top of page
Original.png

గుమ్మడికాయ దొంగ

#GummadikayaDonga, #గుమ్మడికాయదొంగ, #JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు,  #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

ree

Gummadikaya Donga - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao Published In manatelugukathalu.com On 23/12/2025

గుమ్మడికాయ దొంగ - తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

“యిదిగో లక్ష్మీ! బయట గోడ దగ్గర పెట్టిన డబ్బాలో మట్టి పోసి గుమ్మడి విత్తనాలు నాటాను.   నువ్వు అది చెత్త కోసం అనుకుని చెత్త వెయ్యకు” అన్నాడు వాసు.   


“మీకు పని లేకపోతే కొద్దిగా తల్లో పేలు తీయ్యండి నాకు, ఒక్కటే దురద, గోక్కుంటో వుంటే చూడటమే గాని సహాయం చెయ్యరు” అంది.  


“అవ్వా! గ్రీన్ ఇంకుతో సంతకాలు పెట్టిన చేతితో నీ తలలో పేలు తీయ్యాలా, గుమ్మడి విత్తనాలు వెయ్యడానికి, నీ తలకి సంబంధం ఏమిటి, రిటైర్ అయిన తరువాత మరీ లోకువ అయ్యాను నీకు.   కూరలు తరగడం నుంచి, పోపులో మిరపకాయలు నలపడం దగ్గర దాకా చేయిస్తున్నావ్, యింకా యిప్పుడు పేలు తీయ్యమంటున్నావు, ఎవ్వరైనా వింటే నవ్విపోతారు” అన్నాడు వాసు.  


“మొన్న టూర్ కి వెళ్ళినప్పుడు డబ్బులు ఆదా చెయ్యడానికి చిన్న హోటల్ లో రూమ్ తీసుకున్నారు, అప్పటినుండి తలంతా దురద, అయినా యింట్లో వున్నది మనమిద్దరం, ఎందుకు నామోషి” అంది.  


“మీ మరదలిని పిలిచి చూపించుకో” అన్నాడు వాసు.   


“బాగానే వుంది. ఆవిడే తలంతా బర్కుంటో వుంటుంది ఎప్పుడు చూసినా. తనేం సహాయం చేస్తుంది?” అంది తలగొక్కుంటో. “సరే మట్టి చేతులు కడుక్కుని ఉప్మా తింటానికి రండి, షుగర్ పడిపోతే కష్టం” అంది.  


భార్య యిచ్చిన ఉప్మా ప్లేట్ అందుకుని పరిశీలనగా చూస్తో “యివి ఆవాలేనా లేకపోతే తల గోకున్నావా” అన్నాడు అనుమానంగా.  


“ఛాలెండి మీ హాస్యం, రేపటి నుంచి ఆ గుమ్మడి విత్తనాలు నాటిన డబ్బాలో నీళ్లు పొయ్యాలి అంతేగా, ఏరాక్కపోయి అడిగాను పేలు తీయ్యమని, అవును.. అన్నిటికి ఆన్లైన్ సర్వీస్ ఉన్నట్టు పేలు తీయ్యటానికి కూడా ఎవ్వరైనా అమ్మాయి దొరుకుతుందేమో తెలుసుకోండి” అంది నవ్వుతు.  


లంచ్ అయిన తరువాత ఒక రెండు గంటలు పడుకునే వాసు ఆ రోజు పడుకోకుండా పెద్ద దువ్వెన పట్టుకుని కూర్చొని ఉండటం చూసి “ఏమిటి నిజంగానే పేలు చూస్తారా” అంది లక్ష్మి.   


“మొన్న నాకు నడుం నొప్పి వస్తే నువ్వు ఆయింట్మెంట్ రాసావు. అలాగే యిప్పుడు నీకు పేలు చూస్తాను. అరవై దాటిన తరువాత యింకా మొగాడు ఏమిటి? ఆడవాళ్లు ఏమిటి.. యిద్దరూ ఒక్కటే” అన్నాడు.  


నిజంగానే తల దురదగా ఉందేమో పాపం జుట్టు విరబోసుకుని కూర్చుంది.   

“తలలో ఏమి ఉన్నట్టు లేవే, రోజూ పూజలు వ్రతాలు అంటూ తలస్నానం చేస్తున్నావు కదా.. తల ఎండిపోయింది. కొబ్బరినూనె రాసుకో” అన్నాడు.   


“తప్పించుకోకుండా కొద్దిగా చూడండి, ఏపని చెప్పినా తప్పించుకోవడానికి చూస్తారు” అంది లక్ష్మి


కాలింగ్ బెల్ మ్రోగడంతో వెళ్లి తలుపు తీసి “నువ్వా అన్నయ్య.. లోపలికి రా” అంటూ చేతిలోని దువ్వెన వెనక్కి పెట్టుకున్నాడు.   


అక్కడ జుట్టు విరబోసుకుని వున్న తమ్ముడి భార్య, చేతిలో దువ్వెనతో తమ్ముడు వాసుని చూసి “తరువాత వస్తాలే రా, పని కానివ్వు, నాకూ అప్పుడప్పుడు తప్పటం లేదు” అని వెనక్కి వెళ్ళిపోయాడు.  


“ఛీ.. పరువు అంతా పోయింది” అన్నాడు వాసు భార్యతో. 


“అయినా ఏ పనిలేనట్టు ఈ టైములో రావడం ఏమిటి మీ అన్నయ్య” అంది లక్ష్మి.  


“నేనే ఉదయం చెప్పాను గుమ్మడి విత్తనాలు వున్నాయి కావాలంటే వచ్చి తీసుకో అని, బహుశా దానికోసం వచ్చివుంటాడు” అన్నాడు.   


“ఈ రోజు పెట్టిన విత్తనాలు అప్పుడే పాదులు అయిపోయి కాయలు కాస్తున్నట్టుగా అందరికి చాటించేసారు అన్నమాట, మీ వదినకి రేపు నా మొహం ఎలా చూపించాలో ఏమిటో” అంటూ జుట్టు మూడి వేసుకుని లేచింది.  


వారం రోజుల తరువాత నిద్రపోతున్న భర్తని లేపి “మీ ఫ్రెండ్ వచ్చాడు వెళ్లి చూడండి” అంది లక్ష్మి.   


కంగారుగా బయటకు వచ్చి చూసి “ఎవ్వరు లేరే” అన్నాడు తులసి చెట్టు చుట్టూ తిరుగుతున్న భార్యతో.   


“అదిగో ఆ డబ్బాలో చూడండి” అంది.   


“ఓహో గుమ్మడి మొక్క వచ్చిందే, జాగ్రత్తగా పెంచాలి” అన్నాడు.   


సాయంత్రం గోడకి మేకులు కొట్టి పందిరిలా వేసాడు.   నెల రోజులకి గుమ్మడి తీగ పందిరి చుట్టూ అల్లుకుంది.   


“మీ చాదస్తం కాకపోతే గుమ్మడి తీగ నేలమీద అల్లుకుని కాయలు కాస్తుంది. పందిరి కాయల బరువు పలేదు అంటే వినరు కదా” అంది.   


“నేల ఎక్కడఉందే మనకు. అయినా చూద్దాం ప్రయత్నించి” అన్నాడు.  


“ఏమండీ మీరు చెప్పింది నిజమే. మన గుమ్మడి పాదు కి పిందలు వచ్చాయి” అంటున్న భార్యతో “మన అనకు నేను పెంచుకుంటున్నాను” అన్నాడు వాసు.  

 

“అయినా రేపు గుమ్మడి కాయ పెద్దది అయిన తరువాత నేను వండాలిసిందేగా” అంది.  


మొగుడు పెళ్ళాం రోజూ గుమ్మడి కాయ ఎంత ఎదిగిందో చూడటం అలవాటు అయ్యింది.   చుట్టూ పక్కన వాళ్ళు ‘బాగా కాసిందే గుమ్మడి కాయ’ అనటం లక్ష్మికి చిరాకు తెప్పించింది.   


“ఏమండీ కాయ పెద్దది అయ్యింది, ఇహ కోసేస్తా” అంది. 


“రేపు ఆదివారం కోద్దాం, అది సరే గాని సగం చెక్క పక్కింటి వాళ్లకి యిద్దామా” అన్నాడు.   


“భలే వారే, ఎవ్వరికి ఇవ్వద్దు, మొదటి కాయ, సగం ముక్క గుళ్లో శాస్త్రిగారికి యిస్తాను, మనకి మంచి జరుగుతుంది” అంది.  


“సాయంత్రం ఫస్ట్ షోకి ‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే సినిమాకి టికెట్స్ బుక్ చేసాను వెళ్ళాలి, త్వరగా పని పూర్తి చేసుకో” అన్నాడు వాసు.  


హాలు అంతా ఖాళీగా వుంది, ముందుగా టికెట్స్ బుక్ చెయ్యడం ఎందుకు అనుకుంటూ సగం సినిమా చూసి బయటకు వచ్చేసి హోటల్ లో టిఫిన్ తిని ఇంటికి చేరుకున్నారు.  


తలుపు తీసుకుని బయట లైట్ వేసి కెవ్వు మని అరిచాడు వాసు.   


“చీకట్లో గుమ్మడి పాదు దగ్గరికి వెళ్ళారా, పాములుంటాయి జాగ్రత్త” అంది.  


“పాముకాదే గుమ్మడి కాయ లేదు ఎవ్వరో కోసేసారు” అన్నాడు.   


“అయ్యో వెధవ సినిమా కి అనవసరంగా వెళ్ళాము, యింట్లో లేము అని తెలిసి కోసేసుకున్నారు” అంది లక్ష్మి.   


“ఆవిడ పనే అంటావా” అన్నాడు.   


“వాళ్లే రోజూ వాకింగ్ చేస్తో మన గుమ్మడికాయ వంక చూస్తో వెళ్ళేవాళ్ళు” అంది.   


“యిప్పుడు ఎలా? నువ్వు చెప్పినట్టు ఉదయమే కోసేసి వుంటే బాగుండేది” అన్నాడు.   


“మీరు నా మాట ఎప్పుడు విన్నారు కనుక” అని అంటించింది లక్ష్మి.  


“సరే రేపు ఉదయం వెళ్లి సెక్యూరిటీ ఆఫీస్ లో సీసీ కెమెరా చూడండి. అందులో దొంగ ఎవ్వరో తెలుస్తుంది” అని సలహా యిచ్చింది.  


ఉదయం లేచి సెక్యూరిటీ ఇంచార్జితో చెప్పాడు “మా దొడ్లో గుమ్మడికాయ ఎవ్వరో దొంగతనం చేసారు, సీసీ కెమెరాలో చూడండి ఒకసారి” అన్నాడు.  


“భలే వారే సార్. సీసీ కెమెరాలు పెట్టింది గుమ్మడి కాయ పోతే చూడటానికి కాదు. అయినా సీసీ కెమెరాలు ఊరికే పెట్టాము దొంగలు భయపడటానికి” అన్నాడు.   


“అదేమిటి ప్రతీ నెలా సీసీ కెమెరా రిపేర్ అంటూ మా దగ్గరనుండి డబ్బులు తీసుకుంటున్నారుగా” అన్నాడు.   


“ఆ రహస్యం మాకు తెలియదు సార్. మీకు వీలుంటే సెక్రటరీ గారిని అడగండి” అన్నాడు.  


“కెమెరాలో ఎవ్వరైనా కనిపించారా అని అడిగింది భర్తని.   


“ఆ.. నేనే కనిపించాను. అసలు కెమెరాలు పనిచెయ్యడం లేదుట, పోనిలే ఏం చేస్తాం.. మనకి ప్రాప్తం లేదు” అన్నాడు దిగులుగా.   


“భోజనం అయిన తరువాత ఆ గుమ్మడి పాదు పీకేసి పందిరి కూడా తీసేయండి.   శ్రమ మనది తినటం బయటవాళ్ళది” అంది.  


లంచ్ కి కూర్చొని “ఆ గుమ్మడికాయ వుంటే చక్కగా దప్పలం పెట్టుకునే వాళ్ళం” అన్నాడు వాసు.   

యింతలో కాలింగ్ బెల్ చప్పుడు అవ్వడంతో లేచి తలుపు తీసి “ఏమిటిరా మా ఇల్లు గుర్తుకు వచ్చిందా” అన్నాడు తన బావమరిది కొడుకుని చూసి.  


“చదువు లో పడి రాలేకపోయాను.   అమ్మ మీకు గుమ్మడికాయ పులుసు యిచ్చి రమ్మంటే తీసుకుని వచ్చాను” అన్నాడు చేతిలో బాక్స్ టేబుల్ మీద పెడుతో.  


“మా గుమ్మడికాయ ఎవ్వరో కోసుకుని వెళ్లిపోయారు అని బాధపడుతున్నాము. పోనీలే నువ్వు గుమ్మడికాయ పులుసు తెచ్చావు. కొంతలో కొంత నయం” అంది లక్ష్మి.  


“అదేమిటి అత్తయ్య.. నిన్న నాన్నా అమ్మా వాళ్ళు గుమ్మడికాయ మీ యింటి నుంచే తెచ్చారుగా.. మీకు తెలియదా?” అన్నాడు.   


ఆ మాటకి తెల్లబోయిన వాసు దంపతులు “మీ అమ్మావాళ్ళు ఎప్పుడు వచ్చారు రా, నిన్న సాయంత్రం మేము యింట్లో లేము” అంది.  


తమ్ముడికి ఫోన్ చేసి “ఒరేయ్. మీ బావగారు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న గుమ్మడికాయని ఆలా ఆడకుండా కోసుకుని వెళ్ళిపోవడం ఏమన్నా బాగుందా, ఎవ్వరు కోసుకున్నారో తెలియక నానా శాపనార్ధాలు పెట్టాము” అంది.  


“మీ ఇంటికి వస్తే మీరు లేరు, గుమ్మడికాయ కనిపించగానే మీరు మాత్రం అంత కాయ ఏమి చేసుకుంటారు అని కోసుకుని వెళ్ళము.   ఆ విషయం చెప్పాలని ఫోన్ చేస్తే మీరు ఫోన్ కట్ చేసారు.   నీకు శ్రమ లేకుండా మేమే గుమ్మడికాయ తో పులుసు చేయించి పంపించాను గా” అంటున్న తమ్ముడి మాటలు వినకుండా ఫోన్ పెట్టేసింది లక్ష్మి.  


“పాపం అనవసరంగా యివిడ దొంగిలించింది అనుకున్నాము, కొద్దిగా పులుసు తీసుకుని వెళ్లి యిచ్చిరా” అన్నాడు వాసు.  


ఇతరుల వస్తువు వాళ్ళు మనకి ఎంత కావలిసిన వాళ్ళు అయినా అడగకుండా తీసుకోవడం అపార్ధం కి తావిస్తుంది.   అతి చనువు అనర్థం.  


 శుభం 


 జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.







30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



bottom of page