top of page

రైటర్ రాగిణి

#ASurekha, #Aసురేఖ, #WriterRagini, #రైటర్, #రాగిణి, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

ree

Writer Ragini - New Telugu Story Written By A. Surekha

Published In manatelugukathalu.com On 18/10/2025

రైటర్ రాగిణి - తెలుగు కథ

రచన, కథా పఠనం: A. సురేఖ  

ఒక రోజు ఉదయం రాగిణి ముగ్గు వేస్తూ ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లు పదేపదే వీధిగుమ్మం వైపు చూస్తోంది. వంట చేస్తూ కూడా మధ్యలో వచ్చి వీధిలోకి చూసి వెళ్తూ ఉంది. ఒకపక్క భర్తకి ఆఫీసు కి టైమ్ అవుతోంది. పాలవాడు రానే లేదు. పేపర్ వాడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. కాలుగాలిన పిల్లిలా రాగిణి ఇంట్లోకి బయటికి పచార్లు చేస్తూనే ఉంది. ఆ వీధిలోనే కాదు, దాదాపు ఇంకో రెండు మూడు వీధుల్లో ఆమెకు చాలా మంచిపేరే ఉంది. రాగిణి అంటే ఆ వీధుల్లో జనాలకి చాలా గౌరవమే ఉంది. ఆవిడ ఎదురుగా తలెత్తి మాట్లాడరు, ఎదురుగా నిలబడ్డానికి సాహసం కూడా చేయరు. 


ఒకసారి బయటికి వచ్చి, పాలవాడికోసం, పేపర్ అబ్బాయికోసం ఎదురుచూసీ తన నేమ్ బోర్డు ని చీర పమిట తో శుభ్రంగా తుడిచి ఆప్యాయంగా అక్షరాల్ని తడిమి చూసుకొంది ఒకసారి. 


“శ్రీమతి రాగిణి, ప్రముఖ నవలా రచయిత్రి” అని ఈ మధ్యే సుందరం అదేనండీ.. రాగిణి భర్త తళతళ మెరిసిపోయే పెద్ద పెద్ద ఇత్తడి అక్షరాలతో బోర్డు చేయించి గుమ్మానికి పక్కనే బోర్డుతగిలించాడు. అదేంటో.. ఆ బోర్డు పెట్టినప్పటినుండి ఆ వీధిలోకి తెలిసిన వాళ్ళు రావడమే మానేశారు. 


“ఇవాళ పేపర్ వాడు పేపర్ తీసుకుని రాలేదండీ. ఆ కుంకాక్షి, పాలవాడు ఎక్కడ తాగేసి పడిపోయాడో”.. కాఫీ లేదని విచారంగా భార్యామణి చెప్తూ ఉంటే, మనసులోనే చిరునవ్వులు చిందిస్తూ “నేను మన వీధి చివరి దాకా వెళ్ళి పేపర్, పాలూ తీసుకొస్తానులే” అంటూ చొక్కా వేసుకొని వడివడిగా అడుగులు వేస్తూ వీధి మలుపు దగ్గరకి వెళ్ళాడు. 


అప్పటికే అక్కడ వేచి ఉన్న, పాలవాడు గబగబా సుందరం చేతిలో రెండు పాల పాకెట్లు పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. పేపర్ వాడేమో, తమిళం పేపర్ చేతిలో పెట్టాడు. “ఇదేంటయ్యా తెలుగు పేపర్ కదా నాదీ” అడిగాడు సుందరం.


 “మరిచిపోయాను సర్, ఈ మతిమారుపుకి కారణం మీ మేడమ్ గారే సర్”, అంటూ తెలుగు పేపర్ చేతిలో పెట్టి, రివ్వున సైకిల్ మీద దూసుకుని పోయాడు. 


ఇంటికి పాల పాకెట్లతో పేపర్ తో వచ్చిన భర్తకు కాఫీ చేసి చేతిలో పెట్టింది. ఆ కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్న సుందరం ఆమెని చూసి తనలో తనే పిచ్చోడిలా నవ్వుకున్నాడు. ఈ కథల పిచ్చిదానికి తిక్క కుదిరింది అనుకుంటూ, ఏమీ తెలీనివాడిలా, పేపర్ లో నిమగ్నమైపోయి భార్యని దొంగతనంగా గమనిస్తున్నాడు. 


రాగిణి కాలుగాలిన పిల్లిలా కిచెన్ లోకి వీధి గుమ్మంలోకి తిరుగుతూనే ఉంది. “ఈ రోజు నా శ్రీమతి రాసిన రాతలకి మతి పోగొట్టుకో బోయే ఆ దురదృష్టవంతుడు ఎవరో పాపం” అని తనలో తనే అనుకుంటూ భార్యామణి చేతి కాఫీ జుర్రుకుంటూ చప్.. చప్ మని శబ్దం చేస్తూ ముగించాడు. 


హటాత్తుగా ఒక విషయం గుర్తొచ్చింది, “అమ్మోయ్ ఎవరు లేకపోతే నేనే నా భార్యామణి కవితలకి బలి అవుతాను” అనుకొని త్వరగా రెడీ అయ్యి ఆఫీస్ కి బయలుదేరడానికి హడావుడి పడ్డం మొదలెట్టాడు. 


“ఏమండీ”.. అంటూ గోముగా రాగిణి పిలిచిన పిలుపుకి సుందరం గుండెకాయ మోకాలి లోకి జారిపోయి అక్కడి నుండి నేలలోకి ఇంకిపోయింది. 


“ఏమిటి రాగీ.. ” అంటూ ప్రేమగా పిలిచాడు ఆమెను. 

“ఇవాళ ఎందుకో చాలా మూడ్ వచ్చేస్తోందండీ. ఒకసారి ఇలా రండి” అంటూ పిలిచింది. 


“ఇప్పుడా. నాకు ఆఫీసు కి టైమ్ అవుతోందే” అన్నాడు సుందరం.


“అబ్బా రెండు మూడు నిమిషాల్లో అయిపోయే పనికి అంత బెట్టు చేస్తారెందుకు త్వరగా రండి మూడ్ పోతే మళ్ళీ రాదు” అంటూ సుందరాన్ని తొందర పెట్టింది. 


భార్యకి మూడ్ రావడానికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ భయం భయంగా కిచెన్ దగ్గర బయట నిలబడ్డాడు సుందరం. 


“ఇది చూసి ఎలా ఉందో చెప్పండి” అంటూ గోముగా అడిగింది రాగిణి. 


సుందరం భయం భయంగా గుటకలు మింగుతూ ఆమె ఇచ్చిన కాగితం అందుకుని అందులో ఏముందో చూడాలని వణుకుతున్న చేతులతో అందుకున్నాడు. అందులో కవితని చూసేసరికి అరగంట కింద తాగిన కాఫీ, చేదుగా నోట్లోకి తన్నుకుంటూ వచ్చేసింది. దాంతో పాటూ కళ్ళల్లో నీళ్ళు ఉబికి పొంగిపోర్లాయి. 


“ఏమైందండీ బాగోలేదా కవిత. చాలా మూడ్ ఆఫ్ గా ఉన్నారు” అనడిగింది. 


“అబ్బే అదేం లేదు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఆఫీసు కి టైమ్ ఐపోతోంది కదా, త్వరగా లంచ్ బాక్స్ పెట్టు. స్నానం చేసేసి వస్తాను” అంటూ ఆమె ఏదో చెప్పబోతున్నా వినకుండా బాత్రూమ్ లోకి పరుగు పెట్టాడు. 


“కొత్తగా ప్రతిఘటన సైటు లో కథలు రాస్తున్నాన”ని తన స్నేహితురాలు చెప్తే తాను కూడా రచనలు చేద్దామని ఒక కవిత రాసి పంపింది. అది ఆ సైటు లో పబ్లిష్ అవ్వగానే తానొక గొప్ప రచయిత్రి ఐపోయినట్లు ఫీల్ అవ్వడం మొదలెట్టింది రాగిణి. నిజంగా రచయిత్రిగా కనిపించాలి అంటే కళ్ళజోడు ఉండాలని రాగిణి ఉద్దేశం. తను చూసిన సినిమాలలో రచయిత్రులు కళ్ళజోడు సరి చేసుకుంటూ కథలు రాస్తూ ఉండడం గమనించింది. ఒకానొకరోజు భర్తని తీసుకొని కంటి డాక్టర్ దగ్గరకి వెళ్ళింది.


"మీకంటి చూపు అమోఘం, కళ్ళజోడు పనేమీ లేదు" అంటూ డాక్టర్ చెప్తే ఆయనతో పొట్లాడి, అతని మెడ మీద కత్తి పెట్టి మరి బెదిరించి కళ్ళజోడు రాయించుకుంది. ఆ కళ్ళజోడు కాసేపటికి ఒకసారి పైకి కిందకు కదిలిస్తూ, పెన్నుతో పళ్ళమధ్య కెలుక్కుంటూ ఏదో ఆలోచన వచ్చినప్పుడల్లా గబగబా ఒక పెన్ను పేపర్ తీసుకొని రాస్తూ ఉంటుంది. తత్ఫలితంగా రాగిణి రచనలు మొదలెట్టిన నెలరోజుల్లో పది పాల గిన్నెలు, రెండు కుక్కర్ లు మాడి మసై పోయాయి ఇంట్లో. “ఈ వంటా అవీ చేస్తూ కూర్చొంటే నా రచనా వ్యాసంగం ముందుకు నడవడం లేదు. వంటమనిషిని పెట్టండి” అంటూ గొడవచెయ్యడం మొదలెట్టింది రాగిణి. 


“నాకు అంత స్థోమత లేదు. నువ్వు వండితే తింటాను లేకపోతే పస్తులు పడుకుంటాను” అంటూ సుందరం మొండికేయడంతో ఏం చేయాలో తెలియక రాగిణి వంట చేసేది.


 తాను రాసిన కవితలు అద్భుతంగా ఉన్నాయని ఎవరైనా పొగిడితే వాళ్ళకి హారతులు ఇచ్చి, కాఫీ టీ పోసి, టిఫిన్ పెట్టి మరీ సాగనంపేది. ఏదో ఒక పది లైన్లు రాసి ఆ కవితకి ఏదో ఒక పేరు పెట్టి, పొద్దున్న వచ్చే పాలవాడి తో మొదలుపెట్టి ప్రతి ఒక్కరికి తన కవితలు వినిపిస్తూ, వాళ్ళ చేత ఆహా.. ఓహో.. అనిపించుకునేది. ఆమె గోల భరించలేక ఆవిడ నిద్రలేచే కంటే ముందే ఈ మధ్య పాలవాడు, పేపర్ వాడు వచ్చి పాలు పొసేసి, పేపర్ వేసేసి మెల్లగా జారుకుంటారు. 


వాళ్ళు రావడం అలస్యమైతే, సుందరం వీధి చివరి దాకా వెళ్ళి పాలూ, పేపర్ అందుకొని ఇంటికి తెచ్చేవాడు. పదేళ్లుగా నమ్మకంగా ఇంట్లో పని చేసే పనిమనిషి, రాజమ్మ “నేను పనిలోకి రాలేను” అని చెప్పి, ఆ వీధిలో అందరి పనులు మానేసి మరీ వెళ్లిపోయింది. తను పోతూ.. పోతూ మిగిలిన పనిమనుషులకుచెప్పినట్లుంది. ఆ వీధిలో పనిమనుషులు ఆ వీధి ఛాయలకు రావడమే మానేశారు. పాలబిల్లు, పేపర్ బిల్లు వీధి చివర నిలబడి సుందరం దగ్గర వసూలు చేసుకొని వెళ్లిపోతున్నారు. పాలవాడూ. 


కూరగాయల బండివాడు ఎప్పుడైనా రాగిణి ఫోన్ చేసినా సెల్ ఇంట్లో పెట్టేసి వెళ్లిపోతున్నారనే సమాధానం వస్తోంది ఆమెకు. ఇంక అప్పుడప్పుడు వచ్చే కూరల వాళ్ళైతే ఆ వీధిలోకి వెళ్లాలంటే హడలి పోతున్నారు. లేదా "కూరగాయలండోయ్" అంటూ గట్టిగా అరవడం మానేసి బుద్ధిగా అమ్ముకొని వెళ్లిపోవడం మొదలెట్టారు. ఆ వీధిలో నుండి హై స్కూల్ కి వెళ్ళే పిల్లలు కూడా కొంచెం దూరమైనా వేరే వీధులలోంచి వెళ్ళిపోవడం మొదలెట్టారు. 


రాగిణి తన వంట పని ముగించేసి, గుమ్మంలో కాపు కాసుకొని కూర్చుంది. ఎవరైనా అటుగా వస్తే చటుక్కున పట్టేసుకొని తన కవితలు వినిపించడానికి వీలుగా పుస్తకం పక్కనే పెట్టుకుంది. ఈ మధ్య ప్రతిఘటన సైటు లో కొత్తగా స్టోరీ పెట్టు, ప్రైజ్ కొట్టు అనే పోటీలు పెడితే, ఆ సైటు అడ్మిన్ నాని తో మాట్లాడి, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్- కం- శృంగార కథ, “దిక్కుమాలిన రాజు-దిక్కులేని రాణి” సీరియల్ గా రాయడం మొదలెట్టింది. ఆ కథ లో లేటెస్ట్ ఎపిసోడ్ వినిపిద్దామని భర్తను అడిగితే తనకు ఖాళీయే లేదంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. 


భార్య దెబ్బనుండి తట్టుకోడానికి సుందరం హడావుడి పడుతూన్నట్లు నటిస్తూ, "ఇవాల్టికి టిఫిన్ వద్దులే రాగీ డార్లింగ్" అంటూ ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తూ ఇంట్లోంచి బయటపడ్డానికి సిద్ధపడ్డాడు. “నేను ఆఫీస్ కి బయలుదేరు తున్నా” అంటూ వరండాలో కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్న రాగిణికి చెప్పి చెప్పులు చేత్తో పట్టుకొని ఇంటి బయటకు నడవబోయాడు. “ఏవండీ ఒక్క నిమిషం ఆగండి”! అంటూ కాస్త చిరాగ్గా చీర కొంగు విదిలిస్తూ చెప్పింది రాగిణి. 


"అమ్మో నా పని అయిపోయినట్లు ఉంది, ఇలా బుక్కయిపోయానేంటి" అనుకుంటూ సుందరం కాస్త ఇబ్బందిగా పళ్ళికిలించి నవ్వుతూ "ఏంటి రాగీ డార్లింగ్ " అని తన ఎత్తుపళ్లు బయటికి పెట్టి నవ్వుతూ మరీ అడిగాడు. 


"ఏమండీ మీరు వెళ్లేదారిలో నన్ను కాస్త పోస్ట్ ఆఫీస్ దగ్గర వదిలి వెళ్తారా" అని కాస్త గోముగా అడిగింది. 


ఎందుకో పోస్ట్ ఆఫీస్ కి అని ఆలోచనలో పడ్డాడు సుందరం. ఆలోగా "అమ్మగారూ పోస్ట్" అంటూ నల్లగా బక్కపలచగా, దళసరి కళ్ళజోడుతో అరిగి పోయిన చెప్పులతో ఒక పెద్ద మూట నిండా ఉత్తరాలు తెచ్చి రాగిణి కాళ్ళముందు పడేసి నీరసంగా నేలమీద కూలబడ్డాడు పోస్టుమాన్. 


“ఇదిగో రాగీ డార్లింగ్, పోస్ట్ మ్యాన్ ని మంచి చేసుకో, నువ్వు చెప్పిన ఏ పనైనా చేసి పెడతాడు. నువ్వెందుకు ఎండలో పడి అంత దూరం వెళ్ళడం. పైగా నీకు టైమ్ కూడా సరిపోవడం లేదన్నావు గా. వాడికే కాస్త పదో పరకో ఇచ్ఛావనుకో సులభంగా నీ పని చేసి పెడతాడు” ఒక ఉచిత సలహా పారేసి, చెప్పులు చంకన పెట్టుకొని చొక్కా బొత్తాలు పెట్టుకుంటూ బయటికి పారిపోయాడు సుందరం. 


బక్క చిక్కిన పోస్ట్ మాన్ ని చూడ్డంతోనే రాగిణికి ఒక ఐడియా వచ్చింది. మా ఆయన చెప్పిన ఐడియా బావుంది అనుకుంటూ తాను రాసిన కవితల పేపర్ కట్టల్ని అతని చేతికే ఇచ్చి, పోస్ట్ చేయిస్తే సరిపోతుంది కదా! “బాబూ కూర్చో” అంటూ గబగబా లోపలికి వెళ్ళి వేడిగా కాఫీ తెచ్చి ఇచ్చింది. పోస్ట్ మాన్ సిగ్గుపడకుండా కాఫీని గుటగుట శబ్దం చేసుకుంటూ తాగేసి, "అమ్మగారూ తమరికి ఇన్ని ఉత్తరాలు వచ్చాయేంటండీ" అంటూ తన మొహానికి పట్టిన చెమటను తుడుచుకో సాగాడు. 


“అయ్యో, బాబూ చెమటలు కారిపోతున్నావు. ఫ్యాన్ వేస్తానుండు” అంటూ అతనికి కుర్చీ వేసి కూర్చోపెట్టింది ఫ్యాన్ కింద. 


"మేడం నేను ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి సుమారు నాలుగు నెలలు దాటింది. ఒక్కటంటే ఒక్క ఉత్తరం కూడా రాలేదు మన ఊరు పోస్ట్ ఆఫీస్ కి ఈ మధ్య కాలంలో. కానీ ఈరోజు ఇన్ని ఉత్తరాలు రావడం చూసి నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఇంతకు తమరు ఏం చేసారని ఇన్ని ఉత్తరాలు వచ్చాయండీ" అంటూ కాస్త కుతూహలంగా అడిగాడు పోస్ట్ మాన్. 


రాగిణి కి పోస్ట్ మాన్ ని బలిచ్చి ఆ ఘోరం తాను చూడ్డం అనవసరమని భావించిన సుందరం బతుకుజీవుడా అనుకుంటూ ఎప్పుడో ఆఫీస్ కి పారిపోయాడు. 


“నేను ఒక రచయిత్రిని” అంటూ చాలా గర్వంగా చెప్పింది రాగిణి. పోస్ట్ మాన్ మాత్రం ఎంతో ఉత్సాహంగా “తమరి లాంటి గొప్ప రచయిత్రిని కలిసే అదృష్టం నాకు కలుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదండి. నా జన్మ ధన్యమైందండీ. తమరి లాంటి గొప్ప రచయిత్రి ఉన్న ఏరియా కి పోస్ట్ మ్యాన్ గా రావడం నా తల్లి దండ్రులు చేసుకున్న పూర్వజన్మ సుకృతం" అంటూ రెండు చేతులూ పైకెత్తి రాగిణి కి దణ్ణంపెట్టాడు. 


ఒక గొప్ప రచయిత్రిగా తనకొక సన్మానం జరిగినట్లు, తానో పెద్ద కవయిత్రి-కం-రచయిత్రి అయిపోయినట్లు పోజ్ పెట్టి, తన కవితల కట్టల్ని బయటికి తీసింది. రాగిణి అనర్గళంగా కొన్ని కవితలు చదివి వినిపించి, “ఎప్పుడు తిన్నావో వెర్రి పీనుగవి, టిఫిన్ తెస్తా ఉండు” అంటూ లోపలికి వెళ్ళి జీడిపప్పు వేసిన నేతి ఉప్మా తెచ్చి పెట్టింది. 


పోస్టుమాన్ అది తింటూ ఉండగా, ఈ మధ్య నేనో పెద్ద కథ రాస్తున్నాను. ఒక సైటు లో “స్టోరీ పెట్టు, ప్రైజ్ కొట్టు” అంటూ పోటీలు పెడుతున్నారు. నానీ అని ఆ సైటు అడ్మిన్ నాకు ఫోన్ చేసి మరీ ట్రైనింగ్ ఇచ్చాడు కథ ఎలా రాయాలో అంటూ ఇంకో కాగితాల కట్ట తీసింది. చేతిలో ఉప్మా వదల్లేక చచ్చినట్లు ఆమె కథ వినడం మొదలెట్టాడు పోస్ట్ మ్యాన్. 


అతడు కథని వింటూ చెపక్ చెపక్ మంటూ శబ్ధాలు చేసుకుంటూ, ఉఫ్ఫ్, ఉఫ్ఫ్ అని ఊదుకుంటూ వేడి వేడి ఉప్మా తింటూ ఉంటే, రాగిణి మొహంలో కోటి తారల వెలుతురు కనిపించింది. “అసలు నా కథ వినే వాళ్లే లేరు అనుకున్న సమయంలో దేవుడులా వచ్చావు. అని సంబరంతో, నా కథ పూర్తయ్యేదాకా కదలకుండా వినాలి” అంటూ షరతు విధించింది. 


“రోజూ నీ పనయ్యాక ఇక్కడికి వచ్చి నా కథలు వింటే ఉదయం టిఫిన్, కాఫీ ఇచ్చి, మధ్యాహ్నం భోజనం పెట్టి, నెలకో వెయ్యి రూపాయలిస్తాను” అంటూ పోస్ట్ మాన్ తో బేరం కుదుర్చుకుంది. 


“హా సరే తప్పకుండా మేడం, అలాగే కానివ్వండి” అంటూ తిండికి మొహం వాచిపోయినవాడిలా ఉప్మా తింటున్నాడు. 

“ఇంతమంది అభిమానులు మీ కథను చదివి ఆనందిస్తే నా అదృష్టం చూడండి మీ కథ మీ నోటితో వినే భాగ్యం కలిగింది, అంతే కాకుండా తమరి చేత్తో కడుపునిండా తిని, నెలకి వెయ్యి రూపాయలు తీసుకోవడం అంటే మాటలా. దీన్నే అంటారేమో ‘అదృష్టం కూడా దరిద్రం పట్టినట్లు పట్టడం’ అని, నాకు అంతకన్నా నాకు ఇంకేం కావాలి” అంటూ కదలకుండా కూర్చున్నాడు కుర్చీలో. 


రాగిణి ఉత్సాహంగా లేచి నుంచుని ఏదో యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు చెంగు బిగించి బొడ్లోదోపి జుట్టుని కూడా గట్టిగా ముడివేసి కథ చెప్పడం ప్రారంభించింది. "అది ఒక అమావాస్య రాత్రి ఆకాశంలో ఒక మూలన ఎక్కడో చంద్రుడు తొంగి చూస్తున్నాడు". 


"మేడం అమావాస్య రాత్రి చంద్రుడు ఎందుకు ఉంటాడు" అంటూ కాస్త సంకోచంగా అడిగాడు పోస్టుమాన్. 


“నేను ముందే చెప్పాను కదా కదలనైనా కదలకూడదు అన్న షరతుకి ఒప్పుకున్నావు కదా మళ్లీ ప్రశ్నలేంటి” అంటూ కాస్త కోపంగా చూసింది అతణ్ణి. 


"ఓ క్షమించండి మేడం మీరు కథ కొనసాగించండి" అంటూ మౌనంగా కూర్చున్నాడు. 


గంట కథ పూర్తయింది.. రెండు గంటలు పూర్తయిపోయాయి కానీ అమావాస్య రాత్రి ఆకాశంలో చంద్రుడు, ఆమె భయంకరమైన ఎక్స్ప్రెషన్స్ తప్ప ఆ కథ కొంచెం కూడా ముందుకు వెళ్లడం లేదు. పోస్ట్ మాన్ కి కడుపులో దేవేసినట్లు, తిన్న ఉప్మా ఉండలు ఉండలై కడుపులో గిరాగిరా తిరుగుతున్నట్లు, అది ఎటువైపు నుండి బయట పడాలో తెలీక కడుపులో దేవుతున్నట్లు ఉంటే ఎంతో ఇబ్బందిగా ఉన్నా అలాగే కూర్చున్నాడు ఆమె మాత్రం ఆ నాలుగు లైన్లు మళ్లీమళ్లీ చెప్తూనే ఉంది. 


"మేడం కాస్త తాగడానికి మంచి నీళ్లు".. అని సంకోచంగా అడుగుతున్నాడు అతను. రాగిణి అతని మాటలు పట్టించుకొనే స్థితిలో లేదు. పోస్ట్ మాన్ కళ్ళు తిరిగి పడిపోయాడు. "అయ్యో అయ్యో" అంటూ పరుగున లోపలికి వెళ్లి నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది. పోస్ట్ మాన్ పారిపోతాడని భయపడి, వీధి గుమ్మనికి లాక్ చేసి మరీ వెళ్ళింది. 


"అమ్మగారూ, కథ రేపు వింటానండీ, ఆ ఉత్తరాలు అభిమానులు రాసారేమో. ఒక ఉత్తరం చదివి వినిపించండి"అన్నాడు పోస్టుమాన్. 


నువ్వే చదువు నేను వింటాను. అంటూ కుర్చీలో కూర్చుంది. 


పోస్ట్ మాన్ ఒక ఉత్తరం బయటికి తీసాడు. "అమ్మగారూ, ఈ ఉత్తరం ఉత్తరావల్లి నుండి ఉత్తరకుమారి గారు రాశారు"అన్నాడు. 


చదువు అన్నట్లు చెయ్యూపి ఈజీ చైర్లో వెనక్కి వాలి దర్జాగా కాలుమీద కాలు వేసుకుని కూర్చుంది. 


"రాగిణిగారికి, ఉత్తరం పత్రికలో ఇటీవల మీ దిక్కుమాలిన రాజు, దిక్కులేని రాణి" కథ మొదటి ఎపిసోడ్ చదివాను. మీ దిక్కుమాలిన రచన కి నా జోహార్లు. మీకు కూడా జోహార్లు. ఇంకోసారి ఇలాంటి దిక్కుమాలిన కథలు రాసి పత్రికల్లో అచ్చు వేయిస్తే, మీ దిక్కుమాలిన ఫోటో కి దండవేసుకొని దణ్ణం పెట్టుకుంటాము " ఇట్లు ఉత్తరకుమారి. 


 రెండో ఉత్తరం తీసాడు పోస్టుమాన్ 

"గౌరవనీయులైన రైటర్ రాగిణి గారికి ఉత్తరం పత్రిక ఎడిటర్ ఉత్తుత్తి ఉత్తేజ్ సవినయంగా రాయునది ఏమనగా, మీ దిక్కుమాలిన రాజు, దిక్కులేని రాణి రచన పుణ్యమా అని మా ఉత్తరం ప్రెస్ కి అడ్రస్ లేకుండా పోయింది. మొన్నామధ్య పాఠకులు మా కార్యాలయం మీద దాడి చేసి ప్రెస్ లో పనిచేస్తున్న అందరిమీద దాడి చేశారు. ఇదంతా చూసి భయపడిన బిల్డింగ్ ఓనర్, లీజు కాన్సెల్ చేసి, తక్షణమే ఖాళీ చేసేయమని చెప్పారు. మా పత్రిక సర్క్యూలేషన్ కూడా దారుణంగా పడిపోయింది. కరవమంటే కప్పకి కోపం విడవమంటే పాముకి కోపం అన్నట్లు అయింది మా పరిస్థితి.


మీ కథలు ప్రచురించకపోతే మీరు చంపుతామని కత్తి పట్టుకుని ఇక్కడే కూర్చుంటున్నారు. పోనీ ప్రచురిస్తే ఇదిగో ఇలా జనాలు చంపుతారు ఎలాగైనా చావడం తప్పదు అని అర్థమైన మాకు ఈ ప్రెస్ నడపడం ఎంత మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని అర్థమైంది. ప్రెస్ మిషనరీ కూడా పాత సామాన్లు కొనేవాడికి కిలో ల లెక్క అమ్మేసి, మేము ఊరొదిలి పెళ్ళాం బిడ్డలతో సహ వెళ్లిపోతున్నాము. ఇంక మీనుండి సెలవు తీసుకుంటున్నందుకు చాలా చాలా హాయిగా, సంతోషంగా అనిపిస్తోంది. ఇంకెప్పటికీ మీ కంటపడకూడదని నిర్ణయించుకున్నాను" 


ఇట్లు ఉత్తేజ్, ఎక్స్ ఎడిటర్, ఉత్తరం వార పత్రిక. 


పోతే పోయిందిలే ఈ కవితలు కట్ట పట్టుకెళ్లి ఆ "సరస శృంగార అఖండ జ్యోతి వారపత్రిక్కి" పంపించు బాబూ, నేను ఈ లోగా ప్రతిఘటన సైటు లో “స్టోరీ పెట్టు, ప్రైజ్ కొట్టు పోటీలకి తరువాతి ఎపిసోడ్ రాసి, రేపు నీకు వినిపిస్తాను” అంటూ లోపలికి డబ్బులు తీసుకుని రావడానికి వెళ్ళింది. 


ఇక్కడే ఉంటే చచ్చిపోతానని భావించిన పోస్ట్ మాన్ ఇంటి తాళం పగలకొట్టి, పోస్ట్ బ్యాగ్ ని కూడా అక్కడే వదిలేసి, రాగిణి బయటికి వచ్చేలోగా, కాళ్ళకి బుద్ధి చెప్పాడు. 


***

A. సురేఖ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కి text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం:

ప్రొఫైల్ లింక్: https://www.manatelugukathalu.com/profile/asurekha

నా పేరు సురేఖ. పుట్టింది పెరిగింది కర్ణాటక లోని సింధనూరు అనే ఊళ్ళో.

చదివింది MA ఇంగ్లీష్. బి. ఎడ్.

గత కొంతకాలంగా సత్యసాయి విద్య సంస్థ లో ఆంగ్ల భాషోపాధ్యాయని గా పనిచేస్తున్నాను. మనతెలుగు కథలు. కామ్ లో గోపాలకృష్ణగారు రాసే కథలకి ఆడియో చేస్తుంటాను. గతంలో కొన్ని కథలు, కవితలు.. తెలుగు, కన్నడ, ఆంగ్లభాషల్లో రాసాను. మనతెలుగు కథలు. కామ్ లో ఇదే నా మొదటి కథ. అందరూ నా కథని ఆదరిస్తారని భావిస్తాను

bottom of page