top of page
Original.png

ఎవరి బంధం ఎంతవరకో?


విశాఖ బీచ్ రోడ్డుపై కన్నీటి కళ్లతో నిలుచున్న నిర్మలమ్మకు అండగా విక్కీ, శ్యామ్ నిలబడి ఉన్న భావోద్వేగ దృశ్యం; రక్తసంబంధం కంటే మానవత్వం గొప్పదనే సందేశాన్ని ప్రతిబింబించే చిత్రం.
విశాఖ బీచ్ రోడ్డుపై కన్నీటి కళ్లతో నిలుచున్న నిర్మలమ్మకు అండగా విక్కీ, శ్యామ్ నిలబడి ఉన్న భావోద్వేగ దృశ్యం; రక్తసంబంధం కంటే మానవత్వం గొప్పదనే సందేశాన్ని ప్రతిబింబించే చిత్రం.

Evari Bandham Enthavarako - Telugu Emotional Family Story | Madhupatra Sailaja Uppaluri

ఎవరి బంధం ఎంతవరకో?తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | మధుపత్ర శైలజ ఉప్పలూరి  

Published in manatelugukathalu.com on 02/06/2026


“అమ్మా! మీ ప్రక్కన సీటు ఖాళీయేనా? ఎవరైనా ఉన్నారా?” నిర్మలమ్మని అడిగాడో యువకుడు. రోజూ రద్దీగా ఉండే కాకినాడ నుండి విశాఖపట్నం వెళ్ళే రైలు ఆరోజెందుకో కాస్త ఖాళీగా ఉంది.


“ఎవరూ లేరు, వచ్చి కూర్చో బిడ్డా,” అంటూ ఆప్యాయం నిండిన గొంతుతో ఆమె పలికిన మాటలకు అనాథగా బ్రతుకుతున్న విక్కీకి మనస్సంతా పులకించిపోగా, వచ్చి ఆ తల్లి ప్రక్కన కూర్చున్నాడు.


“ఏ ఊరు బాబూ మీది?” అంటూ నిర్మలమ్మ అడిగిన దానికి విక్కి, “అమ్మా! నేను విశాఖపట్నంలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఆఫీసు పనిమీద కాకినాడ వచ్చి, పని పూర్తిచేసుకుని తిరిగి విశాఖకు వెడుతున్నాను. మీరు ఎందాకా వెడుతున్నారమ్మా?” అని కుశలమడిగాడు విక్కి.


“మాది ముమ్మిడారం గ్రామం. నా కొడుకు, కోడలు, మనవడితో కలసి విశాఖపట్నంలో కాపురముంటున్నాడు. వాళ్ళ దగ్గరకే నేను వెడుతున్నాను,” అని చెప్పింది నిర్మలమ్మ.


“నేను తెచ్చిన చద్దిబువ్వ ఉంది. ఇద్దరం కాస్త తిందాం రా బాబు,” అంటూ తాను తెచ్చిన చద్దిమూట విప్పి ఆకులో అన్నం, ఆవకాయ పచ్చడి వేసి విక్కీ చేతిలో పెట్టింది నిర్మలమ్మ. “అమ్మ పెట్టిన అన్నం అమృతంతో సమానమంటారు కదా! కాస్త ఎంగిలి పడు. రాత్రి ఏవేళకు తిన్నావో, మనం ఊరికి చేరేసరికి బువ్వవేళ దాటిపోతుంది. తిను,” అంటూ అనురాగపు మాటలతో విక్కి కడుపు నింపింది నిర్మలమ్మ.


“చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవటంతో నా తాతగారి దగ్గర పెరిగాను నేను. ఆయన నన్ను డిగ్రీ దాకా చదివించి, తనకు తెలిసిన వారి సాయంతో పోర్ట్ ఆఫీసులో నౌకరి ఇప్పించాడు. రెండు గదులను అద్దెకు తీసుకుని తాతగారితో కలసి ఉంటూ, నా బ్రతుకు బండిని లాగించేస్తున్నాను. ఈ మధ్యనే తాతగారు కాలం చేయటంతో నేను అనాథగా మిగిలిపోయాను. తాతలేని ఇంటిలో ఒంటరిగా ఉండలేక, నా స్నేహితుడు శ్యామ్‌తో కలసి ఉంటున్నాను,” అంటూ నిర్మలమ్మతో తన గతం గురించిన కబుర్లు పంచుకున్నాడు విక్కి.


“అమ్మా! మీ అబ్బాయి పెద్ద ఉద్యోగమే చేస్తున్నాడా విశాఖలో?” అని అడిగాడు విక్కి.


“మీ తాతగారు నిన్ను చదివించినట్లుగానే, నేను కూడా మా వాణ్ణి పెద్ద చదువులే చదివించాను. ఉన్న రెండెకరాల పొలం అమ్మి, విశాఖలోని పెద్ద కాలేజీలో చేర్పించాను.


ఊళ్ళోవాళ్ళంతా “మా నిర్మలమ్మ పొలం అమ్మి మరీ తన కొడుకుని చదివించుకుంటోంది. ఇక చదువు పూర్తయిన తరువాత వాడు మంచి ఉద్యోగంలో చేరి లక్షలు లక్షలు సంపాదించి, తల్లి అమ్మిన పొలం తిరిగి కొనిపెడతాడు. నిర్మలమ్మ భాగ్యమే భాగ్యం,” అంటూండేవారు.


పొలం అమ్మేయటంతో ప్రస్తుతం ఇల్లు గడవటానికి, నా ఖర్చుల గురించి చిన్న కిరాణా కొట్టు నడుపుకుంటున్నాను. గతంలో మా దగ్గర పనిచేసిన పాలేరు పిల్లలు నా అవసరాలకు సాయం చేస్తున్నారు.


చదువురానిదాన్ని కదా, వాడేమి ఉద్యోగం చేస్తున్నాడో నాకు పూర్తిగా తెలియదు. కానీ స్టీల్ ప్లాంట్‌లో మంచి ఉద్యోగమని చెప్పాడు. ఉద్యోగంలో చేరినా, చాలా సంవత్సరాలు మా వాడు నన్ను చూడటానికైనా మా ఊరు రాలేదు.


రెండేళ్ళ క్రితం ఓ రోజు పెద్ద కారులో భార్యను, చంటి బిడ్డను వెంటబెట్టుకుని వచ్చిన నా కొడుకు, “అమ్మా! ఈమె నీ కోడలు. వాళ్ళ నాన్నగారు మా ఆఫీసులో జనరల్ మేనేజర్. వాళ్ళు బాగా ధనవంతులు. మా ఇద్దరికీ చదువుకునే రోజులనుండి పరిచయం ఉంది. అది ప్రేమగా మారి, పెళ్ళి వరకు వెళ్ళింది. నాకు కంపెనీలో ఉద్యోగం రావటంలో కూడా సాయమందించిన మామగారు, మా పెళ్ళి వెంటనే జరిపించేశారు. వచ్చి నిన్ను తీసుకువెళ్ళే వ్యవధి కూడా నాకు చిక్కలేదు.


ఆ తరువాత కొత్త ఉద్యోగం, కొత్త సంసారాల గొడవలో పడి నీకు ఈ విషయమే చెప్పలేదు. అందుకే ఉన్న పనులన్నింటినీ పక్కన పెట్టి నీకు కోడల్ని, మనవణ్ణి చూపించటానికి బయలుదేరి వచ్చాను. మనవడికి ఇప్పుడు 5వ నెల వచ్చింది. ఈ కారు మా పెళ్ళి సందర్భంగా మామగారు నాకు ఇచ్చిన కానుక,” అంటూ కిరణ్—అదే మా అబ్బాయి—సంతోషంగా కబుర్లు చెప్తున్నాడు.


“పోనీలే నాయనా! కోడలు బంగారు బొమ్మలా ఉంది. నా దిష్టే తగిలేలాగుంది,” అంటూ చుట్టుప్రక్కల వాళ్ళను పిలిచి కోడలిని, మనవణ్ణి చూపించి మురిసిపోయాను. పిల్లలకి ఇష్టమైన పిండి వంటలు వండి వారికి భోజనం పెట్టాను. రోజంతా నాతోనే మా వాడు ఉన్నా, నా కోడలు నాతో ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం చాలా ఆశ్చర్యమనిపించింది.


“కలవారింటి అమ్మాయి కదా, ఈ పల్లెటూరి, చదువురాని అత్తమ్మ, ఆమెకు నచ్చినట్లుగా లేదని ఆమె ముఖంలో కనిపించిన చిరాకు, విసుగులు నాకు తెల్పకనే తెలిపాయి. ఏదో చిన్న పిల్లని సర్దిచెప్పుకున్నాను. నన్ను చూడటానికి అంత దూరం నుండి పిల్లవాడితో కలసి వచ్చింది అదే పదివేలు,” అని సంతోషపడ్డాను.

మా వారు నాకోసం చేయించిన గొలుసు మనవడి మెడలో వేసి ఆనందంతో పొంగిపోయాను. సాయంత్రం కాగానే “అమ్మా, నాకు రేపు ఆఫీసులో ముఖ్యమైన మీటింగ్ ఒకటుంది. మరి మేం బయలుదేరుతాం,” అంటూ ఓ అయిదు వేల రూపాయలు నా చేతిలో పెట్టి “మంచి చీరలు కొనుక్కో అమ్మా,” అని భార్యా, పిల్లాడితో కలసి వెళ్ళిపోయాడు కిరణ్.


వాళ్ళ కారు వెళ్ళగానే వాడలోని వారందరూ వచ్చి “మీ వాడు పెద్ద ఉద్యోగస్తుడయ్యాడుగా. అక్కడ ఇల్లు కూడా కట్టుకున్నారట. ఈసారి వచ్చినట్లుగానే, ఎప్పుడో హఠాత్తుగా వచ్చి నిన్ను కూడా తీసుకువెడతాడు నిర్మలమ్మా. అక్కడకు వెళ్ళగానే మమ్మల్ని మర్చిపోకు,” అంటూ సరదాగా మాట్లాడుకున్నారు.


“అంత భాగ్యమా నాకు?” అంటూ కిరణ్ తెచ్చిన మిఠాయిలు, పండ్లు వచ్చిన అందరికీ ఇచ్చి పంపించాను. చూస్తూండగానే క్యాలెండర్‌లోని కాగితాలన్నీ తిరిగిపోయి కొత్త క్యాలెండర్ గోడపైకి చేరింది.


ఓ రోజు మనవడు కలలోకి వచ్చి, అదే పనిగా గుర్తుకొస్తూంటే టెలిఫోన్‌బూత్‌కెళ్ళి కిరణ్‌కు ఫోన్ చేయించాను. వాడే మాట్లాడాడు. “అమ్మా! ఎలా ఉన్నావు? నాకీ మధ్యన ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది. అసలు తీరుబడి దొరకటం లేదు. కోడలికి పిల్లవాడితో క్షణం ఖాళీ దొరకదు. అందుకే నీ దగ్గరికి రాలేకపోతున్నాం,” అన్నాడు.


“పోనిలే నాయనా! నీ ఉద్యోగంలో ఎంత కష్టముంటుందో నాకేం తెలుస్తుంది. నాకే మనవణ్ణి చూడాలని మనసు పీకుతోంది. నేనే మీ దగ్గరకొచ్చి నాలుగు రోజులుండి, బాబుతో ఆడుకుని తిరిగి మన ఊరు వచ్చేస్తాను. మన పాలేరుతో రైలు టికెట్టు కొనిపించుకుని రమ్మంటావా?” అని ఆర్తితో అడిగాను.


కిరణ్ అంతా విని “సరే నీ మాటెందుకు కాదంటాను. నీవు వచ్చే ముందు నాకు ఫోన్ చేస్తే నేనే కారు తీసుకుని స్టేషన్‌కు వచ్చి నిన్ను ఇంటికి తీసుకువెడతాను,” అన్నాడు. అందుకే వాడికి ఇష్టమైన పిండి వంటలన్నీ తయారుచేసుకుని ఇలా బయలుదేరాను,” అంటూ తన ప్రయాణం గురించి విక్కీకు చెప్పింది నిర్మలమ్మ.


“ఉన్న ఒక్కగానొక్క కొడుకు పాపం ఈ తల్లిని ఒంటరిగా పల్లెటూరిలో వదిలి ఎంత పెద్ద ఉద్యోగం చేస్తే మాత్రం ఏం లాభం? చూసి ఆనందించేవారు లేని ఆ కార్లు, డబ్బు, ఇల్లు వంటి వైభోగాలెవరికోసం?” అనాథగా మారిన విక్కి మనసు బాధపడుతూ ఆక్రోశించింది.


“విక్కీ బాబూ! ఇటు చూడు,” అంటూ ఎవరూ చూడకుండా ఉండటం కోసం తన చీరకొంగును బ్యాగ్‌పై కప్పి అందులోని వెండి గ్లాసు, చిన్న కంచాలను చూపించి, “వీటిని నా మనవడి కోసం కొన్నాను. అందుకోసం నా మంగళసూత్రాలను అమ్మేశాను. చెట్టంత మనిషే పోయిన తరువాత ఆ సూత్రాలతో నాకింక పనేముంటుంది? మనవడు ఈ గ్లాసుతో పాలు తాగుతూ, కంచంలో అన్నం తింటూంటే చూస్తూ పొందే ఆనందం ముందు ఆ సూత్రాలు లేవనే ఆలోచనే రాదుగా,” అంది నిర్మలమ్మ.


నిర్మలమ్మ కొడుకు పైన చూపిస్తున్న ప్రేమకు విక్కీకి మనస్సు ఆనందంతో పొంగిపోతోంది. “అమ్మా, నీ కొడుకు ఎంత అదృష్టవంతుడమ్మా! మీరిక విశాఖలో మీ కిరణ్ ఇంటిలోనే ఉండిపొండి. హాయిగా మనవడి ఆటపాటలను చూస్తూ వాడికి కథలను చెపుతూ, నిదురపుచ్చే వేళ లాలిపాటలను పాడుతూ మీ సరదాలనన్నింటినీ తీర్చుకోండి,” అన్నాడు విక్కి.


“మంచి మాటన్నావు నాయనా! నా మనస్సులోని ఆశను కళ్ళముందుంచావు. కానీ నాకు అంత అదృష్టం ఉందా బాబు? ఎందుకంటే నా కోడలికి నేనంటే చిన్నచూపని నా దగ్గరకు వచ్చినప్పుడే అర్థమయ్యింది. నేను పల్లెటూరి దానిని, పేదరాలిని కావటంతో తనకి నచ్చలేదనుకుంటాను. అందుకే ఏదో చుట్టపుచూపుగా వెళ్ళి, నాలుగు రోజులుండి మనవడితో నా సరదాలను తీర్చుకుని రావాలనుంది అంతే,” అంది నిరాశ నిండిన గొంతుతో నిర్మలమ్మ.


రైలు విశాఖ చేరేసరికి మధ్యాహ్నం ఒంటిగంటయ్యింది. రైలు దిగి అక్కడే బెంచ్‌ మీద కూర్చుంది నిర్మలమ్మ, కిరణ్ కోసం ఎదురుచూస్తూ. “మీ అబ్బాయి వచ్చేదాకా నేను మీకు తోడుగా ఉంటాను,” అంటూ ఆమె ప్రక్కనే కూర్చున్నాడు విక్కి.


“నా కోసం నీ పనులనెందుకు పాడుచేసుకుంటావు బాబు?” అంది నిర్మలమ్మ.


“మీ అబ్బాయి వచ్చేస్తాడుగా, ఒకవేళ రాకపోతే మీకు ఇబ్బంది అవుతుంది. అందుకే నేను మిమ్మల్ని మీ అబ్బాయికి అప్పగించిన వెంటనే ఆఫీసుకెడతానమ్మా,” అన్నాడు విక్కి.


ఒక పది నిమిషాలకే “అమ్మా! ఇక్కడున్నావా! నేను ప్లాట్‌ఫాం ఆ చివరనుండి నీ కోసం వెతుకుతున్నాను. అందుకే ఆలస్యమయ్యింది,” అంటూ నిర్మలమ్మ దగ్గర బ్యాగ్ అందుకున్నాడు కిరణ్.


“వీడే మా అబ్బాయి కిరణ్,” అంటూ విక్కీకు కిరణ్‌ను పరిచయం చేసింది నిర్మలమ్మ. “అమ్మా! మరి నేను ఉంటాను ఇక,” అంటూ ఇద్దరి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు విక్కి.


“ఎవరమ్మా అతను? మన ఊరివాడా?” అంటూ అడిగాడు కిరణ్.


“లేదురా. అతని పేరు విక్కి. కాకినాడలో నాతో పాటే రైలు ఎక్కి, ప్రక్కనే కూర్చుని ప్రయాణం చేశాడు. నన్ను ‘అమ్మా, అమ్మా’ అంటూ పిలుస్తూ నాలో పేగుబంధాన్ని కదిలించాడు,” అంటూ ఆప్యాయంగా విక్కి వెడుతున్న వైపే చూస్తూ అంది నిర్మలమ్మ.


బయట కారు దగ్గరకెళ్ళి, “అమ్మా! కూర్చో,” అంటూ తల్లిని కారులో కూర్చోబెట్టి సరాసరి ఓ హోటల్‌కు తీసుకెళ్ళాడు కిరణ్. “మీ కోడలు బంధువుల ఇంటిలో ఏదో ఫంక్షన్ కెళ్ళింది. రేపుగానీ తిరిగి రాదు. అందుకే ఈ రాత్రికి మనం ఇక్కడే ఉందాం. త్వరగా నువ్వు తయారైతే మనం భోజనం చేసి, సింహాచలం కొండకు పోయి వద్దాం,” అన్నాడు కిరణ్.


“అబ్బా! ఎన్ని రోజులకి ఓ పెద్ద గుడికి వెడుతున్నాను! ఎప్పుడో నా పెళ్ళయిన కొత్తలో ఆయనతో కలసి అప్పన్న గుడికి వచ్చాను. ఇన్నాళ్ళకి నా కొడుకుతో కలసి తిరిగి ఆ స్వామిని చూస్తున్నాను,” అని ఆ తల్లి మనసు ఆనందంతో పరవశించిపోయింది.


ఓ గంటలో భోజనం పూర్తిచేసుకుని, కొండకెళ్ళి అప్పన్నని దర్శించుకున్నారు. కాసేపు మంటపంలో కూర్చుని ఊరిలోని సంగతులను కిరణ్‌కు చెప్పింది. మనవడి ముచ్చట్లను అడిగింది.


మాటల మధ్యలో “అమ్మా, మనం రేపు ఉదయమే మన ఇంటికి వెడదాం. మనమిక్కడి నుండి కనక మహాలక్ష్మి వారిని కూడా చూసి రాత్రికి హోటల్‌కెళ్ళి విశ్రాంతి తీసుకుందాం. నేను కూడా నీతోపాటే ఉంటాను,” అన్నాడు కిరణ్.


“అలాగే బాబు. నీవెలా చెపితే అలాగే. నువ్వు పక్కనే ఉండగా నాకు కావల్సింది ఏముంటుంది? ఇన్నాళ్ళు మనవడికి దూరంగా ఉన్న నేను, మరో పూట మనవడికి దూరంగా ఉండగలను,” అంది నిర్మలమ్మ. కనక మహాలక్ష్మి అమ్మవారిని చూసి వాళ్ళు హోటల్‌కి చేరేసరికి రాత్రి ఎనిమిది గంటలయ్యింది. రాత్రి భోజనం పూర్తిచేసి వచ్చి పక్క చేరిన నిర్మలమ్మకు ఒళ్ళు తెలియని నిద్ర పట్టింది.

మరునాడు హోటల్ నుండి బయలుదేరిన కిరణ్, మధ్యలో ఏదో ఫోన్ వస్తే కారుని రోడ్డు పక్కనే ఆపి కాసేపు మాట్లాడాడు. ఆ సమయంలో అతని ముఖంలోని కదలికలను, భావాలను చదివిన నిర్మలమ్మకు విషయం తెలియక కంగారు మొదలయ్యింది.


“అమ్మా! ఆఫీసులో ముఖ్యమైన పనొకటి వచ్చింది. నిన్ను ఇంటిలో దించి, మరల ఆఫీసుకు వెళ్ళాలంటే నాకు రెండు గంటలపైన సమయం పడుతుంది. అందుకే నువ్వు ఓ గంట ఇక్కడే వేచి ఉన్నావంటే నేను వచ్చి నిన్ను ఇంటికి తీసుకువెడతాను,” అని చెప్పి ఆమె చేతిలో ఓ అయిదు వందలు పెట్టి, ఓ కాగితం కూడా ఇచ్చి, “ఒకవేళ నేను రావటం బాగా ఆలస్యమైతే ఈ కాగితంలో మన ఇంటి చిరునామా వ్రాశాను. ఆటో అతనికి ఈ కాగితం చూపిస్తే, నిన్ను ఇంటికి తీసుకువెడతాాడు. ఆ సమయానికి నీ కోడలు కూడా ఇంటికి వచ్చి ఉంటుంది. ఏం భయపడకు. నాకు మధ్యలో ఈ ఆఫీసు పని వచ్చింది లేకపోతే నేనే నిన్ను ఇంటికి తీసుకువెళ్ళేవాడిని,” అని తల్లిని రామకృష్ణా బీచ్ రోడ్డులోని బస్ షెల్టర్‌లో వదిలి కన్నీటి తెరలు కన్నుల నిండగా కారులో వెళ్ళిపోయాడు కిరణ్. కొడుకు కన్నులలో కన్నీటి తెరలెందుకో అర్థం కాని నిర్మలమ్మ అయోమయంలో పడిపోయింది.


రాత్రి ఇంటిలో జరిగిన సంఘటన కారుని డ్రైవ్ చేస్తున్న కిరణ్ మనస్సుని తొలిచేయటం మొదలుపెట్టింది. ఇప్పుడు ఫోను భార్యనుండే వచ్చింది. ఆమె గొంతులోని అధికారం, కోపం, తల్లిని ఎట్టిపరిస్థితిలోనూ ఇంటిలోకి తీసుకువచ్చే వీలు లేదని చెప్పిన తీరు అతనిని కలచివేశాయి. పరిచయమైన నాటి నుండి నామీద ఎనలేని ప్రేమ చూపించే భార్య, అమ్మ మాట ప్రస్తావనకు వస్తే చాలు అపర కాళికలా మారిపోతుంది, ఎందుకో తెలియదు. అమ్మ వస్తున్న విషయం చెప్పినప్పటి నుండి ఇంటిలో శాంతి లేకుండా పోయింది. “ఆమె వస్తే నేను విషం తీసుకుంటాను,” అని చెప్పిన భార్యకు సమాధానమేం చెప్పాలో తెలియని కిరణ్ నిస్సహాయుడైపోయాడు.


అందుకే అమ్మను ఇంటికి తీసుకురాలేదు. సరికదా, అమ్మను అలా అనాథగా వదిలి రావలసి వచ్చింది. వయసు ప్రభావం చేతనో, భవిష్యత్తుకు ఉపయోగపడతారనే ఆశతోనో, తన కోరికలకు తాను బానిసై, భార్య మాటలకు దాసుడైపోయి తల్లిని పూర్తిగా విస్మరించడం జరిగింది. తల్లా? పెళ్ళామా? అనే సందిగ్ధంలో పెళ్ళాం వైపే ఒరిగిపోయింది కిరణ్ మనసు. కానీ అంతరాత్మ అనేది ఒకటుంటుంది కదా! దాని ముందు ఓడిపోయిన మనసు కారణంగానే అతనికి వచ్చిన కన్నీటి తెరలు నిర్మలమ్మలో కంగారుని కలిగించాయి.


కిరణ్ తనకు ఎన్ని పనులున్నా వాటిని పక్కన పెట్టి నిన్న మధ్యాహ్నం నుండి నాతోనే ఉండి నన్ను గుడికి తీసుకెళ్ళి, ఎంత చక్కగా చూసుకున్నాడో. పోనీలే, కిరణ్‌కు ఆఫీసు పనులు కూడా ముఖ్యమైనవే కదా. పల్లెటూరిలో పుట్టి పెరిగిన దానిని, జీవితంలో ఎన్నో ఢక్కామొక్కీలు ఎదుర్కొన్న నాకేం భయం. అందులోనూ ఇది పగటి సమయమేనాయో,” అనుకుంటూ ఎదురుగా ఎన్నో బడబాగ్నులను తనలో దాచుకున్న సముద్రాన్ని, విరుచుకుపడినా ప్రశాంతంగా వెనుకకు వెళ్ళి తన జన్మస్థలానికి చేరే నీటి అలల అల్లర్లను చూస్తూ గంటకు పైగా సమయం గడిపేసింది. నిద్ర ముంచుకురాగా అదే బెంచ్‌పై నిద్రపోయింది.


సాయంత్రమయ్యిందన్న దానికి నిదర్శనంగా ప్రశాంతంగా ఉన్న పరిసరాలు, చంద్రుని చూసి ఉప్పొంగే సంద్రపు కెరటాలుగా, జన తరంగాలతో నిండిపోయాయి. పిల్లల ఆటలు, కేరింతలు, తినుబండారాలమ్మే వారి కేకలతో సందడిగా మారింది. నిర్మలమ్మకు మెలకువ వచ్చింది. చుట్టూ చూసి ఒక్కసారి ఉలిక్కిపడింది. గంటకు వస్తానని చెప్పిన కిరణ్ ఇంత సమయమైనా ఎందుకు రాలేదో ఆమెకు అర్థం కాలేదు.


ఇంతలో ఇద్దరు యువకులు ఆమె ముందు నుండి నడుచుకుంటూ వెడుతున్నారు. వాళ్ళలో ఒకతను, “అమ్మా! మీరేమిటి ఇక్కడ? మీ మనవడితో కలసి బీచ్‌కు వచ్చారా? వాణ్ణి నాకు చూపించరా?” అంటూ అడిగాడు నిర్మలమ్మని.


దానికి ఆమె, “విక్కి, నువ్వేనా? ఈ రోజు ఆఫీసు అయిపోయిందా?” అని అడిగింది.


“అయిపోయిందమ్మా! ప్రతిరోజు ఆఫీసు నుండి రాగానే ఇలా బీచ్‌కి వస్తాను. మా ఇల్లు ఇక్కడకు చాలా దగ్గర. ఇతను నా స్నేహితుడు శ్యామ్ అని చెప్పాను కదా,” అంటూ ప్రక్కనున్న అతనిని పరిచయం చేశాడు విక్కి.


“అలాగా! నేను ఇంకా మా కిరణ్ ఇంటికి వెళ్ళనేలేదు విక్కి,” అంటూ నిన్న మధ్యాహ్నం నుండి జరిగిన సంగతులనన్నింటిని పూసగుచ్చినట్లుగా విక్కీకు చెప్పింది నిర్మలమ్మ. అతనికెందుకో అనుమాన బీజం మనసులో మొలకెత్తింది.


“నా బిడ్డ గంటలో వస్తాను, నన్ను ఇక్కడే ఉండమన్నాడు. తన మీటింగ్ అయ్యాక వస్తాను. లేకపోతే ఇదిగో ఈ కాగితంలోని అడ్రస్‌కు ఆటో మాట్లాడుకుని వచ్చేయమని చెప్పాడు,” అంటూ ఆ కాగితాన్ని విక్కీకు ఇచ్చింది నిర్మలమ్మ.


ఆ కాగితం తీసుకుని ఆ అడ్రస్ తనకేమైనా తెలిసిన ప్రాంతమేమోనని, గబగబా చదవాలని మడతలు విప్పాడు. అందులోని విషయం చదివి ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు విక్కి. మరి ఆ కాగితంలోని విషయం అలాంటిది. “ఈ కాగితం ఇచ్చిన ఆమెకి మతిస్థిమితం లేదు. తన పేరు నిర్మలమ్మని, కొడుకుపేరు కిరణ్ అని, ఊరు ముమ్మిడారం అని మాత్రమే చెప్పగలదు. ఆమెను బస్ స్టాండ్‌కు గానీ, రైల్‌స్టేషన్‌కు గానీ చేర్చగలరు,” అని ఆ కాగితంలో రాసి ఉంది. విక్కి కన్నులు కురిపిస్తున్న కన్నీటి ధారలను చూసిన శ్యామ్, “ఏమయ్యిందిరా? కంట్లో ఏమైనా పడిందా?” అని కంగారుగా అడిగాడు విక్కీని.


మౌనంగా ఆ కాగితాన్ని శ్యామ్‌కు ఇచ్చాడు కిరణ్. చదివి నిర్ఘాంతపోవటం శ్యామ్ వంతయ్యింది. కిరణ్ ప్రవర్తనకు చాలా కోపం వచ్చింది శ్యామ్‌కి. ఉదయం నిన్న వచ్చిన దగ్గరనుండి నిర్మలమ్మ గురించి విశేషాలను విక్కీ చెపుతూనే ఉన్నాడు. “ఇంత నీచుడా ఆ కిరణ్? పోలీసులకు చెపుదాం పదరా,” అంటూ ఆవేశపడ్డాడు శ్యామ్.


అతని మాటలను వింటూ “ఏమైంది నా కిరణ్‌కి? వాడు క్షేమంగానే ఉన్నాడు కదా? మీరు పోలీసులంటున్నారు...” అంటూ నిర్మలమ్మ కంగారు పడసాగింది వీళ్ళ మాటలు అర్థంకాక.


“అబ్బే! అదేమి లేదమ్మా! బాగా రాత్రి అవుతోంది. మా ఇల్లు ఇక్కడకు దగ్గరని చెప్పాను కదా! అందుకే మనం రాత్రికి మా ఇంటికి వెడదాం. రేపు ఉదయం మేమే మిమ్మల్ని ఈ కాగితంలోని అడ్రస్‌కు తీసుకువెడతాం. రాత్రి వేళల్లో పోలీసులు ఇక్కడ ఎవరినీ ఉండనివ్వరు,” అంటూ ఆమెను బలవంతం చేసి ఆటోలో తమ ఇంటికి తీసుకువెళ్ళారు.


స్నేహితులిద్దరూ కలసి నిర్మలమ్మను అతి కష్టంమీద ఇంటికైతే తీసుకొచ్చారేగానీ, ఒక్క ముద్ద అన్నమైనా తినిపించలేకపోయారు. “కొడుకు తిరిగి వచ్చి తాను కనిపించక ఎంతగా కంగారు పడుతున్నాడో,” అంటూ బాధపడుతూ అలాగే నిద్రపోయింది.


పల్లెటూరిలో పుట్టి పెరిగిన ఆ తల్లికి ఉదయానే మెలకువ వచ్చేసింది. లేచి అటూ ఇటూ పరిశీలనగా చూసింది. ఒక్కొక్కటిగా నిన్న జరిగిన అన్ని విషయాలూ గుర్తుకొచ్చాయి. లేచి గబగబా తయారయ్యింది. ఈమె హడావిడికి స్నేహితులిద్దరూ కూడా నిద్ర లేచారు.


ఆమె వాళ్ళని చూసి “బాబూ, పెద్దదాన్ని. చాదస్తం అని అనుకోకుండా, తిట్టుకోకుండా ఓసారి నన్ను బీచ్‌కి తీసుకెళ్ళండయ్యా! నా కిరణ్ ఉదయానే వచ్చి నా కోసం వెతుకుతూ, నేనక్కడ కనిపించక కంగారు పడుతుండి ఉంటాడు. మీరు ఈ తల్లికి చేసే సాయం ఊరికే పోదు. వచ్చే జన్మలో మీకు అమ్మ దొరుకుతుందయ్యా,” అంటూ వాళ్ళని ఒత్తిడి చేయసాగింది.


కొడుకుపై ఆమెకు గల నిష్కళంకమైన, నిర్మలమైన ప్రేమకు వాళ్ళు చలించిపోయారు. ఏమైనా సరే ఆ తల్లీ కొడుకులను కలపాలని బాగా అనిపించింది వారికి.


“అలాగే వెడదామమ్మా! ఒక్క పది నిమిషాలు,” అంటూ తాము స్నానాదికాలు ముగించుకుని, బయట నుండి ఇడ్లీ తీసుకువచ్చి, ఆమెతో బలవంతంగా తినిపించి ఆమెను తీసుకుని ఆటోలో రాత్రి ఆమె కనిపించిన చోటుకే తీసుకెళ్ళారు.


నిన్న ఆమె కూర్చున్న షెల్టర్ ఖాళీగా లేదు. ఎవరో పల్లీలమ్ముకునే అతను బండి పెట్టుకున్నాడు. నిర్మలమ్మ అతన్ని చూసి “బాబూ! దొరబాబులా ఉండే నా కొడుకు ఇక్కడకొచ్చి, నా గురించి అడిగాడా?” అంటూ ఆతృతగా అడిగింది.


“అమ్మా, నేను ఉదయమే ఇక్కడకు వచ్చాను గానీ ఎవరూ వచ్చి నన్ను ఏ విషయం గురించి అడగలేదు,” అన్నాడా పల్లీలమ్ముకునే వ్యక్తి.


ఇదంతా చూస్తున్న స్నేహితులిద్దరికీ గుండెలు బరువెక్కాయి. విక్కి మెల్లగా “ఒరేయ్ శ్యామ్! ఇక మనం ఈ తల్లికి ఆ గుండెబద్దలయ్యే నిజాన్ని చెప్పాల్సిన సమయం వచ్చిందిరా. ఇప్పుడు మనం చెపితేనే మంచిది. మనం ఆఫీసులకెళ్ళాక, ఆ కాగితాన్ని వేరే ఎవరికైనా చూపిస్తే ప్రమాదంలో పడుతుంది. మనం ఈ అమ్మను కాపాడుకుందాం,” అని చెప్పాడు శ్యామ్‌తో.


బెంచ్‌పై ఆమెను కూర్చుండబెట్టి “అమ్మా...” అంటూ ఆర్తిగా పిలిచారు ఆ స్నేహితులిద్దరు. తల్లి లేని పిల్లలు వాళ్ళు. తొలిసారిగా ఎదురుగా పొంగుతూ కనిపిస్తున్న కడలి అంత ప్రేమ గల ఆ తల్లికి గల విశ్వరూపాన్ని అర్థం చేసుకుంటూ మరోసారి “అమ్మా...” అన్నాడు విక్కి.


“ఏం బాబూ! నీకు ఆఫీసుకు వేళయ్యిందా! మీరు వెళ్ళండి. నేను ఇక్కడే అబ్బాయి కోసం ఎదురుచూస్తూ ఉంటాను. ఓ రెండు గంటలు చూసిన తరువాత ఈ కాగితంలోని అడ్రస్‌కు ఆటోలో వెడతాను. నా గురించి భయపడకండి,” అందామె.


“అదికాదమ్మా! నువ్వు ఇక మీ అబ్బాయి కోసం ఎదురుచూడవలసిన పని లేదు. అతను రాడు సరికదా, నీకు ముఖమైనా చూపిస్తాడనుకోను. అమ్మా! నిన్ను నీ కిరణ్ మోసం చేశాడు. నీకు చదువు రాదని, చదవలేవనీ తెలిసిన అతడు ఈ కాగితంలో తన ఇంటి అడ్రస్ రాసానని ‘అబద్ధం’ చెప్పాడమ్మా. ఈ కాగితంలో ఏముందో నీవు చదవలేవు. ఆ విషయం చదివిన మేము మా నోటితో చెప్పలేము,” అంటూ ఉదయపు నడకలో అటుగా వస్తున్న ఓ పెద్దాయనను పిలిచి “సార్! ఈ తల్లికి చదువు రాదు. చదివిన మేము ఆమెకు ఆ విషయం చెప్పలేకున్నాం. మీరు దయచేసి ఇందులో ఏం రాసి ఉందో ఆ తల్లికి చదివి చెప్పండి,” అన్నాడు విక్కి.


“అలాగే నాయనా,” అంటూ నిర్మలమ్మ దగ్గర ఆ కాగితం తీసుకుని “అమ్మా, ఈ కాగితంలో అడ్రస్సు ఏమీ లేదమ్మా! నీకు మతిస్థిమితం లేదని, నిన్ను బస్టాండ్‌కు గానీ, రైల్‌స్టేషన్‌కు గానీ పంపించమని రాసి ఉంది,” అని చెప్పి ఆ కాగితం తిరిగి నిర్మలమ్మ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడా వ్యక్తి.


చెవులు రిక్కించి విన్న నిర్మలమ్మ నిర్ఘాంతపోయింది. “ఇది నిజమా! నేను ఎంతో ప్రేమతో పెంచుకున్న నా కిరణ్ నన్ను పిచ్చిదని ముద్రవేసి వదిలించుకోవాలని చూశాడా? గంటల పరిచయమైనా లేని విక్కి రాత్రి నుండి నా కోసం కలత చెందుతున్నాడా? నిజం తెలిసినా నా క్షేమం కోసం, నన్ను బాధపెట్టలేక రాత్రంతా నలిగిపోయాడా?”


కోడిపెట్ట తన పిల్లలను పొదుముకున్నట్లుగా కన్నీళ్ళతో విక్కీని, శ్యామ్‌ని తన కౌగిలిలోకి తీసుకుని “నా ఆయుష్షు కూడా తీసుకుని, నిండు నూరేళ్ళు సంతోషంగా బ్రతకండి,” అని ఆశీర్వదించింది.


“ఇక నుండి మీరు అనాథలు కాదు. ఈ తల్లి మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టదు. పదండి మన ఇంటికి వెడదాం. ఇక నేను మీ దగ్గరే ఉండి, మీ ప్రేమానురాగాలను పొందుతూ శేషజీవితం గడిపేస్తాను,” అంటూ ధృఢ నిశ్చయంతో ఇద్దరు ప్రేమమూర్తులైన కొడుకుల చేతులనందుకుని ముందుకు కదిలిందా మాతృమూర్తి.

*****     

మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: మధుపత్ర శైలజ ఉప్పలూరి


ఒక స్పూర్తి కలిగించే వార్తను చదివినా, దృశ్యం చూసినా దానిలోని కదిలించే గుణం అవ్యక్తభావన రచయిత లేదా రచయిత్రి మదిలో పడితే అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని వారు ఆ సంఘటనను సృజనాత్మకతతో, కల్పనతో ఓ కవితగానో, ఓ కథగానో, ఓ నవలగానో రూపాంతరం చేసి దానిని అనేకమందికి చేరవేయటం ద్వారా విశ్వవ్యాప్తి చేస్తారు. ఆ కోవకు చెందినవే నా కవితలు, కథలు.  గత 20 సంవత్సరాలుగా చేస్తున్న ఈ సాహితీ సేద్యంలో ఒక కవితా సంపుటి (మధుపత్రాలు), మూడు కథా సంపుటాలను (మధుమాలిక, మధువనం, మధుమంజీరాలు) ప్రచురించాను. 100 కవితలను, 300 పైగా కథలను రచించాను. అనేక సాహితీ సంస్థలు  నా రచనలకు బహుమతులనిచ్చి, ప్రచురించి నన్ను ప్రోత్సహిస్తున్నాయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page