top of page
Original_edited.jpg

దీపావళి ప్రాశస్త్యం

  • Writer: Sudha Vishwam Akondi
    Sudha Vishwam Akondi
  • Oct 20
  • 4 min read

#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #TeluguDevotionalStories, #DeepavaliPrasasthyam, #దీపావళిప్రాశస్త్యం

ree

Deepavali Prasasthyam - New Telugu Story Written By Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 20/10/2025 

దీపావళి ప్రాశస్త్యంతెలుగు కథ

రచన: సుధావిశ్వం ఆకొండి


ఆనందాలను పంచే దీపావళి. రకరకాల టపాకాయలు ఉత్సాహంగా పేల్చి, చెప్పలేని ఆనందాలు పంచుకునే దీపావళి. 


దీపావళి అంటే దీపాల వరుస. ఎన్నో దీపాలు వరుసగా వెలిగించడం! ఆ దీపాల కాంతులు చీకట్లను పారద్రోలి వెలుగులను వెదజల్లుతూ కాంతివంతం చేస్తాయి.

మహావిష్ణువు ఆది వరాహమూర్తిగా వచ్చినప్పుడు, హిరణ్యాక్షుడి చేత నీటిలో దాచబడిన భూమిని రక్షించాడు ఆ రాక్షసుని వధించి. అప్పుడు భూదేవి కోరిక మేరకు ఆది వరాహమూర్తి ప్రసాదించిన పుత్రుడే ఈ నరకుడు. 


కానీ రాక్షస ప్రవృత్తితో ఉండడం వల్ల రాక్షసుడు అయ్యాడు. బ్రహ్మ దేవుని కోసం తపస్సు చేసి, తల్లి చేతిలో తప్ప ఎవరి చేతిలో మరణం లేని వరం పొందాడు. తల్లి ఎలాగో కొడుకును చంపలేదు కనుక తనకు మరణం లేదని విర్రవీగుతూ లోకాలను పీడించాడు. 

 అందరూ వెళ్లి కృష్ణ పరమాత్మతో మొరపెట్టుకోగా ఆయన అభయం ఇచ్చాడు. ఆ తర్వాత భూమి అంశ అయిన సత్యభామను వెంట తీసుకుని వెళ్లి, నరకాసురునితో యుద్ధం చేసి నరకుని అనుచరులతో సహా అందరినీ సంహరిస్తాడు. అతడి చెరలోని వారిని వదిలిపెడతాడు. అతడి చెరలో ఉన్న పదహారు వేలమంది రాచకన్యలు మాత్రం కృష్ణ పరమాత్మను వరిస్తారు. పరమాత్మ షోడశకళలే ఆ కన్యలు. వారిని ఆయనే చేపడతాడు.


నరకుడు చతుర్దశి నాటి రాత్రి మరణించగా, మరునాడు అమావాస్య రోజు, నరకుని మరణించాడని ఆనందంగా దేవతలు, మానవులు అందరూ ఎన్నో దీపాలు వరుసలుగా పెట్టి వెలిగించి ఆనందోత్సాహాలు జరుపుకున్నారట. అందుకని అలా ఇప్పటికీ దీపాలు వెలిగిస్తాము. 


 మనలోనే ఉన్న అసలు నరకుడిని సంహరిస్తే అప్పుడు నిజమైన దీపావళి. 

నరకుడు అంటే అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని కృష్ణ పరమాత్మ తీసివేశాడు. మనలోని అజ్ఞానం తొలగిపోవాలంటే జ్ఞానజ్యోతి వెలగాలి. జ్ఞానజ్యోతి వెలగాలంటే పరమాత్మ అనుగ్రహం కావాలి. ఆయన అనుగ్రహం లభించాలంటే ఆయన్నే శరణు వేడుకోవాలి.

 ***

 ఈ రోజున లక్ష్మీదేవి దీపాల వెలుగులలో ప్రకాశిస్తుంది. దీపాలున్న అన్ని ఇళ్లలోకి అమ్మ వస్తుందని పెద్దలు చెబుతారు. అందుకే రాత్రంతా ఇంట్లో, గడపల వద్ద దీపాలు వెలిగించి ఉంచుతారు. అమ్మ దీపాల కాంతులలో వెలిగిపోతున్న ఇంటికి వచ్చి, తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని పెద్దలు చెబుతారు. అందుకు ఉదాహరణగా ఒక కథ ప్రాశస్త్యంలో ఉంది. 


 *** 

 ఒక ఊరిలో ఒక గొప్ప వ్యాపారి ఉండేవాడు. పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు. ఆయనకు ఏడుగురు కూతుళ్లు. చిన్నప్పటి నుంచీ ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. 


 ప్రతి సంవత్సరం తన జన్మదిన వేడుకలు ఎంతో గొప్పగా జరుపుకునేవాడు. అతిథులు అందరూ వెళ్ళిపోయాక తన కూతుళ్లను దగ్గరకు పిలిచి, ఒక ప్రశ్న అడిగేవాడు. 

 ఒక్కో కూతురితో.. 

 "ఇదంతా నీ అదృష్టమా? నా అదృష్టమా?" అని ఆడిగేవాడు. అందరూ

నీ అదృష్టమే నాన్నా! అనగానే తృప్తిగా అందరికి కానుకలు ఇచ్చి పంపేవాడు. అలా పిల్లలను అడగడం, వాళ్లు నీదే అదృష్టం అనడం ఆనవాయితీ అయిపోయింది. 


*****


 కాలం గిర్రున తిరిగింది. కూతుళ్లకు యుక్తవయస్సు వచ్చింది. ఆ సందర్భంలోనే ఆయన పుట్టినరోజు వచ్చింది. అప్పుడు కూడా ఎప్పుడూ ప్రతి సంవత్సరం అడిగినట్టుగానే అడిగాడు కూతుళ్లను అడిగాడు. 

 ఈ సారి ఆరుగురు కూతుళ్ళూ ఎప్పటిలాగే చెప్పారు. 


కానీ.. 

ఆఖరి అమ్మాయి ఏడవ కూతురు మాత్రం వేరేలా చెప్పింది ఈసారి. 


 "నా అదృష్టమే నాన్నా!" అంది. 


 "అదెలా?" అని అడిగాడు వ్యాపారి


అప్పుడు ఆమె.. 

 "నీ అదృష్టం ఎప్పుడూ నీదే! నీది నాది కాదు నాన్నా! నేను చేసుకున్న దాన్ని బట్టే నా అదృష్టం ఉంటుంది. అది నాదే!" అంది. 


దాంతో కోపం వచ్చిన తండ్రి.. 

 "అలా కాదు! నా అదృష్టమే! అని ఒప్పుకో?" అన్నాడు పంతంగా


కానీ తను ఒప్పుకోలేదు. 

 " సరే చూస్తాను. నీ అదృష్టం నీకు ఎలా వస్తుందో చూస్తాను! నా కూతురుగా లేనప్పుడు, నీకు ఏ అదృష్టం లేదు. అందుకే అంతా నా అదృష్టమే! అలా ఒప్పుకోక తప్పదు నీకు" అని విసవిసా వెళ్ళిపోయాడు. 


 ఆరుగురు కూతుళ్లకు తెలివి గలవారు, సంపన్నులైన వరులను చూసి వివాహం చేసాడు. చివరి కూతురు లక్ష్మికి మాత్రం అమాయకుడు, అసలు వ్యవహార జ్ఞానం లేనివాడికి ఇచ్చి పెళ్లి చేసి, ఇంట్లోంచి వెళ్ళిపొమ్మన్నాడు. 


లక్ష్మి తన భర్తతో కలిసి కట్టుబట్టలతో బయటకు వెళ్తుండగా, కళ్ళల్లో నీరు పెట్టుకుంటూ తల్లి డబ్బులు ఇవ్వబోగా, వద్దని తిరస్కరిస్తుంది. తండ్రి వల్ల ఆ ఊళ్ళో ఎక్కడా పని దొరకదు. 


వేరే రాజ్యంలోకి వెళ్లి, అక్కడ ఒక చోట గుడిసె వేస్కుని, కాపురం ఉంటారు. చిన్న చిన్న మొక్కలు, కూర పాదులు పెట్టుకుని, వాటి ద్వారా ఏది దొరికితే, దాంట్లో ఇద్దరూ తినేవారు. భర్త లక్ష్మి చెప్పింది మాత్రం చేసుకొచ్చేవాడు అంతే తప్ప, ఏ మాత్రం ఆలోచన, వ్యవహార పరిజ్ఞానం లేనివాడు. 


ఇలా ఉండగా.. 


ఒకనాడు ఆ దేశ రాకుమారి ఆడుకుంటూ, ఉద్యానవనంలో స్నానానికి వెళుతూ ఆభరణాలు పక్కన చెట్టుకు తగిలించి పెడుతుంది. అక్కడే ఉన్న ఒక పక్షి అదేంటో తినేది అనుకుని, నోట కరుచుకుంటుండగా పరిచారికలు చూసి అరుస్తారు. భటులు ఆ పక్షి వెంట పడతారు. ఆ పక్షి ఎగురుకుంటూ ఎటో వెళ్తుంది. ఇక లాభం లేదని వెనక్కి వెళతారు. ఆ పక్షి తీసుకెళ్లింది రాకుమారి యొక్క వజ్రాల హారం. 


అది ఎంతో విలువైనదే కాక పురాతనమైనది. పూర్వీకులనుంచి పరంపరాగతంగా వచ్చిన ఆ హారం మరింత ముఖ్యమైనది. 

 అందుకని రాజుగారు చాటింపు వేయిస్తారు. 

 "ఆ హారం దొరికినవారు తెచ్చి ఇస్తే, వారికి తగిన బహుమతి ఇవ్వబడుతుంది", అని 


*****


లక్ష్మి తెల్లవారు జాముననే నిద్ర లేచేది. ఆ రోజు కూడా అలానే లేచి, వేపపుల్లతో తోముకుంటూ, సొరకాయ పందిరి పైకి చూసింది కాయలేమైనా వచ్చాయా అని. అక్కడ ఏదో మెరుస్తూ కన్పించింది. ఏమిటా అని కర్రతో జరిపి చూడగా మిలమిల మెరుస్తూ రాకుమారి వజ్రలహారం. అది తీసి భద్రపరిచి అన్ని పనులూ చేస్కుని, భర్తను కూడా తయారయి రమ్మని చెప్పి, పంపింది. 


భర్త రాగానే ఒక సంచిలో ఆ హారం పెట్టి, మూటగట్టి అతని చేతికి ఇచ్చింది. 


 "ఇది రాజుగారికి ఇచ్చి రండి. రాజుగారు ఏది ఆడిగినా నాకు తెలియదు నా భార్యను అడగమని చెప్పాలి" అని చెప్పి పంపింది. అలాగే అని భర్త రాజుగారి వద్దకు వెళ్లి, ఇస్తాడు. 


"మా ఈ అమూల్య హారాన్ని తెచ్చిచ్చావు. నీకేమి కావాలో కోరుకో! ఇస్తాను" అని అడిగాడు రాజు సంతోషంగా 


 అప్పుడు అతను తన భార్యను అడగమన్నాడు. రాజు సరేనని లక్ష్మిని సగౌరవంగా పిలిపించి అడుగుతాడు రాజు. 

అప్పుడు ఆమె.. 

" ఒక్కటే ఒక్క చిన్న కోరిక మహారాజా! ఎల్లుండి వచ్చే దీపావళి అమావాస్య నాడు, ఈ రాజ్యంలో ఉన్న ప్రజలు ఎవ్వరూ మీతో సహా దీపాలు వెలిగించకుండా, తొందరగా పడుకోవాలి. ఆ ఒక్కరోజు. ఈ కోరిక తీర్చండి మహారాజా! ఇదే నా కోరిక! ఇది తీర్చగలిగితే తీర్చండి. లేదంటే ఏదీ వద్దు!" అని అడిగింది. 


'మాట ఇచ్చాక తప్పుతుందా' అనుకుని రాజు అలాగే అన్నాడు. రాజ శాసనం అయ్యింది. రాజ్యం అంతటా విషయం చాటింపు వేయించాడు రాజు. 


 అమావాస్య రానే వచ్చింది. 

రాజ్యం అంతా చీకటి. ఒక్క లక్ష్మి ఇంట్లో మాత్రం వున్నంతలో వెలిగించింది. భర్త పడుకున్నాడు. తను మాత్రం పడుకోకుండా కూర్చుంది. ఇంతలో గజ్జెల శబ్దం వినిపించింది. ఆ శబ్దం తలుపు వరకు రాగానే చటుక్కున వెళ్లి, తలుపు మూసేసింది. అట్నుంచి.. 


"తలుపు తెరువు లక్ష్మీ! ఎక్కడా వెలుగు లేదు. ఇక్కడ ఉందని వస్తుంటే తలుపు వేస్తున్నావేంటి" అని సుమధురంగా కంఠం వినబడింది. 


అప్పుడు లక్ష్మి.. 

 "ఎందుకమ్మా? మళ్ళీ వెళ్లిపోతావు కదా ఎలాగో! అప్పుడు ఇంకా బాధ. నా భర్తకు వ్యవహార జ్ఞానం లేదు. నేను బ్రతికేదే కష్టం" అని తన బాధ వెళ్లబోసుకుంది. 


"ఒక్కసారి తలుపు తియ్యి. అన్నీ అనుకూలం అవుతాయి" అంది అమ్మవారు. 


 "అలా మాట ఇవ్వు అమ్మా!"


"అలాగే మాట ఇస్తున్నా"


తరువాత లేచి తలుపు తీసింది లక్ష్మి. 


కన్నుల్లో వాత్సల్యాన్ని కురిపిస్తూ, నాలుగు చేతులతో రెండు చేతుల్లో పద్మాలు పట్టుకుని, అభయం ఇస్తూ, ఎరుపురంగు పట్టుచీర ధరించి, సర్వాభరణాలతో దర్శనం ఇచ్చింది. 


వెంటనే లోపలికి వచ్చిన అమ్మవారు, లక్ష్మి ఇచ్చిన నైవేద్యం స్వీకరించి, ఆమె భర్త నాలుక పైన ఏవో బీజాక్షరాలు రాసి, దీవించి అదృశ్యం అవుతుంది. 


ఇక తెల్లవారగానే పూర్తిగా మారిపోయిన భర్తను తృప్తిగా చూసుకుంది. కొద్దిరోజుల్లోనే చిన్న వ్యాపారంతో మొదలుపెట్టి, ఆ రాజ్యంలోనే గొప్ప వ్యాపారస్తుడుగా పేరు పొందుతాడు. 


లక్ష్మి తండ్రి వ్యాపార నిమిత్తం అల్లుడని తెలియక ఇక్కడికి వస్తాడు. కూతురిని, అల్లుడిని చూసి హతాశుడు అవుతాడు. కూతురిని కష్టాలకు గురి చేసినందుకు బాధపడతాడు. నిజమే ఎవరి అదృష్టం వారిదే. నీ అదృష్టం నీదే అంటాడు. తర్వాత అంతా కలుస్తారు. 


అందరికీ ఆనందాల దీపావళి.. 

దీపావళి పర్వదిన శుభాకాంక్షలు������


కృష్ణార్పణమస్తు


ree

-సుధావిశ్వం





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page