top of page

బుడ్డ మిరపకాయ

Updated: Aug 17

#పెనుమాకవసంత, #PenumakaVasantha, #BuddaMirapakaya, #బుడ్డమిరపకాయ, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

ree

Budda Mirapakaya - New Telugu Story Written By Penumaka Vasantha

Published In manatelugukathalu.com On 11/7/2025

బుడ్డ మిరపకాయ - తెలుగు కథ

రచన, కథా పఠనం: పెనుమాక వసంత

అనగనగా ఒక వూరిలో ఒక ముసలి అవ్వ ఉండేది. ఆవిడకు నా అనే వారు లేరు. దానితో 

ఆమె ఎపుడు బాధ పడుతూ... దేవుడ్ని "ఇన్నేళ్లుగా నీకుపూజలు చేస్తున్నాను. నాకు పెద్ద వయసయింది. నా బాగోగులు చూసేవారు లేరు. నేను పోతే.. నన్ను మట్టి చేయటానికి ఒక బుడతడ్ని ప్రసాదించు తండ్రి!" అని వేడుకుంటూ ఉండేది


 ఆరాత్రి ఆ ముసలవ్వకు కల్లో దేవుడు కనపడి "రేపు పొద్దున లేచి నువ్వు నీ ఇంట్లోని కుండ పై మూత తీసి చూడు. నువ్వు కోరుకున్నట్లు జరుగుతుంది" అన్నాడు. 

 

మరసటి రోజు లేవగానే కుండ తీసి చూస్తే అవ్వకు ఏమి కనపడలేదు. లోపలినుండి ఒక స్వరం వినబడింది. అవ్వ చెవులు రిక్కించి వింటే.. "అవ్వా! నేను బుడ్డ మిరపకాయను. చూడు నన్ను.. !" అన్న గొంతు విని ఏమి కనపడక కుండ లోపల 

వస్తువులను కింద విదిలించింది ఆశగా అవ్వ. 


చిన్న బుడతడు బుడ్డ మిరపకాయ అంతే వున్నాడు. ఆ వస్తువుల్లోంచి బయటకు వచ్చి అవ్వ చీరకొంగు లాగాడు. "అవ్వా నేను నీ మనవడిని వచ్చాను. నిన్ను చూసుకోవటానికి. "


అవ్వకు అపుడు తట్టింది 'రాత్రి దేవుడ్నిబుడతన్ని ప్రసాదించామంటే.. నిజంగా బుడ్డోడినీ ఇచ్చాడు. ఏదోకటి లే దేవుడిచ్చాడు!' అని సంతోషపడుతూ ఆ బుడ్డ మిరపకాయను ఎత్తుకుని ముద్దాడింది. 


"అవ్వా! నీకేమి చెయ్యాలో చెప్పు ఒక్క క్షణంలో చేస్తా!"


"అలాగే బుడతా! ఈ గేదెలను అడివికి తీసుకెళ్ళి మేపుకురా!" అంటూ కర్రకు చద్ది మూట తగిలించి "ఇది మధ్యాహ్నం తిను" అంటూ పంపింది అవ్వ, బుడ్డ మిరపకాయను. 



గేదెలను తీసుకుని అడవికి వెళ్ళాడు బుడ్డ మిరపకాయ. సూర్యుడు నెత్తి మీదకు రావటంతో అవ్వ ఇచ్చిన చద్ది తిని నిద్రపోయాడు. సూర్యుడు అస్తమించే సమయానికి గేదెలను తోలుకుని వద్దామని గేదెల దగ్గరకు వెళితే ఎవరో దొంగలు గేదెలకు పాలు పిండుతూ కనపడ్డారు. 


వాళ్ళను ఏమన్నా చేద్దామంటే... వేలేడంత మిరపకాయ ఏమి చేస్తాడు? ఆలోచించి గేదె తినే గడ్డిలో దూరాడు. గేదె గడ్డి తినగానే పొట్ట లోపలికి పోయి లోపల గేదెను గిచ్చుతుంటే.. ఆ బాధకు గేదె దొంగల్ని తన్ని నడ్డి విరగ గొట్టింది. తర్వాత పేడ వేయగానే బయటకు వచ్చాడు. ఇలా అన్ని గేదెల్లోకి వెళ్ళి దొంగలను తరిమికొట్టాడు. 


తర్వాత పక్కనున్న కుంటలో మునిగి కాసేపు ఈత కొట్టి ఒంటికి అంటిన పేడను పోగొట్టుకుని బయటికి వచ్చాడు. 


అన్ని గేదెలను తోలుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే "అవ్వా! ఆకలవుతుంది. అన్నం పెట్టు!" అన్నాడు. 


"మనవడా! నేను పేద దాన్ని. నాదగ్గర నీకు పెట్టటానికి ఏమి లేవు!"

 

"కొట్టుకు వెళ్ళి షావుకారు దగ్గర తెస్తా. ఏం కావాలో చెప్పు అవ్వా?" అంటే.. కావలసిన సరుకుల పేర్లు చెప్పింది అవ్వ.


కొట్టుకు వెళ్ళి షావుకారునీ సరుకులు అడిగితే.. "డబ్బులిస్తేనే సరుకులు కడతాను" అన్నాడు షావుకారు. 


 "నా వద్ద డబ్బులు లేవే! రేపు ఇస్తాను" అప్పు ఇవ్వమని అడిగాడు షావుకారును. 


బుడ్డ మిరపకాయను చూసి షావుకారు ఎగతాళి చేసాడు. 

"నువ్వు నాకు డబ్బులిస్తావా? డబ్బులంత పొడవులేవు!" అని పకపక నవ్వాడు. 


షావుకారు తల మీదకు ఎగిరి దూకాడు బుడ్డమిరపకాయ. షావుకారు మిరపకాయను తలనుండి తీసి విసిరి వేయబోతుంటే.. చటుక్కున చెవిలోకి దూరాడు. చెవిలో గులగుల లాడుతుంటే.. తీసి కింద వేసాడు. 


"ఇపుడు ఇస్తావా? లేదా నీ ముక్కులోకి దూరనా?"


"వద్దూ! నీకేమి కావాలో అవి ఇస్తాను" అంటూ ఇచ్చాడు షావుకారు. అవి తీసుకెళ్ళి అవ్వకిస్తే వండి పెట్టింది. అన్నం తిని హాయిగా నిద్రపోయాడు. 


మరుసటి రోజు రాజభటులు వచ్చి దండోరా వేస్తే.. వెళ్ళి విన్నాడు. 

"రాజకుమారి సునందినికీ స్వయం వరం. అన్ని యుద్ధ విద్యల్లో ఆరితేరినవారు ఎవరైనా పాల్గొనవచ్చు. కానీ ఓడిపోయిన వారికి శిక్ష పడుతుంది" అనే వార్త విని ఇంటికి వచ్చి అవ్వతో "నేను స్వయంవరంలో పాల్గొని గెలిచి రాజకుమారిని పెళ్లి చేసుకుంటాను" అన్నాడు. 


అవ్వ బోసి నోరంతా తెరిచి ఒకటే నవ్వింది. "నువ్వెక్కడా? అందగత్తే రాజకుమారి ఎక్కడా? అత్యాశ పనికి రాదంటూ!" హిత బోధ చేసింది. 


"అయినా నేను రాజధానికి వెళ్ళి పోటీల్లో పాల్గొంటాను. రాజకుమారిని చేపడతాను" అన్నాడు మొండిగా మిరపకాయ. 


"వెళ్ళు ఓడిపోయి వెయ్యి కొరడా దెబ్బలు తినిరా!" అంటూ నవ్వుతూ పంపింది అవ్వ. 


వెళ్తూ ఉంటే.. మార్గ మధ్యంలో అడవి తగలబడి మంటలు వస్తె.. వాటిని తన దోసిలిలోకి తీసుకుని నోరు తెరిస్తే.. అవన్నీ నోటిలోకి పోయాయి. నోరు మూసి ఇంకా ముందుకు వెళితే.. పెద్ద నదులు కనపడితే.. వాటిని దోసిలోకి తీసుకుని చెవుల్లోకి ఒంపుకున్నాడు. తర్వాతా తాపీగా నడుస్తూ రాజధాని చేరాడు బుడ్డ మిరపకాయ. 


అప్పటికే పోటీలు ఆరంభం అయ్యాయి. ఎందరో తమ నైపుణ్యాలు చూపిస్తున్నారు. కానీ చివరి పరిక్షలో ఓడిపోతున్నారు. ఆ ఆజానుబాహువుల మధ్య మన బుడ్డ మిరపకాయను చూసిన వారేలేరు. సునందిని ఎంతో అందంగా దండపట్టుకుని సిగ్గుపడుతూ నిల్చుని ఉంది. 


మన బుడ్డ మిరపకాయ చివరిగా తలపడటానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నవాళ్ళను ఓడించడానికి. అందరికీ మొదట కనపడలేదు. తర్వాత ఒక ఈగలాగా వాళ్ళ మీదకు వాలటం వాళ్ళ ముక్కులు కొరకటం. చెవులు గిల్లడం, బుగ్గల మీద రక్కటంతో బుడ్డ మిరప కాయని వదిలించుకునే క్రమములో వాళ్ళు కత్తిని వదిలేశారు. చివరికి విజయం పొందాడు వాళ్ళమీద బుడ్డ మిరపకాయ. 


అందరూ మిరపకాయను వింతగా చూస్తున్నారు. ఎవరీ? వింత మరగుజ్జు మనిషని!? 

 

తర్వాత కుస్తీ పోటీల్లో కూడా ఆ మల్ల యోధులను సైతం మీద పడి ఎక్కడ పడితే అక్కడ పిడిగుద్దులు గుద్ది వారిని మట్టి కరిపించాడు. అందరూ భలే నవ్వుతూ బుడ్డమిరపకాయను చూసారు. చివరకి విజయం పొందాడు. 


 కానీ రాజు ఈ వేలేడంతలేని ఈ బుడ్డ మిరపకాయకు తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయటానికి ఇష్టపడక... మిరపకాయను చెరసాలలో వేయమని ఆదేశించాడు. 


ఇక రాజుకు తన నిజ ప్రతాపం చూపించాలని ఎగిరి రాజు ఒళ్ళో కూచున్నాడు. 


"ఓ రాజా! నాకు నీ కుమార్తెను ఇచ్చి వివాహం చేయని ఎడల నిన్ను, నీ రాజ్యాన్ని సర్వ నాశనం చేస్తాను. "


"నన్నే ధిక్కరిస్తావా! ఎవరక్కడా? ముందు ఈ బుడతడన్ని పట్టుకుని బంధించండి!" అన్నాడు రాజు ఆవేశంగా. 


వెంటనే ఎగిరి స్తంభం మీద కూచుని ఒక్కసారిగా నోరు తెరిచాడు. నోటినుండి పెద్ద మంటలు రాజ దర్బారులోకి వ్యాపించాయి. ఆ మంటలకు తాళలేక.. అందరూ బయటికి

పరుగులు తీసారు. 


 రాజు కోపంతో రగిలిపోయి.. భటులను "ఆ స్తంభం మీదున్న ఆ మరగుజ్జును పట్టుకుని రండి. " అని ఆదేశించాడు. 


భటులు స్తంభాలు ఎక్కుతుంటే.. ఈసారి గట్టిగా చీదాడు. ముక్కునుండి వచ్చిన నీటితో దర్బారు సగం వరకు నిండింది. రాజు ఆ నీటిలో తేలుతూ! బతికుంటే... 

రాజ్యం ఏలుకోవచ్చనుకున్నాడు. 


"వెంటనే.. నీటిని కట్టడి చేయి. వివాహం జరిపిస్తాను నా కుమార్తెతో. కిందకు దిగిరమ్మని" బుడ్డమిరపకాయను వేడుకుంటే... కిందకు వచ్చి సునందినినీ వివాహం చేసుకున్నాడు బుడ్డ మిరపకాయ. 


వివాహం చేసుకున్న వెంటనే.. రాజకుమారుడులాగా మారిపోయాడు బుడ్డ మిరపకాయ. 


రాజు, ప్రజలు ఆశ్చర్యంగా చూస్తుంటే.. "తనకు శాపవిమోచనం అయిందంటూ!" రాజు కాళ్ళకు మొక్కాడు. 


"నేను ఇక్కడకు వందకోసుల దూరంలోనున్న మగధ దేశ యువరాజు ప్రతాప సింహుడును. ఒకరోజు మా దేశంలో జరుగుతున్న హోమంలో పాల్గొనటానికి వచ్చిన ఒక మరుగుజ్జు సాధువును చూసి ఎగతాళి చేసాను. ఆ సాధువు వెంటనే.. "నన్ను అవమానించిన నువ్వు.. ! నాకన్నా మరుగుజ్జువై.. వేలంత పొడవులో పుడతావు" అని శపించాడు. 

 

నేను పొరపాటైంది శాప విమోచనం చేయమని సాధువును కోరాను.


"నిన్ను ఎవరైనా పెళ్లాడితే.. నీకు శాప విమోచనం జరుగుతుంది. "


"కానీ నా రూపం చూసి నన్ను ఎవరు? పెళ్లాడతారూ?" అని ఆ సాధువు కాళ్ళు పట్టుకుని ప్రాధేయ పడితే... "నీకు కొన్ని శక్తులను ధార పోస్తాను. వాటితో విజయం సాధిస్తావు. 

దానితో పాటు మీ ఇలవేపును పూజించాలి. అపుడే.. నా శక్తులు నీకు ఉపకరిస్తాయి" అన్నాడు. 


"అపుడు నేను చేసిన పూజలకు మెచ్చి మా ఇలవేల్పు తన భక్తురాలికి అండగా ఉండమని కలలోకి వచ్చి ఆదేశించాడు. అవ్వకు నేను వేలెడంత రూపములో కుండలో దొరికాను" అంటూ తన కథను చెప్పటం ముగించాడు ప్రతాప సింహుడు. 


ప్రజల జయజయధ్వానాల మధ్యలో రాజకుమారిని గుర్రం ఎక్కించుకుని ముసలవ్వ దగ్గరకు వెళ్ళాడు. ఆమె సంతోషంతో దీవించింది ఇద్దర్ని. ఆమెను, రాజకుమారిని తీసుకుని తన రాజ్యానికి వెళ్ళాడు ప్రతాపసింహుడు. 



సమాప్తం


పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


Comments


bottom of page