ఇదే ఇదే జీవితం..
- Pamarthi Vira Venkata Sathyanarayana

- 1 day ago
- 8 min read
#Thirumalasri, #తిరుమలశ్రీ, #IdeIdeJeevitham, #ఇదేఇదేజీవితం, #TeluguHeartTouchingStories

Ide Ide Jeevitham - New Telugu Story Written By Thirumalasri
Published In manatelugukathalu.com On 09/12/2025
ఇదే ఇదే జీవితం.. - తెలుగు కథ
రచన: తిరుమలశ్రీ
నెల్లాళ్ళ తరువాత జెయిల్లోంచి బైట అడుగుపెట్టడంతో గుండెలనిండా ఊపిరి పీల్చుకున్నాను నేను. పంజరంలో బంధింపబడ్డ చిలుకకు స్వేచ్ఛ లభించినట్లనిపించింది. వసుధైకకుటుంబం అంటూ చంకలు కొట్టుకునే ఈ లోకంలో ఏకాకిని నేను.. పాతికేళ్ళక్రితం చెత్తకుండీలో పడున్న ఓ పసికందును అక్కున చేర్చుకుని జీవితం ఇచ్చారు ఓ పుణ్యదంపతులు. దురదృష్టవశాత్తూ నా ఐదవ ఏటనే ఆ పుణ్యదంపతులు ఓ ప్రమాదంలో మరణించడంతో అనాథనయ్యాను. ఆ తరువాత నేను ఎక్కడ పెరిగానో, ఎలా పెరిగానో- ఈ విశ్వంలో ఇద్దరికే ఎరుక. ఒకరు- ఉనికికోసం పోరాడే నేనైతే, మరొకరు- ఉన్నా కనిపించని ఆ దేవుడు! ఆకలి నీతి ఎరుగదు. పొట్టకోసం పసివయసులోనే దొంగనయ్యాను.
ఇంటివద్ద పిల్లలు గుర్తుకురావడంతో, ’పాపం, పసివాళ్ళు.. ఏమైపోయారో!’ అనిపించి మనసు విలవిల లాడిపోయింది. జెయిల్ కు వెళ్ళివచ్చినవాడంటే అందరికీ భయమే కాబోలు. నన్ను చూడగానే పశ్చిమ కనుమల వెనుక దాక్కున్నాడు సూర్యుడు.
గుమ్మంలోనే నాపైన విరుచుకుపడింది సత్తెమ్మ మామ్మ – “నెల్లాళ్ళుగా కంటికి కనిపించకుండా పోతే ఈ పిల్లలు ఏమైపోతారనుకున్నావ్రా?” అంటూ.
సత్తెమ్మ మామ్మకు యాభై ఏళ్ళుంటాయి. నేను ఊరిమీద పడితే, ఇంటిపట్టున ఉండి నా పిల్లల్ని సాకేది ఆమే. మామ్మకు నా వృత్తి ఏమిటో తెలియదు. నా ప్రవృత్తి మాత్రమే ఎరుగును ఆమె. అందుకే నేను జెయిల్ కు వెళ్ళానన్న నిజం చెప్పదలచుకోలేదు.
నా గొంతుక ఆలకించి, ’డాడీ!’ అంటూ లోపలినుండి పరుగెత్తుకొచ్చారు పిల్లలు. అరడజనుమంది. ఏడాది నుండి ఐదేళ్ళ వయసులున్న ఆడపిల్లలు. అందరిలోకీ చంటిదైన బుజ్జిని ఎత్తుకుని ముద్దులాడాను. జేబులోంచి ఫైవ్ స్టార్ చాక్లెట్ తీసి చేతికిచ్చాను. ముఖం చాటంత అయింది పాపకు. ’డాడీ, నాకో!’ అంటూ మిగతావాళ్ళు కూడా గెంతుతూ చేతులు చాచడంతో అందరికీ తలోటీ ఇచ్చాను. వారి వదనాలలోని వెలుగు చూస్తూంటే నా మది ఆనందంతో నిండిపోయింది.
“బోలెడు రోజులు కనిపించలేదు నువ్వు. ఎక్కడికి వెళ్ళావు, డాడీ?” అనడిగింది ఐదేళ్ళ ఉష. అందరిలోకీ పెద్దది అది.
“ఊరికి వెళ్ళానమ్మా” అన్నాను.
లత, పద్మలు రెండేసి ఏళ్ళ వారైతే.. లక్ష్మికి నాలుగేళ్ళు, రాణికి మూడేళ్ళూను. అందరినీ ఎత్తుకుని ముద్దులు పెట్టుకున్నాను.
“ఏం పిల్లలో ఏమోరా, రాజూ! చంటివాళ్ళిద్దరూ డాడీ కావాలని పేచీ పెడితే, పెద్దవాళ్ళు ముగ్గురూనేమో ఒంటరిగా కూర్చుని ఏడ్చేవాళ్ళు, ” మామ్మ చెబుతూంటే, కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి నాకు. ఏనాటి అనుబంధమో అది!
“కొంపదీసి వీళ్ళను కొట్టలేదుకదా నువ్వు?” కంగారుగా అడిగాను.
చిన్నగా నిట్టూర్చింది ఆమె. “ఈ చిట్టితల్లుల్ని కొట్టడానికి ఎవరికైనా చేతులెలా వస్తాయిరా, రాజూ! పాతికేళ్ళకే ఆరుగురు పసిపాపలకు తండ్రివైన గొప్పవాడివి నువ్వు.. ఆడపిల్లలు అని కన్నవాళ్ళే కసాయివాళ్ళై పసికందుల్ని చెత్తకుండీలో పడేస్తే, పెద్దమనసుతో తెచ్చి నెత్తికెక్కించుకున్న దేవుడివి నువ్వు! ఇది ఏ జన్మ ఋణమో!” చేతులు జోడించింది.
కేవలం స్త్రీ శిశువు అన్న కారణంగా కన్నవారు కఠినాత్ములై బిడ్డల్ని పురిటిలోనే చెత్తకుండీలో పడేస్తే, అదృష్టవశాత్తూ వాళ్ళు నా కంట పడడంతో ఆ శిశువులను తెచ్చి పెంచసాగాను. ఒక పాపతో మొదలయింది కాస్తా మరో ఐదుగురు తోడైతే- అది నాకు ఆనందం కలిగించిందే తప్ప, భారమని ఎప్పుడూ అనిపించలేదు. పదేళ్ళక్రితం భర్తను కోల్పోయి ఒంటరిగా బ్రతుకుతూన్న సత్తెమ్మను చేరదీసి పిల్లల సంరక్షణాబాధ్యతను అప్పగించాను.
ఓరోజు– నాంపల్లిలో జరుగుతూన్న ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో ఓ యువతి మెళ్ళోని హారం కత్తిరిస్తూ దొరికిపోయాను నేను. నా చెంప ఛెళ్ళుమనిపించిందామె.
“ముడతలులేని డ్రెస్ తొడుక్కుంటే సరిపోదు. మనసుకూడా మరకలు లేకుండా చూసుకోవాలి. పరువుగా బ్రతకడం చేతకాకపోతే ఏ చెరువులోనో పడి చావడం మేలు!” అంటూ ఆమె తీక్షణంగా మందలిస్తూంటే, అవాక్కయి ఆమె వదనంలోకి చూస్తూండిపోయాను.
ఇరవయ్యేళ్ళుంటాయి ఆమెకు. కనకాంబరపు రంగు కాటన్ శారీలో సింపుల్ గా ఉంది. సమ్మోహితం చేసే కలువల్లాంటి కాటుకకనులు, నల్లత్రాచులా పిరుదులను అంటే జడ.. సామాన్య రూపమే ఐనా, ఏదో అద్వితీయమైన ఆకర్షణ ఆమెలో.
#
ఆర్నెల్ల తరువాత- ఉషను బళ్ళో చేర్పించుదామని ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళాను. అనుకోకుండా అక్కడ కనిపించిన ఆ యువతిని చూసి ఖంగుతిన్నాను.
ఆమెకు నేనింకా గుర్తున్నట్లున్నాను, ఉషను చూసి, “ఈ పాప నీ కూతురా?” అనడిగింది.
ఔనన్నాను. నవ్వుతూ పాపను ముద్దాడింది.. తన పేరు మమత అనీ, అదే బళ్ళో టీచర్ గా పనిచేస్తున్నాననీ చెప్పింది. తాను దగ్గర ఉండి పాపకు అడ్మిషన్ ఫార్మాలిటీస్ పూర్తిచేయించింది.
’థాంక్స్’ చెప్పి వచ్చేస్తూంటే, “నీకెంతమంది పిల్లలు?” అనడిగిందామె యథాలాపంగా.
నా సమాధానం విని ఉలికిపడింది. నావంక కోపంగా చూస్తూ, “నీకేమైనా బుద్ధుందా? ఈ వయసులోనే ఆరుగురు ఆడపిల్లలకు తండ్రివయ్యావంటే.. నువ్వెంతటి మూర్ఖుడివో అర్థమౌతోంది. దొంగతనాలతోనే వాళ్ళందర్నీ పోషించగలననుకుంటున్నావా?”
ఆమె ఆత్మీయురాలిలా చనువుగా మందలిస్తూంటే చిత్రంగా అనిపించింది నాకు. “నీ భార్యతో మాట్లాడాలి నేను, పద” అంది.
ఆటో ఎక్కి ఉష పక్కను కూర్చుంటూ, “డ్రైవర్ ఎక్కడా?” అనడిగిందామె.
“ఇడుగో!” అంటూ వెళ్ళి డ్రైవర్ సీట్లో కూర్చున్నాను నేను. “నువ్వా!?” అంది సంభ్రమంగా.
“ఒక ఐడియాయే కాదు, ఓ చెంపదెబ్బ కూడా జీవితాలను మార్చేస్తుంది!” అన్నాను నవ్వుతూ.
మా ఏరియా కార్పొరేటర్ సాయంతో ఆటో ఒకటి అద్దెకు తీసుకుని పాతజీవితానికి స్వస్తి చెప్పాను నేను.
ఇంటి దగ్గర ఆటో ఆగగానే పిల్లలందరూ బిలబిలమంటూ వచ్చి నాకు చుట్టుకుపోయారు. “వీళ్ళేనండీ నా చిన్నారులు” అన్నాను. ఆమెను మామ్మకు పరిచయం చేసాను.
“రాజు భార్య ఇంట్లో లేదా, మామ్మా?” అనడిగింది మమత లోపలికి దృష్టి సారిస్తూ.
మామ్మ నావంక సాశ్చర్యంగా చూసింది. చిరునవ్వు నవ్వి, “ఇప్పుడే వస్తాను, మీరు మాట్లాడుతూండండి” అని చెప్పేసి బుజ్జిని, లతను చెరో చంకనూ ఎత్తుకుని, మిగతా పిల్లలు వెంటరాగా వీధి చివరనున్న షాపుకు వెళ్ళాను. పిల్లలకు చాక్లెట్స్ ఇప్పించి, స్ప్రైట్ బాటిల్ ఒకటి తీసుకున్నాను.
నేనిచ్చిన డ్రింక్ ను మొహమాటంగా అందుకుంటూ నావంక నిశితంగా చూసింది మమత.
మామ్మ అంతా వివరించినట్టుంది, “నువ్వు నిజంగానే మహోన్నతుడివి, రాజూ! నిన్ను అపార్థం చేసుకున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను” అంది.
ఆ తరువాత మమత తరచు మా ఇంటికి వచ్చి పిల్లలతో ఆడుకుని వెళ్తూండేది. వాళ్ళకోసం తినుబండారాలో, ఆటవస్తువులో తెస్తూండేది. కొత్త బట్టలు కొనేది. జడలు వేసి పూలు పెట్టేది. కొద్ది రోజులలోనే పిల్లలంతా ఆమెకు చేరికయిపోవడం, ’అక్కా’ అని పిలవడం జరిగింది.
దయమాలిన దేవుడు చిన్నతనంలోనే తల్లిదండ్రులను తీసుకుపోవడంతో మేనమామ దగ్గర పెరిగింది మమత. డిగ్రీ పాసై, ట్రెయినింగ్ పూర్తి చేసుకుని ఆ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ ఉద్యోగం సంపాదించుకుంది. ఉద్యోగరీత్యా ఆ ఊళ్ళో ఒంటరిగా ఉంటోంది.
కాలంతోపాటు మా స్నేహంకూడా వయసు పోసుకుంది. చిలవలు పలవలు వేసుకుని, ప్రేమగా పుష్పించింది.. ఉష ఇప్పుడు రెండోతరగతి చదువుతోంది. లక్ష్మి ఫస్ట్ క్లాస్ లో చేరింది.
“ఇంకెన్నాళ్ళురా రాజూ, మీరిద్దరూ ఇలా దూరంగా ఉండడం? ఆ మూడుముళ్ళూ పడిపోతే.. నీకో జోడూ, పిల్లల్ని సాకడంలో నాకో తోడూ దొరుకుతాయి, ” అంది సత్తెమ్మ మామ్మ ఓ రోజున.
మమతను చూసి వారం రోజులయింది. కనీసం ఫోన్ కూడా చేయలేదు. “మమతమ్మ వచ్చి వారం పైనే అయిపోయింది. పిల్లలుకూడా అడుగుతున్నారు. ఓపాలి ఎల్లి ఎలాగుందో చూసిరాకూడదట్రా, రాజూ?” అంది మామ్మ, నా మదిలోని ఆలోచనను పసిగట్టినదానిలా.
“అలాగేలే మామ్మా!” అన్నాను. ఆ రోజు మా పెళ్ళి ప్రస్తావన కూడా తేవాలని నిశ్చయించుకున్నాను..
కాని, చుప్పనాతి విధి మరోసారి నా జీవితంతో ఆడుకుంటుందని
ఊహించలేకపోయాను!.. మమత ఎక్కడ ఉందో తెలుసుకుందామని ఫోన్ చేస్తే, ఆమె సెల్ ఆఫ్ లో ఉంది. అంతలో జానకి దగ్గరనుండి కాల్ వచ్చింది. జానకి మమత సహోద్యోగి, స్నేహితురాలూను. లోగడ ఒకటి రెండు సార్లు కలుసుకున్నాను ఆమెను.. నాలుగురోజుల క్రితం మమత హాస్పిటల్లో అడ్మిట్ అయిందని చెప్పింది. వివరాలు పూర్తిగా వినకుండానే ఆసుపత్రికి పరుగెత్తాను.
అక్కడ నేను ఆలకించిన భయంకర నిజం నన్ను నివ్వెరపాటుకు గురిచేసింది.. మమతకు బ్రెస్ట్ క్యాన్సర్! అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉందట!!.. నా గుండెను ఎవరో పిడికిట్లో బిగించి గట్టిగా పిండుతున్నట్టు విలవిలలాడిపోయాను. తన అనారోగ్యం గురించి మాటమాత్రంగానైనా నాతో ఎప్పుడూ చెప్పలేదు ఆమె. క్యాన్సర్ వార్డ్ లో బెడ్ మీద పడున్న మమత నన్ను చూసి నీరసంగా నవ్వింది.
“ప్రాణం మీదకొచ్చేంతవరకు ఎందుకు ఉపేక్ష చేసావు, మమతా? ముందే నాకెందుకు చెప్పలేదు? ఎందుకు??” ఉద్వేగంతో నిండిన నా స్వరంలో బాధ, కోపం, నిష్ఠూరం మిళితమయ్యాయి. నా కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరిగాయి. దుఃఖంతో గొంతుక బొంగురుపోయింది.. అనునయంగా నా చేతిమీద చేయి వేసిందామె.
సత్తెమ్మ మామ్మను ఆసుపత్రికి తీసుకువెళ్ళాను. ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా తిరిగే మమతను ఆ స్థితిలో చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుంది మామ్మ. ఆమెకు తగ్గిపోవాలని చేతులు జోడించి దేవుళ్ళందరికీ మొక్కుకుంది.
పిల్లలు, ’అమ్మ ఎక్కడ?’ అని అడగడం ప్రారంభించారు. ’అక్కా’ అని పిలిచే పిల్లలకు ’అమ్మా’ అని పిలవడం మెల్లగా అలవాటు చేసింది మామ్మ. ’అమ్మ ఊరికెళ్ళిందనీ, వచ్చేస్తుందనీ’ చెప్పి సముదాయించసాగాము.
మూడు రోజుల తరువాత జానకి ఫోన్ చేసింది. గతరాత్రి నుండీ మమత పరిస్థితి బాగోలేదట. డాక్టర్లు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటున్నారని చెప్పింది.. వెంటనే ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ని కలిసాను. వారం రోజుల లోపున సర్జరీ జరిగితే ఆమెను దక్కించుకునే అవకాశం ఉంటుందనీ, అదీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సేననీ చెప్పాడు అతను.
ఆపరేషన్ కు రెండు లక్షలు ఔతుందన్నాడు. దుఃఖం ముంచుకువచ్చింది నాకు.
రెండు లక్షలు!.. వారం రోజులు కాదుగదా, ఏడాది గడువిచ్చినా నేను కళ్ళనైనా చూడలేనంతటి సొమ్ము అది! ఎవర్ని అడగాలో, ఎలా సంపాదించాలో బోధపడలేదు నాకు. మునుపటి సంగతి వేరు. ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. నిజాయితీగా బ్రతుకుతున్నాను.. చేతులారా మమతను పోగొట్టుకోలేను. ఏదో ఒకటి చేయాలి! ఆమెను బ్రతికించుకోవాలి!
మా ఏరియా కార్పొరేటర్ని అడిగాను. నావంక పిచ్చివాణ్ణి చూసినట్టు చూసాడు. ఆటో ఓనర్ని అడిగితే, నోటికొచ్చినట్టు బూతులు తిట్టి పంపేసాడు. జానకితో కలసి వెళ్ళి స్కూల్ ప్రిన్సిపాల్ ను కలుసుకున్నాను. స్కూలు తరపున సాయం చేయమని అర్థించాను. “రూల్స్ ఒప్పుకోవు” అన్నాడు అతను.
మమతను పెంచిన మేనమామ ఏదో ఊళ్ళో ఉన్నట్టు చెప్పింది మమత లోగడ ఒకసారి. వారి వద్దకు వెళ్ళి ఆమె కండిషన్ గురించి వివరించి ఆర్థికసాయం కోరాలనుకున్నాను, చివరి ప్రయత్నంగా. కాని, మమత మేనమామ పోయాడనీ, అత్తయ్యకు మమతంటే కిట్టదనీ జానకి చెప్పడంతో హతాశుడినయ్యాను.
అప్పుడే రెండురోజులు గడచిపోయాయి. సొమ్ము లభించేదారి కానక నిద్రాహారాలు మాని పిచ్చివాడిలా తిరిగాను.. ఆ రోజు నలిగిన దుస్తులతో, మాసిన గడ్డంతో, దైన్యవదనంతో పక్కలో కూర్చున్న నన్ను, మమత ఎదురు ఓదార్చుతూంటే దుఃఖం ఆగలేదు. బైటకు వచ్చి భోరున ఏడ్చేసాను.. అదంతా గమనించిందో ఏమో వార్డ్ సిస్టర్ నా దగ్గరకు వచ్చి సానుభూతిగా నా తల నిమిరింది.
తగ్గుస్వరంతో ఆమె చెబుతూన్నది వింటూంటే.. ఏటిలో కొట్టుకుపోతూన్నవాడికి కట్టెపుల్ల దొరికినట్లనిపించింది నాకు. ఓ ధనవంతుడికి కిడ్నీ కావాలి. అందుకు మూడులక్షలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడు! అందులోంచి ఓ లక్ష రూపాయలు మధ్యవర్తికి పోగా రెండులక్షలు నా చేతికి వస్తాయి.. మారు ఆలోచన చేయకుండా ’సరే’ ననేసాను. ’ఒకవేళ నా కిడ్నీ అతనికి సూట్ కాకపోతేనో?’ “డోంట్ వర్రీ. కిడ్నీ దాతల కోసం వెదుకుతూన్నవారు బోలెడుమంది. నీది ఎవరో ఒకరికి సూట్ కాకపోదు” అంటూ హామీ ఇచ్చాడు మధ్యవర్తి..
నా కిడ్నీ ఆ పేషెంట్ కు సరిపోతుందని డాక్టర్లు నిర్ధారించారు. నా ఆనందానికి మేరలేకపోయింది. ఆ తరువాత రాతకోతలన్నీ చకచకా జరిగిపోయాయి. రెండులక్షలు అడ్వాన్స్ గా ఇచ్చారు వాళ్ళు. వెంటనే సొమ్ము తీసుకువెళ్ళి ఆసుపత్రి కౌంటర్లో కట్టేసాను. మమత ఆపరేషన్ కు మూడురోజుల తరువాతే డేట్ దొరికింది. దానికి ముందురోజే కిడ్నీ మార్పిడి కూడాను. నేను కిడ్నీ అమ్ముతూన్న విషయం జానకికి తప్ప ఎవరికీ తెలియదు.
మర్నాడే నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు ప్రిపరేషన్ కోసమని.. కిడ్నీ మార్పిడి రోజున – నన్ను ఆపరేషన్ థియేటర్ కు తీసుకువెళ్ళి మత్తుమందు ఇచ్చారు. ఆ తరువాత ఏం జరిగిందీ నేనెరుగను..
మళ్ళీ తెలివిలోకి వచ్చేసరికి వార్డ్ లో బెడ్ మీదున్నాను.. మధ్యవర్తి వచ్చి, కిడ్నీ మార్పిడి సక్సెస్ అయిందని చెబుతూంటే, ఆనందం కలిగింది నాకు. రెండు రోజులపాటు ఆసుపత్రిలోనే ఉండాలట నేను, ఆబ్జర్వేషన్ కోసం.
మమతకు సర్జరీ చేసే రోజది.. జానకి నన్ను చూడ్డానికి వచ్చింది. ఆపరేషన్ థియేటర్ కు వెళ్ళేముందు నన్ను చూడాలని మమత పట్టుపట్టిందట. పిల్లలు పేచీ పెడుతున్నారంటే ఇంటికి వెళ్ళాననీ, సర్జరీ టైమ్ కు వచ్చేస్తాననీ చెప్పిందట జానకి.
ఏదో తెలియని భీతి ఆవహించుకుంది నన్ను. ఏం వార్త వినవలసివస్తుందోనన్న భయం! సమయం గడచేకొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది. అక్కడే ఉంటే అదే ధ్యాసతో ఆందోళనగా ఉంటుందని, ఓసారి ఇంటికి వెళ్ళివద్దామనిపించింది. నాలుగు రోజులుగా పిల్లల్ని చూడలేదు. ఎలా ఉన్నారో ఏమో!.. ఎవరికీ చెప్పకుండా మెల్లగా ఆసుపత్రిలోంచి బైటపడ్డాను. ఒంట్లో నీరసంగా ఉంది. బైట ఎండగా ఉంది. , ఆటో కోసం ఎదురుచూస్తూ నిల్చున్నాను.
అదిగో.. అప్పుడే.. జరిగింది ఆ సంఘటన. రోడ్డుకు అవతలివైపు కుక్కలు రెండు దేనికోసమో పోట్లాడుకుంటున్నాయి. పసిపాప ఏడ్పు సన్నగా వినవస్తోంది. పరీక్షగా చూసాను. గుడ్డలో చుట్టబడియున్న ఓ పసికందు! అక్కడికి ఎలా వచ్చిందో!? కుక్కలు దానికోసమే హోరాహోరీ పోరాడుతున్నట్టు అర్థమైపోయింది నాకు.. ఆ సంఘటనను ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. ఎవరికివారు కాలంతోపాటు పరుగులు తీస్తున్నారు.. ’ఆ పసికందు ఆడో, మగో? ఆసుపత్రి వార్డ్ నుండి ఆ కుక్కలే ఎత్తుకువచ్చుంటాయా!?’ అవి ఎక్కడ చంపేస్తాయోనన్న భయం పట్టుకుంది నాకు.
కంగారుగా రోడ్ దాటడానికి ఉపక్రమించాను, వాహనాలను లెక్కచేయకుండా. అడుగులు వేగంగా పడడంలేదు. అరుస్తూ కుక్కల్ని అదలించడానికి ప్రయత్నించాను.. అదే సమయంలో జేబులోని సెల్ మ్రోగింది. జానకి కాల్ అది. మమత ఆపరేషన్ ముగిసిందేమో! ఏం వార్త వినవలసివస్తుందో?.. టెన్షన్ తో గుండె వేగంగా కొట్టుకుంటూంటే, “హలో!” అన్నాను..
2
పది సంవత్సరాల తరువాత ---
ఫారిన్ లో ఉండే తన ఓల్డ్ స్టూడెంట్ అనురాధ తనను వెదుక్కుంటూ రావడంతో, ఆనందంతో కౌగలించుకుంది మమత. వారు మాట్లాడుకుంటూంటే, అప్పుడే స్కూల్ నుండి వచ్చిన ఉష, “అమ్మా!” అంటూ మమతను కావలించుకుంది. ఆమె వెనుకే మిగతా ఐదుగురు పిల్లలూను. ఒక్కొక్కరే వచ్చి మమతను వాటేసుకుని ముద్దులు పెట్టారు. ఆ దృశ్యాన్ని అపూర్వంగా చూస్తూన్న అనూరాధతో, “నా కూతుళ్ళు!” అంది మమత గర్వంగా.
అనూరాధ సాశ్చర్యంగా చూసింది. పిల్లలు వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోయాక, “మేడమ్! వీళ్ళంతా.. అంత పెద్ద పిల్లలు.. నిజంగా మీ పిల్లలేనా!?” అనడిగింది.
“ఊఁ, వీళ్ళు నాకు దేవుడిచ్చిన బిడ్డలు!” జవాబిచ్చింది మమత చిరునవ్వుతో.
“మరి వీళ్ళ డాడీ.. అదే, మీ హజ్బెండ్.. ఏం చేస్తూంటారు?”
’ఔను రాజు ఏం చేస్తూంటాడు.. ఇప్పుడు?’ మమత మనసు జారుడుబల్ల ఎక్కినట్టు చటుక్కున గతంలోకి జారిపోయింది..
‘తనకు ఆపరేషన్ ఐన ఆ రోజు.. రోడ్డవతల కుక్కలు ఓ పసికందును ఎక్కణ్ణుంచో ఈడ్చుకు రావడం చూసిన రాజు, ఆ బిడ్డను రక్షించేందుకని రోడ్ కు అడ్డంపడ్డాడు. అదే క్షణంలో జానకి ఫోన్ చేసింది, తన సర్జరీ సక్సెస్ అయుందని చెప్పడానికి. ఆ కాల్ ని రిసీవ్ చేసుకోవడంలో తృటికాలం ప్రమత్తతకు గురయ్యాడు రాజు. వేగంగా దూసుకువచ్చిన ట్రక్ ఒకటి అతన్ని గ్రుద్దేసింది. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.. ఓ అనాథ బిడ్డను కాపాడే ప్రయత్నంలో అతను అసువులు బాసాడని చెప్పారు ప్రత్యక్ష సాక్షులు..
రాజు అకాలమరణంతో తన లోకం తలక్రిందులయింది. సర్జరీ సక్సెస్ అయిందన్న సంతోషం దక్కకుండాపోయింది తనకు. తనకోసం అతను చేసిన త్యాగం గురించి జానకి చెబితే తల గోడకు కొట్టుకుని రేయింబవళ్ళు రోదించింది.. ’డాడీ కావాలి!’ అంటూ గుండెలు అవిసేలా విలపించే ఆ పసివాళ్ళను చూస్తే కడుపు తరుక్కుపోయింది.
సత్తెమ్మ మామ్మ ఓదార్పుతో గుండె రాయి చేసుకుని, వారికి ’అమ్మ’ అయింది. రాజు అసంపూర్ణంగా విడిచి వెళ్ళిన బృహత్కార్యాన్ని తాను కొనసాగించడానికి నడుం కట్టుకుంది. అది అతను తనపై విశ్వాసంతో తన భుజస్కంధాల పైన మోపిన బాధ్యతగా భావించింది. అందుకే వివాహం చేసుకోకుండా ఆ బిడ్డలకు ’తల్లి’ అయింది.
ఐదేళ్ళ క్రితం సత్తెమ్మ మామ్మ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టడంతో, ఒంటరిదయిపోయింది. ఆ చిన్నారుల ఆటపాటలతో మాటలతో మురిసిపోతూ, రాజు జ్ఞాపకాలతో మనసు దిటవుచేసుకుని కాలం వెళ్ళదీస్తోంది.. ప్రస్తుతం తన లక్ష్యం ఒక్కటే- ఆ చిన్నారులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్ది ప్రయోజకుల్ని చేయడమే!.. ’
మమత చూపులు గోడనున్న రాజు ఫోటోమీద పడ్డాయి. చిద్విలాసంగా నవ్వుతున్నాడు.. హృదయం బాధగా మూలిగింది.
అదే క్షణంలో ఎక్కడినుండో రేడియోలోంచి పాట వినవచ్చింది –
’ఇదే ఇదే జీవితం.. సుఖదుఃఖాల సంగమం.. ’
************
తిరుమలశ్రీ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం :
‘తిరుమలశ్రీ’ గారి అసలు పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ. ఎమ్.ఎ. (సోషియాలజి), ఎల్.ఎల్.బి., సి.ఎ.ఎస్. భారతప్రభుత్వపు CSIR అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి చెందిన వీరు, జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ అఫ్ అడ్మినిస్ట్రేషన్' గా పదవీ విరమణ చేసారు…వీరి మరో కలంపేరు 'విశ్వమోహిని'. తెలుగులో వీరివి అన్ని జేనర్స్లోను, ప్రక్రియలలోను(బాలసాహిత్యంతోసహా) అసంఖ్యాక రచనలు ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి. సుమారు185 నవలలు ప్రచురితమయ్యాయి. పలుకథలు, నాటికలు, నాటకాలు ఆలిండియా రేడియోలోప్రసారితమయ్యాయి. కొన్ని నాటికలు దూరదర్శన్లో ప్రసారంకాగా, మరికొన్నిరంగస్థలం పైన ప్రదర్శింపబడ్డాయి. పలుకథలు బహుమతులను అందుకున్నాయి. కొన్నికథలు హిందితోపాటు ఇతర దక్షిణాది భాషలలోకి అనువదింపబడ్డాయి. ఓ మాసపత్రికలో రెండు కాలమ్స్ నిర్వహించారు. ప్రతిలిపి 'కథాకిరీటి', 'కథావిశారద', మరియు 'బాలకథాబంధు' (బాలసుధ-బాలసాహితీసంస్థ, విజయనగరం) బిరుదాంకితులు. 'కలహంస పురస్కార' గ్రహీతలు. ఆంగ్లంలో సుమారు100 కథలు, ఆర్టికల్స్ ప్రముఖ పత్రికలలోను, జాతీయ దినపత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్ని బహుమతులను అందుకున్నాయి. ఓ ప్రముఖ ఆంగ్ల జాతీయ దినపత్రికలో వీక్లీ (లిటరరీ) కాలం వ్రాసారు. ఓ జర్మన్ పబ్లిషింగ్ హౌస్ ద్వారా 20 ఈ బుక్స్ ప్రచురిత మయ్యాయి... స్టోరీ మిర్రర్ (ఆంగ్లం), ‘లిటరరీ బ్రిగేడియర్’ బిరుదాంకితులు, మరియు ‘ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020’ నామినీ… హిందీలో అరడజను కథలు ప్రచురితం కాగా,ఓ బాలల నాటిక ఆలిండియా రేడియోలో ప్రసారితమయింది.
''స్టోరీ మిర్రర్- 'ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020' అవార్డ్స్ (రీడర్స్ చాయిస్- ఫస్ట్ రన్నరప్ & ఎడిటర్స్ చాయిస్- సెకండ్ రన్నరప్) ట్రోఫీలు లభించాయి..."




Comments