'Godugu' - New Telugu Story Written By Jidigunta Srinivasa Rao
'గొడుగు' తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
“అదేంటి.. గొడుగేది?” అన్నాడులోపలికి వచ్చిన భార్య సుగుణతో కుమార్.
“అవును.. గొడుగేది?” అంటూ కూరల సంచి కిందపెట్టి, “బహుశా మార్కెట్ లో మర్చిపోయాను అనుకుంట, ఏ కూరల బండి మీద వదిలేసానో, మళ్ళీ వెళ్లి అడుగుతాను” అంది.
“ప్రతిదానికి తయారువుతావు,గొడుగు తీసుకుని వెళ్లినిదానివి అలా మర్చిపోయి వస్తే ఎలా?” అన్నాడు ఆ గదిలోనుంచి ఈ గదిలోకి వాకింగ్ చేస్తో.
“ప్రతీ గురువారం మార్కెట్ వుంటుంది, సాయంత్రం త్వరగా లేచి వెళ్లి, వారానికి సరిపడే కూరగాయలు తీసుకుని రావాలని చెప్పినా ‘నువ్వు ఎలాగో పూజకోసం పువ్వులు తెచ్చుకుంటావు కదా అదే చేతితో రెండు కూరలు కొనుక్కుని రా’ అని తప్పించుకుంటున్నారు. నా ఖర్మ కాకపోతే ఈ కొత్త గొడుగు వేసుకుని వెళ్లి మర్చిపోయి వచ్చాను” అంది చెప్పులు వేసుకుంటూ సుగుణ.
“ఆగు. నువ్వు మళ్ళీ ఏం వెళ్తావు? నేను వెళ్లి అన్ని బళ్ళ వాళ్ళని అడిగి గొడుగు పట్టుకుని వస్తాను. అసలు నీలాంటి మతిమరుపు దానికి తాటకు గొడుగు కొనాలిసింది” అన్నాడు కుమార్.
“అవును, కొని మీరు వేసుకుని వెళ్ళాలి, అచ్చు వామనుడి లాగా వుంటారు” అంది నవ్వుతో సుగుణ.
“అంటే నేను పొట్టిగా వుంటానని అంటావా, జుట్టున్నప్పుడు నీకంటే రెండు ఇంచెలు పొడుగే, యిప్పుడు వయసు పెరిగి జుట్టు వూడి పొట్టిగా కనిపిస్తున్నాను. అవునూ.. వయసు మగవాళ్ళకి, ఆడవాళ్ళకి పెరుగుతుంది కదా, జుట్టు వూడి గుండు మగాళ్లకే ఎందుకు అవుతుందో.. ఈ రాకెట్స్ చంద్రుడిమీదకి పంపేబదులు మీ ఆడవాళ్ళ మెదడు మీద రీసెర్చ్ చేసి, మగాళ్ళకి జుట్టు వూడకుండా మందు కనిపెడితే బాగుండును” అన్నాడు.
“ఆ కనిపెడతారు కానీ, ముందు మీరు వెళ్లి పోయిన గొడుగు ఎక్కడ వుందో కనిపెట్టండి, మళ్ళీ వాన పడేడట్లుంది” అంది.
“సరే ఆ సంచి యిటు యివ్వు, యింకా లేత కూరగాయలు వుంటే కొనుక్కుని వస్తాను, ఈ వారం మీ తమ్ముడు వాళ్ళని భోజనం కి పిలిచాము గా” అన్నాడు.
“చిన్నగా చినుకులు పడుతున్నాయి. గొడుగు కాస్తా పోగొట్టింది” అనుకుంటూ నెత్తిమీద జేబురుమాలు వేసుకుని ఇంటినుంచి ఆరువందల అడుగుల దూరం వున్న మార్కెట్ కి బయలుదేరాడు. ప్రతీ వారం యిక్కడ రైతులు తాము పండించిన కూరగాయలు తెచ్చి అమ్ముకుంటారు. మొదట్లో రేట్స్ తక్కువగానే వుండేవి. జనం కి సంతకి వచ్చి కొనడం అలవాటు అవడంతో, రైతులు కూడా రేట్స్ పెంచేసి అమ్ముకుంటున్నారు.
వరుసగా వున్న బళ్ళను చూసుకుంటో వెళ్తున్నాడు తమ నీలం రంగు గొడుగు కనిపిస్తుందా అని. మార్కెట్ అంతా మనుషులు కనిపించడం లేదు, గొడుగులు తప్పా. ప్రతివాడు తమ గొడుగును పట్టుకునే కూరగాయలు కొనుకుంటున్నారు.
‘అబ్బా, ఈ బండి మీద కూరలు నవనవలాడుతున్నాయి, ముందు కూరలు కొనుక్కుని తరువాత గొడుగు గురించి వెతుకుదాము’ అని ఒక బండి దగ్గర ఆగి తనవంతు వచ్చే వరకు నిలబడ్డాడు.
పదినిముషాలు తరువాత తన వంతు రావడం తో కూరలు అమ్మీ దగ్గర నుంచి బుట్ట తీసుకుని, పొడుగు వంకాయలు కిలో, పెన్నాడ వంకాయలు అరకిలో, బెండకాయ, దొండకాయ, కంద కిలో కిలో వచ్చేడట్లుగా ఏరి, బుట్ట ని తూఖం వెయ్యమంటోవుంటే, పక్కనుంచి తెలిసిన గొంతు ఒకటి, “ఏమిటి సార్ నాలుగు రకాల కూరలు కొంటున్నారు, యింట్లో ఏమైనా తద్దినమా” అంటో శాస్త్రి గారు కనిపించాడు.
“అబ్బే అలాంటిది ఏమి లేదండి, మాకు ఫ్రీజ్ నిండా కూరలు వుంటే కానీ తోచదు. మా నాన్నగారి టైంనుండి మాకు అలవాటు” అన్నాడు కుమార్.
“అందరూ నీలాగా వుండరు పంతులుగారు, పావుకిలో అయిదు రూపాయలు వున్నా నువ్వు ఎప్పుడు అర్ధ పావు కంటే కొన్నది లేదు” అంది కూరలు అమ్మే ఆమె శాస్త్రి గారితో.
“చూడమ్మా, గంట క్రితం మా భార్య వచ్చి పువ్వులు, కొన్ని కూరలు కొని, గొడుగు మర్చిపోయింది, ఈ సంచి నీ దగ్గర వుంచితే, అన్ని బళ్ళు వాళ్లని అడిగి తిరిగి వచ్చి తీసుకుని వెళ్తాను” అన్నాడు కుమార్.
“నా బండి గుర్తు పెట్టుకో సార్, పానీపూరి బండి పక్కది, రాత్రి పదిగంటలవరకు వుంటాను” అంది కూరగాయల సంచి పక్కన పెట్టుకుంటూ.
పది బళ్ళ తరువాత ఒక బండి మీద లంకలో లంకిని లా నీలం రంగు గొడుగు వేసుకుని కనిపించడంతో, కుమార్ కి చెప్పలేనంత ఆనందం కలిగింది గొడుగు దొరుకుతున్నందులకు. “అమ్మా, ఈ గొడుగు మాది, ఒక గంట క్రితం మా ఆవిడ నీ బండి మీద మర్చిపోయింది” అన్నాడు శేఖర్.
నోట్లో వున్న కిల్లీ ఉమ్మేసి, “ఏమిటి ఈ గొడుగు నీదా, నీలం రంగు గొడుగు మాకుండకూడదా,నేను చిట్టీ డబ్బులతో కొనుకున్నాను, పెద్ద వచ్చావు చేతిలో సంచి కూడా లేకుండా, ఎందుకు వయసు వస్తే చాలదు, కొంటే కూరలు కొను, లేదంటే వెళ్ళు” అంటూ పెద్దగా అరవడం మొదలుపెట్టింది.
“నేను ఏమన్నాను అని అలా అరుస్తావు, ఒకవేళ ఆ గొడుగు నీదే అయితే, నాది అని చెప్తే చాలు కదా” అన్నాడు కుమార్.
“అది నువ్వు అడిగిన విధానం బట్టి జవాబు వుంటుంది, వెళ్లి ముందు అడుక్కో, బేరం లేక నేను ఏడుస్తున్నాను” అంది గొడుగు గట్టిగా పట్టుకుని.
అప్పటికే చుట్టు పక్కన వాళ్ళు అక్కడకి చేరి తన వంకే చూస్తోవుంటే సిగ్గేసింది కుమార్ కి. ఛీ వెధవ గొడుగు కోసం ఈ లంకిని తో నానా మాటలు పడ్డాను, పోతే పోయింది యిహ యింటికి వెళ్లి స్నానం చేయడం మంచిది అనుకుని వెనక్కి తిరిగిన కుమార్ చెయ్యి ఎవ్వరో పట్టుకోవడం తో ఉలిక్కి పడ్డాడు. ఒక ముసిలి స్త్రీ మూగ సైగలు చేస్తో తనని తనతో రమ్మంటోంది.
ఏమిటో అర్ధం కాక, ఆవిడ వెంట నడిచాడు కుమార్. రోడ్డుకు అవతల నీలం రంగు గొడుగు వేసుకుని పువ్వుల బండి మీద చంటిపిల్లాడిని వొళ్ళో పెట్టుకుని కూర్చొని వుంది ఒక ముప్పై ఏళ్ళ వయసు అమ్మాయి.
నా చెయ్యి పట్టుకుని యిట్టే రోడ్డు దాటించి బండి దగ్గరికి తీసుకుని వెళ్లి, ఆ అమ్మాయి కి ఏదో సైగ చేసి చెప్పింది ముసిలి స్త్రీ.
ఆ అమ్మాయి తను వేసుకున్న గొడుగును టక్కున మూసివేసి, “అయ్యా మా అమ్మ అంటోంది ఈ గొడుగు మీది అని. ఒక రెండు గంటల క్రితం ఒకరు పువ్వులు కొనుక్కుని గొడుగు మర్చిపోయి వెళ్లిపోయారు.వస్తే యిద్దాము అని పక్కన పెట్టివుంచాను, ఈలోపు వాన వచ్చింది, పిల్లాడు తడుస్తాడేమో అని గొడుగు పట్టాను సార్, యిదిగో మీ గొడుగు” అంది పిల్లాడి తలకి పాలితిన్ కవర్ తోడుగుతు.
“ఈ చంటిపిల్లాడిని పెట్టుకుని నువ్వు గొడుగు లేకుండా ఎందుకు వున్నావు, ఈ ముసలమ్మ ఎవ్వరు” అని ఆడిగాడు కుమార్.
“ఆవిడ మా అమ్మ,, మూగది, నాకు ఇద్దరు పిల్లలు, పెనిమిటి చనిపోయాడు మొన్న కోవిడ్ సమయంలో. తిండి గడిస్తే చాలు సార్, గొడుగులు ఎక్కడ కొంటాము, అయినా మాకు వానలో తడవటం అలవాటే, మబ్బులు ముంచుకుని వస్తున్నాయి, త్వరగా యింటికి వెళ్ళండి” అంది తన దగ్గర వున్న పువ్వులు లాంటి మనసు కలిగిన ఆ అమ్మాయి.
“బాగానే వుంది కానీ ఈ గొడుగు నాది కాదు, నా గొడుగు నీలం రంగు మీద తెల్లటి పువ్వులు వుంటాయి. గొడుగు పోయింది అని ఎవ్వరైనా వస్తే యిచ్చేసేయి” అంటూ అరకిలో పువ్వులు కొనుక్కుని వెనక్కి బయలుదేరాడు. కూరగాయల సంచి తీసుకుని ఒక్కసారి రోడ్డుకి అవతల వున్న పువ్వుల బండి వంక చూసాడు కుమార్. మళ్ళీ ఆ అమ్మాయి గొడుగు వేసుకుని వుంది.
లోపలికి బరువైన సంచితో వచ్చిన భర్తని చూసి, “గొడుగు దొరికిందా” అంది సుగుణ. సంచి కింద పడేసి రెండు అరచేతులు చూపించాడు కుమార్.
“అదేమిటి ఎర్రగా దెబ్బలు, ఎవ్వరు కొట్టారు?” అంది .
“నీ మొహం, కొట్టడం కాదు, సంచి బరువు మోసే సరికి చేతులు కందపోయాయి, యిహ గొడుగు సంగతి అంటావా..” అని జరిగింది చెప్పాడు.
“పోనీలెండి, మనం యింకో గొడుగు కొనుక్కోగలం, చిన్నపిల్లాడు తడవకుండా మన గొడుగు వాళ్ళకి ఉపయోగపడటం ముఖ్యం” అంది సుగుణ.
భార్య చేసిన వేడి వేడి ఉప్మా తింటూ, “నేను ఒక నిర్ణయం తీసుకున్నాను సుగుణా, ప్రతి ఏడు ఒక పదివేలు ఖర్చు చేసి వానాకాలం కొంతమంది బీదవారికి గొడుగులు, ఎండాకాలం విసినకర్రలు, చలికాలం దుప్పట్లు యిద్దామని” అన్నాడు కుమార్.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
@himabindusworld1383 • 7 minutes ago
నిజ జీవిత ప్రతిబింబం
@saipraveenajeedigunta8361 • 16 hours ago
Chala bagundi