top of page
Original.png

జీవితమంటే..

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారి ఉగాది షడ్రుచుల కథల పోటీకి పంపబడింది.

ఉగాది, ఉగాది షడ్రుచులు, జీవితమంటే, తెలుగు కథ, కుటుంబ కథ, భావోద్వేగ కథ, సుఖదుఃఖాలు, ఆశ, నిరాశ, కుటుంబ అనుబంధాలు, తల్లిదండ్రులు, వివాహం, Inspirational Story, Ugadi Story, Telugu Stories, Family Story, Life Lessons, Mana Telugu Kathalu

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'జీవితమంటే' కథలో ఉగాది సందర్భంగా కుటుంబ సభ్యులు కలిసి ఉగాది పచ్చడి ముందు ఆనందంగా కూర్చున్న దృశ్యం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'జీవితమంటే' కథలో ఉగాది సందర్భంగా కుటుంబ సభ్యులు కలిసి ఉగాది పచ్చడి ముందు ఆనందంగా కూర్చున్న దృశ్యం.

Jeevithamante - Telugu Emotional Family Story | Nayana kasthuri

జీవితమంటే.. తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | నయన కస్తూరి

Published in manatelugukathalu.com on 28/06/2026

                                                                                                                      ఉగాది పండుగ కేవలం తెలుగు నూతన సంవత్సరానికి ప్రారంభం మాత్రమే కాదు, జీవితాన్ని అర్థం చేసుకునే గొప్ప తాత్విక సందేశాన్ని అందించే పండుగ కూడా. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు మన జీవితంలోని సుఖం, దుఃఖం, ఆశ, నిరాశ, కోపం, భయం వంటి అనేక భావాలను సూచిస్తాయి. "జీవితమంటే........" అనే ఈ హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథ, ఒక మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే భావోద్వేగాల ద్వారా జీవితం అనేది అన్ని అనుభవాల సమ్మేళనమని అందంగా వివరిస్తుంది.


తన సెల్ రింగ్ వినగానే రంగనాథం గారి వంట్లో వణుకు మొదలైంది. గుండెలో దడ మొదలైంది. వెంటనే భార్య పార్వతమ్మ పరుగులాంటి నడకతో భర్త దగ్గరకు వచ్చి, అలమారాలో ఏవో బట్టలు సర్దుతున్నట్లుగా నిలబడి, భర్త ఎవరితో మాట్లాడుతున్నారో అని వినడానికి ఆసక్తి చూపింది. 


తాము ఎవరి ఫోన్ కోసమైతే ఎదురు చూస్తున్నామో వారు కాదని, మాట్లాడేది తన మరిది వేణు అని గ్రహించి, నిరాశపడి వంటిట్లోకి వెళ్లి, తన పనిలో పడింది మళ్ళీ. రంగనాథం గారు తమ్ముడి ఫోన్ పెట్టేసాక నిరుత్సాహంగా నిట్టూర్చి, "సెల్ రింగ్ అవగానే, క్రిందటి వారం అమ్మాయిని చూసి వెళ్ళిన పెళ్ళివారి నుండి శుభవార్త అనుకుని ఆశపడ్డాను. పాపం భార్య పార్వతమ్మ కూడా ఈ ఫోన్ వినడం కోసమే వచ్చిందని నాకు తెలుసు. వాళ్ళు కాదని గ్రహించి, నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది పాపం." అని జాలిపడ్డాడు.


వారం రోజుల నుండి వారికి ఇదే తంతు అయింది. పెళ్ళివారి ఫోన్ కై ఆశగా ఎదురు చూడటం, కబురేమీ రాక నిరాశ పడటం!

రంగనాథం గారు ఏలూరులో పోస్టుమాస్టర్‌గా చేసి రిటైర్ అయ్యారు. భార్య పార్వతమ్మ గారు. వారికి ఒక కొడుకు రాజేష్, ఒక కూతురు అమృత. ఇద్దరికీ చదువులు పూర్తి అయి ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. 


ఏలూరులో ఉన్న ఇల్లు అమ్మేసి, తన దగ్గరున్న డబ్బుతో, కొడుక్కు వచ్చే లోన్‌తో హైదరాబాద్‌లో ఒక ఫ్లాట్ కొనుక్కుని, గౌరవంగా తమ జీవనం కొనసాగిస్తున్నారు. 


కానీ, ఇది వారికేమీ అంత సులభంగా జరగలేదు. రంగనాథం గారే ఇంటికి పెద్దకొడుకు అవడంతో తల్లిదండ్రులకి కూడా సహాయ సహకారాలను అందజేయాల్సి వచ్చింది. ఇద్దరి చెల్లెళ్ళ పెళ్లిళ్లకి, ఇద్దరి తమ్ముళ్ల ఇంజనీరింగ్ చదువులకి తనకు వీలైనంత ఆర్థిక సహాయం చేశాడు. 


ఈ విషయంలో భార్య అప్పుడప్పుడు రంగనాథం గారితో గొడవ పడుతూ ఉండేది. "ఇంకా ఎంతకాలం వాళ్ళనే చూసుకుంటారు? మన పిల్లల గురించి ఆలోచించరా మీరసలు?" అని తన కోపమంతా వెళ్ళగక్కేది.


"ఎందుకాలోచించను? నేనే కాదు, అమ్మా, నాన్నా, చెల్లెళ్లు, తమ్ముళ్ళు అందరూ ఆలోచిస్తారు. నువ్వేమీ భయపడకు. మనమందరం ఒకటే కుటుంబం!" అని ఓదార్చేవారు రంగనాథం గారు.

...........

రాజేష్, అమృతలకు హైదరాబాద్‌లో మంచి ఉద్యోగాలు రావడంతో ఏలూరు వదిలి, హైదరాబాద్‌కి మారారు. అమ్మా, నాన్నా, చెల్లెళ్లు, తమ్ముళ్లు ఏలూరులోనే ఉండటంతో వాళ్ళను వదిలి రావటానికి మొదట్లో చాలా బాధపడ్డారు. పార్వతమ్మ, పిల్లలు వాళ్ళ ఊరిని, వాళ్ళ బంధువులను వదిలి రావడానికి చాలా దుఃఖించారు. 


"ఏమిటర్రా! మీకు చాలా బాధగా ఉందా, బామ్మా, తాతా వాళ్ళను వదిలి రావడానికి?" అడిగారు రంగనాథం గారు. 


"అవునండీ కష్టానికి, సుఖానికీ అందరం కలిసేవాళ్ళం. అందరి పుట్టిన రోజులకి, పెళ్ళి రోజులకి సంతోషంగా వేడుకలు చేసుకునే వాళ్ళం. కోపావేశాలతో పాటు ఎన్నో మధురానుభవాలు మన జీవితాలతో అనుబంధమై వున్నాయి.." అని వాపోయింది పార్వతమ్మ. 


రోజులు గడుస్తున్నకొద్దీ వారి కొత్త జీవితానికి వారు అలవాటు పడ్డారు. పిల్లల విజయాలకి ఉత్సాహపడేవారు. గెలుపు ఓటములకు అలవాటు పడ్డారు. పిల్లలిద్దరికీ మంచి ఉద్యోగాలొచ్చినప్పుడు ఆనందముతో ఆకాశానికి ఎగిరారు. ఎదురుదెబ్బలు తగిలినప్పుడు కృంగిపోయేవారు. 


ఇప్పుడు అమ్మాయికి పెళ్ళి ప్రయత్నాలప్పుడు భయానుమానాలు, ఆర్థిక లోటులతో భయాందోళనలు వారిని చుట్టముట్టాయి. ఎవరైనా మంచి పెళ్లివారు చూడటానికి వచ్చినప్పుడు అది కుదిరిపోతుందని పెళ్ళి ఎలా జరిపించాలి అనే ఊహల పల్లకీలో ఊరేగేవారు. అది ఏదో కారణం చేత తప్పిపోతే నిరాశతో కృంగిపోయేవారు భార్యాభర్తలిద్దరూ.


ఇలాగే ఆశానిరాశలతో, జీవిత నౌక ఎదుర్కొనే ఆటుపోట్లతో వాళ్ళ జీవితం సాగిపోతోంది. ఆ నెలలో రంగనాథం, పార్వతమ్మ గార్ల షష్టిపూర్తి మహోత్సవం రాబోతోంది. పిల్లలు, బామ్మా, తాతగారు, పిన్నులు, బాబాయిలు అందరూ కలిసి, రంగనాథం దంపతులకి తెలియకుండా బాగా జరిపించాలని ప్లాన్ చేశారు.


ఒకరోజు ముందుగా అందరూ దిగారు. అందరినీ ఒక్కసారి కలవగానే రంగనాథం దంపతులకు ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. అందరూ కలిసి భోజనాలు అయ్యాక అసలు విషయం బయటపెట్టారు.


"అయ్యో నాన్నగారూ! ఎందుకిదంతా ఇప్పుడు? అసలే ఒకపక్క పిల్లకు మంచి సంబంధం కుదరక మేము బాధపడుతుంటేను" అని తమ బాధ వెళ్ళగక్కారు.


"నువ్వూరుకో నాన్నా........." అని రాజేష్ నాన్నను ఒప్పించబోతుంటే,

"ఒరేయ్ నువ్వు పెట్టావా ఇదంతా అసలు?"

అని కొడుకు మీద అసహనం గా అరిచాడు.


"అన్నయ్యా ఒక మాట చెప్పు. నీకేమి తక్కువ? ఇద్దరు పిల్లలూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ఇక అమ్మాయంటావా? చూడచక్కని పిల్ల. మంచి ఉద్యోగం. ఫస్ట్ క్లాస్ సంబంధం వస్తుంది. నువ్వేమీ టెన్షన్ పడకు.." అని పెద్ద తమ్ముడు ధైర్యం చెప్పాడు.


"అవునురా అబ్బాయి. నువ్వేమీ ఏదేదో ఊహించుకోకు. చక్కగా అందరం కలిశాము. సంతోషంగా చేసుకోండి నువ్వూ, కోడలూ కలిసి." అని కొడుకుని, కోడలిని ప్రోత్సహించింది.


"ఒరేయ్, రంగడూ! నీకు తెలియంది కాదు. జీవితమంటే ఏమిటో ఉగాది నాడు ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఎందుకు కలిపి తీసుకుంటాము? తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అన్నీ కలిసి రుచికరమైన పండుగ తయారైనట్టు, ప్రతివారి జీవితం ఈ షడ్రుచుల సమ్మేళనం. 


ఈ ఆరు రుచులు కలిగించే ఆరు జీవన భావనలైన విజయోత్సాహాలు, అనూహ్య భావనలు, కోపోద్వేగాలు, భయాందోళనలు, సుఖదుఃఖాలు మన జీవితానికి సంపూర్ణతను ప్రసాదిస్తాయి. షడ్రుచులే మన జీవితాల్లోని గెలుపు ఓటములను, కష్ట సుఖాలను ఎలా నియంత్రించుకోవాలో ఉగాది పచ్చడి ద్వారా సందేశం ఇస్తుంది." అని తండ్రి తెలియపరిచాడు.


రంగనాథం "నాకు తెలిసొచ్చింది నాన్నా! జీవితం ఒక కలగూరగంప. జీవితమంటే సుఖం ఒక్కటే కాదు, అలా అని బాధ ఒకటే కాదు. అన్ని భావనలను అనుభవించక తప్పదు. రంగులరాట్నం లాగా గుండ్రంగా తిరిగి అన్ని వైపులా ముందుకు సాగిపోవాలి. అంతేనా నాన్నా? ఇప్పుడు ఏడు రంగుల ఇంద్రధనుస్సులాగా అందంగా కనిపిస్తోంది జీవితం!" అని నవ్వుతూ లేచాడు రంగనాథం.


***

ఈ కథ మీకు నచ్చితే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా పంచుకోండి. ఉగాది షడ్రుచుల వెనుక ఉన్న జీవన సందేశాన్ని మరింత మందికి చేరవేయండి. ఇలాంటి విలువైన తెలుగు కథలు, ఉగాది ప్రత్యేక రచనలు మరియు కుటుంబ అనుబంధాలను ప్రతిబింబించే సాహిత్యం కోసం మన తెలుగు కథలును అనుసరించండి.


నయన కస్తూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: నయన కస్తూరి

నా పేరు నయనతార కస్తూరి. నా విద్యార్హత M A English Lit. Med. తెలుగు, ఇంగ్లీష్  హిందీ భాషలంటే ఎంతో అభిమానం. కధలు వ్యాసాలు, ఆధ్యాత్మిక  విషయాలు  రచించుట నా హాబీ. నేను రచించిన కొన్ని కధలు మాస వార పత్రికలలో ప్రచురింప బడినవి..మేము హైదరాబాద్ వాస్తవ్యులము.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page