top of page

దివ్య జ్యోతుల దీపావళి

#RCKumar #శ్రీరామచంద్రకుమార్, #దివ్య జ్యోతుల దీపావళి, #TeluguDevotionalArticle

ree

జిలుగు వెలుగుల దివ్య జ్యోతుల దీపావళి నేపథ్యం 

Divya Jyothula Deepavali - New Telugu Article Written By R C Kumar

Published In manatelugukathalu.com On 17/10/2025

దివ్య జ్యోతుల దీపావళి - తెలుగు వ్యాసం

రచన: ఆర్ సి కుమార్


దీపావళికి సంబంధించి ముఖ్యంగా రెండు కథలు బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుణ్ణి వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. 


త్రేతా యుగానికి సంబంధించిన ఇంకో కథకూడా ఉంది. లంకలో రావణుని సంహరించి, రాముడు సీతాసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు అమావాస్య. ఆరోజు దీపాలు వెలిగించి ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు. 


ఉత్తరాదిలో ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటించి ఆనందోత్సవాలతో జరుపుకుంటారు. స్కూళ్లకు ఆఫీసులకు ఐదు రోజుల సెలవు దినాలు ప్రకటిస్తారు. ఆ రోజు లక్ష్మీదేవి పూజచేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు. ఆదాయ పన్ను నిబంధనలు మార్చిన తర్వాత ఇప్పుడు అందరూ మార్చ్ 31వ తేదీకి ఆర్థిక సంవత్సర చివరి దినంగా పాటిస్తున్నారు. 


ఉత్తర భారత ప్రజలు ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, భగినీహస్త భోజనం అన్న పేర్లతో అయిదు రోజులూ పండుగ వేడుకలను జరుపుకుంటారు. దీపాల ఆవళి అనగా దీపాల వరుస కాబట్టి దీపం గురించే ముందుగా ప్రస్తావించుకుందాం. 

ఈ పండుగను దీపావళిగా చెప్పుకోకుండా ఈ మధ్యకాలంలో ఉత్తర భారతీయులను అనుకరిస్తూ మనవాళ్లు స్టైల్ గా దాన్ని దీవాలిగా మార్చేశారు. ముచ్చటైన దీపాల ఆవళిని దీవాలిగా తెలుగు వాళ్ళు మాట్లాడుకోవడం బాధాకరం. దీపం మీద ఎంత చక్కటి స్తోత్రం ఉందో చూడండి. 


దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |

దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||


దీపం పరబ్రహ్మ స్వరూపం. తమో గుణ దోషాలను పోగొట్టి సకల సిద్ధులు కలగజేసే సంధ్యా దీపానికి నమోస్తుతే. చీకటి అజ్ఞానానికి సంకేతం. వెలుగు జ్ఞానానికి సంకేతం. ఆ దీపజ్యోతి మనలోని అజ్ఞానాన్ని పోగొడుతుంది. దీపావళి పండుగ పరామర్థమిదే! ఇంటింటా వెలుగులు విరజిమ్మే దీపకాంతుల ఆవళి అందుకే. భారతీయ సంస్కృతికి అద్దంపట్టేలా పిల్లలు పెద్దలు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగే దీపావళి. దీపం చిన్నదైనా చుట్టుపక్కంతా వెలుగును నింపుతుంది. అది కళ్లకు మాత్రమే కనిపించే కాంతికాదు. మనుసును నింపే జ్ఞానకాంతి. చిమ్మచీకట్లను కురిపించే అమావాస్య రాత్రిని పిండారబోసినట్లు జిలుగు వెలుగులతో నింపే పండుగ. కుల మతాలకు అతీతంగా, వర్గ వయో భేదాలు లేకుండా అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ. అది నవ్యకాంతుల నేత్రావళి. దివ్వ జ్యోతుల దీపావళి. 


ఏ శుభకార్యం జరిగినా ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేయడం మన దేశంలో సంప్రదాయం. ఇంట్లో పూజ గది నుండి ఎల్లమ్మకు బోనం పెట్టేవరకు, ప్రారంభోత్సవాలలో, సభా కార్యక్రమాలలో ప్రతి శుభకార్యంలో దీప ప్రజ్వలన చేస్తాం. దీపకాంతిని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకగా పేర్కొంటారు. జాగ్రత్తగా గమనిస్తే, దీపంలో మూడు రకాల రంగులు కనిపిస్తాయి. అలా కనిపించే ఎర్రని కాంతి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి, నీలి కాంతి విష్ణు భగవానునికి, తెల్లని కాంతి పరమశివుడికి ప్రతినిధులని చెబుతారు. దీపం ఐశ్వర్యం అయితే, అంధకారం దారిద్ర్యం. దీపం సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపం. దీపావళినాడు దీపలక్ష్మి తన కిరణాలతో జగత్తునంతటినీ కాంతిమయం చేస్తుంది. దీపలక్ష్మికి భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తే సకల సంపదలూ లభిస్తాయి. ఒకానొక సందర్భంలో సాక్షాత్తు ఇంద్రుడికి ఈ అనుభవం కలిగింది. 


ఇక దీపావళికి మూలమైన నరకాసుర వధ గురించి తెలుసుకుందాం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడనే రాక్షసుడు లోక కంటకుడై సాధు జనాలను పీడిస్తూ దేవతలకు కూడా సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. నిషిద్దకాలమైన సంధ్యా సంయములో కలవటము వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో అసురలక్షణాలు వస్తాయని విష్ణుమూర్తి భూదేవికి చెపుతాడు. ఆ మాటలకు బాధ పడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ కలిగించమని వరము కోరుతుంది. ‌ దానికి విష్ణుమూర్తి సరే అని, తన తల్లి చేతుల్లలోనే ఇతనికి మరణము ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఏ తల్లీ తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది. 


తర్వాత నరకుడిని జనక మహరాజుకి అప్పచెప్పి విద్యాబుద్ధులు నేర్పమని అడుగుతుంది. ఆ విధముగా జనకమహారాజు పర్యవేక్షణలో పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారతాడు. పెరిగి పెద్దవాడైన తరువాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రాగ్జ్యొతిష్యపురము (ప్రస్తుతం అది అస్సాంలోని గౌహతి ప్రాంతం. ) అనే రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తుంటాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగ భావిస్తు చక్కగా పూజచేసెవాడు. కాలక్రమేణా అతనికి పక్క రాజ్యమైన శోణితపురముకు రాజైన బాణాసురునితో స్నేహము ఏర్పడుతుంది. తమోగుణ ప్రభావితుడైన బాణాసురుడు స్త్రీలను తల్లిలాగ భావించడాన్ని ఒప్పుకునేవాడు కాదు. అతని దృష్టిలో స్త్రీ ఒక భోగవస్తువు. అతనితో స్నేహ ప్రభావము చేత నరకాసురుడు క్రమంగా అమ్మవారి పూజ అపేసాడు. ఆరు నెలల సహవాసంలో వాడు వీడు అవుతారు అనే నానుడి ఉండనే ఉంది కదా. స్నేహితుడి సహవాసంలో నరకాసురుడిలోని అసురీ లక్షణాలు పూర్తిగా బయటపడ్డాయి. 


ప్రపంచములోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలను వివాహం చేసుకోవాలని ఉద్దేశంతో వారిని బలవంతముగా ఎత్తుకొచ్చి తన రాజ్యములో బంధించి ఉంచుతాడు. ఆ విధముగా 16, 0000 మంది రాకుమార్తెలను బందీలుగా మార్చుకున్నాడు. మహావిష్ణువు శ్రీకృష్ణ భగవానుడిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది. వరగర్వంతో నరకాసురుడు సకల లోకవాసులను, దేవతలను కూడా విడిచి పెట్టకుండా అందరినీ హింసించడం ప్రారంభిస్తాడు. చివరికి నరకాసురుడు స్వర్గంపై దండయాత్ర చేసి స్వర్గాధిపతి అయిన ఇంద్రుడిని తరిమివేసి అతని స్థానాన్ని ఆక్రమిస్తాడు. అంతేకాదు. నరకాసురుడు దేవతలకు తల్లి అయిన అదితి కుండలములను తస్కరించాడు. వరుణుడి ఛత్రమును ఎత్తుకుపోయాడు. దేవతలందరూ విహారం చేసే మణిపర్వతమును పెకిలించి పారేసాడు. 'వాని ఆగడములు భరించలేక 'కృష్ణా! నీవే వానిని హతమార్చాలి’ అని కోరుతారు దేవతలు. అపుడు కృష్ణుడు తాను తప్పకుండా నరకాసుర సంహారం చేస్తాను’ అని చెప్పి దేవతల నందరిని సాంత్వన పరిచి సత్యభామ సమేతుడై నరకుడిపైకి యుద్ధానికి బయలుదేరుతాడు. 


శ్రీకృష్ణుడు మొదట నరకాసురుడి నమ్మినబంటు అయిన ముర అనే రాక్షసుని, అతని పుత్రులను హతమారుస్తాడు. ఇది చూసిన నరకాసురుడు కోపోద్రిక్తుడై శ్రీకృష్ణుడిపై యుద్ధానికి బయల్దేరుతాడు. నరకాసురుడి బాణం తగిలి శ్రీకృష్ణుడు మూర్ఛ పోయినట్టు నటిస్తాడు. అప్పుడు సత్యభామ నరకాసురుడితో ఘోర యుద్ధం సాగిస్తుంది. ఇలా ఈ భీకర యుద్ధం చేసిన సత్యభామ తరువాత అలసి పోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామకు సహాయంగా నిలిచి ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు ఆమె సహాయంతోనే నరకాసురుడిని అంతమొందిస్తాడు. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధర్మస్థాపన జరిగింది. ఈ 16 వేల మంది రాజకన్యలు తాము నరకాసురుడి చెరలో ఉన్నందున తమతో వివాహానికి ఎవరూ అంగీకరించరు కాబట్టి వారు తమని భార్యలుగా చేపట్టమని శ్రీకృష్ణుని కోరుతారు. ఆ విధంగా వారికి అప్రతిష్ట కలుగకుండా కాపాడడానికి మాత్రమే కృష్ణుడు వారిని తన భార్యలుగా చేసుకొన్నారే తప్ప వారితో కాపురం చేయడానికి, సంగమించడానికి కాదు. 


నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. నరకాసురుడిపై శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై వచ్చి సంహరించింది ఎక్కడో కాదు అది తెలుగు నేలపైనే. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నడకుదురు ప్రాంతంలోనే ఈ సంఘటన జరిగిందని స్కంద పురాణం చెబుతోంది. నదీతీర గ్రామమైన నడకుదురు ఆనాడు నరకోత్తారక క్షేత్రంగా విలసిల్లింది. 


నరకాసురవృత్తాంతంలో మనం తెలుసుకోవలసిన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాలు:


అసుర సంధ్య వేళలో సంగమించడం: 


పగలు వేడి, జ్ఞానం, శక్తి వంటి మంచి లక్షణాలకు ప్రతీక. చీకటి నిద్ర అజ్ఞానం కామం వంటి దుర్లక్షణాలకు ప్రతీక. అసుర సంధ్య వేళలో బీజం పడిన నరకాసురుడికి అసురుడి లక్షణాలు వచ్చాయి. 


సాక్షాత్తు భగవంతుని కుమారుడైనా:


దేవుడి కుమారుడు అయినప్పటికీ లోక కళ్యాణం కోసం ఆ దేవుడే అతన్ని చంపవలసి వచ్చింది.

 

చెడు స్నేహ ప్రభావం:


అతనిలో నిద్రాణంగా ఉన్న అసుర లక్షణాలను బాణాసురుడు అనే రాక్షసుడి చెడు స్నేహం మేల్కొలిపింది. కాబట్టి దుష్టులకు దూరంగా ఉండాలి. 

కోరితెచ్చుకున్న కీర్తి Vs కోరి తెచ్చుకున్న అపకీర్తి : 

ప్రహ్లాదుడు రాక్షసుడి కడుపున పుట్టినా దేవుడిగా మారాడు. అది కోరి తెచ్చుకున్న కీర్తి. నరకాసురుడు భగవంతుడి కడుపున పుట్టినా రాక్షసుడిగా మారాడు. ఇది కోరి తెచ్చుకున్న అపకీర్తి. మనం ప్రహ్లాదుడిగా మంచి పేరు తెచ్చుకోవాలా లేక నరకాసురుడిగా అపకీర్తి పాలవ్వాలా అనేది మన ప్రవర్తన లోనే ఉంటుంది. 


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

Comments


bottom of page