చేతనైన సాయం

Chethanaina Saayam - Telugu Moral Story | B. Swathi Karunakar
చేతనైన సాయం - తెలుగు నైతిక కథ | బి. స్వాతి కరుణాకర్
Published in manatelugukathalu.com on 11/09/2026
“మనకు ఉన్నదానిలో కొంతైనా అవసరంలో ఉన్నవారికి పంచితే అదే నిజమైన మానవత్వం.”పేదరికం మనిషిని ఎన్నో కష్టాలకు గురిచేస్తుంది. అయినప్పటికీ ప్రేమ, బాధ్యత, త్యాగం ఉన్న మనసు మాత్రం ఎప్పుడూ గొప్పదే. అలాంటి మానవత్వాన్ని చాటిచెప్పే హృదయస్పర్శి తెలుగు కథ “చేతనైన సాయం”.
పక్షవాతంతో మంచాన పడిన భర్తను పోషించేందుకు మంగమ్మ ఒక ధనికుడి ఇంట్లో కుక్కను చూసుకునే పనిలో చేరుతుంది. అక్కడ తనకు లభించే ఆహారాన్ని కూడా తినకుండా భర్త కోసం తీసుకెళ్తుంది. అయితే ఆమె మంచితనాన్ని దొంగతనంగా అపార్థం చేసుకోవడంతో ఉద్యోగం కోల్పోతుంది. ఆ తర్వాత జరిగిన సంఘటన యజమాని ఆలోచననే మార్చేస్తుంది.
ఇతరులకు మనం చేయగలిగిన చిన్న సహాయం కూడా వారి జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలదు అనే విలువైన సందేశాన్ని ఈ కథ అందిస్తుంది.
మంగమ్మ ఒక పేదరాలు. తన ఇంట్లో తినడానికి సరుకులు లేని పరిస్థితి. ఒకప్పుడు తన కుటుంబాన్ని అంతా తన భర్త మల్లయ్య పోషించేవాడు. కానీ తనకు పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు.
మల్లయ్య బాధ్యత, హాస్పిటల్ ఖర్చులు అన్నీ తనకు తలకుమారిన భారంగా అయిపోయాయి మంగమ్మకు.
మల్లయ్య కూడబెట్టిన సొమ్ము అంటూ ఏమీ లేదు. మంగమ్మకు దిక్కుతోచక తను ఇంట్లో పని చేసుకుని బ్రతుకుదామని అనుకుంది. అలా తను పని కోసం రోడ్డు వెంబడి తిరగడం మొదలుపెట్టింది.
ఒకరి ఇంటి ముందు ఆగి చూస్తే అది ఒక పెద్ద ఇంద్రభవనం. ఈ ఇంట్లో చాలా కోటీశ్వరులు ఉన్నట్టున్నారు. వీరికి చాలామంది పనివాళ్ళు అవసరమై ఉంటారు. వెళ్లి ప్రయత్నం చేద్దామని ఇంటి ముందు గేటు దగ్గర వాచ్‌మెన్‌ను అడుగుతుంది.
తను మంగమ్మను చూసి "ఏం కావాలి...?" అని అడిగితే, "ఈ ఇంట్లో ఏమైనా పని ఉందేమో అని అడగడానికి వచ్చాను అయ్యా" అంటుంది.
"ప్రస్తుతం ఈ ఇంట్లో ఏ పనివాళ్ళు అవసరం లేదు. కుక్కను చూసుకోవడానికి ఒక మనిషి కావాలనుకున్నారు. మరి నీకు ఆ పని చేయడానికి ఇష్టమేనా?" అని అడుగుతాడు.
ఆ మాటకి మంగమ్మ తనకి ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న ఈ దుర్భర పరిస్థితుల్లో ఏ పనైనా సరే, తన భర్తకు, తనకు బుక్కెడు బువ్వ దొరికితే చాలు అని పనికి ఒప్పుకుంటుంది.
"అలాగే" అని మంగమ్మను యజమాని దగ్గరికి తీసుకెళ్లి పనిలో పెట్టిస్తాడు వాచ్‌మెన్.
మరుసటి రోజు నుండి పనిలోకి వస్తుంది మంగమ్మ. తనకు కుక్కను రోజు బాగా చూసుకోవాలి. దానికి సమయానికి భోజనాన్ని పెట్టాలి, స్నానం చేయించాలి అని పనిని పురమాయిస్తారు.
వాళ్ళు చెప్పినట్టుగానే రోజు కుక్కకు స్నానం చేయించి, బట్టలు వేసి దానికి సమయానికి భోజనం ఇస్తుంది మంగమ్మ.
ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటే ఒకరోజుకి కుక్కకు అయ్యే ఖర్చు నెల రోజులు పేదింటి భోజనానికి సరిపోతుంది అని మంగమ్మకి అర్థమైంది.
దానికి పెడిగ్రీ అని, మటన్, చికెన్ అలా మంచి మంచి తినే పదార్థాలు పెట్టేవారు. యజమానులతో సమానంగా కుక్కకు భోజనాన్ని వండేవారు.
మంగమ్మ... యజమానులు, కుక్క అందరూ తిన్నాక మిగిలిన భోజనం తినేది. తను ఇక్కడ మంచి భోజనం తింటున్నాను కదా... నా భర్తకి కూడా మంచి రుచికరమైన, ఆరోగ్యకరమైన పదార్థాలు తినిపించాలని, తనకి తినడానికి ఇచ్చిన పదార్థాలను తన భర్తకి రోజు కొంగుచాటున పెట్టుకొని తీసుకెళ్లేది. ఇలా రోజు వాచ్‌మెన్ గమనిస్తూ ఉంటే... తను ఇంట్లో నుంచి ఏదో దొంగిలించుకొపోతుంది అని అపార్థం చేసుకుని పనిలోంచి తీసివేస్తాడు.
మంగమ్మ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోతుంది. తనకు బ్రతకడానికి ఇంకో దారి లేక తను ఏం చేయలో తోచక తను రోడ్డుపై పక్షవాతం వచ్చిన తన భర్తని పక్కన కూర్చుబెట్టుకొని భిక్షం ఎత్తుకుంటుంది.
ఒకరోజు కార్లో యజమాని వెళుతూ మంగమ్మని, తన పక్కన కూర్చున్న భర్తని గమనించి కారు ఆపి, "ఏంటి... మంగమ్మ ఇక్కడ ఉన్నావు? రోజు ఏదో దొంగిలిస్తున్నావని వాచ్‌మెన్ పని నుండి తీసివేశాడని చెప్పాడు. నువ్వు ఏంటి ఈ పరిస్థితిలో ఇలా ఉన్నావు...?" అని ప్రశ్నించాడు.
"లేదు అయ్యా... నేను రోజు మిగిలిన భోజనాన్ని నేను తినకుండా నా భర్త కోసం తీసుకు వస్తున్నాను తప్పిస్తే నాకు ఎలాంటి దుర్బుద్ధి లేదు" అని ఏడవసాగింది.
అలాగే కారులో ఉన్న కుక్క విశ్వాసంతో మంగమ్మ పక్కన చేరి ఒళ్ళో కూర్చుంది.
అప్పుడు యజమాని తనలో తాను ఇలా ఆలోచించుకున్నాడు: 'నా ఇంట్లో ఒక కుక్క తినే భోజనం ఇలా పేదలకు పంచిపెడితే ఎంతో మంది పేదల ఆకలి తీరుతుంది. నా పరపతినే నేను చూసుకున్నాను.' అని ఆనాటి నుండి పేదల కోసం తనకు చేతనైనంత సహాయం చేసి రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకి అన్నదానం చేశాడు. ఎందరో ఆకలిని తీర్చాడు.
మనిషి పోకుడలకు పోకుండా తనకు ఉన్నంతలో చేతనైన సాయం చేయాలి. ఏమంటారు...?
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
బి స్వాతి కరుణాకర్ ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: నా పేరు బి స్వాతి కరుణాకర్,
నివాసం హైదరాబాద్,
విద్యాభ్యాసం MA, M.ed పూర్తి చేశాను. ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్నాను.
నాకు చిన్నప్పటినుండి సాహిత్యం అంటే ఎంతో అభిరుచి. తీరిక సమయాల్లో కవితలు, కథలు వ్రాయడం చాలా ఇష్టం. నా కవితా శరాలతో సమాజంలో చైతన్య దీప్తులు నింపాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదములు.🙏







Comments