చిట్టి చేతులు
- Palla Venkata Ramarao

- 4 days ago
- 4 min read
#పల్లావెంకటరామారావు, #చిట్టిచేతులు, #పుస్తకసమీక్ష, #TeluguBookReview

చిట్టి చేతులు-బాలల కథల సంపుటి-పుస్తక సమీక్ష-పుట్టా ఓబులేసు
Chitti Chethulu- Review By PUtta Obulesu Published on 12/12/2025
చిట్టి చేతులు - సమీక్ష
రచన: పుట్టా ఓబులేసు
సమర్పణ: పల్లా వెంకట రామారావు
మెరుపు మెరిస్తే,
వాన కురిస్తే,
ఆకాశమున హరివిల్లు విరిస్తే,
అవి మీకే అని ఆనందించే కూనల్లారా!! అంటూ బుడిబుడి నడకల బుజ్జాయిల స్వచ్ఛమైన మనసు గురించి తనదైన శైలిలో వర్ణిస్తారు మహాకవి శ్రీశ్రీ, తన శైశవగీతిలో..!. పసి పిల్లల మనసు తెల్ల కాగితం లాంటిదని, దానిని "టబులరస"అంటారని, అలాంటి మనస్సులో ఎలాంటి ఆలోచనలు ప్రవేశపెడితే అవే అభివృద్ధి చెందుతాయని వివరిస్తోంది మనోవిజ్ఞాన శాస్త్రం.
జాలి, దయ, ప్రేమ, నిజాయితీ, పరోపకారం, సహకారం, పట్టుదల, ధైర్యం, స్వీయ క్రమశిక్షణ లాంటి విశ్వ మానవీయ విలువలను ఔదలదాల్చి, రేపటి పౌరులగా బలమైన జాతి నిర్మాణానికి ఇరుసుగా మారాల్సిన నేటి బాలలు, అందుకు పూర్తివిభిన్నమైన మార్గంలో ప్రయాణించడం శోచనీయం.
సామాజిక మాధ్యమాల విష కౌగిలిలో నేటితరం బాల్యం బందీగా మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమాలు కూడా అందుకు ఆజ్యం పోస్తున్నాయి. నాణేనికి బొమ్మ,బొరుసు ఉన్న చందంగా సామాజిక మాధ్యమాల ద్వారా ఒకరి భావాలను మరొకరు పంచుకోవడం, ప్రపంచంలో జరిగే సమస్త విషయాలను క్షణాల్లో తెలుసుకోవడానికి, ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్లడం లాంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. కానీ నేటి బాలలు సామాజిక మాధ్యమాల ద్వారా నేర ప్రవృత్తితో కూడిన దృశ్యాలు, కార్టూన్ నెట్వర్క్ వీడియోలు, అశ్లీల వీడియోలను వీక్షిస్తూ వాటికి బానిసలుగా మారుతున్నారు. ఇది సరి కాదని ఇంట్లో తల్లిదండ్రులు పాఠశాలలో ఉపాధ్యాయులు ఎంత మొత్తుకున్నప్పటికీ వారి మాటలు పెడచెవిన పెడుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో వారిపైకే తిరగబడి దాడులు చేస్తున్నారు.
ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మాయలో పడి ఏది మంచి ఏది చెడు అన్నది తెలుసుకోలేనంత దయనీయ స్థితికి నేటి బాలలు దిగజారి జాతి భవితకు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నారు అనడంలో సందేహం లేదు. ఇలాంటి సంధి కాలంలో బాల బాలికల మానసిక వికాసాన్ని పెంపొందించడానికి బాల సాహిత్యం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పటికే పత్రికలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, చిన్నచిన్న కథలు,కవితలు, నాటికల వంటి ప్రక్రియల ద్వారా బాల సాహిత్యాన్ని వికసింపచేస్తూ, నేటి బాలల సంపూర్ణ మూర్తిమత్వాభివృద్ధికి ఇతోధిక కృషి చేస్తున్నాయి. వ్యక్తిగతంగా కూడా అనేకమంది రచయితలు, కవులు బాలసాహిత్యాన్ని సృజయిస్తూ బాలల భవితను బంగారుమయం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఆ కోవలోకే వస్తారు కవి, రచయిత పల్లా వెంకట రామారావు.
తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, విద్యార్థులకు నాణ్యమైన బోధను అందిస్తూనే, నేటి బాలల స్థితిగతులను దగ్గరగా పరిశీలించి, వారి ఉజ్వల భవిష్యత్తును కాంక్షించి "చిట్టి చేతులు"అన్న పేరుతో ఈ రచయిత ఒక కథల పుస్తకాన్ని ప్రచురించారు. ఇందులో 23 కథలు ఉన్నాయి. ఈ కథలన్నీ విభిన్న పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆకర్షణీయమైన రంగుల్లో మనసును హత్తుకునే విధంగా రూపొందించిన ముఖచిత్రంతో చూడచక్కగా ఉంది. పరిమాణంలో చక్కగా ఉన్నప్పటికీ పుస్తకాన్ని తెరిచి అందులోని కథలను చదివిన కొద్ది "పిట్ట కొంచెం కూతఘనం"అన్న చందంగా ఆ పుస్తకం బాలల మనోవికాసానికి కలిగించే ప్రయోజనాలెంటో మనకు అవగతం అవుతుంది.
అనాది నుండి మానవులంతా సమానమేనని ఎంతమంది, ఎన్నిసార్లు చెప్పినప్పటికీ, నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కూడా కుల, మత, జాతి, వర్గాల పేర్లతో మీరు తక్కువ మేము ఎక్కువ అంటూ మానవులంతా ఒకరినొకరు కలహించుకోవడం మనం ఎన్నో సందర్భాలలో చూస్తుంటాం. కానీ ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అని భావించడం సరికాదని, ఎవరి గొప్పదనం వారికుంటుందన్న విషయాన్ని "అందం"అనే కథలో "ఉమ్మెత్త మొక్క"ద్వారా రచయిత తనదైన శైలిలో చాటి చెప్పారు.
మనం చేసే పని ఏదైనా, ఆ పనిలోకి మనం ప్రవేశించడానికన్నా ముందే ఒక కట్టుదిట్టమైన కార్యచరణ ప్రణాళిక, వ్యూహం రూపొందించుకోవాలి. అప్పుడే మనం చేస్తున్న పనిలో మంచి ఫలితాలను సాధించగలం, అలా కాని పక్షంలో ఫలితాలు నిరాశజనకంగా ఉంటాయన్న విషయాన్ని"విజయం"అన్న కథలో మంత్రి సామంతుడి కుమారుడు విజయుడి ద్వారా చక్కగా తెలియజేశారు. పరీక్షల్లో విజయం సాధించలేక, నిర్వేదంలోకి జారిపోతున్న నేటి విద్యార్థి లోకమంతా విజయుడి లాగా నిశిత పరిశీలన, సునిశిత ఆలోచన, కుశాగ్ర బుద్ధి, కట్టదిట్టమైన ఆచరణ లాంటి లక్షణాలు, అలవరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కష్టపడి సంపాదించిన డబ్బు కలకాలం ఉంటుంది. ఎలాంటి శ్రమ లేకుండా సంపాదించిన డబ్బు ఎంతో కాలం నిలవదు అన్న లోకోక్తిని"దురాశ"అన్న కథలో సురేష్ అన్న పోలీసు పాత్ర ద్వారా కళ్లకు కట్టినట్లుగా రచయిత విశదీకరించారు. విద్యార్థులైన నేటి బాల బాలికలు కూడా ఎలాంటి శ్రమలేకుండా తాము ఆశించిన రంగంలో అద్భుతమైన ఫలితాలు రావాలని ఆశిస్తుంటారు. అలా ఆశించడం సరికాదని రచయిత ఈ కథ ద్వారా తెలిపారు.
దేశభక్తి అంటే దేశం కోసం ఆయుధాలు చేతబట్టి సరిహద్దుల్లోకి వెళ్లి పోరాడడమే కాదు, దేశంలోని వనరులను అవసరమైనంత మేరకే వాడి, భావితరాల వారి సుస్థిర ప్రగతికి బాటలు వేయడం కూడా అన్న విశాల దృక్పథాన్ని"నిర్లక్ష్యం ఖరీదు"అన్న కథలో వెంకటేష్, రమేష్ పాత్రల ద్వారా రచయిత విపులీకించారు. నేటి చిన్నారుల్లో కూడా నేను సుఖంగా ఉంటే చాలు అన్న స్వార్థచింతన మొగ్గతొడుగుతూ ఉంది. కానీ "అందరూ బాగుండాలి అందులో నేనుండాలి"అన్న వసుదైక భావన అలవరుచుకోవాల్సి అవసరం ఉంది.
ఈ భూగోళం కేవలం మానవులకు మాత్రమే సొంతం కాదు, జంతువులు, పశుపక్షాధులు, క్రిమి కీటకాలు.... ఇలా సమస్త జీవరాశికి నిలయం. కాబట్టి ప్రతి జీవరాశికి జీవించే అవకాశం కల్పించాలి, భూత దయను కలిగి ఉండాలి అన్న భావనను"చిట్టి చేతులు"అన్న కథ ద్వారా అభి, అతని మిత్రుల ద్వారా, వారు జంతు సంక్షేమానికి చేపట్టిన చర్యల ద్వారా రచయిత సమాజానికి, బాల బాలికలకు అద్భుత కథనంతో వివరించారు. ఈ కథను సూక్ష్మంగా పరిశీలించినప్పుడు రచయితలో అంతర్నీహితంగా ఉన్న పర్యావరణ ప్రేమికుడు కనిపిస్తాడు.
మంచివైపు కన్నా చెడు వైపుకు ఆకర్షితులవ్వడం చాలా సులభం. పాఠశాల విద్యార్థులలో కూడా కొంతమంది పొగాకు, గుట్కా, గంజాయి, సిగరెట్, మద్యం, ఆన్లైన్ బెట్టింగ్ లాంటి దురవ్యసనాలకు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును చేజేతుల బుగ్గిపాలు చేసుకుంటున్నారు. దురలవాట్లకు లోను కావడం వల్ల పర్యవసానాలు ఎలా ఉంటాయో, వాటిని ఏ విధంగా వదిలించుకోవాలో"మొక్కై వంగనిది మానై వంగునా"అన్న కథలో శివ పాత్ర ద్వారా రచయిత అద్భుతమైన కథనంతో వివరించారు. ఇందులో రచయితకు సమాజహితాన్ని కాంక్షించే సంస్కర్త హృదయం ఉన్నట్లుగా గోచరిస్తుంది.
ఇలా కథలన్నీ ఎక్కడ పట్టుసడలకుండా ఏకబిగిన చదవాలి అని ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పాఠకుల ఆలోచన పరిధిని విస్తృతం చేస్తాయి. ప్రతి కథని రాయడంలో రచయిత పల్లా రామారావు ప్రదర్శించిన నైపుణ్యం, కథ, కథనంలో ఆయన తీసుకున్న జాగ్రత్తలు, ప్రతి కథలో సూక్ష్మంగా, అంతర్లీనంగా నైతిక విలువల బీజాలను పసి మనసులో నాటేందుకు ఆయన చేసిన అధ్యయనం రచయితగా ఆయనని ఒక మెట్టు పైన నిలబెడుతుంది.
ఈ కథల్లో ఒక పాఠకుడిగా రచయిత సునిశిత పరిశీలనాశక్తి, విశ్వ మానవీయ విలువలను ఎంతో చాకచక్యంతో నైపుణ్యంతో పాఠకుల మనసులలో చూపించిన తీరు నన్ను సూదంటు రాయిలా ఆకర్షించాయి. రచయిత స్వయంగా ఉపాధ్యాయుడు కావడం కూడా ఇందుకు కారణం కావచ్చు ఏమో! ఏదేమైనా రాయాలన్న బలమైన తపన, సంకల్పం ఉన్న రచయితలు మాత్రమే ఇంతటి అద్భుతమైన కథలు రాయగలరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
కథలలో రచయిత వాడిన భాషలో సరళత్వం, కథనంలో వైవిద్యం, సూక్ష్మంలో మోక్షం లా చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెప్పే రచనా శైలి లాంటి లక్షణాలు "చిట్టి చేతులు"పుస్తకానికి మరింత వన్నెతెచ్చాయి. ఈ విధంగా తన రచన కౌశలంతో "చిట్టి చేతులు"పుస్తకం ద్వారా బాల సాహిత్యంలో సూతన ఒరవడి సృష్టించిన రచయిత పల్లా వెంకట రామారావు అభినందనీయులు. చిట్టి చేతులు పుస్తకాన్ని చదివి, ఆ పుస్తకంలో అంతరార్థాన్ని అవగతం చేసుకున్నప్పుడు "నదులు, కవులు, భూగోళపు రక్తనాళాలు" అన్న గుంటూరు శేషేంద్రశర్మ గారి మాటలు అక్షరసత్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
- పుట్టా ఓబులేసు.
ప్రతులకు:
పల్లా వెంకట రామారావు,
14/10, శ్రీనివాస పురం, వైఎంఆర్ కాలనీ, ప్రొద్దుటూరు.516360.
కడప జిల్లా.
మొబైల్: 9949043019
పల్లా వెంకట రామారావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Podcast Link:
Youtube Play List Link:
పేరు: కాశీవరపు వెంకటసుబ్బయ్య
చదువు: B.com
పుట్టిన తేది: 1960
తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య
రచనలు: ఎద మీటిన రాగాలు కవితా సంపుటి.
అముద్రితాలు: తుమ్మెద పదాలు మని కవితలు సంపుటి, పినాకిని కథలు కథల సంపుటి.
సాహిత్య సేవ: చైతన్య సాహిత్య కళా వేదిక సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.
సన్మానాలు సత్కారాలు: అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు సత్కారాలు పొందడం.




Comments