top of page

మలుపు


'Malupu' - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy

'మలుపు' తెలుగు కథ

రచన: M R V సత్యనారాయణ మూర్తి

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


“నమస్కారం సర్ “


కాష్ కౌంటర్ లో ఉన్న కార్తికేయ తల ఎత్తి చూసాడు. ఎదురుగుండా అమ్మవారి దేవస్థానం గుమస్తా సుధాకర్.


చిన్నగా నవ్వాడు అతన్ని చూసి.


సుధాకర్ డిపాజిట్ ఫారం, కాష్ కౌంటర్ లో నుంచి కార్తికేయ కి అందించాడు.


కాష్ రెండు లక్షల పదివేలు లెక్క చూసుకుని, ఫారం మీద స్టాంప్ వేసి ఇచ్చాడు కార్తికేయ..

శివపురం లోని అమ్మవారి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం.


విజయవాడ బ్రాంచ్ నుంచి శివపురం బ్రాంచ్ కి కార్తికేయ బదిలీ మీద వచ్చి ఆరు నెలలు అయ్యింది. ఈ ఊరు అతనికి బాగా నచ్చింది. విజ్జేశ్వరం నుండి నర్సాపురం వరకూ ప్రవహిస్తున్న పెద్ద కాలువ. ఆ కాలువ ఒడ్డునే ఉన్న శివపురం మండల కేంద్రం.


చుట్టూ పచ్చని వరిచేలు, అక్కడక్కడ కొబ్బరి, అరటి తోటలు. వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. కార్తికేయ భార్య చారుమతి కి కూడా ఈ ఊరు బాగా నచ్చింది. వారికి ఒక్కడే కొడుకు. రెండో తరగతి చదువుతున్నాడు.


*****


పదిరోజుల తర్వాత బ్యాంక్ కి వచ్చి డబ్బు డిపాజిట్ చేసాక “సర్, రేపు శని, ఆది వారాలు మా గుడిలో సినిమా షూటింగ్ ఉంది. చూడటానికి రండి”అని ఆహ్వానించాడు సుధాకర్.

“శనివారం కుదరదు లెండి. వీలుగా ఉంటె ఆదివారం వస్తాను. ఇంతకీ ఎవరు యాక్టర్స్ ?” పనిచేసుకుంటూనే అడిగాడు కార్తికేయ.


“సినిమా పేరు తెలీదు కానీ హీరో శ్రీకర్, హీరోయిన్ హిందీ అమ్మాయి అని తెలిసింది” నవ్వుతూ అన్నాడు సుధాకర్.


బదులుగా నవ్వి తన పనిలో నిమగ్నమయ్యాడు కార్తికేయ. లంచ్ టైం లో బ్యాంకు స్టాఫ్ కూడా గుడిలో షూటింగ్ గురించి మాట్లాడుకున్నారు. సినిమా హీరో శ్రీకర్ రెండు చిత్రాలు సూపర్ హిట్ అవడంతో అతనికి మంచి పేరు వచ్చిందని, పది సంవత్సరాల నుంచి ఫీల్డు లో ఉన్నా రాని గుర్తింపు ఈ రెండు సంవత్సరాలలో వచ్చిందని స్టాఫ్ మాట్లాడుకోవడం విని మౌనంగా ఉన్నాడు కార్తికేయ.


శనివారం బ్యాంకు కూడా పెద్దగా రష్ లేదు. శివపురం పల్లెటూరు అవడంవలన సినిమా షూటింగ్ ప్రభావం బ్యాంకు మీద కూడా పడిందని స్టాఫ్ గుస గుస లాడుకున్నారు. ఆదివారం ఉదయమే సుధాకర్ ఫోన్ చేసాడు ‘గుడిలో షూటింగ్ కి తప్పకుండా రమ్మనమని’. అలాగే అన్నాడు కార్తికేయ. తొమ్మిది గంటలకు టిఫిన్ తిని అమ్మవారి గుడికి వెళ్ళాడు.


గుడి లోపల ప్రాంగణంలో షూటింగ్ జరుగుతోంది. గుడి ముందు ఏడు అంతస్తులతో గాలిగోపురం రంగు రంగుల బొమ్మలతో చాలా అందంగా ఉంది. గోపురం ఎదురుగా ఉన్న ఖాళీ స్తలం లో జనం గుమిగూడి ఉన్నారు. పోలీస్ లు ఎవ్వరినీ గుడి లోపల ప్రాంగణంలోకి పంపడం లేదు.


కార్తికేయ సుధాకర్ కి ఫోన్ చేసాడు. వెంటనే సుధాకర్ వచ్చి కార్తికేయని లోపలకు తీసుకువెళ్ళాడు. లోపల రంగు రంగుల జెండాలు, పూల దండలతో అలంకరించారు. పెద్ద పెద్ద లైట్లు, వైట్ షేడ్ లు అమర్చి ఉన్నాయి. జూనియర్ ఆర్టిస్ట్ లు మేకప్ తో అటూ ఇటూ తిరుగుతున్నారు.


షూటింగ్ స్పాట్ కి కొంచం దూరం లో ఉన్న కుర్చీలో కూర్చుని ఉన్న గుడి ఈ. వో. దగ్గరకి తీసుకువెళ్ళి కార్తికేయ ని పరిచయం చేసాడు సుధాకర్. ఈ. వో. షేక్ హ్యాండ్ ఇచ్చి తన పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోమని సాదరంగా చెప్పారు. కుర్చీలో కూర్చుని చుట్టూ చూసాడు కార్తికేయ. తనలాగే మరో నలుగురు అక్కడ షూటింగ్ చూడటానికి వచ్చారని గ్రహించాడు.


ప్రధాన గుడి చుట్టూ ఉన్న నాలుగు ఉపాలయాలు కూడా పూల దండలతో అలంకరించారు. ’నిన్న వినాయకుడి గుడి దగ్గర షూటింగ్ చేసారని, ఈరోజు కూడా అక్కడే షూటింగ్ చేసి, మధ్యాహ్నం లోపల ఉన్న నూటరెండు స్తంభాల మండపం లో షూటింగ్ చేస్తారని’ చెప్పాడు సుధాకర్.


ముఖ్యమైన వాళ్ళు అందరూ రాజమండ్రి లో ఎ. సి. హోటళ్ళలో ఉన్నారని, చిన్న నటులు, టెక్నికల్ స్టాఫ్ తమ గుడి సత్రవు లో ఉన్నారని అన్నాడు సుధాకర్. నెత్తిమీద వైట్ కేప్ పెట్టుకుని ఉన్న ఆయన్ని చూపించి ఆయనే దర్శకుడని కూడా చెప్పాడు సుధాకర్. ఆయన ఎందుకో అనీజీ గా ఉన్నట్టు గ్రహించాడు సుధాకర్.


ఆయన పక్కనే ఫైల్ పట్టుకుని ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ ఎదో చెబుతున్నాడు. కానీ డైరెక్టర్ చిరాగ్గానే ఉన్నాడు. ఇంతలో ఫోన్ వస్తే పక్కకు వెళ్లి మాట్లాడుతున్నాడు డైరెక్టర్.


అసిస్టెంట్ డైరెక్టర్ కార్తికేయ వాళ్ళు కూర్చుని ఉన్న వైపు వచ్చాడు. సుధాకర్, కార్తికేయని ఆయనకీ పరిచయం చేసాడు ‘బ్యాంకు స్టాఫ్’ అని. అసిస్టెంట్ డైరెక్టర్ కార్తికేయని పరిశీలనగా చూసాడు,


ఈలోగా టీ లు వచ్చాయి. అందరూ టీ లు తాగుతున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రం కార్తికేయనే చూస్తూ టీ తాగాడు. ఆ తర్వాత కెమెరా మాన్ తో, మేకప్ మాన్ తో గుస గుస లాడాడు. వాళ్ళు కూడా కార్తి కేయని పరీక్షగా చూసి చిరునవ్వు నవ్వారు. అసిస్టెంట్ డైరెక్టర్ గబా గబా డైరెక్టర్ దగ్గరకు వెళ్లి కార్తికేయని చూపించి నెమ్మదిగా చెవిలో చెప్పాడు. ఆయన కార్తికేయ దగ్గరగా వచ్చి అతన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేసారు.


అయిదు నిముషాలు గడిచేసరికి అసిస్టెంట్ డైరెక్టర్ కార్తికేయని, సత్రవు గదిలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ డైరెక్టర్, కెమెరా మాన్, మేకప్ మాన్ ఉన్నారు.


“సార్, మా సినిమా లో చిన్న వేషం వుంది వేస్తారా?” అడిగాడు డైరెక్టర్.


కార్తికేయ ఒక్కసారి ఆశ్చర్యపోయి, “నేనా!”అన్నాడు.


విషయం చెప్పమన్నట్టుగా అసిస్టెంట్ కి సైగ చేసాడు డైరెక్టర్.


“ఆ ఏమీలేదు సర్. మా హీరో గారి మదర్ కి వంట్లో బాగుండలేదని ఫోన్ వచ్చింది. హీరో గారు హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఆయనతో చేయవలసిన షూటింగ్ మిగిలి ఉంది. మరలా ఇంతమంది టీం తో ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బంది. హీరోయిన్ డేట్స్ దొరకవు.

అందుకని మీరు హీరో గారి డూప్ గా యాక్ట్ చేస్తే మేము షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్తాం. హీరోయిన్ తో అయిదారు షాట్లు ఉంటాయి. మీకు పారితోషికం పాతిక వేలు ఇస్తారు. మీ పోలికలు మా హీరో గారికి చాలా దగ్గరగా ఉన్నాయి. అందుకని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం” అన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్.


వాళ్ళ సెలక్షన్ కూడా కరెక్టే. కార్తికేయ బాగా పొడగరి, మంచి రంగు ఉన్న మనిషి. అందగాడు. రెండు నిముషాలు ఆలోచించాడు కార్తికేయ. చివరికి ‘సరే’అన్నాడు. అది అతని చిరకాల కోరిక. వెంటనే అతన్ని మేకప్ రూమ్ లోకి తీసుకువెళ్ళారు. కార్తికేయ కి మేకప్ వేసి, విగ్ పెట్టి, క్రితం రోజు హీరో వేసుకున్న పట్టు పంచ, లాల్చీ వేసారు. ఇవన్నీ పూర్తి అయ్యేసరికి గంట సమయం పట్టింది.

అద్దంలో తనని చూసుకున్న కార్తికేయ ఆశ్చర్యపోయాడు. అచ్చు హీరో శ్రీకర్ లా ఉన్నాడు. హీరోయిన్ రాజమండ్రి లోనే మేకప్ వేసుకుని వచ్చింది. డైరెక్టర్ హీరోయిన్ కి విషయం చెప్పి, హీరో డూప్ తో సన్నివేశాలు తీస్తున్నామని చెప్పారు. ఆమె ఓ. కే. అంది.

సత్రవు లో నుండి షూటింగ్ లొకేషన్ కి వచ్చారు. షాట్ వివరాలు అన్నీ అసిస్టెంట్ డైరెక్టర్ కార్తికేయ కి, హీరోయిన్ కి చెప్పాడు. వాళ్ళు ఇద్దర్నీ చూడగానే గుడి ప్రహరీ గోడల మీద కూర్చుని ఉన్న జనం గట్టిగా ఈలలు వేసారు. డైరెక్టర్ సూచన మేరకు జూనియర్ ఆర్టిస్ట్స్ తో కలిసి వినాయకుడి గుడి వరకూ కార్తికేయ, హీరోయిన్ కలిసి నడిచి వెళ్ళే సీన్ లాంగ్ షాట్ లో తీసాడు కెమెరా మాన్.


తర్వాత గుడి బయటకు వస్తున్న షాట్, గుడి పక్కనే ఉన్న దేవకాంచనం చెట్టుకింద కూర్చునే షాట్ తీసారు. షాట్ సమయం తక్కువే అయినా, కార్తికేయ, హీరోయిన్ లతో, , జూనియర్ ఆర్టిస్ట్స్ లతో రిహార్సల్స్ వేయించడం వలన రెండు గంటల సమయం పట్టినది. షూటింగ్ బ్రేక్ లో జూసులు తాగడం, హీరోయిన్ తో వచ్చీ రాని హిందీ లో మాట్లాడడం అన్నీ గమ్మత్తుగా ఉన్నాయి కార్తికేయ కి.


మధ్యాహ్నం పన్నెండు గంటలకు నూట రెండు స్తంభాల మండపం లో కొన్ని షాట్స్ తీసారు. భోజనాలు అయ్యాకా గాలి గోపురం ముందు ఆర్టిస్ట్స్ తో కలిసి కార్తికేయ, హీరోయిన్ కోలాటం ఆడే సన్నివేశం తీసారు. సాయంత్రం ఐదు గంటలకు పేకప్ చెప్పారు. అసిస్టెంట్ డైరెక్టర్ శశిధర్ తో కార్తికేయ కి చనువు ఏర్పడింది.


మధ్య మధ్యలో ఫోటోగ్రాఫర్ వచ్చి స్టిల్స్ తీసుకున్నాడు. షూటింగ్ అయిపోగానే నిర్మాత పాతిక వేలు పట్టుకువచ్చి కార్తికేయ కి ఇచ్చాడు.


మేకప్, కాస్ట్యూమ్స్ తీసేసి తన బట్టలు వేసుకుని ఇంటికివచ్చాడు కార్తికేయ. శశిధర్ తన విజిటింగ్ కార్డు ఇచ్చి హైదరాబాద్ వస్తే తనని కలవమని చెప్పాడు.


ఇంటికొచ్చాకా జరిగిన విషయం అంతా చారుమతికి చెప్పాడు కార్తికేయ. ఆమె కూడా చాలా సంతోషించింది. ఆరు నెలలు గడిచాకా మిత్రుల సలహా మీద బ్యాంకు కి రెండు నెలలు సెలవు పెట్టి హైదరాబాద్ వెళ్లి శశిధర్ ని కలిసాడు కార్తికేయ. అతన్ని తన ఫ్రెండ్ రూములో ఉంచాడు శశిధర్. వారం పోయాకా ఒక సినిమా లో హీరో ఫ్రెండ్ కేరక్టర్ ఇప్పించాడు శశిధర్.


పది సార్లు హీరో పక్కనే కనిపించడం, కొన్ని క్లోజ్ అప్ షాట్స్ కూడా ఉండేటట్లు ఏర్పాటు చేసాడు శశిధర్. ఆ తర్వాత ఇంకో సినిమాలో కాలేజీ లెక్చరర్ గా, మరో సినిమాలో హీరోయిన్ బ్రదర్ గా అవకాశాలు ఇప్పించాడు శశిధర్. ఈ క్యారెక్టర్ లు చేయడం కోసం మరో రెండు నెలలు లీవు పెట్టాడు కార్తికేయ. అతనికి కెమెరా సెన్స్, టైం సెన్స్ బాగా తెలిసాయి. డైరెక్టర్ తో, నిర్మాత తో ఎలా ఉండాలో శశిధర్, కార్తికేయకి బాగా బోధించాడు.


“క్యారెక్టర్ చిన్నదా, పెద్దదా అని కాదు, దానికి మనం ఎంత వరకూ న్యాయం చేసామా?అని ఆలోచించు. పదిమందికి నీ టాలెంట్ తెలియాలి. అప్పుడు పెద్ద అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి” అని చెప్పాడు శశిధర్.


నాలుగు నెలలు గడిచాకా శివపురం వచ్చి భార్య తో “నేను బ్యాంకు కి లాంగ్ లీవ్ పెట్టాలనుకుంటున్నాను. సినిమా రంగం లో స్థిరపడటానికి గట్టిగా కృషి చేయాలని అనుకుంటున్నాను” అని అన్నాడు.


ఆమె కూడా అంగీకరించింది. బ్యాంకు కి లాంగ్ లీవ్ పెట్టి హైదరాబాద్ మకాం మార్చాడు కార్తికేయ. చారుమతి అన్నగారు కూడా హైదరాబాద్ లోనే ఉన్నాడు.


కాలేజీ రోజుల్లో నాటకాల్లో నటించి బహుమతులు తెచ్చుకోవడమే కాక, ఇంటర్ కాలేజీ నాటక పోటీల్లో కూడా తన ప్రతిభ చూపి ‘బెస్ట్ యాక్టర్’ అవార్డు సాధించాడు కార్తికేయ. ఆ అనుభవమే ఇప్పుడు సినిమాలలో ఉపయోగపడుతోందని అతనికి అర్ధమయ్యింది.


రెండు ఏళ్ళు గడిచేసరికి సినిమాలలో బాగా నిలదొక్కు కున్నాడు కార్తికేయ. అనుకోకుండా ఒక ఎన్. ఆర్. ఐ. యువకుడు కొత్త కధాంశం తో శశిధర్ ని డైరెక్టర్ గా పెట్టి సినిమా తీయడానికి ముందుకు వచ్చాడు.


శశిధర్, కార్తికేయని పిలిపించి ఆ యువకుడికి పరిచయం చేసాడు. కార్తికేయని చూడగానే అతను బాగా ఇంప్రెస్ అయిపోయి ‘నువ్వే మా సినిమాలో హీరో’ అన్నాడు ఆనందంగా. జీవితంలో రెండో సారి ఆశ్చర్యపోయాడు కార్తికేయ.


ఒకసారి హీరో కి ‘డూప్’ గా వేసాడు. ఇప్పుడు డైరెక్ట్ గా హీరో. తన కల నిజమయ్యే రోజులు వచ్చాయని చాలా సంబరపడ్డాడు కార్తికేయ. కొత్త అమ్మాయిని హీరోయిన్ గా పెట్టారు. చిన్న చిన్న నటీ, నటులతో ఆరు నెలలలో మొత్తం సినిమా పూర్తి చేసాడు శశిధర్.


ఈ సినిమా ముగ్గురు జీవితాలతో ముడిపడి ఉంది. ఒకరు శశిధర్, రెండు కార్తికేయ, మూడు నిర్మాత ఎన్. ఆర్. ఐ. యువకుడు. కథ కొత్తగా ఉండడం, నటీ, నటులు అందరూ వారి పాత్రలలో ఒదిగిపోయి నటించడం వలన ప్రేక్షకులకు సినిమా బాగా నచ్చింది. టి. వి. చానల్స్ లో కూడా మంచి పబ్లిసిటీ ఇవ్వడం సినిమా విజయానికి కారణమయ్యింది. ప్రధాన వ్యక్తులు ముగ్గురూ సంతోషించారు.


మర్నాడు ఉదయమే కార్తికేయ శశిధర్ ఇంటికి వెళ్లి, పెద్ద పూల దండ అతని మెడలో వేసి అతని పాదాలకి నమస్కరించాడు.


“నాలోని నటుడ్ని గుర్తించి నా జీవితాన్ని ‘మలుపు’ తిప్పిన మహా వ్యక్తి మీరు. మీ మేలు ఎన్నడూ మరిచిపోను సర్” అన్నాడు కార్తికేయ గాద్గిగంగా.


అతన్ని అక్కున చేర్చుకున్నాడు శశిధర్.


“నీలో ప్రతిభ ఉంది. కష్టపడ్డావు, పైకి వచ్చావు. కానీ ఒకటి గుర్తుంచుకో. అహంకారాన్ని దగ్గరకి రానీయకు, వినయాన్ని వదలకు, వృత్తిని దైవంగా నమ్ముకో”అన్నాడు శశిధర్.


కురుక్షేత్రం లో కృష్ణుడి కేసి చూసిన అర్జునిడిలా అతనికేసి భక్తిగా చూసాడు కార్తికేయ.

******

M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.54 views0 comments
bottom of page