సరైన నిర్ణయం
- Srinivasarao Jeedigunta

- 4 minutes ago
- 7 min read
#సరైననిర్ణయం, #SarainaNirnayam, #JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguMoralStories, #తెలుగునీతికథలు

Saraina Nirnayam - Telugu Moral Story | Jeedigunta Srinivasa Rao Published In manatelugukathalu.com On 21/03/2026
సరైన నిర్ణయం - తెలుగు నీతి కథ | జీడిగుంట శ్రీనివాసరావు | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
“గోదానం చేయడానికి సిద్ధమైన ఒక పండితుడు… చివరి క్షణంలో తీసుకున్న నిర్ణయం అక్కడ ఉన్నవాళ్లందరినీ ఆశ్చర్యపరిచింది!” అది సరైన నిర్ణయం అని ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత జీడిగుంట శ్రీనివాసరావు గారి కథ వింటే మీరు కూడా అంగీకరిస్తారు. |
అమలాపురం అగ్రహారంలో కృష్ణ శాస్త్రి గారు అనే గొప్ప పండితుడు ఉండేవారు. ఆయన భార్య రుక్మిణి భర్తకు తగ్గ భార్య. ఆమె నిత్యం పూజలతో గడపడమే కాదు, నూతన భావాలు కలిగి పేదవాళ్ళకి చేతనైన సహాయం చేస్తూ ఉండేది.
కృష్ణ శాస్త్రి గారు పురాణాలు జనానికి అర్థమయ్యేలా చెప్పడంలో ఎంతో నేర్పరి, కానీ వాటిని తను అర్థం చేసుకున్నవాడిలా భార్యకి అనిపించేవాడు కాదు.
తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి, పాడి, పంటలు ఉండటంతో కృష్ణ శాస్త్రి గారికి ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు. కొడుకు, కూతురుని బాగా చదివించి, వారికి మంచి కుటుంబంలో ఇచ్చి వివాహం చేసి, తను సాయంత్రం పురాణాలు చెప్పుకుంటూ హాయిగా గడిపేస్తున్నాడు.
ఆ రోజు సాయంత్రం కృష్ణ శాస్త్రి గారు గుడిలో గోదానం గురించి వివరంగా పురాణం చెప్పింది విన్న రుక్మిణి, ఇంటికి వచ్చిన భర్తకి పాల గ్లాస్ చేతికి ఇచ్చి, "ఏవండీ! ఈ రోజు గుడిలో పురాణంలో మీరు చెప్పారు కదా.. 'గోదానం కన్నా మిన్న అయిన దానం లేదు' అని. ఆ మాటలు మనం కూడా పాటించాలి కదా! అందుకే మన ఇంట్లో ఉన్న గోవులలో కపిల గోవుని, దాని దూడని దానం చేద్దాం!" అంది.
పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి శాస్త్రి గారు భార్యతో, “గోదానం అంటే చనిపోయిన తరువాత యమధర్మరాజు దున్నపోతును ఎక్కకుండా, వైతరణి నదిని ఆవు తోక పట్టుకుని దాటడానికి చేసేది. మనమిద్దరం ఇంకా బతికే ఉన్నాముగా!” అన్నారు.
రుక్మిణి నవ్వుతూ, "మరి గుడిలో బతికివుండగానే ఏ దానం చేసినా దానం చేసినవాడికి సంతృప్తి, ఫలితం ఎక్కువ అని చెప్పారు. ఉట్టిదేనా? చనిపోయాక ఏం చేశారో పోయిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? బతికుండగానే మన చేతులతో ఆవును దానం ఇచ్చి, అది ఒకరి ఇంట్లో పాలిస్తుంటే చూసే పుణ్యం కంటే లోకంలో గొప్పది ఉందా? పండితులైన మీకు చెప్పే అంత దానిని కాదు, ఆలోచించండి!" అంది.
శాస్త్రి గారు భార్య తన పాండిత్యం గురించి మెచ్చుకోవడంతో, "ఓహో, నీకు కూడా నేను చెప్పిన పురాణం అర్థమైంది, సంతోషం! అలాగే దానం చేద్దాం. పిల్లలని సెలవు పెట్టి మాఘమాసంలో రమ్మను," అన్నాడు.
భర్త ఇంత త్వరగా ఒప్పుకోవడంతో అమలాపురంకి దగ్గరలో ఉన్న తన అన్నగారికి ఫోన్ చేసి విషయం చెప్పి, దానం తీసుకోవడానికి మంచి బ్రాహ్మణుడిని చూడమని కోరింది.
ఉదయం పొలం దగ్గరికి వెళ్లి రైతులకి పనులు పురమాయించి ఇంటికి వస్తూ ఉండగా, దారిలో పెంకుటిల్లులోనుండి ఒక కుర్రాడు బయటకు వచ్చి "దండాలు స్వామి!" అన్నాడు. "చిరంజీవ!" అంటూ వెళ్ళిపోయాడు శాస్త్రి గారు.
నెల రోజులు నుంచి ఆ కుర్రాడు విధిగా తప్పకుండా శాస్త్రి గారికి నమస్కారం చేస్తూ ఉండడంతో, "ఎవరు ఈ కుర్రాడు? రోజూ నాకెందుకు ఇలా దండం పెడుతున్నాడు?" అనుకున్న శాస్త్రి గారు, అతనిని దగ్గరికి పిలిచి, "ఎవరు నాయనా నువ్వు?" అని అడిగాడు.
అతను దూరంగా నిలబడి, "స్వామి, నా పేరు వేణు. మా నాన్న పక్క ఊరిలో చెప్పులు కుడుతూ ఉంటాడు. నేను కొద్దిగా చదువుకున్నాను కానీ వచ్చే సంపాదన చాలడం లేదు. క్రితం జన్మలో పాపం చేసుకోబట్టి ఈ కష్టం వచ్చింది అని, వచ్చే జన్మ అయినా బాగుండటం కోసం మీలాంటి పండితుల దర్శనం చేసుకుంటున్నాను," అన్నాడు.
"మరి కుటుంబ పోషణ ఎలా నాయనా? నీకు వివాహం అయిందా?" అని అడిగాడు శాస్త్రి గారు.
"వివాహం అయింది స్వామి. గంతకు తగ్గ బొంత దొరికింది. ఇద్దరు చిన్న పిల్లలు. తల్లిదండ్రులు నా భార్యని ఇంటి పనికి పంపుదాం అనుకుంటే మా కులం అడ్డు వస్తోంది అన్నిచోట్లా. అందుకే నేను పై సంపాదన కోసం పొలం గట్ల మీద పచ్చగడ్డి కోసి, ఊర్లో అమ్మి పిల్లలకి పాలు కొనుక్కుంటాను స్వామి," అన్నాడు.
జేబులో ఉన్న రెండు వందలు అక్కడ అరుగు మీద పెట్టి, "పిల్లలకు ఏమైనా కొనిపెట్టు. రేపు మా ఇంటికి వస్తే మా రైతుతో చేనుకి వెళ్లి గడ్డి కోసుకో," అన్నాడు.
మర్నాడు వేణు శాస్త్రి గారి ఇంటి బయట అరుగు కింద వినయంగా నిలబడి ఉండటం చూసి శాస్త్రి గారి భార్యకి కోపం వచ్చింది. "ఇది బ్రాహ్మణ వాడ అని తెలిసి సరాసరి శాస్త్రి గారి ఇంటికి వస్తావా? పనివాడిని పంపి బియ్యం పంపుతాను, తీసుకుని వెళ్ళు," అంది.
"అమ్మా! స్వామి రమ్మంటే వచ్చాను తల్లి," అన్నాడు కొద్దిగా దూరంగా జరిగి.
"స్వామితో ఏం పని? పెళ్లి ముహూర్తం పెట్టాలా?" అంది.
"లేదమ్మా, నాకు ఇద్దరు పిల్లలు," అన్నాడు.
ఇంతలో మునసబు గారితో కలిసి వచ్చిన శాస్త్రి గారు వేణుని చూసి, "ఆ, వచ్చావా? ఉండు," అని లోపల గోశాల దగ్గర పనిచేస్తున్న రామయ్యని పిలిచి, "ఈ కుర్రాడిని తీసుకుని మన తోట, పొలాలు చూపించు. అతనికి వీలున్నప్పుడు వచ్చి పచ్చగడ్డి కోసుకుంటాడు. అలాగే కొన్ని కూరగాయలు కూడా ఇవ్వు," అన్నాడు.
రోజులు గడుస్తున్నాయి. ఏదో ఒక సమయంలో శాస్త్రి గారికి వేణు నమస్కారాలు అందుతూనే ఉన్నాయి. అయితే అదివరకులా శాస్త్రి గారు పలకరించకుండా వచ్చేస్తున్నారు.
కడుపునిండా భోజనం చేసి, భార్య ఇచ్చిన తాంబూలం వేసుకుని నములుతూ, పట్టె మంచం మీద పడుకుని కిటికీ వంక చూశాడు. నెత్తిమీద పచ్చగడ్డి మోపుతో పెరటి దొడ్లోకి వెళ్తున్న వేణుని చూసి భార్యని అడిగాడు, "అతను మన ఆవులకి కూడా పచ్చగడ్డి తెచ్చి వేస్తున్నాడా?" అని.
"అవునండి. పాపం ఏమో అనుకున్నాను కానీ కుర్రాడు మంచివాడు. వారంలో ఒకసారి పచ్చగడ్డి తెచ్చి వేస్తున్నాడు. నేను కూడా అడగలేదు. మన పొలంలో గడ్డే కదా అని. వేణుని చూడగానే మన ఆవులు ఒక్కసారిగా హుషారు అయిపోతాయి. కపిల దూడని గంటసేపు ఆడిస్తాడు," అంది రుక్మిణి.
"పాపం, గడ్డి మీద ఏం వస్తుంది అండీ? మీకు పెద్ద పెద్ద వాళ్ళు పాద నమస్కారాలు చేస్తారు కదా! వేణుకి ఏదైనా ఉద్యోగం ఇప్పించలేరా?" అంది.
"గలన్.. చూద్దాం కొన్నాళ్ళు," అన్నాడు ఇప్పించలేను అని తెలిసి కూడా శాస్త్రి గారు.
ఇట్టే మాఘమాసం వచ్చింది. పిల్లలిద్దరూ వారి పిల్లలతో ముందుగానే వచ్చేసారు. అల్లుడు గారు ముహూర్తం రోజుకి ముందు రోజున వస్తాను అని చెప్పడంతో, ఎవ్వరిని పిలవాలి, ఎవ్వరిని పిలవద్దో లిస్ట్ చెప్తోంది కొడుకుకి రుక్మిణి.
"ఇదే నాకు నచ్చదమ్మా! ఇంకా విరోధం అని కావలసిన వాళ్ళని దూరం పెట్టేడట్లు అయితే ఈ గోదానం వల్ల ఉపయోగం ఏముంటుంది?" అన్నాడు శాస్త్రి గారి అబ్బాయి సతీష్.
"అమ్మ చెప్పిందే కరెక్ట్. వాళ్ళు మనం బాగున్నాం అని ఏడుస్తున్నారు," అంది శాస్త్రి గారి కూతురు సుమ తల్లిని సపోర్ట్ చేస్తూ.
కుర్చీలో కూర్చొని పంచాంగం చూసుకుంటున్న తండ్రిని చూసి, "ఏమిటి నాన్నా మీ అభిప్రాయం? వాళ్ళకి గొడవ మీతోనే, మాతో బాగానే ఉంటారు," అంది సుమ.
"అమ్మా! తమ్ముడు చెప్పినట్టుగా వాళ్ళని కూడా పిలుద్దాం. ఈ గోదానం సందర్భంగా అందరూ కలిస్తే మంచిదేగా. మేమూ దూరంగా ఉంటున్నాము ఉద్యోగం వల్ల. మీకు తోడుగా ఉంటారు. కలిస్తే ఏమంటావ్?" అంది రుక్మిణి కూతురు.
"ఇప్పటికే మనం ఏదో రియల్ ఎస్టేట్ చేస్తున్నామని, ఊరిలో పొలాలు, స్థలాలు కొన్నామని అందరికీ లేనిపోనివి చెప్తున్నారు. ఇప్పుడు ఈ గోదానం చూసి ఏం గొడవలు అవుతాయో అని నా భయం. అసలే బీపీ, షుగర్ తో ఉన్నాము," అంది రుక్మిణి.
"నీ చాదస్తం కాని, వాళ్ళు మనకి పరాయి వాళ్ళు కాదు కదే. మన దగ్గర నాలుగు రూపాయలు ఉంటే అవసరం పడితే ఆదుకుంటారు అనుకోవాలి కాని, మన బాగుంటే బాధపడటం వాళ్ళ అమాయకత్వం అనుకోవాలి. పిల్లలు చెప్పినట్టు ఎవ్వరిని వదలకుండా పిలువు," అన్నాడు శాస్త్రి గారు.
"మీకు ఎప్పుడు ప్రేమ కలుగుతుందో, కోపం వస్తుందో ఆ దేవుడికే తెలియాలి. సరే, అలాగే పిలుస్తాను," అంది భర్తతో.
"పిలుపులు సరే, ముందు మీ అన్నయ్యా బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నాడే. దానం తీసుకునే పంతులుగారిని సెలెక్ట్ చేసి మాట్లాడిస్తాను అన్నాడు. ఏది?" అన్నారు శాస్త్రి గారు.
"అన్ని అర్హతలు ఉన్నవాడిని తీసుకుని ఈ గురువారం వస్తాను అన్నాడు. మీరు మాత్రం ఏ పని చేయకుండా అలా కూర్చొని ఉంటారు," అంది.
గురువారం ఉదయం శాస్త్రి గారి బావమరిది రామ్ శాస్త్రి, ఒక వేదపండితుడు అయిన మురళి శాస్త్రిని వెంటబెట్టుకుని వచ్చాడు.
"బావగారు, వివరాలు అన్నీ మురళి గారికి చెప్పాను. ఆయన మీతో మాట్లాడాలి అన్నారు," అంటూ, "చెప్పండి మురళి గారు. గోదానం మాత్రం ఏ తేడా రాకుండా చేయించాలి. అసలే మా బావగారు శాస్త్రం చదువుకున్నవారు," అన్నాడు.
"నమస్కారం శాస్త్రి గారు. అమలాపురంలో మీకున్న పేరు నేను కూడా విన్నాను. గోదానం చేయడం గురించి మీకు విడిగా చెప్పక్కర్లేదు.
నేను గోవు, దూడ ని తీసుకుని వచ్చి దానం తీసుకుంటే లక్షా ఇరవై వేలు తీసుకుంటాను.
నేను మా ఊరిలో గోశాల నడుపుతున్నాను.
మీరే గోవు, దూడని మీ గోసంపద నుంచి ఇస్తాను అంటున్నారు కాబట్టి, పదిహేను వేలు ఒక ఏడాదికి గోగ్రాసం కొరకు, దానం తీసుకున్నందుకు నాకు పదివేలు దక్షిణ ఇవ్వాలి. మీరు సరే అంటే ఆదివారం మీరు నిర్ణయించిన ముహూర్తానికి వచ్చేస్తాను," అన్నాడు.
కృష్ణ శాస్త్రి గారికి ఎందుకో మురళి శాస్త్రి గారి మాటలు నచ్చలేదు. 'పూర్తిగా డబ్బు మనిషిలా ఉన్నాడు' అనుకుని, "రోజుకి అయిదు లీటర్లు పాలు ఇచ్చే గోవుని దూడతో సహా దానం ఇస్తున్నప్పుడు, మరలా మీకు పదివేలు దక్షిణ ఎందుకు? దానివలన డబ్బు తీసుకుని దానం తీసుకున్నట్టు అవుతుంది కదా!" అన్నాడు.
"మీరు దానం ఇచ్చి వదుల్చుకుంటారు. నేను దానిని జీవితాంతం పోషించాలి. అందుకే డబ్బు కూడా తీసుకోవడం జరుగుతోంది," అన్నాడు మురళి శాస్త్రి.
"బాగానే ఉంది. నేను ఈ రోజు ఆలోచించుకుని రేపటిలోగా మీకు మా బావమరిదితో తెలియచేస్తాను," అన్నాడు.
గోదానం చేసే రోజు రానే వచ్చింది. ఇంటి ముందు పందిరి, ఇంటి వెనుక వంటలు అవుతున్నాయి. శాస్త్రి గారి ఇల్లు చుట్టాలతో నిండిపోయింది. ముహూర్తం ఉదయం పదకొండు గంటలకు. బ్యాండ్ వాళ్ళు వాయిస్తున్నారు.
శాస్త్రి గారు, రుక్మిణి, వారి సంతానం పట్టుబట్టలు కట్టుకుని ఉన్నారు.
పందిరిలో అలంకరణతో కపిల ఆవు, దాని దూడని పట్టుకుని నిలబడి ఉన్నాడు వేణు.
"ఏమండీ! దానం తీసుకునే శాస్త్రి గారు ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేయండి. ముహూర్తం టైం అవుతోంది," అంది రుక్మిణి.
"అందరూ సిద్ధంగానే ఉన్నారు. పదండి నీటి బిందెలు తీసుకుని ఆవు దగ్గరికి," అంటూ మంత్రాలు చదువుతూ ముందుకు నడిచారు కృష్ణ శాస్త్రి గారు. ఆయనని వెంబడించారు అందరూ.
ఆవుని కదలకుండా గట్టిగా పట్టుకుని ఉన్నాడు వేణు. "ఇదిగో వేణు, ఈ పువ్వుల దండలు ఆవు, దూడకి వేసి కొద్దిగా పచ్చగడ్డి తినిపించు వాటికి," అన్నాడు శాస్త్రి గారు.
గోమాత చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న భర్తని వెంట నడుస్తున్న రుక్మిణికి, పిల్లలకు జరుగుతోంది ఏమిటో తెలియక అయోమయంలో ఉన్నారు. ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న కృష్ణ శాస్త్రి గారు సడన్ గా ఆగి, కొడుకు భుజం మీద కండువా తీసి వేణు భుజం మీద వేసి, "ఇదిగో వేణు, ఈ గోమాతను దాని సంతానంతో సహా మనస్ఫూర్తిగా నీకు దానం చేస్తున్నాను. ఇలా వచ్చి ఆవు తోక పట్టుకో," అన్నాడు.
ఒక్కసారిగా అలజడి! "అదేమిటి శాస్త్రి గారు! గోదానం బ్రాహ్మణుడికి ఇవ్వాలి కాని, ఇలా ఎవ్వరికి పడితే ఇస్తే మహా పాపం!" అన్నారు. వారితో పాటు భార్య రుక్మిణి కూడా గొంతు కలిపింది.
"అయ్యా! ఒక్క క్షణం నా మాట వినండి. గోదానం తీసుకుంటాను అన్న మురళి శాస్త్రి గారికి ఇంట్లో ఇప్పటికే పది ఆవులు ఉన్నాయి. మనం ఇచ్చేది పదకొండోది అవుతుంది. ఆయన దీన్ని సంతలో అమ్మేసి సొమ్ము చేసుకుంటాడు. అదికాక దానం తీసుకోవాలి అంటే డబ్బు కావాలి అన్నాడు.
అదే వేణుకి ఇస్తే, వాడు దీన్ని కన్నబిడ్డలా చూసుకుంటాడు. ఆ పాలు అమ్ముకుని వాడి తల్లికి మందులు కొంటాడు. పిల్లలకి రెండు పూటలా అన్నం పెట్టగలడు. నేను చదువుకుని అర్థం చేసుకున్న శాస్త్రము వలన నాకు అర్థం అయ్యింది, నిజమైన దానం అంటే అవసరమున్న వాడికి ఇవ్వడమే కదా!"
"గ్రేట్ నాన్నా! మిమ్మల్ని చూసి నిజంగా గర్వపడుతున్నాము. ఆ పాత్ర దానం వలన పుణ్యం వస్తుందో, పాపం వస్తుందో తెలియదు కానీ, ఈ రోజు మీరు చేసిన పని వలన ఒక పేద కుటుంబం రేపటి నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవించగలుగుతారు. అది మీ కళ్ళారా బతికి ఉండాగానే చూడటం కంటే సంతృప్తి ఏముంటుంది?" అన్నారు శాస్త్రి గారి పిల్లలిద్దరూ తండ్రికి పాద నమస్కారం చేసి.
"అయ్యా! ఒక్కసారి ఆలోచించండి. నేను, నా కులం మీకు పుణ్యం రానివ్వకుండా అడ్డుపడుతుంది స్వామి," అన్నాడు భయంగా దూరం జరుగుతూ.
"అన్నిటికీ సిద్ధం వేణు! ఇటు రా," అంటూ అతని చెయ్యి పట్టుకుని ఆవు దగ్గరికి తీసుకుని వెళ్లి చేతిలో నీళ్లు పోసి గోదానం చేశాడు.
"భర్త వంక చూసిన రుక్మిణి, 'ఇన్నాళ్లూ పురాణాలు చదివాను, విన్నాను కానీ, ధర్మాన్ని ఇవాళ చూశాను. చనిపోయాక స్వర్గం వస్తుందో లేదో తెలియదు కానీ, బతికుండగానే ఒకరి కళ్ళలో ఆనందం చూడటమే అసలైన గోదానం. ముసలితనంలో చేసే దానం 'భయం' వల్ల వస్తుంది, కానీ మధ్య వయసులో చేసే దానం 'బాధ్యత' వల్ల వస్తుంది'," అంది.
దానం అంటే కేవలం వస్తువును వదిలించుకోవడం కాదు; అది ఒక మనిషి ఆకలిని తీర్చి, ఆత్మగౌరవాన్ని నిలబెట్టే వారధి కావాలి. చనిపోయిన తర్వాత పుణ్యం కోసం కాక, బతికున్నప్పుడే సాటి మనిషిని ఆదుకోవడమే నిజమైన మానవత్వం.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






Comments