top of page
Original.png

భూమి కోసం

#VemparalaDurgaprasad, #వెంపరాలదుర్గాప్రసాద్, #BhumiKosam, #భూమికోసం, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Bhumi Kosam - New Telugu Story Written By Vemparala Durga Prasad

Published In manatelugukathalu.com On 06/12/2025

భూమి కోసం - తెలుగు కథ

రచన: వెంపరాల దుర్గాప్రసాద్


రఘురామయ్య చాలా దిగులుగా ఉంటున్నాడు గత ఏడాదిగా. ఆ దిగులు కి కారణం ఏదో రీ-సర్వే పేరుతో, రెవిన్యూ రికార్డులు తారుమారు చేయించిన భుజంగరావు అనే మోతుబరి రైతు. అతను ప్రస్తుత ఎమ్మెల్యే కి బావమరిది. అతని భూదాహానికి బలైన వాళ్ళు ఎందరో. 


ప్రభుత్వ భూమి పేరుతో పక్కకి జరిపిన భూముల్ని కావాల్సిన వాళ్ళ పేరుతో రికార్డులు మారుస్తారు. అప్పుడు అవే భూముల్ని ప్రభుత్వం చేత ఎక్కువ ధరకు కొనిపించి, పేదలకి ఇళ్ల పథకానికి మళ్లిస్తాడు భుజంగరావు. అదీ అతని వ్యూహం. అలా అతను దారి మళ్లించి రికార్డులు తారుమారు చేసినవి 60 ఎకరాలు. అందులో రఘురామయ్య భూమి 1 ఎకరం, 50 సెంట్లు. 


రఘురామయ్యకి, మహాదేవపాలెం గ్రామం లో 6 ఎకరాలు పొలం వుంది. ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నాడు. ప్రభుత్వాలు మారినా ఎప్పుడూ రాని సమస్య ఇప్పుడు ఎదురయింది అతనికి. 


రీ-సర్వే పేరుతో, సర్వేయర్, విలేజ్ రెవిన్యూ ఆఫీసర్ కలిసి ఆడిన నాటకం లో, 1 ఎకరం, 50 సెంట్ల భూమి అతనిది కాదని, మార్కింగ్ చేసేసారు. 

ఎవరికి మొరపెట్టుకున్నా, అతని గోడు వినేవాడు కరువయ్యాడు. 


కంటి నిండా నిద్ర కరువయ్యింది అతనికి. ఎప్పుడూ దిగాలుగా వుండేవాడు. కూతురు పెళ్లి చెయ్యాలన్నా, ఒక్క గా నొక్క కొడుకుని ఇంజినీరింగ్ చేయించాలన్న.. ఆ భూమిని నమ్ముకునే అతను బ్రతుకు సాగిస్తున్నాడు. 


కూతురు మంజుల పట్నంలో డిగ్రీ మొదటి సంవత్సరం లో వుంది. కొడుకు శేఖర్ ఇంజినీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. 


అతని భార్య సావిత్రికి రఘురామయ్యని ఎలా సముదాయించాలో అర్ధం కావడం లేదు. తన అన్నకి గోడు వెళ్లబోసుకుంది. అన్న రాజారామ్ పట్నం లో తనకి తెలిసిన లాయర్ దగ్గరకి తీసుకుని వెళ్ళాడు. 


లాయర్ మహేశ్వరరావు పట్నం లో మంచి పేరున్న లాయర్. కాగితాలు చూసిన లాయర్, “ మనం కేసు వేద్దాము. మీరు కంగారు పడకండి ” అన్నాడు. 


ఏదో ఆశ చిగురించిన రఘురామయ్య, “ సరే” అని, లాయర్ కి ముందుగా ఒక 25 వేలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. 


కేసు ఏడాదిపాటు వాయిదాలు తిరిగినా, జడ్జి తహసీల్దార్ రిపోర్ట్ దగ్గర ఆగిపోయాడు. తహసీల్దార్ పాలక ప్రభుత్వం లో ఉన్న ఎమ్మెల్యే గారికి, వ్యతిరేకంగా వెళ్లలేడు కదా. 

అతను, “ రఘురామయ్య ప్రభుత్వ భూమి లో ఎకరం, 50 సెంట్లు ఆక్రమించుకుని సేద్యం చేసుకుంటున్నట్లు సర్వే లో తేలింది “ అని రిపోర్ట్ ఇచ్చాడు.

 

లాయర్ కి అర్ధం అయింది రికార్డులు తారుమారు అయ్యేయని. కానీ అతని వాదన కంటే తహసీల్దార్ రిపోర్ట్ ని నమ్ముతుంది కోర్టు. 


రఘురామయ్యకి వ్యతిరేకంగా తీర్పువచ్చింది ఆరోజు. రఘురామయ్యకి ఉన్న ఆశలు చితికిపోయాయి. విసిగిపోయిన ఆయన ఇంటికి వచ్చి, గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. 


ఏదో అనుమానం వచ్చిన సత్యవతి తలుపులు బాదింది. అరచి గోల చేసింది. సమయానికి ఆమె తమ్ముడు కృష్ణ, అక్కడే ఉండడం తో, అతను తలుపులు బద్దలు కొట్టి లోపలి కి వెళ్ళేడు. అప్పటికే రఘురామయ్య చూరుకి వురి వేసుకుని వేలాడుతున్నాడు. 


పక్క ఇంటివాళ్ళని పిలిచి, వాళ్ళ సాయం తో ఆయన ని పై నించి కిందకి దింపేరు. కొన ప్రాణం తో ఉన్న రఘురామయ్య ని ప్రధమ చికిత్స చేసి, పట్నం లో హాస్పిటల్ లో జాయిన్ చేసేరు. మరునాడు కళ్ళు తెరిచేడు ఆయన. 


సత్యవతి నెత్తీ నోరూ కొట్టుకుంది. 

" పొలం పొతే పోయింది. నువ్వు మాకు ఉంటే చాలు. పిల్లలని తండ్రి లేని వాళ్ళని, నన్ను విధవరాలిని చేస్తావా ? ఇదెక్కడి న్యాయం ? “ అని ఏడ్చింది. 


బావమరిది, వూళ్ళో పెద్దలు చాలా మందలించారు. డాక్టర్ ఇచ్చిన కంప్లైంట్ తో పోలీస్ కేసు రిజిస్టర్ అయింది. 


మళ్ళీ పట్నంలో కోర్టుకే వెళ్ళేడు అయితే, ఈసారి పోలీసులు పెట్టిన కేసుకోసం, వాళ్లే తీసుకెళ్ళేరు. జడ్జి గారు 3 నెలలు జైలు శిక్ష వేసేరు. “ఆత్మహత్య కి పాల్పడడం నేరం” అన్నారు జడ్జి గారు. 


“రాజకీయ బకాసురులు చేస్తున్న భూ దందా లో తన పొలం పోతుంటే లేని నేరం, తాను విసిగి ఆత్మహత్య కి పాల్పడం నేరం ఎలా అవుతుందో “ అర్ధం కాలేదు ఆ ముసలాయనకి. నిర్వేదం గా జైలు కి వెళ్ళేడు రఘురామయ్య. 


3 నెలలు గడిచేయి. బయటకి వచ్చేడు. కానీ, ఇప్పుడు రఘురామయ్యలో మునుపటి ఉత్సాహం లేదు. ఏదో యాంత్రికంగా జీవిస్తున్నాడు. 


ఖర్చులు బాగా తగ్గించుకుని, చాలీ చాలని సంపాదనతో నెట్టుకొస్తూ పిల్లల చదువులు కొనసాగిస్తున్నారు ఆ దంపతులు. కొడుకు సాయంత్రాలు ట్యూషన్లు చెప్పి కొంత సంపాదించేవాడు. కూతురు తనకి తెలిసిన కుట్టుపని, ఎంబ్రాయిడరీ చేసి, కొంత సంపాదించేది. వేన్నీళ్ళకి చన్నీళ్ళు గా పిల్లలు సహాయం చేస్తూ ఉండడం సత్యవతి కి కడుపు తరుక్కు పోతూ ఉండేది. 


కొడుకు శేఖర్, కూతురు మంజుల తండ్రి వేదన చూసి తట్టుకోలేక పోతున్నారు. 

మరో 10 నెలలు గడిచేయి. 


ఎలక్షన్లు వచ్చేయి. పాలక పక్షం చిత్తుగా ఓడిపోయింది. ఎన్నో చోట్ల వాళ్ళ అరాచకాల కి ప్రజలు ఓటు తో బలమయిన తీర్పు ఇచ్చేరు. కొత్త గా వచ్చిన ప్రభుత్వం లో ప్రజా దర్బార్ కి వెళ్ళేడు రఘు రామయ్య. ఇప్పుడు అతనిలో మళ్ళీ ఆశలు చిగురించాయి. 

ఇలాంటి ఎన్నో అర్జీలు చూసిన మినిస్టర్ గారు ఆ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టి కి తీసుకుని వచ్చేరు. క్యాబినెట్ మీటింగ్ లో ఆ అంశం పెట్టి, నిజనిర్ధారణ కమిటీ వేయాలని తీర్మానించింది ప్రభుత్వం. 


పంచాయితీ రాజ్ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, రెవెన్యూ సెక్రటరీ తో కలిపి ఒక బృందాన్ని నియమించారు. ఆ కమిటీకి, నిజాలు పరిశీలించడానికి 4 నెలల సమయం ఇచ్చారు. 


4 నెలలు గడిచేయి. నిజ నిర్ధారణ కమిటీ నిజాలు నిగ్గు తేల్చింది. ఎన్నో గ్రామాల్లో భూమి రీ సర్వే లో అవినీతి జరిగిందని తేల్చింది. భూ బకాసురులు బాగానే దోచుకున్నారని చెప్పింది. 


ఇక మహాదేవ పాలెం విషయానికి వస్తే, సర్వేయర్, విలేజ్ రెవిన్యూ ఆఫీసర్, తహసీల్దార్ లు అవకతవకలకు పాల్పడినట్లు, కమిటీ తేల్చింది. ఇందులో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్లు నిర్ధారించింది. 


కమిటీ రిపోర్ట్ ఆధారంగా, మహాదేవ పాలెం సర్వేయర్ ని, విలేజ్ రెవిన్యూ ఆఫీసర్లను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. తహసీల్దార్ ని దూరంగా ట్రాన్స్ఫర్ చేసింది. 

రీ -సర్వే పూర్తి చేసి, కొత్త రిపోర్ట్ 2 నెలల లో సమర్పించాలని, కొత్తగా వచ్చిన బృందానికి ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. కొత్త రిపోర్ట్ ప్రకారం, రఘురామయ్య తిరిగి తన పొలాన్ని దక్కించుకున్నాడు. 


ఆరోజు తండ్రి తో కొత్త తహసీల్దార్ వద్దకి వెళ్ళేడు శేఖర్. తండ్రి మొహం లో ఆనందం చూసి అతనికి ఇప్పుడు చాలా రిలీఫ్ గాఉంది. 


కొత్త తహసీల్దార్ శేఖర్ ని ఉద్దేశించి అడిగేడు.. "ఏం చేస్తున్నావు బాబు?"


"ఇంజనీరింగ్ పూర్తి అయిపోవచ్చింది " అన్నాడు. 


"మంచిది. ఇప్పుడు, నీకు క్యాంపస్ లో వుద్యోగం వచ్చి ఉండాలి?" అన్నాడు ఆయన. 


"వచ్చింది సార్. కానీ జాయిన్ అవదలుచు కోలేదు" అన్నాడు శేఖర్ స్థిరంగా. 


రఘురామయ్య, తహసీల్దార్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. 

"అదేమిటి? " అన్నాడు ఆయన. 


"మాకు జరిగిన అన్యాయం ఎందరో రైతులకి జరుగుతోంది. ఇలాంటి అన్యాయాలు ఆగిపోవాలి. ఆలా జరగాలంటే, రాష్ట్రం లో భూమి రికార్డులను డిజిటలైజ్ చేయాలి. ఆ దిశగా ప్రభుత్వానికి మార్గదర్శనం చేసే పటిష్టమైన రెవిన్యూ వ్యవస్థ కావాలి. నేను ఒక సెక్రటరీ స్థాయి అధికారిగా ప్రభుత్వంలో సేవలందించాలి. అందుకు ఎన్ని ఏళ్ళు పట్టిన పర్వాలేదు. నేను ఎంచుకున్న మార్గం I. A. S. " అన్నాడు శేఖర్, తన నిర్ణయం యెంత బలంగా తీసుకున్నాడో తెలుపుతూ.

 

మెచ్చుకోకుండా ఉండలేక పోయాడు తహసీల్దార్. రఘురామయ్య కొడుకు నిర్ణయానికి గర్వంగా చూసేడు. 


తహసీల్దార్ రఘురామయ్య గారికి, ఆయన భూమి తాలూకు పాస్ బుక్ ఇచ్చారు. 

పోయిందన్న భూమి దక్కడంతో రఘురామయ్య పొంగిపోయాడు. తాను ఎప్పుడూ మొక్కే శివయ్య గుడికి వెళ్ళి అభిషేకం చేయించాడు. 

ఆ కుటుంబం లో ఆనందం వెల్లి విరిసింది. 


సమాప్తం

 

వెంపరాల దుర్గాప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:


నా పేరు: వెంపరాల దుర్గాప్రసాద్


నేను AP ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో


అనగా APEPDCL లో personnel Officer గా పని చేసి november 2022 లో రిటైర్ అయ్యేను.


రచనలు చెయ్యడం, బొమ్మలు వేయడం, పద్యాలు రాయడం నా హబీ లు.


క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ ఆటలు టీవీ లో చూడడం ఇష్టం.


ధోనీ, రోహిత్ శర్మ అంటే  క్రికెట్ లో చాలా ఇష్టం.


సంప్రాస్, జకోవిక్ ల టెన్నిస్ ఆట ఇష్టం.


ఫుట్ బాల్ లో రోనాల్డో కి ఫాన్.


వుండేది విశాఖపట్నం.


ఇప్పటి దాకా వివిధ పత్రికల్లో 40 కధలు రాసేను.

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Sowmya Mullapudi
Sowmya Mullapudi
Dec 20, 2025
Rated 5 out of 5 stars.

Adugaduguna mosapotunna saamanyulaku ituvanti oorata andaali ...

Like
bottom of page