top of page
Original.png

కొన్ని దూరపు కొండలు నునుపే సుమా! 

#PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #KonniDurapuKondaluNunupeSuma, #కొన్నిదూరపుకొండలునునుపేసుమా! , #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Konni Durapu Kondalu Nunupe Suma - New Telugu Story Written By Pandranki Subramani

Published In manatelugukathalu.com On 17/10/2025

కొన్ని దూరపు కొండలు నునుపే సుమా!  - తెలుగు కథ

రచన: పాండ్రంకి సుబ్రమణి

ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

పొందికగా చీర కట్టుకుని నిండుదనం తొణికిసలాడే గుండ్రటి బొట్టు పెట్టుకుని చైన్ స్నాచర్ల పాపిష్టి కళ్లబడకుండా మెడ ను చెంగుతో కప్పుకుని ఫుట్ పాత్ పైన ఒదిగి ఒదిగి నడుస్తూంది కౌసల్య. పెళ్లయి ఇద్దరు బిడ్డలకు తల్లయినా- ఆమెది పొంగు లూరే అంగసౌష్టవమేమో వచ్చే పోయే మగరాయళ్ల చూపులు చెదరే వాన చినుకుల్లా ఆమె పైన పడుతున్నాయి. అది ఆమెకు తెలుస్తూనే ఉంది. అందుకే ఈ మెళకువంతా.. అలా కళ్లప్పగించి చూడటానికి తనేమి క్యాట్ వాక్ చేసే మోడలింగ్ సెలబ్రిటీ కాదు కదా— మరెందుకు అంతటి పెద్దకళ్ళతో చూస్తున్నారో! 


అలా ఉక్రోశంగా ఆలోచిస్తూ ఫుట్ పాత్ మారడానికి అటు వేపు అడుగులు వేస్తున్నప్పుడు అక్కడ గొంతు వినిపించింది- “అక్కాయ్! ఇటు రావే! అలా వెళ్తూ నిన్ను మీ ఆఫీసులో దిగవిడిచి వెళ్తాను!”


 కౌసల్య ఆ గొంతెవరిదో గుర్తుపట్టింది. చిన్నాన్న కూతురు సునంద! ఇక మరు పలుకు లేకుండా, అటూ ఇటూ ఓసారి చూపుసారించి చూసి చెల్లెలి ప్రక్కన డోరు తెరుచుకుని కూర్చుంది. ఆ ఊపున అక్కాచెల్లెళ్ళిద్దరూ పది నిమిషాలలో సుల్తాన్ పూర్ బజారు చేరుకున్నారు. అక్కడకు చేరుకుని కారుని మెల్లగా డ్రైవ్ చేస్తూ కౌసల్య ఆఫీసు ప్రాంగణం ముందు ఆపింది సునంద. ”బాయ్! ” అంటూ చెల్లికి వీడ్కోలు చెప్పి లోపలకు వెళ్ల బోయింది కౌసల్య. 


కాని సునంద అక్కయ్య నుంచి వీడ్కోలుని అందుకోలేదు. కారుని పార్కు చేసి అక్కయ్య వెనుక నడిచింది, ”కాస్తంత ఆగవే” అంటూ.. 


ఇద్దరూ కార్యాలయ చేంబర్ లోకి వెళ్లింతర్వాత చెల్లి చేతిని చిన్నగా గిల్లుతూ కౌసల్య అంది-“సో—ఈరోజు నాతో బాతాఖానీ కొడ్దామన్న తీర్మానంతోనే వెంబడించావన్న మాట! ఊఁ-కానియ్యి మరి. ఈ లోపల నీకోసం రెండు ఉల్లి గారెలు తెప్పిస్తాను.. మా ప్యాంట్రీ లో బాగుంటాయి”అంటూ మంచి నీళ్ల గ్లాసుని సునంద ముందుకి తోసి లేడీ అటెండర్ని గారెలతో రెండు కప్పుల కాఫీ తెమ్మని పురమాయించింది. 


అటెండర్ అలా అటు వెళ్లడం గమనించిన సునంద మొదటి తూటాను పేల్చింది- “నేనొకటి చెప్తాను ప్రొద్దటే నీ మూడ్ పాడుచేస్తున్నానని నిందించకపోతే..” 


కొన్ని అర్జంటు ఫైళ్లను చేతిలోకి తీసుకుంటూ పెదవుల ఓరన నవ్వుతూ అంది కౌసల్య -“ఎన్ కౌంటర్ యెదుర్కోవడానికి నేను సిధ్దంగానే ఉన్నాను. ఇక నీదే ఆలస్యం—” 


సునంద గంభీరంగా ముఖం పెట్టుకోవడాని ప్రయత్నిస్తూ చెప్పసాగింది “నిజంగా నిన్ను చూస్తుంటే నాకు కష్టంగా ఉందే అక్కాయ్! పెద్దమ్మకూ పెదనాన్నకూ ఒక్కగానొక్కతివి. యువరాణిలా ఉండేదానివి. అడక్కుండానే అన్నీ వచ్చి నీ ముంగిట వాలేవి. మరి ఇప్పుడేమో—” 


ఆమాటను తెంచుతూ కౌసల్య అందుకుంది- “మంచి ఉద్యోగంలో ఉండికూడా బస్సులోనో— ఆటోరిక్షాలోనో తొక్కిసలాటకు లోనవుతూ రహదారుల రద్దీని భరిస్తూ వెళ్తున్నానంటావు. అంతేనా! ” 


“అదేమిటే అక్కాయ్! అంత తేలిగ్గా తీసి పారేస్తున్నట్టు మాట్లాడుతున్నావు- నీకు తెలుసో తెలియదో గాని— ఈ మధ్య నువ్వన్నీ అవక తవగ్గానే చేస్తున్నావు” 


‘ఎలా? ’అన్నట్టు ప్రశ్నార్థంగా చూసింది కౌసల్య. 


“ఏమీ తెలియనట్టు అలా ముఖం పెట్టి చూడకే— నాకు నిజంగానే చిరాకేస్తుంది. పగలంతా ఆఫీసులో పనిచేసి వెళ్లి విశ్రాంతి తీసుకోకుండా ఇంట్లోని చాకరి అంతా గతితప్పని భూపాలరాగంలా నువ్వే నెత్తిన వేసుకుని చేస్తావట. ఆ అగచాట్లన్నీ నీకెందుకే! నువ్వు వాళ్ళింటి కోడలివా.. లేక విరామం లేకుండా పని చేసే రొబోవా? ఇవన్నీ పెద్దమ్మ నాతో చెప్పి నొచ్చుకుంది తెలుసా!”


అటెండర్ తెచ్చిన గారెల ప్లేటు సునంద ముందుకు తోస్తూ అడిగింది కౌసల్య- “ఐపోయిందా లేక ఇంకా మిగిలి ఉందా? ”


కాఫీ కప్పుని మాత్రం చేతిలోకి తీసుకుంటూ.. “ఉంది. అదంతా చెప్పకుండా నేనిక్కణ్ణించి కదిలేది లేదే అక్కాయ్! ”


అలాగే ముందుకు సాగమన్నట్టు తలూపింది కౌసల్య. 


“చిన్నప్పుడు నాన్నగారు నీగురించి చాలా చెప్తుండేవారు. ఇంకా చెప్పాలంటే— నువ్వు ఎంతటి బ్రిలియంటే స్టూడెంటువంటే— అప్పటి రోజుల్లో ఇంట్లో మాకందరకూ ఐకన్ ఐపోయావనుకో-నువ్వేదో ఒకరోజున ఐ ఏ ఎస్ వో— ఐపీఎస్ పోలీసు ఆఫీసరువో ఐపోతావునుకునే వాళ్లం. కాలేజీలో గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నావట. ఇప్పుడేమో- గంపెడంత కుటుంబానికి కోడలుపిల్లగా వెళ్లి పేదరాశి పెద్దమ్మలా తయారయావు- చెంగు కొసకి ఘళ్ళు ఘళ్ళున తాళాల గుత్తి తగిలించుకుని. మెట్టింటి వాళ్లతో సర్దుకుపోవల్సిందే— కాదనను. కాని అన్నటితోనా— అస్థిత్వం చంపుకుని.. “ 


“అన్నిటితోనా అని నన్నడిగితే నాకెలాతెలుస్తుంది? అదేమిటో చెప్తేకదా తెలిసేది! ”


“దానికే వస్తున్నాను మరి. గంపెడంత మందికి వంటగత్తెను పెట్టుకోకుండా నువ్వెందుకే వంట పనులు చేస్తున్నావు? మీ వారిది గుండెకాయా లేక బండరాయా? రెండు చేతులా సంపాదిస్తున్న వాడు పెళ్ళాం కోసం ఆపాటి ఖర్చు భరించలేడా! అంత పిసినారా” 


“నువ్వు ఆవేశంలో ఉన్నట్టున్నావు. శాంతించి నేను చెప్పేది విను. ఇంట్లో పనిగత్తె ఉంది. వంటగత్తె మాత్రం లేదు. ఎందుకు లేదో చెప్తాను. మీరందరూ అనుకున్నట్టే నేను సెంట్రల్ సర్వీసు ఎగ్జామ్ కి చదవాలనుకున్న మాట వాస్తవమే. మీ పెద్దమ్మా మీ పెద నాన్నే మంచి సంబంధం, అటువంటిది మళ్లీ రాదని చెప్తూ నా మెడ వంచి తాళి కట్టించారు. అప్పుడు వాళ్లతో చిన్నాన్న పిన్నీ కూడా కలిసారు. ఇకపోతే ఇంటి పనుల గురించి చెప్తాను. మీరందరూ అనుకున్నట్టు నేనేమీ ఇంటి పనులన్నీ నెత్తిన వేసుకోవ డం లేదు. రెండు పూటలా వంట మాత్రం చేస్తాను” 


ఆ మాట విన్నంతనే సునంద సివంగిలా అందుకుంది- “అదే నేనూ అడుగుతున్నాను. నువ్వెందుకు చెయ్యాలని? ”


కౌసల్య నవ్వింది- నవ్వుతూ బదులిచ్చింది- “చెప్తాను శాంతంగా విను. వంటగ త్తెను పెట్టాం. కాని మా ఇంట్లోవాళ్లకు ముఖ్యంగా మా మరదికీ శ్రీవారికీ వాళ్ళ వంట నచ్చ లేదు. పెద్ద ప్రాణం కదా.. మా అత్తగారికేమో, అవన్నీ చేయడానికి శరీరం సహకరించడం లేదు. అంతేకాదు- ఆమెకు కూడా నా వంటే నచ్చుతుంది. ఇప్పుడు చెప్పు— నాకు తీరికలేదంటూ వాళ్ల కడుపులు కాల్చమంటావా! వాళ్లందరూ నాకు కావల్సిన వాళ్లేగా! నావంట వల్ల వాళ్లందరూ కడుపార తింటే నాకు తృప్తే కదా? 


నేను వండిన భోజనం వాళ్లు మాత్రమేనా తింటున్నారు? మరి నా ఇద్దరు బిడ్డల సంగతీ! వాళ్ళూ లొట్టలు వేసుకుని తింటున్నారుగా— తల్లిని కాబట్టి.. కనీసం వాళ్లకోసమైనా నేను వంట చేయాలిగా! ఆడది వంట చేయడమంటే నామోషీ కానేరదుగా..”


దానికి సునంద వెంటనే స్పదించలేదు. అక్కయ్య కళ్లలోకి చూస్తూ గారెను తింటూ కాసేపు నిశ్సబ్దంగా ఉండిపోయింది. ఆ తరవాత నిదానంగా అడిగింది- “నీకు మెట్టింటి పైనా భర్తా బిడ్డలపైన ఎంతటి ప్రేమాభిమా నాలు ఉన్నా నిన్ను పెంచి పెద్దచేసిన పుట్టింటిని తిరస్కార భావంతో చూడాలన్న నియమం ఏదైనా ఉందా? దీనికి సూటిగా చెప్పు”


ఈమాట విన్నంతనే కౌసల్య తెల్లబోయింది. ”నీకు మతిగాని పోయిందా సునందా! నేనెందుకు అమ్మానాన్నల్ని తిరస్కార భావంతో చూస్తాను? హోల్ట్ యువర్ టంగ్”

“నాకంటే పెద్దదానివి కదానని దబాయించకు. నువ్వునిజంగానే వాళ్ళను తిరస్కారభావంతో చూసావు. అది నాకు తెలుసు”

 

“కమౌట్ విత్ ఫ్రూఫ్! ” కౌసల్య చేలెంజింగ్ టోన్ తో అడిగింది. 


”చెప్తాను, ముందు నువ్వు ఆవేశం తగ్గించుకుని మాట్లాడు. పెద్దనాన్న నువ్వు ప్రతిరోజూ ఆఫీసుకి బస్సులో వెళ్లడం చూసి నీకు కారు కొనిస్తానని ఆఫర్ చేసాడు. ఎందుకు తిరస్కరించావు? అంటే— నువ్వు మా అందరితో ఉన్న సంబంధాలు పల్చన చేయాలని తీర్మానించేసావన్నమాట!”


కౌసల్య మౌనం వహించింది. 


“మౌనం వహిస్తే చాలదే అక్కాయ్! నౌ యు షుడ్ కమౌట్ ఆన్ యువర్ ఓన్! ”


“నాకు మీ బావంటే అభిమానం. ఆయనను చిన్నబుచ్చడం నాకిష్టం లేదు”


“బాగుంది. భలే బాగుందే అక్కాయ్! కొమ్మకీ పిలక్కీ ముడి వేయడానికి బాగానే ప్రయత్నిస్తున్నావు. అతడికి వీలైతే తానే ఒక కారు భార్యకి కొనివ్వాలి. లేదా అత్తామామలు ఇచ్చే కారుని స్వీకరించాలి. రెండూ చేయకుండా ఈఅర్థరాత్రి మేళం ఏమటి? ”


“ఇప్పుడు దీనికి బాగా ఆలోచించి బదులియ్యి-తలచుకుంటే నేను మాకంపెనీ నుండి కారు లోను తీసుకుని కొనుక్కోలేనా! కొనుక్కున్న తరవాత నెలసరి వాయిదాలు కట్టలేనా!” 

“మంచిది. అదే పని నువ్వు నీ పూచీ పైన చేయవచ్చు కదా! డ్రైవింగ్ కూడా తెలుసు కదా.. అటూ ఇటూ కాకుండా దారిపొడవు నా నడుస్తూ వెళ్లడం- క్రిక్కిరిసిన బస్సులోకి తొడ తొక్కిడిగా దూసుకు వెళ్ళడం దేనికి? ”


“అలా చేయకపోవడానికి కూడా కారణం ఉంది. త్వరలోనే ఆయనకు ప్రమోషన్ రాబోతుందట. అప్పుడు ఆయనకు కంపెనీ వాళ్లు తక్కువ వడ్డీతో కారు లోన్ సాంక్షన్ చేస్తారట. అందుచేత ఆయన నాకు ప్రామిస్ చేసారు.. ప్రతి రోజు ఆయనే తన కారులో నన్ను నా వర్క్ స్పాట్ వద్ద దిగబెట్టి— సాయంత్రం మళ్లీ ఇంటికి తీసుకు వస్తానన్నారు” 


“అదెప్పుడు జరుగుతుంది మరి? ఈ ఏడాది పూర్తయే లోపల ప్రమాషన్ తీసుకుని కారు కొంటాడా బావ? ”


“ఏమో తెలియదు. తప్పకుండా కారు కొంటారని తెలుసు. కారు కొని నాకు రానూ పోనూ లిఫ్ట్ ఇస్తారన్నది తెలుసు” 


ఆ మాట విని సునంద అక్కయ్య వేపు ఆశ్చర్యంగా చూసింది. కుర్చీనుండి లేస్తూ తేరిపార చూస్తూ అంది- “అన్నట్టు ఒకటడగాలని తల పోస్తూనే మరిచాను. ఇది మీ అత్తగారి విషయం.. పెద్దావిడ— ఆమె గురించి ప్రస్తావిస్తున్నానని నొచ్చుకోకు. మొన్న నీ కోసం ఇక్కడకు వచ్చి అడిగితే— నువ్వు రెండురోజులు సెలవు పెట్టి మీ అత్తగారితో ఆస్పత్రిలో ఉన్నావని చెప్పారు. 


తెలియక అడుగుతాను— భర్త ఉన్నాడు- ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు- మరి మీ అత్తగారి ఆలనా పాలనా చూడటానికి వాళ్ళెవరూ వెళ్లరా అక్కాయ్! ఇద్దరు బిడ్డల తల్లివి. ఉద్యోగంతో బాటు ఇవన్నీ నువ్వు చూస్తూండగలవా! ఉమ్మడి కుటుంబంలో బాధ్యతల్ని అందరూ పంచుకోవాలి కదా ఇష్టంగా! ” 


చెల్లి మాటకు కౌసల్య నవ్వింది. “నువ్వేదేదో ఊహించేసు కుంటున్నావు గాని— వాళ్ళెవరూ మా అత్తగారికి తోడు రానని అనలేదు. మెడికల్ టెస్టులికి అత్తయ్య నన్నే పిలుస్తారు. మందులు గట్రా తెమ్మని నాకే చెప్తారు. ఐనా ఇందులో అంత విస్మయాత్మకంగా ఫీలవడానికి ఏముందే సునందా! ఆమె కూడా నాకు అమ్మవంటిదేగా..”


సునంద అక్కయ్యను నిదానంగా చూసి అక్కణ్ణించి కదులుతూ అంది- “ఈరోజుల్లో అన్నీ ఉండి కూడా ఏమీ లేని దానిలా బేలగా కాలం సాగదీస్తున్న ఒకే ఒక గృహస్థురాలిని నేనిప్పుడే చూస్తున్నానే అక్కాయ్! ” అలా అంటూ సునంద గదినుండి బయటకు వెళ్ళిపోయింది. 


కౌసల్య బెంగుళూరులో జరుగూతూన్న ఆలిండియా బిజినస్ మీట్ కి వెళ్లి తిరిగొచ్చేటప్పటికి పది రోజులు పట్టింది. 


ఊరు చేరిన మరునాడు ఆమె పని రద్దీలో పడిపోయింది;కంపెనీ బిజినస్ వింగ్సుకి పలు రకాల రిపోర్టులు అందచేస్తూ.. అప్పుడామె తన బిజినస్ డివిజన్ చీఫ్ ని కలుసుకునేందుకు చేంబర్ బైటకి వచ్చేటప్పటికి అక్కడ సునందను చూసి అవాక్కయింది. 


తామిద్దరూ మాటా మంతీ మాట్లాడుకున్నది మొన్నమొన్నేగా! ఇప్పుడు మరేమి పని మీద వచ్చింది! తనిప్పుడు ఊపిరి సలపనంత పని రద్దీలో ఉంది. ఇప్పుడు దీనితో మాటలు కలపడం ఎలా! ఇలా తలపోస్తూ అడిగింది- “ఇదేమిటే వేళ కాని వేళ ఇప్పుడొచ్చావూ! ఆఫీసుకి లీవు పెట్టావా? ” అని అటు తల తిప్పి చూసేటప్పటికి ఆమెలోని ఆశ్చర్యం రెట్టింపయింది. కళ్లు మిటకరిస్తూ పరుగున వెళ్లింది తనకోసం వచ్చిన చిన్నాన్ననూ పిన్నినీ చూసి. 


“రండి రండి! ఎప్పుడొచ్చారు? సునంద మాత్రమే వచ్చిందనుకున్నాను, ఇక్కడ మా ప్యాంట్రీలో పూరీలు బాగుంటాయి. ముందు వచ్చి కూర్చోండి”


అప్పుడు వత్సల బదులిచ్చింది -“వాటిని ఆరగించే మూడ్ లో నేను గాని మీ చిన్నాన్నగాని లేమమ్మా! నీకోసం పదిరోజులుగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాం. నిన్ను చూసిన తరవాత మా కందరకూ తెరపి కలిగింది” అంటూ భర్తతో బాటు లోపలకు వచ్చి కూర్చుందామె. 


చేతిలోని పేపర్లను బల్లపైన ఉంచుతూ అందర్నీ నివ్వెరపాటుతో చూసింది కౌసల్య. తన కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడటమా! అంతా అగమ్య గోచరంగా ఉందామెకు. 

అప్పుడు సునంద కలుగచేసుకుంది- “అమ్మానాన్నా కొంచెం అప్ సెట్ అయినట్టున్నారే అక్కాయ్! జరిగిందేమిటో నేను చెప్తాను. ఎక్కడో దూరపు సంబంధం కోసం వెతకడ మెందుకని మావారిని కూడా తోడు తీసుకువెళ్లి మేమందరమూ మీ ఇంటికి వెళ్లి పరిమళం కోసం పెళ్లి సంబంధం మాట్లాడాం. ఇంట్లోవాళ్లందరూ ఔనన్నారు సంతోషంతో— కాని మీ మరది వెంకటేశ్ మాత్రం ససేమిరా వద్దన్నాడు” 


“ఏమిటీ.. కుందనపు బొమ్మవంటి పరిమళాన్ని వెంకటేశం వద్దంటున్నాడా! ఇంతకీ ఎందుకు వద్దంటున్నాడు? ఎక్కడైనా గార్ల్ ఫ్రెండు చుట్టూ తిరుగుతున్నాడా? ”


ఈసారి వివేకానందం కలుగచేసుకున్నాడు- “అదేమీ లేదమ్మా కౌసల్యా! కుర్రాడు నిదానంగానే ఉన్నాడు. అతడికున్న కారణం ఒక్కటే.. చాలా టెన్షన్ లో ఉన్నాడట. స్టేట్ వీ సెంట్రల్ వీ మూడు ఎగ్జాములు వ్రాసాడట. రెండింటిలో ఉత్తీర్ణుడై ఓరల్ ఇం టర్వ్యూకి హాజరయి వచ్చాడు. ఎందులో సెలెక్ట్ ఔతాడో తెలియని పరిస్థితట. కొన్నిరోజులుగా బుర్ర గిర్రున తిరుగుతున్నట్లుందట. అది అతనికి జీవిత సమస్యని బల్ల గుద్ది చెప్తూ— ఉద్యోగంలో స్థిరపడేంతవరకూ పెళ్ళి ఊసే వద్దంటున్నాడు” 


“అదీ వాస్తవమే చిన్నాన్నా! వెంకటేశ్ కొద్ది రోజులుగా డిస్టర్బ్ గా ఫీలవుతున్నట్టున్నాడు. మొదట సెలెక్టవుతాడో లేదోనని కలత పడేవాడు. ఇప్పుడేమో ర్యాంకు గురించి పోస్టింగు గురించి కలత చెందుతున్నాడు. అందులో ఈ పోటీ తత్వం ఒకటీ.. మొత్తానికి మనిషి మనిషిలా లేడు. ఇప్పుడు అతని మూడ్ ని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా! “ 


“వాస్తవమే— కాని మా ఇంటి అమ్మాయివి కాబట్టి మా తరపున నువ్వు ఆలోచించాలి కదమ్మా! పరిమళ ఇంటికి చిన్నది కాబట్టి మిక్కిలి మాలిమితో పెరిగింది. చదువుకున్నదన్నమాటే గాని— జీవితానుభవం లేనిది. నువ్వున్న చోటుకి వస్తే అది నీ కనుసన్నల్లలో ఉండి నెమ్మదిగా సంసారం చేసుకోవచ్చు కదా! పెద్దక్కయ్యగా నువ్వెప్పుడూ తోడుగా ఉంటావు కదా! ఏది కావాలన్నా ఏది అడిగినా ఇస్తామని చెప్పినా కుర్రాడు బిర్రబిగుసుకు పోయి వినడం లేదు. తనకు జీవితం ముఖ్యం.. పెళ్లి కాదంటున్నాడు“


అంతా విన్న కౌసల్య ఆలోచిస్తూ ఉండిపోయింది. పరిమళాన్ని తమింటకి పంపించాలని ఎందుకు చిన్నాన్నా పిన్నీ ఆరాట పడుతున్నారో ఆమెకు అర్థమైంది. కాని ఈ విషయంలో తను మాత్రం ఏమి చేయగలదు? గుర్రాన్ని తటాకం వద్దకు తీసుకు రాగలదు గాని— దాని చేత నీళ్లు బలవంతంగా తాగించలేదు కదా! 


అందునా— వెంకటేశ్ మానసిక పరిస్థితిని బట్టి చూస్తే ఇప్పటి కిప్పుడు పెళ్ళి వద్దనడానికి బలమైన కారణమే ఉంది. అలా ఆలోచిస్తూ చిన్నాన్న చేతి పైన చేతినుంచి అందామె- “ఇప్పటి కిప్పుడు మీరిద్దరూ టెన్షన్ కి లోనవకండి చిన్నానా! అసలే మీ ఇద్దరికీ బి పి ఉంది. నా ప్రయత్నంగా నేనొకసారి మా మరదితో మాట్లాడతాను. అతడేమంటాడో విని ఆ తరవాత ఏమి చేయాలో ఆలోచిద్దాం. సరేనా! ” 


భార్యాభర్తలిద్దరూ ఒకేసారి తలలూపారు. 


తన ఇంటీరియర్ రూములోపలకు వెళ్ళి ఆమె మరదితో ఎక్కువ సేపు మాట్లాడలేదు. మూడు నిమిషాల్లోపల వాళ్ళ వద్దకు వచ్చింది. ఆమె ముఖంలోకి ఆతృతగా చూస్తూ ఇద్దరూ ముక్త కంఠంతో అడిగారు “ఏమన్నాడమ్మా మీ మరది? ”


ఈసారి కౌసల్య బదులివ్వలేదు. నవ్వు ముఖంతో చూస్తూ అంది- “అనడం కాదు పిన్న! మీరు ఇల్లు చేరుకుని గడప దాటే సరికి వెంకటేశం పరిమళంతో మాట్లాడుతూ కనిపిస్తాడు. అంతేకాదు, పెళ్లి పీటలన కూర్చోవడానికి ఇప్పటికిప్పుడు సిధ్దమే నని ఒప్పుకున్నాడు కూడా- ఇక పరిమళం పెళ్లి గురించిన దిగులు వద్దు. నాకు స్వయంగా తోడికోడలుగా వస్తుంది. సరేనా! ”


ఆ మాటలంటున్నప్పుడు అక్కయ్య గొంతున ద్యోతకమైన హుందాతనం సునంద మాత్రమే గమనించింది. 


మరదే కాదు— ఆ ఇంట్లో అక్కయ్య ఆనతి మీర గలవారున్నారా! 


శుభం

  

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

ree





Comments


bottom of page