దిద్దుబాటు
- Ronanki Divija Saibhanu

- 4 hours ago
- 5 min read
#Diddubatu, #దిద్దుబాటు, #RonankiDivijaSaibhanu, #రోణంకిదివిజసాయిభాను, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Diddubatu - New Telugu Story Written By Ronanki Divija Saibhanu Published In manatelugukathalu.com On 24/12/2025 దిద్దుబాటు - తెలుగు కథ
రచన: రోణంకి దివిజ సాయిభాను
“సరిత.. ఏంటమ్మా నువ్వు అనేది? విమల్‌కి విడాకులు ఇస్తున్నావా?” అంటూ చెప్పాపెట్టకుండా ఇంటికి ఒక్కర్తే వచ్చిన కూతురును అడిగింది రాధ.
సరిత తన తల్లికి సమాధానం ఏమీ చెప్పకుండా అవునన్నట్టుగా తలూపింది. మొదట్నుంచీ వీరిద్దరి మాటలు వింటున్న సరిత తండ్రి రమణ ఏమీ మాట్లాడొద్దు అని సైగ చేయడంతో రాధ ఇంకేమీ అనకుండా మౌనం వహించింది.
అతను సరితను లోపలికి వెళ్లి, కాస్త విశ్రాంతి తీసుకోమన్నాడు. విమల్‌తో కలిసి రాకుండా సరిత ఒక్కర్తే ఇంటికి వచ్చినప్పుడు రాధ, రమణ ఇద్దరూ ఏదో జరిగి ఉంటుందని ఊహించారు, కానీ ఇంత పెద్ద నిర్ణయం సరిత తీసుకుంటుందని ఊహించలేదు. కాసేపు ఆగి మళ్లీ మాట్లాడదాం అనుకొని రాధ లంచ్ సిద్ధం చేయడానికి వంటింట్లోకి వెళ్లింది. ఎంతో అన్యోన్యంగా ఉండే సరిత-విమల్ విడాకులు తీసుకుంటున్నారంటే రాధ జీర్ణించుకోలేకపోతోంది. ఏం జరిగి ఉంటుందో అని ఆలోచించసాగింది.
ఆరు నెలల క్రితం సరిత వచ్చి తన ఆఫీసు కొలీగ్ విమల్ అంటే తనకు ఇష్టమని, అతనిని పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పినప్పుడు ఇద్దరూ ఆమె మాటకు గౌరవమిచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. విమల్‌కు తల్లిదండ్రులు లేరు, అయినా పెళ్లి తర్వాత త్వరగా కలిసిపోయాడు. పెద్దలకు చాలా మర్యాద ఇస్తాడు. అంతా బాగానే సాగుతుందనుకున్న సమయంలో ఈ పిడుగు లాంటి వార్త వచ్చి పడింది.
మధ్యాహ్నం భోజనం అయ్యాక రాధ సరిత గదిలోకి వెళ్లి పక్కన కూర్చుంది. సరిత పుస్తకం చదువుతోంది.
“ఏమైందమ్మా? ఇద్దరూ నచ్చే పెళ్లి చేసుకున్నారు కదా. విమల్‌తో ఏమైనా సమస్యనా? చెప్పు తల్లీ!” అని అడిగింది రాధ.
సరిత పుస్తకం మూసి, కాసేపు మౌనంగా ఉంది. ఆ తర్వాత అమ్మ వైపు తిరిగి చూసి చెప్తుంది,
“అతను కొన్ని నెలల నుంచి రోజూ రాత్రులు ఆలస్యంగా వస్తున్నాడు. మందు, పార్టీలు, జల్సా ఖర్చులు ఎక్కువ అయ్యాయి. విమల్ ఆఫీసు వర్క్‌లో తప్పు చేశాడని ఈ మధ్యనే విమల్‌ని ఉద్యోగం నుంచి కూడా తీసేశారు. ఒక్క సంపాదన మీద ఇల్లు నడవటం రోజు రోజుకీ కష్టం అవుతుంది. అంతే కాకుండా నేను లేనప్పుడు నా పర్స్ నుంచే డబ్బులు తీస్తున్నాడు. నేను అడిగితే గొడవ పెట్టుకుంటున్నాడు.
నిన్న అర్ధరాత్రి కూడా అలానే ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. ఈరోజు ఉదయం ‘ఎందుకిలా చేస్తున్నావు?’ అని గట్టిగా అడిగితే, ‘నిన్ను పెళ్లి చేసుకోవడమే నేను చేసిన పాపం. వెళ్ళు, ఇక్కడ్నుంచి’ అని అన్నాడు. తట్టుకోలేక వచ్చేశాను అమ్మా,” అంటూ తల్లిని పట్టుకుని ఏడ్చింది.
రాధ ఆమెను కౌగిలించుకుంది. “తొందరపడకు అమ్మా, నిజం తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోకు. విమల్‌తో మేము మాట్లాడతాము,” అని ధైర్యం చెప్పింది.
ఆ రాత్రి రాధ-రమణ మాట్లాడుకున్నారు. విమల్ ఏం చెప్తాడో కూడా తెలుసుకోవాలని అనుకున్నారు. కూతురి కాపురం చక్కబెట్టే బాధ్యత వారిరువురిపై ఉంది. విమల్ చెప్తే కచ్చితంగా వింటాడు అనే ధైర్యం, నమ్మకం వారికి ఉంది. మరుసటి రోజు సరిత ఆఫీసుకి వెళ్లాక విమల్‌కి ఫోన్ చేసి, “ఇద్దరం ఇంటికి వస్తున్నాం,” అని చెప్పారు. విమల్ “సరే” అన్నాడు.
రాధ, రమణ ఇద్దరూ గంటలో ఇంటికి చేరుకుని కాలింగ్ బెల్ నొక్కారు.
విమల్ తలుపు తీసి అత్తమామలను గౌరవంగా లోపలికి పిలిచాడు. విమల్‌కి ఎదురుగా ఇద్దరూ కూర్చున్నారు. రాధ సరిత చెప్పిందంతా విమల్‌కు వివరించింది. ఆ సమయంలో విమల్ కళ్లలో ఉబికివస్తున్న కన్నీరుని గమనిస్తూ ఉంది.
“అత్తయ్య, మావయ్య, నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేసాను. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. మాకు పెళ్లైనప్పట్నుంచీ ఆఫీసు వాళ్లు, ఫ్రెండ్స్ ‘భార్య మాట వింటావా? మందు తాగవా? మగాడివేనా రా నువ్వు?’ అని రోజూ ఎగతాళి చేసేవారు. మొదట్లో వారి మాటలు పట్టించుకునే వాడిని కాను. అయినా కూడా నేనెక్కడ కనిపించినా హేళన చేసేవారు. సరిత ఉన్నప్పుడు మాత్రం ఏమీ అనేవారు కాదు.
ఒక రోజు మా కొలీగ్ పెళ్లికి సరిత, నేను కలిసి వెళ్ళాము. ఆ రోజు సరితకు, నాకు ఒక చిన్న విషయంలో గొడవ అయింది. ఆ రోజు ఎందుకో ఆ చిరాకులో మొదటిసారి తాగాలని అనిపించింది. అక్కడ మా వాళ్లతో కలిసి బాగా తాగాను. మొదటిసారి త్రాగినప్పుడు అస్సలు పడక, ఆ తర్వాత వాంతులు కూడా చేసుకున్నాను.
కానీ, తర్వాత నుంచి సరితతో ఎప్పుడు గొడవపడినా మందు తాగాలని అనిపించేది. అది క్రమేణా అలవాటుగా మారింది. ఆఫీసు వర్క్ మీద ఫోకస్ పెట్టలేకపోయాను. ఉద్యోగం పోయింది. భయం, సిగ్గు, బాధ కలిసి అన్నీ సరిత మీద చూపించటం మొదలు పెట్టాను. తన ముందు ముఖం చూపించుకోలేక గొడవ పడుతూ వచ్చాను.
అలా నిన్న నోరు జారాను. అంత మాత్రానికే సరిత విడాకులు వరకూ వెళ్తుందని ఊహించలేదు నేను. దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను మారుతాను, సరితను జాగ్రత్తగా చూసుకుంటాను,” అని అన్నాడు.
రాధ-రమణ ఇద్దరూ విమల్ చెప్పిందంతా మౌనంగా విన్నారు. విమల్ పశ్చాత్తాపం పడటం నిజమే అనిపించింది. విమల్ పరిస్థితికి బాధ పడ్డారు. సాయంత్రం సరిత వచ్చాక చర్చించుకుందాం అని చెప్పి వారితో పాటు విమల్‌ను ఇంటికి తీసుకువెళ్లారు.
సాయంత్రం ఆఫీసు అయ్యాక సరిత ఇంటికి వచ్చి, కాలింగ్ బెల్ నొక్కింది. విమల్ తలుపు తీశాడు. సరిత కాస్త చిరాకు, బాధ కలగలిసిన ముఖంతో అతనిని పక్కకు తప్పుకోమంది. సరిత ఇంట్లోకి వెళ్లిపోయింది. విమల్ కూడా ఆమె వెనకాలే వెళ్లి నిల్చున్నాడు.
విమల్ నెమ్మదిగా ముందుకెళ్లి ఆమె చేతులు పట్టుకున్నాడు.
“సరిత… నన్ను క్షమించు. ఇంకెప్పుడూ నేను ఇలా చేయను, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వు,” అని క్షమాపణ అడిగాడు.
సరిత కళ్లలో నీళ్లతో, ఏమీ మాట్లాడకుండా అలానే నిల్చుంది.
అక్కడే హాలులో రాధ-రమణ నిలబడి చూస్తున్నారు. రమణ నెమ్మదిగా మాట్లాడాడు. “విమల్, సరిత… మీకు ఇంకో విషయం చెప్పాలి.” అందరూ ఆశ్చర్యంగా ఏంటన్నట్టు అతని వైపు చూశారు.
“మా పెళ్లి అయిన మొదట్లో… నేను రోజూ మందు తాగేవాణ్ణి. బిజినెస్ లాస్, భాగస్వాములు మోసం చేయడంతో అప్పులు ఎక్కువయ్యాయి. అప్పటికే రాధ మూడు నెలలు గర్భవతి. ఏం చేయాలో తెలియక చచ్చిపోదామనిపించింది. అదే సమయంలో రాధ డబ్బు కోసం, అప్పులు కోసం రెట్టించి అడగటంతో గొడవ మొదలైంది. కోపంలో విచక్షణ కోల్పోయి, గర్భవతి అని కూడా చూడకుండా ఆమెను చాలా గట్టిగా కొట్టాను. ఆమె స్పృహ తప్పి కింద పడిపోయింది.” విమల్, సరిత ఇద్దరూ నిశ్శబ్దంగా వింటున్నారు. సరితకు కూడా ఈ విషయం ఇప్పటివరకూ తెలీదు.
రమణ కన్నీటిని ఆపుకుని మళ్లీ కొనసాగించాడు.
“తర్వాత భయంతో హాస్పిటల్‌కి తీసుకెళ్లాను, కానీ అప్పటికే తప్పు జరిగిపోయింది. ఆ రోజు… ఆ రోజు నేను నా బిడ్డని కాపాడుకోలేకపోయాను. నా చేతులతో చంపేశాను. రాధ ఎంతో బాధపడినా అసలు నిజం ఎవరికి చెప్పకుండా ‘కాలు జారి పడిపోయాను’ అని తప్పు తన మీదనే వేసుకుంది. ఆమె అలా చెప్పినప్పుడు సిగ్గుతో తలదించుకున్నాను.
అంత పెద్ద తప్పు చేసినా కూడా రాధ నన్ను క్షమించింది, నన్ను నమ్మి నాతోనే ఉంది. అప్పుడు నాలో మార్పు వచ్చింది. ఇకనుంచి తాగకూడదని నిశ్చయించుకున్నాను. మళ్లీ కొత్త బిజినెస్ పెట్టాను. కొన్ని నెలలకు మామూలు స్థాయికి చేరుకున్నాం.
ఆ తర్వాత రాధ మళ్లీ గర్భం దాల్చింది… అప్పుడు సరిత పుట్టింది. కానీ ఆ మొదటి బిడ్డ లేకపోవడం మా ఇద్దరి గుండెల్లో ఎప్పటికీ మిగిలిపోతుంది" అని చెప్పాడు. అప్పటికే రాధ ఏడుస్తూ ఉంది.
“అందుకే విమల్… నీవు మందు మొదలుపెట్టావని విన్నప్పుడు నాకు మా పాత రోజులు గుర్తొచ్చాయి. నా బిడ్డని కాపాడుకోలేకపోయిన బాధ మళ్లీ వచ్చింది. మీ ఇద్దరిదీ ఇంకా చిన్న వయసు. అనవసరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనర్థాలే జరుగుతాయి. సరిత నిన్ను అర్థం చేసుకుంటుంది. మళ్లీ మీరు మీ జీవితాన్ని మొదలుపెట్టండి. చిన్న చిన్న వాటికి విడాకులు వరకూ వెళ్లిపోకూడదు తల్లీ.
ప్రతి పతనానికి ఒక లేచే శక్తి ఉంటుంది. ఆ శక్తి ప్రేమ రూపంలో వస్తే… మనిషి కొత్తగా పుడతాడు. విమల్ కచ్చితంగా మారుతాడు. తన తప్పును సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇచ్చి చూడు, క్షమించడం బలహీనత కాదు, మరో మనసును నిలబెట్టే గొప్ప శక్తి,” అంటూ కూతురికి కూడా నచ్చజెప్పాడు.
సరిత తన తల్లిని, తండ్రిని గట్టిగా కౌగిలించుకుంది. వారిద్దరి మనసు బాధ పెట్టినందుకు క్షమించమని అడిగింది. పాత గాయాలు కూడా కొత్త ఆశతో మానిపోతాయని విమల్, సరిత ఇద్దరూ తెలుసుకున్నారు. విమల్ ‘సారీ’ చెప్తూ సరితను దగ్గరకు తీసుకున్నాడు. సరిత కూడా అంగీకారంతో అతని కౌగిలిలో వాలిపోయింది. విమల్, సరితలను అలా చూసి ముచ్చటపడ్డారు రాధ, రమణ. ఇద్దరూ చిన్నపిల్లల్లా నిల్చుని చప్పట్లు కొట్టారు. ఆ ఇంట్లో మళ్లీ సంతోషపు వెలుగులు, నిజమైన నవ్వులు ప్రతిధ్వనించడం మొదలయ్యాయి.
మరుసటి రోజు నుంచి విమల్ నిజంగానే మొదలుపెట్టాడు. విమల్ రమణ సలహా మేరకు రీహాబిలిటేషన్ సెంటర్‌లో జాయిన్ అయ్యాడు. కొద్ది కాలంలోనే వ్యసనం నుంచి దూరమై మళ్లీ మామూలు మనిషి అయ్యాడు. కొద్ది రోజుల్లోనే మంచి ఉద్యోగం దొరికింది. సరితతో బంధం రోజు రోజుకీ బలపడుతూ వస్తుంది.
కొన్ని నెలల తర్వాత సరిత గర్భం దాల్చింది. వారిద్దరికీ ఆ విషయం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. రాధ, రమణ కూడా ఎంతో సంతోషించారు. వారందరి జీవితాలు ఇప్పుడు చిన్నారి రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆ రోజు విమల్ గర్భం మీద చేయి వేసి, “ఈసారి మన బిడ్డ మనందరినీ కాపాడుతుంది,” అని అన్నాడు. ఆ మాటల్లో కేవలం ఆశ మాత్రమే కాదు, గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే గట్టి సంకల్పం ఉంది. సరిత కళ్లల్లో ఆనంద భాష్పాలు నిండాయి.
ప్రతి సాయంత్రం విమల్ పని నుంచి రాగానే, సరిత కడుపుపై చెవి ఆన్చి ఆ చిన్నారి ఉనికిని అనుభూతి చెందేవాడు. ఈ అనుభవం వారిద్దరి బంధాన్ని మరింత గట్టిగా, మధురంగా మార్చింది. విమల్ తప్పు తెలుసుకుని సరిదిద్దుకున్న తీరు, సరిత అతన్ని క్షమించి మళ్లీ స్వీకరించిన విధానం… ఇదంతా వారి ప్రేమ బలాన్ని, జీవితంపై వారికున్న నమ్మకాన్ని తిరిగి తెచ్చింది. పాత జ్ఞాపకాలు బాధను కలిగించినా, ఈ కొత్త ఆరంభం వారిద్దరికీ ఓ మధురమైన వరం. సరిత తండ్రి పలికిన మాటలు, “పాత గాయాలు కూడా కొత్త ఆశతో మానిపోతాయి” అక్షర సత్యమై నిలిచాయి.
***
రోణంకి దివిజ సాయిభాను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
నా పేరు రోణంకి దివిజ సాయిభాను. తెలుగు భాషాభిమానిని. తెలుగు భాషలో కవితలు మరియు కథలను రాస్తుంటాను. మనసును నింపిన ప్రతి భావాన్ని పదాలతో అల్లుతూ ఇప్పటివరకు ఎన్నో కవితలను రాసాను. నా కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఎన్నో సాహిత్య పోటీల్లో పాల్గొని, విజయాలు సాధించడం నాకు మరింత ప్రేరణనిచ్చింది. భావాలకి, కలలకి మాట దొరికేలా చేసే ఈ సాహిత్యయాత్రలో నిరంతరం కొత్త అంచులను అన్వేషిస్తూ ముందుకు సాగుతున్నాను.




Comments