top of page
Writer's pictureSathyanarayana Murthy M R V

బంగారం లాంటి మనిషి


'Bangaram Lanti Manishi' - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy

'బంగారం లాంటి మనిషి' తెలుగు కథ

రచన: M R V సత్యనారాయణ మూర్తి

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

శివపురం లో బంగారం లాంటి మనిషి మా ‘స్వర్ణశ్రీ’ గారు. ఆయన అసలు పేరు అరటికట్ల సోమేశ్వర రావు గారు. ఆయన బంగారం పని చేస్తారు కాబట్టి, ఆయనని అలా పిలుస్తారని మేం చిన్నప్పుడు అనుకున్నాం గానీ, అది ఆయన బిరుదని పెద్దయ్యాక తెలిసింది.


రామచంద్ర రావు పేట లోని ఇంటి దగ్గర నుండి తొమ్మిదింటికి బయల్దేరితే గాంధీ బొమ్మల దగ్గర ఉన్న కొట్టు దగ్గరకు రావడానికి గంట సమయం పట్టేది. అలాగని అది పెద్ద దూరం కాదు. కానీ దారిలో ఆయన్ని పలకరించే మిత్రులు ఎక్కువ. అందువలన అంత సమయం పట్టేది. ఐదు అడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తు, విశాలమైన మొహం, ఆ మొహానికి బంగారు రంగు ఫ్రేము ఉన్న, కళ్ళ జోడు, ఆ కళ్ళ జోడు వెనకాల పెద్ద కళ్ళు. ఫాంటు దాని పైన ఫుల్ హాండ్స్ షర్టు తో ఆయన గంభీరంగా నడిచి వస్తుంటే చిత్తూరు నాగయ్య గారే గుర్తుకు వస్తారు.


బీళ్ల అప్పలస్వామి ఇల్లు దాటగానే రేకు పెట్టెలు తయారు చేసే జామి అప్పారావు ని, అతని తమ్ముడు రామా రావు ని ఓసారి పలకరించి గానీ ముందుకు సాగేవారు కాదు ఆయన. ఆ తర్వాత ఆ పక్కనే వడ్రంగి పని చేసే శ్రీరామ మూర్తితో రెండు మాటలు మాట్లాడి వెళ్ళేవారు. ఒకోసారి సబ్బెల్ల పుల్లారెడ్డి కూడా అక్కడే ఉంటె అతన్ని కూడా పలకరించి ముందుకు వెళ్ళేవారు.


“ఏంటి స్వర్ణ శ్రీ గారూ, ఈ మధ్యన ప్రోగ్రాములు ఏమీ లేవా ?” అని పుల్లా రెడ్డి అంటే, గత వారం ఎక్కడికి వెళ్లి వచ్చినదీ చెప్పేవారు స్వర్ణ శ్రీ. కామాక్షీ దేవి గుడి దగ్గరకు రాగానే, ఒకరిద్దరు ఆయన్ని ఆపేవారు. ఎం. ఎల్. ఏ. గారు వస్తే చెప్పమని, తమకున్న ఇబ్బందులు గురించి ఆయనకీ చెప్పే వారు. ఆయన, ఎం. ఎల్. ఏ. గారు వస్తే మీకు తప్పకుండా కబురు చేస్తానని హామీ ఇచ్చి ముందుకు సాగేవారు. ఎం. ఎల్. ఏ. వంక సత్యనారాయణ గారు తణుకు లో ఉంటారు. శివపురం వచ్చినప్పుడు పార్టీ ఆఫీస్ కి వచ్చి కార్యకర్తల్ని, మిత్రుల్ని కలిసి వెళ్తూ ఉంటారు. స్వర్ణశ్రీ గారిని ఆయన తప్పకుండా కలుస్తారు. అదీ అసలు సంగతి.


గాంధీ బొమ్మల సెంటర్ దగ్గర ఉన్న జవ్వాది వారి షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న చిన్న కొట్టులో ఆయన బంగారం పని చేస్తారు. ఆయన కొట్టు పక్కనే బంగారం కొట్లు ఉన్నాయి. షావుకార్లు అందరికీ స్వర్ణశ్రీ అంటే చాలా గౌరవం. తమ దగ్గరకు వచ్చే ఖాతాదార్లు ఏమైనా బంగారం వస్తువులు చేయించుకోవాలంటే ముందుగా స్వర్ణశ్రీ గారి దగ్గరికే పంపుతారు షావుకార్లు. దానికి తగిన విధంగానే ఖాతాదార్లకు కావాల్సిన బంగారం వస్తువులను తయారు చేసి సరైన సమయానికి వారికి అందించే వారు.


కొట్టు తలుపు తీసి శుభ్రం చేస్తుండగా, పక్కనే ఉన్న బంగారం కొట్టు వీరభద్రం గారు “ఈరోజు అరగంట ఆలస్యం అయ్యింది సారూ” అని నవ్వుతూ పలకరించారు.


‘అవునండి, ఈరోజు మిత్రులతో ఎక్కువసేపు మాట్లాడవలసి వచ్చింది’ అని జవాబిచ్చారు స్వర్ణశ్రీ పని చేసుకుంటూనే.


“ఆ.. కొఠాలపర్రు నాగమణి గారి బంగారు గాజులు అయ్యాయా?”అడిగారు వీరభద్రం.


“ఆ. అయిపోయాయండి. ఇవాళ మెరుగు పెట్టిడం తరవాయి. మధ్యాహ్నం కి రెడీ అయిపోతాయి” అన్నారు స్వర్ణశ్రీ.


‘సరే సరే.. ’అని వీరభద్రం తన పని చూసుకోసాగారు. ఈ గాజులు తయారు చేసే పని వీరభద్రం గారి ద్వారానే స్వర్ణశ్రీ కి వచ్చింది. కొట్టు శుభ్రం చేయడం పూర్తి కాగానే, సుత్తి, శ్రావణం ఇతర పనిముట్లను గుడ్డతో శుభ్రంగా తుడిచారు. వాటికి నమస్కారం పెట్టుకున్నారు. తర్వాత, చుట్టూ ఊక, మధ్యలో బొగ్గులు ఉన్న కుంపటిని వెలిగించారు. అప్పటికి ఆయన పెద్ద కొడుకు వచ్చారు.

గోడకు చేర్చి ఉన్న ఇనుప బీరువా తెరిచి అందులో ఉన్న బంగారం వస్తువులను తండ్రి ముందు ఉంచాడు.


వాటిని ఓ సారి పరిశీలించి కొడుక్కి కొన్ని సూచనలు చేసారు. అతను ఆ బంగారు వస్తువులను తీసుకుని తండ్రి సూచనల మేరకు వాటిని మెరుగు పెట్టే పనిలో పడ్డాడు. స్వర్ణశ్రీ గారు ఒక బంగారపు ఉంగరం తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఒక గంట గడిచింది. కమ్యూనిస్టు పార్టీ కి చెందిన గుడాల కృష్ణ, పరబ్రహ్మం వచ్చారు కొట్టు దగ్గరకు.


“రండి రండి.. కులాసానా? ఏమిటి విశేషాలు?” నవ్వుతూ అడిగారు స్వర్ణశ్రీ.


“అన్నీ మామూలే. ఎం. ఎల్. ఏ. గారు ఎల్లుండి శివపురం వస్తానన్నారు. నిన్న పరబ్రహ్మం తణుకు వెళ్తే చెప్పారుట” అన్నాడు కృష్ణ. ఆ మాట వినగానే ఆయన మొహం ఆనందంగా వెలిగింది.


“మంచిది. ఇందాకా కామాక్షి గుడి దగ్గర వెంకన్న, సింహాచలం అడిగారు ఎం. ఎల్. ఏ. గారి గురించి.


వాళ్లకు ఆయనతో ఎదో పని ఉందట. అయితే ఎల్లుండి వాళ్ళని పార్టీ ఆఫీస్ దగ్గరకు రమ్మని చెబుతాను “


అన్నారు స్వర్ణశ్రీ. అలాగే అన్నట్టు తలూపాడు కృష్ణ. కాసేపు పార్టీ గురించి, రాష్ట్ర రాజకీయాలు గురించి మాట్లాడు కున్నారు. అప్పుడు పరబ్రహ్మం అడిగాడు ‘ఈ మధ్య బుర్రకథ ప్రోగ్రాం లు ఏమీ లేవా?’ అని.


బ్రహ్మం కూడా కళాకారుడు. నాటకాలు వేస్తూఉంటాడు.


“వచ్చే ఆదివారం అమలాపురం లో సీతారామ రాజు కథ చెప్పాలి, మంగళవారం గణపవరం లో పల్నాటి యుద్ధం కథ చెప్పాలి” అన్నారు స్వర్ణశ్రీ.


“సత్యవరం పంతులు గారు వస్తున్నారా మీతో కథకి?” నవ్వుతూ అడిగాడు కృష్ణ.


“ఆయన రాకపోతే ఎలాగా? వస్తున్నాడు” అన్నారు గంభీరంగా స్వర్ణశ్రీ.


“ఒక పక్క వ్యవసాయం, ఇంకో పక్క పౌరోహిత్యం చేస్తూ ఇలా బుర్రకతలకు రావడం చాలా గొప్పే” అన్నాడు కృష్ణ.


‘కళాకారుదు ఎంత కష్టాన్నైనా భరిస్తాడు, ఎన్ని విమర్శలనైనా ఎదుర్కొంటాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు’ అన్నాడు బ్రహ్మం.


అతని మాటలకి కృష్ణ గట్టిగా నవ్వాడు. “అవును సుమా. నా పక్క, కళాకారుడు ఉన్నాడన్న సంగతి మరిచాను” అని ఆప్యాయంగా బ్రహ్మం భుజం తట్టాడు కృష్ణ. ఈలోగా స్వర్నశ్రీ గారి అబ్బాయి, అయ్యరు హోటల్ కెళ్ళి రెండు టీలు పట్టుకొచ్చి వాళ్ళకిచ్చాడు టీలు తాగి కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు కృష్ణ, బ్రహ్మం. తర్వాత మధ్యాహ్నం వరకూ తన పనిలో ఉండిపోయారు స్వర్ణశ్రీ. మధ్యాహ్నం భోజనానికి కొడుకు సైకిల్ మీద ఇంటికి వెళ్లి వచ్చారు స్వర్ణశ్రీ. ఆయన వచ్చాకా కొడుకు భోజనానికి వెళ్ళాడు. అప్పుడు కాసేపు విశాలాంధ్ర పేపర్ చదివి, తర్వాత శ్రీ శ్రీ ‘మహా ప్రస్తానం’ కవిత్వం చదివారు. అప్పటికి మూడు గంటలు అయ్యింది. కొఠాలపర్రు నాగమణి రావడం, ఆమెకి బంగారు గాజులు ఇవ్వడం జరిగింది.


సాయంకాలం నాలుగున్నరకి స్కూళ్ళు వదిలారు. ఇంటికి వెళ్ళే పిల్లలతో బజార్ సందడిగా ఉంది.


ఎలిమెంటరీ స్కూల్ మాస్టారు షేక్ మీరా జాన్ గారు ఇంటికి వెళ్తూ స్వర్ణశ్రీ గారి కొట్టు దగ్గర ఆగారు.

“రండి జాన్ గారూ, కుశలమా?” నవ్వుతూ ఆదరంగా ఆహ్వానించారు స్వర్ణశ్రీ.


“ఆ బాగానే ఉన్నాను. మీరు ఎలా వున్నారు? మళ్ళీ మీ ప్రోగ్రాములు ఎప్పుడు?” ఆప్యాయంగా అడిగారు మీరా జాన్ గారు.


‘పై వారంలో రెండు చోట్ల కథలు చెప్పాలండి. గొంతుకు కొంచం గుర గురగా ఉంటోంది’ అన్నారు స్వర్ణశ్రీ.


’ఒక అరగంట పోయాకా అబ్బాయిని పంపండి మందులు ఇస్తాను ‘ అన్నారు మీరా జాన్. ఆయన ఆయుర్వేదం వైద్యం చేస్తారు. కాసేపు ఇద్దరూ శ్రీ శ్రీ గురించి, జంధ్యాల పాపయ్య శాస్త్రి గురించి మాట్లాడుకున్నారు. మీరా జాన్ గారు కవిత్వం కూడా రాస్తారు. చాలా సౌమ్యులు. దేవ గ్రామం మన్నే చౌదరి. గారి సహకారంతో జనాలకి ఆయుర్వేదం మందులు ఇస్తూ ఉంటారు.. ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోరు. గొప్ప సాహిత్యాభిమాని. పది నిముషాలు ఉండి మీరా జాన్ గారు వెళ్లి పోయారు.


ఒక గంట పోయాక స్వర్ణశ్రీ గారి కొడుకు మీరా జాన్ గారి ఇంటికి వెళ్లి మందులు తెచ్చాడు. రాత్రి ఎనిమిది అవుతుండగా కొట్టు కట్టేసి ఇంటికి వెళ్ళిపోయారు స్వర్ణశ్రీ, కొడుకూ.

*****

స్వర్ణశ్రీ బహుముఖ ప్రజ్ఞాశాలి. నటుడు, దర్శకుడు, కవి, బుర్రకథ కళాకారుడు. అంతే కాదు గొప్ప వక్త. ఆయన స్టేజి ఎక్కి మాట్లాడుతుంటే శ్రోతలు మంత్రముగ్ధుల్లా వింటారు. కొంగర జగ్గయ్య లా కంచు కంఠం. అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తి. అందుకే కమ్యూనిస్ట్ పార్టీ లో చేరి సమాజంలో రావాల్సిన మార్పులు గురించి, ప్రజలు సంఘటితం కావాల్సిన అవసరం గురించి పడే పడే నొక్కి చెప్పేవారు. ఆయన పేదల పక్షపాతి.


బుర్రకథలకు స్వర్ణశ్రీ, సత్యవరం పంతులు సూర్యం గారు వంతలుగా ఉండేవారు. కథ మధ్యలో వీరు చెప్పే పిట్టకథలు, హాస్య సంభాషణలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకునేవి. అప్పుడప్పుడు బుర్రకథలో రాజకీయం చెప్పినా, ఎక్కువగా వంత పాడే కళాకారుడిగా ఉండటానికే ఇష్టపడేవారు స్వర్ణశ్రీ. ప్రజల మొహాల్లో కాసేపైనా ఆనందం నింప గలిగితే అదే మహాభాగ్యం అనుకునే వారు ఆయన. సుదార ప్రాంతాలకైనా వెళ్లి తన కళను ప్రదర్శించి వచ్చేవారు. ప్రేక్షకుల అభినందనలు ఆయనకి చాలా సంతోషాన్ని కలిగించేవి.


బుర్రకథ ప్రదర్సన అయిపోయాక శివపురం రాగానే, సంత మార్కెట్ రేకు షెడ్లలో ఉన్న యాచకులకు తనకి వచ్చిన పారితోషికాన్ని పంచిపెట్టే వారు. తన వృత్తి తన కుటుంబాన్ని పోషిస్తోంది. అది చాలు. అని సంతృప్తి పడేవారు. కమ్యూనిస్ట్ పార్టీ తరుపున ఉన్న ప్రజా నాట్యమండలి సంస్థ ద్వారా ఎన్నో నాటకాలలో విభిన్న పాత్రలు పోషించి నటుడిగా కూడా తన సత్తా నిరూపించుకున్నారు ఆయన. రెండు నాటకాలకు దర్సకత్వం వహించి, యువ నటుల్ని ఉత్తమ నటులుగా తీర్చి దిద్దారు.


స్వర్ణశ్రీ మంచి పాఠకుడు. లైబ్రరీ కి వెళ్లి పుస్తకాలు తెచ్చుకుని రోజూ రాత్రిళ్ళు చదువుతారు. ఆయన మంచి కవి కూడా. పద్యం, వచన కవిత రెండూ రాస్తారు. ఆయన రాసే కంద పద్యాలంటే మీరా జాన్ గారికి, డాక్టర్ రామచంద్ర రాజు గారికి చాలా ఇష్టం.


శివపురం గర్ల్స్ హై స్కూల్ లో గుమస్తాగా పనిచేసే రామ్మూర్తి తన సాహితీ సమితి ద్వారా ప్రతి ఏటా నవంబర్ నెలలో లైబ్రరీ లో కవి సమ్మేళనం ఏర్పాటు చేసి స్వర్నశ్రీ గారిని ఆహ్వానించే వాడు. రామ్మూర్తి కూడా కవి, కథా రచయిత. తణుకు, ఆచంట, మార్టేరు గ్రామాల నుండి కూడా కవులు వచ్చి కవితలు చదివే వారు..


స్వర్ణశ్రీ గారి కంద పద్యాలు ఆ సమ్మేళనంలో ప్రత్యెక ఆకర్షణగా ఉండేవి. ఒక సంవత్సరం రామ్మూర్తి మీదే ప్రత్యేకంగా ఐదు కంద పద్యాలు రాసి, అతని సాహితీ సేవని కొనియాడిన విశాల హృదయులు. ఆనాటి సభకి అధ్యక్షత వహించిన డాక్టర్ రామచంద్ర రాజు రామ్మూర్తి ని సత్కరించి అభినందించారు.


ఎంఎల్. ఏ. తో ఎంత పరిచయం ఉన్నా తనకి గాని తన కుటుంబానికి గాని సహాయం చెయ్యమని ఎన్నడూ అడగని నిస్వార్ధ జీవి స్వర్ణశ్రీ. అందుకే ఆయన్ని శివపురం లో అందారూ ‘బంగారం లాంటి మనిషి’ అని కీర్తిస్తారు.

*****

M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.




43 views0 comments

Comments


bottom of page