దేవుడా... నీకు ఆధార్ ఉందా?
- Ramana Bandhakavi
- 53 minutes ago
- 6 min read
దేవుడా నీకు ఆధార్ ఉందా, బంధకవి రమణ, AI కథ, Deepfake, Artificial Intelligence, తెలుగు సమకాలీన కథ, టెక్నాలజీ కథ, వ్యంగ్య కథ, తాత్విక కథ, సోషల్ మీడియా, డిజిటల్ యుగం, నిజం మరియు నకిలీ, ఆలోచింపజేసే కథ, తెలుగు కథలు, మనతెలుగుకథలు

Devuda Neeku adhar Unda - Telugu Social Story | Ramana Bandhakavi
దేవుడా... నీకు ఆధార్ ఉందా?| - తెలుగు సామాజిక కథ | రమణ బంధకవి
Published in manatelugukathalu.com on 01/08/2026
దేవుడా... నీకు ఆధార్ ఉందా? - మన కళ్లతో చూసింది కూడా ఇక నిజమేనా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్‌ఫేక్ వీడియోలు, నకిలీ గొంతులు, కల్పిత చిత్రాలు... సాంకేతిక విప్లవం మన జీవితాన్ని ఎంత సులభతరం చేసిందో, అంతే స్థాయిలో నిజం-అబద్ధం మధ్య గీతను కూడా చెరిపేస్తోంది.
దేవుడా... నీకు ఆధార్ ఉందా? కేవలం ఒక వ్యంగ్య కథ కాదు; నమ్మకం, సాంకేతికత, మానవ సంబంధాలు, విశ్వాసం గురించి ప్రతి పాఠకుడినీ లోతుగా ఆలోచింపజేసే శక్తివంతమైన కథ.
సత్యమూర్తికి తన అరవై రెండేళ్ల జీవితంలో ఒక గట్టి నమ్మకం ఉండేది. మనుషులు అబద్ధాలు చెప్పొచ్చు, పత్రికల్లో పొరపాట్లు రావచ్చు, వదంతులు పుట్టొచ్చు, చెవులతో విన్నదంతా నిజం కాకపోవచ్చు, కానీ కళ్లతో చూసింది మాత్రం నిజం కాకుండా పోదు. ఈ నమ్మకం ఒక ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు చచ్చిపోయింది.
అప్పుడు సత్యమూర్తి బాల్కనీలో కూర్చుని పేపరు చదువుతున్నాడు. లోపల నుంచి భార్య సుశీల, “ఏవండీ... మీ ఫోన్ మోగుతోంది!” అని పిలిచింది.
ఫోన్ తీసేసరికి వీడియో కాల్. కాలేజీలో తనతో చదువుకున్న ప్రాణస్నేహితుడు శేఖర్ తెరమీద కనిపించాడు.
“ఒరేయ్ సత్యం! అర్జెంటుగా యాభై వేలు కావాలిరా. హాస్పిటల్లో ఉన్నాను. సాయంత్రానికి తిరిగి ఇచ్చేస్తాను.” అన్నాడు.
“ఏమైందిరా?” అని కంగారుగా అడిగాడు సత్యమూర్తి.
“తర్వాత చెబుతాను. ముందు డబ్బు పంపించు. అకౌంట్ నంబరు వాట్సాప్ చేస్తున్నాను.” అని కాల్ కట్ చేశాడు శేఖర్.
సత్యమూర్తి వెంటనే బ్యాంకు యాప్ తెరిచాడు. ఆ మాటలు విని అక్కడికి వచ్చిన సుశీల, “ఎవరికి యాభై వేలు పంపుతున్నారు?” అని అడిగింది.
“శేఖర్‌కి. పాపం హాస్పిటల్లో ఉన్నాడట.”
“ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కోండి.” అంది సుశీల.
“ఇప్పుడే వీడియో కాల్‌లో మాట్లాడాను!” అన్నాడు.
“అయినా ఒకసారి చెయ్యండి.” అంది.
సత్యమూర్తి విసుక్కుంటూనే శేఖర్ నంబరుకు ఫోన్ చేశాడు. అవతల నుంచి నిద్రమత్తులో గొంతు వినిపించింది.
“ఏంట్రా పొద్దున్నేఫోన్?” సత్యమూర్తి చేతిలో ఫోన్ వణికింది.
“నువ్వెక్కడున్నావు?” అడిగాడు.
“ఇంట్లో మంచం మీద. ఇంత పొద్దున్నే ఇంక ఎక్కడుంటాను?”
“మరి...హాస్పిటల్లో లేవా?”
“నేను బాగానే ఉన్నాను. నువ్వేమైనా హాస్పిటల్లో ఉన్నావా?” అన్నాడు శేఖర్.
సత్యమూర్తి మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు. తాను కాసేపటి క్రితం వీడియో కాల్ లో ఎవరితో మాట్లాడాడో అర్థం కాలేదు. శేఖర్ ముఖాన్ని తన కళ్లతో చూశాడు. అతని గొంతును తన చెవులతో విన్నాడు. అతని పెదవులు కదలడం కూడా చూశాడు. కానీ అతను శేఖర్ కాదు.
“AIతో చేసుంటారు,” అంది సుశీల చాలా తేలిగ్గా.
ఆమె వంటగదిలోకి వెళ్లిపోయింది. సత్యమూర్తి మాత్రం అక్కడే కూర్చుండిపోయాడు. మనిషి ముఖాన్ని నమ్మకూడదు. గొంతును నమ్మకూడదు. వీడియోను నమ్మకూడదు. మరి దేన్ని నమ్మాలి?
ఆ రోజు నుంచి సత్యమూర్తి చూపుకి అనుమానం పట్టుకుంది. వాట్సాప్‌లో వచ్చిన ప్రతి వీడియో కిందా అతనికి ఒక అదృశ్య ప్రశ్నార్థకం కనిపించేది. ఒకరోజు ఒక ప్రముఖ సినీనటుడు ఓ పెట్టుబడి పథకాన్ని పొగుడుతున్న వీడియో వచ్చింది. సత్యమూర్తి నమ్మలేదు. మర్నాడు అది నకిలీ వీడియో అని వార్తల్లో వచ్చింది. “చూశావా? నేను ముందే అనుకున్నాను!” అని భార్యతో గర్వంగా చెప్పాడు.
కొద్దిరోజులకు ఓ నాయకుడు సభలో ఏదో వివాదాస్పదంగా మాట్లాడిన వీడియో వచ్చింది. “ఇదీ నకిలీయే,” అని తీర్పు చెప్పేశాడు సత్యమూర్తి. కానీ అది నిజమైన వీడియో అని తేలింది.
అప్పటి నుంచి అతని సమస్య మరింత పెరిగింది. నకిలీని నిజమని నమ్మడం ప్రమాదమే. కానీ నిజాన్ని కూడా నకిలీ అనుకోవడం మొదలైతే?
ఒక సాయంత్రం అమెరికాలో ఉన్న కొడుకు వీడియో కాల్ చేశాడు. “హలో నాన్నా!” అన్నాడు.
సత్యమూర్తి తెరమీద కొడుకుని అనుమానంగా చూసి, “నువ్వేనా?” అని అడిగాడు.
కొడుకు నవ్వాడు. “నేనే నాన్నా!”
“ప్రూఫ్ ఏంటి?” అన్నాడు సత్యమూర్తి.
కొడుకు నవ్వు ఆగిపోయింది. “ఏంటి నాన్నాఇలా వింతగా మాట్లాడుతున్నావు?”
“మనిద్దరికే తెలిసిన విషయం ఒకటి చెప్పు.” అన్నాడు సత్యమూర్తి.
“నాన్నా! నాకు ఆఫీసుకి టైమవుతోంది.” విసుగ్గా అన్నాడు కొడుకు.
“అదే! అసలైన వాడివైతే చెబుతావు.” అన్నాడు సత్యమూర్తి. కొడుకు చిరాగ్గా ఫోన్ పెట్టేశాడు.
పక్కనే ఉన్న సుశీల భర్త వైపు చూసి, “ఇలాగే ఉంటే ఒకరోజు నన్ను కూడా ప్రూఫ్ అడుగుతారేమో!” అంది.
సత్యమూర్తి ఆమెను పరీక్షగా చూసి, “మన పెళ్లి ఎక్కడ జరిగింది?” అని అడిగాడు.
సుశీల చేతిలోని గరిటె పైకెత్తింది. “ఇంకో ప్రశ్న అడిగారంటే ఎక్కడ జరిగిందో కాదు... ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తుంది!” ఆ విషయంలో మాత్రం సత్యమూర్తికి ఎలాంటి అనుమానం రాలేదు. ఆమె తన భార్యే.
ఆదివారం వాళ్ల కూతురు కుటుంబంతో ఇంటికి వచ్చింది. మనవరాలు మిహిర తన టాబ్లెట్‌లో ఓ ఫొటో చూపిస్తూ, “తాతయ్యా! చూడు!” అంది. సత్యమూర్తి చూశాడు. ఒక్క క్షణం అతని గుండె ఆగినంత పనైంది. ఫొటోలో తన తండ్రి ఉన్నాడు. పక్కనే సత్యమూర్తి. వాళ్ల మధ్య మిహిర నవ్వుతూ నిలబడింది. సత్యమూర్తి తండ్రి చనిపోయి ఇరవై ఏళ్లయింది. మిహిర పుట్టి పదేళ్లే అయింది. వాళ్లిద్దరూ ఎప్పుడూ కలవలేదు.
“ఎలా ఉంది తాతయ్యా? AIతో చేశాను!” అంది. అందరూ నవ్వారు. సత్యమూర్తి నవ్వలేదు. ఫొటోను చేతిలోకి తీసుకుని చాలాసేపు చూస్తూ ఉండిపోయాడు. తన తండ్రి ముఖంలో అదే చిరునవ్వు. భుజాల మీద అదే కండువా. తన చిన్నప్పుడు చూసినట్టే ఉన్నాడు. కానీ అది ఎప్పుడూ జరగని క్షణం. అసలు లేని జ్ఞాపకం.
ఆ రాత్రి సత్యమూర్తికి నిద్ర పట్టలేదు. చనిపోయినవాళ్లను బతికున్నట్టు చూపించవచ్చు. ఎన్నడూ కలవని మనుషులను ఒకే ఫొటోలో నిలబెట్టవచ్చు. చెప్పని మాటలు చెప్పించవచ్చు. చేయని పనులు చేసినట్టు చూపించవచ్చు. అయితే రేపు తాను నిజంగా జీవించిన జీవితానికీ, ఎవరో తయారుచేసిన జీవితానికీ తేడా ఏమిటి?
లేచి పూజగదిలోకి వెళ్లాడు. ఎదురుగా దేవుడి పటం. చేతులు జోడించి, “స్వామీ! చిన్నప్పుడు మా అమ్మ నిన్ను చూపించి దేవుడంది. నమ్మాను. ఇప్పుడు నా కళ్లతో చూసింది కూడా నమ్మలేకపోతున్నాను. ఏది నిజమో, ఏది నకిలీయో తెలుసుకునే బుద్ధి ఇవ్వు,” అన్నాడు.
గదిలో ఒక్కసారిగా వెలుగు నిండింది. సత్యమూర్తి కళ్లు మూసుకున్నాడు. తెరిచేసరికి ఎదురుగా దేవుడు నిలబడి ఉన్నాడు. తలపై కిరీటం. మెడలో పూలమాల. ముఖంలో చిరునవ్వు.
“భక్తా! నీ ప్రార్థన విన్నాను.” సత్యమూర్తి ఉలిక్కిపడి ఒక్క అడుగు వెనక్కి వేశాడు. దేవుడు చిరునవ్వుతో చేయి పైకెత్తి, “భయపడకు నాయనా!” అన్నాడు. కానీ సత్యమూర్తి భయపడలేదు. అనుమానపడ్డాడు. ఈ మధ్య అతనికి భయం కన్నా అనుమానమే ఎక్కువగా వస్తోంది.
మెల్లగా జేబులోంచి ఫోన్ తీసి దేవుడి ఫొటో తీశాడు. ఫొటోలో దేవుడు కనిపించాడు. వీడియో తీశాడు. అందులోనూ కనిపించాడు. అనుమానం తగ్గలేదు.
“మీరెవరు?” అడిగాడు.
దేవుడి చిరునవ్వు కొద్దిగా తగ్గింది. “దేవుణ్ణి నాయనా.”
“దానికి రుజువేమిటి?”
సృష్టి మొదలైనప్పటి నుంచి ఎవరూ అడగని ప్రశ్న ఎదురైనట్టు దేవుడు సత్యమూర్తి ముఖంలోకి చూశాడు. “నువ్వే కదా నన్ను రమ్మని ప్రార్థించావు?”
“మిమ్మల్ని అవమానించడానికి అడగడం లేదు స్వామీ. మొన్న నా ప్రాణస్నేహితుడే వీడియో కాల్ చేసి యాభై వేలు అడిగాడు. ముఖం వాడిదే. గొంతు వాడిదే. కానీ వాడు కాదు. ఇప్పుడు నా కళ్లనే నేను నమ్మలేకపోతున్నాను. మీరే చెప్పండి... మిమ్మల్ని ఎలా నమ్మాలి?”
దేవుడి ముఖంలో చిరునవ్వు. కాసేపు సత్యమూర్తి వైపు చూసి, “సరే నాయనా. ఏం చేస్తే నమ్ముతావు?” అని అడిగాడు.
సత్యమూర్తి కాసేపు ఆలోచించి బాల్కనీ వైపు చూశాడు. అక్కడ ఒక మల్లెమొక్క ఉంది. ఆరు నెలల క్రితమే ఎండిపోయింది. దాన్ని పీకేసి పారేయమని సుశీల ఎన్నిసార్లు చెప్పినా, ఎందుకో సత్యమూర్తి దాన్ని అలాగే ఉంచాడు. “ఆ మొక్కను బతికించగలరా?”
దేవుడు చిరునవ్వుతో దానివైపు చూశాడు. సత్యమూర్తి కళ్ల ముందే ఎండిపోయిన కొమ్మల్లో చిన్న పచ్చని చిగుళ్లు మొలిచాయి. క్షణాల్లో అవి ఆకులయ్యాయి. మొగ్గలు తొడిగాయి. తెల్లటి మల్లెపూలు వికసించాయి. బాల్కనీ అంతా పరిమళంతో నిండిపోయింది. సత్యమూర్తి నోరు తెరిచి చూస్తుండిపోయాడు. ఆనందంతో వెంటనే ఫోన్ లో వీడియో తీశాడు. కుటుంబ వాట్సాప్ గ్రూపులో పెట్టాడు.
మొదటి సమాధానం అమెరికాలోని కొడుకు నుంచి వచ్చింది. “నాన్నా! ఇది AIవీడియో. ఇలాంటి వీడియోలు ఇప్పుడు రెండు నిమిషాల్లో చేసేయొచ్చు.”
మనవరాలు మిహిర, “సూపర్ టైమ్‌లాప్స్ తాతయ్యా!” అని స్పందించింది.
సత్యమూర్తి ఫోన్ నుంచి తలెత్తి దేవుడి వైపు చూశాడు. “ఎవరూ నమ్మడం లేదు స్వామీ.”
“కానీ నీ కళ్ల ముందే జరిగింది కదా!”
అదే సమస్య. సత్యమూర్తి తన కళ్లతో శేఖర్‌ను కూడా చూశాడు. కొద్దిసేపటి క్రితం పరవశంతో చూసిన మల్లెమొక్కను ఇప్పుడు అనుమానంగా చూశాడు. “స్వామీ... ఇంకోటి చేసి చూపించగలరా?”
దేవుడి ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. అయినా సరే అన్నట్టు తల ఊపాడు. సత్యమూర్తి కాసేపు ఆలోచించాడు. అకస్మాత్తుగా అతని కళ్ల ముందు తండ్రి ముఖం మెదిలింది. “మా నాన్న చనిపోయి ఇరవై ఏళ్లయింది స్వామీ. ఒక్కసారి... ఒక్కసారి ఆయన గొంతు వినాలని ఉంది.”
గదిలో నిశ్శబ్దం అలుముకుంది. మరుక్షణం, “ఏరా సత్యం... ఇంకా చిన్నప్పటిలాగే ప్రతి దానికీ అనుమానమేనా?” అన్న గొంతు వినబడింది. సత్యమూర్తి శరీరం ఒక్కసారిగా జలదరించింది.
అది తన తండ్రి గొంతే! అదే ప్రేమ. అదే గాంభీర్యం. తన పేరును పలికే అదే ప్రత్యేకమైన తీరు.
“నాన్నా...” అంటూ సత్యమూర్తి గొంతు వణికింది. కళ్లలో నీళ్లు తిరిగాయి. అప్రయత్నంగా అతని చేయి ఫోన్ వైపు వెళ్లింది. అంతలో ఆగిపోయింది. ఇప్పుడు గొంతులను కూడా ఏఐతో తయారు చేయవచ్చని అతనికి తెలుసు. దేవుడు అతని వైపు చూస్తున్నాడు. సత్యమూర్తి నెమ్మదిగా చేయి వెనక్కి తీసుకున్నాడు.
ఆ క్షణంలో దేవుడి కన్నా తన మీద తనకే ఎక్కువ జాలేసింది. తండ్రి గొంతు విని ఏడవాలో, అది నిజమేనా అని అనుమానించాలో కూడా తెలియని స్థితికి వచ్చేశాడు. కాసేపటి తర్వాత సత్యమూర్తికి మరో ఆలోచన వచ్చింది. “స్వామీ! నా ఒక్కడి ముందు మహిమ చేస్తే లాభం లేదు. అందరూ చూసేలా ఏదైనా చేయండి.”
దేవుడు కిటికీలోంచి బయటకు చూశాడు. వేసవి ఎండ మండిపోతోంది. ఆకాశంలో మబ్బు జాడ లేదు.
క్షణాల్లో వాళ్ల అపార్ట్‌మెంట్ మీద మాత్రమే మేఘాలు కమ్ముకున్నాయి. వర్షం కుండపోతగా కురవడం మొదలైంది. కాంపౌండ్‌లో పిల్లలు కేరింతలు కొడుతూ పరుగులు తీశారు. బాల్కనీల్లోకి వచ్చినవాళ్లు ఫోన్లు తీసి వీడియోలు తీయడం మొదలుపెట్టారు. రోడ్డుకు అవతల మాత్రం ఎండ అలాగే మండుతోంది. సత్యమూర్తి ముఖం వెలిగిపోయింది. ఇప్పుడు ఎవరు కాదంటారు? పది నిమిషాల్లో అపార్ట్‌మెంట్ వాట్సాప్ గ్రూపు మోగడం మొదలైంది.
“క్లౌడ్ సీడింగ్ అయి ఉంటుంది.”
“ఎక్కడో సినిమా షూటింగ్ కోసం రెయిన్ మెషిన్ పెట్టారట.”
“ఈ వీడియో కూడా ఏఐ కావచ్చు.”
“ఫ్యాక్ట్ చెక్ వచ్చే వరకు ఫార్వర్డ్ చేయొద్దు,” అని అందరికీ జ్ఞానబోధ చేశాడు ఒకాయన.
చివరగా అపార్ట్‌మెంట్ కార్యదర్శి సందేశం వచ్చింది.
“వర్షం వల్ల బేస్‌మెంట్‌లో నీళ్లు చేరాయి. దీనికి బాధ్యులు వెంటనే వివరణ ఇవ్వాలి.”
సత్యమూర్తి ఫోన్ పక్కన పెట్టాడు. దేవుడు అతని వైపు చూశాడు.
“ఇప్పుడైనా నమ్మావా నాయనా?” సత్యమూర్తి వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. ఆ చిన్న మౌనం దేవుడికి అర్థమైంది. సత్యమూర్తి తల వంచుకున్నాడు. “మిమ్మల్ని నమ్మాలనుంది స్వామీ. నిజంగా నమ్మాలనుంది. కానీ ఈ ప్రపంచం నా నమ్మే శక్తినే తీసేసింది.”
దేవుడు కొంతసేపు అతని వైపు చూస్తూ ఉండిపోయాడు. “ఒకప్పుడు మనిషి చూడనిదాన్ని కూడా నమ్మేవాడు. ఇప్పుడు చూసినదాన్ని కూడా నమ్మలేకపోతున్నాడు. మాయను సృష్టించింది నేనే అనుకున్నాను నాయనా. మీ AI నన్ను మించిపోయింది. ఇదే మీ కొత్త ప్రపంచమా నాయనా?”
సత్యమూర్తి దగ్గర సమాధానం లేదు. దేవుడు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. సత్యమూర్తి కంగారుగా, “ఆగండి స్వామీ!” అన్నాడు. ఏం అడగాలో తెలియక సత్యమూర్తి కాసేపు ఆయన వైపు చూస్తూ ఉండిపోయాడు. చివరకు ఏదో ఆఖరి ఆధారం కోసం వెతుకుతున్నట్టు అడిగాడు, “పోనీ... మీకు ఆధార్ ఉందా స్వామీ?”
దేవుడు అతని ముఖంలోకి చిత్రంగా చూశాడు. “సృష్టి అంతటికీ నేనే ఆధారమని నమ్ముతారు నాయనా...” క్షణం ఆగి చిన్నగా నవ్వాడు. “మరి ఇప్పుడు నాకే ‘ఆధార్’ అడుగుతున్నావే?”
సత్యమూర్తి తల వంచుకున్నాడు. దేవుడు నవ్వాడు. అంతలో సత్యమూర్తికి ఏదో గుర్తొచ్చింది. “ఆగండి స్వామీ... కనీసం ఒక్క సెల్ఫీ అయినా తీసుకుందాం. మీరు వచ్చారని గుర్తుగా ఉంటుంది.”
దేవుడు అతని పక్కన నిలబడ్డాడు. సత్యమూర్తి ఫోన్ పైకెత్తాడు. ఇద్దరూ కెమెరా వైపు చూశారు.
క్లిక్! ఫొటో వచ్చింది. దేవుడు అందులో స్పష్టంగా కనిపిస్తున్నాడు. సత్యమూర్తి ఆనందంగా దాన్ని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాడు. క్షణాల్లో మనవరాలి కామెంట్ వచ్చింది. “వావ్ తాతయ్యా! AIతో చేసిన దేవుడు చాలా రియల్‌గా ఉన్నాడు!”
కొడుకు స్పందించాడు. “నాన్నా... ఇలాంటి ఫేక్ ఫొటోలు ఫార్వర్డ్ చేయొద్దు.”
పక్కింటి సుబ్బారావు ఇంకో అడుగు ముందుకేసి, “సూపర్ ఎడిటింగ్ సార్! దేవుడికి నీడ పెట్టడం మర్చిపోయారు,” అన్నాడు.
సత్యమూర్తి ఉలిక్కిపడి పక్కకు చూశాడు. దేవుడు లేడు. ఎప్పుడు వెళ్లిపోయాడో తెలియదు. గోడ మీదున్న పటంలో మాత్రం చిరునవ్వుతో చూస్తున్నాడు. సత్యమూర్తి మళ్లీ ఫోన్‌లోని ఫొటో చూశాడు. అందులో దేవుడు ఉన్నాడు. నిజంగానే ఉన్నాడు. కానీ ఆయనను కళ్లారా చూసిన సత్యమూర్తికే ఇప్పుడు చిన్న అనుమానం వచ్చింది. ఫొటో నిజమా? లేక AI సృష్టించిందా? అంతలో మనవరాలి నుంచి మరో సందేశం వచ్చింది.
“తాతయ్యా! నీ ఫొటో వైరల్ అయింది. పది లక్షల వ్యూస్!”
సత్యమూర్తి ఆశ్చర్యంగా ఫోన్ చేసి, “అంటే అందరూ నమ్మారా?” అని అడిగాడు.
మనవరాలు నవ్వింది. “నమ్మడమేంటి తాతయ్యా! అందరూ ఫేక్ అంటున్నారు. అందుకే వైరల్ అయింది!”
సత్యమూర్తి ఫోన్ పక్కన పెట్టి పూజగదిలోని దేవుడి పటం వైపు చూశాడు. దేవుడు ఉన్నాడో లేదో ప్రపంచం వేల సంవత్సరాలుగా తేల్చుకోలేకపోయింది. కానీ ఆయన ఫొటో ఫేక్ అని మాత్రం పది లక్షల మంది ఒక్కరోజులోనే తీర్పు చెప్పేశారు.
***
రమణ బంధకవి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: రమణ బంధకవి
రమణ బంధకవి, ఒక ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ లో ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేసి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నారు. సాహిత్యాభిలాష, తెలుగు మరియు ఆంగ్లంలో రచనాభిలాష కలిగినవారు. కథలు, కవితలు, నవలలు, అనువాద నవలలు వ్రాయడం హాబీ. ఇప్పటివరకు ముప్పై పైచిలుకు కథలు, ఎన్నో కవితలు, రెండు అనువాద నవలలు ప్రచురింపబడ్డాయి. రెండు స్వీయ నవలలు ప్రస్తుతం ప్రచురణలో ఉన్నాయి. ఒకటి 'సంచిక' వెబ్ మాగ్జైన్ వార పత్రికలో ధారావాహికగా వస్తోంది. ఇంకోటి 'ప్రతిలిపి' లో ధారావాహికగా వస్తోంది.


