top of page
Original.png

చదివినవాడు...!

తెలుగు కథ, చదివినవాడు, భావోద్వేగ కథ, లైబ్రరీ, గురువు, శిష్యుడు, గురుభక్తి, విద్యార్థి, చదువు, సివిల్స్, కృతజ్ఞత, జీవిత పాఠాలు, ప్రేరణాత్మక కథ, ట్విస్ట్ ఎండింగ్, Emotional Story, Telugu Stories, Library, Teacher, Student, Mana Telugu Kathalu

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'చదివినవాడు' కథలో వివాహ ఆహ్వాన పత్రికతో వృద్ధ లైబ్రేరియన్‌కు నమస్కరిస్తున్న యువకుడు.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'చదివినవాడు' కథలో వివాహ ఆహ్వాన పత్రికతో వృద్ధ లైబ్రేరియన్‌కు నమస్కరిస్తున్న యువకుడు.

Chadivinavadu - Telugu Emotional Suspense Story | Karlapalem Hanumantha Rao

చదివినవాడు...! - తెలుగు భావోద్వేగ సస్పెన్స్ కథ | కర్లపాలెం హనుమంతరావు

Published In manatelugukathalu.com On 28/06/2026


“ఎక్స్‌క్యూజ్ మీ అండీ... ఈ ఫ్లాట్ నెంబర్ 402 రాఘవరావు గారిదేనా?"


"అవునండీ, నేనే రాఘవరావుని. సెక్యూరిటీ కింద అడగకుండా డైరెక్ట్‌గా పైకి వచ్చేసినట్టున్నారు? ఎవరూ... గుర్తుపట్టలేదు?"


"నేను కార్తీక్‌నండీ. ఒక పదేళ్ల క్రితం మీరు సిటీ సెంట్రల్ లైబ్రరీకి ఇంఛార్జ్‌గా ఉన్నప్పుడు... నేను రోజూ అక్కడికి వచ్చేవాణ్ణి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ లైబ్రరీలోనే ఎక్కువ సమయం గడిపేవాణ్ణి. గుర్తున్నానా సార్?"


"ఓ... సిటీ లైబ్రరీయా! ఎంతకాలమైంది ఆ మాట విని. నేను రిటైరై కూడా ఐదేళ్లు దాటిపోయింది. రా బాబూ, లోపలికి రా, అలా నిలబడిపోయావేం? ఈ రోజుల్లో పాత లైబ్రరీ రోజుల్ని గుర్తుపెట్టుకుని మరీ వెతుక్కుంటూ రావడం అంటే చిన్న విషయం కాదు. కూర్చో, కూర్చో."


"థాంక్యూ సార్. మీ ఇల్లు చాలా ప్రశాంతంగా, అందంగా ఉంది. ఈ బాల్కనీలో పెంచిన మొక్కలు, ఆ పక్కనే ఉన్న పుస్తకాల రాక్ చూస్తుంటే మళ్లీ పాత లైబ్రరీ రూమ్‌లోనే కూర్చున్నట్లు అనిపిస్తోంది సార్."


"హాహా, అలవాటు ప్రాణం కదా తమ్ముడూ! ఉద్యోగం పోయినా ఆ పుస్తకాల వాసన, ఆ నిశ్శబ్దం నన్ను వదల్లేదు. అందుకే ఈ ఫ్లాట్‌లో నాకంటూ ఒక చిన్న ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. అవునూ... ఇంతకీ ఏం తాగుతావు? కాఫీనా, టీనా?"


"ఏదైనా పర్లేదు సార్, మీరు శ్రమ తీసుకోకండి. మీతో కాసేపు మాట్లాడితే చాలు."


"శ్రమేముందిలే, మా ఆవిడ ఊరెళ్లింది. నేను ఒంటరిగానే ఉన్నాను. ఇప్పుడే మంచి ఫిల్టర్ కాఫీ వేసుకుని తెస్తాను, నువ్వు అలా కాసేపు ఆ పాత పుస్తకాలను తిరగేస్తూ ఉండు."


"సరే సార్………. అబ్బా! కాఫీ చాలా అద్భుతంగా ఉంది సార్. నిజానికి ఈ కాఫీ తాగుతుంటే నాకు పాత రోజులే గుర్తొస్తున్నాయి. అప్పట్లో లైబ్రరీ బయట ఉన్న ఆ చిన్న బండి దగ్గర మీరే నాకు చాలాసార్లు కాఫీ ఇప్పించేవారు, గుర్తిందా సార్?"


"ఆ రోజుల్లో లైబ్రరీకి వచ్చే పిల్లలందరూ నా సొంత మనుషుల్లాగే అనిపించేవారు. చాలామంది కేవలం టైంపాస్ కోసం వచ్చేవారు, కానీ కొందరు మాత్రం కళ్లల్లో ఏదో సాధించాలనే కసితో, ఆకలితో పుస్తకాల్లో మునిగిపోయేవారు. నువ్వు ఆ రెండో రకం."


"నిజం సార్. అప్పట్లో నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. రూమ్ రెంట్ కట్టడానికే డబ్బులు ఉండేవి కావు. ఇక కోచింగ్ సెంటర్ ఫీజులు, కాస్ట్లీ పుస్తకాలు కొనడం నావల్ల అయ్యేదే కాదు. అలాంటి సమయంలో లైబ్రరీనే నాకు విద్యాలయం అయింది. లైబ్రరీ టైమింగ్స్ అయిపోయినా, నన్ను లోపలే కూర్చోనిచ్చే వారు. కొత్తగా వచ్చే జనరల్ నాలెడ్జ్ మ్యాగజైన్స్ అన్నీ నా దృష్టికి తెచ్చేవారు."


"చదువు మీద శ్రద్ధ పెడితే భవిష్యత్తు బాగుంటుంది. అవునూ, ఇప్పుడు ఏం చేస్తున్నావు బాబూ?"


"బెంగళూరు ఇన్ఫోసిస్ లో సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా చేస్తున్నాను సార్. ఈ మధ్యనే ఒక ప్రాజెక్టు పనిమీద యూఎస్ వెళ్ళి వచ్చాను. సొంతంగా ఒక ఇల్లు కూడా కొన్నాను సార్. ఇదంతా మీ ప్రోత్సాహం, ఆ రోజు మీరు చూపించిన చొరవ వల్లే సాధ్యమైంది."


"చాలా సంతోషం నాయనా. ఒక గురువుకో, లేదా నాలాంటి ఒక సాధారణ లైబ్రేరియన్‌కో ఇంతకంటే ఏం కావాలి చెప్పు? లైబ్రరీలో చదువుకున్న కుర్రాడు ఈ రోజు ఇంత పెద్ద పొజిషన్‌లో ఉన్నాడంటే నాకు గర్వంగా ఉంది."


"సార్... నాకు ఇప్పటికీ ఒక సంఘటన బాగా గుర్తుంది. ఒకసారి లైబ్రరీలో చాలా ఖరీదైన ఒక రిఫరెన్స్ బుక్‌ చదివేటప్పుడు పొరపాటున ఓ పేజీ మీద కాఫీ ఒలికింది. ఆ విషయం వేరే ఎవరికైనా తెలిస్తే నన్ను లైబ్రరీ నుంచి గెంటేసేవారు. మీరు నన్ను కోప్పడలేదు సరికదా, 'పుస్తకం పాడయినా పర్లేదు గాని, అశ్రద్ధగా జీవితాన్ని పాడుచేసుకోవద్దు' అని సున్నితంగా మందలించి, మీ సొంత డబ్బులతో ఆ పుస్తకం ఖరీదు చెల్లించారు. ఆ రోజు మీరిచ్చిన సలహా నా జీవితాన్ని మార్చేసింది."


"నిజంగా అప్పటి రోజులు వేరు. ఆ రోజుల్లో మనుషుల మధ్య అంత బంధం ఉండేది. ఇప్పుడంతా డిజిటల్ అయిపోయింది కదా. అందరి చేతుల్లోనూ ఫోన్లు, ఐప్యాడ్‌లు... లైబ్రరీకి వచ్చి పుస్తకం పేజీలు తిరగేస్తూ చదువుకునే అభిరుచి లేదు."


"నిజం సార్. వచ్చిన పని పక్కన పెట్టి ఏదేదో వాగాను. నా పెళ్లి పత్రికను మీకు ఇవ్వాలని, ఆ వంకన మిమ్మల్ని ఒకసారి కలవాలని పాత లైబ్రరీ అడ్రస్ కి వెళ్లాను. అక్కడ మీ రిటైర్మెంట్ గురించి తెలిసి, మీ పాత కొలీగ్స్ ద్వారా కష్టపడి ఈ ఫ్లాట్ అడ్రస్ కనుక్కుని వచ్చాను సార్. ఇదిగోండి నా పెళ్లి పత్రిక. వచ్చే నెలలోనే పెళ్లి. మీరు ఖచ్చితంగా వచ్చి నన్ను ఆశీర్వదించాలి సార్. మీ రాక నాకెంతో ముఖ్యం."


"చూస్తాను బాబూ. ఇంత దూరం నన్ను వెతుక్కుంటూ వచ్చి ఈ పత్రిక ఇచ్చావంటే, నీ అభిమానం ఎంతటిదో అర్థమవుతోంది. ఇంత ఎదిగినా పాత రోజులను, నాలాంటి ముసలివాణ్ణి గుర్తుపెట్టుకున్న నీ సంస్కారానికి జోహార్లు. నీ వైవాహిక జీవితం చాలా బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను."


"థాంక్యూ సో మచ్ సార్. మీ మాటలు వింటుంటే మనసంతా తేలికగా, సంతోషంగా ఉంది. ఇక నేను బయల్దేరుతాను సార్, ఆఫీస్ పని మీద మళ్లీ బెంగళూరు వెళ్లాలి. పెళ్లికి మాత్రం మీరు తప్పకుండా రావాలి."


"అలాగే నాయనా. జాగ్రత్తగా వెళ్లు. చాలా సంతోషంగా ఉంది."



నాన్నా ! ఎవరాయన? అంతగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, కాళ్లకి నమస్కారం చేసి మరీ వెళ్లాడు? నువ్వు కూడా అతనితో చాలా అభిమానంగా మాట్లాడావు?"


"ఏమోనమ్మా... నిజం చెప్పాలంటే ఆ అబ్బాయి ఎవరో నాకు అస్సలు గుర్తులేదు!"


"అదేంటి నాన్నా ! అతను నీ గురించి, ఆ లైబ్రరీ గురించి, నువ్వు కట్టిన ఫైన్ గురించి అంత క్లియర్ గా చెబుతుంటే... నువ్వేమో గుర్తులేదు అంటున్నావు!?పరిచయం లేని మనిషితో అంత ప్రేమగా ఎలా మాట్లాడావు?"


"నా ముప్పై ఏళ్ల లైబరీ సర్వీస్‌లో వేలాది మంది పిల్లలు వచ్చారు, వెళ్లారు. ఎంత మందికి పుస్తకాలు ఇచ్చానో, ఎంతోమందికి సాయం చేశానో! ఎప్పుడో వచ్చిన ఈ అబ్బాయి ముఖం నాకు మాత్రం ఎట్లా గుర్తుంటుంది చెప్పు!"


"మరి అలాంటప్పుడు అబద్ధం ఎందుకు చెప్పావు నాన్నా? గుర్తులేదని ముందే చెప్పేయాల్సింది కదా?"


"ఆ అబ్బాయి ఈ రోజు జీవితంలో ఇంత పెద్ద విజయం సాధించి, ఆ విజయానికి కారణం నేనే అని నమ్మి, ఎంతో కృతజ్ఞతతో, గౌరవంతో నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఒకవేళ నేను 'నువ్వు ఎవరో నాకు గుర్తులేదు బాబూ' అని ఒక్క మాట అని ఉంటే... అతని మనసు ఎంతగా గాయపడేది? అతను నాపై పెంచుకున్న ఆ పవిత్రమైన గురుభక్తి, ఆ జ్ఞాపకం ఒక్క క్షణంలో ముక్కలైపోయేవి కదా?"


"అంటే... కేవలం అతని సంతోషం కోసం, అతని నమ్మకాన్ని కాపాడటం కోసమే నువ్వు అలా నటించావా నాన్నా ?"


"అవునమ్మా... కొన్నిసార్లు నిజం చెప్పి ఎదుటివారి నమ్మకాన్ని, ఉత్సాహాన్ని చంపేయడం కంటే... ఒక చిన్న మౌనమో, లేదా ఇలాంటి ఆప్యాయతతో కూడిన నటనో ఎంతో మేలు చేస్తుంది. నా జ్ఞాపకాల్లో అతను లేకపోవచ్చు... కానీ అతని విజయవంతమైన జీవితంలో నేను ఒక భాగమయ్యాననే తృప్తి నాకు చాలు. ఆ అబ్బాయి మనసులో ఉన్న ఆ పాత రాఘవరావుని నేను ఎందుకు చంపాలి చెప్పు?"


"మరి అత్తని పెళ్ళికి కూడా వెళ్ళొస్తావా?”


“అంత దూరం వెళ్ళ లేను గానీ.. ఫోనులో ఒక సారి విష్ చేస్తాను.. సంతోషిస్తాడు.కార్డు మీద నెంబరు ఉందిగా!”


…………..


“హలో! కార్తీక్.. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్!...“


“ఎవరండీ? కార్తీకా? ఇప్పుడు పెళ్ళేంటి! అతగాడు పోయి రెండేళ్ళయింది... ఎన్ని ట్రయల్స్ కి 'సివిల్స్ ' సక్సెస్ కాలేదని పాత లైబ్రరీ బిల్టింగ్ మీద నుంచి కిందికి దూకేశాడుగా! …..”

***


సమాప్తం. 


కర్లపాలెం హనుమంతరావు గారి కొన్ని ఇతర రచనలు:



కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


కర్లపాలెం హనుమంతరావు
కర్లపాలెం హనుమంతరావు

రచయిత పరిచయం:

కర్లపాలెం హనుమంతరావు -పరిచయం


రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోటీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.

#KarlapalemHanumanthaRao, #కర్లపాలెంహనుమంతరావు, #తెలుగునీతికథలు, #మురికి, #Muriki, Inspirational Telugu Stories, Life Lessons Telugu, Social Stories Telugu, Emotional Stories Telugu, Humanity Stories, Telugu Kathalu, Heart Touching Stories, Railway Story Telugu

 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page