top of page

బ్రతుకు తెరువు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Youtube Video link

'Brathuku Theruvu' New Telugu Story


Written By Ayyala Somayajula Subrahmanyam


రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
దిల్‌షుక్‌నగర్‌ చౌరస్తాలో రాబోయే దసరా, దీపావళి పండుగల హడావుడి కోలాహలంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బట్టలషాపువాళ్ళు రకరకాల ఆకర్షణలతో కొనుగొలుదారుల్ని సాదరంగా ఆహ్వనిస్తున్నారు.


ప్రముఖంగా నగరంలో పేరొందిన ఒకపెద్ద బట్టల దుకాణం ముందు ఒకపెద్ద జోకర్‌ బొమ్మ డెక్‌లో వస్తున్న మ్యూజిక్‌ కి అనుగుణంగా చక్కని డాన్స్‌ చేస్తూ జనాన్ని ఆనందపరుస్తోంది. అది చూసిన జనం చప్పట్లుకొడుతూ ఆనందిస్తూ వుంటారు. పిల్లలు ఆ జోకర్‌ బొమ్మతో ఆడుకుంటూ పకపకా నవ్వుతున్నారు. కొందరు ఆ బొమ్మతో సెల్ఫీలు దిగుతున్నారు.


ఆ జోకర్‌ బొమ్మ ఆహ్వానాన్ని నవ్వుతూ అందుకున్న కొందరు, ఆ దుకాణానికి వెళ్ళి బట్టలు కొనుగోలు చేస్తున్నారు. ఆ దుకాణం యజమాని, ఆ జోకర్‌ బొమ్మ మాస్క్‌ తగిలించుకున్న వ్యక్తి డ్యాన్స్‌కి, సమయస్ఫూర్తికి మనసులో అభినందించాడు.


"మేరా నామ్‌ జోకర్‌, మేరా నామ్‌ జోకర్‌" -

జోకర్‌ నండి బాబు, జోకర్‌ నండిబాబు”

అని స్టెప్పు లు వేస్తున్నాడు.


దుకాణంలో బట్టలు కొని వస్తున్న దంపతుల చేతిలోంచి పిల్లవాడిని లాక్కొని, ఎత్తుకుని డాన్స్‌ చేస్తోంది. ఈ హాఠాత్సంఘటనకు ఆశ్చర్యపోయిన బాబు తల్లిదండ్రులు బొమ్మ డాన్స్‌ చూస్తూ తమాయించుకున్నారు. జనం జోకర్‌ బొమ్మ చేస్తున్న డాన్స్‌ కి చప్పట్లతో తాళం వేస్తూ సంతోషిస్తూ ఉన్నారు. సమయం చాలా సేపు గడిచినా బొమ్మ, వాళ్ళ బాబుని వారికి ఇవ్వడములేదు.


బాబు తల్లి తన భర్తతో " బాబుని తీసుకోండి. ఎంత సేపు ఇక్కడ. వెళదాం" అని కోపంగా అంది. కాని జోకర్‌ బొమ్మ, బాబుకు ముద్దులు పెడుతూ , గట్టిగా పట్టుకుని ఇవ్వకుండా మారాం చేస్తోంది. బాబు తండ్రి నవ్వుతాడు.


అది చూసి తల్లి, ఒక్క ఉదుటున బాబుని లాక్కుని "చాల్లెండి సంబరం, రండిక" అని అతని చేయి పట్టుకుని లాక్కెళ్ళింది.


ఆ జోకర్‌బొమ్మ లో వున్న వ్యక్తి గుండెలనెవరో గట్టిగా పిండినట్లయింది. ప్రజలకు కనిపించని ఆ వ్యక్తి కళ్ళనీళ్ళు ధారావాహికంగా ప్రవహించాయి. ఆ బాబు వెళ్ళిన వైపే

చెయ్యిచాచి ప్రేమగా చూస్తూ ఉంది.


బాబు కనుమరుగైపోవడంతో , జోకర్‌ బొమ్మ మాస్క్‌ తీసి , కన్నీళ్ళు తుడుచుకుని , మళ్ళా ఆ మాస్క్‌ తగిలించుకుని డాన్స్‌లో నిమగ్నమైపోయాడా వ్యక్తి.


ప్రతిమనిషి లో బాహ్యరూపం ఒక మాస్క్‌. " దాని వెనక కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు,ఆవేదనలు, శోధనలు"- అనేక సమస్యలు దాచుకుని , ఈ లోకమనే రంగస్థలం మీద పాత్రోచితంగా నటిస్తుంటారు. ఆ మాస్క్‌ తొలగించితే వాస్తవం బయట పడుతుంది.


ఈ సారి జోకర్‌ బొమ్మ, తెల్లటి ఉంగరాల జుట్టు, కళ్ళజోడు పెట్టుకుని సన్నగా వుండే వ్యక్తిని దుకాణం లోంచి వస్తూండగా చెయ్యి పట్టుకుని ఆపి నిలబెట్టింది. ఆ వ్యక్తి విషయం అర్థం కాక అచేతనంగా నిలబడి ఆశ్చర్యంగా జోకర్‌ బొమ్మను చూస్తూ వుండిపోయాడు.


జోకర్‌ బొమ్మ తన ముఖంమీద వున్న మాస్క్‌ తీసివేస్తూ .... సంతోషంగా "ఓరేయి నాగూ! ఏమిట్రా ? అలా చూస్తున్నావు? నేను రా . రామారావుని. " అన్న మాటవిని ఆ పెద్దమనిషి నవనాడుల్లో ఉత్తేజం పొంగి ఒక్కసారిగా కోటివీణలు రవళించాయి.


ఆ మనిషి ఉబ్బితబ్బిబ్బవుతూ " రామూ! ఇది కలా? నిజమా? ఎన్నేళ్ళయ్యిందిరా నిన్ను చూసి......... అది సరే.... నువ్వేమిటి? ఆ జోకర్‌ వేషం వేసుకుని డాన్స్‌ చెయ్యడం ఏమిటీ?” అని ప్రశ్నల వర్షం కురిపించాడు.


అతనికి సమాధానంగా రామారావు .......

“ఓరేయి నాగూ! ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. ఇప్పుడే వస్తా" అని దుకాణంలోకి వెళ్ళి ..... పదినిమిషముల తరువాత మూర్తీభవించిన నటరాజులా బయటకు వచ్చి,


"నాగూ రా! రా..” అని “వెళ్ళి కాఫీ త్రాగుతూ , తాపీగా మాట్లాడుకుందాం" అని అతని చెయ్యి పట్టుకుని హోటల్‌ వైపు దారితీశాడు.


రామారావుని చూస్తూ నడుస్తున్న నాగలింగం మస్తిష్కం లో, గతస్మృతులు ఒక్కసారిగా మెదిలాయి. సినిమాలలో మంచి నటుడిగా ఉన్న రామారావు, తన ప్రాణమిత్రుడు ఇలా ఈ పరిస్థితులలో తను చూడటం, అతని మనస్సును ఎంతగానో బాధించింది.


కాఫీ త్రాగుతూ నాగలింగం రామారావుతో "చెట్టంత కొడుకులు ఇద్దరుండగా నువ్విలా డాన్స్‌ చేసి సంపాదించడమెందుకు మిత్రమా? " అన్నాడు సూటిగా కళ్ళలోకి చూస్తూ.


రామారావు పేలవంగా నవ్వుతూ ... "పున్నామ నరకాత్‌ త్రాయత్‌ ఇతి పుత్రః అనిమాట ఉంది. ఆ మాట విని కొడుకులు పుట్టారని సంతోషిస్తే ..... ఈ లోకంలో నా ఇద్దరు కొడుకులు అంతకు మించి నరకము చూపించారు" అంటూ నిట్టూర్చాడు.


విషయం అర్థం కాని నాగలింగం "రామూ! మీరంతా కలిసి లేరా?”


రామూ దీర్ఘంగా నిట్టూర్చి "ఇప్పుడు లేమురా!..... ఒకప్పుడు సరదాగా సినిమాలలో వేసిన చిన్నచిన్నవేషాల అనుభవమే నాకు, పార్వతికి పట్టెడన్నం పెడుతోంది. జీవితమనే రంగస్థలం మీద "జోకర్‌.... మేరా నామ్ జోకర్‌" లాగా నవ్వుతూ ఏడవడం, ఏడుస్తూ నవ్వించడం ప్రస్తుతం నా పని. నీ లాగా నాది వడ్డించిన విస్తరి కాలేదు రా నాగూ" అన్నాడు బాధగా.


"వివరములు అడిగి నీ మనస్సు కష్టపెడుతున్నానని అనుకోకపోతే ........ అసలేం జరిగిందో చెప్పరా రామూ" అన్నాడు నాగలింగం.


తన మనసులో ఉన్న బాధను అణచుకుంటూ రామూ చెప్పండం మొదలుపెట్టాడు. "కొన్ని నిమిషాల క్రితమే పెద్దోడిని, కోడలిని, మనవడిని చూశాను. నా మనవడిని తనివితీరా ముద్దాడాను. కానీనేనెవరో వాళ్ళు గుర్తు పట్టలేదు. నేను చనిపోయానని , నా పేరే మనవడికి పెట్టుకున్నారు. నా కదే పదివేలు" అన్నాడు, దుఃఖం కట్టలు తెంచుకుని వస్తున్నా ఆపుకుంటూ .


నాగు రాము రెండు చేతులు పట్టుకుని " అసలు విషయం నువ్వు నా దగ్గర దాస్తున్నావు. ఎందుకో నాకు తెలియడం లేదు”.


కన్నీటితో తేలియాడుతున్న కన్నులను తుడుచుకుని రామూ "ఈ విశాల సృష్టిలో మనిషికి దేవుడిచ్చిన వరం నేస్తం. కన్నవాళ్ళు, కట్టుకున్నవాళ్ళు, తోబుట్టువులు ఎందరు వున్నా మనసు విప్పి , తన బాధను తెలియపరచుకునే అదృష్టం ఒక్క స్నేహితుడు దగ్గరే కదా! నాగూ, అలాంటిది నీ దగ్గర విషయం దాచిపెడతానా?


నేను కొడుకులిద్దరినీ ఎంత కష్టపడి పెంచి పెద్దచేసి చదివించానో నీకు తెలుసు. పెద్దాడి పెళ్ళి విషయంలో అమ్మాయి ఇష్టంలేదని చెప్పినా ఆ అమ్మాయిని ఒప్పించి నీ చెల్లెలు.. అదే నాభార్య పార్వతి పెళ్ళి చేయించింది. ఇంక చిన్నాడు ఎవరినో ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకును ఎటో వెళ్ళిపోయాడు.


మా పై ప్రేమ, అనురాగం, ఆప్యాయత , గౌరవం రవ్వంతైనా లేకుండా పోయాయి. ఒక్కోసారి నేను, పార్వతి పస్తులు కూడా ఉన్నాము.


చాలా రోజుల తరువాత ఒక మధ్యహ్నపు వేళలో అందరం కలిసి భోజనం చేస్తున్నాము. అప్పుడు పార్వతి కోడలితో .... "ఏమ్మా ! మీ మావయ్యగారికి పులుపు వస్తువులు తింటే ఆయాసం వస్తోంది కదా! ఏదైనా పులుపు లేకుండా తీయవచ్చు కదా!” అనడంతో ... కోడలి కి కోపం తారాస్థాయికి చేరుకుంది.


"మనిషికో రకంగా వండటానికి, మీ కొడుకేం ఆఫీసర్‌ కాదు. మామూలు గుమాస్తా ఉద్యోగం. డబ్బులు చెట్లకి కాయడం లేదు. నా చేతనైంది చేస్తాను. ఇష్టమున్నా, కష్టమున్నా తింటే తినండి. లేకపోతే మానేయండి. ఇది కూడా లేక ఎంతో మంది అడుక్కు తింటున్నారు. చేసినా కొద్దీ చేయించుకోవడం మీకు అలవాటు. ఈ సోకరాలు నాదగ్గర పనికి రావు" అంటూ నానా మాటలాడి ఈసడించుకుని వెళ్ళి పోయింది.


ఆ మాటలు విని భోజనం ఎక్కలేదు. ఆ రోజు అభోజనమే. పెరటి లోకి వెళ్ళి కూర్చున్నాను. నా వెనకే పార్వతి కూడా వచ్చి కూర్చుంది. ఇంక మనసు బాగా ఘంటసాలవారి భక్తిగీతాలు డీవిడి లో పెట్టుకుని వింటున్నాను. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని.


ఇంతలో ధడాలున చప్పుడు. భళ్ళున తలుపులు తెరుచుకున్నాయి. చప్పుడుకి కళ్ళు తెరిచి చూశాను.


పెద్దాడు వచ్చి కోపంగా" రాత్రిపూట మాకీ గోల ఏమిటీ? మమ్మల్ని పడుకోనివ్వరా .. ఏమిటీ? అంటూ డీవిడి ఆపి

“బుద్ది, జ్ఞానం ఉండాలి. ఏళ్ళొస్తే సరిపోదు" అని చాలా కోపంగా అరిచాడు.


ఆ మాటలు విని నేను తట్టుకోలేక ‘ఏంట్రా పెద్దాడా, తండ్రి అనే గౌరవం లేకుండా ఈ మాటలు ఏమిటీ’ అని అంటున్న నన్ను, నిలబడి ఉండగా ఒక్క తాపు తన్ని మంచం మీద పడేశాడు.


‘ఏదో ఇంత తిని పడిఉండక నీతి సూక్తులు వల్లీస్తావేంటీ..

కరెంటు బిల్లు ఎంతవుతోందో మీకు తెలుసా? పైగా మీ శనిగోల నాకు’ అంటూ విసవిసా వెళ్ళిపోయాడు”


ఆపై చెప్పలేక రామూ గొంతు మాట పెగలక దుఃఖం పొంగు

కొచ్చింది.


అది చూసిన నాగుకు నేత్రాలు చిప్పిల్లాయి. "ఏరా రామూ! పగవాడికి కూడా ఇంతటి కష్టం కానీ, శిక్ష కానీ వద్దురా! పసివాళ్ళే పెద్దాళ్ళైపోయి గుండెలమీద తంతే ఎలా ఓర్చుకున్నావురా? మిత్రమా! ఆ ఘోరం చూసి చెల్లాయి ఎంత తల్లడిల్లి పోయిందో! కళ్ళారా చూసేసింది” అన్నాడు నాగు గద్గద స్వరంతో జాలిగా రామారావును ఓదార్చుతూ.


"పార్వతి నిశ్చేష్టురాలై పోయింది . కళ్ళవెంట ధారాళంగా కన్నీరు. నాకేమో ప్రాణం పోయేట్లా ఉందప్పుడు. ఒక పక్క దగ్గు, ఆయాసం విపరీతంగా రాసాగింది. వెంటనే పార్వతి మాత్రలు తీసుకువచ్చి నోట్లో వేసింది. మెల్లగా మంచి నీళ్ళతో ఆ మాత్రలు మింగాను. కొంచెం సేపటికి తెప్పరిల్లి పార్వతి ఒడిలో తలపెట్టుకుని ఏడుస్తూ పడుకున్నాను.


అప్పుడు పార్వతి మెల్లగా తన దుఃఖాన్ని దిగమింగి నాతో “ఏవండీ! మనం ఎటైనా వెళ్ళి పోదాం. వీళ్ళకి భారంగా ఉండటమెందుకు. ఎవ్వరికీ తెలియని చోటికీ,ఎవ్వరికీ

కనబడనంత దూరం వెళ్ళిపోదాం” అంది చాలా స్థిర నిశ్చయంతో.


పార్వతీ! నువ్వేనా ఈ మాటలు అంటున్నది. మరి మన పిల్లలో..” అన్నాను నిరాశగా.


"గడ్డాలు వచ్చే వరకే మనపిల్లలు. ఆ తరవాత..... మీకు జరిగినది.... రేపు నాకు..” అనే లేపున నా చెయ్యి పార్వతి నోటికి అడ్డుగా పెట్టాను.


“వద్దు, పార్వతీ. ఇక పై ఆ మాటలు వినలేను" అన్నాను బాధగా.


"లేదండి. ఆ రోజు మీ మాట వినక ఆ అమ్మాయితో పెళ్ళి చేయించినందులకు నాకు తగిన శాస్తి జరిగింది. దానికి తగిన శిక్ష అనుభవిస్తున్నాను. మీ కాళ్ళకు దండం పెడతాను. మనం ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండవద్దు” అని గుండెలవిసేలా పడిపడి ఏడ్చింది. ఆ నాడు ప్రసవ వేదన చూసినా , బిడ్డ నవ్వు మొహం చూసిన వెంటనే మాయమయ్యింది. కానీ ఈనాడు రేగిన ఈ బడబాగ్ని జ్వాలను ఆర్పడం, అర్థం చేసుకోవడం ఎవ్వరితరం కాదు. అది స్త్రీకి భగవంతుడిచ్చిన శాపం. ఎవ్వరికీ చెప్పకుండా అర్ధరాత్రి ఇల్లువదలి బస్సులు పట్టుకుని ప్రయాణం చేసి హైదరాబాద్‍ చేరుకున్నాము” రామారావు కళ్ళవెంబడ అశ్రుధారలు కురుస్తున్నాయి.


"నాటకరంగాన్ని నీ నటనా వైధుష్యంతో వుర్రూతలూగించినవాడవు. సినిమాలలో మంచి పాత్రలు నటించినవాడవు. నీ కీ దుర్ఘతి ఏంట్రా? విధి నీ మీద ఇంతగా పగ పట్టిందా? విధి నీ మీద ఇంతలా వక్రీకరించిందా? నాకు ఫోన్‌ చెయ్యాలనిపించలేదా ? నాకు ఉత్తరం రాయాల్సింది. నాకు ఏదోవిధంగా సమాచరం అందివ్వలేకపోయావా”

నాగలింగం సూటిగా, ప్రేమతో కూడిన కోపంతో గట్టిగా అరిచాడు.


“నాగూ! నీ గురించి చాలా ప్రయత్నించానురా. నీ అడ్రస్‌, ఫోన్‌ నెంబరు కూడా దొరకలేదు.”

"సరే! తరవాత ఏమయింది?” అని నాగూ సిగరెట్‌ అందించాడు. కానీ రామూ వద్దన్నాడు.

నాగూని వారిస్తూ "వద్దురా నాగూ .... మానేశాను. ఆయాసం, దగ్గు వస్తోంది. ఇంక తరవాత ఎక్కడికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి. అన్నీ ప్రశ్నలే. జవాబులు లేనివి. పాత డైరీలు తిరగేస్తే , మనతో పాటు నాటకాలాడిన సత్యం అడ్రస్‌ దొరికింది. వెతుక్కుంటూ, వెతుక్కుంటూ వెళ్ళాము. పాపం వాడు కూడా ఎంతో ఆప్యాయంగా రెంజు రోజులు ఎంతో ఆదరంగా చూశారు. కానీ పట్టణంలో ఒక్క మనషి ఎక్కువైనా భారమే కద! వాడి భార్య ముభావంగా ఉండటం,చీటికిమాటికి వాడితో గొడవపెట్టుకోవడం ఎక్కువైపోయాయి.


మళ్ళీ మా కథ షరా మామూలే. ఏదైనా పనిగానీ, ఉద్యోగం కానీ దొరుకుతుందేమోనని తెగ తిరిగాను. ఈ వయస్సులో పని ఎవరిస్తారు? ఎవరు ఉద్యోగం ఇస్తారు. సత్యం ఇంటి ముందు ఓ పాతకాలపు దర్జీ ఉన్నాడు. అతని పేరు రమణ. అతనితో స్నేహం ఏర్పడింది. వీలు దొరికినప్పుడల్లా నా సీటు అక్కడే. అక్కడ కేరాఫ్‌ అడ్రస్‌ గాడినయ్యాను.


నా చరిత్రంతా వివరించాను. నా నాటకాల చరిత్రతో నాకో పెద్ద అభిమాని అయ్యాడు. వీలున్నప్పుడల్లా నాతో పద్యాలు పాడించుకునేవాడు. ఆఖరికి నన్ను బతిమాలి నాకు ఆసరా దొరికేవరకూ తిండి, మకాం కూడా అక్కడే అన్నిఏర్పాటు చేశాడు.


వాళ్ళావిడ కూడా సొంత అన్నగారివలె ఎంతో ఆప్యాయంగా చూసుకుంది. నేను కూడా ఒక దారీ తెన్నూ లేని నాబ్రతుక్కి ఇదే పెద్ద ఆసరా అనుకుని సరేనన్నాను.


జీవతం మెల్లగా ఇలా ఎడ్ల బండిలాగా కుదుపులతో నడుస్తోంది. రమణ కి అక్కడి బట్టలదుకాణాలలో, రెడీమేడ్‌షాపులలో మంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళకి

కావలసిన టైలరింగ్‌ పని, సైజ్‌లు చేసివ్వడం గట్రా. అక్కడే నా జీవితానికి చిన్న టర్నింగ్‌ పాయింట్‌. షాపు ముందు నుంచుని కొనుగోలుదార్లు షాపులోకి వచ్చేటట్లు

చేయడం. దానికి తగ్గట్టుగా ఒక జోకర్‌ గా తిరగి పాటలతో వాళ్ళని షాపుకు రప్పించాలి. పాపం రమణే ఆ జోకర్‌ కు కావలసిన బట్టతెచ్చి నా కు కుట్టి ఇచ్చాడు.


షాపు యజమాని నేను చేస్తున్న పని కి ఎంతో సంతోషపడ్డాడు. ఆ నాడు సరదాగా ఏవో కొన్ని వేషాలు సినిమాలలో వెయ్యడం, నాటకానుభవం ఈ నాడు నాకు మళ్ళీ ఇంత తిండి సంపాదించి పెడుతున్నాయి. ఆ నాడు రంగస్థలం పై నటిస్తూ డైలాగులు చెబుతూంటే ప్రేక్షకులు చప్పట్లు కొట్టేవారు. ఈ నాడు నాకు అదే జీవనాధారమైంది.


ఈనాడు జోకర్‌ వేషం వేసుకుని డాన్స్‌ చేస్తూంటే , అవే చప్పట్లు కొట్టి సంతోషిస్తున్నారిప్పుడు జనం. అప్పుడు నేను ఎక్కువగా పొందినవి జేజేలు

మాత్రమే. కానీ ఇప్పుడీ జోకర్‌ నటనకు పదిహేను వేలు ఇస్తున్నారు. ప్రశాంతంగా జీవనం సాగిపోతోంది. నీ చెల్లెలు పార్వతి అన్నీ మరిచిపోయి నాకోసమే తను, తన

కోసమే నేను బ్రతుకుతున్నాను. ఇదిరా నాగు, జరిగిన నా జీవనచరిత”

గుండెలనిండా గాలిపీల్చిన నాగు, “ఒరేయ్‌ రామూ-నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను. నీ ఆత్మవిశ్వాసానికి నా జోహార్లు. శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఒక్కసారి చెల్లాయిని చూడాలని ఉందిరా. నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళరా? " అన్నాడు ఎంతో ఉద్వేగంగా సజలనయనాలతో.


రామారావు అన్నాడు "తప్పకుండా వెళదాం. ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళాలంటే నానా యాతన పడాలిగానీ ఈ వెంకటాద్రి థియేటర్‌ ప్రక్క సందులో ఈ జోకర్‌ ఇళ్ళు

తెలియని వారే లేరు. సునాయసంగా మా ఇంటికి రావచ్చు. " అయితే చిన్న షరతు.

మా గురించి మా పిల్లల వద్దగానీ, వాళ్ళ విషయాలు నీ చెల్లాయి దగ్గర అస్సలు ప్రస్తావించకూడదు. మేము చచ్చామనే వాళ్ళ దష్టిలో ఉంది. ఆ సంగతి అలానే

ఉండనియ్యి. మేము చచ్చినా కూడా వాళ్ళకి కబురు పెట్టక్కర్లేదు. మేము వాళ్ళ దగ్గరికి

వెళ్ళం. వాళ్ళు మా దగ్గరకు రావద్దు. " అని నిష్కర్షగా నాగు తో రామూ చెప్పాడు.


మెల్లగా ఇద్దరూ హోటల్‌ నుంచి బయటకు వచ్చారు. "రామూ, సాయంత్రం తప్పకుండా మీ ఇంటికి వస్తాను". అని రామారావుకి చెప్పి నాగలింగం తన స్కూటర్‌ఎక్కి వెళ్ళిపోయాడు.


రామారావుకు కు కొండంతభారం గుండెలపై నుంచి దిగిపోయినట్ల అనిపించి, తన మిత్రుడిని కలుసుకున్నందులకు మనసారా ఆనందించి , షాపుకు వెళ్ళి జోకర్‌ మాస్క్ తగిలించుకుని సంతోషంగా డాన్స్‌ చేస్తూ జనాలని ఆకర్షిస్తూ, ఆనందింపజేస్తున్నాడు.

-------------------శుభంభూయాత్‌---------------------------------------

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.


185 views2 comments

2 commentaires


sunitha ys • 5 hours ago

Vaastavaaniki chaala daggaragavundi Hats off to the writer!

J'aime

balakameshwararao
balakameshwararao
15 nov. 2022

Story is good

J'aime
bottom of page