top of page
Writer's pictureSathyanarayana Murthy M R V

హోటల్ రాం ఏ. సి.

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి






Video link


'Hotel Ram A/C' written by M R V Sathyanarayana Murthy

రచన : M R V సత్యనారాయణ మూర్తి

అదొక చిన్న కాఫీ హోటల్.

అక్కడ చేరి పులి మేక ఆడేవారు కొందరు.అనుకోకుండా అక్కడ సరదాగా చదరంగం ఆడటం ప్రారంభించారు. ఆ సరదా ఎక్కడికి దారి తీసిందో కళ్ళకు కట్టినట్లు వివరించారు ప్రముఖ రచయిత ఎం. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి గారు.


పెనుగొండలో లింగాలవీధి చివర కాలవగట్టున ఉన్న కాఫీ హోటల్ తెల్లవారు ఝామునుంచి సందడిగా ఉంటుంది. సుబ్బారాయుడు దొడ్డిలో ఉండే రమణ పోద్దునే ఆర్. టి. సి. లో కండక్టర్ గా డ్యూటీ ఎక్కాలంటే రాం ఏ. సి. లో స్ట్రాంగ్ కాఫీ తాగితేనే గానీ అడుగుకూడా ముందుకు వేయడు.

రామచంద్రం చేసిన కాఫీ తాగి రోడ్ మీదకు వచ్చి నుంచుంటాడు. తిరుపతి నుంచి నర్సాపురం వెళ్ళే ఎక్సు ప్రెస్ బస్సు సరిగ్గా నాలుగున్నరకు పెనుగొండ వస్తుంది. రమణ రోడ్ మీద నిలబడి బస్సు ని దూరాన్నించి చూసి వంగుని ఎడమచేయి రోడ్ దగ్గరగా ఉంచుతాడు. అక్కడ స్టాప్ లేకపోయినా బస్సు ఆపి రమణని ఎక్కించుకుని వెళ్తాడు డ్రైవర్. ఎందుకంటే నిలబడిన వ్యక్తి వంగుని రోడ్ ని టచ్ చేసాడంటే అతను ‘స్టాఫ్’ అని అర్ధం.

అందుకే వాళ్ళు అలా బస్సుని ఆపుతారు. ఒకోసారి పాలకొల్లు సంతకు వెళ్ళే సూర్యనారాయణ కూడా రమణ వెనకే నిలబడి తిరుపతి బస్సు ఎక్కేవాడు. ఎక్సుప్రెస్ బస్సు ఎక్కాలంటే మినర్వా టాకీసు ఎదురుగా ఉన్న బస్సు స్టాండ్ కి వెళ్లి ఎక్కాలి.

పోద్దునే పొలాలకు వెళ్లి గేదెలపాలు తేవడానికి వెళ్ళే రైతులు, ఉదయం నడకకు వెళ్ళే రామకృష్ణ, శ్రీనివాస్, రత్నాజి, సుధాకర్ రామచంద్రం కాఫీ కడుపులో పడితేనేకానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రామచంద్రం మిలిటరీ లో పనిచేసి వచ్చిన మనిషి కనుక ప్రతి పనీ బాధ్యతగా క్వాలిటీతో చేయడం అలవాటు చేసుకున్నాడు. చివరకు గున్నయ్య మాస్టారు కూడా కాలవ రేవుకు వచ్చి వేప పుల్లతో పళ్ళు తోముకుని, రామచంద్రం కాఫీ తాగి తన రోజు వారీ పనులు మొదలుపెడతారు.

లింగాలవీది చివర పెద్ద రావిచెట్టు ఉంది. దాన్ని ఆనుకునే ఆంజనేయస్వామి గుడి ఉంది. ఆ గుడి గోడను ఆనుకుని తూర్పు,పడమరలగా వేసిన రేకుల షెడ్డులో ఉంటుంది రామచంద్రం హోటల్. ఊళ్ళో అందరూ రాముడు హోటల్ అంటే కుర్రకారు మాత్రం సరదాగా ‘హోటల్ రాం ఏ. సి. ’అని పిలుస్తారు. ఆరు గంటలకు వేడి వేడి ఇడ్లీ, ఉప్మా రెడీ చేస్తాడు రామచంద్రం.

ఇడ్లీ లోకి దబ్బకాయ చెట్నీ,సెనగపిండి చెట్నీ, కారప్పొడి ఉంటాయి. రోజు విడిచి రోజు పెసరట్టు వేస్తాడు. ఆ రోజు టిఫిన్ ప్రియులకు’పండగే పండగ’.

అల్లం జీలకర్ర పెసరట్టు ఒకడు అడిగితే ఇంకోడు అల్లం,పచ్చిమిర్చి,ఉల్లి కావాలంటాడు. చెట్లపల్లి భాను మాత్రం అల్లం,జీలకర్ర,ఉల్లి,పచ్చిమిర్చి అన్నీ వేసి పెసరట్టు కావాలంటాడు. తను ఒకటి తిని,రెండు వాళ్ళ నాన్నకు పార్సెల్ చేసి పట్టుకువేల్తాడు. గోపాలం మాస్టారు దత్తుడు రెండు పెసరట్లు,ఉప్మా తిని ఇంటికి నాలుగు పెసరట్లు పట్టుకువేల్తాడు. వీళ్ళ అందరి కళ్లుగప్పి గాంధీ తిన్నగా పెసరట్ల పెనం దగ్గరకే వెళ్లి తనకు కావలసినవి తినేసి వస్తాడు. పల్చగా నూనె ఓడుతూన్న పెసరట్టు ని అరటి ఆకులో వేసి, దానికి ఉప్మా జతచేసి ఘుమ ఘుమలాడుతున్న చెట్నీలతో పట్టుకువస్తున్న రామచంద్రాన్ని ‘నువ్వు రాముడువి కాదయ్యా భీముడివి’ అని వేళాకోళం ఆడతాడు మల్లిపూడి హరనాద్.

ఏడుగంటలు అయ్యేసరికి నిల్లావారి ఫౌండ్రీ లోకి వెళ్ళే కార్మికులు వచ్చి టిఫిన్ తినేసి వెళ్ళిపోతారు. హోటల్ లోపల ఖాళీ లేకపోతే బయట నిలబడే టిఫిన్ తింటారు. వాళ్ళవన్నీ అరువు ఖాతాలే. బుధవారం సాయంత్రం వాళ్లకు జీతాలు ఇచ్చేటప్పుడు రామచంద్రం ఫౌండ్రి దగ్గరకు వెళ్లి పద్దు పుస్తకం చూపించి తన బాకీ వసూలుచేసుకుంటాడు. కార్మికులకు ప్రతి బుధవారం నిల్లా వారి గుమస్తా దంతుర్తి పంతులు జీతాలు ఇస్తాడు. రాత్రి ఎనిమిది అయ్యేవరకు జీతాల బట్వాడా ఉంటుంది.

కాలవగట్టున ఉన్న ఫౌండ్రి దగ్గర ఆరోజు చాలా సందడిగా ఉంటుంది.

ఉదయం ఏడుగంటలు దాటగానే ‘పిచ్చి అప్పారావు’ రామచంద్రం హోటల్ ముందు వచ్చి నుంచుని తనలో తానె మాట్లాడుకుంటాడు. ఆ సమయానికి హరనాదో, గోపాలం గారి దత్తుడో ఉంటె వాడితో వేళాకోళం ఆది అందర్నీ నవ్వులతో ముంచెత్తే వారు.

“ఏరా అప్పారావు, సినిమా యాక్టర్ కృష్ణకుమారి ఫోన్ చేసిందట నిజమేనా?”అడిగాడు హరనాద్. “ఆ, ట్రంక్ కాల్ చేసి మాట్లాడింది”అన్నాడు అప్పారావు ముసి ముసిగా నవ్వుతూ.

“మరి నువ్వు కృష్ణకుమారిని పెళ్లి చేసుకుంటావా?”అడిగాడు దత్తుడు. బుర్ర అడ్డంగా ఊపాడు అప్పారావు. “ఏం, ఎందుకని?”రెట్టించి అడిగాడు దత్తుడు.

“తను ఎప్పుడూ గుర్రం మీద తిరుగుతుంది కదా. నన్ను కూడా గుర్రం మీద ఎక్కమంటుంది. నాకు గుర్రం అంటే భయం. అందుకే ఆ అమ్మాయిని చేసుకోను”సిగ్గుగా చెప్పాడు.

“మరి ఎవర్ని పెళ్లి చెసుకుంటావ్?”అడిగాడు హరనాద్.

“జమున్ని చేసుకుంటాను. ఇంచక్కా నవ్వుతూ మాట్లాడుతుంది. నన్ను కారులో మద్రాస్ అంతా తిప్పుతుంది”మెరుస్తున్న కళ్ళతో గర్వంగా చెప్పాడు అప్పారావు. వాడి మాటలకు హోటల్ లోని వాళ్ళు అందరూ పగలబడి నవ్వుతారు. హరనాద్ రామచంద్రం తో ‘రాముడు గారూ, అప్పారావు కి టిఫిన్ ఇవ్వండి’ అనగానే నాలుగు ఇడ్లీ,ఉప్మా ప్లేటులో పెట్టి ఇస్తాడు. రోజూ ఎవరో ఒకరు అప్పారావు కి టిఫిన్ పెట్టిస్తారు. ఎవరూ వాడికి టిఫిన్ చెప్పకపొతే రామచంద్రమే టిఫిన్ పెడతాడు.

అప్పారావు పాలకొల్లు కాలేజీలో డిగ్రీ చదివేటప్పుడు కల్పనని ప్రేమించాడు. ఆమె కూడా అప్పారావు ని ఇష్టపడింది. కానీ ఆమె తల్లితండ్రులు పేదవాడైన అప్పారావుని అల్లుడిగా చేసుకోవడానికి ఒప్పుకోలేదు. బాగా డబ్బున్న శేఖర్తో కూతురు పెళ్ళిచేసి అత్తారింటికి పంపేసారు. అప్పటి నుంచీ అప్పారావు మతిస్తిమితం కోల్పాయాడు. పగలు ఎక్కడ తిరిగినా రాత్రి అయ్యేసరికి హోటల్ పక్కనే ఉన్న ఆంజనేయస్వామి గుడి అరుగు మీదకు చేరుకుని అక్కడే పడుకుంటాడు.

పెనుగొండ లో ఇద్దరు పిచ్చివాళ్ళు ప్రజలకు వినోదం పంచుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు.

ఒకళ్ళు జవ్వాదివారి మేడ అరుగుమీద ఉండే ‘బియ్యా పంతులు’ రెండో వాడు లింగాలవీధిలో ఉండే అప్పారావు. విచిత్రం ఏమిటంటే ఇద్దరూ డిగ్రీ చదువుతూండగానే మతి స్థిమితం కోల్పోవడం. పంతులు గారికి ప్రేమ వ్యవహారం ఏమీ లేదు.

********

రామచంద్రం హోటల్ లో మధ్యాహ్నం టిఫిన్ల అమ్మకాలు అయిపోయాకా నలుగురూ చేరి పులి మేక ఆడుతూ ఉంటారు. పందేలు ఏమీ ఉండవు. సరదాగా ఆడుతూ ఉంటారు. సత్తిపండు, గాంధీ ఒకసారి చదరంగం పావులు, బోర్డు తీసుకువచ్చి ఆడటం మొదలు పెట్టారు.

భానుమూర్తి,దత్తుడు,హరనాద్ కూడా వాళ్ళతో ఆటలాడటం మొదలుపెట్టారు. ఒకవారం గడిచేసరికి రామచంద్రం వాళ్ళలో కలిసిపోయి చదరంగం ఆడటం నేర్చుకున్నాడు. క్రమేణా ‘పులి మేక’ ఆడేవాళ్ళు తగ్గిపోయి జనం చదరంగం ఆట దగ్గరచేరి చాలా ఉత్సాహంగా ఆటను గమనించసాగారు. చదరంగం ఆటలో రాజు,మంత్రి,ఏనుగు,గుర్రం,శకటం,సైనికుడు పావులు వాళ్ళని చాలా ఆకర్షించేవి. వాటి నడక కూడా విచిత్రంగా ఉండి వారిని ఆశ్చర్యానికి గురిచేసేవి.

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ‘వడ్ల గింజలు’ కథ గురించి సత్తిపండు చెబుతుంటే నోళ్ళు తెరుచుకుని వినేవారు. ఆ కథలోని చదరంగం గొప్పతనం గురించి తెలుసుకున్న యువకులు ‘ఏమైనా సరే చదరంగం నేర్చుకుని తీరాల్సిందేనని’ నిర్ణయించుకున్నారు. వెంటనే తణుకు వెళ్లి కోర్ట్ ఎదురుగా ఉన్న గుప్తా స్టోర్స్ నుంచి చదరంగం సెట్టు కొని తెచ్చుకున్నారు. ఆ విధంగా రాం ఏ. సి. లో రెండో చదరంగం బోర్డు వెలిసింది.

వాళ్లకు గాంధీ గురువు. రోజూ పోద్దునే హోటల్లో నేతి ఇడ్లీ,కారప్పొడి మధ్యాహ్నం మైసూరు బజ్జీ గాంధీకి శిష్యులు ఇప్పించాలి. ఆ ఒప్పందం మీదే గాంధీ వాళ్లకు గురువుగా ఉండటానికి అంగీకరించాడు.

హోటల్ రాం ఏ. సి. లో చదరంగం నేర్పుతున్నారన్న వార్త, ‘జ్యోతిలక్ష్మి చీరకట్టిందన్న’సెన్సేషనల్ న్యూస్ గా గాంధీబొమ్మల సెంటర్లో మారుమోగింది. సాయంత్రం నాలుగు దాటాకా జనం చదరంగం ఆటలు చూడటానికి రాసాగారు. అయితే అప్పటికే కాలవగట్టున ఉన్న శాఖా గ్రంధాలయం లో సాయంకాలాలు చదరంగం ఆటలు జరుగుతున్నాయి. అవన్నీ తలపండిన (తలనెరిసిన) వాళ్ళ బాచ్ వి.

సుబ్రహ్మణ్యం మాస్టారు,నరసింహం మాస్టారు,పరకాల రాజా గారు,భూమి తనఖా బ్యాంకు మేనేజర్ భాస్కరరావు గారు, లైబ్రేరియన్ తమ్మయ్య వంటి హేమాహేమీలు అందరూ ఆడేవారు. కుర్రకారుకి ఆడే అవకాశమే ఉండేది కాదు. చూసి ఆనందించడమే తప్ప.

కానీ హోటల్ రాం ఏ. సి. లో జరిగే చదరంగం ఆటల దగ్గర ‘ఒరేయ్ ఆ గుర్రాన్ని కొట్టెయ్’ ‘ఈ బంటుని లాగేయ్’ ‘మంత్రితో ఏనుగుని మింగేయ్’ అని ఉచిత సలహాలు ఇవ్వవచ్చు. అవతల వాడు ఈ సలహాని వింటే వినవచ్చు లేదా ‘నోర్మూయరా తింగరఎదవా’ అని ఆశీర్వదించవచ్చు. అన్నీ టేక్ ఇట్ ఈజీ పాలసీ. అంతా సరదాగా, హేపీగా ఉంటారు ఇక్కడ. సుబ్రహ్మణ్యం మాస్టారి పెద్ద అబ్బాయి సూర్యం గారు దసరా సెలవలకు వచ్చినప్పుడు రాం ఏ. సి. ఆటగాళ్లకు చదరంగం ఆటలో చాలా మెలవకువలు నేర్పారు. ఆయన కొత్తగూడెం లో బొగ్గు గనులలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. రామచంద్రం కి కూడా సూర్యంగారు అంటే చాలా గౌరవం. ఆ విధంగా ముగ్గురు,నలుగురు మెరికల్లాంటి వారు తయారయ్యారు చదరంగం ఆటలో.

రెండేళ్ళు గడిచాయి. నవంబర్ లో జరిగే గ్రంధాలయ వారోత్సవాలలో చదరంగం పోటీలు కూడా పెట్టారు. ఒకరోజు సాయంత్రం దత్తుడు రాం ఏ. సి. లో మీటింగ్ పెట్టాడు.

“రాముడు గారూ, గ్రంధాలయం లో జరిగే చదరంగం పోటీలలో మన వాళ్ళు కూడా పాల్గొనాలి. మన సత్తా ఏమిటో చూపించాలి”అన్నాడు దత్తుడు ఉత్సాహంగా.

“అలాగే. మరి ఎవరు ఆడతారో మీరే నిర్ణయించండి”అన్నాడు రామచంద్రం.

దత్తుడు అందరికేసి చూసి “సత్తిపండు, గాంధీ మన తరపున ఆడితే బాగుంటుందని నా అభిప్రాయం”అన్నాడు.

దత్తుడు నిర్ణయానికి అంగీకారంగా అందరూ చప్పట్లు కొట్టారు.

“ఇంకో విషయం”అన్నాడు దత్తుడు. ఏమిటి అన్నట్టు అందరూ అతనికేసి తిరిగారు.

“గ్రంధాలయ పోటీల్లో చదరంగంలో నెగ్గిన మన వాడికి, మన రాం ఏ. సి. లో నా స్వంత ఖర్చులతో సన్మానం చేసి నేనూ ఓ కప్పు బహుమతిగా ఇస్తాను. అంతేకాదు వాడిని తణుకు తీసుకువెళ్ళి నరేంద్ర టాకీసులో ఉదయం ఆట సినిమా చూపించి రాజకమల్ హోటల్ లో భోజనం పెట్టిస్తాను”అన్నాడు దత్తుడు.

ఈసారి మరింతగా చప్పట్లు మోగాయి. సత్తిపండు, గాంధీ లలో దత్తుడు ప్రకటనతో కొత్త ఆశలు చిగురు తొడిగాయి. గ్రంధాలయం లో ఇచ్చే బహుమతి కన్నా రాం ఏ. సి. లో పొందే కప్పు, తణుకు జాలీ ట్రిప్ వాళ్ళని ఊహాలోకంలో విహరింపచేసింది.

సాయంకాలాలు సరిపోక రాత్రిళ్ళు కిరసనాయిల్ దీపాలు పెట్టుకుని చదరంగం ఆటలు ప్రాక్టీసు చేయడం మొదలుపెట్టారు సత్తిపండు,గాంధీ. జనార్ధనస్వామి గుళ్ళో ఆచారి గారి చేత ముహర్తం పెట్టించుకుని ఆ రోజు గ్రంధాలయానికి వెళ్లి సత్తిపండు,గాంధీ ల పేర్లు ఇచ్చి ఎంట్రీ ఫీజు కట్టి వచ్చాడు రామచంద్రం. హైస్కూల్, కాలేజీ పిల్లలే కాకుండా లింగాలవీది హోటల్ నుంచి కూడా చదరంగం పోటీలకు కుర్రాళ్ళు వస్తున్నారన్న వార్త పెనుగొండలో చర్చనీయాంశమయ్యింది. కాలేజీ లెక్చరర్లు,హై స్కూల్ మాస్టర్లు తమవిద్యా సంస్థల పిల్లలకు చదరంగంలో శిక్షణ ముమ్మరం చేసారు.

కుర్రకారు మరో ముందడుగు వేసి చదరంగం పోటీ విజేతల మీద పందాలు కాయడం ప్రారంభించారు. కాలేజీ వాళ్ళే గెలుస్తారని కొంతమంది,లేదు లేదు హై స్కూల్ వాళ్ళే గెలుస్తారని మరికొంతమంది పందాలు కాసారు. ఈ సంగతి విన్న దత్తుడికి వళ్ళుమండిపోయింది. మా లింగాలవీది హోటల్ రాం ఏ. సి. ఆటగాళ్లే గెలుస్తారని ‘కోసు’పందెం కాసాడు. పందాల సంగతి తెలిసి, సత్తిపండు గాంధీ లకు టెన్షన్ పెరిగిపోయింది. ఆటలో నెగ్గకపోతే పరువు పోతుందని భయపడ్డారు. సత్తిపండు మహిషాసుర మర్ధని అమ్మవారికి, గాంధీ కన్యకాపరమేశ్వరి అమ్మవారికి, రామచంద్రం జనార్ధనస్వామి కి మొక్కులు మొక్కుకున్నారు. ఈ పందాల సంగతి సర్పంచ్ గారికి కూడా తెలిసింది. లైబ్రరీ తమ్మయ్య కి కబురుచేసి పోటీలో పాల్గొనే వారికి కాఫీ,టిఫిన్లు ఇవ్వదమేగాక గెలిచినవారికి తాను ప్రత్యేకంగా పెద్ద కప్పు బహుమతిగా ఇస్తానని చెప్పారు.

అనుకున్న రోజు రానే వచ్చింది. సర్పంచ్ గారి ఆదేశాలమేరకు గ్రంధాలయం బయట పెద్ద స్టేజి వేసి దాని మీద చదరంగం పోటీలు ఏర్పాటుచేశారు. దసరా పండుగకు లింగాలవీది దొరయ్యగారి రామాలయం వద్ద జరిగే ‘పెద్దాపురం పాప’ డాన్స్ చూడటానికి వచ్చినట్టుగా జనం విరగపడి వచ్చారు.

కాలేజీ కుర్రాడు కిరణ్ తన తోటి ఆటగాళ్ళను చిత్తు చిత్తుగా ఓడిస్తున్నాడు. గాంధీ సెమీ ఫైనల్ వరకూ వచ్చి ఓడిపోయాడు. రామచంద్రం,దత్తుడు,హరనాద్,భానుమూర్తి ల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.

అందరి ఆశలూ సత్తిపండు పైనే ఉన్నాయి. సర్పంచ్ గారు కూడా చాలా ఆతృతగా ఉన్నారు ఎవరు గెలుస్తారా అని. మధ్యాహ్నం పన్నెండు గంటలకు కిరణ్,సత్తిపండు ఫైనల్ కి వచ్చారని రిఫరీ పరకాల రాజా గారు అనౌన్స్ చేసారు. సర్పంచ్ స్వయంగా రెండు కూల్ డ్రింకులు తీసుకువచ్చి కిరణ్,సత్తిపండు లకు ఇచ్చి బెస్ట్ అఫ్ లక్ చెప్పి వెళ్ళారు.

కాలేజీ లెక్చరర్లు అందరి మొహాలు ఆనందంగా వెలిగిపోతున్నాయి. విజయం తమ విద్యార్థి కిరణ్ దేనని చాలా ధీమాగా ఉన్నారు. ‘కాఫీ హోటల్ లో కిరసనాయిల్ దీపం ముందు కూర్చుని ప్రాక్టీసు చేసిన ‘పిల్లకాకి’ సత్తిపండు ఓడిపోవడం ఖాయమని’, అతణ్ణి చూసి హేళనగా నవ్వుతూ అన్నాడు ఓ కుర్ర లెక్చరర్. అది విన్న దత్తుడు ఆవేశంగా ఏదో అనబోతే,రామచంద్రం వారించాడు.

ఆట మొదలయ్యింది. కిరణ్ విజయ గర్వంతో ఎత్తులు వేస్తున్నాడు. సత్తిపండు ఆచి తూచి ఎత్తులు వేస్తున్నాడు. సత్తిపండు ఏనుగుకి కాపలా లేకుండా ఉండడం గమనించి తన మంత్రితో ఆ ఏనుగుని చంపేసాడు కిరణ్. అందరూ ఒక్కసారి విస్తుపోయారు. కానీ సత్తిపండు అదేం పట్టించుకోకుండా తన రెండు గుర్రాలను వేగంగా నడుపుతూ కిరణ్ రాజుకి ‘చెక్’చెప్పాడు. కొంచం పక్కకు జరిపాడు తన రాజుని కిరణ్.

రెండో గుర్రం ముందుకు జరిపి మళ్ళీ ‘చెక్’ చెప్పాడు సత్తిపండు. కిరణ్ యొక్క రాజు ఎటూ కదలలేక ఆగిపోయాడు. అష్టదిగ్బంధనం జరిగింది. సత్తిపండు గెలిచాడు. కిరణ్ ఓడిపోయాడు.

లెక్చరర్ల మొహాలు నల్లగా మారిపోయాయి.

పావుగంట విశ్రాంతి తర్వాత మళ్ళీ ఆట ప్రారంభం అయ్యింది. కిరణ్ కి ఒక విషయం అర్ధం అయ్యింది. సత్తిపండు తన రెండు గుర్రాలతోనే తన ఆట కట్టేశాడు అని. అందుకని అతని రెండు గుర్రాల్ని చంపేస్తే అతను బలహీనపడతాడని నిర్ణయించుకుని, తన రెండు ఏనుగులు పోగోట్టుకుని, సత్తిపండుకి రెండు గుర్రాల్ని లేకుండా చేసాడు. ఈ చర్యకు సత్తిపండు ఒక్కసారి ఖిన్నుడైపోయాడు. అతని మొహం చూసి కిరణ్ చిన్నగా నవ్వాడు. ’నీకున్న ప్రతి బలగాన్నీ ఒక మంత్రిలా,అజేయశక్తిగా మలచుకో’అని చెప్పిన సూర్యం గారి మాటలు గుర్తు తెచ్చుకున్నాడు సత్తిపండు. భయాన్ని పక్కకు నెట్టాడు. ఒక రిద్దరు సైనికుల్ని అనాలోచితంగా ముందుకు జరిపినట్టు జరిపి, కిరణ్ ఆలోచనల్ని పక్కదారి పట్టించి తన రెండు ఏనుగుల్ని ముందుకు తీసుకువచ్చి కిరణ్ ఆట కట్టించేసాడు సత్తిపండు. ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య పరకాల రాజా గారు సత్తిపండుని విజేతగా ప్రకటించారు. సర్పంచ్ సత్తిపండుకి షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించారు.

గ్రంధాలయం వారి బహుమతితో పాటు తను వాగ్దానం చేసిన పెద్ద కప్పుని కూడా సత్తిపండుకి ఇచ్చి ఆశీర్వదించారు సర్పంచ్. విజేతగా నీ అభిప్రాయం చెప్పమన్నారు ఆయన.

“అందరికీ నమస్కారం. నన్ను ఈ పోటీలకు ఎంపిక చేసిన మా దత్తుడుగారికి నా కృతజ్ఞతలు.

ప్రతీ రోజు రాత్రి పన్నెండు గంటల వరకూ తన హోటల్ లో మేం ప్రాక్టీసు చేయడానికి అనుమతి ఇవ్వడమే గాక మాతోపాటే ఉంటూ మాకు కాఫీ,టీలు ఇచ్చిన రామచంద్రం గారికి నా ప్రత్యెక కృతజ్ఞతలు. మా బృందానికి చదరంగంలో మెళకువలు చెప్పిన ఇంజనీర్ సూర్యం గారికి నా నమస్కారాలు. ఇందాకా ఒక పెద్దాయన అన్నారు’కిరసనాయిల్ దీపం ముందు ప్రాక్టీసు చేసిన వాడు, వీడెం గెలుస్తాడని? కానీ వీధి దీపాలవెలుగులో చదువుకుని ఉన్నత స్థితికి చేరిన మహానుభావులు మన దేశంలో ఎందఱో ఉన్నారని వారికి గుర్తు చేస్తున్నాను. మట్టిలో మాణిక్యాలు కూడా ఉంటాయి. వారిని ప్రోత్సహించేవారే ఉండాలి. మా హోటల్ రాం ఏ. సి. మిత్రబృందం విజయమే ఇది అని నేను నిమిత్తమాత్రుడనని వినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను” అన్నాడు సత్తిపండు. ఆ ప్రాంగణమంతా మరోసారి చప్పట్లతో మారు మోగింది.

ఒక ఆదివారం సాయంత్రం దత్తుడు హోటల్ రాం ఏ. సి. లో మీటింగ్ పెట్టి వచ్చిన వాళ్ళందరికీ వినాయక స్వీట్ షాప్ నుంచి కజ్జికాయ, వేరుసెనగ పకోడీ తెప్పించి ఇచ్చాడు.

రామచంద్రం యాలకులు వేసిన చిక్కని టీ ఇచ్చాడు. రామచంద్రం చేతులమీదుగా సత్తిపండుకి రాజమండ్రి నుంచి కొని తెచ్చిన పెద్ద కప్పు బహుమతిగా అందజేశాడు. ‘సత్తిపండు మనందరి పరువు కాపాడి, రాం ఏ. సి. పేరు ఊరు ఊరంతా మారు మోగేటట్టు చేసాడని ‘ గున్నయ్య మాస్టారు కూడా అభినందించారు. ఆ మరుసటి ఆదివారం ఒక్క సత్తిపండునే కాకుండా మిత్రబృందం అందర్నీ తణుకు తీసుకువెళ్ళి నరేంద్ర టాకీసులో సినిమా చూపించి రాజకమల్ హోటల్ లో భోజనం పెట్టించి తన మాట నిలబెట్టుకున్నాడు దత్తుడు.

అప్పటినుండీ దత్తుడు మాటంటే మిత్రబృందం అందరికీ ‘సుగ్రీవాజ్నీ’ అదండీ మా పెనుగొండ “హోటల్ రాం ఏ. సి. ” కథ.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలు :

రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V

ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.


140 views2 comments

2 Comments


pv raju • 7 days ago

నాకు చదరంగంలో ప్రవేశంలేదు కానీ మీ కథ విని ఎంతగానో ఆనందించాను.అభినందనలు.కృతజ్ఞతలు. పివిరాజు

Like

Malapaka Rajeswari • 6 days ago

కధ చాలా బావుంది, మీరు చదివిన విధానం కూడా బావుంది, మీకు రచయిత గారి కి అభినందనలు

Like
bottom of page