top of page
Original.png

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #TeluguArticle, #women, #internationalwomen'sday, #అంతర్జాతీయమహిళాదినోత్సవం

International Women's Day - New Telugu Article Written By  Sudhavishwam Akondi Published in manatelugukathalu.com on 08/03/2026

అంతర్జాతీయ మహిళా దినోత్సవం - తెలుగు వ్యాసం

వివరణ: సుధావిశ్వం ఆకొండి


ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదిన అంతర్జాతీయంగా మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే ఇది ఒక రాజకీయ ఉద్యమంగా ప్రారంభమైంది. కానీ మహిళల సాధికారతకు, హక్కుల రక్షణ కోసం పోరాటం జరిగి వివిధ దేశాల్లో సాధించిన విజయానికి చిహ్నంగా ఈరోజును మహిళా దినోత్సవంగా జరుపుకోవడం మొదలుపెట్టారు.


వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపునిస్తోంది.  సాధారణ దినోత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధనల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతోంది. సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై వివిధ దేశాల్లో ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా, పూర్వ సోవియట్ సమూహపు దేశాల సంస్కృతుల్లో భాగమైంది.


ఇంకొన్ని ప్రాంతాలలో ఐక్యరాజ్యసమితి ఉద్దేశించిన విధంగా రాజకీయ, మానవీయ హక్కులు బలంగా వుండి ప్రపంచవ్యాప్తంగా మహిళల రాజకీయ, సామాజికహక్కుల పోరాటంపై జాగృతి పెంచే విధంగా ఈ ఉత్సవాన్ని జరుపుతారు.


ప్రారంభంలో మహిళా దినోత్సవం వేరు వేరు తేదీలలో జరుపబడింది. చికాగోలో 1908 మే 3న, న్యూయార్క్ లో 1909 ఫిబ్రవరి 28న జరిగాయి. 1910 ఫిబ్రవరి 27న రెండవ అంతర్జాతీయ సామ్యవాద సమావేశానికి ముందుగా 1910 ఆగస్టులో అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెన్ హాగెన్ లో జరిగింది.


అమెరికా సామ్యవాదులచే ఉత్తేజితులై, జర్మన్ సామ్యవాది లూయీస్ జియట్జ్ వార్షిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని ప్రతిపాదించగా సహ జర్మన్ సామ్యవాది క్లారా జెట్కిన్ సమర్ధించారు.  పదిహేడు దేశాలనుండి వచ్చిన నూరుమంది  మహిళలకు ఓటుహక్కుతో పాటు సమానహక్కులు ఇవ్వడానికి అంగీకరించారు. తదుపరి సంవత్సరం 1911 మార్చి 19న పదిలక్షలమంది పైగా ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలలో 1911 మార్చి 19 న మహిళా దినోత్సవం జరిపారు. ఆస్ట్రో-హంగేరియన్ రాజ్యంలో మూడు వందలకు పైగా ఈ ప్రదర్శనలు జరిగాయి. వియన్నాలో రింగ్ స్ట్రాసెలో ప్రదర్శన చేశారు. మహిళలు ఓటుహక్కు, ప్రభుత్వ పదవుల హక్కు అడిగారు. ఉపాధిలో లింగ వివక్షను  ప్రతిఘటించారు. అమెరికాలో ఫిబ్రవరి చివరి ఆదివారం నాడు మహిళా దినోత్సవం  జరుపుకోగలిగారు.

1913 లో రష్యను మహిళలు వారి మొదటి మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి చివరి ఆదివారం జరుపుకున్నారు.


1914 వరకు మహిళా సమస్యల గురించి ఎన్నో ఆందోళనలు జరిగినా అవేవీ మార్చి 8న జరగలేదు. అయితే 1914 నుండి ఆ రోజుని మహిళాదినోత్సవంగా ప్రకటించుకున్నారు. ఆ రోజు ఆదివారం కావడం వలన అలా ప్రకటించి వుండవచ్చు కానీ అప్పటినుండే అన్నీ దేశాల్లోనూ మార్చి 8 నే మహిళా దినోత్సవంగా తీర్మానించారు. 1914 లో జర్మనీ జరుపుకున్న మహిళా దినోత్సవాన్ని మహిళా ఓటు హక్కు కోసం అంకితమిచ్చారు. అయితే,1918లో గానీ వారికి ఓటు హక్కు రాలేదు.


పంతొమ్మిదివందల పదిహేడులో ఫిబ్రవరి విప్లవం, ఆ నెల చివరి ఆదివారం, మార్చి ఎనిమిదిన సెయుంట్ పీటర్స్ బర్గ్ లో మహిళాదినోత్సవం జరుపుకోవడం తో మొదలయ్యింది. ఆ రోజు సెయింట్ పీటర్ బర్గ్ మహిళలందరూ మొదటి ప్రపంచ యుద్ధం, రష్యాలోని ఆహార కొరత ముగిసిపోవాలని నినదించారు. దీన్నే 'బ్రెడ్డు, శాంతి' డిమాండు గా అప్పుడు వ్యవహరించారు. లియోన్ ట్రోస్కీ అనే చరిత్రకారుడు 'ఆ రోజే ఒక విప్లవానికి పునాదులు పడతాయని ఎవరూ ఊహించలేదు. వస్త్ర పరిశ్రమల్లోని మహిళా శ్రామికులందరూ తమ పై అధికారుల హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా విధులు బహిష్కరించి వీధుల్లో పడ్డారు. అవే విప్లవానికి తొలి అడుగులు' అని వివరించడం జరిగింది.


అక్టోబర్ విప్లవం తరువాత సోవియట్ యూనియన్లో ఆ రోజుని అధికారిక సెలవు దినంగా ప్రకటించడానికి బోల్షెవిక్ అలెగ్జాండర్ కొలెన్టైల్ లు, వ్లాదిమిర్ లెనిన్ని ఒప్పించగలిగారు. కానీ, 1965 వరకూ అది అమల్లోకి రాలేదు. అదే సంవత్సరం సోవియట్ మహిళలు అప్పటి వరకు చూపిన సాధికారత స్మారకార్థం మార్చి ఎనిమిదిన యూఎస్ ఆర్ ప్రభుత్వం ఆ దినాన్ని అధికారిక సెలవు దినంగా ప్రకటించింది. పంతొమ్మిది వందల పదిహేడులో సోవియట్ విప్లవం తరువాత రష్యా కూడా దీనిని ప్రకటించింది. చాలా మటుకు కమ్యూనిస్టు, సోషలిస్టు దేశాల్లో దీన్ని పాటించేవారు.


పంతొమ్మిదివందల ఇరవైరెండు నుంచి చైనా వారు, 1936 నుంచి స్పానిష్ వారు దీనిని అధికారికంగా ప్రకటించుకున్నారు. 1949 అక్టోబర్ 1 లో చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఏర్పడినది. వారి రాష్ట్రీయ మండలి డిసెంబరు 23న, మార్చి ఎనిమిదిని మహిళా అధికారిక దినంగా ఉత్తర్వులిస్తూ చైనా మహిళలకి ఆ రోజు సగం సెలవు ప్రకటించింది.


ప్రాచ్య దేశాల్లో, 1977 తరువాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం బహుళ ప్రాముఖ్యత సంతరించుకుంది. అప్పడు మార్చి 8ని మహిళా హక్కులు, ప్రపంచ శాంతి దినంగా ప్రకటించాలని యునైటైడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ పిలుపునిచ్చింది.


భారతదేశంలో తొలిగా అహ్మదాబాద్ లో అనసూయా సారాభాయ్ టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌ అనే పేరుతో కార్మికసంఘం ప్రారంభించింది. భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీలను సంఘటితం చేసిన మహిళా నేతలలో సుశీలా గోపాలన్‌ విమలారణదివే, కెప్టెన్‌లక్ష్మిసెహగల్‌, అహల్యారంగ్నేకర్‌, 

పార్వతీకృష్ణన్‌ ప్రముఖులు. ఈ పోరాటాల ఫలితంగానే స్వాతంత్య్రం తరువాత కార్మికుల బ్రతుకులు మెరుగయ్యాయి. కార్మికుల పని పరిస్థితులు, వేతనాలు, మహిళా కార్మికుల గురించి చట్టాలు చేయబడ్డాయి.


మానవహక్కుల ఉద్యమకారిణి, నటి బేతా పోజ్నియక్ మహిళా దినోత్సవంగా అధికారిక గుర్తింపును, ప్రభుత్వ సెలవుదినాన్ని సాధించేందుకు లాస్ ఏంజిల్స్ నగరానికి మేయరు, కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్, యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ సభ్యులతో కలిసి కృషిచేశారు. 1994లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గుర్తించేలా బిల్లును రూపొందించడం ద్వారా సాకారం చేశారు.


సుమారు వందకు పైగా దేశాలలో ఈ దినోత్సవం జరుపుకొంటున్నారు. 2011 మార్చి 8 న ఈ దినోత్సవ వేడుకలు 100 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా యు.యస్.లో అధ్యక్షుడు బరాక్ ఒబామా 2011 మార్చిని 'మహిళల చారిత్రక మాసం'గా ప్రకటించారు. దేశ చరిత్ర నిర్మాణంలో మహిళల పాత్రని గుర్తించాలని అమెరికన్లకు పిలుపునిచ్చారు. రాజ్య కార్యదర్శి హిల్లరీ క్లింటన్ ఈ సందర్భంగా    మహిళల ఇన్షియేటివ్: అంతర్జాతీయ ఎక్స్చేంజెస్ ద్వారా మహిళలు, బాలికల సాధికారత నుఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రారంభించారు.  ఇదే సందర్భంలోనే ఐసిఆర్సి ICRC మహిళలపై జరుగుతున్న అత్యాచార, లైంగిక వేధింపులని అరికడుతూ తీసుకుంటున్న నివారణ చర్యలపై ఎటువంటి జాప్యం చేయకూడదని తమ రాజ్యాలకు పిలుపునిచ్చారు. పాకిస్థాన్లో పంజాబ్ ప్రభుత్వం వారు గుజ్రాన్ వాలా లింగ సంస్కరణా కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 2011 మహిళా దినోత్సవాన్ని గిఫ్ట్ యూనివర్సిటీ గుజ్రాన్ వాలాలో ఘనంగా నిర్వహించారు. శ్రీమతి షాజియా అష్ఫాగ్ మత్తు, జి.ఆర్.ఎ.పి. అధికారి ఈ వేడుకల్ని చక్కగా నిర్వహించారు.


  ఆస్ట్రేలియా ఈ సందర్భంగా 20 సెంట్ల నాణేన్ని 100 వసంతాల మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసింది.


  ఈజిప్ట్ లో మాత్రం ఈ దినం విషాదాన్నే మిగిల్చింది. తాహిర్ స్వ్కేర్ లో హక్కుల కోసం నినదిస్తున్న మహిళల్ని పురుష సమూహాలు చెదరగొట్టాయి. ఇదంతా పోలీసు, మిలిటలీ బలగాల కళ్ళెదుటే జరిగింది. హదీల్-ఆల్-షల్సీ ఎ.పి.కి రిపోర్టు రాస్తూ ఆ సంఘటనని ఇలా వర్ణించారు-

" బురఖాలలో జీన్స్ లలో వివిధ దుస్తుల్లో ఉన్న మహిళలు కైరో సెంట్రల్ లోని తాహిర్ స్వ్కేర్ కి మహిళా దినోత్సవం జరుపుకోవడానికి చేరుకున్నారు. కానీ అధిక సంఖ్యలో పురుష మూకలు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు"

    ఇదంతా చరిత్ర! ఇంకా ఇతర దేశాలు  సరియైన నాగరికత కూడా లేని కాలంలోనే భారతీయ సనాతన ధర్మంలో స్త్రీలకు అత్యున్నతమైన గౌరవనీయమైన స్థానం ఇవ్వబడింది. పరస్త్రీలను తల్లిగా భావించి గౌరవించే సంస్కృతి మనది. జీవితంలో  ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటూ జన్మను ధన్యం చేసుకున్న మహాత్ములు జన్మించిన గడ్డ ఇది. ఏ ఉద్యమాలు లేకుండానే సామరస్యంగా ఒకరికొకరు సహకారం చేస్తూ జీవనం గడిపిన సమాజం మనది. కానీ రకరకాల జాడ్యాలు సమాజంలో చేరి, దురాచారాలు ప్రబలడం, వాటిని నిర్మూలించడానికి కృషి చేసి అవి పోయాయని అనుకునేలోపు అభివృద్ధి పేరుతో మరిన్ని జాడ్యాలు సమాజాన్ని పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ఏదో ఒక దినాన్ని సెలెబ్రేట్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలపై దృష్టి పెట్టి, అవి తొలగించే మార్గాన్ని పాటించి శాంతిని ఏర్పరచగలిగితే ప్రతిరోజూ పండుగే అవుతుంది. ప్రత్యేకంగా జరుపుకోవాల్సిన అవసరం లేదు. స్త్రీ ఔన్నత్యాన్ని గుర్తించి గౌరవించే పురుషులతో, స్త్రీ తనలోని శక్తిని గుర్తించి, అందుకు తగినవిధంగా చూడగానే నమస్కరించే అత్యున్నత సంస్కారాన్ని పెంచుకుని స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమైన జీవులేనని తెలుసుకున్న ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడితే ప్రతిరోజూ మహిళాదినోత్సవమే!


మహిళలు అందరికీ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు 💐 💐💐

సుధావిశ్వం  


సుధావిశ్వం గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):




-సుధావిశ్వం






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page