top of page

ఇంటి దొంగ


' Inti Donga' written by Madduri Bindumadhavi

రచన : మద్దూరి బిందుమాధవి

శ్రీనివాస్ కి ఫ్రెండ్ దగ్గర నించి వాట్సాప్ మెసేజి వచ్చింది.

"వలస కూలీలు పని లేక, తిండి దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. నాలుగో తరగతి మ్యునిసిపల్ ఉద్యోగులు పాపం కరోనాని లెక్క చెయ్యకుండా డ్యూటీకి రావాలిట. కానీ లాక్ డౌన్ వల్ల తాగటానికి చాయ్, మంచి నీళ్ళు దొరకట్లేదు. ఇలా మనం చూడని వారు, మనకి తెలియని వారు ఎంత మంది బాధ పడుతున్నారో కదా! ఏదో ఒకటి చెయ్యాలోయ్" అని మిత్రుడు వెంకట్ ఇచ్చిన మెసేజి అది.

తన మిత్ర బృందం అందరూ కలిసి విరాళాలు వసూలు చేసి ఈ కరోనా సమయంలో కూలీలకి ఆహారం పొట్లాలు అందిస్తున్నామని, కొంత మందికి నెల వారీ సరుకులు ఇచ్చి సహాయం చేస్తున్నామని..ఇంకొక బృందం లో మరో సందేశం.

ఇక NDTV లో సరే సరి… హాస్పిటల్స్ కి వెళితే ఎక్కడ వ్యాధి బారిన పడతామో అని, పేద వారు… ఇటు మందు మాకు, వైద్య సదుపాయం లేక, అటు తిండి లేక నల్లులు మాడినట్టు మాడుతున్నారు! రవాణా సదుపాయాలు లేక వందల వందల మైళ్ళు నడుస్తూ అవస్థలు పడుతున్న వలస కూలీలు అంటూ సజీవ చిత్రాలు ప్రసారం చేస్తున్నారు.

*******

శ్రీనివాస్ పిల్లల దగ్గర రెణ్ణెల్లు ఉండి పోదామని అమెరికా వచ్చి, అక్కడే చిక్కుకున్నాడు.

ప్రపంచంలో అంతా ఇదే పరిస్థితి అయినా, తన మాతృ దేశం లోని కష్ట జీవుల సమస్యలు టీవీ లో చూసి చాలా కదిలిపోయాడు.

పై పైకి అలా అనిపిస్తోందే కానీ అంతరాంతరాల్లో నిజంగా తను ఏమైనా చెయ్యగలడా అని మాత్రం ఆలోచించలేదు.

ఎవరికయినా కష్టం వస్తే స్పందించే గుణం కాస్తో కూస్తో ఉన్న శ్రీనివాస్, ప్రపంచం అంతా చిగురుటాకు లాగా వణుకుతున్న ఇలాంటి పరిస్థితుల్లో తన వంతు సహాయం చెయ్యటానికి అక్కడ లేకపోయానే అని మాత్రం నిజాయితీగా బాధ పడ్డాడు.

"నువ్వక్కడ లేకపోతే ఏం? నిజంగా చెయ్యాలనుకుంటే మార్గాలే లేవా" అని అంతరంగం ప్రశ్నించింది.

సరిగ్గా అదే సమయానికి

"అందరం కలిసి ఎంతో కొంత వేసుకుని, మిగిలినవి విరాళాలుగా సేకరించి కష్టజీవులకి నెలకి సరిపోయే సరుకులు, పారిశుధ్య కార్మికులకి ఆహార పొట్లాలు పంచుదాం అనుకుంటున్నాం! నీ వాటా ఎంత వేసుకోమంటావ్ ?" అంటూ పాణి దగ్గర నించి మరొక మెసేజి.

ఇక అప్పుడు అతని మనసు బుద్ధిని తన అదుపులోకి తెచ్చుకుని, ప్రాక్టికల్ గా ఆలోచించాలి! ఊరికే ఎవరేం చెప్పినా బుర్ర ఊపెయ్యకూడదు అని పాఠం చెప్పటం మొదలు పెట్టింది.

ఆ పాఠం తలకెక్కిన శ్రీనివాస్ "నేను ఆలోచించి చెబుతాలే" అన్నాడు.

"వీళ్ళు నిజంగా చిత్త శుద్ధితో చేస్తున్నారంటావా? లేక ఇదంతా పబ్లిసిటీనా? అని శ్రీనివాస్ చపలమైన చిత్తం, సహాయం చెయ్యాలనుకున్న బుద్ధిని ప్రశ్నించింది.

ఇలా శ్రీనివాస్ అంతర్మధనం జరుగుతూ ఉండగానే

"నిన్న మా ఇంటి దగ్గర పేవ్ మెంట్ మీద కూరలు, పళ్ళు అమ్ముకునే వారికి, పారిశుధ్య కార్మికులకి బిర్యానీ చేయించి పెట్టాము" అంటూ ఇంకో బృందం వాళ్ళు ఫొటోలు పెట్టి, "ఇలాంటి సేవలు చేసే అవకాశం రావటం మన అదృష్టం, నీ పేరుతో ఓ పది వేలు రాసుకోమంటావా" అని మరొక బృందం మెసేజి పెట్టారు.

"నేను ఫోన్ చేసి చెబుతాను" అని మెసేజి పెట్టి మళ్ళీ ఆలోచించటం మొదలు పెట్టాడు.

"నువ్వు నిజంగా ఈ పరిస్థితి అర్ధం చేసుకుంటున్నావా? అందులో ఉండే తీవ్రత...రోగాలతో, తిండిలేక నల్లుల్లాగా మాడిపోతున్న ప్రజల గురించి నీకు అర్ధం అవుతోందా? ఊరికే ఆదర్శాలు ఉంటే సరిపోదు. అవసరం, సందర్భం వచ్చినప్పుడు స్పందించాలి" అని బుద్ధి నిలదీసింది.

"ఈ లాక్ డౌన్ లో ముహూర్తాలు లేక పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలు చేయించలేని వేద పండితులు, స్మార్తులు ఆదాయం లేక అల్లల్లాడుతున్నారు. అలాగే లలిత కళల కార్యక్రమాలు లేక వాటి మీదే ఆధారపడే కళాకారులు తిండి లేక మాడిపోతున్నారు. ఆ కార్యక్రమాల పట్ల ఆసక్తి కల మనం ఇలాంటప్పుడు పెద్ద మనసు చేసుకుని ముందుకు రాకపోతే, వారి బ్రతుకులెట్లా తెల్లవారతాయ్? అందుకే నీ లాంటి వారందరినీ సంప్రదించి మనిషికి 5000/- చొప్పున ఆర్ధిక సహాయం చేద్దామనుకుంటున్నాం" అని హరికృష్ణ మెయిల్ ఇచ్చాడు.

"ఆ( అలా ఎంతమందికిస్తాం! మనమేమైనా కోటీశ్వరులమా! అడిగిన వారికల్లా ఇచ్చుకుంటూ పోతే మన చేతికి మిగిలేది చిప్పే! అడిగే వారిదేముంది అడుగుతారు! చెప్పేవారు చెబుతారు! మనం విచక్షణతో ఆలోచించాలి" అని మనసు తన వంతు సలహా తను చెప్పింది.

అలా సలహా ఇస్తున్న మనసుకి వోట్ వేసి ....

"నిన్ననే మన వెంకట్ వాళ్ళకి పంపించాను. మనకి సహాయం చెయ్యాలనే కోరిక ఎంత ఉన్నా, అందరికీ చెయ్యలేము కదా! మన పరిస్థితి కూడా చూసుకోవాలి. నేను చెబుతాలే, అప్పుడే నా పేరు రాసేసుకోకండి" అని అందమైన అబద్ధంతో మెసేజికి రిప్లై ఇచ్చాడు.

వీరికిచ్చానని వారికి, వారికిచ్చానని వీరికి మెసేజిలు పెట్టి చివరికి ఎవరికీ పంపించకుండా ఉన్న భర్తని చూసి అతని భార్య పద్మ

"ఏమిటండీ మీ ధోరణి భలే విచిత్రంగా ఉంది. ఉత్తి పుణ్యానికి మీరు ఎవ్వరికీ సహాయం చెయ్యక్కరలేదు. చెయ్యరు కూడా! ఇంత తీవ్రమైన పరిస్థితులొచ్చి ప్రపంచం అంతా చిగురుటాకు లాగా వణికి పోతుంటే.... నోరెండిపోయేట్లు ఊరికే ఇతరుల కష్టాల గురించి మాట్లాడుతూ "లిప్ సింపతీయేనా"? యాక్షన్ ఏమయినా ఉందా? ఎంత సహాయం చెయ్యగలిగితే అంత వెంటనే అందజేస్తే, వారికి ఉపయోగ పడటం మాట దేవుడెరుగు! "నేను సైతం" అని పెద్దలు చెప్పినట్లు, కనీసం మనకి ఆత్మ సంతృప్తి మిగులుతుంది."

"జేబులో డబ్బులు, నోటిలో మాట ఆకలి తీర్చవు… అవసరాలూ తీరవు. క్రియలోకి వెళ్ళాలి. సహాయం చెయ్యాలి, చెయ్యలేకపోతున్నాను అని మీరే అనుకుంటున్నారు. తీరా కార్య రంగంలోకి మీ మిత్రులు దిగి, మేము చేస్తున్నాము. నువ్వొచ్చేసరికి ఆలస్యమవుతుంది. వారి అవసరాలూ ఆగవు… కనుక, డబ్బు పంపించమంటే "మీన మేషాలు లెక్కపెడుతున్నారు! ముందు మీ ఇంటి దొంగ (మనసు) కి బుద్ధి చెప్పి, దాని నోరు నొక్కెయ్యండి."

"తరువాత మన ఫ్లాట్ మీద చెల్లించే అద్దె ఈ నెల బ్యాంకులో వెయ్యకుండా మీ మిత్ర బృందానికి ఇమ్మని చెప్పండి. మనం వెళ్ళాక ఇతర ఖర్చులు చూసుకోవచ్చు" అని గట్టిగా చెప్పింది.

ఆలోచన తప్ప యాక్షన్ లోకి వెళ్ళ లేని శ్రీనివాస్, భార్య చెప్పినట్లు మిత్రులకి డబ్బు ఏర్పాటు చేసి, ఆ రాత్రి హాయిగా గుండెల మీద చెయ్యేసుకుని తృప్తిగా నిద్రపోయాడు.

***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :  63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : ఎం బిందుమాధవి

నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.

సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు


100 views0 comments

Comments


bottom of page