దూసుకుపోతున్న మహిళా మహారాణులు

Dusukupothunna Mahila Maharanulu - Telugu Inspirational Article | Sanjeeva Kumar Y
దూసుకుపోతున్న మహిళా మహారాణులు - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం| వై. సంజీవ కుమార్
Published in manatelugukathalu.com on 06/10/2026
దూసుకుపోతున్న మహిళా మహారాణులు
వంటింటి నుంచి అంతరిక్షం వరకు... విజయపథంలో మహిళా ప్రస్థానం
మహిళ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక కుటుంబానికి ఆత్మ, సమాజానికి పునాది, భవిష్యత్తు తరాలకు మార్గదర్శి. నాడు వంటింటికే పరిమితమైందని భావించిన మహిళ నేడు అంతరిక్షంలోకి అడుగుపెడుతోంది. ఒకప్పుడు ఇంటి గడప దాటడమే కష్టంగా ఉన్న పరిస్థితి, ‘ఆడపిల్లకు చదువా..’ అనే పరిస్థితుల నుంచి, నేడు ఆకాశమే హద్దుగా అంతరిక్షం నుంచి పరిశోధనశాలల వరకు, వ్యవసాయం నుంచి పారిశ్రామిక రంగం వరకు, విద్య నుంచి క్రీడల వరకు ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోంది.
కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుంటూనే, తన కలలను సాకారం చేసుకుంటూ, సమాజ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఒక బిడ్డకు తొలి పలుకులు నేర్పేది తల్లి. తొలి అడుగులు వేయించేది తల్లి. మంచి, చెడుల మధ్య తేడాను తెలియజేసి, జీవితానికి అవసరమైన విలువలను నేర్పేది కూడా తల్లే. అందుకే మహిళను తొలి గురువుగా అభివర్ణిస్తారు. కుటుంబంలోనే కాదు, సమాజ నిర్మాణంలోనూ మహిళ పాత్ర ఎంతో కీలకమైనది. మహిళ భాగస్వామ్యం లేకుండా కుటుంబం సంపూర్ణం కాదు, మహిళల సమాన భాగస్వామ్యం లేకుండా సమాజ అభివృద్ధి కూడా సంపూర్ణం కాదు.
ప్రేమ, సహనం, బాధ్యత, ఆత్మవిశ్వాసం, త్యాగం వంటి లక్షణాలతో కుటుంబాన్ని నడిపించే మహిళకు తనకంటూ ఆశయాలు, ఆలోచనలు, లక్ష్యాలు కూడా ఉంటాయి. వాటిని సాధించేందుకు అవకాశాలు, ప్రోత్సాహం లభిస్తే ఆమె అద్భుతాలు సృష్టించగలదు. విద్యారంగంలో మహిళలు విశేషమైన పురోగతి సాధిస్తున్నారు. ఒకప్పుడు బాలికల విద్యకు ఎన్నో అడ్డంకులు ఉండేవి. నేడు ఉన్నత విద్యను అభ్యసిస్తూ వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులుగా ఎదుగుతున్నారు. విద్య కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాదు; ఆత్మవిశ్వాసం, ఆలోచనా స్వేచ్ఛ, నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది.
విద్యావంతురాలైన మహిళ తన జీవితాన్నే కాదు, తన కుటుంబం మరియు తదుపరి తరాల భవిష్యత్తును కూడా ప్రభావితం చేయగలదు. క్రీడారంగంలో మహిళలు దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధిస్తూ తమ ప్రతిభను ప్రపంచానికి చాటుతున్నారు. కఠినమైన సాధన, క్రమశిక్షణ, పట్టుదలతో విజయాలను అందుకుంటున్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనూ మహిళల పాత్ర రోజురోజుకూ విస్తరిస్తోంది.
ప్రజాప్రతినిధులుగా వార్డు మెంబర్ స్థాయి నుంచి రాష్ట్రపతి స్థాయి వరకు మహిళలు ప్రజాసేవలో తమదైన ముద్ర వేస్తున్నారు. గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తూ, పట్టణాలు, నగరాలు, రాష్ట్రాలు, దేశ అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడుతున్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండటం సమాజ పురోగతికి దోహదపడుతోంది. సమాజ రక్షణలోనూ మహిళలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హోంగార్డు స్థాయి నుంచి ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) స్థాయి వరకు పోలీసు వ్యవస్థలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత, నేరాల నియంత్రణ వంటి బాధ్యతలను నిర్వహిస్తూ సమాజానికి రక్షణగా నిలుస్తున్నారు. విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ, బాధ్యతాయుతంగా తమ సేవలను అందిస్తున్నారు. వైద్యరంగంలో మహిళలు వైద్యులుగా, నర్సులుగా, పరిశోధకులుగా, ఆరోగ్య ఆశా కార్యకర్తలుగా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నారు.
అత్యవసర పరిస్థితుల్లోనూ, క్లిష్టమైన వైద్య సేవల్లోనూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఎంతోమందికి ఆరోగ్య భరోసా కల్పిస్తున్నారు. క్రీడారంగంలో కఠోర సాధనతో విజయాలను సాధిస్తూ దేశ కీర్తిని ప్రపంచానికి చాటుతున్నారు. సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతూ, పరిశోధనల్లో ముందంజ వేస్తున్నారు. విద్యారంగంలోనూ మహిళలు అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నారు. అంగన్వాడీ టీచర్‌గా చిన్నారులకు తొలి విద్యాబుద్ధులు నేర్పించే స్థాయి నుంచి పాఠశాల ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా, ప్రొఫెసర్లుగా, విద్యాసంస్థల నిర్వాహకులుగా ఎదుగుతున్నారు. అంతేకాకుండా సొంతంగా విద్యాసంస్థలను, కళాశాలలను, విశ్వవిద్యాలయాలను స్థాపించే స్థాయికి చేరుకున్నారు.
విద్యను కేవలం ఒక వృత్తిగా కాకుండా సమాజ మార్పుకు సాధనంగా భావిస్తూ, భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు విద్యావ్యాప్తికి కృషి చేస్తూ, ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో మహిళలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉన్నత పదవులను చేపడుతూ తమ సామర్థ్యాన్ని చాటుతున్నారు. వ్యాపారవేత్తలుగా ఎదుగుతూ సంస్థలను స్థాపించడమే కాకుండా, ఇతరులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.
సినిమా, పాత్రికేయం, వార్తా ప్రసారసాధనాలు, కళలు, కళా రంగాలు, మోడలింగ్, వ్యవసాయం, పారిశ్రామిక రంగం, రక్షణ సైనిక రంగం, న్యాయరంగం, అంతరిక్ష పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలు, వైద్య పరిశోధనలు—ఇలా ప్రతి రంగంలోనూ మహిళల అడుగులు బలంగా వినిపిస్తున్నాయి. ఏ రంగాన్ని పరిశీలించినా మహిళల భాగస్వామ్యం స్పష్టంగా కనిపిస్తుంది.
తమ సామర్థ్యాన్ని నిరూపిస్తున్నారు. ఒకప్పుడు కలగా కనిపించిన ఎన్నో లక్ష్యాలను నేడు వాస్తవాలుగా మార్చుతున్నారు. మహిళల విజయగాథలు కేవలం ఉద్యోగాలు, ఉన్నత పదవులు, అవార్డులతో మాత్రమే కొలవలేం. కుటుంబాన్ని నిలబెట్టేందుకు వారు చేసే పోరాటం కూడా అంతే గొప్పది. భర్తను కోల్పోయిన మహిళలు, బాధ్యతారహితమైన భర్తలు ఉన్న కుటుంబాలలో ఉండే తల్లులు, ఒంటరి తల్లులు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న మహిళలు తమ పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. కూలిపనులు చేస్తూ, చిన్నచిన్న వ్యాపారాలు నిర్వహిస్తూ, ఇంటి పనులు చేస్తూ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నారు.
తమకు ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లల చదువు ఆగకూడదని, వారి భవిష్యత్తు బాగుండాలని తపిస్తున్నారు. తమ అవసరాలను తగ్గించుకుని కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చే మహిళలు, తమ ఆకలిని పక్కనపెట్టి పిల్లల కడుపు నింపే తల్లులు ఎందరో ఉన్నారు. వారి కష్టాలు బయటకు కనిపించకపోవచ్చు, వారి విజయాలకు బహుమతులు లభించకపోవచ్చు; కానీ కుటుంబాన్ని నిలబెట్టే వారి శ్రమకు వెలకట్టలేం.
మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నప్పటికీ, వారి ప్రయాణం పూర్తిగా సులభమైనది కాదు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక ఆంక్షలు, వివక్ష, భద్రతకు సంబంధించిన సమస్యలు ఇంకా అనేకమంది మహిళల ఎదుగుదలకు అడ్డంకులుగా ఉన్నాయి. ఉద్యోగం చేసే మహిళలు కార్యాలయ బాధ్యతలతో పాటు ఇంటి బాధ్యతలను కూడా నిర్వహించాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు మరిన్ని అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది.
మహిళల శ్రమకు తగిన గుర్తింపు, సమాన అవకాశాలు, నిర్ణయాధికారంలో భాగస్వామ్యం మరింత పెరగాలి. మహిళల ఎదుగుదలకు కుటుంబం, సమాజం, ప్రభుత్వాలు సమష్టిగా కృషి చేయాలి. బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యతో పాటు క్రీడారంగాలలో, ఆత్మరక్షణకు తీసుకోవలసిన వాటిలో శిక్షణ ఇవ్వాలి. మహిళలకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించాలి. వారి భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలి. వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి. మహిళలకు అవకాశాలు కల్పించడం అంటే ఒక వ్యక్తిని మాత్రమే అభివృద్ధి చేయడం కాదు—ఒక కుటుంబాన్ని, ఒక తరాన్ని, చివరికి మొత్తం సమాజాన్ని ముందుకు నడిపించడం.
విద్యావంతురాలైన మహిళ తన పిల్లలకు మంచి భవిష్యత్తును అందించగలదు. ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్న మహిళ కుటుంబ నిర్ణయాల్లో భాగస్వామ్యం కావచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే మహిళ మరికొందరికి స్ఫూర్తిగా నిలవగలదు. ఇంటి పనులు చేసే మహిళ అయినా, ఉద్యోగం చేసే మహిళ అయినా, వ్యవసాయ కూలీ అయినా, వ్యాపారవేత్త అయినా, ఉన్నత పదవిలో ఉన్న మహిళ అయినా— ఎవ్వరైనా ఉండని, ప్రతి ఒక్కరికీ గౌరవం, సమాన అవకాశాలు లభించాలి.
మహిళ అంటే సహనానికి ప్రతిరూపం మాత్రమే కాదు, సాధనకు చిరునామా కూడా. త్యాగానికి ప్రతీక మాత్రమే కాదు, విజయాలకు మార్గదర్శి. మహిళ ఎదిగితే కుటుంబం ఎదుగుతుంది, కుటుంబం ఎదిగితే సమాజం ఎదుగుతుంది, సమాజం ఎదిగితే దేశం అభివృద్ధి చెందుతుంది. మహిళా మహారాణుల విజయ ప్రస్థానం నిరంతరం కొనసాగాలి.
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
వై. సంజీవ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: వై. సంజీవ కుమార్

నా పేరు వై. సంజీవ కుమార్. హైదరాబాద్‌లో చిన్న కన్సల్టెన్సీ సర్వీస్‌ను నిర్వహిస్తున్నాను. సమాజానికి నా వంతుగా సేవ చేయాలనే ఆలోచనతో స్కై ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి, వివిధ రకాల సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాను.
అలాగే సామాజిక కోణంలో ఉండే అనేక అంశాలపై వ్యాసాలు రాయడం నాకు అలవాటు. ఇప్పటివరకు ఎన్నో సామాజిక అంశాలపై వ్యాసాలు రాశాను. వాటిలో అనేక వ్యాసాలు వివిధ దినపత్రికల్లో ప్రచురితమయ్యాయి.
ఇటీవల మొదటిసారిగా తెలుగు కథల ప్రపంచాన్ని పరిశీలించే అవకాశం కలిగింది. కథల ద్వారా భావాలను, జీవితంలోని అనుభవాలను, సామాజిక అంశాలను మరింత ఆసక్తికరంగా చెప్పవచ్చని అనిపించింది.





Comments