ప్రేమలేఖ

Premalekha - Telugu Love Story | Mucchi Dhanalakshmi
ప్రేమలేఖ - తెలుగు ప్రేమ కథ | ముచ్చి ధనలక్ష్మి
Published in manatelugukathalu.com on 10/08/2026
ప్రేమ అంటే కేవలం పెళ్లికి ముందు కలిగే ఆకర్షణ కాదు. ఒకరి మీద ఒకరికి ఏర్పడే నమ్మకం, కష్టసుఖాల్లో తోడుగా నిలిచే భరోసా, జీవితాంతం విడిచిపెట్టనన్న అనుబంధం. సుశీలకు సుధాకర్‌తో పరిచయం కూడా అలా మొదలవుతుంది. తొలిచూపు ప్రేమను నమ్మని ఆమెను అతని పరిచయం పూర్తిగా మార్చేస్తుంది. కళాశాల రోజుల ప్రేమ, చిన్న చిన్న అపార్థాలు, దూరాలు, మళ్లీ దగ్గరవడం, పెళ్లి, పిల్లలు, దాంపత్య జీవితంలోని తగువులు—ఇవన్నీ దాటుకుంటూ వారి అనుబంధం సాగుతుంది.
కానీ కాలం ఎవరి కోసం ఆగదు. పిల్లలు పెద్దవాళ్లై తమ జీవితాల్లోకి వెళ్లిపోయిన తర్వాత, వృద్ధాప్యంలో మిగిలేది భార్యాభర్తల అనుబంధమే. చివరి దశలో సుశీల రాసిన ఆ ప్రేమలేఖలో కనిపించే ఆవేదన, జ్ఞాపకాలు, ప్రేమ, తన భర్తను తిరిగి తన దగ్గరకు రమ్మనే ఆహ్వానం కథకు అసలైన హృదయం.
సుశీ, ప్లీజ్ సుశీ ఒక్కటి ఒక్కటంటే ఒక్క ప్రేమ లేఖ రాయవూ!
మొదట నిన్ను నేను చూసిన నాటి నుండి నేటి వరకు నీలో కలిగిన భావాలు అందమైన అక్షరాలలో లిఖించవూ!
దిగ్గున లేచి కూర్చుంది సుశీల.
నుదుటికి పట్టిన చెమటని తుడుచుకుంటూ టైం చూసింది లైట్లు వేసి.
సమయం మూడు గంటలు దాటింది, ఇంకా చాలా సమయం ఉంది పడుకోవడానికి ప్రయత్నించింది.
పదే పదే సుధాకర్ మాటలే చెవుల్లో వినిపిస్తున్నాయి.
ఇక ఆలస్యం అనవసరం అనిపించింది. టేబుల్ లైట్ ఆన్ చేసి, కలం కాగితం చేతిలోకి తీసుకుంది.
తొలి పరిచయాన్ని తలచుకుంటూ రెండు క్షణాలు కళ్ళు మూసింది.
అప్రయత్నంగా చిరునవ్వులు వెలిగాయి సుశీల పెదాలపై.
కలం కాగితం పైకి జారి వేగం అందుకుంది.
ప్రియమైన సుధాకర్ కి,
సుధా...
ఇలా పిలిస్తే నీకు చాలా కోపం వస్తుంది కదా! అసలే చిన్నదిగా ఉన్న నీ ముఖం మరింత ముడుచుకుపోతుంది, నేనేమైనా అమ్మాయినా? అంటూ అలిగే వాడివి. కానీ ఎప్పుడైనా మనిద్దరి తగువు తారా స్థాయికి చేరినప్పుడు "సుధా" అంటే చాలు వేసే వాడివి ఆ నవ్వు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో!
ఏ మాత్రం కృత్రిమత్వం లేకుండా బిగ్గరగా నవ్వేసేవాడివి.
తొలిచూపు ప్రేమ అంటే నాకు నమ్మకం లేదు. అసలేంటి ప్రేమంటే? జీవితాంతం నీతోనే ఉంటావన్న నమ్మకం.
కష్ట సుఖాల్లో తోడుంటావన్న ధైర్యం.
ప్రాణం ఉన్నంత వరకు నిన్ను విడిచి పెట్టనన్న భరోసా; ఇవన్నీ ఒక్క చూపులో ఎలా వస్తాయి? పిచ్చి కాకపోతే అనుకున్నా.
జీవితంలో కొన్ని మనకు అనుభవమైతే కాని నమ్మని అహంభావులం కదా? కాదు కాదు అభ్యుదయవాదులమేమో?
నిజం, నీ తొలి పరిచయం నా నమ్మకాన్ని పడగొట్టింది.
గుర్తుందా ఆ రోజు?
నేను నిన్ను చూసిన రోజు, నువ్వు నన్ను చూసిన రోజు, మనం ఒకరినొకరు చూసుకున్న రోజు, నాలో ప్రేమ మొలకెత్తిన రోజు.
సుశీ, ఎంబీఏ గురించి ఏవో డౌట్స్ ఉన్నాయని వారం రోజుల నుండి చంపుతున్నావు కదా! తను మా పిన్ని కొడుకు, అదే చదువుతున్నాడు. నీ సందేహాలను నివృత్తి చేసుకో, తర్వాత నా తల తినకు అంటూ నిన్ను చూపించింది మా వదిన.
హలో చెప్తూ తలెత్తి చూసిన నా గుండె ఒక్క క్షణం లయ తప్పింది. ఏదో విపరీతమైన అలజడి, ఇదివరకు కలగనిది. కాస్త భయంగా, కాస్త కంగారుగా, ఇష్టంగా, కష్టంగా ఏవేవో భిన్న భావాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి.
అవన్నీ ముఖంలో కనపడకుండా ఉండటానికి ఎంతో కష్ట పడ్డాను. నువ్వు మామూలుగా నవ్వి ఐసెట్ కోసం, ఎంబీఏ తర్వాతి ఆఫర్స్ కోసం చాలాసేపు ఏదేదో చెప్పావు కానీ అవేవీ నా చెవులకెక్కలేదు.
ఏదో తెలియని ఊహాలోకంలో ఎంతసేపున్నానో ఏమో? నువ్వు నా కళ్ళ ముందు నుండి వెళ్లాక గాని నన్నల్లుకున్న ఊహాలోకం వదలలేదు. రెండు మూడు రోజుల వరకు పూర్తిగా మామూలు మనిషిని కాలేకపోయాను.
మనసు అనుక్షణం నీ ఆలోచనలతో నీ వైపు లాగుతుంటే మెదడు మందలిస్తూ చదువుని, లక్ష్యాన్ని గుర్తు చేసేది.
సంఘర్షణ, ఎటు వెళ్లలేని తెగింపు, అశక్తత.
అసలు నేనేనా ఇలా మారిపోయింది? ఈ వయసులో కలిగే భావాలు ప్రేమ కాదు ఆకర్షణ అని తెలిసినా ఎందుకింత సతమతమైపోతున్నాను? ఏమో ఏ ప్రశ్నకీ సమాధానం తెలియదు.
ఇంటర్లో, డిగ్రీలో హీరోలు అంటే అబ్బాయిల్ని చూసినా కలగని ఏ భావం నిన్ను చూస్తే ఎందుకు కలుగుతుంది?
ఓ... సారీ సారీ, అంటే నువ్వు బాగా లేవని కాదు, వాళ్ళు నీ కన్నా బాగున్నారని కాదు.
ఇదంతా ఎందుకు? నా కళ్ళకి నువ్వు ఎప్పుడూ హీరోవే.
చాలామంది ప్రేమలో పడ్డాక చదువుని నిర్లక్ష్యం చేస్తారు, లేకపోతే ప్రేమని వదిలేసి చదువులో రాణిస్తారు. నేను రెండింటినీ వదలలేకపోయాను, ఇంతకుముందు కన్నా మరింత కష్టపడి చదివి మంచి ర్యాంకు తెచ్చుకుని అనుకున్న కాలేజీలో సీటు సంపాదించాను.
కౌన్సిలింగ్ లో నా ఆనందం అంతా ఇంతా కాదు.
ఎంతో చెప్పలేనంత,
చూపించలేనంత,
నెంబర్ వన్ కాలేజీలో చదువుతున్నందుకు ఇంకా... ఇంకా... అదే కాలేజీలో నువ్వు ఉన్నందుకు.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.
కాలేజీలోకి అడుగుపెట్టాను కొత్త కొత్త ఊహలతో.
వెల్కమ్ పార్టీ అవుతోంది. కొత్త స్నేహితులు పరిచయమౌతున్నా నా కళ్ళు వెతికేది నీకోసమే.
వెతికి వెతికి క్షణమొక యుగంగా గడుపుతున్న తరుణంలో, రెండు రోజుల తర్వాత రానే వచ్చింది నేను ఎదురుచూసిన క్షణం.
ఆరోజు సీనియర్లు మా పేర్లు, వివరాలు అడుగుతున్నారు.
హాయ్ రా! వెనుక నుండి వినిపించిన నీ గొంతుకి ఒక్కసారిగా గుండె ఆగినంత పనయింది.
నువ్వు నా దగ్గరికి వచ్చి "హలో నేను గుర్తున్నానా?" అంటావు. కాసేపాలోచించి అప్పుడు గుర్తు పట్టినట్టు నటించాలి.
ఎందుకో ఏదో తొందర!
"ఏంట్రా ర్యాగింగా?" అడిగావు.
"ఛీ ఛీ.. పరిచయం చేసుకుంటున్నామంతే" తేలికగా చెప్పాడు మీ ఫ్రెండ్.
"సో వాట్ ఈస్ యువర్ నేమ్?" సరాసరి నన్నే అడిగేశావు.
తల తిరిగినంత పనయ్యింది నాకు, అంటే నువ్వు నన్ను మర్చిపోయావు.
అంతే, ఏదో నిస్పృహ, ఉత్సాహమంతా ఆవిరైపోయింది.
"సుశీల" చెప్పాను ఏడుపు మొఖంతో.
"గాన కోకిల, కమాన్ పాట పాడు" నీకేం నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు కానీ, ఊహలోకంలో ఊయల తెగి పాతాళంలో పడినట్టుంది నా పరిస్థితి.
"ఓకే ఓకే సడన్ గా అంటే కష్టంగానే ఉంటుంది కానీ వన్ వీక్ టైం ఇస్తున్నా ప్రిపేర్ అవ్వు" చెప్పి అదృశ్యమయ్యారు.
ఇదేనా ఆశాభంగం అంటే? ఇంత చేదుగా ఉంటుందా?
కాస్త కోపం, కాస్త విసుగు, మరికాస్త ఏడుపు తాండవం చేస్తున్నాయి లోపల.
అయిపోయింది అంతా అయిపోయింది, దీనికోసమేనా రాత్రి పగలు కష్టపడి చదివింది? దీనికోసమేనా అమ్మానాన్నలకు దూరం అయింది?
శూన్యం అంతా శూన్యం, వారం రోజుల తర్వాత నువ్వు పలకరించి పాట పాడమని గుర్తు చేసేంతవరకు.
"నాకు పాటలు రావు సార్" ధైర్యంగా చెప్పేశాను.
అది ధైర్యం కాదు నీ మీద కోపమే. పాడాలి, పాడాలి అని అరవటం మొదలు పెట్టారు మీ గ్రూప్. అసలే ఆశాభంగంలో ఉంటే మీ ప్రెజర్ కు ఒళ్ళు మండింది. ఆగ్రహం పెల్లుబికింది.
"నేను పాడను, మీకు సంగీతం మీద అంత ఇష్టం ఉంటే మీరే పాడండి"
చెప్పి సీరియస్ గా వెళ్ళిపోయాను.
ఈసారి నివ్వెరపోవడం నీ వంతయింది.
ఇక ఆరోజు నుండి నువ్వు కనబడగానే దాక్కోవడం అలవాటయింది.
ఎందుకో నిన్ను చూస్తే మళ్ళీ మళ్ళీ గుండె బరువెక్కుతుంది.
ఏదో విలువైన దాన్ని కోల్పోయానన్న భావం గుచ్చుతోంది.
ప్రేమ విఫలమైతే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని చూసి నవ్వుకునేదాన్ని, కానీ ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో?
అనుక్షణం వాళ్ళు గుర్తొచ్చినప్పుడు ఎలా విరక్తి కలుగుతుందో బాగా అర్థమైంది.
"కాదు కాదు అనుభవమైంది, ముందే అన్నానుగా అనుభవమైతే గాని నమ్మని అభ్యుదయవాదులం అని"
ఆ రోజు మన ఫ్రెషర్స్ డే వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి; పాటలు, డాన్సులు, స్టేజ్ అదిరిపోతోంది.
"తర్వాత సుధలు చిందించేలా పాటను వినిపించడానికి వస్తున్నాడు సుధాకర్" అనౌన్స్ చేసింది యాంకర్ సుష్మ.
సుధాకర్ అంటే ఎంతమందో ఉండొచ్చు అని సర్ది చెప్పుకుంటుండగా, లెమన్ కలర్ టీషర్ట్లో ప్రత్యక్షమయ్యారు తమరు.
ఒక్కసారి అంతా నిశ్శబ్దం అయిపోయింది. నాకలా అనిపించిందో?
"పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో" పల్లవి అందుకున్నావు నవ్వుతూ.
"చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది"
అంటూ నన్నే చూసినట్టు అనిపించింది. ఎండిపోతున్న ఆశల శిఖరానికి చిన్న చిగురు, అంతలోనే గుర్తొస్తుంది ఆశాభంగం.
ఎందుకో ఇక అక్కడ ఉండలేక, ఆ పాట వినలేక బయటకు వచ్చేసాను.
హలో
హాస్టల్ వైపు నడుస్తుంటే వినిపించింది. జల్లుమంది ఒళ్ళంతా నీ గొంతు గుర్తు పట్టగానే.
నడక వేగం పెంచాను.
"పాడమని సవాల్ విసిరారు కదా! అందుకే వారం రోజులు ప్రాక్టీస్ చేసి మరి పాడాను. ఎలా ఉంది నా పాట?"
పక్కనే నడుస్తున్నావు నువ్వు.
బాగుంది, నవ్వడానికి ప్రయత్నించాను.
"నిజంగానా! థాంక్యూ థాంక్యూ. చాలా రోజుల నుండి అడుగుదామనుకున్నాను, నిన్ను ఎక్కడో చూశాను అనిపిస్తోంది"
అబద్ధం మాత్రం కాదు, ఆలోచిస్తూ అన్నావు.
ఛ... నా కర్మ ఇంత దరిద్రంగా ఉందేంటి? దేనికి తల కొట్టుకోవాలో తెలియడం లేదు.
పిచ్చి మాలోకం నీకోసమే రా! రాత్రి పగలు చదివి ఈ కాలేజీకి వచ్చాను. నీకు నా ముఖం కూడా గుర్తు లేదా అని గట్టిగా అరవాలనిపించింది.
"నీకూ గుర్తు లేదా? లేక కొంతమందిని చూస్తే అలా అనిపిస్తుందా?"
దాదాపు అన్ని ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పాను, మనసు మండుతున్నా.
అప్పటినుండి ఎప్పుడైనా కనిపిస్తే పలకరించే వాడివి, చిగురిస్తున్న నా కలల పై చిరు జల్లు కురిపిస్తున్నట్టు.
ఫైనల్ ఎగ్జామ్స్ లో టాప్ టెన్ లో ఉన్నందుకు అభినందిస్తావనుకున్నాను కానీ టాపర్ కాలేదని తిట్టావు.
ఆహా నా మీద నమ్మకం అని మురిసిపోయాను, ఎందుకంటే నువ్వంటే ఇష్టం కనుక నువ్వు ఏం చెప్పినా ఏమన్నా పాజిటివ్ గా ఆలోచిస్తున్నాను.
అదే ఇష్టం లేకుంటే వీడికేంటి, టాపర్ కావడమంటే అంత ఈజీ అనుకుంటున్నాడా?
అంత కష్టపడితే అని తిట్టుకునేదాన్ని.
"మనసులో నీ మీద కొండంత ప్రేమున్నా కొద్దిగా కూడా బయటకి చూపించలేక పోయేదాన్ని"
చెప్పాక నువ్వు కాదు అంటే అది అందరికీ తెలిసిపోతే? అసలు మాట్లాడడమే మానేస్తే?
పిచ్చిపిచ్చి భయాలు.
అందులోనూ నాకు కాస్త సిగ్గు ఎక్కువే. ఓయ్ అలా నవ్వకు, నిజం చాలా క్లోజ్ అయితే తప్ప ఫ్రీగా ఉండలేను.
మీరు మాకు ఫ్రెషర్స్ పార్టీ ఇచ్చినప్పుడు ఉన్న ఉత్సాహం మీకు ఫేర్వెల్ పార్టీ ఇస్తున్నప్పుడు లేదు, చాలా దుఃఖం.
నువ్వు నాకు శాశ్వతంగా దూరమై పోతున్న బాధ. అయినా కుంగిపోలేదు, స్థిరంగానే ఉండటానికి చాలా చాలా కష్టపడ్డాను. వ్యక్తిత్వ వికాస క్లాసుల ప్రభావమే ఈ ఉద్వేగాల నియంత్రణ.
కాలేజీ వదిలి మీరు వెళ్ళిపోతున్న రోజు మన కాలేజీ రూల్ ప్రకారం అందరం నిలబడి చివరి వీడ్కోలు ఇస్తున్నాము.
మీ ఫ్రెండ్స్ తో గేట్ వరకు నడిచిన నువ్వు ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కి వచ్చావు.
ఫోన్ నెంబర్ అడుగుతావేమో అనుకున్నాను. "నీరజక్కని అడిగినట్టు చెప్పు సుశీ" అని చిన్నగా నవ్వావు. విపరీతమైన ఆశ్చర్యం.
అంటే నీకు వదిన గుర్తుందా? ఉండి కూడా ఇన్ని రోజులు చెప్పలేదా?
ఒక పక్క ఆనందం, మరో పక్క బాధ.
నీకు గుర్తుందని ఆనందపడాలా? లేక తెలిసేటప్పటికే నువ్వు దూరమౌతున్నావని బాధ పడాలా?
సుడులుగా తిరుగుతున్నాయి నీళ్ళు కళ్ళలో. ఎక్కడ అవి కళ్ళ నుండి బయటపడి పరువు తీస్తాయో అని భయమేసి, నీ మాటలు పూర్తిగా వినకుండానే బై చెప్పి వచ్చేసాను.
దూరమయ్యేది మనుషులు మాత్రమే, మనసులు కాదు కదా? సుష్మతో నీవంటున్న మాటలు నా కోసమే అయితే బాగుండు అనుకున్నాను.
మనం నెంబర్ కూడా ఇచ్చి పుచ్చుకోలేదు కనుక ఇక అక్కడతో ఆ బంధం ముగిసి పోయిందనుకున్నాను.
క్రమక్రమంగా జ్ఞాపకాన్ని చెరిపేసే పనిలో పడ్డాను.
20 రోజులకు సరిపడే రికార్డు వర్క్ ఇచ్చి వారం రోజులు సెలవులతో ఇంటికి పంపించారు దసరాకి.
అమ్మకి ఒంట్లో నలతగా ఉందని వదినకు సహాయంగా చీపురు పట్టుకొని స్వచ్ఛాగృహంలోనికి దిగాను.
"ఏయ్ సుధా!" ఆనందంగా అరిచింది మా వదిన నా చెవుల్లో సుధలు పోసినట్లుగా.
క్షణకాలం భ్రమా? నిజమా? తేల్చుకోలేక పోయాయి నా కళ్ళు నిన్ను గుమ్మంలో చూసి.
ఒక్క ఉదుటున గుమ్మంలోనికి వచ్చాను నీకు అభిముఖంగా.
తలంతా ధూళి, చేతిలో చీపురు,
మురికి పట్టిన నైట్ గౌను, నా అవతారం చూసి నమ్మలేనట్లు నివ్వెరపోయావు.
నీ ముఖంలో భావాలు కనిపించక కానీ ఒంటిమీద స్పృహ రాలేదు.
"నైస్ డ్రెస్ సుశీ, వండర్ఫుల్ మేకప్ ఆల్సో"
లోపలి నుండి తన్నుకొస్తున్న నవ్వు ఆపుకుని అభినందిస్తున్నావు.
"ఏంట్రా ఇంత సడన్ గా గుర్తొచ్చాము?" అంటూ అన్నయ్య, వదిన రావటంతో నీ చూపుల నుండి తప్పించుకొని స్నానానికి పరిగెత్తాను.
తర్వాత మాటల మధ్యలో అన్నయ్య "అవును సుశీ కూడా మీ కాలేజీయే, మీ జూనియర్ తెలుసా?" అడిగాడు మామూలుగా.
అసలు చూడనట్టు మొహం పెట్టి, ఓ సారి కళ్ళు నా వైపు తిప్పి అబ్బా ఏం యాక్షన్ చేసావు!
"అమ్మాయిలతో మాట్లాడేంత ధైర్యం నాకు ఎక్కడిది బావా?" అన్నావు అమాయకంగా మొహం పెట్టి.
"మాతో మాట్లాడాలంటే ధైర్యం కావాలా?" కోపంగా అంది వదిన.
"కచ్చితంగా అక్కా, మీ మాటలు బాణాలు ఎదుర్కోవాలంటే చాలా ధైర్యం కావాలి" నా మీదకి ఓ చూపు విసిరి నవ్వుతావు.
స్థిరంగా స్తంభంలా ఉండిపోయాను నీ వైపు చూస్తూ. సైన్స్ గ్రూప్ వారికి ఎగ్జామ్స్ లో ఆర్ట్స్ పేపర్ ఇస్తే ఎలా ఫీలవుతారో అలా ఉంది నా పరిస్థితి.
అసలు అర్థం కావడంలేదు గజిబిజిగా, గందరగోళంగా తలను దేనికైనా కొట్టుకోవాలి అనిపించేంతలా.
అసలేంటి నువ్వు ఏం చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? పిచ్చి పిచ్చిగా అనిపించింది ఆలోచిస్తే.
అమ్మ, నాన్న, అన్నయ్య అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా, విపులంగా సమాధానాలు చెప్పావు.
నీ వినయ విధేయతలకు మా వాళ్ళు ఫ్లాట్ అవుతుంటే... బాబోయ్ నా ఆనందం అంతా ఇంతా కాదు.
తర్వాత వదినతో రాఖీ కట్టించుకోవడానికి, జాబు వచ్చిందని స్వీట్స్ ఇవ్వడానికి, అన్నయ్య వదినలకు పెళ్లిరోజు గిఫ్ట్ ఇవ్వడానికి కావాలనో, మామూలుగానో, సరిగ్గా నేను ఉన్నప్పుడే వస్తుండేవాడివి.
తక్కువే మాట్లాడినా తొందరగా అందరితో కలిసిపోయి గుడ్ కండక్ట్ సర్టిఫికేట్ సంపాదించావు.
నా చదువుకు సంబంధించిన సలహాలు ఇస్తూ, జాబ్స్ గురించి చెప్తూ మా కుటుంబానికి చాలా దగ్గర అయ్యావు.
నిజంగా ఇదంతా కలలానే ఉంది నాకు. దేవునికి ఎంత దయ నా మీద! ఇక ఎదురు లేకుండా ఎదిగిపోయింది నీపై ప్రేమ.
కానీ నీకు ఎలా చెప్పాలి? అన్నది నా సమస్య.
అప్పటికే ఎంబీఏ అయి ఉద్యోగ వేటలో బిజీగా ఉన్నావు.
"సుశీ, సుధాకర్ మీద నీ అభిప్రాయం ఏంటమ్మా?" వన్ ఫైన్ మార్నింగ్ నాన్న అడిగిన ప్రశ్నకి అక్కడే ఎగిరి గంతేయకుండా ఉండడానికి ఎంత కష్టపడ్డానో!
తర్వాత ఇరుపక్షాల అంగీకారాలు, మన ఎంగేజ్మెంట్, పెళ్లి చకచకా జరిగి పోయాయి కదా!
సినిమాలో ఒకే పాటలో హీరో పుట్టి, పెరిగి, పెద్దవాడైనట్టు.
ఎందుకో ఇంత సాఫీగా జరిగి పోవడం నా మనసు నమ్మలేకపోయింది, ఏం అవాంతరాలు వస్తాయో అని ఒకటే భయం.
పెళ్లైన వారం రోజులకు అనుకుంటా మనం వైజాగ్ బయలుదేరాము.
కాస్త భయం, ఇంకాస్త బాధ, టెన్షన్ లాంటి ఉద్వేగాలతో సతమతమైపోతూ నీ పక్కనే కూర్చున్నాను.
"ఇప్పుడు నిన్ను పాడమనే హక్కు నాకుందిగా గానకోకిల?" కఠినంగా వినిపించిన నీ గొంతుకి పై ప్రాణాలు పైనే పోయాయి, అర్థం కానట్లు చూశాను.
"పాడు" సీరియస్ గా చెప్పావు.
ఏంటిది, నువ్వు మంచివాడివి కాదా?
ఒక క్షణం అంతా తలకిందులైనట్టు,
నా చేతుల్లో ఏం లేదా అని కింద పడబోయాను.
"ఏమైంది?" ఆసరాగా పట్టుకున్న నీ చేతులు వణుకుతున్నాయి.
తల్లీ! మౌనముని, నన్ను అలా విలన్ లా చూడకే, ఏదో నిన్ను ఆటపట్టిద్దామని అన్నాను.
ఎన్ని చేశాను నీకోసం?
కనీసం నవ్వవేం? బిజినెస్ చేయాలన్నది నా గోల్ అయినా జాబ్ తెచ్చుకున్నాను, మీ ఫ్యామిలీ దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాను,
మా ఫ్యామిలీ ని ఒప్పించాను,
సో నా వంతు త్యాగాలు, కష్టాలు అన్నీ అయిపోయాయి.
"ఇకనుండి నన్ను త్యాగం చేయమనకూడదు ముందే చెప్తున్నా"
నా కళ్ళలోకి లోతుగా చూస్తూ నువ్వు చెప్తుంటే ఆ ఫీలింగ్...
దాని పేరు ఇది అని చెప్పలేను.
"ఏంటిదంతా నాకోసం చేశావా?" గొంతు పెగల్చుకుని కష్టంగా అన్నాను.
"అవును నీ కోసమే చేశాను, ఏదైనా చేస్తాను కూడా" చెప్తున్న నీ కళ్ళలో అంతులేని ప్రేమ.
అవును నువ్వంటే నాకిష్టం, ఇప్పుడు కాదు నీరజక్క పెళ్లిలో మొదటిసారిగా చూసినప్పటి నుండీ. అందుకే నీకు ఎంబీఏ డౌట్స్ అని తెలియగానే అవి చెప్పే నెపంతో మీ ఇంటికొచ్చాను. కానీ నీకు మా కాలేజీలో సీటు రావడం నా అదృష్టం.
"ఐ లవ్ యు సుధా, లవ్ యు ఫర్ ఎవర్" అప్రయత్నంగా అనేశాను నీ మాటల మధ్యలో.
అది వినగానే నీ కళ్ళు, మనసులో ఆనందాన్ని ప్రతిబింబించే నీ ముఖం నాకిప్పటికీ గుర్తే.
ఇక తర్వాత రోజులు ఎంత తొందరగా గడిచిపోయాయి కదా!
నా అలక, నీ కోపం, చిన్న తగువులు, మళ్ళీ సారీ చెప్పుకోవడం, పిల్లలు, అన్నీ ఎంత తొందరగా అయిపోయాయో? అయినా ఈ కాలానికి అంత వేగం ఎందుకో?
మన జీవితంలో బంగారు క్షణాల్ని కాసేపు అనుభవించనివ్వక ఒకటే పరుగులు తీస్తుంది ముందుకు...
పిల్లలు ఉద్యోగాలకు దూరం వెళ్ళాక మళ్ళీ మనిద్దరం కాస్త దగ్గరయ్యామేమో. వాళ్ళు పెరిగే వరకు అనుక్షణం వాళ్ళ చదువులతో చాలా బిజీ అయిపోయాము.
ఇంట్లో పనులు, కాలేజీతో చాలా బిజీ అయిపోయాము, చాలాసార్లు ఆ ప్రెజర్ వలన తగువులాడుకున్నాం.
ముఖ్యంగా రాకేష్ విషయంలో, వాడికేమో డాక్టర్ కావాలని కోరిక, నువ్వేమో డిగ్రీ చేయమని.
వాడి తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడానని వారం రోజులు నువ్వు నాతో మాట్లాడలేదు.
తలచుకుంటుంటే నిజంగా నవ్వొస్తుంది, చిన్నపిల్లల్లా ఎప్పుడూ గొడవలే.
ఏవి ఆ ఆనంద గడియలు?
కళ్ళు మూసి తెరిచేలోగా కలలా కరిగి పోయాయి కదా?
నాకే శక్తి ఉంటే తిరుగుతున్న కాలచక్రాన్ని వెనక్కి తిప్పేసి చేసేదాన్ని.
నిజం చెప్తున్నా సుధా, ఏ రోజూ నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నా అని బాధ పడలేదు.
నువ్వు అంతేనా?
అప్పుడప్పుడు మనస్పర్ధలు వచ్చినా కూడా అవి ఎక్కువ కాలం మన మధ్యలో ఉండలేక పోయాయి కదా!
నువ్వు నిద్ర లేచేటప్పటికి ఈజీ చైర్ లో కూర్చుని నేను పేపర్ చదువుతుంటే, నా కాళ్ల దగ్గర కూర్చుని, ఒళ్ళో తలపెట్టి, నా కళ్ళలోకి సూటిగా చూస్తూ "నువ్వు నా అదృష్టానివిరా!" అనే వాడివి కదా, అదిగో అది గుర్తొస్తేనే జలజలా రాలుతున్నాయి కన్నీళ్లు.
నిజానికి నువ్వే నా అదృష్టం, చాలామందిలా పురుషాహంకారం ప్రదర్శించలేదు, అన్నింటిలో సమానంగా చూశావు.
పెళ్లి నాడు చేసిన ప్రమాణాలన్నీ పాటించావు కదా?
మరెందుకీ అవసాన కాలంలో నాకు దూరం అయ్యావు?
కడదాకా కలిసే ఉంటాం అన్నావు కదా!
ఆస్తిని పంచుకున్నట్టు పిల్లలు మనల్ని విడదీసి పంచుకుంటుంటే ఎందుకు మౌనం వహించావు?
నా తర్వాత వచ్చిన పిల్లల కోసం, వారి కుటుంబాల కోసం నన్ను వదిలేస్తావా?
ఎంత అన్యాయం సుధా?
వాడికి నాన్న అక్కర్లేదు, వీడికి అమ్మ అక్కర్లేదు, కానీ నాకు నువ్వు కావాలి, నీ తోడు కావాలి.
ఈ చివరి రోజుల్లో ఒంటరితనం నేను భరించలేను.
వెళ్ళిపోదాం
వీళ్ళిద్దరికీ దూరంగా ప్రశాంతమైన చోటికి వెళ్ళిపోదాం.
శరీరంలో శక్తి సన్నగిల్లుతున్న ఈ తరుణంలో మనకి పిల్లల ఆసరా లేకున్నా నీ చేయి నాకు, నా చేయి నీకు ఇచ్చే ఆసరా చాలు.
వేచి చూస్తున్నాను సుధా, రేపటి సూర్యోదయానికి వచ్చే నీ రాక కోసం సరస్సులో తామరలా చూస్తున్నాను.
తొందరగా వచ్చేస్తావు కదూ!
నీ సుశీల సుధాకర్
కోడలి కోపపు చూపులను లక్ష్యపెట్టకుండా పోస్ట్ ఆఫీస్ వైపు నడిచింది సుశీల.
తనకు తెలుసు, ఈ లేఖ చూడగానే సుధాకర్ వస్తాడని.
సుధాకి ఇష్టమైన చీరేది?
ఆలోచిస్తోంది తన మనసు ముసలితనం వదిలించుకుని నవ యవ్వనంగా...
**********************
ముచ్చి ధనలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

పరిచయం: ముచ్చి ధనలక్ష్మి
కధలు చదవటం అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుండి ఏ కథల పుస్తకం దొరికినా ఆఖరి వరకు చదివేదాన్ని. ఇంటర్ చదువుతున్నప్పటి నుండీ రాయటం మొదలు పెట్టాను.
నేను రాసిన Short stories ఈనాడు, సాక్షి, స్వాతి, చతుర, విపుల లో పబ్లిష్ అయ్యాయి. కొన్ని యాప్స్ లో నవల్స్ కూడా రాస్తున్నాను.








చాలా బాగుంది. ఈ కథలోలా నాకెందుకు ఒక ప్రేమ కథ లేదు అని అనిపించేలా... జీవితం అంతా కళ్ళ ముందుకు తెచ్చారు. నా భార్యకి ఒక ప్రేమ లేఖ రాయాలి. ఉంటానండి. మీకు ధన్యవాదాలు.