top of page

ఇంటిని చూసి ఇల్లాలిని చూడు


'Intini Chusi Illalini Chudu' - New Telugu Story Written By Madduri Bindumadhavi

Published In manatelugukathalu.com On 14/10/2023

'ఇంటిని చూసి ఇల్లాలిని చూడు' తెలుగు కథ

రచన: మద్దూరి బిందుమాధవి

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

"అక్కా మా ఫ్రెండ్ హరిత.. వాళ్ళు ఒరిస్సా టూర్ వేసుకున్నారు. మీ ఇంట్లో దిగి, రెండు రోజులుండి భువనేశ్వర్చూసుకుని, తరువాత మిగిలిన టూర్ పూర్తి చేసుకుంటామన్నారు. హరిత నీకు తెలుసు కదా! నీకేమి ఇబ్బందిఉండక పోవచ్చు" అని చెల్లెలు హరిణి నించి ఫోన్.


"ఎప్పుడొస్తున్నారు" అన్నది రుక్మిణి.


"వచ్చే నెల 10 వ తారీకుకి వచ్చి 12 కి వెళ్ళిపోతారు" అన్నది హరిణి.


"అయ్యో వచ్చే నెల 12 వ తారీకు మా ఆడపడుచు కూతురు పెళ్ళి. మేము 5th బయలుదేరి హైదరాబాద్వెళుతున్నాం. అయినా ఫరవాలేదు. మా ఇంటి వాళ్ళకి తాళం చెవి ఇచ్చి వెళతాను. మీ హరిత వాళ్ళని వచ్చిహాయిగా రెండు రోజులు ఉండి వెళ్ళమను" అన్నది మనస్ఫూర్తిగా రుక్మిణి.


హరిత..హరిణి మంచి ఫ్రెండ్స్. చెల్లెలు హరిణి మాటల్లో చాలా సార్లు హరిత గురించి విన్నందువల్ల..రుక్మిణిబేషరతుగా ఆ ఏర్పాటుకి పచ్చ జెండా ఊపేసింది.


"అదేమిటోయ్ మనం లేనప్పుడు బయటి వాళ్ళొచ్చి..ఇల్లంతా నానా కంగాళీ చేసేస్తారేమో? మనం ఉంటేఇలాంటి అతిధి మర్యాదలు ఫరవాలేదు కానీ..లేనప్పుడు ఎందుకు" అన్నారు రుక్మిణి శ్రీవారు వేణుమాధవ్.


"పోనీ లెద్దురూ..ఇప్పుడు కాదంటే చెల్లాయి చిన్నపుచ్చుకుంటుంది. వాళ్ళు రావటం మనకి ఇష్టం లేక పెళ్ళికివెళ్ళాలని సాకు చెప్పాము అనుకోవచ్చు " అన్నది.


@@@


"హరితా... ఈవిడ ఇల్లంతా ఎంత పొందిగ్గా పెట్టుకున్నారో కదా. బాత్ రూముల్లో కొత్త సబ్బులు, తువ్వాళ్ళు.. మంచాల మీద ఉతికి ఇస్త్రీ చేసి వేసిన దుప్పట్లు... దిండ్లు, కప్పుకునే దుప్పట్లతో సహా మన కోసం చక్కగా అమర్చిపెట్టారు. అతిధులకి వెతుక్కోకుండా సౌకర్యంగా ఉండేట్లు... మైక్రో వేవ్ మీద సెరియల్ ప్యాకెట్స్, ఫ్రిజ్జులో పండ్లు, టెట్రా ప్యాకెట్స్ లో పాలు, డైనింగ్ టేబుల్ మీద డబ్బాల్లో బిస్కెట్స్, పక్కనే క్రాకరీ బౌల్స్..వాహ్ మీ ఫ్రెండ్ వాళ్ళ అక్కఫెంటాస్టిక్. గొప్ప ఇల్లాలు" అన్నాడు హరిత భర్త హేమంత్..మెచ్చుకోలుగా.


"అవునండీ..మా హరిణి వాళ్ళ అక్క గురించి ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. ఇంటిని ఫైవ్ స్టార్ హోటల్లెవెల్లో ఉంచుతుంది అని. ఈపూజ గది చూడండి.. ఎంత పవిత్రంగా పెట్టుకున్నారో! హాయిగా అరగంట కూర్చునిమెడిటేషన్ చేసుకోవచ్చు."


'అందుకే మా చిన్నప్పుడు మా అమ్ముమ్మ "ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి" అంటూండేది. ఎప్పుడో ఒకసారి హరిణి ఇంట్లోనే చూశాను ఈవిడని. ఎంత చక్కగా మాట్లాడతారో" అన్నది హరిత.


ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని..స్నానాలు చేసి..బ్రేక్ ఫాస్ట్ తిని..ముందే మాట్లాడి పెట్టుకున్న టూరిస్ట్ట్యాక్సీ లో లింగరాజ్ టెంపుల్, ముక్తేశ్వర్ టెంపుల్, మ్యూజియం ఒక రోజు చూశారు. రాత్రికి భోజనాలు బయటే చేసివచ్చారు.


రాగానే స్నానాలు చేసి ఏసి వేసుకుని హాయిగా అలసట తీరా నిద్ర పోయారు.

మరునాడు బయలు దేరి నందన్ కానన్ జూ, ఉదయగిరి జైన్ మందిర్ చూసి వచ్చారు.


"మీ ఫ్రెండ్ వాళ్ళ అక్క లేకపోయినా ఏ ఇబ్బంది లేకుండా స్వంత ఇల్లులా వాడుకున్నాం. ఫైవ్ స్టార్ హోటల్సౌకర్యాలు..ఇంట్లో ఎంజాయ్ చేశాం. ఏదైనా మంచి బహుమతి కొని వాళ్ళకి సర్ప్రైజ్ గా డైనింగ్ టేబుల్ మీద పెట్టివెళదాం" అన్నాడు హేమంత్.


"మీరు లేకపోయినా మా పట్ల చూపించిన ఆత్మీయత..మీరు అతిధుల కోసం చేసిన సౌకర్యాలకిముగ్ధులైనాము. ఇల్లు ఎలా పెట్టుకోవాలో కూడా నేర్చుకున్నాము" అని ఒక స్లిప్ రాసి డైనింగ్ టేబుల్ మీద వాళ్ళుకొన్న లక్ష్మి దేవి వెండి విగ్రహం కింద పెట్టి..ఇల్లు తాళం వేసి..తాళం చెవులు యధా ప్రకారం ఇంటివాళ్ళకిచ్చివెళ్ళారు.


@@@@

హరితా..హేమంత్ లు... తన అన్నయ్యా వాళ్ళు అమెరికా నించి వస్తున్నారని..వాళ్ళతో రెండు రోజులుగడపాలని హైదరాబాద్ లో ఉండే చెల్లెలు ప్రీతి ఇంటికి వెళ్ళారు.


"టవలెక్కడుంది హరితా? ఇప్పుడే ఇక్కడ పెట్టాను..ఇంతలో ఎక్కడ మాయమయింది"అన్నాడు హేమంత్.


"ఇంట్లో పిల్లలున్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి..తెలియని చోట నన్నడిగితే నేనేం చేస్తాను" అని విసుక్కుంది హరిత.


బ్రేక్ఫాస్ట్ తిని వచ్చి ఆ జిడ్డు చెయ్యి... హేమంత్ వాడే టవల్ తో తుడుచుకుని, పనిలో పని లాప్ టాప్ మీదదుమ్ము దులుపుతూ కనిపించాడు ప్రీతి భర్త మోహన్ రావు.


అది చూస్తూనే మొహం చిట్లించి.."ప్రీతీ..బావగారికి చెయ్యి తుడుకొవటానికి నాప్కిన్ ఇవ్వచ్చు కదే? ఆయననా తడి టవల్ తో లాప్టాప్ తుడుస్తున్నారు. ఎలెక్ట్రానిక్ వస్తువులు అలా తడి బట్టలతో తుడవకూడదు అని నీకుతెలియదా" అన్నాడు.


"అన్నట్టు పొద్దుటి నించి వెతుకుతున్నాను న్యూస్ పేపర్ ఎక్కడుందే" అన్నాడు చుట్టూ చూస్తూ.


"నువ్వు మరీ అన్నయ్యా..ఇక్కడే ఉంది. నీకసలు ఎదురుకుండా ఉన్నది కనిపించదు..చిన్నప్పటి నించీఇంతే!" అని చెప్పుల స్టాండ్ మీద ఉన్న స్కూల్ బ్యాగ్ కింది నించి తీసిచ్చింది.


"న్యూస్ పేపర్, పిల్లల స్కూల్ పుస్తకాలు దైవ సమానం. సరస్వతీ స్వరూపం. వాటిని చెప్పుల స్టాండ్ మీదఎవరైనా పెట్టుకుంటారా? నువ్వే అలా పెడితే..పెట్టకూడదని పిల్లలకెవరు చెబుతారు..వాళ్ళకి పద్ధతులు ఎలాతెలుస్తాయి" అని విసుక్కున్నాడు.


"ఈ పిల్ల రాక్షసులతో సతమవుతుంటే..ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారురా? అంత టైం నాకుండదు" అన్నది ప్రీతి జవాబుగా.


"అన్నయ్యా టిఫిన్ రెడీ.నువ్వూ వదినా వచ్చేస్తే అందరం టిఫిన్ తినేస్తే..వంట పని చూసుకోవచ్చు. పెద్దన్నయ్యా వాళ్ళు వస్తే కబుర్లలో టైం తెలియదు" అన్నది.


హేమంత్, హరిత డైనింగ్ టేబుల్ దగ్గరకి వచ్చేసరికి కడిగి...ఇంకా నీళ్ళు కారుతున్న స్టీల్ ప్లేట్ ఒకటి పింగాణీప్లేట్ ఒకటి తెచ్చింది..ప్రీతి.


"అబ్బబ్బా ఉండవే తల్లీ..ఆ ప్లేట్ ఇటివ్వు..వదిన తుడిచి ఇస్తుంది. అలా నీళ్ళు ఓడుతున్న ప్లేట్ లో పెడితేఅసహ్యంగా ఉంటుంది" అని తనే ప్లేట్ చెల్లి చేతిలోంచి లాక్కుని తుడిచాడు.


చెల్లి వంటింట్లో నించి టిఫిన్ తేవటానికి వెళ్ళినప్పుడు.."హరితా మనం ఉన్న రెండు రోజులు...అది వచ్చి చేసేలోపే...కాస్త నువ్వే కష్టమనుకోక పనులు చూడు. అలా పనులు అశుభ్రంగా..అడ్డగోలుగా చేస్తుంటే చూసిసహించటం నాకు చేత కావట్లేదు. ఏమైనా అంటే..అదీ..వాళ్ళాయన కూడా నన్ను తప్పు పట్టుకోవచ్చు" అన్నాడునెమ్మదిగా మంద్ర స్థాయిలో.


@@@@


పెద్దన్నయ్యా వాళ్ళు వచ్చాక వారితో రెండు రోజులు గడిపి..హరిత వాళ్ళు తిరుగుప్రయాణమవుతూ.."బావగారూ వైజాగ్ రండి. మాతో కూడా ఒక వారం గడపండి" అని చెప్పి వెళ్ళారు.


"హరీ..భువనేశ్వర్ వెళ్ళినప్పుడు.. మీ ఫ్రెండ్ హరిణి వాళ్ళ అక్క రుక్మిణి గారి ఇంటికి వెళ్ళాం. ఆవిడ లేకపోయినా ఏ ఒక్క వస్తువుకి వెతుక్కోకుండా..హాయిగా మన ఇల్లు లాగానే స్వతంత్రంగా గడిపాము."


"ఇప్పుడు నా చెల్లెలు ప్రీతి ఇల్లు చూశాం. ఇక్కడికి…ఆవిడ ఇంటికి ఎంత తేడానో చూశావా" అన్నాడుహేమంత్ ట్రెయిన్ లో తన సీట్ మీదవెనక్కి వాలుతూ.


"అవును హేమూ... ఇంటి నిర్వహణ, పిల్లల పెంపకం ఒక కళ. ఎలాగైనా రోజు గడిచిపోతుంది. కానీ ఎంతపద్ధతిగా గడిచింది అనేది కూడా ముఖ్యమే!"


"అందుకే చిన్నప్పుడు మా అమ్మ మేము ఏ పని అయినా సరిగ్గా చెయ్యకపోతే కేకలేసి చేయించేది. 'పద్దతులుచిన్నప్పుడు పట్టుపడకపోతే..పెద్దయ్యాక రావు. బుద్ధి లేని జంతువుల్లాగా..తిన్నమా..పడుకున్నామా అన్నట్టుకాకుండా బుద్ధి జీవుల్లాగా బతకాలి' అని కోప్పడేది."


'ఖరీదైన బట్టలేసుకు తిరిగినంతా మాత్రాన నాగరికత రాదు..చదువుకున్నంత మాత్రాన సంస్కారం రాదు. దేనికైనా మన ప్రయత్నం ఉండాలి' అనేది.


'కాబట్టి "ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి" అని మన పెద్దలు ఎంత అనుభవంతో చెప్పారో మరొక సారితెలిసింది' అన్నది హరిత.


[కొన్ని పనులు చేశాక నోటితో చెబితేనే తెలుస్తుంది. కొన్ని పనుల్లో అంతర్లీనంగా ఆ పని చేసిన వారిమనసు..నైపుణ్యం..పనిలో వారి అనుభవం కొట్టొచ్చినట్లు తెలుస్తుంది. ఇతరుల పట్ల స్నేహ భావం..ఆదరణ వారిప్రతి కదలికలోను తెలుస్తుంది...]


ఏమంటారు?


***

మద్దూరి బిందుమాధవి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఇక్కడ క్లిక్ చేయండి.

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : ఎం బిందుమాధవి

https://www.manatelugukathalu.com/profile/bindumadhavi/profile

నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.

సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


69 views0 comments
bottom of page