కల్పన ఆశయం
- Neeraja Prabhala

- Sep 23
- 3 min read
#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #KalpanaAsayam, #కల్పనఆశయం, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Kalpana Asayam - New Telugu Story Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 23/09/2025
కల్పన ఆశయం - తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత
కాలేజీలో క్లాసులు అయిపోగానే బస్టాపులో బస్సు కోసం ఎదురుచూస్తోంది కల్పన.
“కల్పనా! మీ ఇంటివద్ద నేను డ్రాప్ చేస్తాను. స్కూటర్ ఎక్కు” ఏకవచనంతో చనువుగా అంటూ వచ్చాడు విశాల్.
“వద్దు. “ అని సీరియస్ గా ముఖం ప్రక్కకు తిప్పుకుంది కల్పన. ఇంతలో కల్పన ఇంటికి వెళ్లే బస్సు రావడం, అందులో ఆమె ఎక్కి కూర్చోవడం జరిగింది.
బస్సులో కూర్చున్న మాటే గానీ కల్పనకు మనసంతా చిరాకుగా ఉంది. గత కొన్ని నెలలనుంచి తనని ప్రేమిస్తున్నానంటూ వెంటబడి వేధిస్తున్నాడు విశాల్. తనకి ఆ అభిప్రాయం లేదని, తను మంచిగా చదువుకోవాలని ఎన్నోమార్లు చెప్పినా మొండిగా ప్రతిరోజూ ఏదో వంకన ఆమెతో మాటలుకలిపి ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు విశాల్.
చదువుసంధ్యలు అబ్బక దుర్వ్యసనాలకు లోనై తండ్రి సంపాదించిన ఆస్తిని హారతి కర్పూరంలా కరిగించే విశాల్ అంటే ఆ ఇంటి చుట్టుప్రక్కల ఎవరికి సదభిప్రాయంలేదు. అతనికి తల్లి చిన్నప్పుడే పోయింది. తండ్రి నరహరి విశాల్ ని పెంచి పెద్ద చేశాడు. చదువు అబ్బక దుర్వసనాలకు లోనై తండ్రిని, తండ్రి మాటని ఖాతరుచేసేవాడు కాదు విశాల్. కొడుకుని నయానా, భయాన మార్చ ప్రయత్నించి విఫలమయ్యాడు నరహరి.
తన ఆస్తిని దక్కకుండా ఏదైనా అనాధాశ్రమానికి వ్రాస్తానని బెదిరించాడు కొడుకుని. మాట వరసకన్నా అన్నంతపనీ తన తండ్రి చేస్తాడని ఆయన్ని తల దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి ఆయన్ని అంతం చేశాడు విశాల్.
ఇరుగుపొరుగు వారినందరినీ కార్డియాక్ అరెస్టుతో ఆయన చనిపోయాడని నమ్మబలికించాడు. విశాల్ స్వభావం తెలిసి కూడా అందరూ మిన్నకుండిపోయారు.
ఇంక ఆస్తి అంతా హస్తగతమైంది. అతని దృష్టి తమ ఇంటికి దగ్గరలోనే ఉంటున్న కల్పన మీద పడింది. మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన కల్పన తన తండ్రి దామోదరం, తల్లి రుక్మిణిలతో కలిసి ఉంటోంది.
దామోదరం ఒక కంపెనీలో పనిచేస్తూ తన కూతుర్ని కష్టపడి చదివిస్తున్నాడు. చిన్నప్పటి నుంచీ చక్కగా చదువుతూ స్కాలర్షిప్ ని తెచ్చుకుంటోంది కల్పన. కష్టపడి చదివి తను మంచి ఉద్యోగాన్ని సాధించి తల్లితండ్రులను కంటికి రెప్పలాగా చూసుకోవాలని కల్పన ఆశయం..
విశాల్ తనని ప్రేమపేరుతో వేధిస్తున్న విషయాన్ని కల్పన తన తల్లిదండ్రులకు, కాలేజీ ప్రిన్సిపాల్ కు చెప్పింది. వాళ్లు అతడిని పిలిచి మందలించారు. అది మనసులో పెట్టుకుని ఇంకా రెచ్చిపోతున్న అతని మీద పోలీసు కంప్లైంట్ ఇచ్చింది కల్పన. అతనిచ్చే డబ్బులకు కక్కుర్తిపడి పోలీసులు కల్పన కంప్లైంట్ ని ఖాతరుచేయలేదు. కొన్నాళ్లకు కల్పనకు అర్థమై తన జాగ్రత్తలో తను ఉంటూ ఈ చదువు పూర్తైతే తనకు మంచి భవిష్యత్తు ఉంటుందనే దృక్పధంతో ఉంది.
కల్పన తనని, తన ప్రేమని నిరాకరించిందని ఆమె మీద పగని పెంచుకున్నాడు విశాల్.
ఒకరోజున కాలేజీ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తున్న ఒంటరైన కల్పనపై యాసిడ్ దాడి చేసి రెప్పపాటులో పారిపోయాడు విశాల్. ఊహించని ఈ హఠాత్పరిణామానికి కుప్పకూలింది కల్పన. భగభగమనే యాసిడ్ మంటతో ఆమె ముఖమంతా సగం వరకు కాలిపోయింది.
ఇంతలో బస్సు కోసం ఎవరో అటుగా వచ్చిన వాళ్లు ఆమెని చూసి గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్చారు. డాక్టర్లు చికిత్స చేసి ఆమెని బ్రతికించే ప్రయత్నం చేస్తున్నారు. కల్పన ఫోనులో ఉన్న నెంబర్ ఆధారంగా ఆమె తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పారు డాక్టర్లు. అలాగే పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చారు.
విషయం విన్న దామోదరం దంపతులు ఆఘమేఘాలమీద వచ్చి కూతుర్ని చూసి దుఃఖించారు. తమ కూతురిని బ్రతికించమని చేతులు జోడించి కన్నీళ్లతో డాక్టర్లని ప్రార్ధించారు. తమవంతు కృషిని తాము చేస్తామని, 24 గంటలు గడిస్తే గానీ తామేమీ చెప్పలేమని డాక్టర్లు చెప్పారు. తమ కూతురిని బ్రతికించమని దేవుళ్లను ప్రార్ధించారు రుక్మిణి దంపతులు.
పోలీసులు కల్పన తల్లితండ్రుల వద్ద, ఆమె కాలేజీ ప్రిన్సిపాల్ వద్ద కంప్లైంట్ ని తీసుకున్నారు. వాళ్లు విశాల్ మీదే అనుమానం వ్యక్తం చేయడంతో, లోగడ తమ వద్ద విశాల్ మీద కల్పన ఇచ్చిన కంప్లైంట్ లతో పోలీసులు తప్పించుకు పోయిన విశాల్ ని వెతికి పట్టుకుని అరెస్టు చేశారు.
48గంటల తర్వాత కల్పన ప్రాణాపొయంనుంచి బయటపడింది. దామోదరం దంపతులు సంతోషించారు. కాలేజీ స్టాఫ్, ప్రిన్సిపాల్, తోటి స్నేహితులు అందరూ హాస్పిటల్ కు వచ్చి కల్పనని చూసి పరామర్శించి ఆమెకు, ఆమె తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి వెళ్లారు. డాక్టర్లు ఆమెకు మంచి వైద్యం చేస్తున్నారు. పోలీసులు ఆమె నుంచి స్టేట్మెంట్ ను తీసుకుని, జరిగింది తెలుసుకుని ఆమెకు ధైర్యం చెప్పి విశాల్ కు శిక్ష తప్పదని చెప్పి వెళ్లారు.
కోర్టు కేసు నడుస్తోంది. తగిన వైద్య చికిత్సను తీసుకున్నాక తమ ఇంటికి డిశ్చార్జ్ అయింది కల్పన. శారీరకంగా, మానసికంగా నెమ్మదిగా కోలుకుంటోంది కల్పన. డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ చేసి ఆమెకి పునర్జీవితాన్నిచ్చారు. కల్పన, ఆమె తల్లిదండ్రులు డాక్టర్లకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
కొన్నాళ్లకి కోర్టు తీర్పు వచ్చింది. నేరం రుజువై విశాల్ కి యావజ్జీవకారాగార శిక్ష పడింది.
కల్పన మరలా కాలేజీకి వెళుతోంది. కష్టపడి చదివి పరీక్షలు వ్రాసి మంచిమార్కులతో పాసయింది. ఆమె తల్లితండ్రులు చాలా సంతోషించారు. అతి త్వరలోనే మంచి కంపెనీలో ఉద్యోగం సాధించింది కల్పన. హాయిగా ఉద్యోగం చేసుకుంటూ తన తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది కల్పన.
తన ఆశయం నెరవేరినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంది కల్పన.
.. సమాప్తం ..

-నీరజ హరి ప్రభల
Profile Link
Youtube Playlist Link




Comments