top of page

దైవ బలం' Daiva Balam ' written by Madduri Bindumadhavi

రచన : మద్దూరి బిందుమాధవి

ప్రకాష్ నిస్పృహగా వచ్చి సోఫాలో కూలబడ్డాడు.

"ఇందూ! కాసిని మంచినీళ్ళు, కాఫీ తెస్తావా" అని షర్ట్ పై గుండీ విప్పి, పైన ఫాన్ తిరుగుతున్నా, గాలి కోసం న్యూస్ పేపర్తో విసురుకోవటం మొదలుపెట్టాడు.

అతని వాలకం చూస్తూనే...వెళ్ళిన పని కాలేదని అర్ధం చేసుకున్న ఇందిర, ఓ చేత్తో కాఫీ గ్లాసు, మరో చేత్తో మంచి నీళ్ళ గ్లాసు పట్టుకొచ్చి పక్కనే కుర్చీలో కూర్చుంది.

అలికిడికి మూసుకున్న కళ్ళు తెరిచి, "అబ్బాబ్బా ఈ బ్యాంక్ వాళ్ళకేం కావాలో స్పష్టంగా చెప్పరు. అసలు వారికైనా తెలుసో తెలియదో అని నాకు సందేహం వస్తోంది."

"నిన్న నావి, నీవి మూడేళ్ళ ఐటి రిటర్న్స్ తెమ్మన్నారా? ఇవ్వాళ్ళ అవి తీసుకెళ్ళాక మీ కంపెనీ లో డైరెక్టర్స్ ఎందరు? మీ మెమొరాండం లో క్లియర్ గా లేదు. పైగా మీ కంపెనీ ప్రారంభించి నాలుగేళ్ళయింది… ఇప్పటివరకు అసలు బ్యాంక్ లిమిట్స్ లేకుండా బిజినెస్ ఎలా నడిపారు? మీ సొంత ఫండ్స్ ఉంటే అసలు లిమిట్స్ ఎందుకు? ఒక వేళ ఎక్కడయినా చేబదుళ్లు తెచ్చి నడిపితే అవన్నీ తీర్చారా? లేదా? తీర్చక పోతే ఎప్పటిలోపు తీర్చాలి? మా దగ్గర తీసుకునే లిమిట్స్ తో పాత అప్పులు తీర్చకూడదు."

"మీ చేతిలో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి? వాటి కాస్ట్ ఎంత? ఒక్కొక్క ప్రాజెక్ట్ లో మీ ప్రాఫిట్ ఎంత అని మీ అంచనా? మీ దగ్గర మార్జిన్ మనీ కి ఏర్పాట్లు ఏమిటి?" అని.. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అన్నట్టుగా భేతాళుడి ప్రశ్నలు వేసి.... ఆ వివరాలతో పాటు మీ కంపెనీ బ్యాలన్స్ షీట్స్ తీసుకుని రేపు రండి" అని పొద్దుటి నించీ కూర్చోబెట్టి, ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్పి పంపారు" అన్నాడు.

"వాళ్ళు అడిగినవన్నీ ముఖ్యమైన వివరాలే! మీకు ఇచ్చి పంపిన కవర్లో అవన్నీ ఉన్నాయి. వాళ్ళు అడిగినప్పుడు తీసి ఇమ్మని మీకు విడి విడిగా చెప్పి, చూపించి చెప్పాను కదా!" అన్నది ఇందిర.

"అవన్నీ నువ్వు చెప్పినట్టే ఇచ్చానోయ్! పైప్ లైన్ లో ఉన్న ప్రాజెక్ట్స్ తాలూకు వివరాలు ఈ రైటప్ లో ఉన్నాయని చెప్పాను. ఆల్రెడీ మొదలయిన ప్రాజెక్ట్స్ తాలూకు ఎగ్రీమెంట్స్ ఇచ్చాను."

"ఇది ఇంకా జూన్ నెలే కదా! ఆడిటెడ్ బ్యాలన్స్ షీట్ అంటే... నిరుడు మార్చి 31 వరకు వివరాలు మాత్రమే ఉంటాయి. వారికి నిరుడు మార్చి తరవాత యాక్టివిటీ గురించిన వివరాలు కావాలిట. ప్రొవిజనల్ తయారవుతోంది… వచ్చాక ఇస్తాను అన్నాను. అహః( దానికి సిఏ అథెంటికేషన్ కావాలిట. సదరు ఆఫీసరు అవన్నీ చూశాడు. ఇవి చాలవండీ అంటూ ప్రశ్నలు సంధించాడు".

"వాడి మాట తీరు చూస్తుంటే.. అసలు వాడికి సబ్జెక్ట్ నాలెడ్జి లేదేమో అనిపించింది" అన్నాడు.

"అయినా వాళ్ళిచ్చే బోడి పది లక్షలకి ఇన్ని వివరాలా? నాది, నీది ఐటి రిటర్న్స్ చూస్తే మన స్టేటస్ తెలియట్లేదా" అని చిర్రు బుర్రులాడాడు.

"మనకి అవసరం ఉండే కదా వాళ్ళ దగ్గరకి వెళ్ళాము! వాళ్ళేమయినా పిలిచారా" అని, అనేశాక నాలిక్కరుచుకుంది.

"రోజూ ప్రాణాలు తోడేస్తున్నారు కదా.. మీకు ఆ లోన్ కావాలా? ఈ లోన్ కావాలా అని! తీరా వెళితే 'అత్తగారి ముష్టి ' లాగా అక్కడ దాకా పిలిచి అప్పుడు, నోటితో లేదనకుండా చేత్తో లేదంటున్నారు" అని అక్కసుగా అన్నాడు.

* * * *

ఈ బ్యాంక్ లిమిట్స్ అనే ప్రహసనం ఏడాది నించి నడుస్తోంది. ముందుగా ఇచ్చిన వివరాలన్నీ పాతవైపోయి ఆర్ధిక సంవత్సరం మారేసరికి మళ్ళీ కొత్తవి అడుగుతున్నారు.

ప్రకాష్ కి బ్యాంక్ లోన్ కోసం వెళ్ళక తప్పట్లేదు. ఒకే సారి ఐదారు ప్రాజెక్ట్స్ చేతిలోకి వచ్చాయి. ఇంకో రెండు మూడు ఇతరుల రిఫరెన్సులతో పెండింగ్ లో ఉన్నాయి.

ప్రతి ప్రాజెక్ట్ లోనూ బిల్డింగ్ నిర్మాణం మొదలయ్యాక, అన్ని ఫ్లాట్స్ పూర్తిగా అమ్ముడయ్యే వరకు అంటే… షుమారుగా 26-30 నెలల టైం పడుతుంది. ఆ లోపు అన్ని సైట్లల్లోను నిర్మాణ ప్రక్రియ కొనసాగాలంటే, వెసులుబాటు కొరకు కొన్ని ఫండ్స్ అవసరం!

అందుకే అప్పటి వరకు తనకి పర్సనల్ ఎకౌంట్స్ ఉన్న బ్యాంక్ కి లిమిట్స్ కోసం వెళ్ళాడు. పోనీ కంపెనీ లిమిట్స్ అంటే ఆలస్యం అవుతున్నదని, అందులో ఒకటి రెండు ఫ్లాట్స్ తన కుటుంబ సభ్యులకి వారి వ్యక్తిగత ఆర్ధిక వనరుల ఆధారంగా అమ్మితే, డబ్బు సర్దుబాటు అవుతుందని ఆలోచిద్దాం అనుకుంటే.... మీరు కట్టే సైట్ లో మీరు కొనుక్కోవాలంటే కుదరదని వేలికి తీస్తే కాలికి, కాలికి తీస్తే మెడకి" రూల్స్ తాళ్ళు వేసి ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారు.

'పాపం వాళ్ళ రూల్స్ వాళ్ళవి.'

మధ్యతరగతి వేతన జీవుల దగ్గర… చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర ఇన్ని జాగ్రత్తలు పాటించి… పెద్ద చేపలకి వాళ్ళే లొంగిపోయి డబ్బు దోచి పెట్టేస్తారు ఈ బ్యాంకుల వాళ్ళు!

* * * *

ఆ రోజు ఎందుకో ప్రకాష్ కాస్త ఎక్కువ సేపు పూజ గదిలో కూర్చున్నాడు.

"ఈ సారయినా మీ పని విజయవంతంగా పూర్తవ్వాలని దేవుడికి అర్జీ పెట్టుకుంటున్నారా" అన్నది నవ్వుతూ ఇందిర.

"అవునోయ్... రెండు ఫ్లాట్స్ అమ్ముడయి, ఎడ్వాన్స్ వస్తే ఏడు కొండల వాడి హుండీలో డబ్బు వేస్తానని ఇంతకు ముందే మొక్కుకున్నాను. ఈ బ్యాంక్ లిమిట్స్ ప్రహసనం ఈ రోజైనా విజయవంతంగా ముగిస్తే, కొండకి నడిచి ఎక్కుతానని మొక్కుకుంటున్నా" అన్నాడు ప్రకాష్.

"అవునండీ మనం ఎంత నిజాయితీగా ఉన్నా, చుట్టు పక్కల మిగిలిన అన్ని అంశాలు మనకి అనుకూలంగా లేకపోతే మన లక్ష్యం మనం చేరలేము. టేబుల్ అవతల కూర్చునే వ్యక్తికి తనకుండే అవకాశాలు, నియమ నిబంధనలు తనకి ఉంటాయి" అన్నది.

"ఏంటోయ్, లోన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చెయ్యమని మీ దేవుడికి లంచం ఆఫర్ చేస్తున్నావా" అంటూ వచ్చాడు రంగా. రంగా కి దేవుడి పట్ల నమ్మకం, విశ్వాసం లేవు. స్వశక్తిని నమ్ముకోవాలి గానీ, దేవుడికి మొక్కటం..పని దానంతట అది అయ్యాక ఆ గొప్పతనం దేవుడికి ఆపాదించి మొక్కులు తీర్చటానికి గుళ్ళు, గోపురాల చుట్టూ తిరగటం ట్రాష్ అని అతని అభిప్రాయం!

" ఎవరి నమ్మకాలు అపనమ్మకాలు వారికి న్యాయంగా అనిపిస్తాయి. ఎవరి అనుభవం వారిది అన్నయ్య గారూ" అంటూ ఇందిర

"రామచంద్రుడంతటి వాడు, తనకున్న యుద్ధ విద్యా నైపుణ్యంతో అప్పటికే ఎంతో మంది రాక్షసులని మట్టు బెట్టి ఉన్నప్పటికీ, అంత అస్త్ర శస్త్ర సంపద ఉండి కూడా రావణాసురుడిని జయించటానికి ప్రత్యేకంగా అగస్త్య మహర్షి ఉపదేశించిన "ఆదిత్య హృదయం" ఉపాసన చేసి సూర్య భగవానుడి అనుగ్రహం పొందాడు!"

"అన్ని రకాల శక్తియుక్తులు ఉన్న భీముడు, సాక్షాత్తు మహాదేవుడిని ప్రసన్నం చేసుకున్న అర్జునుడు తోడుగా ఉన్నప్పటికీ పాండవులు శ్రీకృష్ణుడి అండ దండల వల్లే రాజ్యభ్రష్టులైనప్పుడు కూడా ధైర్యంగా అడవుల్లో బ్రతికారు"

"అందువల్లనే చదువుకునే పిల్లల దృష్టి అటూ ఇటూ మళ్ళకుండా దైవ ప్రార్ధన చెయ్యమంటారు. ఏదో ఒక అతీత శక్తి మనని ఎప్పుడూ నడిపిస్తుందని...పరీక్షల్లో జయాపజయాలని సమానంగా చూడటం నేర్చుకోమని పెద్దలు చెబుతారు. ఇలాంటి నమ్మకాలు చాదస్తం అని అనుకునే వారు అనుకోవచ్చు!"

"దైవ భక్తి, ఉపాసన అంటే మరేమీ కాదు.. మనలో ఉన్న శక్తిని మన చుట్టూ ఉన్న పంచభూతాలలోని శక్తితో అనుసంధానం చెయ్యటం ద్వారా ఏకీకృతం చెయ్యటమే!"

"కానీ మన కంటికి కనిపిస్తూ, మనం అనుభవిస్తున్న చుట్టూ ఆవరించుకున్న శక్తులని నిజమని నమ్మాలి కదా! సూర్య శక్తి ద్వారానే పంటలు, ఓషధులు పండుతాయి. వర్షాలు పడతాయి. సూర్య రశ్మి లో 'డీ 'విటమిన్ ఉంటుందని మనందరికి తెలుసు. జీవక్రియ అంతా సూర్య రశ్మి వల్లనే జరుగుతుంది. అందువల్లనే "ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్" అన్నారు పెద్దలు".

"పండిన ధాన్యాన్ని, కూరగాయలని ఆ పాటే భుజించం. పచనం చేశాకనే ఆహారంగా తీసుకుంటాము. ఆ పని చేసేది అగ్ని శక్తి. అది బొగ్గులు కావచ్చు, కట్టెలు కావచ్చు, గ్యాస్ కావచ్చు."

"గాలిలో ఉండే శక్తి తో గాలిమరల ద్వారా, దూకే నీటి లో ఉండే హైడల్ శక్తి ద్వారా, అగ్ని లో ఉండే వేడి ద్వారా విద్యుచ్ఛక్తి పుట్టిస్తున్నారా? లేదా? భూమి లోపల ఉండే శక్తి మొక్కలు..వృక్షాలు..పంటలు పండటానికి ఉపయోగపడుతున్నదా? లేదా? ఈ శక్తులనే మనం దైవంగా భావించి పూజిస్తాం!"

"మనం నీడనిచ్చి పోషించే చెట్టుని, ఓషధి మొక్కలుగా తులసిని, వేపని, పొలం దున్ని పంట పండించడానికి ఉపయోగించే ఎద్దుని, పాలిచ్చి పోషించే ఆవుని, గణపతి వాహనంగా ఎలుకని, వేద రూపంగా కుక్కని, కాలానికి ప్రతీకగా సర్పాన్ని కూడా దైవాలుగా భావించి పూజిస్తాము."

"దైవం అంటే క్యాలండర్లో ఉండే రాముడు, కృష్ణుడు, లలిత, లక్ష్మి అనే అనుకోనక్కరలేదు. ఆ రూపాలు మన సౌకర్యం కోసం సృష్టించుకున్నాం."

"మన పని అవక చికాకు పడుతున్న సమయంలో, హఠాత్తుగా మనం ఊహించని వ్యక్తి వచ్చి..."నాకు ఆ ఆఫీసులో ఫలానా వ్యక్తి తెలుసు. అతను తలచుకుంటే నీ పని ఇట్టే అయిపోతుంది" అని చెప్పేసరికి మనకి ఏనుగెక్కినంత బలం వచ్చి ముందు ధైర్యం వస్తుంది. 'దైవం మానుష రూపేణ ' అనేది ఇలాంటి సందర్భాల్లోనే! దైవం అంటే శంఖు-చక్రాలు, కిరీటం, పట్టు వస్త్రాలు ధరించి ఉండక్కరలేదు."

"పని అవట్లేదని నిరాశ, నిస్పృహతో చుట్టు పక్కల వారిని తిట్టుకోకుండా, దైవం అనే ఒక అతీత శక్తి నడిపిస్తున్నదనే విశ్వాసం పెంచుకోవటంలో తప్పేం లేదు అన్నయ్యగారూ!"

"తెలివితేటలు, సమర్ధత ఉన్నవాళ్ళు కష్ట పడరు అనుకోవద్దు. ఎవరికి తగిన పరీక్షలు వారికి కాలం పెడుతూనే ఉంటుంది" అని ఇందిర చెప్పేసరికి ప్రకాష్ అన్ని డాక్యుమెంట్స్ ఒకటికి రెండు సార్లు చూసుకుని బ్యాంక్ కి బయలుదేరాడు.

ఇందిర చెప్పినట్లే ఆ రోజు బ్యాంక్ కి వెళ్ళేసరికి, ప్రకాష్ కి అవసరమైన పని చూసే శాఖ లోని పాత వ్యక్తి కి బదిలీ అయిందని తెలిసింది. ఆ సీట్లో కి కొత్తగా వచ్చిన వ్యక్తి చిరునవ్వుతో ప్రకాష్ వాళ్ళని ఆహ్వానించి, "మీ పేపర్స్ చూశానండి. ఇంచుమించు అవసరమయిన వివరాలన్నీ ఉన్నాయి. రేపు మా డి జి ఎం బ్రాంచ్ విజిట్ కి వస్తున్నారు. ఒక్కసారి మీరు వచ్చి ఆయనకి వివరాలన్నీ చెప్పి, అదనపు సెక్యూరిటీ గా ఏమి ఇస్తున్నారో ఆ డాక్యుమెంట్స్ కూడా చూపించండి" అన్నాడు.

అనుకున్న ప్రకారం అన్ని పనులు వేగంగా అయిపోయి ప్రకాష్ కి లిమిట్స్ శాంక్షన్ అయ్యాయి. అప్పటికి షుమారుగా సంవత్సరం నించి నత్త నడకన జరిగిన ఆ వ్యవహారం, అవసరమైన డాక్యుమెంట్స్ సంతకాలయి పది రోజుల్లో ప్రకాష్ తన లిమిట్స్ వాడుకోగలిగాడు.

"ఇందుకేనోయ్ అవసరమైన సమయంలో సరైన సలహా ఇచ్చి నడిపించే భార్యని 'కరణేషు మంత్రి ' అన్నారు. బాబి గాడి సెలవులిచ్చే టైం కి ఆ కుకట్ పల్లి ప్రాజెక్ట్ అయితే, తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకొద్దాం" అన్నాడు.

"రంగా అన్నయ్య వాళ్ళని కూడా రమ్మనండి. మొన్న చిక్కడ్ పల్లి వెంకటేశ్వర స్వామి గుడికి మొదటి సారిగా వెళ్ళొచ్చారుట, పావని చెప్పింది. "తడిసి కానీ గుడిసె కట్టరని" ఆయనికేం బొప్పి కట్టిందో?" అన్నది నవ్వుతూ ఇందిర.

[దైవాన్ని నమ్మే వారంతా చేతకాని వారూ కాదు. సమర్ధత లేని వారూ కాదు. పని అవక చికాకుగా ఉన్నప్పుడు మనసు కుదురుగా లేక తప్పులు ఎక్కువ చేస్తాం. మన మీద మనకి నమ్మకం పోతుంది. మళ్ళీ ఆ నమ్మకాన్ని పెంచుకోవటానికే మన మనసులోని భారాన్ని కనపడని దైవం మీద వేస్తాం. అప్పుడు చెయ్య వలసిన పనిని స్థిమితమైన మనసుతో చేస్తాం. అన్నీ నేనే చేసెయ్యగలను అనే అతి విశ్వాసం కంటే, నా వంతు నేను చేశాను...కాలం కలిసి రావాలి అని నమ్మటంలో తప్పు లేదు అని నా భావన.]

***శుభం***


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : ఎం బిందుమాధవి

నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.

సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు
146 views0 comments

Comments


bottom of page