top of page

దేవుడు వెళ్లిపోయాడు


'Devudu Vellipoyadu' New Telugu Story


Written By Ch. C. S. Sarma



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

మానవ రుణానుబంధాలు చిత్రవిచిత్రాలు . వాటికి చదువు సంస్కారంతో పనిలేదు.... మంచి మానవత్వం వున్న మనస్సు వుంటే చాలు...మనిషి దేవుడై పోతాడు.

స్టేషన్లో రైలు బండి వచ్చి ఆగింది. ఆ స్టేషన్లో దిగ వలసినవారు గమ్యాన్ని చేరామనే ఆనందంతో భోగీల నుంచి కిందకు దిగుతున్నారు.ఆ బండి ఎక్కి ముందుకు ప్రయాణం చేయ వలసిన వారు హడావుడిగా తమ సామాగ్రితో కంపార్టుమెంట్స్ లో ఎక్కుతున్నారు వారి వారి టికెట్ తరగతి ననుసరించి.


నారిగాడు లచ్చి దంపతులు. రెండు గోనె సంచులను చేతపట్టుకొని ఎంతో రద్దీగావున్న మూడవ తరగతి జనరల్ కంపార్టుమెంట్లో అతి కష్టం మీద ఎక్కారు. వున్న సీట్లలో , మధ్యన నడిచే దారిలో జనం నిలబడి వున్నారు. కంపార్టుమెంట్ ముందువున్న ఎక్కే ద్వారం ప్రాంతానవున్న ఖాళీ స్థలంలో లోనికి పోలేక తమ సంచుల్నీ భోగీ చెక్కకు ఆనించి ఇరువురూ ఆ చెక్కకే ఆనుకొన్నారు.


బండి కూతవేసి ముందుకు బయలుదేరింది. అరగంటలో ... ప్రక్క స్టేషన్లో ఆగింది. మధ్యన నిలబడి వున్న వారు కొంతమంది దిగిన కారణంగా... లోన వున్నందున నారిగాడు... లచ్చి మధ్య దారిలోకి రాగలిగారు.


వారివురి వదనాలు... ఎంతో దీనంగా కళావిహీనంగా వున్నాయి. తలకు తైల సంస్కారం లేదు. కళ్ళల్లో కాంతి లేదు. వారి హృదయాల నిండా వున్నది ఆవేదన.


పడమట సూర్యుడు అస్తమించాడు. కంపార్టుమెంట్లో దీపాలు వెలిగాయి. చీకటిని చీల్చుకొంటూ రైలు బండి ముందుకు పోతూవుంది.


బండి మరో స్టేషన్లో ఆగింది. చాలామంది దిగారు. నారిగాడికి లచ్చికి సీట్లు దొరికాయి. బెంచీక్రింద తమ లగేజీని వుంచి కిటికీ వైపున లచ్చి ... ఆమె ప్రక్కన నారిగాడు కూర్చున్నారు. బండి కదిలింది.


“మామా!.. బాధపడుతుండావా?...” నారిగాడి ముఖంలోకి చూస్తూ దీనంగా అడిగింది లచ్చి.

“లేదు... అన్నట్టు తలను పంకించాడు నారిగాడు. కొద్ది సేకన్లు అతని ముఖాన్ని పరీక్షగా చూచిన లచ్చి ...


“మనం ఏ వూరు పోతూండాము మామ?...” మెల్లగా అడిగింది.

“మనలను ఎవరూ గుర్తించని వూరికి...” కిటికీ గుండా శూన్యంలోకి చూస్తూ చెప్పాడు నారిగాడు.

“ఆవూరి పేరెంది మామా!...”

“విశాఖపట్నం...”


“ఈ బండి అక్కడికి ఎపుడు చేరుద్ది ?...”

“తెల్లరగట్ల అనుకొంటా...”


మనసుల్లో ఎంతో ఆవేదన వున్న ఆ యిరువురూ ... కిటికీగుండా శూన్యంలోకి చూస్తూ... వేగంగా జరిగిపోతున్న చెట్లను.. పుట్లను.. చూస్తూ వుండిపోయారు. బండి మరో స్టేషన్లో ఆగింది. లోనికి ఆహారపదార్ధాలను అమ్మే వ్యక్తి వచ్చాడు. ‘పులుసన్నం...పెరుగన్నం..’ అంటూ అరవసాగాడు.


ఒక పులసన్నం... ఒక పెరుగన్నం పోట్లాలను కొన్నాడు నారిగాడు. రెంటినీ లచ్చి చేతికి యిచ్చాడు. వంగి...బెంచీ క్రిందవున్న గోనె సంచిని ముందుకు లాగి అందులో వున్న నీళ్ళ బాటిల్ ను తీసి లచ్చికి అందించి ... సంచి మూతి కట్టి బెంచీ క్రిందకు తోసాడు..


“తిను..” లచ్చిని చూస్తూ చెప్పాడు నారిగాడు.

“నీవు?...”

“పోట్లాం విప్పు... ఇద్దరం తిందామ్...”

లచ్చి పులుసన్నం పొట్లం విప్పింది. ఇద్దరూ తినడం ప్రారంభించారు . పులుసన్నం అయిపోయింది. లచ్చి పెరుగన్నం పొట్లం విప్పింది. యిద్దరు దానిని తిని నీళ్ళు త్రాగారు.


లచ్చి నారిగాడి కళ్ళల్లోకి చూచింది. అతని కళ్ళల్లో నీళ్ళు. అతని మనోవేదనకు కారణం లచ్చికి తెలిసిందే. చేతిలోని అరిటాకూ కాగితాన్ని కిటికీ గుండా గాల్లోకి వదలింది. తన కళ్ళల్లో నిండిన కన్నీటిని పమిటతో తుడుచుకొని నారిగాడి భుజంపై వాలి కళ్ళు మూసుకొంది... లచ్చిని చూస్తూవున్న నారిగాడి మదిలో జ్ఞాపకాలు...

&&&&& &&&&& &&&&&


నారిగాడు ... మాలకొండయ్య పాలేరు. ఆయన భూస్వామి. భార్య కమలమ్మ. వారి ఇంట్లో లచ్చి పనిపిల్ల.

నారిగాడికి లచ్చికి మనసులు కలిశాయి. నారిగాడికి మేనత్త తప్ప ఎవరూ లేరు. లచ్చి తల్లి తన చిన్నతనంలోనే పైకి వెళ్లిపోయింది. నారిగాడి తండ్రి లచ్చి తల్లి అన్న చెల్లెళ్ళు. నారిగాడు లచ్చి ... వారి చిన్న తనంనుంచి మాలకొండయ్య ఇంట్లోనే పనిచేస్తున్నారు. వారిరువురినీ కొండయ్య దంపతులు ఎంతో అభి మానం తో చూచుకొనే వారు. నారిగాడి మనస్సును ఎరిగిన కొండయ్య లచ్చి తండ్రితో మాట్లాడి ఏడాది క్రిందట... లచ్చికి నారిగాడికి వివాహం జరిపించారు.


మాలకొండయ్య భార్య కమలమ్మ ... ఆ ఇద్దరినీ ఎంతగానో అభిమానించేది . వారి పెండ్లి జరిగి పది సంవత్సరాలైంది. మూడుసార్లు గర్భస్రావం జరిగింది. బిడ్డలకోసం ఆ దంపతులు ఎన్నో క్షేత్రాలు దర్శించారు. నోములు వ్రతాలు చేశారు. కానీ వారి ఇంట పసిబిడ్డ కేరింతలు వినబడలేదు.


పదకొండవ ఏట కమలమ్మ నెల తప్పింది. అదే సమయాన లచ్చి కడుపూ పండింది. ఇరువురూ కాన్పుకు హాస్పిటల్లో చేరారు.


కమలమ్మను డాక్టర్లు పరీక్ష చేసి, బిడ్డ అడ్డం తిరిగిందని... సాధారణ కాన్పు జరగదని మాల కొండయ్యకు చెప్పారు. సిటీ నుంచి పెద్ద డాక్టర్లను పిలిపించి పరీక్షలు జరిపారు. బిడ్డో తల్లో ఎవరినో ఒకరిని మాత్రం రక్షించగలం అని ఆ డాక్టర్ తెలియజేశాడు. మాలకొండయ్య... తన భార్య ప్రాణాలను కాపాడమని కన్నీటితో వారిని అర్ధించాడు.


ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీసి కమలమ్మ ప్రాణాలను కాపాడారు డాక్టర్లు. అదే సమయంలో లచ్చి మొగ శిశువును కన్నది. ఆమె కాన్పు ఆయుధాల కాన్పు. బిడ్డ బరువు త్రీ పాయింట్ ఎయిట్ కేజీలు. బిడ్డా తల్లి క్షేమం.

&&&&& &&&&& &&&&&


మాలకొండయ్యను భార్య కమలమ్మ కు స్పృహ వచ్చి... బిడ్డను గురించి అడిగితే ఏమి చెప్పాలనే ప్రశ్న వేధిస్తూ వుంది. ఇది తన నాల్గవ గర్భం. నిలబడి నవమాసాలు మోసినందుకు... తనకు ఆడో... మగో... బిడ్డ పుట్టబోతున్నందుకు ఎంతగానో సంతోషించింది. ఇప్పుడు జరిగిన యధార్ధం ఆమెకు తెలిస్తే ... ఆ నిజాన్ని నమ్ముతుందా!... నమ్మి ప్రాణాలతో బ్రతుకుతుందా!... విషయాన్ని విన్న ఆమె గుండె ఆగిపోతుందా!... అన్నీ అయోమయమైన ... ఆవేదనాపూర్వకమైన ప్రశ్నలే!!... నా కమల క్షేమంగా వుండాలి. బిడ్డ కడుపులోనే పోయిందన్న విషయం ఆమెకు తెలియకూడదు. స్పృహ వచ్చిన తర్వాత ... ఈ చెడు నిజం ఆమెకు తెలియకుండా ఎలా వుంటుంది?... తెలియకుండా వుండాలంటే తాను ఏమి చేయాలి?... ఏమి చేయగలడు ?...


ఎంతోసేపు ఈ తర్జన భర్జన మనస్సున జరిగిన తర్వాత ... మాలకొండయ్య ఒక నిర్ణయానికి వచ్చాడు. డాక్టర్ నర్సులను కలసి జరిగిన విషయాన్ని స్పృహ వచ్చిన తర్వాత కమలకు చెప్పవద్దని, బిడ్డ బలహీనంగా వున్న కారణంగా ... ఐ.సి.యు.లో వుంచామని , రెండు మూడు రోజుల తర్వాత కమల ప్రక్కకు చేరుస్తామని ... చెప్పవలసిందిగా వారిని కోరాడు. వారూ అందుకు అంగీకరించారు.

&&&&& &&&&& &&&&&


“నారిగా!... నీవు నా భార్యను బ్రతికించాలి. నీ బిడ్డను నాకు ఇవ్వాలి. ఇవి చేతులు కావు కాళ్ళనుకో!” దీనంగా ఏడుస్తూ నారిగాడి చేతులు పట్టుకొన్నాడు మాలకొండయ్య.


ఎప్పుడు ఎంతో శాంతంగా ప్రశాంతంగా నవ్వుతూ వుండే కొండయ్యగారి వదనం లో ఎంతో వేదన, కళ్ళల్లో కన్నీరు, ముఖం కళావిహీనంగా వుండటాన్ని చూసిన నారిగాడి మనస్సు... తన యజమాని స్థితిని చూచి బాధ పడుతూవుంది. ఆయన కోరిన కోరిక మామూలు కోరిక కాదు. అదే మనస్సును వేధిస్తూ వుంది. ‘తన బిడ్డను...యజమానికి ఇవ్వడమా!... లచ్చి అడిగితే ... ఆమె ప్రశ్నకు తను ఏమని జవాబు చెప్పగలడు?... అయ్యగారు కోరరాని కోరికను కోరారు. పాపం... తల్లి లాంటి కమలమ్మకు తన బిడ్డ చచ్చిపోయిందని తెలిస్తే... ఆమె పరిస్థితి ఏమిటి?... బ్రతక గలదా!... లేక ... ’ చెడ్డగా వూహించలేక పోయాడు నారిగాడు. ‘ఆ తల్లి తనకు తల్లి లాంటిదే. తన్ను ఎంతో ఆదరాభిమానాలతో చూచుకొనేది. అలాంటి ఆ మహాతల్లి చావకూడదు. బ్రతకాలి.ఆమె బ్రతకాలంటే తను... తను బిడ్డను యజమాని చేతుల్లో వుంచాలి... వేరే మార్గం లేదు....’


“నారిగా!... నేను కోరింది తప్పే...కానీ నాకు మీ అమ్మను బ్రతికించుకునేదానికి వేరే ఏ దారి లేదురా... చూడూ... నీ వయస్సు ఇరవై ఎనిమిది... లచ్చి వయస్సు ఇరవైరెండు... కానీ నా వయస్సు నలభై ఐదు. మీ అమ్మది నలభై. మీ ఇరువురిని ఆ దేవుడు చల్లగా చూస్తే వచ్చే సంవత్సరం ఈనాటికి... మరో బిడ్డ పుడుతుంది. గర్భసంచి తీసేసిన కారణంగా మీ అమ్మకు ఇక ...ఈ జన్మలో సంతానం కలిగే అవకాశం లేదురా!... నా మాటను కాదనకు. నీకు ఏంకావాలన్నా ఇస్తాను. నీ బిడ్డను నాకు ఇచ్చి మీ అమ్మను బ్రతికించరా!... మీ అమ్మను బ్రతికించరా!...” భోరున విలపించాడు మాలకొండయ్య.


మాలకొండయ్య ఆవేదన... నారిగాడి మనస్సును పిండేస్తూవుంది. ‘అయ్యగారు చెప్పిన ప్రతిమాటా నిజమే!... పదిహేను సంవత్సరాలుగా వారి ఉప్పూ పులుసూ తింటున్నాను. ఈ కాలంలో తమపని వారిని ఈ దంపతుల మాదిరి ఆదరించి అభిమానించే వారు చాలా తక్కువ . అయ్యగారి... అమ్మగారి ... ఆనందం కోసం తన బిడ్డను...తన బిడ్డను మాల కొండయ్య చేతుల్లో పెట్టాలని నిర్ణయించుకొన్నాడు.


“అయ్యా!... నాతో రండి...”


ఇరువురు లచ్చి మంచం దగ్గరికి వచ్చారు. ఆయుధాల కాన్పు అయినందున లచ్చి స్పృహ లేకుండా మంచంలో వుంది. ప్రక్కనవున్న వూయలలో బిడ్డ నిద్రపోతూవున్నాడు.


పుట్టి కొన్ని గంటలే అయినా ఆ పసికందును మెల్లగా తన చేతుల్లోకి తీసుకొన్నాడు నారిగాడు. తన స్పర్శతో ఆ బిడ్డ మేల్కొని కళ్ళు తెరిచాడు. నారిగాడిని చూచాడు. క్షణం సేపు వాడి కళ్ళల్లోకి చూచి...బిడ్డను మాలకొండయ్య చేతుల్లో వుంచాడు నారిగాడు. అతని కళ్ళల్లో కన్నీరు... మాలకొండయ్య కళ్ళల్లో కూడా కన్నీరు.... ఒకరివి ఆవేదనాపూర్వక జలాధార... మరొకరివి ఆనంద భాష్పాలు.మాలకొండయ్య బిడ్డను యెత్తుకొని వేగంగా తన అర్ధాంగి వున్న గదిలోకి వెళ్లిపోయాడు... కన్నీటితో.. ఆవేదనతో నారిగాడు లచ్చి మంచం దగ్గర నుండి బయటికి వచ్చాడు.


నర్సు... గుడ్డలో చుట్టి చనిపోయిన బిడ్డతో ఎదురైంది. తన చేతుల్లో వున్న దాన్ని నారిగాడికి అందించింది.


మాలకొండయ్య వారిరువురినీ సమీపించాడు. నారిగాడి కళ్ళల్లోకి చూచాడు. అతని చూపుల్లోని భావన నారిగాడికి అర్ధం అయింది.

“నారిగా!... నాకోసం నీవు ఎన్నో పనులు చేశావు. యీ పనీ నీవే చేయాలిరా!” మాలకొండయ్య కంఠం బొంగురు పోయింది. నయనాల్లో కన్నీరు. ..తల పంకించి తన యజమానిగారి చనిపోయిన ఆడబిడ్డతో నారిగాడు శ్మశానం వైపుకు నడిచాడు.

&&&&& &&&&&

సమయం వుదయం ఐదు గంటల ప్రాంతం. నారిగాడు శ్మశానంలో ప్రవేశించాడు . కాటికాపరి... కోసం చుట్టూ చూచాడు. కనుపించలేదు. అది నది ఒడ్డు. లోనికి నడిచాడు. చేతిలో వున్నదాన్ని నేలన వుంచి ... చేతితో ఇసుకను తోడాడు. ఆ బిడ్డ శవాన్ని గోతిలో వుంచాడు.


“నీకు నాకు ఏనాటి రుణమో... తల్లీ! నేను చేసేదాంట్లో నీకు ఏదైనా తప్పుగా తోస్తే నన్ను చమించమ్మా!... తండ్రిలాంటి అయ్యగారి మాటను కాదనలేక నేను ఈపని చేస్తుండాను. నన్ను మన్నించమ్మా!”... చేతులు జోడించి కూర్చుని మట్టిని కప్పేశాడు. లేచి నిలబడి మరోమారు దణ్ణం పెట్టి వెనక్కు బయలు దేరాడు.


గేటు ముందు కాటికాపరి కోటేశు ఎదురు పడ్డాడు.

“ఏరా! నారిగా... ఈడకెందుకొచ్చినావ్?...”

“బిడ్డ పోయింది... నీకోసం ఎతికినా.. కనపడలా ... పని ముగించి వస్తుండా! ఇదిగో.. నీ కాటి సుంకం.. పైపంచకు వేసివున్న ముడిని విప్పి ... అందులోవున్న నూరు రూపాయల కాగితాన్ని కాటికాపరి చేతిలో పెట్టాడు. వాడు పిలుస్తున్న ఆగకుండా వేగంగా వెళ్లిపోయాడు నారిగాడు ఆ శ్మశాన ప్రాంతం నుండి.

&&&&& &&&&&


దినకరుని దివ్యతేజం ... జగతి నలుమూలలా వ్యాపించింది. నారిగాడు లచ్చి మంచం ప్రక్కనే వున్నాడు. లచ్చి మెల్లగా కళ్ళు తెరిచింది. ఎదురుగా వున్న నారిగాడి ముఖంలోకి చూచింది.

అతని కళ్ళు చింతనిప్పుల్లా వున్నాయి. “లచ్చీ!” ఆప్యాయంగా ఆమె చేతిని పట్టుకొన్నాడు.

లచ్చి... ప్రక్కన చూచింది . బిడ్డ లేని కారణంగా కొంచెం దూరంగా వున్న ఊయలను చూచింది. బిడ్డ కనపడలేదు. ఆత్రంగా నారిగాడి ముఖంలోకి చూచి... “అయ్యా!... మనబిడ్డ ...” లచ్చి పూర్తి చేయక ముందే నారిగాడు....


“పోయింది... లచ్చీ!...” మెల్లగా చెప్పాడు.

లచ్చి తన చెవులును తాను నమ్మలేక పోయింది.కాస్త హెచ్చు స్థాయీ లో ...” నా బిడ్డ ఏదయ్యా!...” గద్ధించినట్లు అడిగింది. ఆమె వదనంలో ఆందోళన... ఆవేదన నిండివున్నాయ్.


నారిగాడు లచ్చి ప్రక్కన కూర్చున్నాడు. తలపై చేతిని వుంచి వంగి... “బిడ్డ పోయింది లచ్చీ!...” బొంగురుపోయిన కంఠంతో చెప్పాడు. అతని కన్నీరు లచ్చి నొసటిపైనా రాలాయి.


లచ్చి బోరున ఏడవసాగింది... తనలో పొంగివస్తున్న దుఃఖాన్ని అణచిపెట్టుకొంటూ నారిగాడు...” అది మనది కాదు. మనం ఋణపడి వున్నాం. ఆ రుణం తీర్చుకొని వెళ్లిపోయింది... బాధ పడకే...” గద్గదస్వరం తో చెప్పలేక చెప్పాడు నారిగాడు.

లచ్చి మాతృత్వం ... ఆ చెడు నిజాన్ని నమ్మలేక ఎంతగానో విలపించింది. గుండెలకు లచ్చిని హత్తు కొని ఓదార్చాడు నారిగాడు.

&&&&& &&&&&


నాల్గవ రోజున లచ్చిని డిశ్చార్జ్ చేశారు. పదవ రోజున కమలమ్మ పండంటి బాబుతో డిశ్చార్జ్ అయి ఆనందంగా ఇంటికి చేరింది. ఆమె ఆనందానికి హద్దులు లేవు.

మాలకొండయ్య నారిగాడిని కలిశాడు. పాతికవేలు డబ్బు కట్టను ‘తీసుకో నారిగా’ అంటూ ఇవ్వబోయాడు.


“అయ్యా!... నేను మీ రుణాన్ని తీర్చుకున్నానని అనుకొంటుండా!... యీ డబ్బు తీసుకొని తమరికి మళ్ళా రుణపడ్డం నాకిష్టం లేదయ్యా...నాకొద్దు”... సవినయంగా మెల్లగా చెప్పాడు.


మాలకొండయ్య ... నారిగాడి తత్వాన్ని ఎరిగి వున్నవాడు కాబట్టి వాణ్ని బలవంతపెట్టి ప్రయోజనం లేదని ... మౌనంగా వుండిపోయాడు.

“అయ్యా! ఒక్కమాట... ఇక నేను ఈ వూర్లో వుండకూడదు. వుండలేను... పదిహేను సంవత్సరాలు నన్ను పోషించారు. దండాలయ్యా!...” చేతులు జోడిం చాడు నారిగాడు.


మాలకొండయ్య .... తను చెప్పదలచు కొన్నది ... నారిగాడే చెప్పినందుకు సంతోషించాడు. మౌనంగా వెళ్లిపోయాడు.


రెండు వారాల తర్వాత నారిగాడు లచ్చితో... ఆ వూరిని వదలి వెళ్ళి పోయాడు. విషయాన్ని విన్న మాల కొండయ్య ‘ నారిగాడు... కాదు నా... ‘దేవుడు వెళ్లిపోయాడు’ అని మనస్సున అనుకొన్నాడు. కృతజ్ఞతాభావంతో అతని కళ్ళు చెమ్మగిల్లాయి.

&&&&& &&&&&

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link

Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.





72 views0 comments

Comments


bottom of page