జయహో స్నేహం
- Sujatha Swarna

- 5 hours ago
- 4 min read

Jayaho Sneham - Telugu Friendship Story | Sujatha Swarna
జయహో స్నేహం - తెలుగు స్నేహం కథ | సుజాత స్వర్ణ
Published In manatelugukathalu.com On 22/03/2026
ఆ రోజు ఆదివారం. రేడియో కార్యక్రమాలు వినడం మాధురికి అలవాటు.
మాధురి ప్రభుత్వ ఉపాధ్యాయిని, అవివాహిత. పనిచేసే ఊర్లోనే రెండు గదులు అద్దెకు తీసుకొని ఉంటోంది.
ఉదయాన్నే లేచి దినపత్రిక చదివి పక్కన పెట్టి, కాలక్షేపానికని రేడియో పెట్టింది.
హైదరాబాద్ రేడియో కేంద్రంలో ఒక కథానిక వస్తోంది.
ఆ గొంతు వింటే తనకు పరిచయం ఉన్నట్లుగా అనిపించింది.
కథానిక చాలా బాగుంది. చదివే తీరు ఎంతో నచ్చింది.
విన్నా కొద్దీ వినాలనిపించే స్వరం.
మనసుకు హత్తుకుపోయేట్లుగా చదువుతున్నాడతను.
చదవడం పూర్తయిన తర్వాత చదివిన వారి పేరు చెబుతారేమోనని ఆసక్తిగా చెవులు రిక్కించి విన్నది మాధురి.
రేడియో ప్రోగ్రాంలో పేరును ముందుగానే ప్రకటించినట్లున్నారు.
తర్వాత వేరే కార్యక్రమం మొదలైంది.
"అయ్యో! కనీసం అతని పేరైనా తెలుసుకోలేకపోయానే!" అని నిట్టూర్చి, కొంచెం ముందుగా రేడియో పెట్టనందుకు తనను తాను తిట్టుకుంది.
***
రోజా మాధురికి సహాధ్యాయిని. ఇద్దరికీ ఇంచుమించు ఒకే వయసు ఉంటుంది.
ఉద్యోగమే ఇద్దరినీ కలిపింది.
రోజాది అదే ఊరు.
కొద్ది రోజులకే ఇద్దరు మంచి స్నేహితులయ్యారు.
సెలవు వస్తే చాలు మాధురి ఇంట్లో ప్రత్యక్షమవుతుంది రోజా.
ఇద్దరూ సాహితీ ప్రియులు.
ఇక ఆ రోజు ఎలా గడుస్తుందో చెప్పాల్సిన అవసరమే లేదు.
ప్రాచీన కవి పోతన నుంచి ఆధునిక కవులు, సినీ కవులు... ఎవ్వరినీ వదలరు వారి సంభాషణలో.
తనకు అవకాశముంటే తెలుగు పాట మీద పి.హెచ్.డి. చేస్తానంటుంది రోజా.
పాటంటే ప్రాణం ఆమెకు. 'తథాస్తు' అంటూ దీవిస్తుంది మాధురి.
మూడేళ్ళు తెలియకుండానే గడిచిపోయాయి.
అవివాహిత కోటా కింద మాధురికి సొంత మండలానికి బదిలీ అవకాశం వచ్చింది.
తన కుటుంబానికి దగ్గరగా వెళుతున్నానన్న సంతోషం ఒకవైపు, రోజా లాంటి ప్రియనేస్తాన్ని, అక్కడి అమాయక పిల్లల్ని వీడి పోతున్నానన్న బాధ మరోవైపు మాధురిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది,
కానీ ఉద్యోగ జీవితంలో ఇవన్నీ సహజమని తనని తాను సముదాయించుకుంది.
రోజా స్నేహమే మాధురికి కొండంత అండ.
ఆ స్నేహమే అన్నాళ్ళు తన వారంతా అక్కడ లేని లోటును తీర్చింది.
కుటుంబాన్ని వదిలి ఒక కొత్త ప్రదేశంలో ఆమె హాయిగా పనిచేయగలిగిందంటే, అందుకు రోజా స్వచ్ఛమైన స్నేహమే కారణం.
ఇక రోజా పరిస్థితి చెప్పాల్సిన పనేలేదు.
మాధురి తనను వీడి వెళుతుంటే కన్నీరు మున్నీరయ్యింది.
ఇద్దరూ కలిసి చేసింది కొద్దికాలమే అయినా, ఆ ఊరి ప్రజల మన్ననలు పొందగలిగారంటే, అందుకు వారి సఖ్యతే కారణమని చెప్పకనే చెప్పవచ్చు.
****
మరుసటి రోజు సొంత మండల కేంద్రానికి వెళ్ళి విద్యాధికారిని కలిసి విధుల్లో చేరింది మాధురి.
ఆ సాయంత్రం తనకు బదిలీ అయిన రాఘవాపురం పాఠశాలకు స్కూటీ మీద బయలుదేరింది ఆమె.
అదో ప్రాథమికోన్నత పాఠశాల అంటే, ఒకటి నుంచి ఏడు తరగతులు ఉంటాయక్కడ.
పదిహేను నిమిషాల్లో రాఘవాపురం ఊరు చేరుకుంది.
పచ్చని పంటపొలాలు, చక్కని రోడ్లతో ఊరు ప్రశాంతంగా ఉంది.
ఊళ్ళో రావిచెట్టు కింద అరుగుమీద ఇద్దరు, ముగ్గురు పెద్దవాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
అక్కడికి వెళ్ళాక రెండు దారులు కనిపించడంతో ఎటు వెళ్ళాలో తెలియక పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్లి స్కూటీని ఆపి, "తాతా! బడికి వెళ్లే దారెటు?" అని మర్యాదగా అడిగింది మాధురి.
ఆ దారిలోనే కొంచెం ముందుకు పోతే రాములోరి గుడి కనిపిస్తుందని, అది దాటాక కుడివైపు తిరగగానే బడి ఉంటుందని చెప్పారు వాళ్ళు.
వారు చెప్పిన మార్గంలో ఓ ఫర్లాంగు దూరం వెళ్ళగానే రాఘవాపురం పాఠశాల బోర్డు కనిపించింది.
బండి బయటే ఆపి, స్టాండ్ వేసి, గేటు తీసుకొని లోపలికి నడిచింది మాధురి.
అక్కడి అందమైన పూలతోట, ఆహ్లాదకరమైన వాతావరణం ఆమెనెంతో ముగ్ధురాలిని చేశాయి.
బడి గోడలన్నీ రంగురంగుల చిత్రాలతో, చక్కని సూక్తులతో అలంకరించబడి కార్పొరేట్ పాఠశాలని తలపింపజేస్తోంది.
చివరి పీరియడ్ కావడంతో కొందరు పిల్లలు మొక్కలకు పాదులు చేస్తూ, నీళ్ళు పోస్తూ కనిపించారు.
మరికొందరు ఆటలు ఆడుతున్నారు.
ఒక పిల్లవాడు మాధురికి ఎదురొచ్చి నమస్కరించి, ఆఫీస్ రూమ్ వైపు తీసుకొనిపోయాడు.
పక్కనే ఉన్న తరగతిగదిలో ఓ మాస్టారు పిల్లల మధ్యలో కూర్చుని వారితో కృత్యం చేయిస్తున్నాడు.
ఆయన అటువైపు తిరిగి ఉండటంతో ముఖం కనిపించలేదు.
ఎక్కువసేపు అలా చూడటం సభ్యత కాదనిపించి ముందుకు నడిచింది ఆమె.
కాసేపు కూర్చున్న తర్వాత లోపలికి వచ్చిన ఉపాధ్యాయుడిని చూసి, ఎక్కడో చూసినట్లు అనిపించింది మాధురికి.
అదే అడుగుదామనేలోగా అతనే నవ్వి, "నమస్తే! మాధురిగారూ!" అంటూ తెలిసినట్లు పలకరించగానే, మరింత ఆశ్చర్యపోయింది - "అతడికి తన పేరెలా తెలుసని!?"
ఆమె ఆశ్చర్యంలో మునిగితేలుతుండగానే, "ఎందుకండీ! అంతలా ఆశ్చర్యపోతున్నారు? మీరు వస్తారని ఎం.ఈ.వో. గారు ఫోన్ చేసి చెప్పారు," అన్నాడు.
కొంత తేరుకొని అతనికి నమస్కరించి, "మీ పేరు తెలుసుకోవచ్చా...?" కుతూహలంగా అడిగింది మాధురి.
"క్షమించండి. మన పరిచయాలు కానేలేదు కదా! నా పేరు వేణు," చిరునవ్వుతో అన్నాడు.
"వేణు గారూ! మీరు... వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పీజీ చేశారు కదా!
నేను కూడా అక్కడే డిగ్రీ చదివాను.
బహుశా నేను మీకు తెలియకపోవచ్చేమో.
మీరు నాకు తెలుసు.
నేను చివరి సంవత్సరంలో ఉండగా గురజాడ జయంతిని పురస్కరించుకొని తెలుగు విభాగం వారు ఒక కథల పోటీ నిర్వహించారు, మీకు గుర్తుందా?
ఆ పోటీలో గెలుపొందిన వారు తమ కథను అందరికీ చదివి వినిపించాలనే నిబంధన కూడా ఉంది.
మీరు రాసిన కథకు మొదటి బహుమతి వచ్చింది.
దానిని మీరు చదివి వినిపించారు కదా!
ఆ కథ పేరు కూడా నాకింకా గుర్తే... "అమ్మ మనసు".
చాలా బాగుంది ఆ కథ!" అంటూ ఉత్సాహంగా చెప్పుకొచ్చింది మాధురి.
ఎప్పటి విషయాలు గుర్తు పెట్టుకొని చెప్పినందుకు మెచ్చుకోలుగా నవ్వాడు వేణు.
తాను రేడియోలో విన్నది కూడా అతని కథానికే అని గుర్తించి, అతనిని అభినందనలలో ముంచెత్తింది మాధురి.
చిరునవ్వుతో కృతజ్ఞతలు తెలిపాడు వేణు మాస్టర్.
"పాఠశాలలో మీరొక్కరే రెగ్యులర్ ఉపాధ్యాయులని విన్నాను.
ఒక్కరే ఏడు తరగతులను ఎలా నిర్వహిస్తున్నారు?
స్కూల్‌ని ఇంత అందంగా ఎలా తీర్చిదిద్దారు?
పిల్లలకు చక్కని క్రమశిక్షణ ఎలా నేర్పారు?" అంటూ ఆగకుండా ప్రశ్నల వర్షం కురిపించింది మాధురి.
"ఏంటండీ బాబు! లాయర్ లాగా ఆగకుండా ఆ ప్రశ్నలు?" అని నవ్వి,
"పాఠశాల విద్యా కమిటీ, తల్లిదండ్రులు, గ్రామస్థుల సహాయ సహకారాలతో ఇదంతా చేస్తున్నాం.
వారు పాఠశాలకు అదనంగా ఇద్దరు ఉపాధ్యాయులను నియమించారు.
గ్రామంలో చదువుకొని బోధన పట్ల ఆసక్తి ఉన్న యువతను కూడా ఆహ్వానించాం.
మీకు తెలియందేముంది చెప్పండి?
బహుళ తరగతి బోధన కూడా చేస్తుంటాం," వివరించాడు వేణు.
పాఠశాలలోని అన్ని తరగతులను చూపించి, పిల్లలు సాధించిన ప్రగతిని గూర్చి చెబుతుంటే ఎంతో సంతోషమేసింది మాధురికి.
ఒక మంచి పాఠశాలకు బదిలీపై వచ్చినందుకు గర్వంగా కూడా అనిపించింది ఆమెకు.
ఆ తర్వాత ఇరువురూ కుటుంబ విషయాలు పంచుకున్నారు.
అతనికి పెళ్ళయ్యిందని, భార్య ఉద్యోగ ప్రయత్నాల్లో ఉందని చెప్పాడు.
తనకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారనీ, కాబోయేవాడు బోధనా వృత్తిలో ఉండాలన్నది తన అభిమతమని తెలిపింది మాధురి.
తథాస్తంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు వేణు.
మాధురి చేరిన మరుసటి సంవత్సరం బడిలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి,
బస్సులెక్కి దూరప్రాంతానికి వెళ్ళే చుట్టుపక్కల ఉన్న పిల్లలను ఆకర్షించి బడిలో చేర్చారు.
వేణు, మాధురి ఇద్దరూ చక్కని సహకారంతో పనిచేసి రాఘవాపురం పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దారు.
దాంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
'అడ్మిషన్స్ లేవు' అనే బోర్డు పెట్టాల్సి వచ్చింది.
పిల్లల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం అన్ని ఖాళీలను భర్తీ చేసింది.
ఎందరో విద్యార్థుల భవితను తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు ఆ ఉపాధ్యాయులు.
ఐక్యంగా పనిచేసి విద్యతోపాటు పిల్లల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నారు.
నేడు ఆ బడి పిల్లలు కథలు చెప్పగలరు, కవితలు అల్లగలరు, పద్య పఠనం చేయగలరు, గణితంలో ముందంజలో ఉన్నారు.
మాధురి, రోజా, వేణు వంటి వారు ఎక్కడ పనిచేసినా స్నేహ పరిమళాలు వెదజల్లుతూ చిన్నారుల జీవితాల్లో విజ్ఞాన వెలుగులను నింపుతుంటారు.
స్నేహం తోడుంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు ఆ ప్రియ మిత్రులు.
"స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల, స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే తోడురా"...
రేడియోలో వస్తున్న పాట వీరి స్నేహానికి తగినట్లుగా ఉంది.
జయహో స్నేహం.
జయ జయహో స్నేహం.
సమాప్తం.
*****
సుజాత స్వర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
*******

రచయిత్రి పరిచయం:
నా పేరు సుజాత స్వర్ణ. మాది సాహితీ గుమ్మంగా పేరొందిన ఖమ్మం. నేను ఉపాధ్యాయినిని. పుస్తక పఠనం, పాటలు వినడం, పాడడం, రచనలు చేయడం... నా వ్యాపకాలు.
Telugu friendship story, స్నేహ కథ, inspirational Telugu story, teacher story Telugu, school stories Telugu, emotional Telugu stories, సుజాత స్వర్ణ, జయహోస్నేహం, Jayaho Sneham |




Comments