top of page
Original.png

దురాశ తెచ్చిన చేటు



“తగినంత తీసుకున్నవాడు నిలిచాడు.. అత్యాశ పడ్డవాడు అంతమయ్యాడు!

పల్లా వెంకట రామారావు గారి  దురాశ తెచ్చిన చేటు కథ ఈ సత్యాన్ని ప్రభోదిస్తుంది. 


Durasa Thechhina Chetu - Telugu Moral Story | Palla Venkata Ramarao

Published In manatelugukathalu.com On 05/04/2026

దురాశ తెచ్చిన చేటు - తెలుగు నీతి కథ | పల్లా వెంకట రామారావు

ఒక చిన్న గ్రామంలో కాముడు అనే రైతు ఉండేవాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూర్వీకుల నుంచి వచ్చిన రెండు ఎకరాల పొలం ఉంది. అదే అతని జీవనాధారం. ఆ పొలంలో ఈ ఏడాది పంట బాగా పండింది. పంట కోసిన తర్వాత దాన్ని అమ్మి, తనకున్న అప్పులన్నీ తీర్చేయొచ్చు అనుకున్నాడు. అయితే ఉరుము లేని పిడుగులా, అతనికి అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారి జోగయ్య "గడువు తీరిపోయింది" అంటూ అప్పు తీర్చమని ఒత్తిడి చేశాడు. "రెండు నెలలు ఆగితే పంట చేతికి వస్తుంది, అప్పుడు నీ అప్పు తీర్చేస్తాను," అన్నాడు. దానికి జోగయ్య ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ పొలాన్ని తాకట్టు పెట్టి కాముడు అప్పు తీసుకున్నాడు. ఇప్పుడు అతను అప్పు తీర్చకపోతే పొలాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. పొలంతో పాటు అందులోని పంట కూడా జోగయ్య వశమవుతుంది. అదే జోగయ్య ఆలోచన.


 ఆ ఆలోచనను పసిగట్టిన కాముడు విషయాన్ని ఊరిలోని పెద్ద మనుషుల ముందు పంచాయితీ పెట్టాడు. అయితే పెద్ద మనుషులు 'కర్ర విరగకుండా పాము చావకుండా' ఒక ప్రతిపాదన పెట్టారు. ప్రస్తుతానికి జోగయ్య పొలాన్ని స్వాధీనం చేసుకుంటాడు. అయితే రెండు నెలల లోపల కాముడు అతని డబ్బు తిరిగి ఇచ్చేస్తే, పంటతో పాటు పొలం కూడా కాముడి స్వాధీనం అవుతుంది. ఈ తీర్పుతో కాముడు నిరాశ చెందాడు. ఎందుకంటే పంట అమ్మితేనే డబ్బు వస్తుంది, కానీ పంట కోసే దానికి వీలు లేకుండా అది జోగయ్య స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు డబ్బు తెచ్చిస్తే గాని పంట, పొలం రెండూ చేతికి రావు. చేసేదేమీ లేక ఉసూరుమంటూ ఇంటి దారి పట్టాడు కాముడు.


 రోజురోజుకూ ఇంట్లో పరిస్థితి దిగజారిపోయింది. చివరికి ప్రతిరోజూ తిండికి వెతుక్కోవాల్సిన పరిస్థితి కాముడి కుటుంబానికి ఏర్పడింది. ఒకరోజు మరీ గడ్డు పరిస్థితి ఎదురైంది. దాంతో కాముడు అడవిలో పండ్లు, కాయలు వంటి ఏదైనా ఆహారం దొరుకుతుందేమోనని భార్యకు చెప్పి, అడవి బాట పట్టాడు. చాలాసేపు వెతికినా ఏమీ దొరకలేదు. అలా వెతుకుతూ వెళుతుండగా అతనికి ఒక పాడుపడ్డ బావి కనిపించింది. అది దిగుడు బావి. పూర్వం రాజులు, జమీందార్లు నీటి కోసం పెద్దవైన దిగుడు బావులు తవ్వేవారు. అవి చాలా విశాలంగా ఉండడమే కాక, చిన్న పరిమాంలో పూజ గదులు, నలుగురైదుగురు మనుషులు ఉండడానికి వీలుగా గదులు కూడా ఉండేవి. అలాంటి బావి అది.


కాముడు ఆశ్చర్యంగా ఆ బావిని పరిశీలిస్తూ మెట్లు దిగి, చుట్టూ కలియతిరిగాడు. అక్కడ ఒక మూలన ఉన్న చిన్న గదిలో ఏదో వెలుతురు కనిపించింది. ఏదైనా దీపం వెలుతురేమో, అక్కడ దేవతామూర్తి విగ్రహం ఏదైనా ఉందేమో అనుకుంటూ అటువైపు నడిచాడు. చూస్తే అక్కడ ఏ దీపమూ లేదు. కానీ లోపల నుంచి చిన్నగా వెలుగు వస్తోంది. ఆశ్చర్యంగా చూస్తూ ఆ చిన్న గదిలో ప్రవేశించాడు. విచిత్రంగా అక్కడ లోపలికి కొన్ని మెట్లు కనిపించాయి. జంకుతూనే మెల్లిగా ఆ మెట్లదారి వెంట నడిచాడు. కొద్దిదూరం వెళ్ళగానే అతని కళ్ళు ఆశ్చర్యంతో వెలిగాయి.


అక్కడ లోపల మరొక గది లాంటి నిర్మాణం ఉంది. ఆ గదిలో చుట్టూ ఉన్న గూళ్ళలో పచ్చగా మెరిసిపోతూ బంగారు నాణేలు కనిపించాయి. ఆ వెలుతురు వాటి నుంచి వస్తోంది. ఆశ్చర్యంతో తనమునకలవుతూ దగ్గరికి వెళ్లి ఆ బంగారు నాణేలను తాకాడు. వాటిని తాకాడో లేదో, ఒక గంభీరమైన స్వరం వినపడింది. ఉలిక్కిపడ్డాడు కాముడు.


"భయపడకు. నేను ఈ బంగారానికి కాపలాదారుణ్ణి. నువ్వు నన్ను చూడలేవు. నీ కష్టాలు తీరిపోయేంత ధనం మాత్రమే తీసుకో. అత్యాశతో ఎక్కువ తీసుకుంటే, తర్వాత జరిగే పరిణామాలకు నీదే బాధ్యత" అని పలికింది ఆ అదృశ్య స్వరం.


కాముడు కాసేపు ఆలోచించి, తనకు ఎంత ధనం తీసుకుంటే కష్టాలు తీరిపోతాయో అంతే తీసుకున్నాడు. "ఇక నువ్వు వెళ్ళవచ్చు. గుర్తుంచుకో: నువ్వు ఏ అవసరానికైతే ధనం తీసుకున్నావో ఆ అవసరానికి మాత్రమే వాడాలి. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు. నీ దగ్గర ధనం పూర్తిగా అయిపోయిన రోజున నీవు మళ్ళీ రావచ్చు" అన్న మాటలు వినిపించి అక్కడి నుంచి బయలుదేరాడు కాముడు.


ఇంటికి వచ్చిన వెంటనే తాను తెచ్చిన ధనంతో భార్యాపిల్లలకు ఆహారము, ఇతర అవసరాలు తీర్చి, మిగిలిన ధనం తీసుకుని జోగయ్య వద్దకు వెళ్లాడు. అక్కడ పెద్ద మనుషుల సమక్షంలో తన బాకీ తీర్చి, పొలం పత్రాలు తెచ్చుకున్నాడు.


కాముడు తన బాకీ తీర్చివేయడం జోగయ్యకు ఆశ్చర్యం కలిగించింది. అంత డబ్బు అంత త్వరగా ఎలా తీసుకురాగలిగాడో అతనికి అర్థం కాలేదు. ఆ విషయం అడిగినా, కాముడు పెదవి విప్పలేదు. జోగయ్యకు ఇదేదో రహస్యంలా అనిపించి కాముడి పైన ఒక కన్ను వేసి ఉంచాడు.


తర్వాత కొద్ది రోజులకు కాముడికి ఏదో అవసరం పడింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. దాంతో మళ్లీ ఆ బావి దగ్గరికి బయలుదేరాడు. అతని కదలికలను గమనిస్తూ ఉన్న జోగయ్య రహస్యంగా అతన్ని వెంబడించాడు. కాముడు బావిలో దిగి, ఆ రహస్య గదిలోకి వెళ్ళడం గమనించాడు. కాముడు వెళ్ళపోయాక, బావిలోకి దిగి ఆ రహస్య గదిలోకి ప్రవేశించాడు జోగయ్య. అక్కడ ఉన్న నిధిని చూసి కళ్ళు చెదిరిపోయాయి జోగయ్యకు. దాన్ని సొంతం చేసుకుందామని చెయ్యి వేసిన జోగయ్యకి అదృశ్యవాణి వినిపించింది.


"ఇక్కడ డబ్బు తీసుకోవాలంటే, నీ దగ్గర ఏమీ ఉండకూడదు. నీకు ఏదైనా అవసరం ఉండాలి. అలాగైతేనే ఈ ధనాన్ని ముట్టుకో. లేదంటే దానికి తగిన ఫలితం అనుభవిస్తావు" అని హెచ్చరించింది అదృశ్యవాణి.


ఆ మాటలు లెక్క చేయలేదు జోగయ్య. తనకు కావలసిన ధనం తీసుకుని ఇంటి దారి పట్టాడు. తను తెచ్చిన ధనాన్ని బీరువాలో పెట్టి ఆ రాత్రి హాయిగా నిద్రపోయాడు. తెల్లవారి లేచి చూస్తే, బీరువాలో తాను తెచ్చిన ధనం లేదు. అంతేకాదు, అంతకుముందు బీరువాలో ఉన్న అతని సొంత ధనం కూడా కొంత మాయమైంది.


జోగయ్యకు కోపం వచ్చింది. "కాముడు బావి నుంచి ధనం తెచ్చుకుని హాయిగా ఉన్నాడు. తనకేమో ఇలా జరిగింది!" అని కోపగించుకుని, ఈసారి పెద్ద గోతం తీసుకొని బయలుదేరాడు. బావిలోకి దిగి గోతం నిండా ధనం నింపసాగాడు.


అదృశ్యవాణి మళ్లీ హెచ్చరించింది, అయినా వినలేదు. గోతం నిండా బంగారు నాణేలు నింపుకొని, అష్టకష్టాలు పడి దాన్ని మోస్తూ ఇల్లు చేరాడు. దాన్ని రహస్యంగా గదిలో ఉంచి తాళం వేశాడు. “ఇప్పుడు ఎలా వెళ్తుందో చూద్దాం” అనుకుంటూ రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా దానికి కాపలా కాశాడు.


తెల్లవారింది. కాలకృత్యాలు తీర్చుకుందామని బయటికి వెళ్ళి వచ్చాడు. చూస్తే తను తెచ్చిన మూట మాయమైంది. కంగారుగా ఇల్లంతా వెతికాడు. లాభం లేదు. బీరువా తెరిచి చూస్తే అతను ఇంతకాలం దాచుకున్న ధనం మొత్తం మాయమైంది. లబోదిబోమన్నాడు.


"ఇప్పుడు నా దగ్గర ధనం లేదు కదా” అనుకుని మళ్ళీ బావి దగ్గరికి వెళ్ళాడు. ఆ రహస్య గదిలోకి వెళ్లి చూస్తే అక్కడ ఏమీ లేదు. అంతా ఖాళీ అయింది. "నీ అత్యాశకు ఇదే తగిన శిక్ష. ఇక నీకు ఎప్పుడూ ధనం కనిపించదు!” అని అదృశ్యవాణి పలికింది.


"దురాశ ఎంత చేటు తెచ్చింది" అని చింతించాడు జోగయ్య.


***************

పల్లా వెంకట రామారావు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పల్లా వెంకట రామారావు

Profile Link:


జన్మస్థలం:     ప్రొద్దుటూరు, కడప జిల్లా. 

జననం:         1974 

తల్లిదండ్రులు:కీ.శే. శ్రీ రామయ్య, శ్రీమతి ఓబులమ్మ

చదువు:        ఎం.ఎ (తెలుగు), టి.పి.టి, డిప్లమో (కంప్యూటర్స్) (జర్నలిజం)

ఉద్యోగం:       స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) 

అభిరుచి:      సాహిత్యం, దర్శకత్వం, నాణేల సేకరణ, యాత్రలు చేయడం(యూట్యూబ్ వ్లాగ్స్)  travel India telugu     

                    (యూట్యూబ్ చానల్ , Id:@travelIndia82)

రచనలు:  'ది అటాక్' నవల, పూలుముళ్ళు, (మినీ నవల) గేయం,

                   వచన కవితలు, హైకు, నాటిక, కథలు, పద్యం,

                   బాలల కథలు, జోక్స్, వ్యాసాలు, వంటివి. సాక్షి, ఈనాడు, వార్త,అల

                   ఉపాధ్యాయ వాణి, బాలభారతం, చంద్రబాల, సూర్య, బాలల

                   బొమ్మరిల్లు, ఆంద్రభూమి వంటి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

 సత్కారాలు: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, పండిత పరిషత్ వారిచే స్టేట్ అవార్డు,రాజుపాళెం

                    మండలం వారిచే ఉగాది పురస్కారం; అటా వారిచే , సాహితీ మిత్ర మండలి, యువ      

                    కళావాహిని, కడప జిల్లా రచయితల సంఘం,రామరాజ భూషణ సాహితీ పీఠం, అనంతపురం జిల్లా 

                    రచయితల సంఘం, తెలుగు కళా వేదిక,వేమన సాహితీ కళాపీఠం, కొని రెడ్డి ఫౌండేషన్ , తెలుగు రక్షణ 

                    వేదిక, కర్ణాటక తెలుగు రచయితల సంఘం, మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ వంటి సంస్థలచే సత్కారం.

bottom of page