top of page
Original.png

జీవన సంజీవిని

59 minutes ago
6 min read

జీవన సంజీవిని తెలుగు కథలో సంజీవిని, చంద్రం గ్రామీణ నేపథ్యంలో భావోద్వేగంగా కలుసుకునే దృశ్యం

Jeevana Sanjeevini - Telugu Social Story | Ch. C. S. Sarma 

జీవన సంజీవిని - తెలుగు సామాజిక కథ | సిహెచ్. సీఎస్. శర్మ

Published In manatelugukathalu.com On 22/10/2026


జీవన సంజీవిని సిహెచ్. సీఎస్. శర్మ రచించిన హృదయస్పర్శి తెలుగు సామాజిక కథ. సంజీవి త్యాగం, చంద్రం ప్రేమ, జీవితంలోని కష్టాలు, కుట్రలు, చివరకు నిజమైన ఆత్మీయత సాధించిన విజయాన్ని ఈ కథ మనసుకు హత్తుకునేలా వివరిస్తుంది.


చంద్రశేఖర్ ఆనందరావు కుమారుడు. వారి భార్య పారిజాతం. వారిది అన్యోన్య దాంపత్యం. ఆనందరావుకు భూములు, ఒక రైస్ మిల్లు ఉన్నాయి. 


మనిషి చాలా ఖచ్చితమైనవాడు. అర్ధాంగి చంద్రాదేవి పదేళ్ల ప్రాయంలో కాన్పు సమయంలో గతించింది. మగబిడ్డ మూడు మాసాలు పోతపాలతో బ్రతికి, తీవ్రమైన విరేచనాలతో ఒకనాడు ఆ బాబూ గతించాడు.


రంగయ్య, సీతమ్మల కుమార్తె సంజీవిని. వయసు ఐదు సంవత్సరాలు. ఆ దంపతులు పేదవారు. ఆనందరావు రైస్ మిల్లులో పనిచేస్తూ ఉంటారు. 


కల్లాకపటం తెలియని అమాయకులు, యదార్థవాదులు.


ఆనందరావు బావమరిది వీర్రాజు. పారిజాతం ఉన్నంతవరకూ వీర్రాజు గొప్ప వీరుడే! అక్కగారి ఆదరాభిమానాలు పుష్కలం. 


ఆనందరావు వ్యవసాయ పనులు చూచుకుంటూ రైస్ మిల్లు బాధ్యత వీర్రాజుకు ఇచ్చాడు. అక్క గతించిన తర్వాత ఆనందరావు వేదనను తగ్గించడానికి వీర్రాజు బావకు మందును అలవాటు చేశాడు. 


అతని ఆంతర్యం బావగారి ఆస్తి మొత్తం తనకు సంక్రమించాలని. ఆ కారణంగా తన చిన్న చెల్లెలు మరకతంను వారి తల్లిదండ్రులతో మాట్లాడి, బావను ఒప్పించి మరకతంతో ఆనందరావుకి రెండవ వివాహం జరిపించాడు.


వీర్రాజు పినతల్లి వారం పది రోజుల తర్వాత నుంచి చంద్రశేఖర్‌కు కష్టాలను సృష్టించింది. ఆ కష్టాలను భరించలేక చంద్రం ఇంటి నుండి పారిపోయేలా చేయాలన్నది ఆ చెల్లి, అన్నల దృఢ సంకల్పం.


చంద్రం, సంజీవి ఒకే స్కూల్లో చదువుకునేవారు. 


చంద్ర చాలా సౌమ్యుడు, మంచివాడు. పిన్నమామకు ఎంతగానో భయపడేవాడు. తన కష్టసుఖాలను చంద్రం సంజీవితో చెప్పుకునేవాడు.


సంజీవి చంద్రం కష్టాలు విని బాధపడేది. తన తల్లిదండ్రులకు చెప్పేది. వారూ చంద్రాన్ని గురించి బాధపడేవారు, కానీ వారు అంతకన్నా ఏమీ సాయం చేయలేని దుస్థితి.


మరకతం చంద్రానికి అన్నపానీయాలు కూడా సరిగా ఇచ్చేది కాదు.


ఆ తరుణంలో సంజీవికి ఒక ఆలోచన కలిగింది. తాను చంద్రం ఇంట్లో పనికి చేరింది. తల్లిదండ్రులతో చర్చించి సంజీవి చంద్రానికి, అతని పినతల్లి మరకతానికి తెలియకుండా భోజనం, టిఫిన్ పెట్టేది.


చంద్రానికి సంజీవి అంటే అభిమానం; సంజీవికి చంద్రమంటే ఆదరణ. వయసు పెరిగే కొద్దీ వారిరువురూ మంచి ఆత్మీయులు అయినారు.


“మీ పిన్ని, మామ ఏమన్నా బాబుగారూ మీరు పట్టించుకోకూడదు. బాగా చదవండి. పెద్దయ్యాక మంచి ఉద్యోగం సంపాదించుకొని మీరు చాలా బాగుంటారు. 


మీది చాలా మంచి మనసు బాబూ!” అని చంద్రానికి అలా చెప్పి జీవితం మీద అతనికి ఆశలు కల్పించేది సంజీవి.


చంద్రానికి ప్రాథమిక విద్య పూర్తయింది. హైస్కూల్లో ప్రవేశించాడు. సంజీవి అతని ఇంట్లో ఉన్నప్పుడు అతని చుట్టూనే ఏదో పని కల్పించుకుని తిరిగేది. 


సంజీవి చాలా తెలివైనది. తప్పులను ఎవరు చేసినా సహించేది కాదు. ఆ కారణంగా వీర్రాజు, మరకతం ఆమె ఎదుట చంద్రాన్ని ఏమీ అనేవారు కారు.


వాళ్ళు ఎప్పుడైనా చంద్రాన్ని ఏదైనా అంటే, సంజీవి “పెద్దయ్యగారికి చెబుతాను... జాగ్రత్త!” అని ఆ అన్నా చెల్లెళ్లను బెదిరించేది.


ఆ మాటను విన్నవారు నోరు విప్పేవారు కాదు.


ఆనందరావుకు సంజీవి అంటే ఎంతో అభిమానం. కన్నకూతురులా చూచుకునేవారు.

రైస్ మిల్లు గుమాస్తా ఆంజనేయులు ఆనందరావుకు నమ్మినబంటు.


‘వీర్రాజు రైస్ మిల్లు లెక్కలను తన చేత గందరగోళం చేయిస్తూ డబ్బులు కాజేస్తున్నాడు’ అన్న విషయాన్ని ఏకాంతంగా ఆంజనేయులు ఆనందరావుకి చెప్పాడు.


ఆనందరావు విచారంగా నవ్వి, “వాడికి నేను ఆంక్షలు పెడితే వాడు తన చెల్లికి లేనిపోనివి కల్పించి చెప్పి నా బిడ్డకు అపకారం చేయవచ్చు అంజీ!” అని విచారంగా అనేవాడు.


ఇంటి పనుల్లో సంజీవి మహానాయకి. ఆమెను ఎవరూ తప్పు పట్టలేరు; అలాగే ఎవరికీ భయపడే రకం కాదు, యదార్థవాది.


చంద్రశేఖర్ తన తండ్రి దుస్థితిని తెలుసుకొని, బాగా చదివి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకొని, ఆ గ్రామాన్ని వదిలి తండ్రిని తనతో తీసుకొని వెళ్లాలని లక్ష్యంతో ఉన్నాడు. అంతేకాదు, సంజీవిని తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ఆకాంక్ష.


సంజీవి యుక్తవయస్కురాలయింది. రెండు వారాల తర్వాత పనికి వచ్చిన సంజీవి అందచందాలకు ప్రతిరూపం. వీర్రాజు జొల్లు కార్చుకున్నాడు, ఆశను పెంచుకున్నాడు.


ఒకరోజు ఆనందరావు, మరకతం, చంద్రశేఖర్ తమ బంధువుల వివాహానికి వెళ్లారు. ఇంట్లో వీర్రాజు, పనిపిల్ల సంజీవి మాత్రమే ఉన్నారు.


వీర్రాజు మిత్రుడు కోటివేలు పశువుల డాక్టర్. ఆ ఊరికి వచ్చి వారం రోజులు అయింది. కోటివేలు సంజీవిని, వీర్రాజుని కలవడానికి వచ్చిన తొలిసారి చూశాడు. 


ఎలాగైనా సంజీవితో సరససల్లాపాలు సాగించాలనుకున్నాడు. తన అభిప్రాయాన్ని వీర్రాజుకు చెప్పాడు. 


అదే అదును కోసం ఎదురుచూస్తున్న వీర్రాజు తనతో కోటివేలును కలుపుకొని తన ఆశను తీర్చుకోవాలనుకున్నాడు. ఏదైనా సమస్య ఏర్పడితే కోటివేలును ఇరికించి తాను తప్పించుకోవచ్చని అనుకున్నాడు.


ఆ రోజు ఇద్దరు మిత్రులు కలిసి వీర్రాజు గదిలో మందు త్రాగడం ప్రారంభించారు. వీర్రాజు సంజీవిని తన గదికి రమ్మని పిలిచాడు. 


ఫ్రిడ్జ్ నుండి నీళ్లను తీసుకొని సంజీవి వీర్రాజు గదికి వెళ్లేసరికి, మందు మైకంలో వికటంగా నవ్వుతూ వీర్రాజు సంజీవికి స్వాగతం పలికాడు. నవ్వుతూ కోటివేలు వంత పాడాడు.


వారిరువురి చూపులు, మాటల తీరుపై అనుమానం కలిగిన సంజీవి గది నుండి వేగంగా బయటికి నడవబోయింది. వీర్రాజు అడ్డగించాడు. కోటివేలు తలుపు మూశాడు.  ఇరువురు ఆమెను చేయి పట్టుకుని మంచం మీదకు తోశారు. రాబందులవలె ఆమెపై పడ్డారు.


సంజీవి బిగ్గరగా అరిచింది. తనను తాకవద్దని దీనంగా ఏడుస్తూ చెప్పింది.


పెళ్లి అయిపోగానే చంద్రశేఖర్ ఇంటికి వచ్చాడు. సంజీవి గొంతు విన్నాడు. వేగంగా మేడపైకి వచ్చాడు. ఆ గదిలో వాకిట పక్కగా ఒక కిటికీ ఉంది. ఆ కిటికీకి ఇనుప కమ్మీలు లేవు, షటర్స్ తెరిచి ఉన్నాయి.


చంద్రం ఆ మార్గం గుండా గదిలోకి ప్రవేశించాడు. ఈలోపు తనపైన పడబోయిన వీర్రాజును కాలితో గట్టిగా తన్నింది సంజీవి. తాగిన మైకంలో వాడు కింద పడ్డాడు.


కోటివేలు ఆపిల్స్ నరికే కత్తిని చేతిలోకి తీసుకొని “నా మాట విను, అరవకు” అంటూ చేతిలోని కత్తిని ఆమె ముఖానికి గురి పెట్టాడు.


సంజీవి తన రెండు చేతులతో కత్తిని తన చేతుల్లోకి లాక్కుంది. కింద పడ్డ వీర్రాజు లేచి ఆమెపై వాలబోయాడు. సంజీవిని వేగంగా మరలా మంచం పైకి తోశాడు. 


చంద్రం సంజీవి చేతిలోని కత్తిని లాక్కున్నాడు. కసిగా, ఆవేశంగా వీర్రాజు గుండెల్లో పొడిచాడు. “అమ్మా!” అంటూ వీర్రాజు నేల వాలాడు.


ఆ సన్నివేశాన్ని చూసిన సంజీవి చంద్రం చేతిలోని కత్తిని తను లాక్కొని, వేగంగా కిటికీ ద్వారా బయటికి పరిగెత్తింది. పోలీస్ స్టేషన్ చేరుకుంది.


“నన్ను బలవంతం చేయబోయిన వీర్రాజును నా మానరక్షణకై పొడిచాను. ఇది నిజం సార్!” అని చంద్రాన్ని రక్షించడానికి వారికి అబద్ధం చెప్పింది. వారు ఆమెను జైల్లో ఉంచారు.


కోటివేలు ప్రాణభయంతో పారిపోయాడు.


చంద్రం, వీర్రాజు హాస్పిటల్లో చేరారు.

రెండు వారాలు హాస్పిటల్లో ఉండాలని, ప్రాణాపాయం లేదని వీర్రాజు విషయంలో డాక్టర్లు చెప్పారు.


చంద్రం పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. తాను కళ్లారా చూసిన నిజాన్ని చెప్పి “వీర్రాజుని పొడిచింది నేను” అన్నాడు.


అతనిని రక్షించడానికి సంజీవి “వీర్రాజుని పొడిచింది నేను సార్!” అంది.


చంద్రం తల్లిదండ్రులు వివాహానంతరం సాయంత్రం వచ్చారు. చంద్రం మూలంగా విషయాన్ని విని ఆ దంపతులు ఎంతగానో విచారించారు.


చంద్రం చదువు పాడవుతుందని, అతను బాగా చదివి గొప్పవాడు కావాలని ఆశించిన సంజీవి తన మాటలతో పోలీసులను నమ్మించింది. పోలీసులు ఆమెను జైల్లో ఉంచారు.


చంద్రం తల్లి మరకతం తన తమ్ముడు హాస్పిటల్ పాలయ్యాడని ఏడుస్తూ అక్కడికి వెళ్లేసరికి, అతనికి ఉపచారాలు చేయసాగింది.


ఆనందరావు తనకు ఉన్న పలుకుబడితో సంజీవిని జామీనుపై జైలు నుంచి విడిపించాడు. మరకతం ‘తన తమ్ముడిని హాస్పిటల్ పాలు చేసింది సంజీవి’ అనే భావనతో ఆమెపై పగ, ప్రతీకార వాంఛలను పెంచుకుంది.


చంద్రం, తన్ను రక్షించడానికి సంజీవి నేరాన్ని తనపై వేసుకుందని ఆమెను పూర్వం కన్నా ఎక్కువ అభిమానించసాగాడు. జైల్లో ఉన్న సంజీవికి “నీవు నాదానివి. నిన్ను నేను వివాహం చేసుకుంటాను” అని మాట ఇచ్చాడు.


“చంద్రం, నేను మీ అభిమానిని. మీకు ఇల్లాలు అయ్యే యోగ్యత నాకు లేదు. నా మీద ఆశలు పెంచుకోకండి” అంది సంజీవి.


కూతురు నేరస్తురాలు అయిందని సంజీవి తల్లిదండ్రులు ఎంతగానో బాధపడ్డారు, ఏడ్చారు. జైలుకు వచ్చి ఆమెను చూశారు.


కోర్టులో వాదప్రతివాదాలు జరిగాయి. ఫలితంగా సంజీవికి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. ఆమెను రాజమండ్రి సెంట్రల్ జైలుకు మార్చారు. ప్రతివారం చంద్రం రాజమండ్రి వెళ్లి సంజీవిని చూసి, మాట్లాడి, “ఏనాటికైనా నీవు నా ‘జీవన సంజీవిని’వి” అని చెప్పి వచ్చేవాడు.


మూడు సంవత్సరాలు కాలగతిలో గడిచిపోయాయి.

చంద్రం బి.ఎస్సి. పాస్ అయినాడు. గోల్డ్ మెడల్ సాధించాడు. అన్ని పేపర్లలో అతని ఫోటో, మార్కుల వివరాలు ప్రచురించారు.


ఆ విషయాన్ని విన్న ఆనందరావు పరమానందంతో పొంగిపోయాడు. కానీ అర్ధాంగి మరకతం, వీర్రాజులు ఆమె మీద పగ, ప్రతీకార వాంఛలతో రగిలిపోసాగారు. చంద్రం సంజీవిపై తనకున్న అభిప్రాయాన్ని తండ్రికి తెలియజేశాడు. వారు పరమానందంతో అంగీకరించారు. 


కానీ పినతల్లి మరకతం అంగీకరించలేదు. పినతల్లికి, చంద్రానికి, ఆనందరావుకు తీవ్రంగా వాగ్వాదం జరిగింది. కానీ చంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.


మరకతం, వీర్రాజు సంజీవి కుటుంబాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఒక రాత్రి సంజీవి ఇంట్లో ఆమె, తల్లి, తండ్రి నిద్రించు వేళ, ఆ పాత ఇంటిపై పెట్రోల్ చల్లి వీర్రాజు నిప్పంటించాడు. సెగలకు మేల్కొన్న సంజీవి, ఆమె తల్లి, తండ్రి తలుపు తెరుచుకొని బయటపడ్డారు.


“నాయనా, ఇక మనం ఈ ఊర్లో ఉండకూడదే... ఎక్కడికైనా దూరంగా వెళ్లి కూలీనాలీ చేసుకొని బతుకుదాం” అంది సంజీవి.

తల్లిదండ్రులు సరే అన్నారు.


సమయం వేకువ ఐదు గంటలు. పని ముగించి (ఇల్లును తగులబెట్టి) ఇంటికి చేరిన వీర్రాజు “చెల్లీ, అంతా పరుశురామార్పితం!” అని పగలబడి నవ్వాడు.


జాగింగ్‌కి అని బయలుదేరిన చంద్రం ఆ మాటలను విన్నాడు. అతనికి ఆ మాటల పరమార్థం అర్థమైంది. 


సంజీవి ఇంటివైపు పరిగెత్తాడు. అప్పటికే వారు బూడిదగా దర్శనమిస్తున్న ఇంటిని వీడి ఎటో వెళ్లిపోయారు. చుట్టుపక్కల తిరిగి వారి కోసం వెతికాడు చంద్రం.

ఆ ఊరికి హై రోడ్డుకి ఐదు కిలోమీటర్లు. రోడ్డు, గ్రావెల్ పక్కన పచ్చని పొలాలు.


చంద్రం ఆ రోడ్డు వైపు పరిగెత్తాడు. కొంతదూరం వెళ్లాక “సంజీవీ... సంజీవీ... నీవు నా జీవన సంజీవివి. అయ్యా రంగయ్య మామా, శాంతమ్మ అత్తా... ఆగండి. మీరు ఊరు విడిచి పోకూడదు. నాతో నా ఇంట్లోనే ఉండాలి. నాకు సంజీవికి వివాహాన్ని జరిపించాలి” అని పిచ్చివానిలా పదేపదే అరిచాడు పరిగెడుతూనే.


అతని కంఠస్వరం సంజీవికి, ఆమె తల్లిదండ్రులకు వినిపించింది. వేగంగా నడిచేవారు ఆగిపోయారు. వెనుతిరిగి చూశారు. సంజీవి మనసున సంచలనం, కళ్లల్లో కన్నీరు. తల్లిదండ్రులు చిత్తరువులై నిలబడ్డారు.


చంద్రం పిలుపు సంజీవి చెవులకు తూటాల్లా వినిపిస్తోంది. ఆమె వెనుతిరిగింది. కొద్ది నిమిషాల్లో చంద్రం వారిని సమీపించి, ఏడుస్తూ తన్నే చూస్తున్న సంజీవిని తనూ ఏడుస్తూ హృదయానికి గట్టిగా హత్తుకున్నాడు. ఆ తల్లిదండ్రుల ముఖంలో పరమానందం.


కొన్ని క్షణాల తర్వాత చంద్రం, రంగయ్య, శాంతమ్మలను సమీపించి వారిరువురి చేతులను తన చేతుల్లోకి తీసుకొని, “మీరు నన్ను నమ్మి నాతో రండి. మిమ్మల్ని నా తల్లిదండ్రుల్లాగా చూసుకుంటాను. సంజీవికి, నాకు వివాహాన్ని జరిపించండి. ఇది నా కోరిక” అని చిరునవ్వుతో చెప్పాడు.


నలుగురూ ఊరి వైపుకి వెనుతిరిగారు. పరుగులాంటి నడకతో వస్తున్న ఆనందరావు వారిని సమీపించాడు. చంద్రం, సంజీవిలను తన హృదయానికి హత్తుకున్నాడు ఆనందంగా.


ఐదుగురూ ఆనందరావు ఇంటి వైపుకి నడిచి చేరారు. నటింట్లో కూర్చుని మరకతం బోరున ఏడుస్తూ ఉంది. కారణం, తను రెస్ట్ రూమ్‌లో ఉండగా తన సోదరుడు వీర్రాజు బీరువాలోని ఆమె నగలు, డబ్బులు తీసుకొని పారిపోయాడు.


విషయాన్ని విని చంద్రం బృందం మొదట ఆశ్చర్యపోయారు. తర్వాత ‘మతి ఎంతో, గతి అంతే!’ అనుకున్నారు.


ఒక శుభముహూర్తాన చంద్రం, సంజీవిల వివాహాన్ని ఘనంగా జరిపించాడు ఆనందరావు.


తొలిరేయిన చంద్రం, “నా జీవన సంజీవినికి స్వాగతం, సుస్వాగతం!” అని నవ్వుతూ అర్ధాంగిని ఆహ్వానించాడు. 


పరవశంతో, ముసిముసి నవ్వులతో సంజీవి చంద్రం చేతుల్లో వాలిపోయింది.


సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page