ఎదురుచూపులు

Edhuruchupulu - Telugu Love Story | P. Gopalakrishna
ఎదురుచూపులు - తెలుగు ప్రేమ కథ | P. గోపాలకృష్ణ
Published in manatelugukathalu.com on 10/09/2026
పి. గోపాలకృష్ణ రచించిన “ఎదురుచూపులు” ఒక హృద్యమైన సామాజిక ప్రేమకథ. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్న సరోజిని, కుటుంబ సభ్యుల నిర్ణయాలు మరియు వివాహ ఒత్తిడిని ఎదుర్కొంటుంది. తన జీవితంపై తానే నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో ఇంటి నుంచి దూరంగా వెళ్లిన ఆమె, ఒక చిన్న రైల్వే స్టేషన్‌లో తన ప్రేమికుడు విశ్వం కోసం ఎదురుచూస్తుంటుంది.
స్టేషన్ మాస్టర్ శేషగిరితో ఆమెకు జరిగిన సంభాషణ ద్వారా కథలోని భావోద్వేగాలు, కుటుంబ సంబంధాల సంక్లిష్టత, ప్రేమపై నమ్మకం, భవిష్యత్తుపై ఆశలు పాఠకులకు పరిచయమవుతాయి. ప్రేమ, కుటుంబ ఒత్తిడి, మహిళా స్వాతంత్ర్యం, నమ్మకం, ఎదురుచూపులు వంటి అంశాలను స్పృశించే ఈ కథ తెలుగు సాహిత్యాభిమానులను ఆలోచింపజేస్తుంది.
అదొక చిన్న రైల్వే స్టేషన్. ఎప్పుడో ఉదయం ఎనిమిది గంటలకు వచ్చే పాసెంజర్ ట్రైన్ అయిదు నిముషాలు అక్కడ ఆగుతుంది. మళ్ళీ అర్ధరాత్రి అదే ట్రైన్ తిరిగి వచ్చేటప్పుడు ఇంకో పది నిముషాలు ఆగుతుంది. మధ్యలో ఒక ఫాస్ట్ పాసెంజర్ ఒక నిమిషం పాటు ఆగుతుంది. ఇవి తప్ప ఆ స్టేషన్‌లో ఆగే ట్రైన్స్ ఏవీ లేవు.
స్టేషన్ రద్దీగా ఉండదు కాబట్టి అక్కడ ఎలాంటి సదుపాయాలు లేవు. సాయంత్రం నాలుగున్నర అవుతోంది టైం. ఖాళీగా ఉన్న స్టేషన్‌లో బయట కుర్చీ వేసుకుని కూర్చున్నారు స్టేషన్ మాస్టర్ శేషగిరి. ఉన్న ఒకేఒక ప్లాట్‌ఫారం మీద దూరంగా ఒక బౌగన్విల్లా చెట్టు. దానికింద సగం విరిగిపోయిన సిమెంట్ బెంచ్. ఆ సిమెంట్ బెంచ్‌కి ఎదురుగా వెలిసిపోయిన పసుపురంగు బోర్డుతో 'లక్ష్మీపురం' అని ఊరు పేరు కనిపిస్తోంది.
సరోజిని ఆ బోర్డు వైపే చూస్తూ కూర్చుంది. ఎంతసేపయిందో ఆమెకే తెలియదు. దడదడమని పెద్ద శబ్దం చేసుకుంటూ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ వెళ్ళింది. ట్రైన్ వెళ్తూ ఉంటే ప్లాట్‌ఫారం అంతా గజగజా చిగురుటాకులా వణికిపోయింది. ఒక్కసారిగా చిన్న నిట్టూర్పు విడిచి ఆ బెంచ్ మీంచి లేచింది సరోజిని. నేరుగా స్టేషన్ మాస్టర్ వైపు వచ్చి, "గుంటూరు నుండి వచ్చే ట్రైన్స్ ఏమైనా ఉంటాయా సర్?" అని అడిగింది.
ఆయన ఆమె వైపు చూసి, "ప్యాసెంజర్ ట్రైన్ రాత్రి పన్నెండు గంటలకి వస్తుందమ్మా! ఒక ఫాస్ట్ పాసెంజర్ ఈ స్టేషన్‌లో ఆగుతుంది, అదీ మధ్యాహ్నం మూడున్నరకి వచ్చి వెళ్ళిపోయిందమ్మా" అని చెప్పారు. "మీరు ట్రైన్ కోసం ఎదురుచూసేకంటే, బస్సు ఎక్కి వెళ్ళడం మంచిదని నా ఉద్దేశం" అన్నారు.
మర్నాడు మధ్యాహ్నం రెండు గంటలకి వచ్చి ఆమె ప్లాట్‌ఫారం మీద అదే సిమెంట్ బెంచ్ మీద కూర్చుంది. ఆమెకు ముప్పై ఏళ్ళకి అటూ ఇటూగా ఉంటుందేమో వయసు. ఆమె నడకలో హుందా తనాన్ని బట్టి బహుశా బాగా చదువుకున్నావిడ అయి ఉంటుందేమో అనుకున్నాడు. లేదా ఏదైనా ఉద్యోగం చేస్తోందేమో అనిపించింది.
ఒకరోజు శేషగిరి గారే ఆమెను పలకరించాలని, "ఎక్కడికైనా వెళ్ళాలా అమ్మా!" అని అడిగారు. లేదన్నట్లు తలూపింది ఆమె. కొంచెం నిశ్శబ్దం తరువాత, "ఎవరైనా రావాలా తల్లీ?" అని అడిగారు. ఆమె మౌనంగా నిలబడిపోయింది చాలాసేపు. "పోనీలే అమ్మా, చెప్పడానికి ఇష్టం లేకపోతే చెప్పకు, పరవాలేదు" అంటూ అక్కడే ఉన్న అటెండర్‌ని పిలిచి, ఇంటికి వెళ్ళి కాఫీ తీసుకురా అంటూ పురమాయించారు. వద్దంటూ మొహమాట పడిపోయింది ఆమె.
"మరేమీ పరవాలేదమ్మా. ఇక్కడ పనిలేని రైల్వే స్టేషన్‌కి నేనో చిన్న స్టేషన్ మాస్టర్‌ని. ఈ పక్కనే మా క్వార్టర్. మా ఆవిడకి పని కావాలి కాబట్టి కాఫీ పెట్టి పంపించమని పురమాయిస్తూ ఉంటాను. కూర్చో అమ్మా, నా పేరు శేషగిరి. ఇంకో పదేళ్ళు వరకూ రిటైర్మెంట్ లేదు. అప్పటిదాకా నేనిక్కడే ఉండిపోదామని ఈ మధ్యే ఇక్కడికి వచ్చాను" అంటూ తనని తాను పరిచయం చేసుకున్నారు.
"నా పేరు సరోజిని సర్, ఇక్కడికొచ్చి పదిహేను రోజులు కావస్తోంది" అని చెప్పడం మొదలెట్టింది ఆమె. "మాది ఒంగోలు దగ్గర చిన్న ఊరు. మా అమ్మా నాన్నలకు నేను ఒక్కదాన్నే. చిన్నప్పుడు ఎంతో అల్లారుముద్దుగా పెంచారు నన్ను. చదువులో చాలా చురుగ్గా ఉంటూ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక బ్యాంకు టెస్ట్‌లు పాస్ అయ్యి క్యాషియర్‌గా స్టేట్ బ్యాంకులో గుంటూరులో జాయిన్ అయ్యాను.
అక్కడే నాకు విశ్వం పరిచయమయ్యాడు. నాకంటే ఒక ఏడాది సీనియర్. చాలా మంచివాడు. వాళ్ళది ఆదిలాబాద్ దగ్గర పల్లెటూరు. మా ఇద్దరి స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఏడాది తిరిగేసరికి ఇద్దరం ఒక అవగాహనకు వచ్చి పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాం. విశ్వం వాళ్ళింట్లో మా ప్రేమ విషయం మాట్లాడి ఎంతో కష్టంమీద వాళ్ళ తల్లిదండ్రుల్ని ఒప్పించాడు. వాళ్ళు మొదట ఒప్పుకోకపోయినా, నా ఉద్యోగం, నా చదువు వాళ్ళని పెళ్ళికి ఒప్పుకునేలా చేసాయి అని వాళ్ళతో మాట్లాడాక నాకు అర్థమైంది.
విశ్వం మాత్రం అలాంటి ఆలోచనలు చేసేవాడు కాదు. పెళ్ళి అయ్యాకా దూరంగా వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగం చేసుకుందాం అని చెప్పేవాడు. కొన్నాళ్ళకి నేనూ మా ఇంట్లో మా ప్రేమ విషయం చెప్పేసాను. అమ్మా, నాన్నా నేను చెప్పేది శ్రద్ధగా విని ఊరుకున్నారు. వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పలేదు. వాళ్ళ మనసులో ఏముందో కూడా నాకు అర్థం కాలేదు. కొన్నాళ్ళు గడిచిపోయాయి. విశ్వం నన్ను పెళ్ళి విషయం అడగడం మొదలెట్టాడు.
మా పేరెంట్స్‌ని ఎన్నిసార్లు అడిగినా ఏమీ మాట్లాడలేదు. వాళ్ళకి విశ్వంతో నాకు పెళ్ళి చేయడం ఇష్టం లేదని అర్థం అయ్యింది. అప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. నాకు చెప్పకుండానే అమ్మా నాన్నా నాకు రాజేష్‌తో పెళ్ళి నిశ్చయం చేసారు. అతను కొంతకాలం మిలిటరీలో పని చేసి, ఎందువలనో ఉద్యోగం పోగొట్టుకొని వచ్చేసి, ఇంటిదగ్గరే వ్యవసాయం చేసుకుంటున్నాడని, చాలా మంచి కుటుంబం అంటూ నా ప్రమేయం లేకుండానే నిశ్చితార్థం చేసేసుకున్నారు.
అప్పటినుండి రాజేష్ రోజూ ఇంటికి రావడం, బ్యాంకులో లోన్ పెట్టమని, తనకు డబ్బులు అవసరమని, ఆ డబ్బులతో వ్యాపారం చేస్తానని చెప్పేవాడు. రాజేష్ ప్రవర్తన గురించి ఇంట్లో చెప్పిన ప్రతిసారి అమ్మా నాన్నతో చాలా పెద్ద గొడవలే జరిగాయి. నా తల్లిదండ్రులకి నేను శత్రువులా కనిపించసాగాను. "లోన్ ఇప్పిస్తే తప్పేంటి" అంటూ అమ్మ ఒకరోజు పెద్ద గొడవే చేసింది. నా కంఠంలో ప్రాణముండగా లోన్ తీసుకోనని, ఇష్టం లేకపోతే పెళ్ళి క్యాన్సల్ చేసుకోమని చెప్పాను.
తాను తీసుకోబోయే లోన్‌కి షూరిటీ పెట్టమని అడిగాడు రాజేష్. నేను పెట్టను అనేసరికి పెద్ద గొడవ జరిగిపోయింది. నా మీద చెయ్యి చేసుకున్నాడు. అమ్మా నాన్నా అతణ్ణి పల్లెత్తు మాట అనలేదు సరికదా, పెళ్ళికి ముహూర్తం కూడా ఖరారు చేసేసారు. ఇంట్లో జరుగుతున్న పరిణామాలన్నీ విశ్వానికి వివరించాను. "ఉద్యోగానికి సెలవు పెట్టి వచ్చేయి, మనిద్దరం పెళ్ళి చేసుకుందాం. తరువాత ఎవరూ మనల్ని ఏమీ చేయలేరు" అని చెప్పాడు విశ్వం.
ఎందుకో నామీద నాకే నమ్మకం కలగలేదు. రాజేష్ రోజూ బ్యాంకుకి వచ్చి ఏదో ఒక న్యూసెన్స్ చేసేవాడు. మేనేజర్ నా పైవాళ్ళకి ఫిర్యాదు చేసారు. ఈ గొడవలు తట్టుకోలేక నేనే ఉద్యోగానికి సెలవు పెట్టేసి ఇదిగో ఈ ఊరు చేరుకున్నాను. ఆ పెళ్ళిని తప్పించుకోవడానికి ఇంట్లోంచి ఎవరికీ తెలియని ఇక్కడికి వచ్చేసాను.
విషయం అంతా విని విశ్వం మాత్రం 'మంచిపనే చేసావు. నువ్వంటే నాకు ఎప్పటికీ గౌరవం, ప్రేమ ఉన్నాయి, నేను తప్పుకుండా నిన్ను త్వరలోనే కలుసుకుంటాను. మనం పెళ్ళి చేసుకుందాం. నువ్వు ఉద్యోగం చేసినా చెయ్యకపోయినా అది నీ ఇష్టం' అంటూ చెప్పాడు. 'నేను అతి త్వరలో వచ్చి నిన్ను కలుసుకుంటాను' అని చెప్పాడు" అంటూ సరోజిని తన కథ ముగించింది.
శేషగిరి గారు ఒక్క నిట్టూర్పు విడిచి, "అమ్మా, నువ్వు ఇక్కడ ఉన్నట్లు మీ వాళ్ళకి తెలిస్తే నీకు చాలా ప్రమాదం. నువ్వు చెప్తున్న విశ్వం ఎలాంటివాడో పూర్తిగా తెలియకుండా పెళ్ళి చేసుకుంటే ఇబ్బంది అవుతుందేమో" అన్నారు శేషగిరిగారు. "నేను అతను కలిసి సుమారు రెండేళ్ళు పనిచేశాం. అధికార్ల దగ్గర కూడా అతనికి చాలా మంచి పేరే ఉందండీ" అంది సరోజిని. "అలా అయితే చాలా మంచిది. మరి పెళ్ళి చేసుకొని మళ్ళీ అక్కడికే వెళ్తే మీ వాళ్ళతో ప్రమాదం ఏమీ లేదా?" అని అడిగారు.
"పెళ్ళయ్యాకా వాళ్ళ వలన ఎలాంటి ముప్పూ ఉండదని అనుకుంటున్నా. అయినా ఈ కోపతాపాలు ఎన్నాళ్ళుంటాయి చెప్పండి. వాళ్ళు మాత్రం నన్ను దూరం చేసుకోడానికి ఇష్టపడతారా? ఖచ్చితంగా ఏదో ఒకరోజు వాళ్ళు విశ్వంలోని మంచితనాన్ని గుర్తిస్తారని అనుకుంటున్నాను" అంటూ ఇంటికి వెళ్ళడానికి లేచి నిలబడింది.
"నేనేమైనా హెల్ప్ చేయగలిగేది ఉంటే అడుగమ్మా, తప్పకుండా చేస్తాను. నీవు నీ ప్రేమని పండించుకోవాలని, నీ ఎదురుచూపులు ఫలించి విశ్వం త్వరలోనే నిన్ను కలుసుకోవాలని ఆ భగవంతుణ్ణి కూడా కోరుకుంటున్నాను" అని చెప్పారు శేషగిరి.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
P. గోపాలకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ P. గోపాలకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కి text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: P. గోపాలకృష్ణ
ప్రొఫైల్ లింక్: https://www.manatelugukathalu.com/profile/gopalakrishna
యూట్యూబ్ ప్లే లిస్ట్ లింక్:
నా పేరు గోపాలకృష్ణ. పుట్టింది, పెరిగింది శ్రీకాకుళం జిల్లా లో. చిన్నప్పటినుండి కథలూ,కవితలూ, రాయడం చదవడం ఇష్టం. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. నా తల్లిదండ్రులు చిన్నప్పటినుండి ఇచ్చిన ప్రోత్సాహమే రచనావ్యాసంగాన్ని అంటిపెట్టుకొనేలా చేసింది. 'ఆ అమ్మాయి..' కథ ఈ సైట్ లో నేను రాస్తున్న ఆరవ కథ. నా కథలను తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాను.





Comments