'Bandhalu - Bandhavyalu' - New Telugu Story Written By Lakshmi Sarma Thrigulla
Published In manatelugukathalu.com On 28/10/2023
'బంధాలు - బాంధవ్యాలు' తెలుగు కథ
రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
పెళ్ళి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిన నీలిమకు అంతా విచిత్రంగా అనిపించసాగింది. అత్తవారింటిలో కూడా రాజభోగాలు అనుభవించడమేననుకుంది. తల్లిగారింటిలో లాగా పక్కమీదనుండి లేవగానే అమ్మా కాఫీ అనగానే వంటావిడ కాఫీ అందించినట్టు అందిస్తారని ఆశించిన నీలిమకు మొదటేరోజే చుక్కేదురయింది.
ఎనిమిది అవుతున్నా ఇంకాలేవని కొత్త కోడలిని చూసి చూడనట్లుగా వదిలేసింది కస్తూరి. నెమ్మదిగా అలవాటు అవుతుందిలే అనుకుంది మనసులో. నీలిమ భర్త మదన్ నీలిమను లేపకుండానే ఉదయం ఏడుగంటలకల్లా ఆఫీసుకు వెళ్ళిపోయాడు. బద్దకంగా లేచి చుట్టూ చూసుకుంది.
తను ఎక్కడుందో గుర్తుకువచ్చి పక్కన చూస్తే భర్త మదన్ కనిపించలేదు. టైం చూస్తే ఏనిమిదవుతుంది. చటుక్కున మంచం దిగి బాత్రూంలో దూరింది.
“ఏమ్మా రాత్రి బాగా నిద్రపట్టిందా? కొత్తచోటు కదా కాస్త అలవాటు అయ్యేవరకు అలానే ఉంటుందిలే, ఇదిగో కాఫీ తాగు. మదన్ ఉదయమే ఆఫీసుకు వెళ్ళిపోయాడు” కోడలి చేతికి కాఫీ అందిస్తూ చెప్పింది కస్తూరి.
“ఆ బాగానే పడుకున్నాను. మదన్ వెళ్ళకముందు నన్ను లేపాల్సింది, ” అంది నీలిమ.
ఇలా అంటుందే కానీ తను ఏనాడైనా ఏనిమిదవందే లేచిన పాపాన పోలేదు. అయినా ఏం కొంపలంటుకు పోతున్నాయని అంత తొందరగా లేవడం అనుకుంది తనలో తానే.
“అత్తయ్యా… అదేమిటి టిఫిన్ మీరు చేస్తున్నారు వంటావిడ వస్తుంది కదా! ఈ రోజు ఆవిడ రానన్నారా అత్తయ్య, ” అడిగింది వంటింటిలో ఇడ్లీ సాంబారు చేస్తున్న కస్తూరిని చూసి.
“నీలిమా… మనింట్లో వంటమనిషి లేదమ్మా, మీ మామయ్యకు, పిల్లలకు, అందరికి నా చేతి వంట చాలా ఇష్టం, వంటవాళ్ళను పెట్టుకుంటే ఆదరాబాదరాగా చేస్తారు, రుచి మాట దేవుడెరుగు పట్టేంత నూనే గుమ్మరిస్తారు, అయినా మన చేతులతో మనం చేసుకుని తినే తృప్తి ఎక్కడొస్తుదమ్మా” అంటూనే ఇడ్లీ సాంబారు తయారు చేసింది.
‘ఇదేం కర్మ రా బాబు … వంటావిడను పెట్టుకుని హాయిగా కూర్చొని తినక ఎందుకొచ్చిన కష్టం ఇది. నా వల్ల అయితే కాదు నేను మాత్రం చెయ్యలేను మా ఇంట్లో కమ్మగ పుల్లగా తిని పెరిగాను’ అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది నీలిమ.
‘ఈ అమ్మాయికి వంటలు గట్రా ఏమి రావనుకుంటా మెల్లిగా నేర్పించాలి’ నీలిమ వెళ్ళినవైపే చూస్తూ అనుకుంది కస్తూరి.
నీలిమ అత్తవారింటికి వచ్చి ఆరునెలల పైనే అయింది. మొదట్లో కొంచెం గొడవచేసి పుట్టింటికి వెళ్ళేది. రాను రాను పుట్టింటికి వెళ్ళాలంటేనే విరక్తి రాసాగింది. తల్లి తండ్రులు ఎన్నో మార్లు అడిగారు రమ్మనమని. అత్త మామలు, భర్త వెళ్ళమన్నా కుదరదు అని చెప్పేది. నీలిమలో ఈ మార్పేంటో అటు తల్లి తండ్రులకు తెలియలేదు, అత్తింటివారికి చెప్పలేదు కానీ నీలిమ చాలా సంతోషంగా ఉందని మాత్రం అర్ధం చేసుకున్నారు అత్తవారింటిలో.
“హలో నేను నీలిమను మాట్లాడుతున్నాను” ఫోన్ వస్తే రిసివర్ తీసి మాట్లాతుంది.
“నీలిమ, నేను తల్లి మీ అమ్మను, నువ్వు మనింటికి వచ్చి ఎన్ని రోజులవుతుందో తెలుసా? నీకేం తక్కువ చేసానని నువ్వు రావడం లేదు, పెళ్ళి కాగానే అత్తగారిల్లే స్వర్గం అనుకునేదాన్ని నిన్నే చూస్తున్నాను, నీలిమ.. నీ కోసమని ఎన్ని కొత్త నగలు తెచ్చానో తెలుసా? ఫ్యాషన్ గా ఉన్నాయని చాలా చాలా చీరలు తెచ్చాను, అవి చూడడానికన్నా రావే, మీ నాన్న చాలా బెంగపెట్టుకున్నారు నీ మీద, ” ఫోన్ పట్టుకున్నదంటే గడగడా వాయించేస్తుంది నీలిమ తల్లి వాసంతి.
“అబ్బ అమ్మా… నాకిప్పుడు నగలు కావాలని నీకు చెప్పానా, మీరు పెట్టినవి కాక ఇక్కడ మా అత్తగారు తీసుకున్నవే చాలా ఉన్నాయి, ఏం చేసుకుంటాను అవన్ని, మొన్న మీ అల్లుడు మద్రాసు వెళ్ళాడా.. ఎన్ని చీరలు తెచ్చాడనుకున్నావు ? అసలు అంత మంచి చీరలు మన దగ్గర దొరకవంటే నమ్ము, ” ఆనందంతో చెబుతుంది నీలిమ.
“అయితే ఏమంటావే, మనింటికి మాత్రం రాను అంటావు, ఏంటి మీ అత్తగారు ఏదో మందుపెట్టినట్టున్నారు మనింటికి రానివ్వకుండా, అంతేలే, నువ్వు లేకపోతే ఇంట్లో పనిచేసేవాళ్ళుండరు, అందుకని నిన్ను మనింటికి రానివ్వకుండా చేస్తున్నారు, ” కోపంతో కఠినంగా మాట్లాడుతూ ఫోన్ పెట్టేసింది వాసంతి.
‘ పిచ్చి అమ్మా … నువ్వునుకున్నట్టు మా అత్తయ్య అంత దుర్మార్గురాలు కాదు, మంచి మనుసున్న మహారాణి. ఆమె మంచితనం ముందు మనం నయాపైస విలువలేము, నీ దగ్గరకు వచ్చి అన్ని విషయాలు చెబుదామనుకున్నాను, కానీ
తీరికలేక రాలేకపోయాను. ఈ లోపల నువ్వు ఫోన్ చేసావు’ అనుకుంటూ, ‘ఇలా కాదు, మా అమ్మ దగ్గరకు వెళ్ళినా వివరంగా చెప్పలేనేమో, అందుకే తీరుబడిగా కూర్చొని
లేటర్ రాస్తాను’ పెన్ను పేపర్ తీసుకుని రాయడం మొదలుపెట్టింది.
“అమ్మా… నమస్కారం… అమ్మా నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను, మనింటికి రావడంలేదని మీరు బాధపడుతున్నారని నాకు తెలుసు, నేను అత్తవారింటికి వచ్చిన మొదట్లో అనుకునేదాన్ని, నాకు పెళ్ళి ఎందుకు చేసారు హాయిగా స్వేచ్చగా ఉండేదాన్ని, ఇక్కడ బయపడుతూ ఉండాలంటే నా వల్లకాదు అనుకునేదాన్ని.
, ఏమిటో మనింట్లో ఎప్పుడు లేచినా అడిగేవారే ఉండకపోదురు, ఎవరిష్టం వాళ్ళు అన్నట్టుగా ఉండేవాళ్ళం మనం. పక్కమీదనుండి లేచామంటే బెడ్ కాఫీ ఇవ్వడానికి వంటవాళ్ళు, ఆకలి అవుతుంది అనిపిస్తే డైనింగ్ టేబుల్ మీద వండి సిద్ధంగా పెట్టిన వేడి పదార్థాలను పెట్టుకుని తినడం, మనింట్లో ఉన్న మన నలుగురం ఎవరు ఎప్పుడు తింటున్నామో, ఇంట్లో ఎప్పుడు ఉంటున్నామోనన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళం ఉంటాం, ఒకర్నొకరు పలకరించే సమయమే ఉండదు మనకు, అలాగని మనమేం పెద్ద ఉద్యోగస్తులం కాదు. ఉద్యోగం చెయ్యవలసిన పని మనకు అంతకంటేలేదు, ఎందుకంటే మనకు తరగని ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా అందుకని.
అమ్మా … నీకో విషయం తెలుసా? నువ్వు నన్ను చాలా గారాబంగా పెంచావనుకున్నావు కానీ! నాకు పని పాటలురాని రాని చేతకాని దాన్నిలా తయారు చేస్తున్నా ననుకోలేకపోయావు, పని వాళ్ళ చేతుల్లో పెరిగాను కదా ప్రేమ ఆప్యాయతలు చాలా తక్కువగా నేర్పావు, ఎందుకంటే అమ్మ ఒడిలో పెరిగిన బిడ్డలకు మనుషుల విలువలు తెలుస్తాయంటారు, నువ్వు నన్ను అలా పెంచలేదు. పరవాలేదు, కనీసం మనుషుల విలువలు తెలుసుకునే ఇంటికి కోడలిగా పంపారు చూడు.. అదమ్మా నువ్వు నాకు ఇచ్చిన బహుమానం. ఏమన్నావు.. మా అత్తగారు నాచేత పని చేయించుకుంటుందనుకున్నావు కదా! తప్పమ్మా, మా అత్తగారు తనే ఆప్యాయతను మనసునిండా నింపుకుని వండి కమ్మని వంటలు చేసి, ప్రేమ అనే అమృతాన్ని దగ్గరుండి వడ్డిస్తుంది.
అమ్మా… నాకు చిన్నప్పుడు నువ్వు గోరు ముద్దలు తినిపించి ఉండవు, ఎందుకంటే మనం డబ్బులో పుట్టి పెరిగిన వాళ్ళం కదా! పసిపిల్లలను పనివాళ్ళకు అప్పచెప్పడమే నీకు తెలుసు, కానీ ఇప్పుడు మా అత్తగారిని చూస్తుంటే నా బాల్యంలో నేనేం పోగొట్టుకున్నానో అర్ధమౌతుంది.
చూడమ్మా… డబ్బు అనేది అందరికి ఉంటుంది, ఆ విషయానికి వస్తే మా అత్తగారికి ఉన్న డబ్బులో మనమెంతనుకున్నావు, కానీ మా కుటుంబంలో ఎవ్వరికి డబ్బుందన్న అహంకారమేలేదు, అందరిని సమానంగా చూస్తారు.
ఎంత మంచి మనుషులమ్మా వీళ్ళు, అమ్మా నీకో విషయం తెలుసా? ప్రతి ఆడపిల్లకు పుట్టినింటికి రావాలని, అమ్మ ఒడిలో తలపెట్టుకుని పడుకోవాలని, అత్తగారు ఆడపడుచులు పెట్టే బాధలు చెప్పుకుని, మామగారికి భయపడుతూ భర్త చెప్పుచేతలలో ఉంటున్నానని, కన్నవారింట్లో సేద తీరాలని అనుకుంటారు అందరు.
కానీ నేను అలా కాదమ్మా, ఎందుకంటే నాకు మనింట్లో ఎక్కడ చూసినా డబ్బు అహంకారమే కనపడేది తప్పా ఆప్యాయతలు కనిపించేవి కావు. ప్రేమగా పట్టెడన్నం ఎప్పుడైనా తిన్నామా మనం, వంట వాళ్ళకు ఆర్డర్ వెయ్యడం, ఆదర బాదర తినడం అయిందనిపించడం, నాన్నేమో బిజినెస్ పని మీద వెళ్ళిపోతే నువ్వేమో క్లబ్బుకు వెళ్ళిపోయేదానివి, అదేదో నీ స్వర్గసీమ అన్నట్టుగా. ఇక అన్నయ్య అయితే వాడేం చేస్తున్నాడో, ఎప్పుడు ఇంటికి వస్తాడో వాడికే తెలియదు. అలాగని వాడి గురించి ఆలోచించే సమయం ఎవరికుంది చెప్పు..
ఇక నా విషయమంటావా? నేను పుట్టినప్పటినుండి నేర్పించిన డబ్బు గర్వం నా నరనరానా నిండిపోయి ఎవ్వరిని లెక్కచేసేదాన్ని కాదు, నీకు తెలుసు కదా అమ్మా… మంచేదో చెడేదో తెలియక డబ్బుంటే ఏదైనా కొనగలమని విర్రవీగేదాన్ని. అలాంటి నాకు మీరిచ్చిన మంచి బహుమానం ఏంటో తెలుసామ్మా, ప్రేమ ఆప్యాయతలు కలబోసిన కుటుంబాన్నిచ్చి, నన్నొక మనిషిగా నిలబెట్టారు అందుకోసం నేనెప్పుడు మీకు కృతజ్ఞురాలిని.
మానవత్వం అంటే ఏమిటో మా మామయ్య దగ్గర నేర్చుకున్నాను., అనురాగం ఆత్మీయతలు పుష్కలంగా ఎలా పంచాలో మా అత్తయ్య నుండి తీసుకున్నాను. మా ఆడపడుచు ఉంది చూసావు.. తనైతే తన అత్తమామలను దైవంగా చూసుకుంటుంది. పైగా తనొక పెద్ద
డాక్టర్. ఆ గర్వమే లేదు మచ్చుకైనా. ఇక నా భర్తంటావా.. నన్ను కంటిపాపలా చూసుకుంటాడు. నా కోసం కొండమీది కోతిని తెమ్మన్నా తేవడానికి సిద్ధం. కానీ ఇది
నేను మొండితనంతో అడిగేది కాదు. నా మీదున్న ప్రేమతో..
అమ్మా… నేనిప్పుడు నీ పాత నీలిమను కాదు, ఇంటికి వచ్చిన వారిని ఆదరణతో చూసి ప్రేమగా పలకరించడం, పనివాళ్ళ కష్టసుఖాలను విచారించడం నేర్చుకున్నాను. ఇప్పుడు ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం లేకపోతే అందరికి దిగులు.అంతగా మారిపోయాను తెలుసా అమ్మా, ఇదంతా ఎందువలన అంటావు.. మా అత్తగారి వల్ల. అందుకే నేను మన ఇంటికి రాలేకపోతున్నాను. అమ్మలా ఆప్యాయంగా మాట్లాడుతుంది, ఆకలి అవుతుంది అంటే కన్నతల్లిలా కడుపునింపుతుంది.
ఒంట్లో కాస్త నలతగా ఉందంటే అక్కున చేర్చుకుని సేద తీరుస్తుంది. ఇంకా ఇంతకంటే ఏం కావాలమ్మా ఏ ఆడపిల్లకైనా..
ఇక ఉంటానమ్మా! ఈ ఉత్తరం నిన్ను బాధపెట్టాలని రాయలేదు, మనం ఏం పోగొట్టుకుంటున్నామో రాసాను అంతే!
అమ్మా, నన్ను క్షమిస్తావు కదూ.. ”
ఇట్లు,
మారేపల్లి నీలిమ, ”
ఉత్తరమంతా రాసిన తరువాత ఒకసారి తృప్తిగా చదువుకుని పోస్టుబాక్సులో వేసింది. కనీసం ఇప్పుడన్నా మా అమ్మా వాళ్ళు మనసున్న మనుషులుగా మారితే ఎంత అదృష్టవంతురాలినో నేను అనుకుంది మనసులో.
ఉత్తరం చదువుకున్న వాసంతికి కళ్ళముందు ఎగిరెగిపడుతున్న నీలిమకు ఇప్పుడు ఉత్తరం రాసిన నీలిమకు ఎంత తేడా. చిన్న పిల్లైనా ఎంత చక్కగా మా కళ్ళు తెరిపించింది. డబ్బుందన్న అహంకారంతో కళ్ళు మూసుకపోయాయి. డబ్బులేదన్న చుట్టాలను పక్కాలను దగ్గరకు రానివ్వక అందరిని దూరం చేసుకున్నాము. నా డబ్బుతో నాకు గొడుగు పట్టే వాళ్ళే నా వాళ్ళనుకున్నాను. ఎంత పొరబాటుచేసాను.. నీలిమకు పెళ్ళి జరిగి ఆరునెలలు
కాలేదు, అప్పుడే ఎంతగా మారిపోయింది.. పరిస్థితులను ఎంత చక్కగా అవగాహన చేసుకుంది.. మంచితనం కలగలిసిన మనుషుల మధ్య ఉంటే మంచితనమే అలవాటవుతుంది. ఇంకానయం, నీలిమ అత్తవారింటిలో తనకున్న అహంభావం చూపెట్టి ఉంటే కనుక ఈ పాటికి పుట్టింటిలో ఉండిపోయేదేమో.
నిజమే నీలిమ చెప్పినట్టు భార్యభర్తలమైన మా మధ్య సఖ్యత తక్కువే. తల్లి కూతుర్ల నడుమ ప్రేమ ఆప్యాయతలు పరాధీనమే. ఇక తల్లి తండ్రులుగా మేము, కొడుకుగా వాడు మేమేనాడు లేము. డబ్బు అవసరమనుకున్నప్పుడు వాడు మా కళ్ళముందు కన్పిస్తాడు అంతే తప్పా! బంధాలకు
బాంధవ్యాలకు విలువలేదు మా మధ్యన. డబ్బే ముఖ్యమనుకుని ఎన్ని కోల్పోయామో ఇప్పుడు అర్ధమవుతుంది. నీలిమ.. నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నేనేకాదు.. మీ అన్నయ్య, మీ నాన్నకు కూడా నీ ఉత్తరం చూపిస్తాను. వాళ్ళు కూడా నువ్వు చెప్పిన మార్గంలో నడిచేలా చేస్తాను. తొందరలోనే నిన్ను కలుస్తాను’ అని మనసులో అనుకుంటూ ఇన్నాళ్ళుగా అలవాటులేని పనులన్నీ చెయ్యడం మొదలుపెట్టి భర్తను కొడుకు నెమ్మదిగా తన మాట వినేలా చేసుకోసాగింది వాసంతి.
కలిసి భోజనం చెయ్యడం, ముగ్గురు కలిసి సరదాగా బయటకు వెళ్ళిరావడం, ఎంతో తృప్తినియ్యసాగింది వాసంతికి. మెల్లెమెల్లెగా తన పాత అలవాటులన్ని మానుకుని, తన వాళ్ళందరిలో మంచిపేరు తెచ్చుకుంది.
***********************************************
లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ
నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,
నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.
ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.
మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,
లక్ష్మి శర్మ
లాలాపేట సికింద్రాబాద్
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
@JayaLakshmi-kf6sy • 2 days ago
Chala bagundi laxmakka kuturlu tallini marchatem
@sowmyakoride9848 • 3 days ago
Chala bagundi storey
@swapnaj8931 • 3 days ago
Chaala bagundi Katha, prathi illu ee vidhanga unte enta baguntundo, ilanti inspirational stories inka enjoy rayali meeru.