top of page
Original.png

డైనింగ్ టేబుల్

డైనింగ్ టేబుల్ కథ, తెలుగు కుటుంబ కథ, కుటుంబ బంధాలు, అపార్ట్‌మెంట్ జీవితం, తల్లిదండ్రుల ఒంటరితనం, ఆధునిక కుటుంబం, తెలుగు కథలు, బంధకవి రమణ, కుటుంబ విలువలు, emotional telugu story

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'డైనింగ్ టేబుల్' కథలో డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్న వృద్ధ దంపతులు, చుట్టూ మొబైల్ ఫోన్లు మరియు ల్యాప్టాప్‌లలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు కనిపిస్తున్న భావోద్వేగ తెలుగు కుటుంబ కథా చిత్రం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'డైనింగ్ టేబుల్' కథలో డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్న వృద్ధ దంపతులు, చుట్టూ మొబైల్ ఫోన్లు మరియు ల్యాప్టాప్‌లలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు కనిపిస్తున్న భావోద్వేగ తెలుగు కుటుంబ కథా చిత్రం.

Dining Table - Telugu Emotional family Story | Ramana Bandhakavi

డైనింగ్ టేబుల్ తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | రమణ బంధకవి

Published in manatelugukathalu.com on 19/06/2026


ఆధునిక జీవితంలో ఒకే ఇంట్లో ఉంటూ కూడా మనుషులు ఎంత దూరమవుతున్నారో హృదయాన్ని కదిలించే విధంగా చెప్పిన కథ "డైనింగ్ టేబుల్". కొత్త ఇంటి ఆనందం, కలిసి జీవించాలనే ఆశలు, సాంకేతికత వల్ల పెరుగుతున్న మానసిక దూరాలు, చివరికి కుటుంబాన్ని మళ్లీ కలిపే చిన్న చిన్న క్షణాలు ఈ కథలో ఎంతో సహజంగా ప్రతిబింబించాయి. ప్రతి కుటుంబం తప్పకుండా చదవాల్సిన ఆలోచింపజేసే కథ ఇది.


వాన కురిసిన తర్వాతి సాయంత్రం.

“పుష్పక్” అపార్ట్‌మెంట్ పదకొండో అంతస్తు బాల్కనీ నుంచి నగరం మొత్తం తడిసినట్టుగా మెరుస్తోంది. దూరంగా ఫ్లైఓవర్ మీద కార్ల లైట్లు నీళ్లలో కదులుతున్న దీపాల్లా కనిపిస్తున్నాయి.


లలిత, బాల్కనీ రైలింగ్స్ మీద ఆరేసిన చిన్న తువాలు తీసుకుంటోంది. లోపల కొత్త ఇంటి వాసన ఇంకా పోలేదు- పెయింట్, వార్నిష్, కొత్త ప్లై వుడ్… అన్నీ కలిసిన ఒక కొత్త జీవితపు వాసన. హాల్లో అట్టపెట్టెలు ఇంకా పూర్తిగా తెరవలేదు. ఒక మూల స్టీల్ డబ్బాలు. మరో మూల పాత ఇంటి నుంచి తెచ్చిన దేవుళ్ల ఫోటోలు. భాస్కరరావు కిటికీ దగ్గర నిలబడి కింద రోడ్డువైపు చూస్తున్నాడు.


“ఏమండీ! మన పాత ఇంటి కాంపౌండ్ లో వాన పడితే మట్టి వాసన ఎలా వచ్చేదో అది గుర్తొస్తోంది.” అంది లలిత.


“అక్కడ మట్టి వాసన ఎక్కువైతే… ఇక్కడ EMI వాసనలు ఎక్కువ.” భాస్కరరావు చిన్నగా నవ్వుతూ అన్నాడు. లలిత కూడా నవ్వింది.


కొత్త ఫ్లాట్ కి మారటానికి వాళ్ళకి మొదట ఇష్టం లేదు. పాత ఇల్లు చిన్నదే, కానీ సంవత్సరాల అనుభూతులు ఆ గోడల్లో, ఆ గదుల్లో కలిసిపోయి ఉండేవి. ముందు మామిడి చెట్టు, సాయంత్రం అరుగుమీద కూర్చుని మాట్లాడుకునే పొరుగువాళ్లు, వేసవిలో డాబా మీద పడకలు, ఇలాంటివి ఎన్నో. కానీ కొడుకు వికాస్ వాళ్ళని తన మాటలతో ఒప్పించేశాడు.


“డాడీ... పాత ఇండిపెన్డెంట్ హౌస్ మైన్టైన్ చేయడం ఇప్పుడు చాలా కష్టం. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో మంచి సెక్యూరిటీ ఉంటుంది. ఎన్నో సౌకర్యాలు ఉంటాయి. మనమందరం కలిసి ఉండొచ్చు.”


ఆ “కలిసి” అన్న మాట దగ్గరే లలిత మనసు కరిగిపోయింది. ముంబై నుంచి హైదరాబాద్ బదిలీ తీసుకుని వచ్చిన వికాస్ తన కుటుంబంతో సహా తమతో కలిసి ఉండబోతున్నాడు. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ ఇంట్లో మనుషుల శబ్దాలు వినిపిస్తాయనుకుంది ఆమె. కోడలు నిహారిక, మనవరాలు తనిషా నవ్వులు, రాత్రి అందరూ కలిసి చేసే భోజనాలు, సండే టీవీ ముందు కూచుని అందరూ చూడబోయే సినిమాలూ, అన్నీ ఆమె కళ్ళ ముందు కదలాడాయి. వయసు పెరిగేకొద్దీ మనుషులు పెద్ద పెద్ద కలలు కనరు. ఇల్లు మళ్లీ నిండిపోతే చాలని కోరుకుంటారు.


అప్పుడే డోర్ బెల్ మోగింది. ఫ్లాట్ ఇంటీరియర్ డిజైనర్ వచ్చాడు. చుట్టూ ఒకసారి చూసి తన ల్యాప్టాప్ తెరిచాడు.


“సర్… ఈ డైనింగ్ ఏరియాకి ఎయిట్ సీటర్ డైనింగ్ టేబల్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఒకేసారి ఎనిమిది మంది కూర్చుని చక్కగా బోజనం చెయ్యొచ్చు. రోజ్ వుడ్ ఫినిష్ టేబల్, పైన పెన్డెంట్ లాంప్స్...మంచి క్లాసీ లుక్ వస్తుంది. ఫ్యామిలీ డైనింగ్ కి చాలా బాగుంటుంది.”


వికాస్ వెంటనే ఉత్సాహంగా తలూపి “Done.” అన్నాడు.

భాస్కరరావు మాత్రం ల్యాప్టాప్ లో కనిపిస్తున్న టేబుల్ వైపు చూస్తూ మెల్లగా నవ్వుకున్నాడు.


“మా చిన్నప్పుడు అందరం నేలమీదే కూర్చుని తినేవాళ్ళం” అన్నాడు.

“దట్ ఇస్ వెరీ అన్ కమ్ఫర్ట్ బుల్ తాతయ్యా!” అని తనిషా వెంటనే నవ్వేసింది.

అందరూ నవ్వారు.


లలిత మాత్రం ఆ టేబుల్ చుట్టూ అందరూ కలిసి కూర్చుని భోజనం చేస్తున్న దృశ్యాన్ని మనసులో ఊహించుకుంది. ఆ ఊహలో వేడి అన్నం ఉంది, పప్పు వాసన ఉంది, నవ్వులు ఉన్నాయి. “ఇంకొంచెం వడ్డించనా?” అనే మాట కూడా ఉంది. కొత్త ఇంట్లో కొత్త టేబుల్ వస్తే, కుటుంబం కూడా కొంచెం కొత్తగా దగ్గరవుతుందేమో అనిపించింది ఆమెకు.


డైనింగ్ టేబుల్ వచ్చిన రోజు ఇంట్లో చిన్న పండుగలా అయిపోయింది. ఎనిమిది కుర్చీలు. మధ్యలో చిన్న పూలవాజ్. తనిషా వెంటనే ఫోటోస్ తీసి ‘మై ఫస్ట్ ఫ్యామిలీ డిన్నర్’ అంటూ ఇంస్టాగ్రామ్ లో పెట్టింది.


ఆ రాత్రి నిజంగానే అందరూ కలిసి కూర్చున్నారు. లలిత వేడి వేడి చపాతీలు వేస్తోంది.


వికాస్ ఏవొ ఆఫీసు విషయాలు చెబుతున్నాడు.

“ఇక టీవీ ముందు ప్లేట్ పట్టుకుని కాదు. ప్రాపర్ గా డైనింగ్ టేబల్ మీదే భోజనం.” కోడలు నిహారిక నవ్వుతూ అంది.


భాస్కరరావు చుట్టూ కలియ చూసాడు. పైన వేలాడుతున్న లైట్ వెలుతురులో అందరి ముఖాలు మెరిసిపోతున్నాయి. అతనికి తెలియకుండానే హృదయం నిండిపోయింది.


“టేబుల్ బాగుంది…” అన్నాడు మెల్లగా.


“టేబుల్ కాదు… ఇలా అందరూ కలిసి కూర్చోవడం బాగుంది.” అని లలిత వెంటనే అంది.


మొదటి కొన్ని వారాలు నిజంగానే అలానే జరిగాయి. రాత్రి ఎనిమిదయ్యేసరికి లలిత టేబుల్ సర్దేది. నీళ్ల గ్లాసులు, ప్లేట్స్, వేడిగా భోజనం. తనిషా కూడా ఫోన్ పక్కన పెట్టి వచ్చేది. కానీ ఆ తర్వాత మెల్లగా ఏదో మారడం మొదలైంది.


ఒకరోజు వికాస్: “మామ్… కాల్ లో ఉన్నా, మీరు మొదలుపెట్టండి.” అన్నాడు.


మరుసటి రోజు నిహారిక: “నేను సలాడ్ ఆర్డర్ చేసుకున్నా. మీరు కానీయండి” అంది.


ఇంకోరోజు తనిషా: “ఇప్పుడే నా రూమ్ లో నూడుల్స్ తిన్నాను బామ్మా” అంది.


టేబుల్ మీద ఐదు ప్లేట్లు. కూర్చున్నది మాత్రం ఒక్క భాస్కరరావే.

“భోజనం కూడా ఇప్పుడు అపాయింట్మెంట్ సిస్టమ్ అయిపోయిందా?” అతను మెల్లగా అన్నాడు. ఎవరూ వినలేదు, వికాస్ హెడ్ ఫోన్స్ లో ఉన్నాడు.


కొద్ది రోజులకి డైనింగ్ టేబుల్ వాలకం పూర్తిగా మారిపోయింది. ఒక మూల ల్యాప్టాప్, మరో మూల కొరియర్ పాకెట్స్, ఫోన్ చార్జర్లు, హెడ్ ఫోన్స్, అమెజాన్ డబ్బాలు. భోజనం కన్నా వస్తువులే ఎక్కువ. లలిత ఒకరోజు టేబుల్ మధ్యలో చిన్న పూల గుత్తి పెట్టింది. మరుసటి ఉదయం దాని చుట్టూ కొరియర్ పార్శిల్స్. ఆమె మెల్లగా పూలవాజ్ తీసి కిచెన్ షెల్ఫ్ మీద పెట్టేసింది. ఎవరూ గమనించలేదు.


ఒక ఆదివారం మధ్యాహ్నం. లలిత ప్రత్యేకంగా మామిడికాయ పప్పు, ఆలుగడ్డ వేపుడు చేసింది. ఈరోజైనా అందరూ కలిసి తింటారేమో అనుకుంది.


“వికాస్… అన్నం పెట్టనా?” అని కొడుకుని అడిగింది.


“కొంచెం తరవాత మామ్” అన్నాడు ల్యాప్టాప్ చూసుకుంటూ.


“నిహారికా, నువ్వు వస్తున్నావా?”


“నాకు వెబినార్ ఉంది అత్తయ్యా, మీరు తినేయండి.” అంది.


“తనిషా నువ్వైనా రా తల్లీ”


“నాట్ హంగ్రీ బామ్మా” అంది తన రూమ్ లోంచి.


వేడి అన్నం మెల్లగా చల్లారిపోయింది. భాస్కరరావు ప్లేట్ లో పప్పు కలుపుతున్నాడు.

“నీకో విషయం తెలుసా లలితా…”


“ఏంటి?”


“ఇంట్లో వంట వాసన ఇంకా ఉంది…”


“మరి?”


“భోజన శబ్దాలు తగ్గిపోయాయి.” 


లలిత ఒక్క క్షణం ఆగింది.

“ఇప్పటి పిల్లల టైమింగ్స్ వేరు.” ఆమె చిన్నగా నవ్వుతూ అంది. కానీ ఆమె స్వరంలో తనకే వినిపించే అలసట ఉంది.


ఆ రాత్రి పవర్ సప్లయ్ పోయింది. వైఫై కూడా లేదు. తనిషా చికాగ్గా బయటికి వచ్చింది, “సో బోరింగ్!” అంది.


వికాస్ ల్యాప్టాప్ మూసేశాడు. నిహారిక మొబైల్ సిగ్నల్ కోసం బాల్కనీకి వెళ్లి తిరిగి వచ్చింది.


ఎవరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి అందరూ డైనింగ్ టేబల్ దగ్గరే కూర్చున్నారు.


మొదట నిశ్శబ్ధం. తర్వాత భాస్కరరావే మాట్లాడడం మొదలుపెట్టాడు.

“తనీషా...మీ నాన్న చిన్నప్పుడు పప్పు తిననని ఏడ్చేవాడు.”


వికాస్ వెంటనే నవ్వేశాడు.

“అయ్యో… ఎంత గోల చేసేవాడో…” లలిత కూడా నవ్వింది.


“ఒకసారి టేబుల్ కింద దాక్కుని...”


“మామ్!” అన్నాడు వికాస్ సిగ్గుపడుతూ.


అందరూ నవ్వేశారు. తనిషా కూడా. ఆ నవ్వు ఇంట్లో చాలా రోజుల తర్వాత కొంచెం గట్టిగా వినిపించింది. లలిత ఒక్క క్షణం వాళ్లందరినీ చూసింది. మళ్లీ అందరూ కుటుంబంలా కనిపిస్తున్నారు. ఆ రాత్రి భోజనం ఆలస్యంగా అయింది. కానీ చాలాకాలం తర్వాత తిన్న భోజనంలా అనిపించింది.


ఉదయం వైఫై వచ్చేసరికి మళ్లీ అందరూ తమ తమ స్క్రీన్స్ లోకి వెళ్లిపోయారు. ఇల్లు మళ్లీ నిశ్శబ్దమైంది.


ఒక మధ్యాహ్నం. లలిత కిచెన్లో ఉంది. భాస్కరరావు డైనింగ్ టేబల్ దగ్గర పేపర్ చదువుతున్నాడు. అకస్మాత్తుగా కళ్ల ముందు మసకబారింది. చెమటలు పట్టాయి.


“లలితా…” అని పిలిచాడు. ఆమె పరుగెత్తుకొచ్చేసరికి అతను కుర్చీకి ఆనుకుని కళ్లు మూసుకున్నాడు.

“వికాస్!” అని ఆమె గట్టిగా పిలిచింది. వికాస్ రూమ్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని మీటింగ్ లో ఉన్నాడు. నిహారిక వెబినార్ లో ఉంది. తనిషా రూమ్ తలుపు మూసుకుని ఉంది. లలితే నీళ్లు చల్లి అతన్ని లేపింది.


హాస్పిటల్ కి తీసుకెళ్లేసరికి, “షుగర్ లెవెల్ పడిపోయింది. ఈ వయసులో రెగ్యులర్ మీల్స్ చాలా ముఖ్యం.” అని డాక్టర్ అన్నాడు. భాస్కరరావు నీరసంగా నవ్వాడు.


“మీల్స్ రెగ్యులర్ గానే ఉన్నాయి డాక్టర్…కలిసి తినేవాళ్లు తగ్గిపోయారు అంతే.” కొద్దిసేపు ఆగి అన్నాడు. 


డాక్టర్ అర్థంకాని నవ్వు నవ్వాడు.

రాత్రి హాస్పిటల్లో లలిత బల్ల మీద కూర్చుంది. భాస్కరరావు కుర్చీలో కూచుని కిటికీ బయటకి చూస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత అన్నాడు, “మనమూ బిజీ గానే ఉండేవాళ్లం కదా?”


“అవును.” అంది లలిత.


“కానీ రాత్రి భోజనం దగ్గర కలిసేవాళ్లం.” లలిత మెల్లగా తలూపింది.


“మీ నాన్న ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవారో గుర్తుందా? అందరూ కూర్చున్నాకే భోజనం మొదలుపెట్టాలి. అప్పుడు అది రూల్ లాగా అనిపించేది. కానీ ఇప్పుడు అర్థమవుతోంది, అది కుటుంబాన్ని ఒకచోట కూర్చోబెట్టే పద్ధతి అని” గుర్తుచేసుకున్నాడు భాస్కరరావు.


ఇద్దరూ కొద్దిసేపు మౌనంగా ఉన్నారు.

“మనవాళ్లు తప్పు చేస్తున్నారని అనిపిస్తోందా?” అని క్షణం తర్వాత భాస్కరరావు అడిగాడు.


లలిత చాలా సేపు ఆలోచించింది.

“లేదు.”


“మరి?”


ఆమె కిటికీ బయటికి చూసింది.

“వాళ్ల జీవితం వాళ్లది. వాళ్ల ప్రపంచం వేగంగా పరుగెడుతోంది.”


కొద్దిసేపు ఆగి మెల్లగా అంది, “కానీ… ఒకే ఇంట్లో ఉండి కూడా ఒకరినొకరు మిస్ అవుతుండటం కొత్తగా ఉంది.”


భాస్కరరావు చాలాసేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత చిన్నగా నవ్వాడు.

“డైనింగ్ టేబుల్ కొన్నప్పుడు ‘ఫ్యామిలీ బాండింగ్’ అన్నాడు గుర్తుందా ఆ డిజైనర్?”


లలిత కూడా నవ్వింది.

“టేబుల్ వచ్చింది…బాండింగ్ మాత్రం రాలేదు.”


ఇద్దరూ చిన్నగా నవ్వుకున్నారు. ఆ నవ్వులో బాధ ఉంది. కానీ ఎవరి మీదా కోపం లేదు.


మరుసటి రోజు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాడు భాస్కరరావు. సాయంత్రం లలిత గట్టిగా పట్టు పట్టింది.

“ఈరోజు అందరూ కలిసి తినాలి.”


వికాస్ కూడా వెంటనే తలూపాడు. “ష్యూర్ మామ్”


రాత్రి టేబుల్ మీద, వేడి అన్నం, మామిడికాయ పప్పు, వంకాయ వేపుడు, పెరుగు. చాలా రోజుల తర్వాత ఐదు ప్లేట్లు మళ్లీ ఒకేసారి నిండాయి.

మొదట నిశ్శబ్ధం. తర్వాత తనిషా అడిగింది-

“తాతయ్య… మీ స్కూల్ స్టోరీస్ చెప్పు.”


భాస్కరరావు నవ్వాడు.

“మా స్కూల్లో ఒక స్టూడెంట్ ఉండేవాడు…” అతను కథ మొదలుపెట్టాడు.


అప్పుడే వికాస్ ఫోన్ మోగింది. అతను అలవాటుగా లేచి వెళ్లబోయాడు. కానీ ఒక్క క్షణం ఆగిపోయాడు. ఫోన్ వైపు చూశాడు. తర్వాత సైలెంట్ లో పెట్టి తిరిగి కూర్చున్నాడు. లలిత అది గమనించింది. ఏమీ అనలేదు. కేవలం అతని ప్లేట్ లో మరికాస్త పప్పు వడ్డించింది.


భోజనం అయిపోయాక అందరూ తమ తమ గదుల్లోకి వెళ్లిపోయారు.

డైనింగ్ టేబుల్ మీద ఇంకా నీళ్ల గ్లాసులు, అన్నం మెతుకులు ఉన్నాయి. లలిత ప్లేట్స్ తీస్తోంది. భాస్కరరావు టేబుల్ మీద చేయి నెమ్మదిగా నిమిరాడు. కొద్దిసేపటి తర్వాత మెల్లగా అన్నాడు-

“ఇవాళ టేబుల్ కొంచెం తన పని చేసినట్టుంది…”


లలిత నవ్వింది.

పెన్డెంట్ లైట్ మసక వెలుతురులో టేబుల్ మధ్యలో పెట్టిన చిన్న పూల గుత్తిలో ఒక్క తెల్లగులాబీ మెల్లగా తల ఊపుతోంది. 


***

రమణ బంధకవి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: రమణ బంధకవి

రమణ బంధకవి, ఒక ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ లో ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేసి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నారు. సాహిత్యాభిలాష, తెలుగు మరియు ఆంగ్లంలో రచనాభిలాష కలిగినవారు. కథలు, కవితలు, నవలలు, అనువాద నవలలు వ్రాయడం హాబీ. ఇప్పటివరకు ముప్పై పైచిలుకు కథలు, ఎన్నో కవితలు, రెండు అనువాద నవలలు ప్రచురింపబడ్డాయి. రెండు స్వీయ నవలలు ప్రస్తుతం ప్రచురణలో ఉన్నాయి. ఒకటి 'సంచిక' వెబ్ మాగ్జైన్ వార పత్రికలో ధారావాహికగా వస్తోంది. ఇంకోటి 'ప్రతిలిపి' లో ధారావాహికగా వస్తోంది.

9 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Nayana Kasturi
Nayana Kasturi
5 hours ago
Rated 5 out of 5 stars.

డైనింగ్ టేబుల్ కధ చాలా బాగుంది. అందరూ మర్చిపోయిన డైనింగ్ టేబుల్ ని గుర్తు చేశారు మంచి కుటుంబ కథను అందజేశారు.

Like
Replying to

ధన్యవాదాలు నయన గారు

Like

Nayana Kasturi
Nayana Kasturi
5 hours ago
Rated 5 out of 5 stars.

రమణ గారి కధ చాలా బాగుంది. కుటుంబం లో అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడం మర్చిపోయిన డైనింగ్ టేబుల్ ని గుర్తు చేశారు రచయిత. ఈ చక్కటి కుటుంబ kadకథను చదివిన తర్వాత అయినా అందరూ వీలు చేసుకుని

Like
Replying to

ఈ కథ మీకు కాలం మరిచిపోయిన ఒక వస్తువును గుర్తుచేసినఅందుకు సంతోషం నయన గారు

Like

venibhavani
5 hours ago
Rated 5 out of 5 stars.

కథలో చెప్పినట్లు అందరూ కలిసి భోజనంచేయటం అనేది ఇప్పటి ఫ్యామిలీ లో కుదరదు. పగలంతా అందరు ఆఫీసు, స్కూల్ లోతింటారు .రాత్రి అన్న కలిసి భోజనం చేస్తే బాగుంటుంది. పెద్దలు లేకపోయినా ఉన్న ముగ్గురు కూడా ఏదో పెద్ద పనులలో ఉన్నట్లు కలిసి తినలేక పోతే dining table కూడ వృథా. పార్శిల్ ,ఇంకా అలాంటిది పెట్టడానికి పనికివస్తున్నది అని యధార్థం చెప్పారు రచయిత .


Like
Replying to

చక్కగా చెప్పేరు భవానీ గారు. ధన్యవాదాలు.

Like

Rated 5 out of 5 stars.

ఈ రోజుల్లో  టీవీ చూస్తూ హాళ్లలో సోఫాలో కూర్చుని  భోజనాలు చేయడం, ఫోన్ చూస్తూ ,కంచంలో ఏ పదార్ధం ఉందొ కూడా గమనించకుండా తినడం మాములయిపోయింది. టేబుల్ మీద భోజనం కుటుంబ సభ్యులను కలుపుతుందని చాలా చక్కగా చూపించేరు. పెద్ద వాళ్ళ భావాలని చాలా హృద్యంగా చూపించేరు . 


Like
Replying to

కిందటి తరం యొక్క ఆనవాలు ఈ వస్తువు. ఇప్పుడు కేవలం అలంకారప్రాయంగా మారింది . ధన్యవాదాలు రత్నా గారు

Like
bottom of page