top of page

బతుకమ్మ పండుగ

#RCKumar #శ్రీరామచంద్రకుమార్, #బతుకమ్మపండుగ, #గౌరమ్మపండుగ, #సద్దులపండుగ

ree

బతుకమ్మ పండుగే గౌరమ్మ పండుగ, సద్దుల పండుగ


Bathukamma Panduga - New Telugu Article Written By R C Kumar

Published In manatelugukathalu.com On 23/09/2025

బతుకమ్మ పండుగ - తెలుగు వ్యాసం

రచన: ఆర్ సి కుమార్


పూల పండుగగా భావించే బతుకమ్మ పండుగను గౌరమ్మ పండుగ, సద్దుల పండుగ అని కూడా అంటారు. శరదృతువులో వచ్చే పండుగల్లో ఒకటి బతుకమ్మ పండుగ, మరొకటి దసరా (విజయ దశమి). అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణ ప్రజల గుండెచప్పుడుగా అలరారే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. రంగు రంగుల పూలను పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ మహిళలు చప్పట్లు కొడుతూ లయబద్ధంగా అడుగులు వేస్తూ వలయాకారంలో తిరుగుతూ బతుకమ్మ పాటలను పాడే దృశ్యాలని చూసే ఎవరైనా మైమరిచి పోవాల్సిందే. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ మరింతగా బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు చిహ్నంగా జరిగే బతుకమ్మ పండుగ ఈ మధ్యకాలంలో విశ్వవ్యాప్తంగా ప్రచారం అవుతోంది. ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకగా ఈ పండుగను చెప్పుకోవచ్చు. సాంప్రదాయ బద్ధంగా బతుకమ్మ పండుగను జరుపుకునే తెలంగాణ ఆడ్డ‌బిడ్డ‌లంద‌రికీ బతుక‌మ్మ శుభాకాంక్ష‌లు తెలిపి వారిని సౌభాగ్యవతులుగా దీవించవలసిన అపూర్వమైన వేడుక ఇది. 


పండుగ నేపథ్యం 

------------------------

తొమ్మిది రోజులు సంబురంగా జరిగే ఈ తీరొక్క పూల పండుగ వేర్వేరు చోట్ల విభిన్న రీతుల్లో కన్నుల పండుగలా కొనసాగుతుంది. వివిధ పుష్పాలతో బతుకమ్మని పేర్చి సాంప్రదాయ వస్త్రాలు ధరించి బతుకమ్మల చుట్టూ పాటలు పాడుతూ మహిళా మణులు లయబద్ధమైన నృత్యాలతో సందడి చేస్తారు. "బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో" అని సాగే ఈ పాటల్లో మహిళల తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం వంటి అన్ని భావోద్వేగాలను పాటల ద్వారా పంచుకుంటారు. గత వెయ్యేళ్లుగా బతుకమ్మను తెలంగాణాలో ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారు. ఎన్నో చరిత్రలు, పురాణ గాధలు మేళవిస్తూ గొంతు కలిపి జానపద పాటలు పాడుతారు మహిళలు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. "బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో" పాటల వెనుక ఉండే అంతర్యం ఇదే.


పులకించే ప్రకృతికి వందనం ఈ సంబరం 

------------------------------------------------------

ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. ఆ సమయానికి వర్షాలతో చెరువులన్నీ నిండుకుండలా కనిపిస్తాయి. రకరకాల రంగురంగుల పువ్వులు ఆరుబయళ్ళలో విరబూసి ఉంటాయి. వీటిలో ఎక్కువగా కనువిందు చేసేవి గునుగు పూలు, తంగేడు పూలు. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. పేదవాడి ఆపిల్ అనబడే సీతాఫలాలు ఈ సమయంలోనే మార్కెట్లోకి వస్తాయి. అలాగే జొన్న పంట కోతకు సిధ్ధంగా ఉన్నానంటూ తలలూపుతూ ఉంటుంది. ప్రకృతి పరవశించే ఈ దృశ్యాల నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ బిడ్డను మోసే నవమాసాలకు ప్రతీక కావున దీనిని సంతాన సాఫల్య పండుగగా కూడా జరుపుకుంటారు.


బతుకమ్మ నైవేద్యాలు : 

-----------------------------

తొమ్మిది రోజులపాటు ఒక్కో రోజు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. 

ఎంగిలి పూల బతుకమ్మ: మహాలయ అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

ముద్దపప్పు బతుకమ్మ: ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.

నాన బియ్యం బతుకమ్మ: నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.

అట్ల బతుకమ్మ: అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.

అలిగిన బతుకమ్మ: ఈరోజు ఆశ్వయుజ పంచమి. ఎటువంటి నైవేద్యం సమర్పించరు. అలిగిన బతుకమ్మగా అలంకరిస్తారు.

వేపకాయల బతుకమ్మ: బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

వెన్నముద్దల బతుకమ్మ: నువ్వులు, వెన్న, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

సద్దుల బతుకమ్మ: ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు.


సద్దుల బతుకమ్మ 

-----------------------

చివరి రోజు సద్దుల బతుకమ్మ పండుగ చూడముచ్చటగా ఉంటుంది. ఈరోజు మాత్రం ఐదు రకాల నైవేద్యాలను మహిళలు తయారు చేస్తారు. సాయంత్రం, ఆడపడుచులు అందరూ అభరణాలు, రంగురంగుల దుస్తులు ధరించి ఇంటి ముందు బతుకమ్మను పెడతారు. చుట్టుపక్కల ఉన్న వారు కూడా వారి బతుకమ్మలను అలంకరించి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు. ఐక్యత, సోదరభావం, ప్రేమను కలపి రంగరిస్తూ మానవ హారంగా ఏర్పడి పాటలు పాడుతారు. ఒకరు ముందుగా పాట మొదలుపెడితే మిగిలినవారు వారితో గొంతు కలుపుతూ పాడుతారు. వీనుల విందుగా ఉండే ఈ జానపద గీతాలు ప్రత్యేకమైన తెలంగాణా సంస్కృతిని ఆవిష్కరిస్తాయి. ఇక చీకటి పడే సమయానికి స్త్రీలందరూ బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో చెరువు లేక కుంట వైపు జానపద గీతాలు పాడుతూ ఊరేగింపుగా బయలుదేరుతారు. జలాశయం దగ్గరికి చేరుకొని బతుకమ్మలను మెల్లగా నీటిలో జారవిడుస్తారు. ఆ తరువాత "మలీద" (చక్కెర, రొట్టెతో చేసినది) అనే పిండి వంటకాన్ని బంధు మిత్రులకు పంచిపెట్టి ఇంటికి చేరుతారు.


ఆనాటి కొన్ని ఆచారాలు 

--------------------------------

జానపదులు తమ సంతానం క్షేమంగా ఉండాలని అమ్మదేవతలకు మొక్కుకునే ఆనవాయితీ పురాతనమైనది. పుట్టిన పిల్లలను చల్లగా చూడమని అమ్మదేవతలకు ముడుపులు, మొక్కులు చెల్లించుకుంటారు. కొంతమంది పుట్టినపిల్లలు పుట్టినట్లు చనిపోతుంటే, పిల్లలు పుట్టిన వెంటనే పెంట మీద వేసి తెచ్చుకుని ‘పెంటమ్మ లేదా పెంటయ్య’ అని పేరు పెట్టుకునేవారు. మరి కొందరు పుట్టినపిల్లల్ని ఎవరికైనా ఇచ్చేసి ‘బిచ్చంగా’ తిరిగి ఇవ్వమని కోరుకుంటారు. అట్లా తీసుకున్న పిల్లలకు ‘భిక్షపతి, భిక్షమ్మ’ అని పేరు పెట్టుకునేవారు. వాళ్ళే బుచ్చపతి, బిచ్చప్ప, బుచ్చమ్మలుగా కూడా పిలువబడుతుంటారు. పిల్లల్ని బతికించమనే వేడుకునే దేవతల్లో మన బతుకమ్మ ఒక ముఖ్యమైన దేవత. ఆ దేవత వరప్రభావంతో బతికిన వారికి బతుకమ్మ, బతుకయ్య అని పేర్లు పెట్టుకుంటారు. సమ్మక్క మేడారంలో బతుకయ్య పేరున్న వాళ్ళు ఇప్పుడు కూడా వున్నారు.


గత చరిత్ర : 

-------------

రాజరాజ చోళుడు క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. అతని కుమారుడైన రాజేంద్రచోళుడు శత్రువులతో జరిగిన ఒక యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006లో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ. సా.శ 1010లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బ్రిహదేశ్వరాలయంలో ప్రతిష్ఠించాడు. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే తంజావూరులో బృహదీశ్వరాలయం నిర్మాణాన్ని చేపట్టినట్టు చోళ రాజుల తమిళ శిలాశాసనాల్లో చెక్కబడి ఉంది. అక్కడ గర్భ గుడిలోని 13.5 అడుగుల ఎత్తు 60 అడుగులు విస్థీర్ణంలో వున్న శివలింగం, ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి, బృహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడచ్చు. 


వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది. బృహదమ్మ (పార్వతి) నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను, తమ దు:ఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణవాసులు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణవాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలంగాణ వాసులు.


బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పండుగ. పూలు పూసి వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సీజన్లో జరుపుకునే బతుకమ్మ పండగ సంబరాలు ప్రకృతితో మమేకమయ్యే మానవ సంబంధ బాంధవ్యాల ప్రత్యేక వేడుక. తెలంగాణ ప్రజలందరి బతుకుల్లో వెలుగులు నింపుతూ, అందరూ మరింతగా సుఖ సంతోషాలతో జీవించేలా కరుణించాలని ఆ దేవిని మనసారా కోరుకుందాం.


*స్వస్తి

ఆర్ సి కుమార్

ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

Comments


bottom of page