చేతులు కాలాక
- Srinivasarao Jeedigunta
- 2 hours ago
- 5 min read
#Chethulu Kalaka, #చేతులు కాలాక, #JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguMoralStories, #తెలుగునీతికథలు

Chethulu Kalaka - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao Published In manatelugukathalu.com On 02/01/2026
చేతులు కాలాక - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
రాజారావు హేమలత కి వివాహం జరిగి యాభై సంవత్సరాలు అయినా యిద్దరి అభిప్రాయాలు కలవడం అనేది జరగలేదు. హేమలత కూడా ఉద్యోగం చేసి రిటైర్ అవ్వడం వలన సహజంగానే తన చెయ్యి కూడా పైనే ఉండాలి అనుకునే తత్త్వం. రోజుకి ఒకసారైనా యింట్లో గొడవలు తప్పవు.
అలా అని ఒకరిమీద ఒకరికి ప్రేమ లేదా అంటే కాదు, రాజారావు కి ఏమి కావాలో ముందే గ్రహించి అన్నీ సమకూర్చే హేమలత రాజారావు ఏదైనా ఒక మాట అంటే వదిలేయకుండా గంటలు గంటలు విషయాన్నీ సాగదిస్తుంది. దానితో గొడవ మొదలు. అయితే వాళ్లలో వున్న మంచి గుణం ఎంత పెద్ద గొడవ అయినా యిట్టే కలిసిపోవడం.
వీళ్ళకి ఒక కూతురు, ఒక కొడుకు. యిద్దరు పిల్లలూ ఇంజనీరింగ్ చదువుకోవాలి అని తల్లిదండ్రులుగా కోరుకునే వాళ్ళు. అయితే కూతురు ఒకసారి ఎంసెట్ రాసి సరైన ర్యాంక్ రాకపోవడం తో ఎంసి ఏ చేసింది. కొడుకుకి ఇంజనీరింగ్ అంటే ఇష్టం లేకో లేకపోతే మరే ఇంట్రెస్ట్ వలనో ఏంబీ ఏ చదువుతాను అని అనటంతో వాళ్ళని తమకి ఉన్నంతలో బాగానే చూసుకుని పెంచారు.
కూతురు సుమ ఎందుకో తల్లిదండ్రులు తనని సరిగ్గా చూడటం లేదు అని, ప్రేమ అంతా తమ్ముడు వాసు మీద చూపిస్తున్నారు అని ఒక అసంతృప్తి తో ఉండేది.
రాజారావు కూతురు చదువు గురించి ఎక్కువగా పట్టించుకునే వాడు కాదు. తనకి చెప్పక్కర్లేకుండానే చదువుకుని అన్ని క్లాసులు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేది.
కొడుకు శ్రీధర్ కి ఒక ఐడియా అంటూ లేకుండా చదవేవాడు. అయితే రాజారావు తల్లిదండ్రుల దీవెనల వలన రాజారావు పిల్లలిద్దరూ మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు.
రాజారావు కూతురికి వివాహం జరిగి కెనడా లో సెటిల్ అయ్యింది. కొడుకు శ్రీధర్ చెన్నై లో సెటిల్ అయ్యాడు.
రాజారావు దంపతులు అప్పుడప్పుడు కూతురు దగ్గర కొన్నాళ్ళు, కొడుకు దగ్గర కొన్నాళ్ళు వుండి, తిరిగి హైదరాబాద్ వచ్చేసి యిద్దరూ ఉండేవారు.
కూతురు కి రాజారావు కి ఒక్క నిమిషం పడేది కాదు. రాజారావు కూతురు సుమకి ఆవేశం ఎక్కువ అవ్వడం తో తల్లిదండ్రులు అని కూడా చూడకుండా మాట్లాడేది. తరువాత గంటకు మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి సారీ చెప్పేది. అక్కడ వున్న రోజులు అన్నీ యిదే తంతు.
యిహ యిటు కూతురు కి చెప్పలేక అటు భర్తకి చెప్పలేక చివరికి కోపం భర్త మీద చూపించేది హేమలత.
కొడుకు శ్రీధర్ కి ఫోన్ చేసి మీ నాన్న కోడిపుంజులా ఎగురుతున్నారు. మేము రాలేమన్నా పిలవడం, రెండు రోజులు బాగుండి రోజూ తండ్రి కూతురు పొట్లాడుకోవడం.. ఇంటికి వచ్చిన తరువాత సోఫాలో కాళ్ళు జాపుకుని పడుకోవడం తప్ప ఒక్క సహాయం లేదు మీ నాన్న.
బజారు కి కూడా వెళ్లకుండా అన్నీ ఆన్లైన్ లో తెప్పించడం, ఏదైనా అయిపోయాయి అంటే మళ్ళీ కావాలంటే ఎలా మొన్ననే తెప్పించాను కదా అని గొడవ పెడుతున్నారు అని భర్త మీద చెప్పేది.
నాలుగు రూపాయలు సంపాదించడం తెలిసిన తరువాత ఇంకేముంది తల్లిని తండ్రి ఏదో బాధపెడుతున్నాడునుకుని తండ్రికి క్లాస్ పీకడం చేసేవాడు శ్రీధర్.
“అంటే మీ అమ్మ అన్నీ నీకు చెప్పేస్తోంది అన్నమాట. మీ అమ్మ కి డబ్బులు ఎలా వస్తున్నాయో తెలియటం లేదు అనే వాడిని తప్ప ఇంటికి కావలిసినవి అన్నీ కొనేవాడిని. అయినా నా మీద తనకి ఏదో అసంతృప్తి” అని కొడుకు కి చెప్పేవాడు రాజారావు.
ఆరోజు మామూలుగా మాట మీద మాట పెరిగి రాజారావు అన్నం తినకుండా పడుకున్నాడు. ఉదయం ముందుగా లేచిన హేమలత టేబుల్ మీద వండిన వంటలు అలాగే ఉండటం తో ‘అలిగి ఎవరిని సాధిద్దాం అనుకుంటున్నారో’ అనుకుంది.
ఉదయం పదిగంటలు అయినా భర్త లేవకపోవడంతో “పనిమనిషి వచ్చి మీ గది తుడవకుండా వెళ్ళిపోయింది లేవండి” అని అరిచింది.
అయినా భర్త కదలకుండా ఉండటం తో అనుమానం తో చూస్తే కళ్ళు తేలేసి చలనం లేకుండా వున్న రాజారావు ని చూసి కంగారుగా చుట్టుపక్కల వున్న వాళ్ళని పిలిచింది.
ఏ అర్ధరాత్రో రాజారావు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పిల్లలు వచ్చి చెయ్యాలిసిన కార్యక్రమం చేశారు.
“అమ్మని నాతో తీసుకుని వెళ్తాను” అంది హేమలత కూతురు సుమ.
“అంత దూరం ఎందుకు నాతో తీసుకుని వెళ్తాను” అన్నాడు శ్రీధర్ తన అక్కయ్యతో.
“నీకేనా అమ్మ. నాకు కూడా అమ్మే, నాతో తీసుకుని వెళ్లి కొన్నాళ్ళ తరువాత పంపుతాను, ఆ తరువాత నీ దగ్గరే ఉంటుంది కదా” అని తనతో తీసుకుని వెళ్ళిపోయింది.
యిల్లు తాళం వేసి శ్రీధర్ చెన్నై వెళ్ళిపోయాడు.
‘పోనిలే నాన్న గొడవ అమ్మకి తప్పింది, యిప్పుడేనా సుఖంగా ఉంటుంది’ అనుకున్నాడు.
కెనడాలో మొదటి వారం బాగానే గడిచింది హేమలత కి. అయితే ప్రతి నిమిషం భర్త సోఫాలో పడుకుని వున్నట్టే అనిపించేది. తను పూజలో ఉంటే పాపం టిఫిన్, టిఫిన్ లోకి కావలిసిన పచ్చడి చేసుకునే వారే కాని ఎప్పుడు నేను చెయ్యలేదు అనే వాడు కాదు.
ఓపిక లేదంటే హోటల్ నుంచి భోజనం తెప్పించేవారు. ఎంతో ఆరోగ్యం గా వున్న భర్త అలా సడన్ గా చనిపోవడం ఏమిటో అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది.
“అలా ఏడుస్తూ కూర్చుంటే ఏమి లాభం అమ్మా? లేచి కొద్దిగా వంట పని చూడు. నాకు ఆఫీస్ వర్క్ ఎక్కువగా వుంది” అనటం తో మెల్లగా వంట గదిలోకి వెళ్ళింది.
ఫ్రీజ్ లో చూస్తే ఎప్పుడు తెచ్చారో అతి తక్కువ కూరగాయలు ఉండటం తో రెండు మూడు రకాలు కలిపి కూర చేసింది.
భోజనం కి కూతురు అల్లుడు ఎంతవరకు రాకుండా పని చేసుకుంటున్నారు, తను తినాలో లేదో తెలియక అయోమయం లో వుంది హేమలత.
“నువ్వు ముందు తినేసి రెస్ట్ తీసుకో, నాకు లేట్ అవుతుంది” అని అనే వారే గాని తనకోసం ఆగమని అనుకునే వాడు కాదు భర్త.
‘ఏమిటో యిక్కడ అన్నీ కూతురు ని అడిగితే కాని చేసే స్వేచ్ఛ ఉండటం లేదు’ అనుకునేది హేమలత.
రోజులు గడుస్తున్న కొద్దీ నడుం నొప్పి ఎక్కువ ఉండటం హాస్పిటల్ సౌకర్యం లేకపోవడం తో హేమలత, కూతురు ని ఒప్పించి ఇండియా వచ్చేసి హైదరాబాద్ లో తన ఇంటికి చేరుకుంది.
అల్మారా లో భర్త మెడిసిన్స్ డబ్బా చూసి, ‘తన పెళ్లి అయిన దగ్గర నుంచి ఏ ఆస్తి కొన్నా తన పేరున ఉంచుకోకుండా నా పేరు మీద పెట్టేవారు, ఒక్క వంట బాగా ఉండాలి అనే గొడవ పెట్టినా మళ్ళీ అయిదు నిమిషాలలో కోపం తగ్గి మామూలుగా వుండేవారు, యిప్పుడు ఇల్లంతా బోసిపోయింది’ అనుకుంటూ మంచం మీద పడుకుని రాజారావు గురించి తలచుకుని బాధపడింది హేమలత.
“ఎందుకమ్మా అక్కడ ఒంటరిగా ఉండటం. టికెట్ బుక్ చేస్తాను. చెన్నై వచ్చేసేయి” అని కొడుకు అడగటం తో కొడుకు దగ్గరికి వెళ్ళింది…
“ఇదిగో ఇంటికి చుట్టాలు వచ్చారు, నువ్వు పనికి త్వరగా రావాలి” అని పనిమనిషి కి చెప్తున్న కోడలు మాట విని ‘అంటే ఈ యింట్లో నేను చుట్టాన్ని అన్నమాట, ఏమిటో నా రాత ఎలా వుందో’ అనుకుంది.
మొదట్లో కొన్నాళ్ళు బాగానే నడిచింది. కొడుకు ఆఫీస్ నుంచి రాగానే “అమ్మా కొద్దిగా మంచి నీళ్లు యిచ్చి కాఫీ పెట్టవా” అని అడగటం, సరే అని లేచి వంటగదిలోకి వెళ్లి స్టవ్ వెలిగిస్తో వుంటే కోడలు వచ్చి “ఆయన పనులు చూడటానికి నేను వున్నాను, మీకెందుకు” అనటం తో “పోనిలే తల్లి ఎవ్వరు చేస్తే ఏముంది” అంది హేమలత వంట గదిలో నుంచి బయటకు వస్తో.
తన గదిలో కూర్చొని భాగవతం చదువుకుంటున్న తల్లిని చూసి “అమ్మా కాఫీ అడిగాను మర్చిపోయావా” అన్నాడు శ్రీధర్.
“మీ ఆవిడ యిస్తాను అంది రా, యివ్వలేదా” అంది హేమలత.
“తను టీవీ చూస్తోంది, రోజూ నువ్వే యివమ్మా” అన్నాడు.
“ఏమిటో ఆయన వున్న రోజుల్లో మహారాణి లా వున్నాను. ఆయన పోయిన తరువాత తను లేని లోటు తెలుస్తోంది. మొన్న కాలనిలో ఒకరు పేరంటం కి పిలవడానికి వచ్చి కోడలికి బొట్టు పెట్టి తనకి పెట్టబోతోవుంటే, ‘మా మామయ్యగారు లేరు. ఆవిడకి బొట్టు వద్దులెండీ, నాతో తీసుకుని వస్తాను మా అత్తగారిని” అన్నప్పుడు తెలిసింది నాకు ఆయన లేకపోతే నా విలువ ఏమిటో అని బాధపడింది హేమలత.
“ఎందుకమ్మా ఆలా వున్నావు, నీకు యిక్కడ నచ్చకపోతే హైదరాబాద్ వెళ్లి మన ఇంట్లోనే వుండు. నేనే అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తాను” అన్న కొడుకు మాటలకు “అవును రా. ఒక సారి పెళ్లి అయిన తరువాత ఆడదానికి మొగుడే దిక్కు, తన ఒడిలో పెరిగి పెద్దవాళ్ళు అయిన పిల్లలకు కూడా తల్లిదండ్రుల వునికి బరువుగానే ఉంటుంది. ఈ నిజం తెలియక భర్త ఏదో అన్నాడు అని భర్త మీద పిల్లలకి చెప్పుకుని లోకువ అవ్వడం, మొగుడు పోయిన తరువాత అందరికి భారంగా అనిపించడం దురదృష్టం.
బతికివున్నన్నాళ్లు ఒకరిని ఒకరు లోకువ చేసుకోకుండా వుండే భార్య భర్తలు మిగిలిన జీవితం లో కూడా పోయిన వారి తీపిగుర్తులతో కాలం గడిపేసేయవచ్చు కదా. నాకు మీ నాన్న నా భద్రత కోసం నా పేరున యిల్లు కొన్నారు. ఆ ఇల్లే నాకు స్వర్గం. మీ నాన్న ఉన్నట్లే అనుకుని ఆయనని తలచుకుంటో మిగిలిన జీవితం గడిపేస్తాను” అని హైదరాబాద్ బయలుదేరింది.
“ఏమిటమ్మా అంతా నీ యిష్టం ప్రకారం నన్ను పెంచావు, నాకంటూ ఒక అభిప్రాయం లేకుండా చేసి యిప్పుడు పెళ్లి అయిన తరువాత కూడా నువ్వు చెప్పినట్లు ఉండాలి అంటే ఎలా” అంటున్న కొడుకు ని చూసి తెల్లబోయింది. నేను నాన్నని యిష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు నాన్న కూడా నాలాగే బాధపడి ఉంటాడు కదా అనుకుంది.
ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి నీరసంగా వంటగదిలోకి వెళ్ళాడు కాఫీ కలుపుకోవడానికి శ్రీధర్. హాల్ లో ఏదో హిందీ సినిమా చూస్తో నవ్వుకుంటున్న భార్య పిల్లల గొంతులు వినిపించడం, అమ్మ ఉంటే రాగానే మంచి నీళ్ల గ్లాస్ తో ఎదురు వచ్చేది కదా అనుకున్నాడు.
మొగుడు పెళ్ళాం మధ్య గొడవలు వున్నా ఎదుటి వారి ముందు చివరికి కడుపున పుట్టిన పిల్లలకు కూడా తెలియనివ్వకూడదు.
జీవితం రంగులరాట్నం. మీ తల్లిదండ్రులని అగౌరవపరిస్తే రేపు మీ పిల్లలతో కూడా మీకు దక్కేది అదే.
సమాప్తం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


