top of page

భార్య దిద్దిన కాపురం


'Bharya Diddina Kapuram' written by Voleti Sasikala

రచన : వోలేటి శశికళ

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.... ఇంటర్నేషనల్ డిపార్చర్స్ టెర్మినల్ దగ్గర కారు ఆపిన రేవతి.... గబగబా కొడుక్కి సామాన్లు దించడం లో సహాయం చేసి.... ట్రాలీని పోర్టర్ కు అప్పజెప్పింది!


తల్లిని ,పుట్టి పెరిగిన ఊరును వదిలి వెళ్తున్నానన్న బెంగ సగం, కొత్త దేశంలో కొత్త భవిష్యత్తు వెతుక్కుంటూ వెళుతున్నానన్న ఉత్సాహం, ఉద్వేగం సగం... రాజీవ్ మొహంలో!


వెనకనుంచి హార్న్ కొడుతూ తొందర చేస్తున్న ఇతర కార్ డ్రైవర్ల అసహనం వలన... తల్లితో మరి కాస్త సమయం గడిపే అవకాశం లేక, ఆమెను ప్రేమతో ఆలింగనం చేసుకుని , మెరుస్తున్న కంటితడితో... పోర్టర్ వెనకాలనే నడుస్తూ లోపలికి ప్రవేశించాడు రాజీవ్!


పార్క్ చేసిన కారు వద్దకు నడుస్తున్న రేవతికి.. అంతవరకూ బిగపెట్టిన దుఃఖం ఒక్కసారి తన్నుకొచ్చింది! కళ్లు తుడుచుకుంటూ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి డ్రైవ్ చేసుకుంటూ ...నేరుగా కెబిఆర్ పార్కుకు వచ్చి, కారు ఒకపక్కగా పార్క్ చేసుకుని, పార్క్ లో ప్రవేశించింది రేవతి.

చుట్టూ జనసందోహం ఎంత ఉన్నా... ఆమె మనసులో చేరిన ప్రశాంతత కు భంగం కలగడం లేదు! కొడుకు వియోగం ఆమెలో రేపుతున్న దుఃఖాన్ని ఆ ప్రశాంతత ఉపశమింపలేకపోతోంది!


ఇంతలో ఆమె ఉదాసీనతకు భంగం చేస్తూ.. ఆమె సెల్ ఫోన్ మ్రోగింది ! అమెరికా నుండి ఆమె కూతురు రమ్య! ఫోన్ ఎత్తి " ఆ... రమ్యా! తమ్ముడు బయల్దేరి పోయాడు! ఇంకా చెకిన్ అవ్వాలి అనుకుంటా! ఓ... మీరిద్దరూ ఎయిర్పోర్టుకు రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నారా! ఓ చాలా సంతోషం! .." అంది రేవతి


" అమ్మా! రాజీవ్ మా దగ్గరికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది! నిజంగా మనం చాలా అదృష్టవంతులం! కాస్త ఆలస్యమైనా రాజీవ్ లో చాలా మంచి మార్పు వచ్చింది! వాడు ఇంజనీరింగ్ పూర్తి చేసి ,ఇలా మాస్టర్స్ చేయడానికి అమెరికా వస్తాడని .. మనం ఎవరైనా ఊహించగలిగామా! దీనంతటికీ నాన్న లో వచ్చిన మార్పే కారణమేమో అమ్మ! నాన్నకు యాక్సిడెంట్ అవ్వడం , ఆయన పూర్తిగా వీల్చైర్ కు అంకితమవ్వడం ఒకందుకు మంచిదేనేమో! " ...... జీవితంలో కొన్ని మంచి మార్పులు రావడానికి… కొన్ని చెడులు జరిగి తీరాలన్న భావన రమ్య లో!


" సరేలే రమ్యా! ఇవన్నీ నీ బుర్ర లోంచి పూర్తిగా చెరిపేస్తానని నువ్వు నాకు మాట ఇవ్వాలి! పాత విషయాలు, పాత జీవితాన్ని తిరగతోడడం వలన... రాజీవ్ అప్సెట్ అవ్వచ్చు మళ్ళీ! నువ్వు , కిరణ్ అనుక్షణం వాడిని కనిపెట్టుకుని ఉండాలి! వాడి పాత జీవితపు ఛాయలు కూడా మళ్ళీ వాడి లో మనం చూడకూడదు! ...."... కాస్త దృఢంగానే చెప్పింది రేవతి!


" తప్పకుండానమ్మ! ఐ ప్రామిస్! ఈరోజు నేను అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ ,స్వతంత్రం, కిరణ్ .. పింకీ లతో జీవితమంతా నిండిపోయిన ఆనందం.... ఇవన్నీ నువ్వు పెట్టిన భిక్షేనమ్మా! మేము దేశం విడిచి ఆ రాత్రి పారిపో గలిగామంటే దానికి నువ్వే కారణం! సరేనమ్మా! నేను ఆఫీసుకు బయలుదేరుతున్నాను! రాజీవ్ అట్లాంటా వచ్చాక ,మళ్ళీ కాల్ చేస్తాను నీకు!".... అంటూ పెట్టేసింది రమ్య


ఆ ఉషోదయం.. ఆ ప్రత్యూష పవనాలకు ఆహ్లాదంగా తలలు ఊపుతున్న పూబాలలు, తమ లేలేత రెక్కలను సవరించుకుంటూ .. గాలిలోకి ఎగిరి పోవడానికి ప్రయత్నాలు చేస్తున్న పక్షి పిల్లలు, పైనెక్కడో కాపు కాసిన గ్రద్దల చూపులనుండి తమ లేత కూనలను కాపాడుకోడానికి రెక్కలు చాచిన తల్లి పక్షులు.... ఎన్నో జీవిత పాఠాలను ,జీవితానుభవాలను రేవతి ముందుంచాయి!


ఐదేళ్ల నాటి ఆ కాళరాత్రి... ఆమె జ్ఞాపక పుటలలో రక్తాక్షరాల... నిక్షిప్తమై పోయింది!

స్త్రీ అంటే బలహీనురాలు ,

స్త్రీ అంటే అబల , స్త్రీ అంటే అసమర్థురాలు,


స్త్రీ జీవితం సవ్యంగా నడవాలంటే ఆమెకు ఖచ్చితంగా ఒక బలమైన ఊతం ఉండితీరాలి,., తండ్రిగా .. భర్తగా.. కొడుకుగా ..

స్త్రీ… మగవాడు ప్రదర్శించే దౌష్ట్యాన్ని , దౌర్జన్యాన్ని మౌనంగా, సహనంగా భరించి తీరాలి...

అమ్మయినా ,ఆలయినా.. కూతురైనా... తన ఇంట్లో పురుష పరిపాలనకు తలొగ్గి బ్రతక వలసిందే!

స్త్రీకి సలహా ఇచ్చే హక్కు లేదు, స్త్రీని సమభాగంగా చూసే పరిస్థితి లేదు, అసలు స్త్రీకి అస్తిత్వమే లేదు!


..... ఇది ఐదేళ్ల క్రితం రేవతి ఇంట్లో స్త్రీలకు ఉన్న స్థానం!


ఆమె తండ్రి తను చేసే అనైతిక వ్యాపారాల దృష్ట్యా కూతుర్ని... అంతో ఇంతో సవ్యమైన రీతిలో పెంచాడు! ఒక్కతే కూతురని... తన పంచప్రాణాలను, పెంచుకున్న ఆస్తులను... కూతురి మీదే పెట్టాడు!


కానీ చాలామంది తండ్రుల లాగే ఆమె పెళ్లి విషయం వచ్చేసరికి... తొందర పడ్డాడు!

కేవలం తన పట్ల చూపిస్తున్న విశ్వాసపాత్రత, తన వ్యాపారాలలో అతను చూపిస్తున్న దక్షత... కారణాలుగా చూపిస్తూ రేవతి ని తన నమ్మినబంటు రమేష్ బాబు కి ఇచ్చి పెళ్ళి చేశాడు… కూతుర్ని, వ్యాపారాన్ని ,.. జాగ్రత్తగా చూసుకుంటాడని!


చాలా మంది అమ్మాయిల లాగే రేవతి జీవితం కూడా... ఒక పంజరం నుంచి మరొక పంజరం లోకి మారింది! ఏది బంగారు పంజరమో ఏది ఇనుప పంజరమో... ఆమెకేమీ తేడా కనిపించలేదు! ఒక పంజరంలో కాస్త ప్రేమ దొరికింది … మరొక పంజరంలో అణిచివేత దొరికింది! ఏ పంజరం నుండి విముక్తి అయితే దొరకలేదు.... ఐదేళ్ల నాటి ఆ కాళరాత్రి వరకు!


‌. అయినా కాళరాత్రి అని ఆమె ఎందుకు అనుకోవాలి! ఆ అర్ధరాత్రే కదా ఆమెకు నిజమైన స్వతంత్రం దొరికింది! ఆమెలోని శక్తిస్వరూపిణి బహిర్గతమై... ఆమెకు దిశానిర్దేశం చేసింది!


ఆమె ఆలోచనలు రెక్కలు విప్పుకుని ఆ రాత్రి మీద వాలాయి!.... తన ఇంటి ఆడబిడ్డ ఊపిరి నిలపడానికి ఆమె చేసిన పోరాటం కళ్లముందుకొచ్చింది!


****. ****. **************** ******


రాత్రి పదకొండున్నర!

రమేష్ బాబు నిద్రలేచి... పిల్లిలా నడుస్తూ కొడుకు గది తలుపు కొట్టాడు.

తలుపు వారగా తెరిచుండడం చూసి కొడుకు లేచే ఉన్నాడనుకుని గది లోపలికి ప్రవేశించి లైట్ వేసాడు ! లోపలున్న వ్యక్తిని చూసి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు!


“నువ్వా!”

“ఊహించలేదు కదా నన్నిక్కడ! “

“ రాజీవ్ ఎక్కడ?”

“ రాజీవ్ లేడు! రాడు కూడా! మీ దిక్కుమాలిన పగలు తీర్చుకోడానికీ, మీ దౌర్భాగ్యపు భావజాలం నూరిపొయ్యడానికీ నా కొడుకు మీకింక దొరకడు! వాడిని చంపనయినా చంపుతాను కానీ మీతో చేరి ఒక నేరస్థుడిగా ఎదగనియ్యను.!”


“ ఏంటే! చాలా ఎక్కువ పేలుతున్నావ్! వంటింట్లో పడి ఉండే ఆడదానికి ఇంత నోరు లేవకూడదు. నీకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. నాకు ప్రస్థుతం టైమ్ లేదు ఈ అర్ధరాత్రి అంకమ్మ సివాలకి. ఆడు ఎక్కడున్నాడో చెప్తావా లేదా? బెల్ట్ తియ్యమంటావా? ....” ....చేతివాచీలో టైం చూసుకుంటూ... చొక్కా పైకెత్తి అరచేతిమందాన దున్నపోతులా ఉన్న తోలుబెల్టు మీదకు చెయ్యేసాడు రమేష్ బాబు!


“ చూడూ! నువ్వు కొట్టే దెబ్బలకు వణికిపోయి... కుక్కినపేనులా పడుండడానికి ఇక్కడున్నది నీ పెళ్ళాం పాతరేవతిని కాదు! తన పిల్లల కోసం ఏ స్థాయికయినా తెగించగల తల్లిని. ఏం చేసిందయ్యా ఆ పిల్ల నీకు? నీకూతురిగా నా కడుపున పుట్టడమే అది చేసిన పాపమా! తొలిచూలు ఆడపిల్ల పుట్టిందన్న ఆనందమే లేదు! పుట్టిన రోజు నుండి ఆ పిల్లను ఎలా అంతం చేయాలన్నదే నీ ఆలోచన! చిన్ననాటి నుండి...నీ కోపతాపాలకూ, నీ ఆగడాలకూ అణిగిమణిగి ఉంటూ... ఆఖరికి రక్షించాలిసిన తండ్రే దానిపాలిట భక్షకుడిగా మారి తన జీవితాన్ని నాశనం చెయ్యబోతుంటే.... ఈ తాగుబోతుకొంప నుండి పారిపోయింది...”.....ఆమె ఇంకా కొనసాగించ బోతుంటే...అతను అందుకున్నాడు!


“ ఏం కూసావే. ....****కూతురా! “.... అలవాటయిన బూతుతో...ఒక్క ఉదుటున దూకి భార్య జుట్టు చేతిలోకి తీసుకున్నాడు! కళ్ళు నిప్పులు చెరుగుతుండగా..." తాగుబోతంటావే నన్ను!!...” అంటూ ...ఆమెతలను బలంగా గోడకేసి కొట్టేవాడే... మరి ఎక్కడినుండి తెచ్చుకుందో అంత బలం...రేవతి ఒక్కసారి కాలెత్తి... భర్త నాభిభాగంలో ఒక్క తాపుతన్నింది . ఊహించని హఠాత్పరిమాణానికి అంత పశువూ తూలి బలంగా వెనక్కి పడ్డాడు. ఆరడుగుల భారీశరీరంలో ఎక్కడో ఓ ఎముక కలుక్కుమన్నట్టు తెలుస్తోంది.


అయినా మొండిగా లేవబోయిన వాడు... అలాగే నల్లతాచును చూసినట్టు బిత్తరపోయి చూస్తూ ఉండిపోయాడు. ఆమె చేతిలో నల్లగా మెరుస్తూ... రివాల్వర్!


ధనబాద్ బొగ్గుమాఫియా నుండి తెప్పించుకున్న తన రివాల్వర్!


ఇంట్లోంచి పారిపోయి... తను చేస్తానన్న పెళ్ళిని తప్పించుకుని... వేరే కులం వాడితో లేచిపోయి , పెళ్ళిచేసుకుని.... , తన పరువు నేలపాలు చేసింది కూతురు రమ్య!


ఇప్పుడు ఏకంగా దేశం నుండే చెక్కేయబోతున్న తన కూతుర్నీ, దాని మొగుడినీ చంపేసి... చేతులు కడుక్కుందామని రహస్యంగా తెప్పించిన . 32 కాలిబర్ రివాల్వర్ ! దీని చేతిలోకి ఎలా వచ్చింది? “...... ఇప్పటి వరకూ ఢాంబికంగా చూపించిన అహంకారం, పశుప్రవృత్తి స్థానే.... నిలువెల్లా వణికిస్తున్న భయం అతని వెన్నులో, కళ్ళల్లో!


“ భయమేస్తోంది కదా! నిన్నిక్కడే చంపేసి... మూడోకంటికి తెలీకుండా నా పెరట్లో పాతిపెట్టేయగలను. భర్తవనే గౌరవం ఎప్పుడో హరాయించేసావు నాలో! ఏ తప్పూ చెయ్యకుండానే... నన్నూ, నాకూతుర్ని ఇదే గదిలో పెట్టి ఎన్నిసార్లు ఎంత హింసించావు! కుటుంబం, పరువు, పిల్లల భవిష్యత్తు...అని ఆలోచించినోరు విప్పలేకపోవడమే నేను చేసిన నేరం. ఏంటయ్యా నీ బోడిగొప్ప. లిక్కర్ కింగ్ ని , బార్లు ,రెస్టారెంట్లు ఓనర్నని రెచ్చిపోతూ.. రౌడీషీటర్ లా ధాష్టీకాలు చేస్తూ బతికేస్తున్నావు..."


....‌"నా వారసుడంటూ" పిల్లాడికీ నీ బుద్ధులన్నీ మప్పుతున్నావు. చిన్నప్పుడు చక్కగా చదువుకునే వాడికి ఇప్పుడు...తల్లంటే లోకువ. చక్కగా చదువుకుంటున్న అక్కంటే అసూయ, ద్వేషం ! ఇరవై ఏళ్ళకే డ్రంకెన్ డ్రైవింగ్, డ్రగ్స్ , రేప్ చార్జ్ లున్నాయంటే... వాడు భవిష్యత్తులో ఎంత రాక్షసుడు అవుతాడో ఊహించలేను! ఇన్నాళ్ళూ కన్నతల్లిగా ఏం చెయ్యలేక, చెప్పడానికి నోరు లేక... వీడి ఆగడాలను చూస్తూ మౌనసాక్షిగా ఉన్నా. ఇప్పటికన్నా కళ్ళు తెరవకపోతే ... నా ఇంటితో పాటూ మరెన్నో కుటుంబాలు తగలెట్టేస్తారు మీ తండ్రీకొడుకులు”...... ఆవేశంతో రొప్పుతూ.. ఊగిపోతూ... అరుస్తోంది రేవతి.


ఆమెకు అంత గొంతుకున్నట్టు ఏనాడూ వినలేదు అతను. నిజానికి గొంతు పెగలనిస్తే కదా ఆమెకు! ఆమె ఉగ్రరూపం చూసి అతనికిప్పుడు దడుపు పుట్టింది. కొంపతీసి కొడుకునేం చెయ్యలేదు కదా... అని మనసులో గుబులు పుట్టింది!


తన రెండునెలల ప్లానింగ్ వ్యర్థం అవుతున్నందుకు ఉక్రోషంగా ఉంది అతనికి. అతని ఆలోచనలన్నీ తన పగ చుట్టే తిరుగుతున్నాయి!


....ఇంకో రెండు మూడు గంటల్లో కూతురు రమ్య, దాని మొగుడూ దేశం దాటేస్తారు. ఎయిర్ పోర్ట్ వెళ్ళేలోగా అర్ధరాత్రి ఆ ఇద్దరినీ గప్ చుప్ గా ముట్టుపెట్టేయాలని... మధ్య దారిలో... నిర్మానుష్యంగా ఉండే స్థలం దగ్గర ...కాపు కాయమని మనుషుల్ని పెట్టాడు. తన చేతులతో స్వయంగా వాళ్ళిద్దరినీ చంపితే కానీ కక్ష తీరదని రివాల్వర్ తెప్పించాడు! వాళ్లు అక్కడ తన ఆదేశాల కోసం ఎదురు చూస్తూ.. ఉంటారు. ఇక్కడ చూస్తే ఇది రాక్షసిలా అడ్డం పడుతోంది!".... “.... ఆలోచనల నుండి బయటపడి....

మెల్లగా జేబులోంచి ఫోన్ తీసాడు.


అంతే.....


“ ధన్” మని చెవులు చిల్లులు పడేలా రివాల్వర్ పేలింది.


అతని మణికట్టు ఊడేలా నిప్పులు కక్కుతూ బుల్లెట్ తగిలి రక్తం జివ్వున చిమ్మింది.


“ అమ్మో! చంపేస్తోంది ఇది...బాబోయ్”... అని ఒక్కసారి అరుస్తూ ఫోన్ కిందపడేసాడు. వెంటనే ఆ ఫోన్ అందుకుంది రేవతి!


“ భయపడకు రమేష్ . నీ కొడుకుకేం కాలేదు. వాడు రోజూ తాగే దాంట్లో ఓ పది నిద్రమాత్రలు కలిపాను. అది బానే పనిచేసి... అదిగో ఆ బాత్రూంలోనే పడున్నాడు. “


“పిశాచిముండా! సర్వనాశనం చేసావు నా ప్లానంతా. ముందు నిన్ను చంపి... నీ కూతురి కేసి వెళ్ళాలిసింది. నంగనాచిలా సర్వం గమనిస్తున్నావని తెలుసుకోలేకపోయా! చూస్తానే ఎంత సేపు నన్ను బెదిరించగలవో! నీకు నా సంగతింకా తెలీదు. ఇక్కడ తప్పించుకున్నా అమెరికాలో చంపించగలను దానినీ, దాని బాయ్ ఫ్రెండ్ ని....”.... బాధతో రొప్పుతూ అరుస్తున్నాడు.... రక్తాలోడుతున్న చేతిని చూసుకుంటూ బాధతో ఏడుస్తున్నాడు!


రేవతి కళ్ళల్లో ఎర్రని కోపపుజీరలు!


“ రమేష్! నువ్వు బతుకుతున్న బతుకు నాతండ్రి పెట్టిన భిక్ష. ఎర్ర ఏగానీ లేని నిన్ను చేరదీసి, నీ నాటకాలన్నీ నమ్మి నన్నూ, సారా వ్యాపారాన్ని నీ చేతిలో పెట్టి నా గొంతుక్కోసాడు మా నాన్న! ఆయన అర్ధాంతరపు చావూ నీ ఖాతాలోదే! నా జీవితం పోతే పోతుంది. కానీ రమ్య జీవితమైనా బావుండాలి. ఆడదంటే అంత అలుసురా నీకు! ఓ తల్లికేగా పుట్టావు పశువా! కన్నతండ్రి అంటే కడుపులో పెట్టుకోవాలి కానీ కడదీర్చకూడదు! ఇన్నాళ్ళూ సౌభాగ్యం కోసం, ఇంటి క్షేమం కోసం అమ్మవారి పూజలు చేసా. ఈరోజు మన ఇలవేల్పు నూకాలమ్మ సాక్షిగా చెప్తున్నా..... అదే అమ్మవారు చూపించినట్టు దుష్టశిక్షణ జరగాలిసిందే! అధర్మం నశించాలిసిందే....”


“ ధన్ ధన్ ధన్ ధన్”..... మరో మూడు గుళ్ళు రమేష్ బాబు ఎడం భుజంలోకి, రెండు తొడల్లోకీ గురిచూసి పేల్చింది రేవతి.... ఇంటర్ లో ఎన్ సీ. సీ లో అండర్ ఆఫీసర్ గా నేర్చుకున్న తుపాకీగురి తప్పలేదు ఆమెకు!


స్పృహ తప్పుతున్న భర్తకేసి కక్షగా చూస్తూ... “ నువ్వు దీనితో చావవు. కానీ జీవితాంతం జీవచ్ఛవంలా పడుంటావు. చట్టం నాకు ఏ శిక్ష వేసినా పరవాలేదు. రమ్య ఈపాటికి విమానం ఎక్కేసి ఉంటుంది. ఈ దౌర్భాగ్యపు తండ్రి నుండి దూరంగా పోతుందది. పుట్టి బుద్ధెరిగి సుఖపడ్డది లేదు ఆ పిల్ల! కనీసం ఇప్పుడయినా నీ దుష్టత్వం వదిలి బిడ్డక్షేమం కోరుకో! ఎక్కడో అక్కడ తన బతుకు తనను బ్రతకనీ“..... కోపంగా అరుస్తూనే....ఫోన్ తీసుకుని పోలీస్ కంట్రోల్ రూమ్ కు కాల్ చేసింది రేవతి!


అప్పుడప్పుడే విచ్చుకుంటున్న అరుణరేకలలో...దూరంగా గుట్టమీద నూకాలమ్మగుడి నుండి మహిషాసుర మర్థిని స్థోత్రం లీలగా వినిపిస్తోంది! ఆరోజు ఉగాది ముందురోజు! కొత్త అమావాస్య!


*********************


రేవతి చేసిన పని సవ్యమైనదే అని సమర్థిస్తూ... భగవంతుడే ఆమెకు గొప్ప సహాయం చేశాడు! ఆ రోజు రాత్రి దారికాసిన రౌడీషీటర్లు ...గస్తీపోలీసుల చేతచిక్కారు! కూతుర్ని, అల్లుడినీ చంపడానికి రమేష్ బాబు పన్నిన పన్నాగం అంతా బయటపెట్టారు! రేవతి తన భర్తను ఆత్మరక్షణ కోసం కాల్చిందని ...నమోదు చేసి ,కోర్ట్ లో ఆమె మీద కేసు కొట్టి వేశారు!


అంతటితో రేవతి రిలాక్స్ అవ్వలేదు ! తన భర్తను, తన కొడుకును సంస్కరించుకోవాలి ఇప్పుడు!


లిక్కర్ వ్యాపారం, బార్లు...లిక్కర్ సిండికేట్ లో ఉన్న ఇతర సభ్యులకు అయినకాటికి అమ్మి పడేసింది! రెస్టారెంట్ల బాధ్యత తన చిన్నాన్నలకు అప్ప చెప్పింది!


స్నేహితులతో పాటు తాగి వచ్చి ..తల్లి మీద వీరంగం చేస్తున్న ...తన కొడుకుని ...మత్తులో ఉన్నప్పుడు కట్టిపడేసి ,కార్లో వేసి...చిక్కమగళూరు లో... ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ నడుపుతున్న... రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేసింది!

అక్కడ తాగుడుకు విరుగుడు తో పాటు, యోగా, మెడిటేషన్ నిర్బంధంగా చేయించేవారు ! రెండుసార్లు పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ.... తల్లి వద్ద తన ఆటలు సాగవు అని తెలిసాక.... ఆ క్రమశిక్షణకు అలవాటుపడి.... మెల్లగా రాజీవ్ లో పరివర్తన రావడం మొదలు పెట్టింది!


అన్ని రకాల డబ్బులు వచ్చే సోర్స్... ఆపేయడంతో....రాజీవ్ కు మెల్లగా డబ్బు విలువ తెలియసాగింది!

చెడు స్నేహాలు దూరం అయ్యి, చదువు మీద కాస్త శ్రద్ధ పెరగడంతో ...కొడుకును ..చిక్మగళూర్ లోనే.. ఇంజనీరింగ్ పూర్తి చేయించింది రేవతి!


ఇదిగో ఈ రోజు కంప్యూటర్స్ లో మాస్టర్స్ చేయడానికి అమెరికాలో తన అక్క వద్దకు బయల్దేరాడు రాజీవ్!


రమేష్ బాబు జీవితాన్ని కూడా..తన చేతుల్లోకి తీసుకుంది రేవతి!


ఒక బుల్లెట్ వెన్నుపూసకు తగలడం వలన శాశ్వతంగా అవిటివాడు అయ్యాడతను! భార్యమీద పరుషవాక్య ప్రయోగాలతో అరుస్తూ ఉండేవాడు అతను!


అదే ఊళ్లోనే ఉంటే అతని ఆటలు కొంతలోకొంత సాగే వేమో.... కానీ అతనికి మాటశుద్ధి తో పాటు ఆత్మశుద్ధి కూడా అవసరమని రేవతి గట్టిగా భావించింది!


. పుట్టపర్తిలో... ప్రశాంతినిలయానికి దగ్గరలో.. ఒక కాటేజ్ కొనుక్కుని ,భర్తతోపాటు అక్కడకు మారిపోయింది!


కొడుకు లాగే.. రమేష్ బాబు కూడా.. ఆ ప్రశాంత, క్రమశిక్షణా పూరిత జీవితాన్ని వ్యతిరేకిస్తూ ఉండేవాడు!


కానీ తన సర్వఅవసరాలకు భార్యే ఆలంబన అవ్వడం వలన.... మెల్లగా అతనిలో పరివర్తన ,పశ్చాత్తాపం మొదలయ్యాయి! అక్కడ జరిగే భజన్లకు , సేవా కార్యక్రమాలకు...అతను బాగా ఆకర్షితుడవ్వ సాగాడు! గత జీవిత నేరచరిత్ర నుండి బయట పడి ...ఆధ్యాత్మిక పథంలో సాగిపోగలుగుతున్నాడు అతడిప్పుడు!


మారిన మనసుకు తార్కాణంగా ...కూతురు రమ్యను, ఆమె భర్త కిరణ్ ను స్వయంగా భారత దేశానికి ఆహ్వానించి... సాదరంగా పసుపుకుంకాలు ఇప్పించి పంపాడు!


"క్షమయా ధరిత్రి "...అన్న ఆర్యోక్తి అన్నివేళలా స్త్రీ విషయంలో జరగదని.... ఆమెలో అసహనం, ద్వేషం రగిలితే ఆ క్రోధాగ్ని లో తప్పుచేసిన వారు..శలభములా కాలి పోతారని ... రేవతి నిరూపించి చూపింది!

అదే స్త్రీ ..పార్వతియై.. తన కొడుకు భవిష్యత్తును తీర్చిదిద్దుకుంది! దుర్గయై...తన భర్తను చెడు మార్గం నుండి తప్పించగలిగింది!!


"దేవి ప్రచండదోర్దండ దైత్య దర్పనాశినీ

తారిణీం దుర్గాంబ సంసారసాగరస్య కులోద్భవాం!"������

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

పేరు: వోలేటి శశికళ

వయసు : 59

వృత్తి : గృహిణి

Education: MSc

Hobbies: Writing, Music

రచనా వ్యాసంగం: ఫేస్ బుక్ వేదిక గా 300 పైగా కథలు రాశాను! కొన్ని కథలు విపుల, ఆంధ్రభూమి, మధురవాణి, కథామంజరి, సంచిక, మాలిక, అచ్చంగా తెలుగు వెబ్ మాగజైన్స్ లో వచ్చాయి!
84 views0 comments

Comments


bottom of page