top of page

ఈ నాన్నలు ఎప్పుడూ ఇంతే..


'Ee Nannalu Eppudu Inthe' - New Telugu Story Written By P. Gopalakrishna

'ఈ నాన్నలు ఎప్పుడూ ఇంతే..' తెలుగు కథ

రచన: P. గోపాలకృష్ణ

కథా పఠనం: A. సురేఖ

ఏంటో ఈ మధ్య నాన్న ప్రవర్తన వింతగా ఉంది. ఆయన్ని అర్థం చేసుకోవడం మా ఎవరి తరమూ కావడం లేదు. ఎప్పుడు చిట్టీ, చిట్టీ అంటూ నా వెంట తిరిగే నాన్నలో హటాత్తుగా ఇంత మార్పు ఎందుకొచ్చిందో తల ఎంత బద్దలుకొట్టుకున్నా అర్థం కాలేదంటే నమ్మండి.


చిన్నప్పుడైతే నేలమీద నడిస్తే రాళ్లు, చిన్న చిన్న కర్రపుల్లలూ గుచ్చుకుంటాయని, కాళ్ళకి చెప్పులు వేసి మరీ ఎత్తుకొని బడికి తీసుకెళ్ళేవారు నాన్న.


నన్ను స్కూల్ లో దింపేసి, మాష్టారికి అప్పచెప్పి, పొలం వెళ్ళేవారు. అంత పెద్ద సదువులు సదువుకున్న మీరు ఉద్యోగం చేయకుండా ఈ ఎవసాయం సెయ్యడమెంటయ్యా అని ఊళ్ళో వాళ్ళు అడిగితే, చిన్నగా నవ్వేసి, నాకు ఈ పల్లెటూళ్ళోనే ఎంతో బావుంది అని చెప్పేసి పొలం వెళ్లిపోయేవారు. కానీ ఏంటో ఆశ్చర్యం ఇప్పుడు నాన్న పూర్తిగా మారిపోయారు. నాకైతే చాలా కోపంగా ఉంది.


“బడిలో మీ అమ్మాయి చాలా అల్లరి చేస్తోందండీ, తోటి పిల్లల్ని కొడుతోంది. చదువులో ఎప్పుడూ ఫస్ట్ ఉంటుంది కాబట్టి మేమేమీ అనలేకపోతున్నాం కాస్తా మీరైనా చెప్పండి” అని మా శిరీష మేడమ్ నాన్నకి కంప్లయింట్ చేస్తే, “పోనీలెండి టీచర్ మా చిట్టి ని ఏమీ అనకండి. ఆ పిల్లలతో నేను మాట్లాడతాను కదా” అనేవారు.


నన్ను క్లాస్ లో కూర్చోపెట్టి, పక్కవీధిలో కృష్ణమూర్తి కొట్టు దగ్గరకి వెళ్ళి, బిళ్ళలు, బిస్కెట్లు తెచ్చి బళ్ళో పిల్లలకి పంచిపెట్టి వాళ్ళని మంచి ఫ్రెండ్స్ చేసేసుకుని, చిట్టి తో అందరూ సరదాగా ఉండాలని చెప్పి, పొలం వెళ్ళే మా నాన్న ఈ మధ్య మారిపోయారంటే నాకే ఆశ్చర్యంగా ఉంటోందంటే నమ్మండి.


ఆగస్టు పదిహేను జెండా వందనం పండగ అంటే, నాన్న పడే హడావుడి ఎవరు చూసిన కడుపు చెక్కలయ్యేలా నవ్వుకోకతప్పదు. మా చిట్టి ఎక్కువ సేపు ఎండలో నిలబడలేదు మాష్టారూ, జెండావందనం అయిపోయిన వెంటనే టెంట్ లో పిల్లల్ని కూర్చోపెట్టి మీటింగ్ జరిపించండి అని పది రోజుల ముందునుండి హెడ్ మాష్టారి బుర్ర తినేసి, సరే అని ఒప్పించేవారు నాన్న.


ఆగస్టు పదిహేనో తారీఖు ఉదయాన్నే బడి ముందు టెంట్ వేయించి కుర్చీలు అమర్చే పని ప్రత్యేకంగా చేయించేవారు నాన్న. తరువాత స్వీట్లు, చాక్లెట్లు లాంటివి తెప్పించి హెడ్మాస్టర్ గారి టేబిల్ మీద అమర్చేవారు. నాన్నకి చిట్టి అంటే అంత ప్రాణం, చిట్టి తోడిదే లోకం. అలాంటి నాన్న ఇప్పుడు పూర్తిగా మారిపోయారంటే నాకు అసలు నమ్మబుద్ధి కావడం లేదంటే మీరు నమ్మరేమో.


వేసవి సెలవులకి ఒంటిపూట బడులు అనేసరికి నాన్నకి ఎక్కడ లేని కంగారు వచ్చేది. “చిట్టిని పరీక్షలకి పంపిస్తా మాష్టారూ, అంతవరకూ ఇంట్లోనే ఉండి చదువుకుంటుంది. ఎండలు మండిపోతున్నాయి” అనేవారు. అంత పెద్ద చదువు చదువుకున్న నాన్న టీచర్స్ ని బతిమాలుతుంటే ఒక్కోసారి నాకు మహా సిగ్గుగా ఉండేది. ఇంకొక్క సారి మా స్కూల్ కి వచ్చి నా పరువు తియ్యకు నాన్నా అని మూడో తరగతిలో ఉన్నప్పుడు అన్నానేమో. పెద్ద ఆరిందాలా మాట్లాడిన నన్ను చూసి ఫక్కున నవ్విన నాన్న నన్ను దగ్గరకు తీసుకుని నుదిటి మీద ముద్దుపెట్టి, పోయి ఆడుకో అమ్మలూ అనేసి ఏదో పనున్నట్లు తన గదిలోకి వెళ్లిపోయారు. అలాంటి నాన్న మారిపోయినందుకు నాకు అసలు నమ్మబుద్ధి కావడంలేదు.


మా ఊళ్ళో ఎలిమెంటరీ స్కూల్ పూర్తి చేసి, పక్కనే రెండున్నర కిలో మీటర్లు దూరం ఉన్న హై స్కూల్ కి వెళ్లాలనుకున్నానా నాన్నేమో నేను రోజూ నిన్ను స్కూల్ లో దింపేసి వస్తాను అని ఒకటే గొడవ. నేనేమైనా చిన్నపిల్లనా. పదేళ్లు పూర్తయ్యి, పదకొండో ఏడు వచ్చింది. నాన్నతో స్కూల్ కి వెళ్తే ఇంకేమైనా ఉందా. ఇప్పటికే మా ఊళ్ళో ఉన్న ఫ్రెండ్స్ అంతా నాన్న కూచి అంటూ ఏడిపిస్తున్నారు. ఇప్పుడు హై స్కూల్ కి తీసుకెళ్తే నాన్న నన్నొక్కదాన్నీ ప్రశాంతంగా బళ్ళో చదువుకోనిస్తారా ? నేను ఇక్కడే చెట్టుకింద కూర్చొంటాను అంటారు.


అప్పుడు మిగిలిన ఊళ్ళ నుండి వచ్చిన స్టూడెంట్స్ మాత్రం ఊరికే మనల్ని వదిలేస్తారా? ఖచ్చితంగా నాన్న కూచి అంటారు. అందుకే నేను నాన్నని నాతో స్కూల్ కి రావద్దని కండిషన్ పెట్టానా, అయితే నువ్వు హై స్కూల్ కి వెళ్లొద్దని ఒక్కటే గొడవ. ఎలాగో నాన్నని సముదాయించి, బతిమాలి బుజ్జగించి హై స్కూల్ లో జాయిన్ అయిపోయా. అప్పట్లో అంత గొడవ పెట్టిన నాన్నలో ఇప్పుడు చాలా అంటే చాలా మార్పు వచ్చింది.


నేను సైకిల్ మీద స్కూల్ కి వెళతాను నాన్నా అని అడిగాను ఒకరోజు. నేను స్కూల్ లో దింపుతాను. సైకిల్ వద్దు గాక వద్దు అంటూ కంగారు పడుతున్న నాన్న ను చూస్తే నాకు నవ్వాగింది కాదు. నేను పకపకా నవ్వుతూంటే నాన్నేమో బుంగమూతి పెట్టుకొని వీధి అరుగుమీద కూర్చొన్నారు. నేనెంత బతిమాలానో నాన్నని. ఎప్పుడూ నువ్వు చెప్పినట్లే వింటున్నాగా, ఈ ఒక్కసారికి నా మాట వెంటే అరిగిపోతావా?” నిష్టూరంగా అన్నారు నాన్న.


నా కంటికి నాన్న చిన్నపిల్లడిలా కనిపించారు. ఎప్పుడూ నేను చెప్తున్నట్లే నువ్వు వింటున్నావుగా. ఇప్పుడు కూడా విను మరి. తప్పేముంది” పకపకా నవ్వుతూ అన్నాను. నా ఒళ్ళో తలపెట్టుకొని పడుకోడం నాన్నకి ఇష్టం. అప్పుడూ అలాగే పడుకున్నారు. నేనేమో మా నాన్న గుడ్ బాయ్ కదా, ఇవాళ సాయంత్రం నాకో సైకిల్ కొనిస్తారుట” నాన్న కళ్ళలోకి చూస్తూ నవ్వాను. నాకు తెలుసు నాన్న బలహీనత నేనే అని.


ఏమనుకున్నారో, సైకిల్ బాగా తొక్కడం వచ్చేదాకా నేనూ నీతో పాటూ స్కూల్ కి వస్తాను అన్నారు. “అయ్యో, పిచ్చి నాన్న, మీ చిట్టి డబుల్స్ కూడా బాగా తొక్కగలదు” పగలబడి మరీ నవ్వాను. నీకు సైకిల్ తొక్కడం వచ్చని నాకు తెలుసులే చిట్టీ, కాళ్ళు నొప్పులు పుడతాయని సైకిల్ వద్దన్నాను అన్నారు. నేనంటే అంత ప్రేమ చూపించే నాన్న ఇంతలా మారిపోతారని నేనెప్పుడూ ఊహించలేదు.


నాన్న ఎంత గారాబంగా చూసినా, నాన్న నాన్నే. కొన్ని పనులు అమ్మతోనే చేయించుకోగలం. కొన్ని మాటలు అమ్మకే చెప్పగలం. నేను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు అదే జరిగింది. నాన్నా అర్జెంట్ గా పక్కింటి విజయక్కని పిలువు పనుంది అని నేను చెప్పినప్పుడు నాన్నకి నా సమస్య అర్థమైంది. నాలుగురైదుగురు పెద్దవాళ్ళని పిలుచుకొచ్చారు. క్షణాల్లో ఏర్పాట్లన్నీ ఘనంగా చేయించారు.


“ఇదిగో నయ్యా శివా, ఆడపిల్లలు ఉన్న ఇళ్ళల్లో ఇవన్నీ మామూలే. అందుకే లలితమ్మ వెళ్లిపోయాక మళ్ళీ పెళ్లి.. అని ఏదో చెప్పబోతున్న సీతమ్మ అమ్మమ్మకి, రెండు చేతులు ఎత్తి దణ్ణం పెడుతూ, “లలిత నాతోనే ఉంది అత్తయ్యా, ఇంకోసారి పెళ్ళి మాట చెప్పొద్దు” అన్నారు.


ఏమనుకుందో సీతమ్మ అమ్మమ్మ. ఇంకేమీ మాట్లాడలేదు. సీతమ్మ అమ్మమ్మ మాకు బంధువు కాదు. ఆవిడ లేకుండా ఏ శుభకార్యమూ జరగదు మా ఊళ్ళో. చివరికి ఫంక్షన్ కూడా అద్భుతంగా జరిపించేసిన నాన్న పరీక్షలు పాస్ అయినంత గొప్పగా ఫీల్ అయ్యారు. అలాంటి నాన్న ఇప్పుడు ఇలా మారిపోయారంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు.


టెన్త్ క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చిందని తెలిసినప్పుడు నాన్న ముఖంలో ఒకమూల కనిపించిన విషాదాన్ని ఇప్పటికీ నేను మరిచిపోను.


“మీ అమ్మ ఉండిఉంటే ఇవాళ ఎంత సంతోషించేదో కదా” అంటూ ఉంటే ఆయన కళ్ళల్లో సన్నటి నీటి పొర చూసిన నా మనసు చివుక్కుమంది.


“ఇప్పుడు అమ్మ విషయం అవసరమా నాన్నా, తాను కూడా అంత బాగా చూసుకోలేనని చెప్పి నీకు నన్ను అప్పచెప్పేసి, తాను దేవుడి దగ్గరకెళ్లిపోయింది. నువ్వు ఇలా మాట్లాడకూడదు ఇంకెప్పటికీ” అంటూ నాన్న కాళ్ళకి దణ్ణం పెట్టబోయాను.


“చిట్టీ, నువ్వు నా కూతురువి మాత్రమే కాదమ్మా, ఈ ఇంటికి దేవతవు. అలాంటి నీవు కాళ్ళకి మొక్కకూడదు” అంటూ నాన్న నన్ను పైకి లేపి తలమీద ముద్దుపెట్టుకున్నారు.


నన్నెంత గారాబంగానో చూసిన నాన్న ఈ మధ్య కాలంలో నా ఊహాలకి కూడా అందనంత మారిపోయారు.


కాలేజీ చదువులకి చాలా దూరం వెళ్లాల్సి వస్తుందని మనం టౌన్ కి షిఫ్ట్ అయిపోదాం అంటూ నాన్న చెప్పిన రోజు, “నాన్నా! మీకు వ్యవసాయం అంటే ప్రాణం కదా, వ్యవసాయం మానేసి, టౌన్ వెళ్ళిపోతే మనకు బతుకుతెరువు ఎలాగా?” అడిగాను నేను.


నాన్నకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక, మౌనంగా ఉండిపోయారు.


“నాన్నా, నేను ప్రైవేట్ గా చదువుకుంటాను. ఇంట్లోనే ఉండి చదువుకొని ఎగ్జామ్స్ రాస్తాను. నిన్ను చూసుకుంటూ చదువుకోవడం నాకిష్టం” అని చెప్పేసరికి నాన్న ఎంత సంతోషపడిపోయారో మాటలతో చెప్పలేను. అలాంటి నాన్న లో ఇప్పుడు చాలా మార్పు వచ్చేసింది.


ఇంట్లో ఉంటూ నాకు ఇష్టమైన బియ్యే ఇంగ్షీషు చేశాను. అప్పుడే నాన్న అంతరంగంలో మాట బయట పెట్టారు ఒకరోజు. “చిట్టెమ్మా, నీకోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నా. ఇదిగో అబ్బాయిల ఫోటోలు. నీకు నచ్చిన అబ్బాయి ఎవరైనా ఈ ఫోటోస్ లో ఉంటే చూసి చెప్తే ఆ సంబంధం ఖాయం చేద్దా”మని హడావుడిగా చెప్పిన నాన్న, తీరిగ్గా పొలంలోకి వెళ్లబోతూ ఉంటే, “నాన్నా, మీకు నచ్చిన సంబంధం నాకూ నచ్చుతుంది. మీకిష్టమైన అబ్బాయిని ఖాయం చేసి మాట్లాడండి” చెప్పాను.


నాన్న పొలం వైపు వెళ్తూ “ఈ అబ్బాయి బాగున్నాడు” అంటూ ఒక ఫోటో చూపించారు. నా ఊహల్లో ఉన్న అబ్బాయి కూడా అలాగే ఉండడంతో ప్రసాదు తో నా పెళ్ళి మా నాన్న స్థాయికి తగినట్లు చేశారు. అంతా పద్ధతిగా జరిగిందని మా ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటూ ఉంటే, మా నాన్న సమర్థతకు నాకు గర్వంగా అనిపించింది. నేను మా నాన్నని విడిచి ఉండలేను అని చెప్తే నా భర్త ప్రసాదు చిన్నగా నవ్వేసి, నా నుదిటి మీద ముద్దు పెట్టుకుని, “అక్కడ కూడా నాన్న నీతోనే ఉంటారు” అన్నారు.


అత్తవారింటికి వెళ్ళిన నేను అందరి ఆడపిల్లలగానే నాన్నని తొందరగానే మరిచిపోయాను. ఇప్పుడు నాన్న కాదు, నేను మారిపోయాను. కానీ నాన్న లో చాలా మార్పు వచ్చిందని నాకు అర్థమవుతోంది.


పెళ్ళయ్యి అత్తవారింట్లో అడుగుపెట్టిన నన్ను చూడ్డానికి మొదటి ఆరు నెలల్లో రెండు మూడు సార్లు వచ్చిన నాన్న ఎందుకో పరాయివారిలాగా ప్రవర్తించడం నాకు చాలా బాధగా అనిపించింది. ఒక్కసారి మాత్రం లంచ్ చేశారు. మరో సారి వచ్చినప్పుడు నాకు ఇస్టమైన మా పెరటి సపోటాలు తీసుకొచ్చి, చిట్టీ నీకోసం మంచి మంచి సపోటాలు ఏరి తీసుకొచ్చాను అని చెప్పి సంచి చేతిలో పెట్టారు. ఎప్పుడూ తన చేత్తో సపోటాలు తినిపించే నాన్న మాత్రం దూరంగా కూర్చుని కాసేపు మాట్లాడి, లంచ్ చేయకుండానే బయల్దేరి వెళ్లిపోయారు పనుందంటూ. అందుకే అంటున్నా నాన్న పూర్తిగా మారిపోయారు అని.


అమ్మాయి నెలతప్పింది, మీరు తాత కాబోతున్నారని అత్తయ్య నాన్నతో మాట్లాడిన మర్నాడు నాన్న సంబరంగా కొత్తబట్టలూ, స్వీట్లు, పళ్ళు అన్నీ మోసుకుంటూ ఇంటికి వచ్చి, చాలా ఉత్సాహంగా గడిపారు.


“రెండు రోజులు ఉండి వెళ్ళండి అన్నయ్యగారూ” అని చెప్పిన అత్తయ్యగారి మాటలు కానీ, “ఇక్కడే ఉండిపోవచ్చు కదా బావగారూ” అంటూ చెప్పిన మామయ్యగారి మాటలు కానీ, “ఇక్కడే ఉండిపో నాన్నా” అని చెప్పిన మాటలు కానీ చెవికెక్కించుకోకుండా మండిపోతున్న ఎండలోనే తిరుగు ప్రయణమైన నాన్న మారిపోయారనే అంటాను నేనైతే.

“అమ్మాయి ని డెలివరీ కి మా ఇంటికి తీసుకెళతాను” అని నాన్న అడిగితే, “మీరు ఆ అవస్థ పడలేరు అన్నయ్యగారూ, ఇక్కడ మేమున్నాముగా, మీరే ఇక్కడికి వచ్చి ఆ టైమ్ లో ఉండండి. పైగా ఆ పల్లెటూళ్ళో వైద్యం కూడా కష్టం గా ఉంటుంది కదా” అని అత్తయ్య పదేపదే చెప్పగా నాన్న అయిష్టంగానే అందుకు ఒప్పుకున్నారు. అదీ ఒక షరతు మీద. డెలివరీ ఖర్చులన్నీ నేనే భరిస్తాను అని చెప్పారు అత్తయ్యా, మామయ్య వాళ్ళతో. నాన్న చాదస్తానికి వాళ్ళు నవ్వుకుని, సరే మీ ఇష్టం అన్నారు. డెలివరీ సమయానికి నువ్వు కనిపించాలి నాన్నా అని చెప్పానా, సరే అని వెళ్ళిన నాన్న ఇంకా రాలేదంటే, నాన్న మారిపోయారని అనిపించింది నాకు.


కానీ హాస్పిటల్ లో అడుగుపెట్టిన సమయానికి ఎదురుగా కనిపించి ఆశ్చర్యపరిచిన నాన్న, “చిట్టీ, మళ్ళీ అమ్మని చూడాలననుంది నాకు” అని ఆశగా అడిగితే మౌనంగా తలూపడం తప్ప నేనేం చెప్పగలిగాను. మా వారు విన్నట్లున్నారు ఆ మాటని. మీ అమ్మగారిని చూడాలని నాకూ ఉంది చిట్టీ అన్నారు.


నవ్వుతూ ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళిన నేను ఎలాంటి ఆపరేషన్ అక్కరలేకుండానే పండంటి ఆడబిడ్డను కన్నానని తెలిసి నాన్న మళ్ళీ చిన్నపిల్లాడైపోయారట. తరువాత అత్తయ్య, మామయ్య, మావారూ చెప్తూ పగలబడి నవ్వేవారు. మళ్ళీ అమ్మని నాకు చూపించినందుకు థాంక్స్ అని ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనని నాన్న మారిపోయాడంటే నమ్మండి.


కాల చక్రంలో ఏడాది గిర్రున తిరిగింది. ఇప్పుడు నేను ఎవరికీ అక్కరలేని దానినయ్యాను.


“ చిట్టీ, కాఫీ కావాలమ్మా” అని మా వారు అడిగితే కాఫీ తీసుకెళతానా, “నిన్ను కాదు పిలిచింది, మా చిట్టిని” అంటూ అక్కడికి వచ్చిన ముద్దుల కూతుర్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటారు.


ఇప్పుడు నాన్న ఆరోగ్యం అంత బాగలేదని బలవంతంగా మా ఇంటికి తీసుకొచ్చాము. “చిట్టీ, నేను బయటికి వెళ్తున్నా, నీకేమైనా కావాలా” అని నాన్న అడిగితే ఆప్యాయంగా అడిగారు కదా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి, ‘నాకోసం సపోటాలు, ఇంకా బోలెడు చాకొలెట్లు తీసుకురండి’ అని చెప్పాలనుకుంటే, ‘నేను పిలిచింది నిన్ను కాదు చిట్టిని’ అని నాన్న తనలో తానే నవ్వుకుంటూ, చిట్టిని ఎత్తుకొని బయటకి వెళ్తూ ఉంటే, “మరి నేనెవర్ని?” అని గట్టిగా అడుగుతానా, “నువ్వు చిట్టెమ్మవి, చిట్టివి కాదు” అంటూ ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్లిపోతారు. ఇప్పుడు చెప్పండి నాన్న మారిపోయారా లేదా.


ఈ నాన్నలు ఎప్పుడూ ఇంతే.. మనవరాలు పుడితే కూతురిని మరిచిపోతారు.


***

P. గోపాలకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కి text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

ప్రొఫైల్ లింక్: https://www.manatelugukathalu.com/profile/gopalakrishna

యూట్యూబ్ ప్లే లిస్ట్ లింక్:

నా పేరు గోపాలకృష్ణ. పుట్టింది, పెరిగింది శ్రీకాకుళం జిల్లా లో. చిన్నప్పటినుండి కథలూ,కవితలూ, రాయడం చదవడం ఇష్టం. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. నా తల్లిదండ్రులు చిన్నప్పటినుండి ఇచ్చిన ప్రోత్సాహమే రచనావ్యాసంగాన్ని అంటిపెట్టుకొనేలా చేసింది. 'ఆ అమ్మాయి..' కథ ఈ సైట్ లో నేను రాస్తున్న రెండవ కథ. నా కథలను తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాను.


36 views0 comments

Comments


bottom of page