top of page
Original.png

ఈనాటి ఈ బంధం ఆనాటిదే


"ఒక చిన్నప్పుడు తీసుకున్న ఫోటో...

40 ఏళ్ల తర్వాత ఒక మహానటుడిని గురువు పాదాల దగ్గరకు తీసుకొచ్చింది!

Eenati Bandham Aanatide - Telugu Emotional Story | Kotthapalli Udayababu 

ఈనాటి ఈ బంధం ఆనాటిదే - తెలుగు భావోద్వేగ కథ | కొత్తపల్లి ఉదయబాబు

Published in manatelugukathalu.com on 10/08/2026


"ఒక చిన్నప్పుడు తీసుకున్న ఫోటో...

40 ఏళ్ల తర్వాత ఒక మహానటుడిని గురువు పాదాల దగ్గరకు తీసుకొచ్చింది!

ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?" 

కొత్తపల్లి ఉదయబాబు గారి ఈనాటి ఈ బంధం ఆనాటిదే కథను చదవండి





అధ్యాయం 1 — సన్మాన సభ 


“నటరాజ కళా నిలయం’’ అనే అక్షరాలు హెడ్ లైట్ల కాంతిలో అత్యద్భుతంగా మెరుస్తూ ఆ ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్రాంగణానికి వింత శోభను కలుగ చేస్తున్నాయి.

 

“రాష్ట్ర స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డును రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుకున్న శ్రీ శివాజీ గారికి సన్మాన సభ” అని వ్రాయబడిన బ్యానరు సిల్కు ధగధగలతో మెరుస్తూ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది. కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాటు చేయబడ్డ ఆ సన్మాన సభకు చాలా ప్రత్యేకత ఉంది. ఆరోజు “నటరాజ కళా నిలయం’’ రజతోత్సవ సంరంభం కూడా. నటరాజ కళా నిలయం స్థాపకుడు, శాశ్వత గౌరవ అధ్యక్షుడు అయిన భీమారావు గారు ప్రస్తుతం ప్రసంగిస్తున్నారు.

 

“ఈనాడు నాటక రంగం దీనాతి దీన స్థితిలో ఉంది. నాటక రంగం నుంచి సినీ పరిశ్రమకు వెళ్లి అక్కడి కుటిల రాజకీయాలకు, మోసపూరిత వాతావరణానికి తట్టుకోలేక కళామతల్లి ముద్దుబిడ్డలమని చెప్పుకోలేక బ్రతుకు ఈడుస్తున్నారు కొందరు. 


తమ అంగ బలంతో, అర్థ బలం తో రాజకీయ రంగ ప్రవేశం చేసి రాజ్యమేలుతున్నారు కొందరు. అటువంటి పరిస్థితులలో తన అత్యుత్తమ నటనా కౌశలంతో బండరాయి లాంటి హృదయాలను కూడా తన కరుణరసంతో కలిగించగల ఒక మహానటుడు, మన సభ్యుడు అయిన చిరంజీవి శివాజీని మన రాష్ట్ర ప్రభుత్వం వారు గుర్తించి ఉత్తమ నటుడి అవార్డుగా ‘’బంగారు నంది’’ అవార్డు, పదివేలరూపాయల నగదు ఇచ్చి సన్మానించడం మన నాటక రంగ సభ్యులందరికీ రసవత్తరమైన పండుగ.


శివాజీ వంటి నట దిగ్గజం మరింతగా పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని మన నాటకరంగాన్ని అభిమానులందరూ గర్వించేలా దిశ దిశలా వ్యాపింప చేయాలని కోరుతూ ఆశీర్వదిస్తున్నాను. ఇప్పుడు చిరంజీవి శివాజీ కి సన్మానం జరుగుతుంది. 


ఈ అవకాశం మనకు కలిగించిన రాష్ట్ర ప్రభుత్వానికి మన కళానిలయం తరఫున కృతజ్ఞతలు అందజేస్తూ, ఆయన మనం చేసే సన్మానం స్వీకరించడానికి ప్రత్యేక ఆసనంలో కూర్చుని వలసినదిగా కోరుతున్నాను.’’

 

అనంతరం వేద పండితులు వేదపఠనం చేస్తుండగా, కార్పొరేషన్ మేయర్ శివాజీని ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. సన్మాన పత్రం చదువుతుండగా పండితుల ఆశీర్వచనం జరిగింది. పావు గంట పైనే జరిగిన ఈ కార్యక్రమం పూర్తి అయ్యాక శివాజీ సన్మాన గ్రహీత గా మైకు ముందుకు వచ్చాడు.

 

“సభకు నమస్కారం. కళా ప్రియులకు, నన్ను అభిమానంతో ఆశీర్వదించిన పెద్దలకు, సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ముందుగా మీరు నా పట్ల అభిమానంతో చేసిన ఈ సన్మానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 


కృషి చేస్తే రాయి కూడా అర్థమవుతుంది. మట్టిని కూడా వెన్నముద్దగా చేసి మనకు అనుకూలంగా మలుచుకోవచ్చు. మరి ఆ శక్తిని, ఆ స్ఫూర్తిని కలగచేసే ఒక వ్యక్తి ఉండాలిగా!


ఉన్నారు. అణువు అణువు కరుణ తో నిండిన ఆ హృదయం కలిగిన ఆ దివ్య మూర్తి ఎక్కడ ఉన్నారో నాకు తెలీదు కానీ, బతికే ఉన్నాడు అని తెలుసు. ఆయన నాటకాలే నా నటనకు స్ఫూర్తి. ఆయనే లేకుంటే ఈ శివాజీయే లేడు. ఆ మహానుభావుడికి శిష్యుడైన నేను నా తుదిశ్వాస విడిచే లోగా ‘ గురుదక్షిణ’ సమర్పించుకోవాలని నా ఆకాంక్ష. 


అధ్యాయం 2 — గురుదక్షిణ ప్రకటన 


అందుకే... అందుకే... నన్ను గౌరవించి ఇచ్చిన పది వేల రూపాయల క్యాష్ అవార్డును ఈ కళా నిలయం సిఫార్సు చేసే ఒక వృద్ధ కళాకారునికి నా గురువు పేరు మీదుగా అందించాలని నిర్ణయించుకున్నాను. ఇదే నా కనిపించని గురువుకు ఈ తెలియని శిష్యుడు సమర్పించుకునే గురుదక్షిణ. 


ఈ సభ ముగిసేలోగా పెద్దలు గురుతుల్యులు శ్రీ భీమారావు గారిని ఆ పేరు ను వెల్లడించవలసిందిగా కోరుతున్నాను. నన్ను ఈ స్థాయికి పెంచిన కళామతల్లికి నేను ఇచ్చే నూలుపోగులాంటి సహాయం అందుకునే ఆ కళాకారుడు ఈ సభలో ఉంటే వేదిక మీదకు పిలువవలసిందిగానూ, లేకుంటే కనీసం ఆయన పేరుని సూచించ వలసిందిగా కోరుతూ నా పట్ల మీ అభిమానానికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ - నమస్తే.’’

 

 అంతే. ఆ ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్రాంగణమంతా చప్పట్లతో అదేపనిగా మారుమ్రోగిపోయింది. శివాజీ నోటివెంట వృద్ధ కళాకారునికి సహాయం అన్న మాట వినగానే భీమారావు గారు తీవ్రంగా స్పందించారు. 


ఆయన మాట అంటే కళానిలయం సభ్యులందరికీ వేదవాక్కు. స్టేజి మీద ఉన్న పెద్దలందరూ భీమారావు గారు ఎవరిని నిర్ణయించినా అభ్యంతరం లేదని తమ అంగీకారాన్ని తెలియజేశారు.

 

 ప్రేక్షకులు కూడా తమ హర్షధ్వానాలతో తమ అంగీకారాన్ని తెలియజేశారు. సహాయం అందుకునే వ్యక్తి పేరును సూచించడానికి మళ్ళీ ముందుకు వచ్చిన భీమారావు గారు ఇలా అన్నారు,

“రెండవసారి మైకు ముందుకు వచ్చి మీకు బోర్ కొట్టను. నటనలోనే ఉన్నతుడు అనిపించుకున్న 35 ఏళ్ళు శివాజీ మానవత్వాన్ని చూపించటంలో కూడా మహోన్నతుడు అని నిరూపించుకున్నాడు. 


ఇప్పుడు అందరి అనుమతితో ఆ వృద్ధ కళాకారుని పేరును ప్రకటిస్తున్నాను. వారు నాకు గురుతుల్యులు నేను ఆయన వద్ద ఓనమాలు నేర్చుకున్న వాడిని. నా గురువునే తన గురువుగా భావించి ఆయనకు ఈ క్యాష్ అవార్డు పదివేల రూపాయలు చెక్కు చేయవలసిందిగా చిరంజీవి శివాజీని కోరుతున్నాను. 


ఆయన పేరు సూర్య ప్రకాశరావు గారు. దయచేసి సూర్య ప్రకాశరావు గారు ఎక్కడ ఉన్నా వేదిక మీదకు రావాలి. ఆయన 77 ఏళ్ల వృద్ధుడు. వారిని సగౌరవంగా తోడ్కొని రావలసిందిగా కార్యకర్తలను కోరుతున్నాను. శ్రీ సూర్య ప్రకాశ్ రావు గారు....’’ 


సభ అంతా మరల కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది.

 

అయిదు నిమిషాలు గడిచినా ఎవరూ ముందుకు రాలేదు. అందరూ ఉత్కంఠతో మరో ఐదు నిమిషాలు చూశారు. ఎవరు వేదిక వైపు రాలేదు.

 

భీమారావు గారు ప్రధాన కార్యదర్శి రఘునాధ్ ని అడిగారు “అదేమిటి రఘూ... సూర్యప్రకాశ రావు గారికి ప్రత్యేకంగా ఆహ్వానం పంపానే...ఆయన సభకు రాలేదా?’’

 

“వచ్చారు సార్. నేను చూశాను. ఈ పనుల ఒత్తిడిలో పలకరించడం కుదరలేదు. ఆయన ఆఖారీ వరుసలో ఉన్నారు. నేను వేదిక వద్ద ఉండిపోయాను” అన్నాడతను ఆయనను కలవలేకపోయిన బాధను వ్యక్తం చేస్తూ.


అధ్యాయం 3 — సూర్యప్రకాశరావు శివాజీ ఇంటికి 

 

‘’ఎవరు బాబు? మీకు ఎవరు కావాలి?’’


 దారిలోనే ఎదురు ప్రశ్నలు వేస్తూ అడిగిన అతనిని ఎగాదిగా చూశాడు ఆ ముసలాయన. 


“మీ అయ్య గారు ఉన్నారా?’’ అడిగాడు ముసలాయన.


“ఉన్నారు బాబు. ఇంకా నిద్ర లేవ లేదు.”


“నీ పేరు?’’


“అప్పలస్వామి.’’


“చూడు అప్పలస్వామి. నేను మీ అయ్య గారు లేచేంత వరకు వెయిట్ చేస్తాను. నాకు పని ఏమీ లేదు. సరేనా? నేను ఎక్కడ కూర్చోవాలో చూపించి ఏ పాత పేపరు అయినా నా మొహాన పడేస్తే చదువుకుంటూ ఉంటాను.- మీ అయ్య గారు వచ్చేంతవరకు.’’


ఎంతో కలుపుగోలుతనంగా మాట్లాడుతూనే వరండా మెట్లెక్కి హాల్లోకి వచ్చిన ఆయనని విజిటర్స్ రూములో కూర్చోబెట్టాక తప్పింది కాదు అప్పలస్వామికి.


 కాసేపటి తర్వాత –

“బాబు గారు.. తమరు వచ్చి రెండు గంటల పైనే అయింది. కాఫీ ఏమైనా తెమ్మంటారా? ‘’అడిగాడు అప్పలస్వామి.


“ఉదయం పది గంటలు దాటింది. ఇంతవరకు మీ అయ్య గారు లేవలేదు... అంటే అసలు ఇంట్లో ఉన్నారంటావా లేక నాతో అబద్ధం చెప్తున్నావా?’’ 


సూటిగా ముసలాయన వేసిన ప్రశ్నకు అప్పలస్వామి కంగారు పడిపోయాడు.


“అబ్బే. అమ్మ మీద ఒట్టు. ఇందాక ధైర్యం చేసి లేపబోయాను. ‘తనంతట తను లేచేంతవరకు నిద్ర లేపితే తోలు తీస్తా’ అన్నారు బాబు’’

“సరే అయితే. మళ్లీ రేపు వస్తాను’’ అని ముందుకు అడుగు వేయబోయిన ముసలాయనని ఆపాడు అప్పలస్వామి.


“మళ్లీ ఏంటయ్యా?’’


“ఎవరు వచ్చారు అని చెప్పమన్నారయ్యా?’’


“సూర్యప్రకాశరావు... 77 ఏళ్ల సూర్యప్రకాశరావు వచ్చి వెళ్లారని చెప్పు.’’

 

అధ్యాయం 4 — రెండో రోజు 

 

మరుసటి రోజు ఉదయం పదిగంటలకు ఎండలో చెమటలు కక్కుతూ వచ్చిన సూర్యప్రకాశరావు గారిని చూస్తూనే అప్పలస్వామి నాలిక కరుచుకున్నాడు.


“మీ అయ్య గారు ఈ వేళ కూడా ఇంకా లేవలేదా?’’ అడిగారాయన.


“లేవకపోవడం ఏంటి అయ్యగారు? ఈవేళ ఏడు గంటలకే లేచి పూలరంగడులా తయారై వెళ్ళిపోయారు.’’ 


“వెళ్లిపోయారా?’’ హతాశుడై శూన్యం లోకి చూస్తూ అలాగే ఉండిపోయారాయన.


“ఇంతకీ మీరు వచ్చిన పని ఏమిటి బాబు?’’


ఆయన అంతలోనే సీరియస్ అయిపోయారు. ఒక్క క్షణం తటపటాయించారు.


“మీకు ఇబ్బంది అయితే చెప్పద్దు బాబు’’ అన్నాడు అప్పలస్వామి నొచ్చుకుంటూ.


“అబ్బే. ఆత్మాభిమానం అడ్డొస్తోంది అప్పలస్వామి. మొన్న జరిగిన సన్మాన సభలో, ఆయాసంగా ఉంటే నేను సభ పూర్తవకుండానే ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత రోజు అంటే మొన్న నటరాజ కళా నిలయం స్థాపకుడు భీమరావు గారిని, నా చిన్ననాటి స్నేహితుడు, శివాజీ బాబు ఇస్తానన్న కేష్ అవార్డుకు నన్ను ఎంపిక చేశారని చెప్పి నన్ను చూసి వెళ్ళాడు. 


నా మనవడికి నా మనవరాలికీ పరీక్ష ఫీజు కట్టాలి. ఈ డబ్బు ఉపయోగిస్తామని ఆశపడ్డాను.వాళ్ల దురదృష్టం ఏమిటో... నాకు శివాజీని కలిసే అవకాశం రావడం

లేదు.’’ అంటూ ఇంకా అక్కడ పని లేనట్టుగా నిర్వికారంగా లేచి ఇంటిదారి పట్టారు సూర్యప్రకాశరావు గారు.


అధ్యాయం 5 — చిన్ననాటి జ్ఞాపకం 

 

మరుసటి రోజు ఉదయం 7:00 గంటల వేల శివాజీ హాల్లో పేపర్ చదువుకుంటూ కాఫీ తాగుతున్నాడు. అప్పలస్వామి పద్దెనిమిదేళ్ళ నూనూగు మీసాల కుర్రవాడిని వెంటబెట్టుకు వచ్చాడు.


‘ఏమిటన్నట్లు’ చిరాగ్గా చూశాడు శివాజీ.


ఆ కుర్రవాడు శివాజీకి ఒక కవరు అందించాడు. అందులోంచి రంగు మాసిన పాత లెటర్-హెడ్ కాయితాలమీద ముత్యాలసరాలు లాంటి అక్షరాలతో పొదగబడిన ఉత్తరాన్ని బయటకు తీశాడు. 


పైపైన చదివేసి పక్కన పెట్టేద్దాం అనుకున్న శివాజీ అంతరంగం మీద చర్నాకోల ఝుళిపిస్తున్నట్టుగా వ్రాయబడిన వాక్యాలను ఏకాగ్రతతో చదవడం మొదలు పెట్టిన అతను కళ్ల నీళ్ళు తిరుగుతూఉండగానే చదవసాగాడు.


అధ్యాయం 6 — ఉత్తరం 


 అందులో ఇలా ఉంది.


‘మాననీయులు, గౌరవనీయులు శివాజీ గారికి కళాభివందనాలు. నా పేరు సూర్య ప్రకాశరావు. సి.ఎస్.రావు అనేది నా నిక్ నేమ్. నేను కళకు అంకితమై, ఉన్న ఆస్తిని సర్వనాశనం చేసి భార్యాబిడ్డలను చెండనాడుకుని కీర్తి ప్రతిష్టలనే ఎండమావుల వెనుక సుదూర తీరాల పరిగెత్తి అలిసిపోయే సరికి నా జీవితం కరిగిపోయింది.


ఇంతటి చెడు జీవితంలో కళను నమ్ముకుని నేను సాధించింది ఏమీ లేదు అనుకుంటే పొరపాటే. ఆనాటి నా కీర్తిప్రతిష్టలన్నీ ఆ కళామతల్లి పెట్టిన భిక్షే. మిగతా ఈనాటి జీవితం కేవలం నా స్వయంకృతాపరాధం.

 

ఇన్నేళ్ల జీవితంలో నేను మర్చిపోలేని అపురూప సంఘటన ఒకటి మీకు వివరిస్తున్నాను. నేను ఇంకా చిత్రా రంగంలో అడుగు పెట్టని రోజులు. నేను రచించి దర్శకత్వం వహించిన నాటకాన్ని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టౌన్ హాల్ లో ప్రదర్శిస్తున్న రోజు. నేను మేకప్ రూమ్ లో మేకప్ వేసుకుంటున్నాను. 


ఒక 7 ఏళ్ల కుర్రాడు గడపను ఆనుకొని నేను మేకప్ అయ్యే విధానాన్ని పరిశీలిస్తున్నాడు.

‘లోపలకు రా’ అన్నాను.


‘భయంగా ఉంది’ అన్నాడు.


‘నీ పేరు?’ అడిగాను.


“రాజు’’


“నీకు నాటకాలు అంటే ఇష్టమా?’’


“చాలా ఇష్టం సార్. మీ పేరు పేపర్లలో మీ ఫొటోలు చూడ్డం నాకు ఎంతో ఇష్టం. మీరు కరుణ రసం ఎంతో బాగా పోషిస్తారని మా అమ్మఅస్తమానూ అంటుంది. మీరు నటిస్తుంటే చూడాలని నా కోరిక. అందుకే అమ్మతో చెప్పకుండా వచ్చాను. నాటికి చూశాక వెళ్తాను.’’


 ఆరోజు హాలంతా కిటకిటలాడిపోతోంది. అయినా నేను వాడిని ముందు సీట్లో కూర్చో పెట్టించాను. మధ్య మధ్యలో నిద్ర వస్తుండగా కళ్ళు నులుముకుని ఎక్కడ ఈ దృశ్యం మిస్ అయిపోతానో అని వాడు చూపిన ఉత్కంఠను నేను ఎన్నడూ మర్చిపోలేను. 


నాటకం పూర్తిగా చూసేసరికి వాడు కుర్చీలోనే నిద్రపోతూ కనిపించాడు. వాడిని లేపి మొఖం కడిగించి వాడితో ఫోటో తీయించుకున్నాను. నా ఆ నాటకానికి బాలప్రేక్షకుడు వాడు ఒక్కడే. అది ఒక తడి జ్ఞాపకం. నా నటనకు అలాంటి అభిరుచి ఉన్న వాడే వారసుడు అనుకున్నాను.

 

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఎండమావుల వెంట పరిగెత్తి బంగారు జీవితాన్ని పాడు చేసుకోకుండా నా తరువాతి తరం నటునిగా మీకు ఇచ్చే పనికిమాలిన సలహా – ‘ జీవితాన్ని అద్దంలా చూసుకోమని’. 


ఆత్మాభిమానం చంపుకుని రెండు రోజులు మీ ఇంటికి వచ్చాను. రాత్రి నుంచి విపరీతమైన ఆయాసం తో ఊపిరి పీల్చడం కష్టంగా ఉంది. మీరు చేస్తానన్న ఆర్థిక సహాయం పొందడానికి నటరాజ కళా నిలయం వారు ఇచ్చిన సిఫార్సు లెటర్ కాపీ కూడా దీనితో జతపరుస్తున్నాను.

 

మీకు అభ్యంతరం ఇబ్బంది లేకుంటే మీరు చేస్తానన్న ఆర్థిక సహాయం నా మనవడికి ఇచ్చి పంపండి. నేను స్వయంగా రాలేకపోతున్నందుకు మన్నించండి. 


‘కళాకారుడు ఎప్పుడూ ఆర్థికంగా కుచేలుడే’ అని అసహ్యించుకోకండి. మీ సహాయానికి, సహాయం చేస్తానన్న మాట కి ఆజన్మాంతం కృతజ్ఞుడిని. మిమ్మల్ని ఆ నటరాజు సదా దీవించాలని కోరుతూ...

మీ సహాయం అర్ధించే

సి.ఎస్.రావు అనే సూర్యప్రకాశరావు’’


అధ్యాయం 7: బాధ పడ్డ శివాజీ   


ఉత్తరం చదివిన వెంటనే ఒక్క సారి చేతుల్లో ముఖం దాచుకుని భోరున విలపించసాగాడు శివాజి.

తెల్లబోయి వింతగా చూడసాగారు అప్పలస్వామి. ఆ వచ్చిన అబ్బాయి.


ఐదు నిమిషాల అనంతరం తేరుకున్న అతను గబగబా లేచి లోపలకు వెళ్లి మరో ఐదు నిముషాలలో తయారై వచ్చాడు. అతని సిల్కు లాల్చీ జేబులో హడావుడిగా దోపుకున్న వంద రూపాయల నోట్ల కట్ట తొంగిచూస్తోంది.


“బాబు.. నీ పేరు?’’

“ప్రకాష్ రాజ్!”


 శివాజీ అతనితో అప్పలస్వామి వెంటరాగా బయల్దేరాడు సూర్యప్రకాశరావు గారి ఇంటికి.

దారి లో ప్రకాష్ రాజ్ చెప్పిన విషయాలన్నీ విని జీర్ణించుకోలేకపోయాడు. 


ఎంత వద్దనుకున్నా తన నిర్లక్ష్యం ఒక వ్యక్తిని ఎంతటి వేదనకు గురి చేసిందో అర్ధమవుతూ ఉంటే అతని కళ్ళు ఊట బావిలా చమరుస్తూ, మనసు పొరల మధ్య దాగున్న దుర్గుణాలన్నీ కరిగి కన్నీరై జారిపోసాగాయి.


అధ్యాయం 8 — గురువు–శిష్యుల కలయిక

 

అతను గుమ్మంలో అడుగుపెడుతూనే ఆయాసంతో రొప్పుతూ ఉన్న సూర్యప్రకాశరావు గారి పాదాలకు నమస్కరించి ‘’గురువుగారు !నన్ను... నన్ను... క్షమించండి “అంటూ బావురుమన్నాడు.


ఎవరికీ ఏమీ అర్థం కాని ఆ పరిస్థితిలో నెమ్మదిగా కళ్ళు తెరిచిన రావు గారీ పక్కనే కూర్చున్నాడు శివాజీ.


 “గురువు గారు... నేను... నేను రాజుని. మీరు మీ జీవితంలో జ్ఞాపకంగా ఉంచుకున్న శివాజీ రాజుని. ఇదిగో మనం ఇద్దరం తీయించుకున్న ఫోటో’’ అంటూ శివాజీ తన జేబులోంచి ఫోటోతో పాటు నోట్ల కట్టను కూడా ఆయనకు చేతులకు అందించాడు.

 

 ఆయన కళ్ళల్లో వింత శక్తి ప్రవేశించి నట్టుగా ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి ఫోటోను పరిశీలించి చూసారు. నెమ్మదిగా మనవడి సాయంతో పైకి లేచిన ఆయన శివాజీని అత్యంత సంతోషంతో కౌగిలించుకున్నారు.

 

“బాబూ రాజూ..” అంటూ మనవడు రాజు చేతిని శివాజీ చేతుల్లో ఉంచారు.


అధ్యాయం 9 — ముగింపు 


“నిన్ను... నిన్ను కలుస్తాను అని అనుకోలేదు రా.! నా మనవడికి నీ పేరు పెట్టి నిన్ను వాడిలో చూసుకుంటున్నాను. నేను నిన్ను ఏదీ కోరను బాబు. వాళ్ళు తండ్రి లేని పిల్లలు. వాడు చదువుకుని తన కాళ్లమీద తాను నిలబడి తన కుటుంబాన్ని పోషించుకునే చేయూత ఇవ్వు. ఇదొక్కటే నా కోరిక.’’

ముద్దగా వస్తున్న మాటలు ఆగిపోయి అచేతనంగా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయిన ఆయనను చూస్తూనే అందరూ గొల్లుమన్నారు.

 

ఏకలవ్య శిష్యరికం చేసి గురువును ప్రత్యక్షంగా సేవించి ప్రత్యక్ష ప్రేరణగా, స్పూర్తిగా తీసుకుని గురువుని మించిన శిష్యుడు అయిన శివాజీరాజు చేతుల్లో, భారత యుద్ధంలో ద్రోణాచార్యుడు మరణించినట్టుగానే ఈ ద్రోణుడూ మరణించాడు.


అయితే ఇద్దరికీ ఒకటే తేడా.

ఆత్మ సంతృప్తి!

 


సమాప్తం. 


***

కొత్తపల్లి ఉదయబాబు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


కొత్తపల్లి ఉదయబాబు

రచయిత పరిచయం:

పేరు : కొత్తపల్లి ఉదయబాబు పుట్టిన తేదీ : 01/07/1957 విద్యార్హతలు : M.Sc., M.Ed., M.phil (maths) నిర్వహించిన వృత్తి : ప్రధానోపాధ్యాయులు


తల్లి తండ్రులు : శ్రీ కొత్తపల్లి గంగాధర్ శర్మ, విశ్రాంత హెడ్ పోస్ట్-మాస్టర్ స్వర్గీయ శ్రీమతి సుబ్బలక్ష్మి. భార్య : శ్రీమతి సూర్యకుమారి కుమార్తె : చి. సౌ. గుడాల సుబ్బ లక్ష్మి సంతోషిత , M.B.A. w/o లక్ష్మికాంత్ – లాయర్ మనుమరాలు : చి. లక్ష్మి పూర్ణ సాధ్వి కుమారుడు : చి. హనుమ గంగాధర్ శర్మ , సాఫ్ట్-వేర్, h/o చి.సౌ.తేజశ్రీ మనుమలు : చిరంజీవులు గహన్ ముకుంద, ఋషిక్ వశిష్ట.

*వృత్తి పరంగా :

*జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల పోటీలలో వివిధ అంశాలలో బహుమతులు, క్విజ్,సాంకేశృతిక కార్యక్రమాల నిర్వహణ, న్యాయ నిర్ణేతగా వ్యవహిరించిన అనుభవం.

*పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2002 లో తొలిసారిగా ఐదుగురు విద్యార్థులకు నూటికి నూరు మార్కులు రావడం ఆ సందర్భంగా అరకాసు ఉంగరం బహుమతిగా అందుకోవడం ఒక చక్కని ప్రోత్సాహం, ఉత్సాహం. అలా మొత్తం సర్వీసులో నూటికి నూరు మార్కులు దాదాపు తొంభై మందికి పైగా విద్యార్థులు పొందగలగడం వృత్తిపరంగా సంతృప్తిని కలిగించిన విషయం.

*జిల్లా స్థాయిలో అధికారికంగా నిర్వహించిన భౌతిక శాస్త్ర,గణిత శాస్త్ర సదస్సులకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించడం.

*జిల్లా ఉమ్మడి పరీక్షల సంస్థకు అయిదు సంవత్సరాలపాటు ఎక్కువమంది విద్యార్హులు గణితంలో ఉత్తీరర్ణతాశాతం పొందదానికి అవసరమైన విజయ సూచిక, విజయ సోపానాలు... పుస్తకాలను ప్రభుత్వం తరపున రూపొందించుటలో ''గణిత ప్రవీణుడు''గా వ్యవహరించడం.

*ఆకాశవాణిలో కథానికలు, నాటికల ప్రసారం,అవగాహనా సదస్సులలో పాల్గొనడం, రేడియో నాటక కళాకారునిగా మూడు సంవత్సరాలు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పాల్గొనడం..మొదలైనవి


ప్రవృత్తి పరంగా :

*కథా రచయితగా రచనలు :

1. అందమైన తీగకు...! - 25 కధల మాలిక (2003) 2. చిగురు పిట్టలు* - నానీల సంపుటి (2007) 3. ఉదయబాబు మాస్టారి' కధానికలు - ఉదయకిరణాలు (2015) 4. అమ్మతనం సాక్షిగా... కవితా సంపుటి (2015) 5. నాన్నకో బహుమతి - 16 కథల సమాహారం (2019-.) జీ.వి.ఆర్. కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన కథాసంపుటుల పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన కథల సంపుటి) 6. ఆయన మా నాన్నగారు ( దీర్ఘ కవిత - త్వరలో )

నవలలు : 1 . లేడీ సింగర్ (2 భాగాలు )

                  2 . మనసు చేసిన న్యాయం(ప్రతిలిపి వారు మార్చి 2202 లో నిర్వహించిన ధారావాహికల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందినది)

ప్రేరణ : నాన్నగారు...ఆయన నాటక రచయిత,దర్శకుడు,ఉత్తమ నటుడు(18 నాటక పరిషత్తులలో)

  *సామాజిక సేవ : రక్తదాన కార్యక్రమం లో, లయన్స్ క్లబ్ వారి కార్యక్రమాలలో విరివిగ పాల్గొనడం .

తెలుగు సాహిత్యానికి సేవ : తెలుగు సాహితీ సమాఖ్య లో కార్యకర్తగా, సంయుక్త కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా తెలుగు సాహిత్యానికి విశేష కృషి , జిల్లా స్థాయిలో ర్యాలీల నిర్వహణ ...అష్టావధానం, త్రీభాషా శతావధానం లలో పృచ్చకునిగా 46 సంవత్సరాలపాటు ప్రతీ నెల సాహితీ స్రష్టల ప్రసంగాలు...విద్యార్హులకు వివిధములైన పోటీల నిర్వహణ,

పత్రికా రంగం లో : వ్యంగ్య చిత్రకళ లో పలు కార్టూన్లు వేయడం. :*1999 - జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు - పశ్చిమ గోదావరి జిల్లా*

 2000 - యువసాహితీ సహస్రాబ్ది అవార్డు - ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య 2011 - సోమేపల్లి సాహితీ పురస్కారం 2016 - గోదావరి మాత అవార్డు - ఉంగుటూరు ఎం.ఎల్.ఎ, శ్రీ గన్ని వీరంజనేయులుగారి చే- గణపవరం - పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎం.ఎల్.ఎ. శ్రీ వి.వెంకట శివరామరాజు గారి చే ''ఉగాది పురస్కారం*

పాలకొల్లు - కళాలయ సంస్థవారిచే " కధాభారతి" బిరుదు ప్రదానం.

*జన విజ్ఞానవేదిక - భీమవరం వారిచే " ఉగాది పురస్కారం" ....సుమారు నూటికి పైగా సన్మానాలు సత్కారాలు...ఇంకా ఎన్నో..

Youtube :1. తెలుగు కథను ప్రపంచ వ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం "Mastaru Kadhalu 'in' Telugu " ఛానెల్ ద్వారా నా కథలతో పాటు దాదాపు 25 మంది రచయితల కథలు (ఈనాటికి 420 కధల ఆడియో వీడియోలు)చదివి వీడియోలుగా మలుస్తూ ఉచిత సేవగా అందించడం జరుగుతోంది.

2.KUBDevotionalWorld అనే ఛానల్ ద్వారా శ్రీ భగవద్గీత 700 శ్లోకాలను ప్రతీరోజు 5 శ్లోకాలను భావాలతో సహా వీడియోలుగా చదివి అందించడం జరుగుతోంది.

3. UDAYABABUMathsBasics యు ట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు గణితంలో మౌలిక భావనల బోధన

ప్రస్తుత నివాసం : 2010 లో సికింద్రాబాద్ సైనిక్ పురి లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఇప్పటికీ కధా రచయితగా, బాలల కథారచయితగా కొనసాగడం.

చివరగా నా అభిప్రాయం :

ఇప్పటికీ నా కవితా ప్రస్తానం, కధా సాహితీ సేద్యం కొనసాగుతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం లో చెట్టు నాకు ఆదర్శం.

కవిగా రచయితగా తమ సాహితీ ప్రస్తానం కొనసాగిన్చాదలుచుకున్న యువత అంతా పాత సాహిత్యాన్ని బాగా చదవాలి. 'వెయ్యి పేజీలు చదివి ఒక్క పేజీ రాయి' అన్న ఒక మహాకవి వాక్యాలు స్పూర్తిగా తీసుకుని నిన్నటి రచన కన్నా, నేటిది, నేటి రచన కన్నా రేపటిది మరింత మెరుగుపరచుకుని ఈ రంగం లో తమకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరచుకోవాలని, ఆ దిశగా వారి సాహితీ ప్రస్తానం కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ...సాహిత్యాభినందనలు.

కొత్తపల్లి ఉదయబాబు

సికింద్రాబాద్

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page