top of page
Original.png

మనసు...


ఆపదలో భర్త ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న పల్లెటూరి భార్య సరోజ

MANASU - Telugu Emotional Family Story | Bhaskara Rao B. R. K. V.

మనసు... తెలుగు భావోద్వేగ కుటుంబ  కథ | బి ఆర్ కె వి భాస్కర రావు

Published in manatelugukathalu.com on 10 /08/2026


**పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని మొదటిసారి శివశంకర్‌కు సందేహం కలిగింది. భార్య సరోజకు సిటీ కల్చర్ తెలియదని స్నేహితుల మాటలు అతని మనసులో అనుమానాలను రేపాయి. కానీ కాలం అతనికి ఒక చేదు నిజాన్ని నేర్పించింది—సంస్కృతి అంటే మనం ఎలా తింటాం, ఎలా మాట్లాడతాం, ఎక్కడ పెరిగాం అన్నది కాదు; ఆపదలో మనిషి ఎలా స్పందిస్తాడో అదే అసలైన సంస్కృతి.


శివశంకర్ చివరగా తానిచ్చిన వెడ్డింగ్ కార్డు తీసుకున్న కుమార్, అతని భార్య సుజి అన్న మాటలు కారు డ్రైవింగ్ చేస్తున్నా పదే పదే గుర్తుకువస్తున్నాయి.


"అదేమిటి శివా!!? గ్రేట్ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చిన్నవయసులోనే ఉద్యోగం సంపాదించిన నువ్వు ఎంతో తెలివైనవాడివి అనుకున్నా... తీరా చూస్తే ఓ పల్లెటూరి అమ్మాయిని పెళ్లిచేసుకుంటావా?! ఆవిడ హైదరాబాద్ వచ్చి ఎన్నాళ్ళకు సిటీ కల్చర్ అలవాటు చేసుకుంటుంది? కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందేమో.."


వాళ్ళిద్దరూ అప్‌డేటెడ్ పెయిర్. ఇద్దరూ అదే యూనివర్సిటీలో జాబ్స్ చేస్తున్నారు. బుర్రనిండా రకరకాల ఆలోచనలు. తప్పు చేశానేమోననిపించింది మొదటిసారిగా. కానీ తప్పదు..

గతం ఓసారి కళ్ళ ముందు కదలాడింది..


శివశంకర్ తల్లిదండ్రులు హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న ఓ పల్లెటూరిలో ఉండేవాళ్ళు.


గతంలో వాళ్ళు కూడా గోదావరి జిల్లాలోనే ఉండేవారు. ఇక్కడ పనులు సరిగా లేకపోవడంతో అక్కడికి వెళ్ళిపోయారు.


శివశంకర్ ఒక్కడే కావటంతో తల్లిదండ్రులు ఎంతో గారంగా పెంచారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుండగా ఓ రోజు శివశంకర్ తల్లిదండ్రులు టౌన్‌కు వెళ్ళి బైకు మీద తిరిగొస్తుంటే టిప్పర్ గుద్ది వేయడంతో వాళ్ళిద్దరూ అక్కడికి అక్కడే అసువులు బాసారు…


ఒక్కసారిగా శివశంకర్ తన జీవితం ఒంటరిపాలవడంతో తల్లిదండ్రులు చనిపోయిన బాధ కన్నా ఏమి చేయాలో తోచక భయపడిపోయాడు.. నూనూగు మీసాల కొత్త యవ్వనం తనది.


ఆ సమయంలో నీకు నేను ఉన్నానని భుజం తట్టి ధైర్యం చెప్పాడు మేనమామ మాణిక్యం.


భార్య లేని మాణిక్యం తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఒక్కగానొక్క కూతురు సరోజను పెంచుతూ మారుమూల పల్లెటూరిలో ఉంటున్నాడు.


"తండ్రి లేనివారికి మేనమామే తండ్రితో సమానం అంటారు పెద్దలు. నువ్వేమీ బాధపడకు. ధైర్యంతో చదువు కోసాగించు.


నువ్వు ఎంతవరకు చదువు కోవాలని అనుకున్నావో అంతవరకు చదువు. 


డబ్బుల గురించి బెంగ పడకు నేను పంపుతాను" అని శివశంకర్ కు హామీ ఇవ్వటంతో మాణిక్యం దేవుడిలా కనిపించాడు.


అది మొదలు శివశంకర్ పట్టుదలగా చదివి డిగ్రీ, పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో చదివి ప్రొఫెసర్‌గా తాను కన్న కలల ప్రకారం అక్కడే ఉద్యోగం సంపాదించుకున్నాడు.


నడి సముద్రంలోని నావలా తయారైన తన జీవితాన్ని ఒడ్డుకు చేర్చిన మేనమామ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియక ఓ రోజు తనకు ఉద్యోగం వచ్చిందని చెప్పే నెపంతో వాళ్ళ ఊరు వెళ్ళాడు.


"చిన్నప్పుడే తల్లి దూరమవడంతో ఎలాగోలా టెన్త్ వరకు చదివించాను. నాక్కూడా వయసు మళ్లడంతో వంట వార్పు చేస్తూ ఆపై చదవడం కుదరక ఇంటిపట్టునే ఉండిపోయింది. 


ఆడపిల్లలందరూ డిగ్రీలు చదివితేగానీ పెళ్లిళ్లు కానీ ఈ రోజుల్లో పెద్దగా చదవని నీ మరదలిని ఎవరు చేసుకుంటారోనని బెంగపట్టుకుంది నాకు" అంటూ నర్మగర్భంగా నీ మరదలు అని బాధ్యత తనమీదే వేసి నువ్వు చేసుకోక తప్పదు అన్న మేనమామ మాటలలోని సారాంశం గమనించుకోలేని చిన్న వయసేమీ కాదు శివశంకర్ ది.


మరదలు సరోజేమీ అనాకారి కాదు, ఓ మోస్తరుగా ఉంటుంది, కాకపోతే పల్లెటూరి తీరు మారాలి. 


కొద్దిరోజులు పోతే అదే అలవాటు అవుతుందని నిర్ణయించుకుని తాను కూడా రుణవిముక్తుణ్ణి అవుతానని భావించి మాణిక్యంతో "మావయ్యా! సరోజ గురించి నువ్వేమీ దిగులు పడకు, నీకు సరోజకు ఇష్టమైతే తనను పెళ్లి చేసుకుంటాను" అన్నాడు.


దాంతో మాణిక్యం ఆనందానికి హద్దులు లేకుండా పోయింది

కారు గ్రౌండ్ ఫ్లోర్‌లో పెట్టి తన సింగిల్ రూమ్ అపార్టుమెంటులోకి వెళ్ళి తాను చేసింది కరెక్ట్ అని తనను తాను సమర్థించుకున్నాడు.


నెలరోజులు తిరిగేసరికి శివశంకర్, సరోజల పెళ్లి అతి వైభవంగా జరిగింది. తమతో వచ్చేయమని మాణిక్యాన్ని ఎంతో బ్రతిమాలినా రాలేదు.


భార్యతో కొత్తగా కాపురం పెట్టిన శివశంకర్ దంపతుల్ని డిన్నర్‌కు ఓ రోజు ఆహ్వానించారు కుమార్ దంపతులు.


పట్టుచీర కట్టుకుని తూరుపు సింధూర వర్ణం కుంకుమ పెట్టుకుని వాళ్ల ఇంటికి వెళ్ళాక ఇంటీరియర్ అంత మోడ్రన్‌గా ఉండటంతో ఆశ్చర్యపోయింది సరోజ. శివ మాట్లాడుతున్నా సరోజ ఎక్కువగా మౌనంగానే ఉంది.


"శివా! మీ వైఫ్ ను ఏమైనా మాట్లాడమను. ముత్యాలు రాలితే ఏరుకుంటాంలే, లేకపోతే పల్లెటూరి గబ్బిలం అనుకోగలరు" అని సుజి కొంచెం వ్యంగ్యంగా అనేసరికి సరోజ మనసు చివుక్కుమంది. కానీ అది బయటపడకుండా చిరునవ్వు నవ్వింది.


"మీరింకా పరిచయం లేదుగా అందుకనే మొహమాటం" అనేసి భార్య వైపు చూశాడు, అది ఒకటి మాట్లాడమన్నట్టుగా.


అప్పుడు కూడా సరోజ నుంచి నవ్వే సమాధానం అయ్యింది. కాసేపటికి డిన్నర్ ప్రారంభించాలని అనుకునేసరికి "బావా! చేతులెక్కడ కడుక్కోవాలి?" అని సరోజ కొంచెం గట్టిగా అనేసరికి ఆ దంపతులిద్దరూ పకాలున నవ్వేశారు. శివశంకర్‌కు సరోజ మీద కోపం వచ్చింది. 


సరోజ తప్ప మిగిలిన ముగ్గురు స్పూన్స్‌తో తింటుంటే సరోజ మాత్రం చేత్తో కలుపుకుని తినడం చూసి సుజి మొహం అదోలా పెట్టి శివ వైపు తక్కువ చేసినట్టు చూసింది.


అలాంటి సంఘటనలు నాలుగైదు సరోజతో జరిగేసరికి శివశంకర్ ఓ రోజు, "సిటీలో ఏమీ లేకపోయినా ఉన్నట్టు, అన్ని తెలిసినా తెలియనట్టు, మిగతావాళ్ళు ఏమి చేస్తే మనమూ అదే చేస్తే మనల్ని ప్రత్యేకంగా చూడరు. అదే వాళ్లకు భిన్నంగా చేస్తే పురుగులా చూస్తారు. ఒకవేళ మనం చేసేది తప్పైనా మనం చెప్పకూడదు. దాన్ని చెప్పడానికి ఎవరో ఒక పెద్ద రావాలి. అప్పటివరకు అది అలా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి.."

"మనం నటించడం నేర్చుకుంటే బ్రతకగలం అంటావు" అంటూ శివశంకర్ చెప్పబోయే వాక్యం పూర్తి చేసింది సరోజ నవ్వుతూ..


కొద్దిరోజుల తర్వాత వైస్ ఛాన్సిలర్ మనవరాలిపుట్టినరోజు వేడుకకు అందర్నీ పిలిచారు. 


శివశంకర్ భార్య తో సహా వెళ్ళేడు.


ఒక్కొక్కరుగా వెళ్ళి పాపపై అక్షింతలు వేస్తూ గిఫ్టులు ఇస్తున్నారు గౌరవంగా. వరుసలో వెళ్ళిన శివశంకర్ వి. సి. మనవరాలికి గిఫ్టు ఇచ్చేసి నమస్కరించాడు.


సరోజ వెంటనే వి. సి. చేతిలోని పాపను చొరవతో తీసుకుని లాలిస్తూ బుగ్గన ముద్దు పెట్టేసరికి అక్కడున్న అందరూ ఒకేసారి షాక్‌కు గురయ్యారు. వి. సి. కోపంతో శివశంకర్ ను చూశాడు.


శివశంకర్‌కు అయితే గుండె ఆగినంత పనయ్యింది. వెంటనే తేరుకుని "సారీ సార్.. సారీ సార్.. ఎక్స్‌ట్రీమ్లీ సారీ సార్" అంటూ సరోజ చేతిలోని పాపను ఆయనకు ఇచ్చేసి సరోజను అక్కణ్ణుంచి లాక్కొచ్చేశాడు.


వాళ్ల వెనకనే ఉన్న కుమార్ దంపతులకు నోట మాట లేదు. వాళ్ళు కూడా గిఫ్ట్ ఇచ్చేసి పరుగులాంటి నడకతో వీళ్ళ దగ్గరకొచ్చి "వాట్ మిస్టర్ శివ!! వాట్ ఈజ్ థిస్? నీ భార్య ఏమనుకుంటోంది? వి. సి. అంటే మాటలా? ఇంత పెద్ద పెద్ద ఫంక్షన్స్‌కు వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చెయ్యాలో చెప్పొద్దా?" అని సుజి మందలింపు ధోరణిలో అనేసరికి కోపంతో సరోజను తీసుకుని ఇంటికి వచ్చేశాడు.


 తాను చేసిందాంట్లో తప్పేమిటో అర్థం కాక అమాయకంగా భర్తను చూసింది. ఇంట్లోకి వెళ్ళిన వెంటనే చెళ్లున చెంప మీద కొట్టి "నువ్వు తక్షణం మీవూరు వెళ్ళిపో. లేదా నీ జీవితంలో నాతో మాట్లాడకు, నావైపు చూడకు, నాగదిలోకి రాకు" అనేసి బెడ్రూంలోకి వెళ్ళి ధడేల్న తలుపేసుకున్నాడు.


"చిన్న పిల్లను పుట్టినరోజు పూటా ఎత్తుకుని ముద్దాడటం తప్పా బావా.. ఇంకెప్పుడూ ఇలా చేయను. దయచూపించి తలుపు తీయి బావా... నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతాను

బావా.. నా జన్మలో నీతో ఎక్కడికీ రాను బావా.. నన్ను క్షమించు బావా" అంటూ తెల్లవార్లూ తలుపు దగ్గర ఏడుస్తూ ఉండిపోయింది సరోజ.


అది మొదలు చాలారోజుల పాటు శివశంకర్ భార్య వైపు కన్నెత్తి కూడా చూడలేదు.


ఓ రోజు సడన్ గా ట్విన్ సిటీస్ మొత్తం అలెర్ట్ చేసే ప్రకటన ఒకటి వెలువడింది.

"సిటీలో చాలా ప్రమాదకరమైన పొంగు లాంటి వ్యాధి సిటీ అంతా ప్రబలింది. అది చాలా ప్రమాదకరమైన వ్యాధి. తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాపిస్తుంది. 

వళ్ళంతా పొక్కులు మొదట్లో చిన్నగా వచ్చి కొన్ని గంటల్లో పెరిగి పెద్దవి అయి గాయాలుగా మారిపోతాయి.


ఈ వ్యాధి వైరస్ వలన వస్తుంది. దీనికి మందు లేదు. సిటీ లిమిట్స్ అన్నీ మూసివేయబడ్డాయి. దానివల్ల బయటకు వెళ్ళడానికి వీల్లేదు. వేరే ప్రదేశంలోని ప్రజలు ఈ వ్యాధి రాకుండా జాగ్రత్తపడటమే దీని ఉద్దేశ్యం.


ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ఏవీ కూడా పనిచేయవు. వ్యాధిగ్రస్తులు ఇంట్లో ఉండాలి. వారు ప్రత్యేక గదిలో ఉంటే మిగిలిన ఇంటిలోని సభ్యులకు వ్యాధి రాదు. వ్యాధి వచ్చినవారిని తాకినా, వారితో మాట్లాడినా వెంటనే వారికి సోకుతుంది. మందులు ఇంకా కనిపెట్టని ఈ వ్యాధి వచ్చినవారు మరణించడం కూడా జరుగుతుంది.


 ప్రజలు ఈ వ్యాధి రాకుండా జాగ్రత్తగా ఉండటమే మందు."


ఆఫీసులు, విద్యాసంస్థలు ఒకటేమిటి అన్నీ మూతపడ్డాయి.


రెండు రోజులుగా కుళాయి నీళ్లు రాకపోయేసరికి ఆర్. ఓ. నీళ్ళైనా తెచ్చుకోవచ్చునని సరోజ ఎంత చెప్పినా వినకుండా శివశంకర్ టిన్ను తీసుకుని బయటకు వచ్చాడు. అక్కడ లైనులో చాలా మంది ఉన్నారు. వాళ్లతోనే ఉండి నీళ్లు తీసుకు వచ్చిన రాత్రే శివశంకర్‌కు ఆ వ్యాధి సోకింది.


తన గదిలో తలుపేసుకొని ఉండిపోయాడు.


జ్వరంతో బాధలు తట్టుకోలేక ములిగేసేవాడు.


తలుపు తీసి ఆహారం కానీ, మంచినీళ్ళు కానీ సరోజ అందిస్తే వద్దని కోపంగా అరిచేవాడు.


రెండు రోజుల తర్వాత ఉదయమే సరోజ నిద్ర లేచేసరికి శివశంకర్ గదిలోంచి ఏ ములుగు వినిపించక పోవడంతో అనుమానం వచ్చి కిటికీలోంచి లోపలకు చూసింది.


ఒక్కసారిగా గుండె ఆగినంత పనైనా సరోజ తలుపులు బాదింది ఏడుస్తూ...అయిన శివశంకర్ లేచి తలుపు తీయక పోయేసరికి ఏమిచేయాలో తోచక కిచెన్‌లో ఉన్న చిన్న రోలు తీసుకు వచ్చి దానితో తలుపు విరగ్గొట్టి లోపలకు వెళ్ళి అచేతనంగా మంచంమీద పడి ఉన్న భర్తను రోదిస్తూ కుదిపేసింది. 


శ్వాస ఉంది కానీ చలనం లేదు శివశంకర్ శరీరంలో..


ఒళ్ళంతా చల్లబడి ఉంది.


ఏడుస్తూ దేవుణ్ణి తలచుకుని భర్తను వెల్లకిలా పడుకోపెట్టి రెండు అరిచేతులు కలిపి బలంగా

గుండెల మీద నాలుగు గుద్దులు గుద్దింది.


అయినా భర్తలో కదలిక లేకపోవడంతో స్కూల్లో చెప్పింది గుర్తుకువచ్చి తన నోటి ద్వారా అతని నోటిలోకి శ్వాసను ఇచ్చింది. తనకు ఓపిక తగ్గేవరకు విసుగు విరామం లేకుండా అందిస్తూనే ఉంది. సరిగ్గా అరగంటకు కళ్ళు తెరిచాడు శివశంకర్.



ఉబికి వస్తున్న దుఃఖంతో వాళ్ళంతా చెమటలతో తడిసిపోయున్న భార్యను చూసి ఆశ్చర్యపోయి తనను తాను మర్చిపోయి రెండుచేతులు జోడించేసరికి,"బావా ఏవిటి నువ్వు చేస్తున్నది?" అని చేతుల్ని విడదీసింది.


"నన్ను క్షమించస్తావా సరూ?"


"అంత పెద్దమాటలెందుకు బావా.నువ్వే నన్ను క్షమించాలి. ఎందుకంటే నీ ఆజ్ఞను ధిక్కరించి నీగదికి వచ్చాను"


"ఎంతమాట అన్నావు సరూ! నువ్వు టైముకు రాకపోతే నేనేమై పోయేవాణ్ణి. ఇన్నాళ్లు నీ మంచి మనసు అర్థం చేసుకోలేక ఎన్నో మాటలు అన్నాను. చివరకు చెయ్యి కూడా చేసుకుని పశువులా ప్రవర్తించాను. సంస్కృతి "


అనేది పుట్టుకతో రావాలి కానీ నేర్చుకుంటే వచ్చేది కాదని నిరూపించావు.


నువ్వు నా వ్యాధి గురించి తెలిసినా అంత సాహసం చేసావు ఒకవేళ నీకు ఏమైనా అయితే?"


"నువ్వు బ్రతికి ఉంటావుగా బావా నేనేమైనా పర్వాలేదు"


శివశంకర్ నేత్రాలు కన్నీటితో అప్పటికే  హత్తుకుని ఉండటం వల్ల ఆమె పాపిటను అభిషేకించాయి.


అంతలో ఫోన్ రింగయ్యేసరికి అవతలనుంచి "హలో శంకర్! నేను కుమార్‌ను.


నీకు ఎలా ఉంది? నా భార్య నాకు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వడం లేదు. గదిలో నేను ఏడుస్తూ ఉంటే తాను మాత్రం కావలసినవన్నీ వండుకుని తిని టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. 


వాష్ బేసిన్‌లోని నీళ్ళు తాగుతూ బ్రతుకుతున్నాను..." అని ఇంకా ఏదో చెప్పబోతుంటే ఫోన్ కట్ చేసింది సరోజ......




*** 

బి ఆర్ కె వి భాస్కర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


బి ఆర్ కె వి భాస్కర రావు

రచయిత పరిచయం: బి ఆర్ కె వి భాస్కర రావు


ప్రతి ఒక్కరు చెప్పే సాధారణ సాకే అనుకోకపోతే నాక్కూడా తక్కువ ఖాళీ వల్ల ఎక్కువ కథలు రాయలేకపోయాను. బీఎస్సీ చదివి తాత తండ్రుల వారసత్వంగా వచ్చే వైద్యం చేపట్టి పల్లెటూరులో ఆర్ఎంపీ గా స్థిరపడి అడపా దడపా కథలు రాస్తూ గడుపుతూ ఉంటాను.ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి,అంజలి,గీతాంజలి వంటి వీక్లీ లలో కథలు,వ్యాసాలు,కవితలు నావి అచ్చయ్యాయి.

భారతం ,భాగవతం లాంటి పురాణాలు అంటే చెవి కోసుకుంటాను.

రచయితలలో కొడవటిగంటి కుటుంబం రావు,చాసో,బుచ్చిబాబు నాకు ఇష్టమైన వారు.

ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు.మరి ఇప్పుడో సెల్ ఫోన్ హస్త భూషణం అనే రోజులొచ్చాయి.

పుస్తకాలు తీరిగ్గా చదివే ఓపిక సమయం లేనిఈ రోజుల్లో పాఠకుల మనసును గ్రహించి వాళ్ళను రంజింప చేసే ప్రయత్నం లో మన తెలుగు కథలు యాజమాన్యం వారు రచయితలకు గొప్ప ప్లాట్ఫారం ఏర్పాటు చేయడం అభిందనీయం. వీక్లీలు పుస్తక రూపంలో ఇంచుమించు కనుమరుగయ్యే నేటి రోజుల్లో రచయితలకు దిశ ,దశ చూపించినందుకు కృతజ్ఞతలు

నాపేరు బి ఆర్ కె వి భాస్కర రావు

ఊరు పాలి

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page