top of page
Original.png

బ్రహ్మరాక్షసుడి ప్రాణం మర్రిచెట్టు తొర్రలో..



Brahma Rakshasudi Pranam Marrichettu Thorralo - Telugu Suspense Story | Karlapalem Hanumantha Rao

బ్రహ్మరాక్షసుడి ప్రాణం మర్రిచెట్టు తొర్రలో - తెలుగు ఉత్కంఠభరిత కథ | కర్లపాలెం హనుమంతరావు

Published In manatelugukathalu.com On 10/04/2026


ఒక మనిషి చేసిన చిన్న పొరపాటు జీవితాంతం అతన్ని వెంటాడుతుందా?

గతం నుంచి తప్పించుకోవడానికి ఎంత దూరం వెళ్లినా… అది మనల్ని వదిలేస్తుందా?

“బ్రహ్మరాక్షసుడి ప్రాణం మర్రిచెట్టు తొర్రలో” కథలో సూర్యప్రకాశ్ జీవితంలో దాగి ఉన్న రహస్యం, బ్లాక్‌మెయిల్, తెలివైన ప్రతిస్పందన—మీకు చివరి వరకూ ఉత్కంఠను కలిగిస్తాయి.


పట్టపాలెంలో తన  చిన్న పెంకుటింటి ముందు సూర్య తన పాత బుల్లెట్ మోటారు సైకిల్‌ను తుడుచుకుంటున్నాడు. పాత తరం రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిల్ అది . 


పదేళ్ల కిందట పాండిచ్చేరీ సెంట్రల్ బ్యాంక్ దోపిడీలో ఆబండి  సైలెన్సర్  కు తూటా తగిలినప్పుడు పడ్డ  సొట్ట చేతికి తగిలింది. మనసు అదోలా అయిపోయింది. బండిసొట్ట చేతికి  తగిలినప్పుడల్లా ఎప్పుడో జరిగిన క్రైమ్ సీన్  రీక్రియేట్ అయి  బాధకలగడం సూర్య ప్రకాష్ కి అలవాటే. 


“కంటి ముందు  పెట్టుకుని అట్లా కుమిలే కన్నా ఆ పాత డొక్కును ఏ ఇనప సామానుకో  వెయ్యచ్చుగా! మీ ప్రాణానికీ నా  ప్రాణానికీ తెరిపి !" అని సణుగుతుంటుంది సుగుణ. 


సుగుణ కంటికి అది వట్టి ఇనుప తుక్కే  కావచ్చు. కానీ ఆ బండితో తనకున్న బంధం భార్యతో ఉన్న బంధం కన్నా గట్టిది. 


మిలటరీలో    షార్ట్ సర్వీస్ కమీషన్ పూర్తి చేసుకుని ఆర్మీ కోటా కింద బ్యాంక్ సెక్యూరిటీ గార్ట్ గా సర్వీసు చేయడమే సుగుణకు తెలుసు. అంత సెక్యూర్డ్ జాబు కూడా  వదిలేసుకుని బైటికి ఎందుకొచ్చాడో ఆమెకు  తెలీదు. తను చెప్పలేదు. 


పెళ్ళయే ముందే  మొగుడూ పెళ్ళాలు అన్నీ మనసు విప్పి మాట్లాడుకోవాలి అంటారు. సుగుణ తాను తన మేనమామ చేత ఎంతలా  హెరేజ్ మెంట్ కు గురయిందో మర్మం లేకుండా అంతా వివరంగా చెప్పింది. కానీ తాను మాత్రం పదేళ్ళ కిందట జరిగిపోయిన దుస్సంఘటనను ధైర్యంగా బయటపెట్టలేక పోయాడు. సుగుణ అపార్ధం చేసుకుంటుందని భయం! 


ఈ పాత బండిని చూసినప్పుడల్లా ఆనాటి సంఘటన గుర్తుకొస్తుంది సూర్యకు. పదేళ్ళ ఆ పసిమొగ్గ కంటి ముందు కదిలి గుండె నీరవుతుంది. 


ఆరోజు తను లేచిన వేళ మంచిది కాదు.  బంగారు భవిష్యత్తు ముందున్న ఆ చిన్నారి బతుకు తన మూలకంగా  ఛిద్రమయింది. బ్యాంక్ లో జొరపడ్డ దొంగల ముఠాను అడ్డుకునే డ్యూటీలో పొరపాటన పేలి గురితప్పిన తూటా బ్యాంకు పని మీద కూతురుతో వచ్చిన ఆయనకు తగిలింది. అంతలావు మనిషీ  అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. 


పాప తండ్రి చావును మర్డర్ గా మార్చి  కోర్టు బోనులో తనను నిలబెట్టినందు కన్నాతండ్రిని పోగొట్టుకున్న ఆ చిన్నారి  ముందు తాను దోషిగా నిలబడ్డందుకు   కుమిలిపోయాడు సూర్య . 


అక్కడే ఉంటే అనుక్షణం ఆ నరక యాతన భరించక తప్పదు. అందుకే    జైలు నుంచి కోర్టుకు వచ్చే   ట్రాన్సిట్ ట్రెం లో సందు చూసుకొని తను ఉడాయించిందీ.. పోలీసుల కంటపడకుండా ఉండటానికి   రాష్ట్రం మారి ఇంత దూరం వచ్చి ఈ మారుమూల కుగ్రామంలో తలదాచుకున్నది. 


తన మూలకంగా ఒక పసిపాప నిష్కారణంగా అనాథ అయిందని  తెలిస్తే  సుగుణ క్షమిస్తుందా? అందులోనూ ఆమెకు ఇప్పుడు ఆరో నెల! 


"మీ మురిపాల బిడ్డను  ఇంకెంత సేపు లాలిస్తారు గాని, లోపలికి పదండి! మన కీపూట డాక్టరుగారి అప్పాయింటుమెంటుంది" అంది సుగుణ... బండిని వాష్ చేసిన ఆయిల్   పారబోసేందుకు బౌల్  అందుకోబోతూ.    వారించాడు సూర్య."ఇంకా సర్వీసింగ్ పని పూర్తికాలేదు,  ఆ బౌల్ అక్కడే ఉంచు సుగుణా! " అంటూ  గ్రీజు అంటిన చేతులు శుభ్రం చేసుకొనేందుకు నీళ్ళ పంపు దగ్గరకు వెళ్ళాడు . 


  “హలో ! సూర్యా! హౌ ఆర్యూ ! “


పిలుపు వినిపించిన వైపుకు తలెత్తి చూస్తే...  సెల్వరాజన్!   అతగాడి  వెనకాలే అతని తోక  .. తోకాడిస్తూ  'ఫైరీ' ..! 


సెల్వరాజన్ ఊళ్ళోకి ఎప్పుడో గానీరాడు. అతనో అరక్ కంట్రాక్టరు. కావలిలో మొయిన్  వైన్ షాపులు రెండుంటే .. ఆ చుట్టు పక్కల ఊళ్ళల్లో పది పన్నెండు  బెల్టు షాపులు ! వాటి లెక్కా డొక్కా చూసుకోవటానికి అమావాస్యకో పౌర్ణమికో ఒకసారి వచ్చి పోతుంటాడు. 


ఎప్పుడొచ్చినా అతగాడికి తోడుగా ఆ 'ఫైరీ' ఉండాల్సిందే. కరోనా కాటుకి పదేళ్ళ  కొడుకు పోయినప్పట్నుంచి సెల్వరాజన్ కి ఫైరీ నే కొడుకయ్యాడు.  


ఎప్పుడూ లేంది ఈసారి సెల్వరాజన్ ఈ నెల్లో రావడం రెండోసారి!  వచ్చీరాగానే షాపు వైపు వెళ్ళకుండా నేరుగా  తనింటికే రావటం ఆశ్చర్యం వేసింది సూర్యకు... ఆమాటే  అడిగాడు సెల్వరాజున్ ని.  


"ఏంటన్నా? ఈపాలి తొందరగా వచ్చేసినావే? ఏమన్నా విశేషమా?"


"అంత స్పెషల్గా  విశేషాలేమీ లేవులేరా అబ్బీ! కావలిలో సినిమా  హాలు కట్టిస్తున్నాగా  ! ఈ ఉగాది కల్లా తెర మీద  బొమ్మ పడాలని ప్లాను ! కాని పని ముందుకు  సాగటం లేదబ్బీ  .. ఫైనాన్స్ ప్రాబ్లమ్ ! అద్సరేగానీ.. లాస్ట్ వీక్ చెన్నైలో మా బామ్మర్ది కూతురు పెళ్ళికి వెళ్ళానా! అక్కడ   నీ మాటొచ్చిందిరా అబ్బీ ఆశ్చర్యంగా.. మా 'కో - సస్- ఇన్లా' ఇచ్చాడిది! " అంటూ ఓ పేపర్  కటింగ్ సెల్వరాజన్ చేతిలో పెట్టాడు సెల్వరాజన్. 


అదో అరవ న్యూస్ పేపర్ తాలూకు కటింగ్! ఆ కాగితం ముక్కను చూడగానే సూర్య మొహం పాలిపోయింది. 


పదేళ్ళ కిందట పాండిచ్చేరీలో జరిగిన బ్యాంకు దోపిడీ తాలూకు ప్రకటన అందులోఉంది! కస్టడీ నుంచి   తప్పించుకొని వచ్చిన తరువాత పోలీసులు తన కోసం తెగ గాలించినట్లుతెలుసు. ఫలితం లేక మెజిస్ట్రేటియల్  ఆర్డర్స్  మీద సెర్చ్ వారంట్ ఇష్యూ  చేసారన్న మాట! 


పారిపోయిన ఖైదీ ఆచూకీ తెలిపితే   రివార్డ్ ఇస్తామని  ప్రకటన!   పోలీస్ డిపార్ట్ మెంట్ లో పని వెలగబెట్టాడన్నాడుగా వీడి బామ్మర్ది. ఆడికి దొరికిన కాగితమ్ముక్క   పట్టుకొనొచ్చి ఈ సెల్వరాజన్ బ్లాక్ మెయిలింగ్ కి దిగాడని సులువుగానే అర్థమయింది సూర్య ప్రకాష్ కి. 


తన ఆర్మీ పెన్షన్, కమ్యూటేషన్ సొమ్ము మీద ఈ సెల్వరాజన్ గాడి కళ్ళు పడ్డాయని చాలా కాలం కిందే  పసిగట్టాడు తను. ఒకటికి  రెండుసార్లు వడ్డీకి అప్పివ్వమని వత్తిడి తెచ్చాడు కూడా. తనే పడనీయలా! ఏదో వంకతో  నెట్టుకొచ్చాడు ఇంతకాలం. అంచేత ఇప్పుడిట్లా బ్లాక్ మెయిలింగుకి దిగాడన్నమాట.. దౌర్భాగ్యుడు! ! 


నిజానికి ఆ సొమ్ము దాచింది తన కోసం కూడా కాదు.  తనవల్ల జరిగిన తప్పిదానికి జరిమానా చెల్లించుకోవడానికి. తండ్రిని పోగొట్టుకున్న ఆ చిన్నారి భవిస్యత్తు ఛిద్రమవకుండా కాచుకోడానికి!  

ఆ బిడ్డ మేజర్ అయిందాకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆసొమ్ము  బ్యాంకులోనే ఉండేలా ఏర్పాటు చేసింది కూడా అందుకే. అంత విలువైన సొమ్ము ఈ పాపాత్ముడి పాలబడడానికి ఎంత మాత్రం వీలులేదు. 


"ఏం సూర్యా! నువ్వు పాండిచ్చేరిలో బ్యాంక్ సెక్యూరిటి గార్డ్ గా   పనిచేసావటగా! మాతోడల్లుడు  చెప్పాడులే. మేటర్ అర్ధమయిందనుకుంటా!  తమిళం నీకూ తెలిసుంటుందీ!" 


అదోలా నవ్వాడు సెల్వరాజన్... పాము 'హిస్'  మన్నట్లు! 



చేతిలోని పేపర్ పరపరా చింపేయాలనిపించింది సూర్యకి. కాని   ఇది జిరాక్స్ కాపీ! ఒరిజినల్ సెల్వరాజన్ దగ్గరున్నంత కాలం తను బోనులోని పులే! 


'ఫైరీ' మొరుగుతోంది ఎందుకో! ఆ శబ్దానికి  ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు సూర్య. 


కుక్కకు బాగా దాహంగా ఉన్నట్లుంది.  బొచ్చెలోని లిక్విడ్ వంక దూకుతోంది. బహుశా అది దప్పిక తీర్చే నీళ్ళు అనుక్నుట్లుంది పిచ్చి ముండ! 


సెల్వరాజన్ ఫైరీని కంట్రోల్ చేయలేక తన్నుకులాడుతున్నాడు.


సూర్య అన్నాడు, " సెల్వరాజున్! పాపం మూగజీవి! దానికేం తెలుసు మన్లాగా ఎమోషన్లని దాచుకోవటం! వదిలేయ్! రెండు గుక్కలు తాగితే ఏం కాదులే! " 


సెల్వరాజున్ ఆలోచనలో ఉండగానే  బోరింగ్ పైపు కొట్టి బకెట్ కు పట్టిన నీటిని ఫైరీ ముందుంచాడు. 


ఆబగా నీటిని తాగే ఫైరీ వంక దీక్షగా చూస్తూ అన్నాడు సూర్య "నేను గాని ఆపక పోయుంటే నీ పెట్ డాగ్ నిజంగానే ఆ బొచ్చెలోవి నీళ్ళనుకొని తాగుండేదేగా! బైక్ లు మెయింటెయిన్ చేసేవాడివి..బళ్ళ  సర్వీసుకు వాడే కూలెంట్లో ఇథిలీన్ గ్లైకాల్  అనే విషముంటుందని ..   అది గాని శరీరంలోకి  వెళితే  బాడీలోని 'ఆక్సాలిక్' యాసిడ్‌గా మారి కిడ్నీలకు  మూడుతుందని నీకు మాత్రం తెలీకుండా ఉంటుందా ? " 


సెల్వరాజన్ మొహంలో రంగులు మారాయి . అతగాడి మనసులో సుళ్ళు తిరుగుతున్న భయాన్ని   పసిగట్ట లేనంత  అమాయకుడు కాదు సూర్య. ఒకెట్లోని  వాటర్  తాగే ఫైరీని బలవంతంగా  లాగే ప్రయత్నంలో ఉన్న సెల్వరాజన్ తో నిదానంగా  అన్నాడు "ఎంత కొడుకులా సాకినా కుక్క కుక్కే రాజన్! మనుషుల్నే కుక్కల కన్నా హీనంగా చంపుతున్నారీ రోజుల్లో!  ఇక కుక్కల్ని చంపటం ఒక లెక్కా ! " 


సెల్వరాజున్ దిగ్గున తతెత్తి చూశాడు సూర్య వంక.  చిర్నవ్వు చిందిస్తూ నిలబడున్న సూర్య  మాటల్లోని అంతరార్థం అర్థమయింది అతగాడికి.  ఫైరీ మెడకి కట్టిన గొలుసును బలవంతంగా లాక్కుపోయి  చకచకా బైకెక్కేశాడు సెల్వరాజన్. 


కన్ను రెప్ప కొట్టే లోపే దూరంగా దుమ్ము లేపుకుంటూ దూసుకెళ్ళే సెల్వరాజన్ బండిని  చూసి నవ్వుకున్నాడు సూర్య . "ఈ కుక్క బతికున్నంత కాలం సెల్వరాజన్ నుంచి తనకు ముప్పు లేదు! బ్రహ్మ రాక్షసుడి ప్రాణం మర్రి చెట్టు తొర్రలో  ఉంది మరి"    


చేతిలోని కాగితం ముక్కను  పరపరా చింపేశాడు సూర్య .  


వసారాలో  నిలబడి అంతా      చూస్తున్న సుగుణ అడిగింది సూర్య దగ్గరికొచ్చి .  "ఎందుకా పెద్దమనిషి మమ్మల్ని అంతలా బెదిరించింది?! ఇంతలోనే ఎందుకలా  తుర్రుమన్నది?! మీరు చింపేసిన కాగితంలో అసలేముంది?!"


ప్రశ్నల వర్షం కురిపిస్తున్న సుగుణ భుజం మీద  అనునయంగా చేతులేసి ఇంట్లోకి దారి తీసాడు .. "అవతల డాక్టరుగారి అప్పాయింట్ మెంటుకి టైమవుతుంది .. ముందు తొందరగా తయారవ్వు  " అంటూ! 


 'సెల్వరాజన్ బ్లాక్ మెయిలింగ్ కథ’ ఎలా చెపితే సుగుణ 

అపార్థం చేసుకోకుండా   ఉంటుంది?' అని ఆలోచిస్తున్నాడిప్పుడు  సూర్యప్రకాష్. 


సమాప్తం. 

 ***

కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

కర్లపాలెం హనుమంతరావు -పరిచయం


రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోటీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.

#KarlapalemHanumanthaRao, #కర్లపాలెంహనుమంతరావు, #తెలుగునీతికథలు, #మురికి, #Muriki, Inspirational Telugu Stories, Life Lessons Telugu, Social Stories Telugu, Emotional Stories Telugu, Humanity Stories, Telugu Kathalu, Heart Touching Stories, Railway Story Telugu

 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page