దురాశ
- Kondeti Prakash
- 1 day ago
- 3 min read
#Durasa, #దురాశ, #KondetiPrakash, #కొండేటిప్రకాష్, #TeluguMoralStories, #తెలుగునీతికథలు

Durasa - New Telugu Story Written By Kondeti Prakash
Published In manatelugukathalu.com On 09/10/2025
దురాశ - తెలుగు కథ
రచన: కొండేటి ప్రకాష్
అదో పెద్ద రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు పులి. రాజ్యంలో అన్ని రకాల జంతువులు, పక్షులు నివసిస్తుండేవి. అవి కలిసి మెలిసి సంతోషంగా ఉండేవి.
ఒక రోజు జంతువులన్ని ఒకటే చర్చ చేస్తున్నాయి. అదేమిటంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నాయి. మనలో మనం నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకోవడం ద్వారా ప్రయోజం ఏమి లేదు. ఒకరితో ఒకరు పోట్లాడుకుందాం. అందులో ఎవరు గెలిస్తే వారే గొప్పవారు అవుతారని ఒక జంతువు సలహా ఇచ్చింది.
మరో జంతువు ఇలా చెప్పింది. పోట్లాడుకోవడం వద్దు. ఎందుకంటే ఇలా పోట్లాడుకోవడం ద్వారా గాయాలు అవుతాయి. మనకు మనమే నష్టం చేసుకోవడం కంటే అందరం మన రాజు దగ్గరకు వెళ్ళి ఈ సమస్యకు పరిష్కారం అడుగుదామని చెప్పింది.
ఒక్కనాడు రాజు దగ్గరికి అన్ని రకాల జంతువులు, పక్షులు వెళ్ళినాయి. తమ రాజుకు వారి సమస్యను వివరించాయి. సరే మీ సమస్యకు పరిష్కారం రేపు ఉదయం చెపుతాను. అందరూ రేపు తన దగ్గరకి రమ్మని పులి రాజు సెలవిచ్చాడు.
మరుసటి రోజు ఉదయానే జంతువులు, పక్షులు సమావేశ మందిరానికి చేరుకున్నాయి. కొద్ది క్షణాల్లో పులి రాజు సింహాసనం మీదికి వచ్చాడు.
“నిన్న మీరు చెప్పిన సమస్యకు పరిష్కారం ఆలోచన చేశాను. మీలో ఎవ్వరు గొప్ప కాదు, ఎవ్వరు తక్కువకాదు. అందరూ సమానమే” అని తీర్పు ఇచ్చాడు. నేటి నుంచి రాజ్యంలో అందరికీ సమానంగా జీవించే హక్కు ఉంటుందని చెప్పాడు. జంతువులు మరియు పక్షులు తమ రాజు నిర్ణయాన్ని అంగీకరించాయి.
పులి రాజు మరో ఆలోచన కూడా చేశాడు. “జంతువులు, పక్షులు ఒకరి పట్ల మరొకరి ఉన్న ఈ సద్భావనకు దూరం కాకుండా ఉండేందుకు ప్రతి సంవత్సరం నా కోటలోమీ అందరికి ధావత్ ఇస్తాను. దీనిని ఒక పండగలా జరుపుకుందాము” అన్నాడు. అప్పటి నుండి ఏడాదికి ఒక సారి రాజుగారి కోటలో రెండు రోజులు పండుగ జరుపుకుంటాయి. ఆ పండగలో ఆటలు, పాటలు, నృత్యాలు ఇలా అన్ని రకాల పోటీలు నిర్వహించుకోవడం. అక్కడి జంతువులకు, పక్షులకు అనవాయితీగా వస్తుంది.
రెండు రోజుల పండుగలో మొదటి రోజు పాటలు మరియు నృత్యాలు, రెండవ రోజు పండగలో ఆటాపోటీల నిర్వహణ ఉంటుంది. అయితే పండగ మొదటి రోజు పాటలు నృత్యాలతో సంతోషంగా జరిగిపోయింది. ఇక రెండవ రోజు ఆటల పోటీల్లో భాగంగా పులి రాజు ఒక కొత్త పోటీ పెట్టినాడు.
ఈ పోటీ ఎవరు తెలివి కలిగిన వారని తెలుసుకోవడంతో పాటు పోటీలో గెలిసిన వారిని తన మంత్రి మండలిలో సలహా మంత్రి పదవి ఇస్తానంటాడు. ఈ పోటీలో పాల్గొనే వాళ్ళు పేర్లు నమోదు చేసుకోవాలని ప్రకటిస్తాడు.
ఈ ప్రకటన రావడమే ఆలస్యం వెంటనే అందరిలో తెలివిమంతుడను నేనే అనుకున్న జిత్తులమారి నక్క. తాను పోటీలో ఉంటానని పేరు నమోదు చేయించుకుంది. నక్కతో పోటీ పడే వారు ఎవ్వరని మిగతా జంతువులు, పక్షులు చర్చోపచర్చలు జరుపుతున్నవి.
జిత్తులమారి నక్కతో ఎవ్వరు పోటీ పడలేక, పోటీకి దూరంగా ఉండలేక అందరూ తలలు పట్టుకున్నారు. ఎవరు నక్కతో పోటీ పడకుంటే నక్క ఏకగ్రీవంగా గెలిసినట్లు అవుతుంది.
రేపటి నుండి పులి రాజు సలహా మంత్రి గా జిత్తులమారి నక్క ఉంటుంది. నక్క ఆ పదవిలో ఉండటం మిగతా జంతువులు, పక్షులు ఏ మాత్రం ఇష్టము లేదు.
జంతువుల్లో ఎందరో మహామహులు ఉన్నప్పటికీ ఎవ్వరు పోటీలో పాల్గొనేందుకు సుముఖత చూపడం లేదు. ఆ జంతువుల గుంపులో అక్కడెక్కడో చివర కూర్చున్న చిన్న జంతువు ఒక్కటి అందరిని పక్కకు జరుపుకుంటూ ముందుకు వచ్చి యుద్ధభూమిలో నిలబడి నేను కూడా పోటీ లో ఉంటానని చెప్పింది.
ఆ చిన్న జంతువు కుందేలు. ఆ చిన్న కుందేలును చూసిన జిత్తులమారి నక్క ఇక విజయం తనదేనని బీరాలు పలికింది. కొద్దిసేపటిలోనే పులి రాజు పోటీని ప్రారంభించాడు.
రాజుకి ఒక బృందావనం ఉన్నది. అది రాజు కోటకు కొద్దిదూరంలో ఉన్నది. ఆ బృందావనంలో రెండు గుండ్రని బంతులు ఉన్నాయి. వాటిని ఎవరు ముందుగా తీసుకొస్తారో వారు విజేతలని ప్రకటించి పోటీ ప్రారంభించాడు.
జిత్తులమారి నక్క వేగంగా బృందావనంలోకి వెళ్ళి వెదికి వెదికి ఒక పెద్ద బంతిని మోయలేక మోయలేక తీసుకొచ్చింది.
కుందేలు కూడా వెళ్ళింది. బంతిని వెదికి తాను మోయగలిగిన బంతిని మోసుకుంటూ కొద్ది పాటి ఆలస్యంగా వచ్చింది.
పులి రాజు జిత్తులమారి నక్క మరియు కుందేలు తీసుకొచ్చిన బంతులను చూశాడు. ఎవరు ముందు వచ్చారని కూడా గమనించాడు.
ఏనుగును పిలిచి మొదట నక్క తీసుకొచ్చిన పెద్ద బంతిని పగులగొట్టమని చెప్పాడు. ఏనుగు అదే ప్రకారంగా బంతిని పగులగొట్టింది. అందులో నుండి బంగారు నాణాలు చాలా బయటపడ్డాయి. ఇది చూసిన నక్క విజయం తన స్వంతం అయినట్లుగా భావించింది.
అదే విధంగా కుందేలు తీసుకొచ్చిన రెండో బంతిని కూడా పగులగొట్టమని ఏనుగు కు చెప్పాడు రాజు. ఏనుగు ఆ బంతిని పగులగొట్టింది. అందులో నుండి వజ్రాలు బయట పడ్డాయి.
పులి రాజు ఈ రెండిటిని గమనించి తాను మోయగలిగిన దానిని మాత్రమే తీసుకొచ్చిన కుందేలును మెచ్చుకున్నాడు. తాను మోయగల్గినంత ఎంచుకున్న కుందేలు విలువైన వజ్రాలను తీసుకొచ్చినందుకు అభినందించి తన సలహా మంత్రి పదవి ఇచ్చాడు.
తాను అందరిలో ఎక్కువ తెలివి కలిగిన వాడినని చెప్పుకున్న జిత్తులమారి నక్క జంతువులు మరియు పక్షులందరి ముందు నవ్వులపాలయ్యింది. ఎందుకంటే నక్క తాను మోసే బరువు కంటే ఎక్కువ బరువున్న బంతిని దురాశతో మోసుకొచ్చింది. అందుకే ఇంతటి అవమానం జరిగింది.
***
కొండేటి ప్రకాష్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/prakashk

పేరు: కొండేటి ప్రకాష్
జిల్లా: నల్లగొండ
తెలంగాణ
Comments