top of page

దసరా మంచికి ఆసరా

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #DasaraManchikiAsara, #దసరామంచికిఆసరా, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 127


Dasara Manchiki Asara - Somanna Gari Kavithalu Part 127 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 02/10/2025

దసరా మంచికి ఆసరా - సోమన్న గారి కవితలు పార్ట్ 127 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


దసరా మంచికి ఆసరా

-------------------------------------------

దసరా పండుగ వచ్చెను

ఆసరా మంచికి ఆయెను

సంబరాలే తెచ్చెను

అంబరాన్నే తాకెను


విజయోత్సవ శుభదినము

విజయ దశమి పర్వదినము

క్రమ్ముకున్న కష్టాల

మేఘాల పలాయనము


మంచికి స్థానమివ్వాలి

మదిని మలినం కడగాలి

బ్రతుకులో దశ తిరగాలి

విజయ దశమి రావాలి


అప్పుడే జీవితాల్లో

సామాన్యుల హృదయాల్లో

ఘన దసరా సంబరాలు

సుఖమయమే కుటుంబాలు



ree










తల్లిదండ్రులు ఘనులు

---------------------------------------

కనిపించే వేల్పులు

కన్నవారు భువిలో

త్యాగానికి గురుతులు

పూజించుము మదిలో


కన్నోళ్లు ప్రేమలో

ముందంజ సేవలో

గౌరవానికార్హులు

ఘనులే బాధ్యతలో


తల్లిదండ్రుల ఆశలు

వారి గుండె శ్వాసలు

చూడంగా పిల్లలు

వంశానికి వారసులు


గొప్పగా ఎదిగితే

వినయంతో ఒదిగితే

పొంగి పొంగి పోతారు

అనిశము పొగడుతారు

ree








అంతే మరి!!

--------------------------------------

దీపం వెలిగిస్తే

పుస్తకం పఠిస్తే

గదిలోన, మదిలోన

చీకట్లే మాయము


విజయం సాధిస్తే

జ్ఞానం బోధిస్తే

పదిమందికి లాభము

జగమంతా క్షేమము


ప్రతిభలో రాణిస్తే

రహస్యం ఛేదిస్తే

ఘనతకది కారణము

తెచ్చును గౌరవము


కష్టాన్ని నమ్మితే

ఏదైనా సాధ్యము

నమ్మకాన్ని అమ్మితే

సర్వమూ నాశనము

ree











గర్వమే శత్రువు

-----------------------------------------

గర్వం చూపరాదు

పతనం కారాదు

దానితో బంధము

అవుతుందోయ్! దూరము


అహంకారం చెరుపు

బాధ పెట్టే కురుపు

వదిలేస్తే క్షేమము

జీవితం సుభిక్షము


విజయానికి మూలము

సాటిలేని వినయము

అభివృద్ధికి నిచ్చెన

అహర్నిశలు సాధన


ఏదీ కావాలాయ్!

కోరుకొమ్ము నేస్తము

వేగిరమే వదిలేయ్!

మనసులోని గర్వము

ree

















చిన్ని పాప-పెద్ద బోధ

---------------------------------

చిన్ని చిన్ని సంతోషాలు

మరుపురాని అనుభవాలు

చేసుకోకు బహు దూరము

పిమ్మట దొరుకుట కష్టము


చిన్ని చిన్ని సమస్యలు

మామూలే బ్రతుకులోన

అదే పనిగా చింతించకు

పదే పదే మనసులోన


చిన్ని చిన్ని పొరపాట్లు

దిద్దుకొనుట అవసరము

లేకపోతే అగచాట్లు

పెద్దవైతే నష్టము


చిన్ని చిన్ని ప్రయత్నాలు

తప్పకుండా చేయాలి

పెద్దపెద్ద విజయాలు

సొంతమని భావించాలి


-గద్వాల సోమన్న

Comments


bottom of page