top of page

హేమంతం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link

'Hemantham' New Telugu Story


Written By Yasoda Pulugurtha


రచన: యశోద పులుగుర్త'ఈ నాడు' దినపత్రికలోని ఒక వార్తను చూడగానే రామకృష్ణ దృష్టి అక్కడే ఆగిపోయింది.


వైజాగ్ లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక ఇరవై సంవత్సరాలు నిండిన అమ్మాయి తన ప్రేమికుడు రోడ్ ప్రమాదంలో చనిపోయాడన్న వార్త విని తట్టుకోలేక ఫేన్ కి ఉరివేసుకుని చనిపోయిందట. ఈ వార్తవిన్న ఆమె తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా కుమార్తె మరణంపై విలపిస్తున్నారని ఆ వార్త సారాంశం..


ఇటువంటి వార్తలు రోజూ ఎన్నో చదువుతున్నా టి.వి.లో చూస్తున్నా, ఎంతో భవిష్యత్ ఉన్న ఒక చిన్న అమ్మాయి అనాలోచితంగా తీసుకున్న నిర్ణయానికి ఆవేదనతోబాటూ ఒకలాంటి కోపంతో ‘ప్రేమిస్తే మటుకు ఇటువంటి ప్రాణత్యాగం చేయలా’ అనుకుంటూ అక్కడే ఉన్న భార్యతో "విన్నావా హేమా" అంటూ మొత్తం విషయాన్ని చెపుతూ “ప్రేమ ను ప్రాక్టికల్ గా తీసుకుంటున్న ఈరోజుల్లోకూడా ఆ అమ్మాయి అనాలోచిత నిర్ణయం తొందరబాటు కాదా" అన్నాడు.


హేమంత ఉలిక్కి పడుతూ మౌనం వహించింది.


"ఏం మాట్లాడవే హేమా?”


"ఏం మాట్లాడాలి ? చాలామందికి అనాలోచితం అనిపించవచ్చు. కానీ ఆ అమ్మాయికి అదే న్యాయమైనదిగా అనిపించవచ్చు. ఆ ప్రేమ విలువ ఏమిటో అనుభవించిన వారికి మాత్రమే తెలిసినంతంగా బయట వాళ్లకు అర్ధం కాకపోవచ్చేమో కృష్ణా”.


"నీ ముఖం, ప్రేమించుకుని నీవు లేనిదే నేను జీవించ లేనంటూ చెట్టాపట్టాలేసుకుని పెళ్లి చేసుకుంటున్న జంటలు పెళ్లైన కొద్ది నెలలకే ఎందుకు విడిపోతున్నారు? నా దృష్టిలో ప్రేమించుకోవడం ఒక ఫాషన్ అంటాను. నాకు ఈ ప్రేమలు, త్యాగాలు పట్ల నమ్మకంలేదు హేమా!”


భర్త మాటలకు సమాధానమివ్వకుండా వంటింట్లోకి వెళ్లిపోయింది హేమంత.


రామకృష్ణ హేమంతను ఒక పెళ్లిలో చూసి ఇష్టపడి తల్లితండ్రులతో ఆ అమ్మాయినే చేసుకుంటానని చెప్పి ఇరువైపుల పెద్దల అంగీకారంతో శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్నాడు. ఎవరైనా స్నేహితులు సరదాగా నీది ప్రేమవివాహమే కదా అంటే నాకు ప్రేమపట్ల నమ్మకంలేదు, కాని హేమంతను చూసి ఇష్టపడి ఈ అమ్మాయిని చేసుకుంటే నా జీవితం బాగుంటుందనిపించి పెళ్లిచేసుకున్నాక ప్రేమించడం మొదలు పెట్టానంటాడు.


వారి పెళ్లి అయి ఇరవై రెండుసంవత్సరాలు దాటిపోయాయి. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న కూతురు వినతి, ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న కొడుకు విశాల్ తో వారి దాంపత్యం అన్యోన్యంగా సాగిపోతోంది. పిల్లలను వారికి నచ్చిన అభిరుచులతో పెంచుతున్నారే తప్ప, ఇదే చేయాలని శాసించరు.


ముఖ్యంగా పిల్లలిద్దరూ టీనేజ్ లో ఉన్నారని వారి ఆలోచనలు, అలవాట్లు పక్కదారి పట్టకూడదని అనుక్షణం ఆలోచించే ఒక సాధారణ తండ్రి రామకృష్ణ.


కొద్ది రోజులనుండి వినతి తనగదిలోకి వెళ్లిపోయి తలుపులు వేసుకోవడం గమనిస్తూనే ఉన్నాడు. ఒకరోజు కూతురితో చెప్పాడు తలుపులేసుకుని చదువుకోవడం ఏమిటని.


“బామ్మ గట్టిగా మాట్లాడే మాటలు, అమ్మ వంటింటి శబ్దాలు, పదే పదే విశాల్ నేను చదువుకుంటుంటే వచ్చి నన్ను ఆటపట్టించడం నాకు డిస్టర్బ్ గా ఉంటోంది. నేను డిగ్రీలో మేధ్స్ ఎందుకు తీసుకున్నానో మీకు తెలుసు, మేధ్స్ లో పి.జి చేయాలనేకదా. అందుకనే ఇప్పటనుండీ దీక్షగా చదవాలని.”


ఆ అమ్మాయి ఆలోచనలకు, ఏకాగ్రతకు తండ్రి హృదయం పొంగిపోయింది. పిల్లలను పదే పదే చదవమని తను చెప్పనవసరంలేదని.


హేమంత, పెళ్లినాటికే ఎమ్ బి ఏ చదివి ఒక ఎక్స్ పోర్ట్ బిజినెస్ చేసే సంస్తలో పనిచేస్తూ ఉండేది. ఉద్యోగం చేయడం నాకు అభ్యంతరంలేదని రామకృష్ణ చెప్పినా, ఉద్యోగం మానేసి ఇంటిని పిల్లలనూ మేనేజ్ చేసుకుంటూ అసలుసిసలైన గృహిణిగా మారిపోయింది.


వినతి డిగ్రీ పూర్తిచేయడంతో సెంట్రల్ యూనివర్సిటీ లో ఎమ్.ఎస్.సి లో చేరిపోయింది. మరో సంవత్సరంలో పూర్తి అయిపోతుంది. మొదటినుండీ చదువులో టాప్ రేంక్ తెచ్చుకుంటున్న వినతి మేధ్స్ లెక్చరర్ గా పనిచేయాలని అనుకుంటోంది. ఉద్యోగంలో స్థిరపడ్డాకనే కూతురి పెళ్లి చేయాలన్న తలంపులో ఉన్నాడు రామకృష్ణ. పిల్లలిద్దరికీ వారి చదువు, కేరీర్ పట్ల పూర్తి స్వేఛ్చను ఇచ్చారు.


కొద్దిరోజులుగా వినతి ఎందుకో ముభావంగా ఉండడం, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్లుగా కనపడుతోంది.


“ఏమైందే విన్నూ, డల్ గా ఉంటున్నావేమి”టంటూ హేమంత అడిగిన ప్రశ్నకు "ఏమీ లేదమ్మా, కొంచెం స్ట్రెస్ గా ఉంటో”దంటూ సమాధానమిచ్చింది.


మేధ్స్ సబ్జక్ట్ అంటే అలాగే ఉంటుంది. కూల్ గా ఏ ఆర్స్ గానీ, ఫైనాన్స్ గాని ఆప్ట్ చేసుకుని ఉండాల్సింది. నేను చెపితే వినవు. మీ నాన్న నీవు ఏది అంటే అదే అంటూ సపోర్టు కూడాను, సరేలే, రెస్ట్ తీసుకో , కాఫీ తెస్తానంటూ లోపలికి వెడుతున్న తల్లివైపే సాలోచనగా చూసిందో క్షణం.


అమ్మ అంతే, ఎక్కువ మాట్లాడదుగానీ, మాటలాడిన మాటల్లో ఎంతో వాస్తవం ఉందనిపిస్తుంది.


తనకు నాన్న దగ్గరే ఎక్కువ చనువు. నాన్న తన అభిప్రాయానికి విలువనిస్తాడు. నాన్నతో ఇంతవరకు తనూ రేవంత్ ప్రేమించుకుంటున్న విషయాన్ని చెప్పలేదు.


రేవంత్ తన స్నేహితురాలు ప్రణవి అన్నయ్య. ప్రణవీ తనూ ఇంటర్ నుండి డిగ్రీవరకు ఒకే కాలేజ్ లో చదువుకున్నారు. తరచుగా ప్రణవిని కలవడానికి వాళ్లింటికి వెడ్తూ ఉండడంతో అప్పటికే ఇంజనీరింగ్ పూర్తిచేసి ఐఐటి ఖర్గ్పూర్ లో ఎమ్ టెక్ చదువుతున్న రేవంత్ తో పరిచయం అయింది. రేవంత్ శెలవులకు వచ్చినపుడు ముగ్గురూ సరదాగా కబుర్లు చెప్పుకునేవారు.


రేవంత్ అంటే ఏమిటో తెలియని ఆకర్షణ ప్రేమ కలిగాయి. చిలిపిగా నవ్వుతూ, నవ్విస్తూ కనబడే రేవంత్ తన మనసునంతా ఆక్రమించాడు. తన చదువు పూర్తి అవగానే అమ్మ నాన్నతో తమ ప్రేమ విషయం చెప్పాలనుకుంటోంది. ఈలోగా రేవంత్ తనను ప్రపోజ్ చేస్తే సరేసరి, లేకపోతే తనే రేవంత్ తో తన ప్రేమవిషయం చెప్పేద్దామని అనుకుంటోంది.


ఒకరోజు ఉదయం పదకొండు గంటలకు ఆఫీసులో వర్క్ బిజీలోనున్న రామకృష్ణకు హేమంత ఫోన్ చేస్తూ ఏడ్చేస్తోంది. “కృష్ణా, మన విన్నూ తొమ్మిదైనా లేవలేదని దానిగదిలోకి లేపాలని వెళ్లాను. ఒళ్లు మంచులా చల్లగా ఉంది. ఉలుకూ పలుకూ లేదు. నీవు తొందరగా వచ్చేయవూ”.. ఏడుపుతో గొంతు పూడిపోతుండగా మాట్లాడలేకపోతోంది.


“వచ్చేస్తున్నాను విన్నూ, కంగారుపడ”కంటూ వెంటనే బయలుదేరాడు. ఆఫీసుకి ఇల్లు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఆఘమేఘాలమీద పరుగెడుతున్నట్లుగా వచ్చేసాడు. నిజమే, విన్నూలో చలనం లేదు, ఉలుకూ పలుకూలేదు. వెంటనే అంబులెన్స్ లో హాస్పటల్ కి తీసుకు వెళ్లారు.


డాక్టర్ వంశీకృష్ణ తన స్నేహితుడు పనిచేస్తున్న హాస్పటల్ అది. వినతిని ఐసీయూకి తరలించారు. ఊపిరి అందడం లేదు. పల్స్ కూడా చాలా వీక్ గా ఉన్నాయి. ఏవో ఇంజక్షన్స్, సెలైన్స్ తో హడావుడి పడుతున్నారు.


డాక్టర్ వంశీకృష్ణ బయటకు వచ్చి రామకృష్ణను తన పర్సనల్ రూమ్ లోకి పిలిచాడు. రామకృష్ణ దుఖంతో మాటరావడంలేదు.


“ఏమైందిరా కృష్ణా, మన విన్నూ ఆత్మహత్యకు పాల్పడడం ఏమిటి?"


“అసలు విన్నూ ఎలా ఉందిరా వంశీ?"


“ఔట్ ఆఫ్ డేంజర్, భయపడకు. నిద్ర మాత్రలు బాగా మింగేసింది. మీ అమ్మగారికి నేను వ్రాసి ఇచ్చిన నిద్రమాత్రలు అవి. కొన ఊపిరితో ఉన్న పరిస్తితిలో తీసుకొచ్చారు. కొంచెం ఆలస్యం అయి ఉంటే.."


"చెప్పకురా, నా బంగారు తల్లి నా కంటెదురుగా ఉంటేచాలంటూ" వంశీని పట్టుకుని ఏడ్చేస్తున్న కృష్ణకు ధైర్యం చెప్పాడు.


“అసలు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకునే ఖర్మ దానికేమిటిరా. సచ్ ఎ బ్రిలియంట్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్ కదరా!”

“నాకూ అర్ధంకావడంలేదు వంశీ."భోరుమంటూ ఏడ్చేసాడు రామకృష్ణ.


అవతల హేమంత పరిస్తితీ అదే. విన్నూ చేసినపనికి కుములిపోతోంది.


విన్నూ కాస్త కోలుకుంది. మౌనంగా మాటలురానిదానిలా శూన్యంలోకి చూస్తూ కూర్చున్న కూతురి పక్కనే కూర్చుని లాలనగా భుజం చూట్టూ చెయ్యి వేసేసరికి అంతవరకూ అణచివేసుకున్న దుఖం వరదలా పొంగి ప్రవహించింది.


"నాన్నా, నేను మోసపోయాను! రేవంత్ నీకు తెలుసుకదూ.. ప్రణవి అన్నయ్య. నేను అతన్ని ప్రేమించాను. అతను కూడా నన్ను ప్రేమిస్తున్నాడని అనుకున్నాను నాన్నా. నా హృదయం నిండా అతన్నే నింపుకుని ఆరాధించాను. మీకు ఈ విషయం చెప్పాలనుకునేలోగా.....” దుఖంతో కదలిపోతూ ఆయాసపడుతోంది.


“కానీ, రేవంత్ నన్ను ప్రేమించలేదుట. ‘నీవు నన్ను ప్రేమించావా?’ అంటూ ఫక్కున నవ్వేస్తూ తేలికగా మాటలాడేడు. తన పెళ్లి అతను ప్రేమించిన మరో అమ్మాయితో త్వరలో జరగబోతోందని చెప్పేసరికి నేను ఎంతో ఇన్ సల్ట్ గా ఫీల్ అయ్యాను నాన్నా.


ఛ, నేనే లవ్ అంటూ అతని వెంటపడి భంగపడ్డానన్న ఫీలింగ్ ను భరించలేకపోయాను. నామీద నాకే అసహ్యం కలిగింది. అందుకే అలా చేసుకోవలసివచ్చిందంటూ తండ్రి ఒడిలో వాలిపోయి ఏడుస్తున్న కూతురి జుట్టు నిమురుతూ, "ఎంతో తెలివిగలదానివనుకున్నాను విన్నూ! క్షణికావేశంలో తీసుకునే అనాలోచిత నిర్ణయాలు ఆత్మహత్యకు దారి తీయాల్సిందేనా? చెప్పు తల్లీ.


నీవు తీసుకున్న నిర్ణయం మంచిదికాదు. రేవంత్ ప్రాక్టికల్ మనిషని నీవు అర్ధం చేసుకోలేకపోయావు. ప్రేమ కూడా ప్రాక్టికల్ అంటాను నేను. నీవు కూడా తేలికగా తీసుకో. చదువులో బ్రిలియంట్ అనుకున్నానేగానీ, బొత్తిగా లోకజ్ఞానం, లౌక్యం, గడుసుతనం లేవు నీలో.


జరిగింది చాలా స్వల్పమైన విషయమైనా ప్రాణాలు తీసుకునేవరకూ తెచ్చుకున్నావు. నేను, అమ్మా నీకు ఉన్నాం విన్నూ. నీ భవిష్యత్ పై ఇటువంటి చిన్న చిన్న విషయాలు ప్రభావితంకాకూడ”దంటూ అక్కడనుండి నెమ్మదిగా బయటకు వచ్చేసాడు.


ఆ రాత్రి హేమంత తో “మన విన్నూకి కౌన్సిలింగ్ ఇచ్చి మామూలు మనిషిని చేయి హేమా”


హేమంత ముఖం ఎందుకో చిన్నబోయింది. కూతురికి తన పోలికే రాలేదు కదా అనుకుంటూ ఉలిక్కిపడిందో క్షణం.


“ఏమంటావు హేమా? నీమనసులో నీవేమనుకుంటున్నావో చెప్పనా? విన్నూ కూడా నాలాగే చేసిందేమిటా అనే కదూ?”


సర్పద్రష్టలా అతనిముఖంవైపే చూడసాగింది హేమంత.


"నాకు అంతా తెలుసు హేమా! ఈ పరిస్తితిలో నీకు గుర్తుచేసి నిన్ను బాధపెట్టాలని కాదు. మన పెళ్లికి ముందు మీ నాన్నగారు నీ గురించి అంతా చెప్పారు. దాచడం మంచిదికాదని, భవిష్యత్ లో సమస్యలు వస్తాయేమోనని.


మోహన్ అనే వ్యక్తి ని నీవు గాఢంగా ప్రేమించావని, అతనుకూడా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నిన్ను మోసంచేసి వేరే ఆమెను పెళ్లిచేసుకుంటే, ఆ బాధను భరించలేని నీవు ఆత్మహత్యా ప్రయత్నం చేసావని. అసలు జీవితంలో పెళ్లే చేసుకోనని అన్నావుట.


నాతో నీ పెళ్లికి శతవిధాల నచ్చచెప్పి ఒప్పించానని చెప్పారు. అప్పుడు నేనన్నాను. హేమంత నా జీవితంలోకి వస్తే నిజంగా హేమంతం వచ్చినంతంగా భావిస్తానని, నా ప్రాణంలా చూసుకుంటానని. నాకీ విషయం తెలిసినట్లుగా నీకు ఎప్పటకీ తెలియనివ్వనని కూడా చెప్పాను.


మన విన్నూ కోలుకోవాలని, నీవు దానికి ధైర్యం చెపుతావనే ఉద్దేశంతో తిరిగి గుర్తుచేయాలసి వచ్చింది. ప్రేమ వేరు, ఇష్టం వేరు. నేను నిన్ను ఇష్ట పడ్డాను. ఇష్టపడ్డాక ప్రేమించడం మొదలుపెట్టాను. నీ ప్రేమ విషయం తెలిసినా చాలా సహజంగా తీసుకున్నాను.


చెప్పు హేమూ.. నాతో ఆనందంగానే ఉన్నావుకదూ” లాలనగా అడిగాడు.


హేమంత తలెత్తి అతని కళ్లల్లోకి చూస్తూ, "కృష్ణా, నీవే నా జీవిత సర్వస్వం. నాకో అందమైన జీవితాన్ని ప్రసాదించిన నీకు నేనేమివ్వగల”నంటూ అతనిగుండెల్లో ఒదిగిపోయింది.

***

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం51 views0 comments

コメント


bottom of page