'Ekadasi' New Telugu Story
Written By K. Lakshmi Sailaja
ఏకాదశి తెలుగు కథ
రచన: కే. లక్ష్మీ శైలజ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
“ఏకభుక్తే మహాయోగే, ద్విభుక్తే మహా భోగే, త్రిభుక్తే మహారోగే”
“అంటే ఏంటి నాన్నమ్మా” అక్కడే సోఫాలో కూర్చొని పాలకాయలు నములుతున్న కౌశల్ అడిగాడు. వాడి తమ్ముడు త్రివిక్రమ్ కూడా పక్కనే కూర్చొని మైసూర్ పాక్ ను తినే పనిలో వున్నాడు.
“అంటే 'రోజుకు ఒకపూట భోజనం చేస్తే, ఎటువంటి జబ్బులు రాకుండా మహారాజులాగా బ్రతకవచ్చు. రెండు పూటలా భోజనంచేస్తే అప్పుడప్పుడూ అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉండాలి. ఇక మూడు పూటలా భోజనం చేస్తే జబ్బులన్నీ తెచ్చుకొని రోగిలాగా బ్రతకాలి’ అని అర్ధం” అన్నాను నేను.
“ఈ రోజు ‘వైకుంఠ ఏకాదశి’ పండ్లు మాత్రమే తింటాన’’ని చందూ, చందనా లతో చెపుతూ, నేను పై మాట అనడం విని, అడిగాడు కౌశల్.
“నేనూ రేపు ఉపవాసం ఉంటానత్తయ్యా, ఆఫీస్ ఉండదుకాబట్టి” అంది చందన. “ఎప్పుడంటే అప్పుడు ఉపవాసం చెయ్యకూడదు చందనా. ఏకాదశి రోజు మాత్రమే చెయ్యాలి. ద్వాదశి రోజు ఉదయాన్నే భోజనం చేయాలి. ఉపవాసం చేసే ముందురోజు రాత్రి కూడా భోజనం చేయకూడదు” అన్నాను నేను.
“అయితే రోజంతా ఉండలేను. ఉదయం పాలు, పండ్లు తిని, మధ్యాహ్నం భోజనం చేసి, రాత్రికి టిఫన్ తింటాను” అంది చందన.
“ఈసారి నేను కుడా వుంటాను. మేము మా డైట్ ప్లాన్ లో ఒక్కోరోజు పండ్లు తిని ఉంటాము కదా” అన్నాడు చందు. చందుకు ‘వర్క్ ఫ్రం హోమ్’ కాబట్టి ఇంట్లోనే పని చేస్తాడు.
“అలాగేలే. అయితే ‘జీవన జ్యోతి ‘ సినిమాలో ‘అల్లు రామలింగయ్య’ చేసినట్లు, గంటకో టిఫన్ తిని చెయ్యకూడదు. ఈ రోజు ఇద్దరూ తలస్నానం చెయ్యండి. ఉదయం, మధ్యాహ్నం పాలు పండ్లు తిని, రాత్రికి భోజనం చేస్తే ‘నక్తం’ అంటారు. కార్తీకమాసం లో సోమవారం ఇలా చేస్తాము. ఈ రోజు నువ్వు ఆఫీస్ నుంచి వచ్చి, టిఫన్ తిను చందనా. చందూ కూడా అప్పుడే టిఫన్ తింటాడు” అన్నాను నేను.
“ఎన్ని గంటలు ఉండగలిగితే అన్ని గంటలే ఉండండి. తర్వాత కూడా శరీరాన్ని శోషించకుండా, సాత్వికమైన ఆహారమే తినాలి. అప్పుడప్పుడూ జీర్ణవ్యవస్థకు విశ్రాంతి ఇవ్వడం కోసం ఇలా ఉపవాసం చెయ్యాలి. మీ లాప్టాప్ ను షట్ డౌన్ చేసినట్లన్నమాట. మా లాంటి పెద్దవాళ్ళమైతే షుగర్ ప్రాబ్లెమ్ ఉంటే పూర్తిగా ఉపవాసం ఉండీ ఆరోగ్య సమస్య తెచ్చుకోకూడదు” అని చెపుతూ ఉండగా, “ఉపవాసం ఎందుకుండాలమ్మ గారూ” అని ఇంట్లో పని చేసే లక్ష్మి అడిగింది. “కాయకష్టం చేసుకునే నీ లాంటి వాళ్ళు ఉపవాసముండి ఇబ్బంది పడకూడదు లక్ష్మీ, తినగలిగి ఉండి కూడా తినకుండా ఉండగలిగేవాళ్ళు.. ఆకలి బాధను అనుభవించడానికి ఉపవాసం చెయ్యాలి” అని చెప్పాను.
సరేననుకొని ఆరోజు ఉదయం అందరమూ ఉదయం టిఫన్ తినలేదు. పిల్లలకు దోశెలు పోసి ఇచ్చాను. మేము పాలు తాగాము. ఒక పుచ్చకాయ తరిగి, కొంచెం తెల్ల ద్రాక్ష తో పాటు ఒక అరటి పండు కూడా అందరం తిన్నాము. చందన మధ్యాహ్నానికి దోస పండు, ఆపిల్ పండు తీసుకెళ్ళింది. చిన్నఫ్లాస్క్ లో, పాలల్లో బూస్ట్ కలిపి తీసుకెళ్ళింది.
చందు పిల్లలను కారులో తీసుకెళ్ళి స్కూల్లో వదిలి వచ్చాడు. నేను దేవుళ్ళను పులకాపన చేసి, అంటే దేవుళ్ళ పటాలన్నీ తుడిచి, గంధం, కుంకుమా బొట్లుగా పెట్టి, విగ్రాహాలను తుడిచి, బొట్లుపెట్టి దీపారాధన చేసి ‘విష్ణుసహస్రనామం’ చదువుకొని, దేవునికి టెంకాయ కొట్టి, నానబెట్టిన పెసర పప్పును కూడా నైవేధ్యంగా పెట్టాను. పదకొండు గంటలకు పిల్లలు స్కూల్ నుండి వచ్చి, తీర్ధం తీసుకొని, కొబ్బెర ప్రసాదంగా తిన్నారు. మేము నానబెట్టిన పెసరపప్పులో కొంచెం పచ్చికొబ్బెర తురిమి వేసుకొని, పైన నిమ్మకాయ పిండుకొని తిన్నాము.
పన్నెండు గంటలకు చందు ఒక కొబ్బరి బొండం తాగాడు, పిల్లలతో పాటు. నేను, చందు మధ్యలో ఇంకొక గ్లాస్ పాలు తాగాము. మధ్యాహ్నం మళ్ళీ కొంచెం పండ్లు తిన్నాము.
పిల్లల భోజనాలు పూర్తయిన తరువాత కొద్దిసేపు హాల్ లో కింద చాప వేసుకొని పడుకొని, పిల్లలకు కధలు చెపుతూ కాలం గడిపాను.
సాయంత్రం చందన రాగానే మళ్ళీ అందరం పాలు తాగాము. స్నానం చేసి దీపారాధన చేసి, ఇంట్లో పనులు చేసుకుంటూనే ఫోన్లో ఇంకొకసారి విష్ణుసహస్రనామం విన్నాము. పిల్లలకు కొంచెం అన్నం, చారు చేసి, మాకు జీడిపప్పు వేసి, గోధుమ రవ్వ తో ఉప్మా చేసి పెట్టి, అందరం పక్కవీధిలోని వెంకటేశ్వర స్వామి గుడికివెళ్ళి హారతి ఇప్పించుకొని, ప్రసాదం గా కలకండ తీసుకొని వచ్చాము.
“అమ్మా, బియ్యపురవ్వ ఉప్మా చెయ్యకూడదూ?” అన్నాడు, చందు టిఫన్ తినబోతూ.
“చందూ, ఈ రోజు బియ్యం తో చేసిన వస్తువులను తినకూడదు. పురాణాల ప్రకారం ఈ రోజు బియ్యం లో మురాసురుడనే రాక్షసుడు ఉంటాడట. సైన్స్ ప్రకారం ఈ రోజు సూర్యుని కిరణాలు భూమికి దగ్గరగా వచ్చి, మనం తిన్న ఆహారాన్ని జీర్ణం కానివ్వవట. అందుకని త్వరగా జీర్ణమయ్యేవి తినాలట” అని చెప్పాను నేను.
“అవునా! సరే అయితే, ” అన్నాడు చందు. మామూలుగా అయితే చందుకు బియ్యపు రవ్వ ఉప్మా అంటే ఇష్టం
“అందరికీ నచ్చేట్లు బాగా చెప్పారత్తయ్యా, ” అంది చందన.
“మా అమ్మ చెపుతూ ఉండేది. అప్పుడు విన్నాను. ఆమె ప్రతి ఏకాదశి రోజు ఉపవాసం ఉండేది” అని నేను అనగానే “నెలకు రెండు, సంవత్సరానికి పన్నెండూనా?” అని చందన ఆశ్చర్యంగా అంటే ”అవును మధ్యలో ‘పౌర్ణమిలు’ కూడా” అన్నాను నేను నవ్వుతూ. “అది వాళ్ళ ఆరోగ్య రహస్యం” అన్నాను మళ్ళీ.
“అవును. అందుకే వాళ్ళు బాగా వయసు వచ్చే వరకు ఆరోగ్యంగా వుండేవాళ్ళు, ” అన్నాడు చందు.
రాత్రి త్వరగా పడుకొని ఉదయం త్వరగా లేచాము. ద్వాదశి రోజు తల స్నానం చెయ్యకూడదు కాబట్టి మామూలు స్నానం చేసి, ఆ రోజు పండుగలాగా పాయసం, పులిహోర, అప్పడాలు కూడా చేసి స్వామికి నైవేద్యం పెట్టి, మేమందరం ఉదయం తొమ్మిదికే భోజనం చేశాము. చందు, చందనలకు మధ్యాహ్నానికి అటుకుల తిరగమోత చేశాను. ఉపవాసం అయిన తెల్లవారి ఒక పూటే భోజనం చెయ్యాలి కనుక నేను మధ్యాహ్నం ఒక ఆపిల్ పండు తిని, రాత్రికి అందరితో పాటు టిఫన్ చేశాను.
ఆ విధంగా ఉపవాసాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని స్వామికి నమస్కారాలు సమర్పించుకున్నాము.
***
కే. లక్ష్మీ శైలజ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : నా పేరు K. లక్ష్మీ శైలజ.
నెల్లూరు లో ఉంటాను.
నేను ఎం. ఏ. ఎం.ఫిల్ చేశాను.
ఇప్పటి వరకు 40 కథలు , పది కవితలు ప్రచురితమైనవి.
జూన్ 2022 న తానా గేయతరంగాలు లో గేయం రచించి పాడటమైనది.
యూట్యూబ్ లో కథలు చదవడం ఇష్టం.
Comments