్యమా?" అన్నాను వెటకారం గా.


వెంటనే సురేష్ "నీకేం తెలుసు గాంధీ గురించి " అన్నాడు కోపంగా.


"నాకు పెద్దగా తెలీదు, మై ఎక్సపెరిమెంట్స్ విత్ ట్రూత్ లో అయన రాసిందే చెప్పా.. " అన్నాను నేను.


నిజానికి నాకు గాంధీ మీద వ్యతిరేకత కంటే సురేష్ ని అడ్డుతగలటమే లక్ష్యం. దాని కి మళ్ళీ సురేష్ ఏదో అనబోయేంతలో మిగిలినవారు కలగ చేసుకొని ఆ డిస్కషన్ ఆపారు.


అప్పటి నుండి, తరచూ మేం ఒకరికి ఒకరు అవకాశం వచ్చినప్పుడల్లా అడ్డుపడుతూనే వున్నాము. అలాని ఇద్దరి మధ్య బద్ద శత్రుత్వం ఏమి లేదు, కాలేజీ ఫేర్వెల్ అయ్యాక మళ్ళీ ఇదే మాట్లాడటం.


*****


మర్నాడు, ఆఫీస్ కి చేరిన వెంటనే, బాస్ రాధా కృష్ణ కోసం ఎదురుచూస్తూ పని చేసుకుంటున్నాను నేను. నా బాస్ విచిత్రమైన మనిషి. "ఆదివారం ఏం చేస్తారమ్మా.. ఇంట్లో బోర్ కదా, సరదాగా ఆఫీస్ కి రండి " అంటాడు. తెలిసి అంటాడా లేక తెలీక అంటాడో ఎవరికీ తెలీదు.

మెల్లిగా అవకాశం చూసుకొని విషయం చెప్పాను నేను.


"బాగా చేస్తాడా?" అని అడిగాడు బాస్.


"బాగా చేస్తాడు సర్.. " అన్నాను వినయం గా.


"నీకంటే బాగా చేస్తాడా?"


"చేస్తాడు, సర్ "


“సరే పిలు.. మాట్లాడదాం” అన్నాడు..


హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను, ఇంటర్వ్యూ దాక వొస్తే సురేష్ లాగేస్తాడని నాకు తెలుసు. వెంటనే సురేష్ కి ఫోన్ చేసి రమ్మని, ఎలాంటి ప్రశ్నలు అడగటానికి అవకాశం వుందో.. నన్ను ఏమి అడిగారో.. కూడా చెప్పాను, ఒక అవగాహన ఉంటుంది కదా ని..


అన్నీ శ్రద్దగా విన్నాడు సురేష్. అనుకున్నట్టు గానే రెండు రోజుల్లో రావటం, ఇంటర్వ్యూ అవటం, బాస్ కి నచ్చటం, సరే అనటం.. అన్ని ఒక వారం లో జరిగిపోయాయి. సురేష్ మొహం ఆ రోజు వెలిగి పోయింది. మనస్పూర్తి గా సురేష్ నాకు థాంక్స్ చెప్పాడు. సురేష్ ని కూడా నా రూమ్ లోనే ఉండమన్నాను.


సహజం గానే తెలివైన వాడైన సురేష్, కొద్దికాలం లోనే మంచి పేరు సంపాదించాడు. ఒక రెండు వారాలు సాఫీగా సాగిపోతున్న సమయం లో శ్రీకాంత్ అనే ఇంకో క్లాసుమేట్ నుంచి నాకు ఫోన్ వొచ్చింది.


మాటలలో, సురేష్ ఇక్కడే తనతో పాటే వైజాగ్ లో వున్నాడని చెప్పగానే ఒక్క క్షణం ఆగి, “అరేయ్ వాడు వొచ్చింది భావన కోసం రా.. “ అన్నాడు నవ్వుతూ..


దానికి నేను "భావన ? తానెవరు రా " అన్నాను.


“తానూ మన క్లాసుమేట్ లే, ఎప్పుడైనా క్లాస్ కి వొస్తే కదా తెలియడానికి” అని వేళాకోళం ఆడాడు.

"ఓహ్ అవునా? ఇద్దరు ప్రేమ లో ఉన్నారా? ఐతే " అన్నాను.


దానికి శ్రీకాంత్, “ఇంచుమించు అలాంటిదేలే, ఇంకేంటి విశేషాలు.. ” అని మిగిలిన విషయాలు అడిగాడు.


ఫోన్ పెట్టేసాను కానీ, నన్ను తను వాడుకున్నాడా? ఉద్యోగం తీసేయటం అదంతా ఉత్తిదేనా? అని చాల రకాల ఆలోచనలతో సతమతమయ్యాను. ఎందుకు అనుమానాలు.. అడిగేస్తే పోయేదేముంది అని, ఆ రోజు రాత్రి భోజనం చేస్తున్నప్పుడు శ్రీకాంత్ ఫోన్ గురించి చెప్పి, భావన గురించి అడిగాను.


దానికి సురేష్ ఒకే క్షణం ఆగి, “తాను ఒక కారణం మాత్రమే, తనే కారణం కాదు” అన్నాడు.


ఆ రోజు మొదలు కొని నేను సురేష్ లు కలిసి, రక రకాల ప్లాన్స్ తో ఎలా కలవాలి, ఎలా ప్రొపొజ్ చెయ్యాలి.. అని ఒకటే తర్జన బర్జన లు, చివరికి నేనే ధర్యం చేసి లంచ్ కి పిలిచాను. దానికి సురేష్ కూడా వొస్తున్నాడు అని చెప్పాను. అందరం ఇక్కడే వున్నాం కదా ఒక సారి కలుద్దామని అని చెప్పాను.


భావన సరే అంది.. మొత్తానికి, ముగ్గురూ లంచ్ కి వెళ్లి కబురులు చెప్పుకొని బయటకు వొచ్చాము.

భావన ‘బై’ అని చెప్పి వెళ్లిపోతుంటే నేను, “వుండు.. సురేష్ నీకు తోడు గా వొస్తాడు”, అని ‘నాకు ఆఫీస్ లో వేరే పని ఉంద’ని చెప్పి సురేష్ వైపు చూసాను.


వాడికి బానే అర్థం అయ్యింది. అదే.. అవసరం అన్నీ నేర్పిస్తుంది కదా.. విషయం అర్థమై సురేష్ వెంటనే “ఆ.. నేను డ్రాప్ చేస్తాను” అని అన్నాడు.


తనకి కి కూడా చూచాయగా తెలుసు కాబట్టి సరే అని అంది నవ్వుతూ.


ఆ రోజు సాయంత్రం, ఇంటికి రాగానే సురేష్ నన్ను గట్టిగ పట్టుకొని థాంక్స్, థాంక్స్ అని చాల సార్లు చెప్పాడు. సురేష్ తెగ సంబర పడిపోతున్నాడు. ఆలా మొదలైన సురేష్ భావన ల పరిచయం, స్నేహాన్ని దాటి ప్రేమ దగ్గరకు చేరింది. కొంత కాలం బాగానే వున్నాడు సురేష్. తరువాత సురేష్ అదోలా ఉండటం గమనించాను. ఎంత వద్దు లే అనుకున్నా ఒక సారి అడిగేశాను సురేష్ ని.


దానికి సురేష్ ఏమి చెప్పలేదు. ‘అంతా బానే వుంది’ అనేవాడు. అడగగా, అడగగా "నేను రూమ్ మారాలట, నీతో ఉండొద్దు అంటోంది” అన్నాడు.


హతాశుడైన నేను తేరుకొని “మధ్యలో, నేనేం చేశాను ?" అన్నాను.


“నన్ను చెడగొడతావని తన భయం. ఆ భయం ఏమి పెట్టుకోకూ అని ఎన్ని సార్లు చెప్పినా వినటం లేదు. ఈమధ్యన రోజూ అదే టాపిక్. ఈసారి నేను గట్టిగానే చెబుతాలే“” అనేసి మాట మార్చాడు.


పాపం, సురేష్ నా కోసం యెంత మదన పడుతున్నాడు అని మనుసులోనే అనుకున్నాను.

ఆ రోజు రాత్రి నేను, ఏదో పుస్తకం చదువుతూ ఉండగా, సురేష్ రుస రుస లాడుతూ లోపలకు వొచ్చి, "తనకి అర్థం కాదా ! ఎన్ని సార్లు చెప్పాలి నేను రూమ్ మారను అని.. " గట్టిగా అరుస్తున్నాడు.


దానికి నేను "పోనీలే సురేష్, నేను రూమ్ మారతాను.. నా మీద మన క్లాస్ లో ఎవరికి సదభిప్రాయం లేదు కదా.. మన ఫ్రెండ్షిప్ గురించి నువ్వు ఎందుకు తన తో గొడవ పడటం.. నువ్వేం వర్రీ అవ్వకు. నేను వేరే రూమ్ కి వెడతాను రేపే" అన్నాను..


దానికి సురేష్, "ఇక్కడ సమస్య నీ గురించో, నీతో నా స్నేహం గురించో కాదు అనంత్! నా గురించి, నా వ్యక్తిత్వం గురించి.. నేను ఎలాంటి వాళ్ళ మధ్యన వున్నా నన్ను ఎవరూ ప్రభావితం చేయలేరు అని తనకి ఈ పాటికి తెలియాలి కదా! గంజాయి మొక్క పక్కన వున్నా తులసి తులసే కదా.. " అని విసురుగా వెళ్లిపోయాయడు సురేష్.


నాకు సురేష్ బాధపడుతున్నది ఎందుకో కాస్త ఆలస్యంగా అప్పుడు అర్థమైంది. ఒక్క క్షణం ఆగి, ఆపేసిన శ్రీ శ్రీ పుస్తకాన్ని మళ్ళీ చదవటం మొదలుపెట్టాను.


ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బ తినిందని, స్నేహితుడొకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్లి పోయారని.. అలాగే ఉండిపోతే ఎలా?


ఆ సంఘటన మా మధ్యన దూరాన్ని పెంచింది. నేను మామూలుగానే ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. సురేష్ మళ్ళీ ఆ విషయం గురించి ఎత్తలేదు. మరీ మాటలు లేనంతగా లేదు గాని దూరం ఐతే పెరిగింది. కొన్ని నెలల తరువాత నాకు హైదరాబాద్ లో ఒక పేరున్న కంపెనీ లో, నేను అనుకున్న ఉద్యోగానికి పిలుపు వొచ్చింది.


వెంటనే అందరికి సెలవు పలికి హైదరాబాద్ వెళ్ళిపోయాను. మళ్ళీ వెనక్కి విశాఖపట్నం వైపు గాని, నా పాత మిత్రులువైపు కానీ, సురేష్ తో కూడా టచ్ లో లేను. కనీసం ఎప్పుడూ ఫోన్ కూడా చెయ్యలేదు. నా పని వత్తిడి, కొత్త పరిచయాలు, కొత్త వాతావరణం కూడా కొంత కారణం.


ఇంతలో మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఆ క్రమం లోనే కొంత మందిని చూస్తున్నాను. నాకు నచ్చితే అమ్మాయి తరఫు వాళ్ళకి నచ్చటం లేదు. మరి నేను ఆర్డర్ అఫ్ ప్రయారిటీ లో చీవర వున్నాను. మొదట NRI లు, తరువాత గ్రీన్ కార్డు హోల్డర్స్, తరువాత h1, ఆ తరువాత మల్టీ నేషనల్ కంపెనీ లో మంచి పొజిషన్ లో వున్న వారు, ఆ తరువాత మంచి కంపెనీ లో సాధారణ ఉద్యోగం, . ఈ లిస్ట్ అందరిని దాటుకొని సంబంధాలు నా దాకా రావటం మానేశాయి.


ఆలా మరి కొంత కాలం గడిచిపోయింది. ఒక రకంగా నాకు బెంగ పట్టుకుంది. అమెరికా ప్రయత్నం కూడా ఫలించటంలేదు. ఓ రోజు ఇంటి నుండి కబురు వొచ్చింది ఏదో సంబంధం అని, మళ్ళీ మామూలే అనుకోని నేను నచ్చని బాపతు ఐతే నా ప్రొఫైల్ చూడగానే వద్దంటారు కదా ఇంత దాక వచ్చింది అంటే.. అని ఒక చిన్న ఆశ తో బస్ ఎక్కి చెప్పిన ఊరు విజయవాడ వెళ్ళాను. వాళ్ళ తల్లిదండ్రులు అక్కడినుండి వొచ్చారు.


పెళ్లి చూపుల తతంగం మొదలయింది. మొదట్లో ముభావంగా వున్న నేను, అమ్మాయిని చూడగానే, టెన్షన్ పడ్డాను. నేను ఆమెకి నచ్చుతానా.. అని. ఎందుకంటే అమ్మాయి చక్కగా వుంది. మొన్ననే CA ఫైనల్ రాసింది. ఇంతలో పెళ్లి కూతురు తండ్రి పరిచయం చేసుకొని, వాళ్ళకి అమెరికా సంబంధాలు ఇష్టం లేదని, కుర్రాడు బుద్ధి మంతుడు, కాస్త తెలిసినవాడు ఐతే మంచిదని, మీ గురించి తమ బంధువులు చెప్పారని, అందుకే ఈ సంబంధం ఇష్టపడుతున్నామని క్లుప్తంగా చెప్పాడు.


అక్కడే నేను ఖంగు తిన్నాను. తాను బుద్ధిమంతుడని తనకి తప్ప ఇంకెవరికి తెలీదు. వీళ్ళకి ఎలా తెలుసు? అని తెగ మదనపడిపోయాను.


ఆ భయం తోనే అమ్మాయి తో “హలో”, ” హౌ అర్ యు” తప్ప ఏమీ మాట్లాడలేదు. ఏమైంతేనేం.. మొత్తానికి సంబంధం ఇరువర్గాలవారికి నచ్చింది. పెళ్లి కి సిద్ధమయ్యారు అంతా.


పెళ్ళిపీటల మీద కూర్చొని ఉండగా, సురేష్ ఆ అమ్మాయిని బుట్టలో ఎత్తుకొని వొస్తూ కనిపించాడు. కొంచెం వొళ్ళు చేసినా గుర్తుపట్టాను సురేష్ ని. సురేష్ కూడా నన్ను పలకరించాడు.


నవ్వుతూ, దగ్గరకు వొచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి “కంగ్రాట్స్ ! పెళ్లికూతురు నా కజిన్” అని చెప్పి పెళ్లి పనుల్లో హడావిడిగా తిరుగుతున్నాడు. తన వెనకే భావన కూడా కనిపించి దూరం నుంచే పలకరింపుగా నవ్వింది. పెళ్లి అయ్యాక తెలిసిన దేమిటంటే, పెళ్లి విషయం అనుకుంటున్నప్పుడు, సురేష్, నా గురించి చెప్పాడని, నేను మంచి వాడినని, సురేష్ మరియు భావన లే హామీ ఇచ్చారని తెలిసింది.


నేను, సురేష్ ని అపార్థం చేసుకున్నందుకు చాల బాధపడ్డాను.


”అద్దం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానం వెతుక్కో” అన్న శ్రీ శ్రీ వ్యాఖ్యలు మదిలో మెదిలాయి..


వెళ్లి, తనను క్షమించమని అడుగుదామనుకున్నాను. కానీ సురేష్ ఏమి జరగనట్టు మామూలుగానే వున్నాడు. నేను ఇంత మదన పడుతూ ఉంటే సురేష్ మామూలుగా ఎలా ఉండగలుగుతున్నాడు? అని అనుకున్నాను.


పెళ్లి తతంగం ముగిశాక, గతం లో సంఘటనలు అన్నీ ఒక సినిమా రీల్ లాగ తిరిగాయి. కానీ ఆ సంఘటనలు నా దృష్టి కోణం లోంచి కాకుండా మూడో వ్యకి లాగా చూసాను. ఈసారి, ఆ సంఘటనలు చాలా చిన్నవిగా పట్టించుకునే స్థాయి కూడా లేనివి గా అనిపించాయి. ఐతే తానుగా చూసినప్పుడు మాత్రం అవి పెద్దవి గా, తనని గంజాయి మొక్కతో పోల్చినట్టు గా అనిపించింది. నిజానికి, సురేష్ ఆ క్షణం లో ఒక సామెతగా మాత్రమే చెప్పాడు.


సముద్రమే కాదు, ఎదుటి వారు కూడా మన ఆలోచనలను ప్రతిబింబిస్తారు. నీ ఆలోచన మంచిదయితే, మంచివారుగానే కనిపిస్తారు. నిజానికి సురేష్, నన్ను విమర్శించడానికి ప్రయత్నించలేదు, ఐతే నేను, సురేష్ ఫై అవకాశం కోసం ఎదురు చూసాను. సురేష్ లో నచ్చని గుణాలు అన్నీ నావే.. సురేష్ లో చూసుకున్నాను.


“ఏమండీ.. ఇంక వెళ్దామా “ అన్న మా ఆవిడ పిలుపుకి ఈ లోకం లోకి వొచ్చి ‘పద’ అని బయలుదేరాం ఇంటికి.


కానీ నాకు అర్థం అయ్యింది ఏమిటంటే, మనకి ఎదురుపడ్డ ప్రతి వ్యక్తి లోను కనిపించేది మన రూపమే.

***

కిరణ్ జమ్మలమడక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: Dr: కిరణ్ జమ్మలమడక

కంప్యూటర్ అప్లికేషన్స్ లో మాస్టర్స్ చేసి, GE లో సీనియర్ మేనేజర్ గా, భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. కిరణ్ , "స్ప్రింగ్" అనే సంస్థ ను స్థాపించి, తద్వారా విద్యార్థులకు మోటివేషనల్, లైఫ్ కోచింగ్ తరగతులను నిర్వహిస్తూ వుంటారు. తన సంస్థ ద్వారానే కాకుండా పిల్లలు , పెద్దలు ప్రపంచం పట్ల సానుకూల దృక్పథం తో ముందుకుసాగాలనే ఉద్దేశం తో కథలు రాయటం మొదలుపెట్టారు, ప్రముఖ పత్రికల్లో ఆయన కథలు కొన్ని ప్రచురితమయ్యాయి ,తెలుగు వెలుగు 'కథా- విజయం 2019' పోటీలో భాగంగాఎన్నిక అయ్యిన "మిరప మొక్క " ప్రజాదరణ పొందినది. పదేళ్లలోపు పిల్లల కోసం రాసిన "యాత్ర", పదేళ్ల పైబడిన పిల్లల కోసం రాసిన నవల "అతీతం" లను తానా - మంచిపుస్తకం 2021 లో ప్రచురించింది.


50 views1 comment

1 Comment


Surekha Arunkumar
Surekha Arunkumar
Nov 09, 2023

I feel this story has come out of real incidents. Good write-up.

Like
bottom of page