top of page
Original.png

చూపుడు వేలు

#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #ChupuduVelu, #చూపుడువేలు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Chupudu Velu - New Telugu Story Written By Vasundhara Rani Munipalle Published in manatelugukathalu.com on 12/02/2026

చూపుడు వేలు తెలుగు కథ

రచన: వసుంధర రాణి మునిపల్లె 


​అనంతయ్య గారు రిటైర్డ్ అధికారి. ఆయనకు క్రమశిక్షణ అంటే ఇతరుల తప్పులను ఎత్తిచూపడమే. ఆయన చూపుడు వేలు ఎప్పుడూ ఎవరినో ఒకరిని దోషిగా నిలబెడుతూనే ఉంటుంది. డ్రైవర్ రాము ఆయన దగ్గర ముప్పై ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అనంతయ్య గారి కఠినత్వాన్ని దగ్గరుండి చూసిన వ్యక్తి రాము.


​ఒకరోజు అనంతయ్య గారి భార్య పుట్టింటికి వెళ్ళింది. ఇంట్లో అనంతయ్య గారు, పని కుర్రాడు శ్రీను మాత్రమే ఉన్నారు. ముందు రోజు అనంతయ్య గారు టేబుల్ మీద పెట్టిన పదివేల రూపాయలు కనిపించలేదు. ఆయన వెంటనే శ్రీను వైపు తన చూపుడు వేలు చూపిస్తూ, నువ్వే తీశావు, నీలాంటి వాళ్ల బుద్ధి ఇంతే. మీ నాన్న కూడా నీలాగే దొంగ అనుకుంటా. ఈరోజే నిన్ను పోలీసులకు అప్పగిస్తాను అంటూ కాలనీ అంతా వినేలా అరిచి, అతడిని దారుణంగా అవమానించారు. శ్రీను ఎంతగా ఏడ్చినా, నేను తీయలేదు బాబూ అని కాళ్ళావేళ్ళా పడ్డా, అనంతయ్య గారు వినలేదు. భయం, అవమానంతో శ్రీను అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు.


​అనంతయ్య గారి భార్య ఊరి నుండి తిరిగి వచ్చింది. ఆమె రాగానే అనంతయ్య గారు జరిగిన గొడవ గురించి చెబుతూ శ్రీనును తిట్టడం మొదలుపెట్టారు. ఆమె కంగారుగా బీరువా తెరిచి, అయ్యో! నిన్న నేను ఊరికి వెళ్లే హడావిడిలో టేబుల్ మీద ఉన్న డబ్బులు పోతాయని నేనే తీసి బీరువాలో పెట్టాను. మీకు చెబుదామనుకున్నాను కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అని చెప్పింది.


ఆ మాట వినగానే అనంతయ్య గారికి కాళ్ల కింద భూమి కదిలినట్లు అనిపించింది. వెంటనే శ్రీనుకు ఫోన్ చేశారు, కానీ ఫోన్ కలవలేదు.


​కొద్దిసేపటికే వాళ్ల ఇంటికి పోలీసులు వచ్చారు. శ్రీను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని, తన చావుకు అనంతయ్య గారి ఆరోపణలే కారణమని ఉత్తరం రాశాడని చెప్పారు. ఆ ఉత్తరం ఆధారంగా పోలీసులు అనంతయ్య గారిపై కేసు నమోదు చేసి, ఆయనను అరెస్ట్ చేశారు.


గౌరవప్రదమైన అధికారిగా బతికిన అనంతయ్య గారు, తన అహంకారం వల్ల అందరూ చూస్తుండగా పోలీస్ జీపు ఎక్కాల్సి వచ్చింది.


​స్టేషన్ నుండి బెయిల్ మీద బయటకు వచ్చాక, ఆ సాయంత్రం రాము కారు ఆపి, వెనక్కి తిరిగి కన్నీళ్లతో ఇలా అన్నాడు:

​అయ్యా, ప్రతిసారీ మీ చూపుడు వేలు ఎదుటివారి వైపు ఎందుకు తప్పుగా వెళుతోందో ఎప్పుడైనా ఆలోచించారా? నన్ను కూడా మీరు ఈ ముప్పై ఏళ్లలో ఎన్నో సార్లు తప్పు పట్టారు, అవమానించారు. కానీ మీ ఉప్పు తిన్న విశ్వాసంతో ఇప్పటి వరకు నేను నోరెత్తలేదు. ఇంత ఘోరం జరిగాక ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ఇంకా నా జన్మకి అర్థం లేదు, అందుకే చెబుతున్నాను. మీరు ఆ చూపుడు వేలితో శ్రీనును నిందిస్తున్నప్పుడే మీ వైపు ఉన్న ఆ మూడు వేళ్లు మీకు మూడు నిజాలు చెబుతున్నాయి. ఒకటి.. ఆ డబ్బుల విషయంలో మీరు పొరబడ్డారని, అది మొదటి వేలు చెప్పిన మీ తొందరపాటు. రెండు.. ఆ పిల్లాడి నిష్కల్మషమైన మనసును మీరు గమనించలేదని, అది రెండో వేలు చెప్పిన మీ అహంకారం. మూడు.. మీ మాటకు ఉన్న పదును ఒక ప్రాణాన్ని తీస్తుందని మీరు అంచనా వేయలేదని, అది మూడో వేలు చెబుతున్న మీ క్రూరత్వం. మీరు ఒకరి వైపు వేలు చూపిస్తే ఆ దేవుడు మీ వైపు మూడు వేళ్లు చూపిస్తూనే ఉన్నాడు అయ్యా, కానీ మీరు ఒక ప్రాణం పోయి, మీరు జైలు మెట్లు ఎక్కే వరకు దేవుడు చూపిస్తున్నది చూడలేదు.


​రాము మాటలు అనంతయ్య గారికి మరణశాసనంలా అనిపించాయి. తన అహంకారం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుందని, తన నీడలా ఉండే రాము మనసును కూడా ఇన్నేళ్లుగా గాయపరిచానని ఆయనకు అర్థమైంది. ఆ రోజు నుండి ఆయన చూపుడు వేలు ఎత్తడమే మానేశారు. చూపుడు వేలు ఎదుటివారిని నిందించడానికి కాదు, మన లోపలికి మనం చూసుకోవడానికి దిశను చూపాలని ఆయనకు ఆ రోజు ఒక చేదు పాఠం బోధపడింది.

*** 

సమాప్తం. 

వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె


నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.


నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.

ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.

bottom of page